Home ఇంట‌ర్వ్యూలు “నీలో దీపం వెలిగించు-నీవే వెలుగై వ్యాపించు”

“నీలో దీపం వెలిగించు-నీవే వెలుగై వ్యాపించు”

by Aruna Dhulipala

డా. వడ్డేపల్లి కృష్ణ

ప్రముఖ లలిత గీతాల కవి, లలిత గీత పరిశోధకులు రచయిత డా. వడ్డేపల్లి కృష్ణ గారితో మయూఖ ముఖాముఖి.. శ్రీ, గేయకిరీటి, కవనప్రజ్ఞ బిరుదాంచితులు, జాతీయస్థాయి స్పెషల్ జ్యూరీ అవార్డ్ గ్రహీత, ప్రముఖ కవి, రచయిత, గౌరవనీయులు డా. వడ్డేపల్లి కృష్ణ గారి జీవితం, సాహితీ ప్రస్థానాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. – మయూఖ ప్రతినిధి అరుణధూళిపాళ

నమస్కారం సార్, ఈరోజు మా మయూఖ పాఠకులకు

మీ గురించిన వివరాలు చెప్పండి.

మొదటగా…..

 మీరు ఎక్కడ జన్మించారు? మీ తల్లిదండ్రులు, మీ బాల్యం గురించి వివరించండి.

నమస్కారం. నేను 1949 జూలై 30వ తేదీన కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల గ్రామంలో ఒక సాధారణ చేనేత కుటుంబంలో పుట్టాను. మా అమ్మగారు లక్ష్మమ్మ, నాన్నగారు లింగయ్య. అక్కడే హైస్కూల్లో హెచ్.ఎస్.సి వరకు చదువుకున్నాను. చిన్నప్పటినుండీ నాటకాలు వేయడం, రాయడం పట్ల ఆసక్తి ఉండేది. బాల్యమంతా అలాగే గడిచింది. మా తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. చేనేతవృత్తి జీవనంగా బతికినవాళ్ళు.  ఈ వృత్తిలో వాళ్ళు మాస్టర్ వీవర్స్ గా ఉండేవాళ్ళు.  మా నాన్న, మా పెద్దన్నయ్య మొదట షోలాపూర్ వెళ్లి అక్కడ నేత నేస్తూ జీవితాన్ని గడుపుతూ వచ్చిన వాళ్లే. మెల్ల మెల్లగా మంచి స్థాయిని సంపాదించుకున్నారు.

ప్రాథమిక దశలోనే మీకు అలాంటి ఆసక్తి కలగడానికి కారణం ఏమిటి?

నా విద్యాభ్యాస ప్రాథమిక దశలో కనపర్తి లక్ష్మీనర్సయ్య గారని సినారె గారి సహచరులు. హన్మాజీ పేటలో పుట్టి పెరిగినవారు. ఆయన నేను 6వతరగతిలో ఉన్నప్పుడు సినారె గారు రచించిన ‘సినీకవి’ అనే ‘ఏకాంకిక’ లో సినీ రచయిత తారాపతి పాత్ర నాతో వేయించారు. అప్పుడు నా వయస్సు 11 సంవత్సరాలు. ఆ విధంగా సినారె గారితో ఆనాడే అవినాభావ సంబంధం పరోక్షంగా ఏర్పడింది. అనంతరాజశర్మ గారు హైస్కూలులో మాకు తెలుగు పండితులు. మంచి వైయాకరణులు. ఆయన వల్ల పద్య ఛందస్సు బాగా పట్టువడింది. పోతన భాగవత పాఠాలకు సంబంధించిన పద్యాలు చెబుతూ ” మీరు కూడా పద్యాలను, ఛందస్సును ఒంట బట్టించుకుని రాస్తే మీ పద్యాలు కూడా పాఠ్యాంశాలు అవుతాయి ” అన్నారు. ఎందుకో ఆ రోజుల్లో తెలియకుండానే ఆ బీజం తలలో పడింది. సి.నారాయణరెడ్డి గారిది మా తాలూకా ఊరే. ఆయన రాసిన “సాగుమా ఓ నీల మేఘమా/ గగన వీణా మృదుల రాగమా” అనే పాటను అనంతరాజ శర్మ గారు రేడియోలో పాడారు. మా గురువు గారు సినారె గారికి నేను పాడాను అని చెప్పగా ఆయన బాగుందని మెచ్చుకున్నారు. అప్పుడు నేను గేయం రాయాలని ప్రయత్నించి ముందు ఒక ఆటవెలది పద్యం, ఆ తర్వాత ఒక గేయం రాశాను. ” నమో నమో శ్రీ రమణా/ చూపుము నాపై కరుణా ” అని మా ఊళ్ళో ఉన్న ఆలయంలోని వెంకటేశ్వర స్వామి మీద రాశాను. ప్రతి శరన్నవ రాత్రులకు పదిరోజులు ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరిగేవి. మైకులో భక్తిగీతాల రికార్డు మోగుతుండేవి.  అప్పుడప్పుడు గాయనీ గాయకులు కూడా వచ్చి పాడుతుండేవారు. నేను రాసిన గేయం విన్న మా గురువుగారు ” నీవు చాలా బాగా రాయగలుగుతున్నావ్” అన్నాడు. అప్పుడు నేను రాయడం కాదు. నేను రాసింది అందరికీ తెలియాలి కదా! అన్నాను. వెంటనే మా స్నేహితుడు రేపాక రాములును పిలిచి “ఈ పాట నువ్వు గుడి దగ్గర పాడాలి” అని చెప్పాను. నాకు ఆనందం కలిగింది. అతడు, నేనూ కలిసి నాటకాలు కూడా వేశాము. అతను రాజబాబు లాగా ఎక్కువ యాక్ట్ చేసేవాడు. నేను ఎఎన్ఆర్ లాగా హీరో పాత్రలు వేసే వాడిని. చదువులో కూడా ముందుండేవాళ్ళం. పాట విని అతడు ‘చాలా బాగుందిరా’ అని ఆ పాటను మైకులో పాడాడు. అందరూ దాన్ని వినడం చూసి చాలా థ్రిల్లింగ్ గా ఫీలయ్యాను. అప్పటి నుండి రచనలు చేయడం మొదలయ్యింది. ‘తరంగిణి’  అని స్కూల్ మ్యాగజైన్ వచ్చేది. దానికి నేను ‘విధి లిఖితం’ అని ఒక కథానిక రాసి ఇచ్చాను. అది అచ్చు వేశారు 1964 లో జరిగింది ఇది. మా గురువుగారు నన్ను పిలిచి ” ఈ కథ నువ్వే రాశావా?” అని అడిగారు. అవునన్నాను. “అందరూ వాళ్ళింట్లో పెద్దవాళ్ళను అడిగి రాసుకొస్తారు. కానీ నువ్వు బాగా రాయగలిగావురా..” అన్నాడు. ఆంధ్రప్రభ వారపత్రికలో 15వ ఆగస్టుకి బాలల కథా రచనల పోటీలు పెట్టేవారు. బహుమతులు కూడా ఇచ్చేవారు. నేను రెండు, మూడు సార్లు ప్రయత్నం చేసాను. ప్రైజు రాలేదు కానీ కథా రచన బలపడింది. ఆ తర్వాత గేయాల మీద మనసు పెట్టాను.

వడ్డేపల్లి కృష్ణగారితో అరుణ ధూళిపాళ

మరి సినారె గారు మిమ్మల్ని ప్రత్యక్షంగా ఏవిధంగా ప్రభావితం చేశారు?

నేను నారాయణరెడ్డి గారి లాగా లలిత గీతాలు రాయాలి. సినిమా గీతాలు రాయాలని అనుకున్నా. సినిమా గీతాల పట్ల ఆసక్తితో రాసి, వాటిని సినారె గారికి పోస్టులో పంపించేవాడిని. వారు బిజీగా ఉన్నప్పటికీ వాటిని చదివి ” నీ రచనలన్నీ బాగానే ఉన్నాయి. సినీ బాణీల ఒరవడితోనే రాసినట్టుగా తెలుస్తోంది. అలాకాదు. నీవు స్వతహాగా గేయ రచన చేయాలి. ఏదైనా కావ్యం అచ్చు వేయాలి. అలా ప్రయత్నం చేయి. నేను నీ కావ్యానికి ముందు మాట రాస్తాను ” అని ప్రోత్సహించారు. గేయాలు రాయాలంటే మాత్రా ఛందస్సు నేర్చుకోవాలి. పద్య ఛందస్సు తెలుసు కానీ మాత్రా ఛందస్సు తెలియదు. సినారె గారే కనపర్తి గారికి లెటర్ రాసి ” కృష్ణ మనవాడు. నువ్వు గేయ రచనా పద్ధతి చెప్పాలి ” అన్నారట. కనపర్తిగారు నా దగ్గరికి వచ్చి “నువ్వు నారాయణ రెడ్డి గారికి లెటర్ రాశావా? నువ్వు ఏం రాశావో చూపించు” అన్నాడు. మాత్రా ఛందస్సు గురించి అడిగా. “ఏముంది గురు లఘువుల గుణకారమే. గురువుకు రెండు మాత్రలు, లఘువుకు ఒక్క మాత్ర. అన్ని పాదాలు సమ మాత్రలతో ఉండేలా చూసుకో” అన్నారు. సరేనని “నేటికాలం ఏటి కాలం/ గొడ్డు కాలం గడ్డు కాలం” ఇట్లా మొదలు పెట్టాను. అది కృష్ణా పత్రికలో అచ్చు అయింది. అప్పటినుండీ సినారె గారు నన్ను అన్ని వేళలా వెన్నుతట్టి ప్రోత్సహిస్తూనే వున్నారు.

ఇలా రచనల మీద దృష్టి పెట్టిన మీరు ఉన్నత విద్యాభ్యాసం ఎలా కొనసాగించ గలిగారు?

నేను హెచ్ ఎస్ సి లో స్కూల్ ఫస్ట్ వచ్చాను. పియుసి లో డాక్టర్ కావాలని బైపిసి తీసుకున్నా. ఫస్టు క్లాసు స్టూడెంట్స్ అందరూ నిజాం కాలేజీలో చదువుతున్నారంటే అక్కడ చేరాను. హాస్టల్ లో నా రూమ్మేట్ జగన్నాథం అని బ్లైండ్ స్టూడెంట్ ఉండేవాడు. పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో ఒకరోజు నేను చదువుకొని పబ్లిక్ గార్డెన్ వైపు వెళ్లి వచ్చేలోగా నా బట్టలు, పుస్తకాలు ఎవరో ఎత్తుకుపోయారు. ఆయన బ్లైండ్ కాబట్టి రూముకు తాళం వేయడానికి వీలు కాలేదు. ఆయనను అడిగితే తనకు తెలియదన్నాడు. ఆ డిప్రెషన్ తో 61% మార్కులు వచ్చాయి. 67% వరకు మెడిసిన్ సీటు వచ్చి ఆగిపోయింది. ఇప్పటిలాగా వేరే అవకాశాలు లేవు. మళ్లీ రిపీట్ చేయాల్సిందే. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మా అన్నయ్య నన్ను చదివించడం కుదరదన్నాడు. ఆ రోజుల్లో ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో సెలెక్షన్స్ జరిగేవి. కావున నాకు మెడిసిన్ సీటు లభించలేదు.  హెచ్ ఎస్ సి మార్కులతో నాకు పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వచ్చింది. ట్రైనింగ్ కోసం వైజాగ్ వెళ్ళాను. ఆ తర్వాత ఉద్యోగం..తక్కిన చదువు అంతా ఎక్స్ టర్నల్ లో కొనసాగింది.

ఒకవైపు వృత్తి పరమైన బాధ్యతలు, మరో వైపు  ప్రవృత్తి పరమైన రచనా వ్యాసంగం కొనసాగిస్తూ ఉండి ఇంకా చదవాలనే ఆలోచనకు ఎలాంటి పరిస్థితులు దోహదమయ్యాయి?

ధర్మపురిలో మొట్టమొదట పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగంలో చేరాను.  ఆ తర్వాత మా ఊరు సిరిసిల్లకు దగ్గరగా ఉంటుందని ఎల్లారెడ్డి పేటకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. అక్కడ సబ్ పోస్ట్ మాస్టర్ గా ఉన్నాను. నారాయణరెడ్డి గారు నాతో  “పోయెట్ గా రాణించాలంటే పోస్టల్ లో కాదు. అకడమిక్ లైన్లో రావాలి” అన్నారు. అంటే ఎమ్ ఏ చేయాలి. ‘వివేకవర్ధిని’ లో బీఏ కోసం (1972, 73 ప్రాంతం) కాలేజీకి వెళ్లకుండా అటెండెన్స్ వేయించుకునే విధంగా ఫీజు కట్టాను. అప్పుడు బోయిన్ పల్లిలో సబ్ పోస్ట్ మాష్టారుగా ఉన్నాను. అలా బిఏ పూర్తయింది. తర్వాత సిరిసిల్లలో ఉద్యోగం చేస్తున్నప్పుడు 1976 లో ఉస్మానియా ఎక్స్ టర్నల్ నోటిఫికేషన్ వచ్చింది. బహుశా 1st బ్యాచ్ నాది. 1978 లో ఎమ్ ఏ పూర్తయింది. అలా సినారె గారి మాట ప్రకారం అకడమిక్ లో ముందుకు నడిచాను.

ఆకాశవాణిలో  మీ లలితగేయాల అరంగేట్రం ఎప్పుడు జరిగింది?

ఉద్యోగం కోసం ట్రైనింగ్ కి వైజాగ్ వెళ్లానని చెప్పాను కదా! అక్కడ మొట్టమొదటి సారి సముద్ర తీరాన్ని చూశాను. సాయంత్రం చూసి వెళ్లబోతుంటే అక్కడివాళ్ళు “ఇప్పుడెందుకు వెళ్తున్నారు? ఈరోజు పౌర్ణమి కదా!రెండు గంటలు ఆగితే అలలు తీరం దాటి వస్తాయి”అని చెప్పారు. రాత్రి 8.00..8.30 ప్రాంతంలో చాలా దూరం వరకు అలలు ఎగిసి వచ్చాయి. అప్పుడు “సంద్రము, చంద్రునకు గల సంబంధం ఎవడెరుగును” అని ఆశువుగా వచ్చింది ఒక పాదం.  “శిథిల శిల్పాల దాగిన కథల గూర్చి ఎవడెరుగును/ చితికిన బతుకుల లోపలి వెతల గూర్చి ఎవడెరుగును / వాడిన కుసుమాలలోని ఏడుపులను ఎవడెరుగును / వీడిన ప్రేమికుల లోని విరహాగ్నుల నెవడెరుగును / మినుకు మినుకు మను తారల కునికిపాట్ల నెవడెరుగును / నీకు నాకు వీలు కాని లోకానికి కానరాని విధిని గూర్చి ఎవడెరుగును /  విను వీధుల కెవడెరుగును / ఆ మధ్యలో సంద్రము చంద్రునకు గల సంబంధం ఎవడెరుగును /అని రాశాను. నారాయణ రెడ్డి గారు అంటుండేవారు గేయాలు రాయడానికి చేయితిరిగి ఉండాలని. ఈ గేయం ఆయనకు పంపిస్తే ” భేష్! నేను అనుకున్నది జరిగింది.

నీ కవితాగుణం పెరిగింది” అని స్రవంతి పత్రికకు పంపమన్నారు.. అది జూన్ లో అచ్చు అయింది. అదే జూన్ లో ” నేటికాలం ఏటికాలం ” కృష్ణా పత్రికలో అచ్చు అయింది.  జూన్ లోనే ధర్మపురిలో పోస్టింగ్ వచ్చింది. అలా జూన్ 1968 నా జీవితంలో ఒక మలుపు. అలాగే గేయాలు, కవితలు రాస్తూ పోయాను. కృష్ణా పత్రిక, ప్రగతి, ప్రభవ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఇలాంటి పత్రికల్లో అచ్చు అయినాయి.  లలితసంగీతంలో కృష్ణశాస్త్రి, బోయిభీమన్న, దాశరథి, సినారె వీళ్ళు రాసిన పాటలు రేడియోలో ఎక్కువగా వినిపిస్తుండేవి.  ఆ ప్రేరణతో లలితగీతాలు రాస్తూ పంపించేవాడిని. అవన్నీ తిరుగుటపాలో వచ్చేవి. ఎందుకు వాళ్లకు నచ్చలేదని అనుకుంటుంటే దాంట్లో ” It does not reflect upon your merit.” అని ఒక ప్రింటెడ్ మ్యాటర్ ఉండేది. అప్పుడు నాలో కసి పెరిగి, కృషి పెరిగి నాలుగైదు సార్లు ప్రయత్నించాక ఒకేసారి రెండు సెలెక్ట్ అయినాయి. “కనరా నీ దేశం, వినరా సందేశం/ కనులు తెరిచి ఒక్కసారి కనరా నీ దేశం/ మనసులోన మంచి నెంచి వినరా సందేశం” అనే దేశభక్తి గీతం ఒకటైతే, ప్రకృతి పరంగా నారాయణ రెడ్డి గారు ” సాగుమా ఓ నీలమేఘమా ” అని రచించినట్టు నేను ” వర్షించవె మేఘమా! వరి చేలు ఫలించగా, వనములు చిగురించగా, మనముల నలరించగా ” అని రాసినది రెండవది. ఈ రెండు సెలెక్ట్ అయినట్టు ఆల్ ఇండియా రేడియో నుండి లెటర్ వచ్చింది. అప్పటి నుండి వరుసగా ప్రోత్సాహంతో లలితగీతాలు రాస్తూ పోయాను. అలా వంద గీతాలు రాసి “కనరా నీదేశం” అని లలిత గీతాలను సంపుటిగా 1971 లో వెలువరించాను.

దీనికి సంబంధించినదే మరో ప్రశ్న… ఆకాశవాణిలో ప్రసారమైన మీ గేయాలను కొన్నింటి గురించి చెప్పండి.

1969 జనవరి నుండి ఆకాశవాణిలో నా గేయాలు ప్రసారమవుతున్నాయి. అలా వరుసగా రాస్తూ వచ్చాను. రేడియోలో ‘ఈ మాసపు పాట’ అని వచ్చేది నెలంతా. దాని కోసం గేయం రాస్తే 1972లో సెలెక్ట్ అయింది. “జగతి రథం జై కొడుతూ/ ప్రగతి పథం పై పోనీ/ ప్రగతి పథం పైన జగతి పండు వెన్నెలై రానీ/ స్వార్థానికి కట్టనిమ్ము శాశ్వతముగ సమాధి/ అదియే దేశాభ్యుదయపు అందమైన పునాది”..అనే ఈ పాటకు చిత్తరంజన్ స్వరాలు సమకూర్చి ఆయనే పాడారు. 1972 సెప్టెంబర్ నెలంతా ప్రసారం అయిందది. 50 సంవత్సరాలు దాటింది. అయినా అది ఇప్పటికీ One of the most better songs గా నిలిచింది. ఈ పాటను చిత్తరంజన్ పలు సందర్భాల్లో చెప్పారు. “ఈ పాట నేర్చుకుందాం” అనే కార్యక్రమంలో కూడా ఆయన దీన్ని నేర్పించారు.  “ద్వేషమే విడనాడితే ఈ దేశమే నవ నందనం/ ప్రేమతో మనగలిగితే నీ హృదయమే శ్రీ చందనం” అనేది, అలాగే ” పాడై పోతున్నదోయి పరిసర వాతావరణం, మార్చుకో ఇకనైనా మసలే నీ ఆవరణం ” మొదలగునవి అనేకం ఈమాసపు పాటలుగా వచ్చాయి. ఎమ్. నర్సింహమూర్తి గారని జానపద గేయాలు పాడేవారు నా గీతాలు కూడా కొన్ని పాడారు.  “మళ్లీ జన్మించు ప్రభూ మానవ కళ్యాణముకై/ మమ్ముల దీవించు ప్రభూ మానవతా సాధనకై/ వంచనకే నేడు విలువ మంచితనముకే శిలువ/ నవ నాగరికతతో భువి వదిలేస్తున్నది వలువ” అన్న నా పాటను ఆయన పాడారు.. చిత్రంగా ఆయన ఈ పాట పాడి విజయవాడ నుండి కారులో తిరిగి వస్తుంటే పెద్ద ఆక్సిడెంటు అయింది. అటు ఇటు ఉన్న ఫ్రెండ్స్ కి బాగా దెబ్బలు తగిలాయి. ఈయనకు మాత్రం కొంచెం నుదుట క్రాస్ పడింది. ఆయన నన్ను కౌగిలించుకుని “కృష్ణా! నేను ఈపాట పాడడం ఏమో కానీ మెరాకిల్ జరిగింది. ఆ దేవుడు నన్ను కాపాడాడు” అన్నాడు. “శ్రీ వేంకటేశా, శ్రీ తిరుమలేశా, శ్రీదేవి నాథా శ్రిత పారిజాతా” అనే పాట కూడా ఆయనే పాడారు. అట్లా చాలా పాటలు పాడారు.

తెలుగులో లలితగీతాలు” అనే ప్రత్యేక అంశాన్ని పిహెచ్ డి కోసం తీసుకోవాలని అనుకోవడానికి కారణం ఏమిటి?

ముందు నుండీ సినారె లాగా సినీ గీతాలు రాయాలని ఉందని చెప్పాను కదా..ఆయన పేరు కింద వెండితెరపై  నా పేరు కనిపించాలన్న కోరిక ‘అమృతకలశం’, ‘యుగకర్తలు’ లో తీరింది. డాక్టర్ సి. నారాయణరెడ్డి లాగా డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ అనిపించుకోవాలనే కోరిక కలిగింది (నవ్వుతూ). ఆయనలాగే లలితగీతాలు, సినీ గీతాలు, రుబాయిలు, ముక్తకాలు, గేయనాటికలు రాశాను. మరి ఈ కోరిక తీరాలంటే పిహెచ్ డి. చేయాలి.  ఆ సమయంలో “భక్త కవి పోతన” సీరియల్ రచన, దర్శకత్వంలో ఉన్నాను. ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు పిలిచి “ఇంతవరకు లలితగీతాల మీద ఎవరూ పిహెచ్ డి చేయలేదని, మీరు చేస్తే బాగుంటుంది. కేవలం మీ గీతాల మీదనే పి హెచ్ డి చేయొచ్చు అన్ని లలితగీతాలు మీరు రాశారు”. అని అవకాశం ఇచ్చారు. సాధారణంగా ఎవరు కూడా ఇలాంటి వాటి మీద చేయరు. చాలా సులువు అనుకుంటారు.  దిగితే కాని లోతు తెలియలేదు. అందుకే ఎవరూ చేయడానికి సాహసించలేదు. నేను ఐచ్ఛికంగానే ఈ అంశాన్ని తీసుకున్నాను.

లలితగీతాలకు నిర్దేశితమైన లక్షణాలతో ప్రామాణిక పరిశోధన చేశారు కదా..అంతకుముందున్న లలితగీతాలకు, మీరు నిర్ణయించిన లక్షణాలకు ఉన్న వ్యత్యాసం ఏమిటి?

అసలు అంతకుముందు లలితగీతాలకు లక్ష్య, లక్షణ నిర్దేశమే లేదు. అదే నాకు ఎంతో కష్టమైంది. గురజాడ ‘దేశభక్తి’ గీతం నుండి తీసుకోవాల్సి వచ్చింది. 90 ఏళ్ళ సాహిత్యాన్ని వడబోయాల్సి వచ్చింది. ఒక్కరి రచనల మీదనే పిహెచ్ డి లు వస్తున్న సమయమది. అటువంటిది 90 ఏళ్ళ సాహిత్యాన్ని తలకెత్తుకోవలసి వచ్చింది. నాకు గైడుగా ఉన్న ఎస్వీ రామారావు గారు  “నువ్వు మొట్టమొదటగా ప్రామాణికమైన బాట వేస్తున్నావు. కాబట్టి తప్పదు ఇది. కానీ నీ పేరు చిరస్థాయిగా మిగిలిపోతుంది” అన్నారు. అదే సమయంలో ఆకాశవాణి, దూరదర్శన్ లో నా అనేక లలితగీతాలు, పాటలు వస్తుండేవి. సీరియల్స్ కూడా బుల్లితెరకెక్కుతుండేవి. కావున కష్టమేమో అనిపించింది. హింసలు భరిస్తేనే కదా హంసలుగా మన పేరు విహరిస్తుంది అనుకున్నా. కష్టపడి పరిశోధన  చేసాను. ఆ తర్వాత “తెలుగులో లలిత గీతాలు” పేరున సిద్ధాంత గ్రంథం వెలువరించాను. దానిని ఆవిష్కరించిన ఆచార్య సి. నారాయణరెడ్డి గారు ” నా ఆధునికాంధ్ర కవిత్వం రెఫరెన్సు లాగా రీసెర్చ్ స్కాలర్స్ కి ఎట్లా ఉపయోగపడుతుందో వడ్డేపల్లి ఈ సిద్ధాంత గ్రంథం కూడా ప్రామాణికంగా అట్లే నిలబడుతుంది. అంతేగాక రీడబిలిటీ ఉన్న సిద్ధాంత గ్రంథం రాశాడు. గేయ రచనలో చేయి తిరిగిన వాడు అనిపించుకోవడమే కాక విమర్శనా దృక్పథంలో కూడా మంచి వన్నె కెక్కినవాడు అనిపించుకున్నాడు” అని అభినందించారు.

నేను ఆరుద్ర గారిని, తొలి గాయనీ గాయకులైన ఎస్. రాజేశ్వర రావు గారిని, బాల సరస్వతీ దేవి గారిని, లలిత సంగీత ప్రయోక్త అయిన బాలాంత్రపు రజనీకాంతరావు గారిని సంప్రదించాను. వాళ్ళను ఇంటర్వ్యూ చేసి..తగిన విషయ పరిజ్ఞానాన్ని పెంచుకున్నాను. మన పరిశోధన ఉపరిశోధన కావొద్దు కదా (నవ్వుతూ)…కావున ప్రామాణికంగా “తాళం, లయ తప్పకుండా రాగయుక్తంగా పాడగలిగే ప్రతి భావ గీతం లలిత గీతం” అని లక్షణ నిర్దేశం చేశాను. అందుకు వాళ్ళు చాలా మెచ్చుకున్నారు. ఇంటర్వ్యూలో ఆరుద్ర గారు “అన్నమయ్య కీర్తనలు, త్యాగరాజ కృతులు తీసుకుంటున్నావా?” అని ఒక ప్రశ్న వేశారు. త్యాగరాయకృతులు రాగ నిర్దేశాలు కాబట్టి తీసుకోవడం లేదు. అన్నమయ్యవే అనుమానంగా ఉంది. కొంతమంది జానపదాలుగా పాడుకుంటున్నారు, లలితగీతాలుగా పాడుకుంటున్నారు అన్నాను. అందుకు ఆయన నవ్వుతూ …”వాళ్ళు పాడుకుంటే పాడుకోనీ.. కానీ అవి ముట్టుకోవద్దు అన్నారు” ‘ఎందుకు సార్’ అంటే అన్నమయ్య రాతలు మనకు రాగిరేకుల్లో భద్రంగా దొరికాయి. కానీ రాగనిర్దేశితాలు దొరకలేదు. కానీ అవన్నీ రాగ నిర్దేశితాలే, సంకీర్తనలే అన్నారు. బతికించారు అనుకున్నాను. 90 ఏళ్ళ సాహిత్యమే ఎలా అనుకుంటే అన్నమయ్య రచనలను తీసుకుంటే మరో 32 వేల సంకీర్తనలు అవుతాయి కదా…కావున వాటి నుండి బయటపడి ఇలా సమర్థవంతంగా మొత్తానికి పిహెచ్ డి పూర్తిచేశాను.

వేయికి పైగా లలితగీతాలు రాసిన మీరు సిద్ధాంత గ్రంథంలో ఏ క్రమంగా విశ్లేషించారు?

ముందుగా ప్రచురిత, ఆ తర్వాత ప్రసారిత గీతాలను ఎన్నుకోవడమైంది. కావున 1910 వ సంవత్సరంలో ప్రచురితమైన గురజాడ గారి ‘దేశభక్తి’ గేయాన్ని తొలి లలితగీతంగా చూపడమైనది.  అది ఆకాశవాణిలో కూడా ఆ తర్వాత  ప్రసారం అయింది.  అంతకుముందు బాలాంత్రపు రజనీకాంతరావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, బసవరాజు అప్పారావు, అడవి బాపిరాజు, మల్లవరపు విశ్వేశ్వర రావు, వింజమూరి శివరామారావు మరియు ఆ కోవలో రచించిన బోయి భీమన్న, దాశరథి, నారాయణరెడ్డి, శశాంక, బాపురెడ్డి గారల ప్రచురిత లలితగీతాలు ప్రసారం అవుతున్న కారణాన  తీసుకోవడమైనది. ఆతర్వాత సి. నారాయణ రెడ్డి, బాపురెడ్డి గార్ల కోవలో అత్యధిక లలితగీతాలు రాసింది నేనే కావడం విశేషం. నా తర్వాత ఆచార్య తిరుమల, తిరుమల శ్రీనివాసాచార్య గార్లు నాకంటే సీనియర్లు కానీ లలితగీతాలు రాయడం ఆలస్యంగా ప్రారంభించారు. అలా నేను మలితరం అగ్రశ్రేణి లలితగీతాల రచయితగా గణుతికెక్కాను. 1969 జనవరిలో మొట్టమొదట నా లలితగీతం ప్రసారమైనప్పటినుండీ వరుసగా ఇప్పటికీ రాస్తూనే ఉన్నాను.  ఇటీవల 75 ఏళ్ళ స్వాతంత్ర్య భారత అమృతోత్సవంలో కూడా ఆకాశవాణి వారు నన్నే ‘ఈ మాసపుపాట’ రాయమన్నారు. వేరేవాళ్ళకు అవకాశం ఇవ్వక పోయారా? అన్నాను. అందుకు వారు నవ్వుతూ “ఇచ్చినా మేము అనుకున్న భావం రాలేదు. మీరైతే సత్తా ఉన్నవాళ్ళు. కరెక్టుగా తొందరగా రాసి ఇవ్వగలిగే వాళ్ళు కాబట్టి మీరే రాయమన్నారు. అప్పుడు ” ఎత్తరా మనజెండా వినువీధుల నిండా/ ఎలుగెత్తరా భారతీయ భావం ఎద నిండా” అని రాశాను. దాన్ని ఆకాశవాణిలో ప్రసారం చేశారు. ఆకాశవాణిని ఇప్పటికీ వదిలి పెట్టలేదు. ఆకాశవాణి కూడా ఎప్పుడూ నన్ను విస్మరించక  అమ్మలా లాలించింది. దూరదర్శన్ తండ్రిలా పోషించింది. పత్రికలు మిత్రుల్లా ప్రోత్సహించాయి. సినిమా రంగం మాత్రమే అప్పుడప్పుడు అవకాశం ఇస్తూ, మధ్యలో చేయిస్తూ ప్రియురాలిలా ఊరించింది ( గలగల నవ్వేస్తూ ).

సినారె గారి లాగా పేరు తెచ్చుకోవాలనుకున్న మీ కోరికకు తొలి మెట్టు ఎక్కడ మొదలైంది?

1974 లో వేములవాడలో పెద్ద బహిరంగసభ జరిగింది. అక్కినేని నాగేశ్వరరావు గారు, నారాయణ రెడ్డి గారు మొదలగు పెద్దలంతా వచ్చారు..వీళ్ళందరికీ పౌర సన్మానం జరిగింది. మరునాడు జరిగిన సాహిత్య సదస్సులో నా అంతర్మథనం కవితా సంపుటిని గురువు గారైన ఆచార్య సినారె గారికి, వాన మామలై వరదాచార్య గారి అధ్యక్షతన అంకితం ఈయడమైనది.  ఆ తర్వాత నారాయణరెడ్డి గారు ‘వెన్నెలవాడ’ అని రాస్తే నేను ‘వెలుగుమేడ’ పేరుతో 9 గేయనాటికలు రచించి ఒక సంపుటిగా వేశాను. దాన్ని అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకితం ఇవ్వదలిచాను. సి. నారాయణ రెడ్డి గారే నాగేశ్వరరావు గారిని పరిచయం చేశారు. అప్పుడు “నాకెందుకు అంకితం?” అన్నారాయన. అందుకు సినారె గారు “కావ్యమంటే ఒక పుష్పం లాంటిది, తీసుకోండి” అన్నారు. ” పుష్పాలు ఆడవాళ్లకు , నాకెందుకు?” అన్నారు నాగేశ్వరరావు గారు. “మీరనేది జడలో పువ్వు. ఇది గుడిలో పువ్వు” అని నారాయణరెడ్డి గారు సమర్థించేసరికి నవ్వుతూ ఆమోదించి స్వీకరించారు. 

ఆ తర్వాత నేను ఆయనను సినిమా పాటకు అవకాశం ఇవ్వమని అడగడం జరిగింది.  ‘వసంతోదయం’ గేయ కథా కావ్యం రాసి భానుమతి గారిని కలిశాను. గంట తర్వాత అనుమతి లభించింది. “సారీ కవిగారు! బయట నిలబెట్టాను. ఏమనుకోవద్దు. నీ కావ్యాలు తిరగేసానయ్యా. అచ్చం దాశరథి, నారాయణరెడ్డి గార్లు రాసినటువంటి పదాలు పడుతున్నాయి. నువ్వు సినిమా పాటలు ఎందుకు రాయకూడదు?” అన్నారు. (మనం వెళ్ళింది అందుకే గానీ ఎగిరి గంతేయకుండా) మీరు అవకాశం ఇస్తే రాస్తానండీ. అన్నాను. అందుకు ఆమె “ఇలా ఏదో భావగీతం కాదయ్యా. నేను బాణీ వినిపిస్తాను రాస్తావా?” అన్నారు. అప్పుడు నేను” మీదంతా రాగ ప్రస్తారం. నాదంతా మాత్రా ప్రస్థానం. మీటర్ తెలిసిన వాణ్ణి కాబట్టి మ్యాటర్ ఏదైనా రాస్తాను” అన్నాను. మాటలు బాగా చెప్తున్నావు పాట ఎలా రాస్తావో చూస్తాను. అని ఆమె ట్యూన్ వినిపించింది. మొదటి సారి శరత్ బాబును హీరోగా పరిచయం చేసిన సినిమా అది. హీరో హీరోయిన్ ను ప్రేమిస్తాడు కానీ హీరోయిన్ సెకండ్ హీరోను ప్రేమిస్తుంది.అక్కడ హీరో భగ్న హృదయంతో పాడుకునే పాట. ” నీవే లేని ఈ జీవితమే కలయై కరిగెనుగా, నాలో కలతై మిగిలెనుగా/పల్లవి లేని పాటగ వలపే తాళం తప్పెనుగా, దేవీ రాగం మారెనుగా” అని రాసి చూపించాను. అందుకు ఆమె ఎంతో మెచ్చుకొని ఏ పదం కూడా తీయడానికి వీల్లేకుండా రాశావు. ఇక చరణాలు కూడా నీవే రాయమని అన్నారు. రికార్డింగుకు కూడా రమ్మన్నారు. టెలిగ్రామ్ కూడా ఇచ్చారు. ఉద్యోగరీత్యా వెళ్లలేక పోయాను. నా బాధ చూసి మా పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ నువ్వు యుడిసి ఎగ్జామ్ పాసయితే హైదరాబాద్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఆఫీసులో ఉండొచ్చు. అక్కడ సెలవు పెట్టుకోవడం ఇబ్బంది కాదు అన్నారు. అది పోటీ పరీక్ష కాబట్టి కష్టపడి చదివి యుడిసి పాసయ్యాను. భానుమతి గారిని కలిసి రాలేని కారణం చెప్పాను.అప్పుడు రికార్డు చేసిన నాపాట వినిపించారు. బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు బాగా వచ్చింది. ఆ విధంగా భానుమతి గారితో నా సినీ ప్రస్థానం మొదలైంది.

సినిమా రంగంలో మీకు బాగా పేరు తెచ్చిన సినిమాలేవి? వాటి అనుభవాలు చెప్పండి.

భానుమతి గారి ‘రచయిత్రి’ సినిమా ద్వారా మొదటి అవకాశం వచ్చినా అది రెండు సంవత్సరాలు ఆలస్యంగా విడుదల అయింది.  ఈ మధ్యలో మళ్లీ నాగేశ్వరరావు గారిని కలిశాను. సంగీత సాహిత్యాలు తెలిసిన భానుమతి గారు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆయనకు నామీద నమ్మకం కుదిరింది. 1980లో ‘పిల్ల జమీందార్’ షూటింగ్ జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోలో సింగీతం శ్రీనివాసరావు గారికి నన్ను పరిచయం చేసి, భానుమతి గారికి రాశాడు. సత్తా ఉన్నవాడే. మనం కూడా అవకాశం ఇద్దాం అన్నాడు. ఆయన నన్ను మద్రాసుకు రమ్మన్నారు. వెళ్లి ఆయన చెప్పినట్లుగా మూడు డ్యూయెట్లు రాశాను. కానీ చక్రవర్తి గారు మాత్రం ట్యూన్ చేయడం లేదు.అప్పుడు శ్రీనివాసరావు గారు నన్ను అక్కినేని గారిని కలవమన్నారు. కలిసి విషయం చెప్పాను. ఆయన చక్రవర్తి గారిని మ్యూజిక్ కంపోజింగ్ కు పిలిచి ఒక మెలోడీ ట్యూన్ చేయమన్నారు. అప్పుడు ఆయన “ఇప్పటి ట్రెండ్ స్లో మెలోడీకి బాగుండదు” అన్నారు. దానికి అక్కినేని గారు నవ్వి మా ‘దొంగరాముడు’ చిత్రం మొదలిడి ఇప్పటివరకు మెలోడీయే కొనసాగుతోంది. కావున స్లో ట్యూన్ చేయండి అని ఒప్పించారు. “కృష్ణా! ఈ ట్యూన్ కి తగ్గట్టు పదాలు వేసి మెప్పించుకో” అన్నారు. రెండు జంటల డ్యూయెటది.”నీ చూపులోన విరజాజి వాన, ఆ వానలోన నేను తడిసేనా హాయిగా/ నీ నవ్వులోన రతనాల వాన, ఆ వానలోన మేను మరిచేనా తీయగా” అని రాసి సింగీతం గారికి చూపిస్తే ” పల్లవి బాగుంది.సన్నజాజుల మీద చాలా వచ్చాయి. విరజాజుల మీద రాలేదు కావున నచ్చింది. బాణీకి సరిపోయింది. అయితే అనుపల్లవిలో మారిపోవాలి. రతనాల వాన రావొద్దు మరి” అన్నారు.

అలాగేనని ” నీనవ్వులోన వడగళ్ల వాన, ఆ వానలోన నేను మునిగేనా తేలేనా” అని సవరించాను..నవ్వి వెంటనే  చరణాలు కూడా రాయమన్నారు. కానీ ట్యూన్ కి రాయడం వల్ల తమిళ్ డబ్బింగ్ లాగా వస్తుందేమోనని నా భయం. అప్పుడు “ఆ వెన్నెలేమొ పరదాలు వేసె, నీ వన్నెలేమొ సరదాలు చేసె/ వయసేమొ పొంగింది, వలపేమొ రేగింది” అని చరణం అందించాను. చాలా బావుందని మెచ్చుకున్నారు. చక్రవర్తిగారు ఫిటింగ్ పెట్టారు, చరణాంతంలో కటింగ్ వస్తే బాగుంటుందని. దానికొక ట్యూన్ ఇచ్చారు. దానికి సరిపడేలా ” కనివిని ఎరుగని తలపులు చిగురించె” అంటూ  ముగింపు పలికాను. నాగేశ్వరరావు గారు శ్రద్ధగా విని అది గొప్ప హిట్టవుతుంది అన్నారు. నిజంగానే అది ఆ సినిమాలోనే కాక ఆ ఇయర్ (1980) లోనే హిట్ సాంగ్ అయింది. ఎన్నో సంవత్సరాలు ఆ రంగంలో ఉన్న అనుభవం ఆయనది. మొదట్లో హీరోగా స్వయంగా ఆయనే పాటలు కూడా పాడారు. అందుకే ఆయన మాట పొల్లు పోలేదు. ఆ తర్వాత నాకు సినిమాలో డైరెక్షన్ చేయాలని ఆసక్తి కలిగింది. గిడుతూరి సూర్యం గారు అది “అమృత కలశం” చిత్రంలో గమనించి తనతో ఉండమన్నారు. నెలన్నర సెలవు పెట్టి ఉన్నాను. ఒక సన్నివేశానికి జావళి కావాలన్నారు. నేను రాస్తాను అన్నాను. “నీవు కాదయ్యా..సినారె గారు రాయాలి” అన్నారు. అప్పుడు సినారె గారు “నేను డ్యూయెట్ రాస్తాను జావళి మనవాడికిచ్చెయ్యి నేను చాలా రాశాను కదా!” అన్నారు. ఆయన సందేహిస్తూనే ఇచ్చారు. జావళి అంటే సంప్రదాయ శృంగార గీతం. కృష్ణుని పరంగా అన్యాపదేశంగా ఉండాలి. ఆనందింప చేయాలి. ” సిగ్గాయె సిగ్గాయెరా స్వామీ బుగ్గంత ఎరుపాయెరా” అంటూ పల్లవి రాసి, చరణం సాహిత్యపరంగా ఉండాలని “చిగురు పెదవుల లోన తగని కోరికలాయె/ నిండు జవ్వనమందు పండు వెన్నెలలాయె” అంటూ రాశాను. ఆయన చాలా ఆశ్చర్య పోయి “నిజంగా సినారె లాగే అద్భుతంగా రాశావు” అని ఎలాంటి మార్పులు లేకుండా రమేష్ నాయుడు గారి చేత ట్యూన్ చేయించారు. సుశీల గారు అద్భుతంగా పాడారు. ఆ తర్వాత పెళ్ళిల్లోయ్ పెళ్లిళ్లు, యుగకర్తలు, అందరూ అందరే ఇలా ఎన్నో సినిమాలకు పాటలు రాశాను. ఎ. ఎమ్. రత్నం గారి మొట్టమొదటి డైరెక్షన్ లో వచ్చిన ‘పెద్దరికం’ సినిమా నాకు బాగా పేరు తెచ్చింది. పరుచూరి వెంకటేశ్వరరావు నాకు మిత్రుడు. ఆయనే ఎ. ఎమ్ రత్నం గారికి పరిచయం చేశాడు. ” ఈ సినిమా మలయాళ మాతృకగా వస్తున్నది. కానీ ఈ ట్యూన్ రాజ్ కోయి చేత విడిగా చేయించాను. తెలుగు నేటివిటీ ఉండాలి. భానుమతి గారి మనవరాలుకు ఎంగేజ్ మెంటు. ఆమె అంచనాకు తగిన లెవెల్ లో ఉండాలి. అట్లయితేనే రికార్డు చేస్తా. తర్వాత బాధ పడొద్దు” అన్నారాయన. ” ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే, ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకు పోవలెనే” అని రాశాను. ఆయనకి బాగా నచ్చింది. ఇదే ట్యూన్ కి వేటూరి గారు భువనచంద్ర గారు కూడా రాశారట. నాకు తెలియదు. వేటూరి గారు కూడా ” భలే రాశావయ్యా. నా పారితోషికం నాకు ముట్టిందిలే. గోఎ హెడ్” అన్నారు నవ్వుతూ..ఇప్పటికీ ఆ పెళ్లి పాట 30 సంవత్సరాలు గడిచినా పెళ్లి వేడుకల్లో మోగుతూనే ఉంది. అన్ని వెడ్డింగ్ ఆల్బమ్స్ లో చోటు చేసుకుంటోంది. గూగుల్ సర్వేలో కూడా ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాల పెళ్లి పాటల్లో టాప్ టెన్ లో ఉంది. ఆ తర్వాత ‘భైరవద్వీపం’ లో ” అంబా శాంభవి భద్ర రాజ గమనా” పాట రాశాను. దానికి సింగీతం గారే డైరెక్టర్. మాధవపెద్ది సురేశ్ మ్యూజిక్ డైరెక్టర్. సింగీతం గారు మంచి సంగీతజ్ఞుడు కూడా. అందువల్ల ఒక పట్టాన ఓకే చేయరు. ఓకే అయిన వాటిని కూడా మళ్లీ ఇంకొక ప్రయత్నం చేద్దాం అంటారు. అందువల్ల 4, 5 సార్లు మద్రాసుకు పోవలసి వచ్చింది. అయినా ఓపికతో వెళ్ళి సాధించుకున్నాను. విజయా వారి సంస్థ కదా.! ఇలా ఎన్నో అనుభవాలు సినీరంగంలో కలిగాయి.

మీ రచనలు, పురస్కారాల గురించి చెప్పండి.

మొట్టమొదటి సారిగా “కనరా నీ దేశం” అనే పేరుతో 1971 లో నా మొదటి గేయసంపుటి అచ్చయ్యింది. రెండవది ‘అంతర్మథనం’ అనే కవితా సంపుటి. దాన్ని సినారె గారికి అంకితం ఇచ్చాను. లలిత గీతాలు ఎన్నో రాశాను కాబట్టి “వడ్డేపల్లి గేయవల్లి” అని 1995 లో నా సాహిత్య రజతోత్సవానికి సంపుటి వేశాను. దానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి గేయ సాహిత్య పురస్కారం లభించింది. అంతకుముందే 1992 లో బాల సాహిత్య రచనల పోటీ పెట్టారు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు. ‘చిరుగజ్జెలు’ అనే పేరుతో పిల్లల పాటలు వంద రాశాను. దానికీ అవార్డు వచ్చింది. అందులోని ఒక పాటను ‘బాల భారతి’ పూణె వాళ్ళు సెలెక్ట్ చేసుకొని పాఠ్యాంశంగా పెట్టారు. “మీరు పద్యాలు గానీ పాటలు గానీ బాగా రాస్తే భవిష్యత్తులో పాఠంగా ఉంటాయన్న” మా గురువు గారి మాటలు గుర్తుకొచ్చాయి. “చెట్లే జగతికి పనిముట్లు/ చెట్లే ప్రగతికి తొలి మెట్లు/ అందుకె వాటిని పెంచాలి/ ఆనందాలను పంచాలి…..ప్రాణ వాయువందించేవి/ పరిసరాల రక్షించేవి/ చెట్లు చెట్లు చెట్లు/ ఆ దేవుని దీవెన లైనట్లు…దీన్ని లైబ్రరీ పుస్తకంలో చూసి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు.

ఇప్పటి వరకు దాదాపు 40 కావ్యాల్ని, 60కి పైగా సంగీత నృత్య రూపకాలను రచించాను. 60 ఆడియో ఆల్బమ్స్, 15 వరకు డాక్యుమెంటరీలు, 96 టీవీ సీరియళ్ళ ధారావాహికలరచన, అందులో 30 కి దర్శకత్వం కూడా చేశాను. ఈ సందర్భంగా మరో విషయం చెప్పాలి. మనం రాసుకున్న రచనల్ని మనం వేసుకోవడం స్వార్థం. పరమార్థం ఏదైనా చేయాలని అనిపించింది.  కరోనా కాలంలో ఇంట్లో ఉన్నప్పుడు తెలంగాణా ప్రముఖ కవులు, కావ్యాలు అని చెప్పి పంపన నుండి 2000 సంవత్సరం వరకు వర్ధిల్లిన ప్రముఖ కవులు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ సాహిత్య పరిచయమే కాకుండా ఆ రచనలు ఎలా రాసారో  కూడా మచ్చుకు చూపుతూ పుస్తకం రచించాను. మామిడి హరికృష్ణ గారు చూసి ఇది గొప్ప రీసెర్చ్ వర్క్ అవుతుంది. కాబట్టి ఇది అందరికీ కరదీపికగా పనిచేస్తుందని వాళ్ళ డిపార్ట్మెంట్ పక్షాన వెలువరించారు. మూడు నెలల క్రితం దీన్ని మంత్రివర్యులు  శ్రీనివాసగౌడ్ గారు ఆవిష్కరించారు. అది ఎంతో సంతృప్తిని కలిగించింది. ఎందుకంటే ఇలా అందరి గురించి ఎవరు రాస్తారు?  పైగా నాకు ఈర్శ్యతో అన్యాయం చేసిన పెద్ద మనుషుల గురించి కూడా చాలా సవ్యంగా రాశాను. విమర్శకుడు ఎప్పుడూ సమ్యక్ దృష్టితో ఉండాలి కదా. రచన, కవిత్వం ఎలా వుందో చూడాలి కానీ మనవాడా, కాదా అన్నది ఉండొద్దు. 500 పేజీల పుస్తకం అది. రాయడానికి ఏడాదిన్నర పట్టింది నాకు. అయినా అది తొందరగా అయినట్టే. ఎందుకంటే క్రీ.శ. 941 నుండి 2000 సం. వరకు వర్ధిల్లిన ప్రముఖ కవుల జీవిత, సాహిత్య సమాచారాలు ఉన్నాయి దాంట్లో. అందులో చేర్చినవాళ్ళు 1975 లోపు జన్మించి వుండాలి. 2000 సం. వరకు వాళ్ళ రచన, కావ్యం ఏదైనా వచ్చి ఉండాలి. దానికి ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం, ఎస్వీ రామారావు గారి తెలంగాణ సాహిత్య చరిత్ర, ఇంకా కొన్ని సాహిత్య చరిత్రలు తిరగేసి, ఆధునికులవి దొరకవు కాబట్టి ఫోన్లు చేసి, బయోడేటాలు, రచనలు సేకరించి చేశాను. ఎస్వీ రామారావు గారు కూడా ” ఇది పెద్ద రీసెర్చ్ వర్క్. పిహెచ్ డి చేయవచ్చు. ఒంటి చేత్తో చేశావని” ప్రశంసించారు.

ఆటా,తానా వంటి సభల్లో, మనదేశంలో మీ సంగీత నృత్య రూపకాలు ప్రదర్శించబడినప్పుడు వచ్చిన ప్రతిస్పందన ఎటువంటిది?

నేను లలితగీతాలు, సినిమా పాటలు రాస్తూనే మధ్యలో రూపకాలు రాశాను. “జయజయహే తెలంగాణ” రూపకం చాలా పేరు తెచ్చింది. అంతకు ముందు ‘ఆటా, తానా’ వీటికి స్వాగత గీతాలు రాశాను. 60కి పైగా సంగీత నృత్య రూపకాలు రాశాను. వాటన్నింటినీ పుస్తకాలుగా కూడా వేశాను.  2004 లో ‘ఆటా’ వాళ్ళకు స్వాగతగీతం రాయాలంటే సరే అయిదు నిమిషాల పాట అనుకున్నాను. కాదు… సంగీత నృత్య రూపకమది. వాళ్ళ ఆవిర్భావం, ప్రగతి, ప్రస్థానం, వాళ్ళ లక్ష్యాలు అన్నీ రావాలి. అందులో ఒక హరికథ, ఒక బుర్రకథ ఉండాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే మన తెలుగుదనం ఉట్టిపడే సమాహారంలా ఉండాలి. అలాగే రాశాను. బాగా వచ్చిందన్నారు.  ప్రదర్శన చికాగోలో జరిగింది. ఆహ్వానించి టికెట్టు ఇచ్చారు. నారాయణరెడ్డి గారు, మాడుగుల నాగఫణి శర్మ గారు, రామానాయుడు గారు, దాసరి నారాయణరావు గారు వీళ్లంతా ముందు వరుసలో కూర్చున్నారు.  నా స్వాగత గీతం తోనే ఆ ప్రపంచ తెలుగు మహాసభల వేడుక ప్రారంభం అయింది. స్టేజీ మీద 70 మంది నాట్య కళాకారులతో ప్రదర్శన జరిగింది. నన్ను పిలిచి దాసరి నారాయణరావు గారు ‘నువ్వే రాశావా’ అన్నారు. “ఇంకెవరు రాస్తారు నేను కాక?” అన్నాను. మళ్లీ ప్రదర్శన వేయించమని చెప్పి చూసి, అక్కడ నాకు ‘లలితశ్రీ’ బిరుదునిచ్చారు. హేమా హేమీలందరు ఉండగా ఇలా జరగడం గొప్ప అనుభూతి. 2014 లో ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పుడు “జయజయహే తెలంగాణ”  రూపకాన్ని రూపొందించాను. అసలు 60 ఏళ్ళుగా ఏం జరిగింది? తెలంగాణా సంఘర్షణ, సాధన అన్నది ప్రధానంగా మలిచాను. కొమురం భీం, దొడ్డి కొమురయ్య, చాకలి  ఐలమ్మ, కాళోజీ, దాశరథి వీళ్లంతా ఎట్లా పాటుపడ్డారు? నిజాం నిరంకుశత్వాన్ని, రజాకార్ల అరాచకాల్ని , కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను, గద్దర్ పాట “పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా!” ఇలా ఆయన కూడా ఎలా ప్రేరేపితులను చేశాడో ఇవన్నీ కలగలిపి ఒక సమాహారంగా చేశాను. అప్పుడు స్పీకర్ మధుసూధనాచారి గారు, స్వామి గౌడ్ గారు, మండలి ఛైర్మన్ గారు వాళ్ళు చూసి, ” మేము అన్నిచోట్ల ఎన్నో విషయాలు చెప్తున్నాం. కానీ కరెక్టుగా ఇప్పుడు మాకు కళ్ళకు కట్టినట్లు చూపించారు” అని ప్రశంసించారు. ఇది అన్ని జిల్లాల్లో ప్రదర్శించాలని కూడా వాళ్ళు ఆదేశించారు. పది జిల్లాల కలెక్టర్లు అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రదర్శింప చేశారు. ఇది ఒక అపూర్వ సంఘటన. ఢిల్లీలో ఇంటర్నేషనల్ ఫేర్ లో కూడా వేశాము. తర్వాత “విత్తనాల విలువ” అని ఇంటర్నేషనల్ ఫెస్టివల్ కు కూడా రాయడం జరిగింది. అలాగే ‘భారత రత్న’ అంబేద్కర్, మహాత్మా పూలే, భాగ్యరెడ్డి వర్మ వాళ్ళ జీవితాలను కూడా డాన్స్ బేస్ డ్ రూపకలుగా రచించాను.

ఈ రూపకాలన్నిటికీ పూర్తిస్థాయిలో బాధ్యత మీరే వహించేవారా?

అవును. రాయడం, దానిని రూపొందించడం అంతా నేనే. ప్రదర్శింప చేయడం అంటే కోట్ల హనుమంతరావు అనే ఆయన డ్రామాకు, కొరియోగ్రాఫర్ గా ఆయన భార్య అనితారావు ఇద్దరూ చేశారు. “జయ జయహే తెలంగాణ” మొత్తం సత్కళా భారతి, సత్యనారాయణ ఆధ్వర్యంలో వాళ్లే చేశారు. “భారతరత్న అంబేద్కర్” కూడా వాళ్ళకే ఇచ్చాను. తర్వాత  “రమణీయ రామప్ప” వసుమతీ వర్కాల అనే ఆమెతో చేయించాను. అద్భుతంగా వచ్చింది అది. మేము ప్రదర్శించిన రెండేళ్లకు దానికి గ్లోబల్ రికగ్నీషన్ వచ్చింది. అంతకుముందే ‘ఆమ్రపాలి’ ని మద్దాలి ఉషా గాయత్రి చేసింది. “తెలంగాణ తేజాల అభినయం” అని వనజా ఉదయ్ చేసింది. దీపికారెడ్డి గారేమో “తెలంగాణ వైభవం” చేసింది. ప్రపంచ తెలుగు మహాసభలలో రాష్ట్రపతి వచ్చేముందు దాన్ని ప్రదర్శింప చేశారు. తర్వాత ఆటా, నాటా, టాటా మొదలగు వాటికి  ఎన్నోసార్లు స్వాగత గీతాలు రాశాను. మొన్న మొన్న కూడా ‘నాట్స్’  న్యూజెర్సీలో జరిగినప్పుడు కూడా స్వాగతగీతం రాయడం జరిగింది. కానీ వెళ్ళడం కుదరలేదు. సినిమాలకు అనేక అవకాశాలు రాలేదని ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. ఏది అవకాశం వస్తే అది రాస్తూనే వున్నాను.

కరీంనగర్ లో ఉన్న క్షేత్రాలపైన చేసిన ఆడియో సీడీ వివరాలు చెప్పండి. ఆడియో రికార్డులు చేయాలి అనుకున్నది మీ ఆసక్తితోనేనా?

అవును. మీరు బాగానే గుర్తుచేశారు. నేను పోస్టల్ ఇన్సూరెన్స్ డెవలప్ మెంట్ ఆఫీసర్ గా ఆంధ్ర దేశమంతటా తిరిగాను. ప్రతీ జిల్లాకు వెళ్ళేవాణ్ణి. ఒక్కొక్క నెల ఒక్కొక్క జిల్లాకు వెళ్లి గవర్నమెంట్ ఎంప్లాయిస్ ని ఎన్ లైటెన్ చేసి, ఎన్ రోల్ చేసేవాడిని. అయితే ఆంధ్రప్రాంతంలో చిన్న చిన్న దేవాలయాల్లో కూడా క్యాసెట్లు మారుమోగుతుండేవి. వేములవాడ మా సిరిసిల్ల దగ్గరే కదా! శ్రీశైలం తర్వాత మన ప్రాంతంలో ద్వితీయ స్థానం ఉన్న దేవాలయమిది. దానికి ఒక్కరికార్డ్ కూడా లేకపోవడం గమనించి ఈవోను అడిగాను. ఎవరూ చేయలేదన్నాడు. సరేనని నేను పూనుకొని  (1991)”కరీంనగర్ క్షేత్రాలు” పేరుతో  బాల సుబ్రహ్మణ్యం గారు, వాణీ జయరాం గారి చేత పాడించి క్యాసెట్ చేయించాను. వాళ్ళు పాడడం అంటే చాలా గ్రేట్ ఆరోజుల్లో. ”

కైలాస నిజనివాస ఓ మహేశ్వరా/ వేములవాడ ప్రవాసా రాజేశ్వరా/ బూడిద ధరియిస్తావు, భుక్తి ప్రసాదిస్తావు….అంటూ బాలుగారి గాత్రంలో పాట సాగుతుంది. ఎ.ఎ.రాజ్ దానికి మ్యూజిక్ డైరెక్టర్. వాణీ జయరాం గారితో మేలుకొలుపు పాట పాడించారు. ఆ రోజుల్లోనే లక్ష క్యాసెట్లు అమ్ముడు పోయాయి. ఇప్పటికీ ఫేస్ బుక్ మాధ్యమంగా విదేశాల నుండి ఆ పాట ఉంటే పంపండి అని నన్ను అడుగుతుంటారు. వెబ్ సైట్ లో పెట్టాను కొన్ని. కైలాస నిజావాసా అనే పాట సినిమా పాట కంటే పాపులర్ అయింది. నేను రాసిన భక్తి గీతాల సంకలనం ఒకటి వేయాలనుకుంటున్నాను. బాల మురళీకృష్ణ గారు కూడా నా పాటలు  పాడారు. ఒకసారి “శివ శివ నామం జపియించు/ భయ భవ బంధం తొలగించు.” అనే పల్లవి.  ఆయన “భవ భయ బంధం” అని పాడారు. అలా కాదని సరి చేశాను. అప్పుడాయన అంత గొప్పవాడు అయి ఉండి కూడా “అందుకే మిమ్మల్ని ఉండమన్నది. మేమెంత స్వర కర్తలం అయినా సాహిత్యం రాసేవాళ్ళు ఉండాలి” అన్నారు. అది ఎంతో అనుభూతిని ఇచ్చింది.

‘నరకాసుర’ అనే సినిమా వస్తోంది. దానిలో శివుని మీద మూడు పాటలు రాశాను. అప్పుడు వాళ్ళు ” మీరు చాలా బాగా రాశారు. పేరున్న వాళ్ళను కూడా అడిగాము. కానీ సరిగా రాయలేకపోయారు” అని అన్నారు. నా ఉద్దేశ్యం ఏమిటంటే సరిగ్గా పదాలు పడాలి అంటే ఆస్తికత్వం ఉండాలి. భక్తి, అనురక్తి ఉండాలి. అలాగే శబ్ద శక్తి కూడా ఉండాలి. పురాణాల అవగాహన ఉండాలి. అప్పుడే అది అనుకున్న విధంగా వస్తుంది. సాయిబాబా జీవిత చరిత్రను, సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా ఆడియో రికార్డు చేసి ఇంట్లోనే వింటూ చేసుకునేలాగా రూపొందించాను.

ఒక జాతీయ కవిగా మీరు గుర్తింపు పొందిన అనుభవాలేవి?

ఈ రోజు అందరూ “నేను జాతీయ కవిని” అని గర్వంగా చెప్పుకుంటుంటారు. నేను 1975 లోనే జాతీయ కవినయ్యాను. ఎలాగంటే ఆకాశవాణి వాళ్ళు నన్ను “మీరు లలితగీతాలు అనేకం రాశారు “జాతీయ బాలల సామూహిక గానం కోసం ఒక పాట రాసి ఇవ్వండి. ఢిల్లీకి పంపుతాము. అది సెలెక్ట్ అయితే జాతీయకవి అవార్డు వస్తుంది.” అని అన్నారు. “జాతీయకవి అంటున్నారు మరి నాకంటే చాలామంది పెద్దవాళ్ళు వున్నారు కదా! వాళ్ళను అడగండి” అన్నాను. “అందరివీ పంపించాము. కానీ అవేవీ సెలెక్ట్ కాలేదు. మీరూ ఒక ప్రయత్నం చేయండి” అన్నారు.”భలేవాళ్లే!  వారివే సెలెక్ట్ అవలేదంటే నేను రాస్తే ఏమవుతుంది?” అన్నాను. అప్పుడు కొట్రా మల్లికార్జునశర్మ గారు  “మీ ప్రయత్నం మీరు చేయండి” అన్నారు. సరేనని రాసిచ్చాను. ” మనమంతా ఒక్కటనే మంచి మనసు పెరగాలి/ జగమంతా ఒక్కటనే జన జాగృతి కావాలి.” అని ఇచ్చాను ముందు. బాలల గీతం కాబట్టి జనజాగృతి కష్టమవుతుందేమో అన్నారు. అప్పుడు “మనమంతా ఒక్కటనే మంచి మనసు పెరగాలి/ జగమంతా ఒక్కటనే మంచిరోజు రావాలి” అని మార్చి, బిందువు బిందువును చేరి సింధువుగా పారునుగా/ సింధువు సింధువు చేరి సంద్రముగా మారునుగా/ మల్లిక మల్లికను చేరి మాలగ రూపొందునుగా/ మాలను మలిచేందుకు ఒక దారమె ఆధారముగా/ అని రాసి, ఇచ్చాను. అదే సెలెక్ట్ అయింది. కావున అది సెప్టెంబర్ (1995 ) నెలంతా ఆలిండియా రేడియోలో అన్ని భాషల అనువాదాలతో తెలుగు పాట మారుమోగింది. థ్రిల్లింగ్ ఫీలయ్యాను. కానీ అది నేను రికార్డ్ చేసి పెట్టుకోలేదు. అనువదించబడిన  ఇతర రాష్ట్ర భాషల పాటలను కూడా కలెక్ట్ చేసి పెట్టుకుంటే బాగుండేది. నేను రాసింది మాతృక కదా వీటికి. అంతకు ముందు ఎన్నో పాటలు రేడియోలో వచ్చాయి కదా! దీన్ని అంతగా పట్టించుకోలేదు. అందరూ ఆ గొప్పతనాన్ని పొగుడుతూ జాతీయ కవిగా ప్రశంసలు కురిపించారు. చిత్తరంజన్ గారు పాడిన తెలుగు పాటతో పాటు మిగతా ప్రాంతీయ భాషల్లో కూడా ఈ పాట ప్రసారమవుతుండేది.  లాస్ట్ ఇయర్ రిపబ్లిక్ డే సందర్భంగా జరిగిన ఉత్సవాల్లో ఉభయ రాష్ట్రాల్లో నా కవిత సెలెక్టు అయింది. అలా కూడా జాతీయ కవినయ్యాను. అందరూ అంటుంటారు. “అమెరికా, లండన్, ఆస్ట్రేలియా లాంటి ఇతర దేశాల్లోనే మీ పాటలు ప్రచారం అవుతుంటే  ఎప్పుడో అంతర్జాతీయ కవి అయ్యారని.”నా గురించి నేను గొప్పగా చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు.

తెలంగాణ మాండలిక భాషలో వెలువడిన మీ రచనలేవి?

తెలంగాణ భాషలో 1976 లోనే ‘వెలుగొచ్చింది’ అనే నాటిక రచన చేసి, దర్శకత్వం వహించి, ఎవరైనా పాత్రధారి రాకపోతే ఆ పాత్ర కూడా పోషించాను. అవార్డులు కూడా వచ్చాయి దానికి. అప్పటికి ఒక లోకువ తెలంగాణా భాష, యాసల్లో రాయడం. కానీ ఆ ప్రయత్నం, సాహసం అప్పుడే చేశాను నేను. ఇప్పుడు తెలంగాణా యాసలో రాస్తే గొప్ప. 10 నాటకాలు రాశాను. వెలుగొచ్చింది, భాగ్యనగర్, ఉద్యోగపర్వం, ముందుచూపు, అతిథి, అడ్డుతెరలు, చదువు బాట, మంచు తెరలు.. ఇలా అన్నింటినీ కలిపి “రంగ తరంగాలు” పేరుతో సంకలనం చేశాను. 2017 లో ప్రపంచ తెలుగు మహా సభలప్పుడు రమణాచారి గారు.. (జయ జయహే తెలంగాణకు కూడా ఆయనే ప్రేరణ) విదేశాల నుండి ఎంతో మంది వస్తారు కాబట్టి హైదరాబాద్ చరిత్ర గురించి తెలియడానికి రాయమంటే ‘భాగ్యనగర్’ రాశాను.  భాగమతి, కులీ కుతుబ్షాల ప్రణయ నేపథ్యంతో పురానాపూల్ ఎలా ఏర్పడింది? చార్మినార్ ఎందుకు ఏర్పడింది? కందుకూరి రుద్రకవి మొదటి యక్ష గానాన్ని ( సుగ్రీవ విజయం ) మల్కిభ రామునికి వినిపించడం ఇవన్నీ వచ్చేలాగా చారిత్రకంగా రచించగా ‘సత్కళా భారతి’ ఆధ్వర్యంలో గొప్పగా ప్రదర్శించారు. అది సినిమాటిక్ గా అద్భుతంగా ఉందని ఎల్. బి శ్రీరామ్, గుమ్మడి గోపాలకృష్ణ వీళ్లంతా ప్రశంసించారు. ‘రస రంజని’ రజతోత్సవాల్లో కూడా దాన్ని ప్రదర్శించారు.  ఇటీవలే నేను 75 ఏళ్ళ అమృతోత్సవంలో అడుగుపెట్టాక దాన్ని పుస్తకంగా “భాగ్యనగర్ – వెలుగొచ్చింది” అని వేశాను. వెలుగొచ్చింది నాటికను పాత్రలు, అంకాలు పెంచి నాటకంగా మలిచాను. మొన్నటి జూలైలో ఆవిష్కరణ జరిగింది. నారాయణ రెడ్డి గారు జూలై 29 న పుడితే నేను జూలై 30న పుట్టాను. సినారె గారు “నన్ను జన్మతః అనుసరిస్తున్నాడు” అనేవారు. ఆయన కూడా తన పుట్టినరోజున పుస్తకాన్ని ఆవిష్కరించుకునే వారు. అలానే నేను కూడా అట్టహాసం లేకుండా నా పుట్టినరోజు న పుస్తకం వేసుకున్నాను. “తెలంగాణ సంస్కృతి- బతుకమ్మ ఆకృతి” అని డాక్యుమెంటరీ చేసాను. అలానే మా సిరిసిల్ల చేనేత కార్మికుల ఆత్మహత్యల గురించి “నేతన్నల ఆత్మహత్యలు” పేరుతో అంటే ఆత్మహత్యలు కాదు ఆత్మస్థైర్యం పెంచుకోవాలని వాళ్లకు ప్రబోధకంగా డాక్యుమెంటరీ చేశాను. బొమ్మలమ్మ గుట్ట మీద తొలి కంద పద్యాలు  నన్నయ్యకు 100 ఏళ్ళ ముందే తొంగి చూశాయని దానిమీద డాక్యుమెంటరీ చేసి ఆ కంద పద్యాలను ప్రొఫెషనల్ సింగర్స్ తో పాడించాను. అలా సాహిత్య పరంగా చేతనైనంత రాస్తూ దాన్ని పాటిస్తూ వచ్చాను.

పాటలు రాయడమే కాకుండా సినిమా, టీవీ సీరియల్స్ కు కూడా దర్శకత్వం చేశారు. ఏమైనా కష్టంగా అనిపించిందా? ఆ వివరాలు కూడా కొన్నింటిని చెప్పండి.

మొదట్లో మా హెడ్మాస్టర్ “మీరు స్కూల్ డే కి నాటకాలు వేయాలని, వేయకపోతే హాల్ టికెట్ ఇవ్వనన్నా”రు. ఆ ప్రేరణ తర్వాతి నా రచనలకు, నాటకాలకు, సినిమాలకు, టీవీ సీరియళ్లకు పునాది అయింది. ఇంతకుముందు చెప్పాను కదా. 30 సీరియల్స్ కి దర్శకత్వం వహించానని. సినిమాలు, టీవీలలో కట్ చేసి టేకులు తీసుకోవచ్చు. నాటకాలు అలా కావు కదా! ప్రత్యక్షంగా ఉంటాయి కాబట్టి పోర్షన్ మరిచిపోతే వెనకనుండి అందించేవాళ్ళం. జనం ముందు అభాసుపాలు కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు టెక్నికల్ డెవలప్ మెంట్ చాలా పెరిగింది కాబట్టి అలాంటి ఇబ్బందులు ఏవీ లేవు. నేను “ఎక్కడికెళ్తుందో మనసు” ప్రేమకే తెలుసు అనే టాగ్ లైన్ తో సినిమాకు దర్శకత్వం వహించాను. అలాగే “లావణ్య విత్ లవ్ బాయ్స్” అనే సినిమా….అయితే ఒక గొప్ప అనుభూతిని ఇచ్చిన విషయం చెప్తాను. “ఎక్కడికెళ్తుందో మనసు” సినిమాలో ఒక మంచి తెలుగు పాట ఉంటుంది. బాలసుబ్రహ్మణ్యం గారి చేత పాడించాము. సన్నివేశంలో హీరో చికాగో నుండి స్వంత ఊరికి వస్తాడు. తెలుగు రాష్ట్రావతరణ దినోత్సవంలో సర్పంచ్ తో (అక్కిరాజు సుందర రామకృష్ణ  గారు) “తెలుగు రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లు గడిచినా శంకరం బాడి సుందరాచారి తర్వాత అలా తెలుగు పాట రాసి, పాడి మెప్పించేవాళ్ళు లేరా?” అనే డైలాగ్ పెట్టించాను. అప్పుడు హీరో లేచి నేనున్నాను అని పాడుతున్నట్లు పాట పెట్టాను. ” తేట తేనెల చిలుకు పలుకు నా తెలుగు/ రాజహంసల కులుకు తళుకు నా తెలుగు/ అద్భుత సంస్కృతి విరియు రెమ్మ నా తెలుగు/ అమృత ధారల కురియు అమ్మ నా తెలుగు/ ఆ తెలుగు తల్లికి అభివందనం/ అనురాగవల్లికి శ్రీచందనం- అని రాశాను. మిగతా రెండు చరణాల్లో ఒకటి సాహిత్యం, మరొకటి సంస్కృతి ఉండేలా రాశాను. ఆ పాట చూసి బాల సుబ్రహ్మణ్యం గారు ” ఎంత బాగా రాశారు? అప్పుడెప్పుడో ‘అమెరికా అమ్మాయి’ లో దేవులపల్లి, తర్వాత ఇన్నేళ్ళకు వడ్డేపల్లి ఇంత మంచి పాట రాశారు. ఇది పాడగలగడం నా అదృష్టం” అన్నారు. అలా జీవితంలో ఎన్నెన్నో మరువలేని అనుభూతులు మిగిలాయి.

వివిధ కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతలుగా, జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు కదా! మీకు ఎదురైన అనుభవాలు ఎటువంటివి?

నేను సెన్సార్ బోర్డు మెంబరుగా మూడుసార్లు చేశాను. అప్పట్లో తెలంగాణ భాషను రౌడీలకు, గూండాలకు, హాస్య పాత్రలకు పెట్టేవాళ్ళు. దీన్ని నేను అడ్డుకునేవాడిని. కట్స్ పెట్టేవాడిని. మీరు తెలంగాణ వారయి ఉండి దీనిని ఎందుకు అడ్డుకుంటున్నారు? అనేవాళ్ళు. తెలంగాణా వాడిని కాబట్టే కట్స్ పెడుతున్నాను. ఇదే భాషను హీరో, హీరోయిన్లకు పెట్టండి ఆదరిస్తాను. పరోక్షంగా మా భాషను అవమానిస్తుంటే ఎలా ఊరుకుంటాను అనేవాడిని.. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జ్యూరీ సభ్యుడిగా చేశాను  (2003). 2006, 2009 లో నంది అవార్డుల కమిటీ చైర్మన్ గా చేశాను. సాధారణంగా ఒకసారి చేశాక మళ్ళీ ఇవ్వరు. కానీ రెండవసారి కూడా ఇచ్చారు. “అదేంటీ? ఎవరైనా అభ్యంతర పెడతారు” అంటే “ఎవరూ సరిగా చూడరు. మీరు న్యాయంగా, నిష్పక్షపాతంగా అన్నీ చూస్తారు. అందుకే మీరే చేయండి” అన్నారు. ఆ పేరు నిలబెట్టుకున్నాను. చాలా కార్యక్రమాలకు, సీరియల్స్ కు న్యాయ నిర్ణేతగా వ్యవహరించాను. అంతకు ముందు ఒకే దానికి అవార్డులు వచ్చేవి. దానికి నేను బ్రేక్ వేశాను. ఒకదానిలో ఒక అంశానికి ప్రాధాన్యత నిస్తే మరో దానిలో ఇంకో ప్రత్యేక అంశానికి, అలా తీసుకొని కేటగిరీలుగా విభజించుకుంటూ ఇచ్చాము. కొందరు నొచ్చుకున్నారు. కొన్ని సందర్భాల్లో సీనియారిటీ, శిఖర స్థాయిలో ఉన్న వాళ్లకు కాకుండా కొత్తగా వచ్చిన ప్రతిభావంతులకు ఇచ్చాము. పేరున్న వాళ్ళు అంతకుముందు ఎన్నో అవార్డులు పొంది వుంటారు కదా..వారికి ఇంకొకటి ఇవ్వడం లెక్క కాదు. అందుకే కొత్తవారికి ఇస్తే ప్రోత్సాహకరంగా ఉంటుందని ప్రతిభకు పట్టం కట్టాము. దాని ద్వారా ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాను. కానీ చలించలేదు. నిష్పక్షపాత వైఖరి నా అభిమతం.

ఇంతటి సాహితీ సేవ చేస్తున్న మీకు ‘ఇంకా ఇది జరగలేదు’ అన్న అసంతృప్తి ఏదైనా మిగిలివుందా?

ఇన్ని రచనలు చేసినా, ఎంత బాగా రాసినా, ఎన్ని ప్రశంసలు పొందినా, ఎన్ని పురస్కారాలు, సన్మాన, సత్కారాలు పొందినా నా రచనలు కేంద్ర సాహిత్య అకాడెమీ వరకు ఎందుకు వెళ్లడం లేదు? అని ఒక లోటు అనిపిస్తుంది. కొంతమంది 2, 3 రచనల్లోనే సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహిస్తున్నారు. 1992 లో రాష్ట్ర స్థాయిలో తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించిన బాలల కోసం నిర్వహించిన రచనల పోటీలో నేను రచించిన  ‘చిరుగజ్జెలు’ గేయ సంపుటికి అవార్డు వచ్చింది. ఇటీవల కూడా 2020లో ‘బాల రసాలం’ అనే బాల గేయ సంపుటిని వెలువరించాను. అంతేకాక “రాగ రామాయణం” అనేది నేను పిల్లల కోసం చేసిన రచన. వారికి ప్రబోధకంగా, కర్తవ్య సుబోధకంగా ఉండేలా, మాతా పితరుల భక్తి, గురుభక్తి పెంచేలా ( ఈ రోజు పిల్లల్లో అదే లోపించింది కదా) చేయాలంటే రామాయణమే సరియైనదని భావించి వాల్మీకి రామాయణాన్ని 100 పేజీల్లో లవకుశుల్లా పాడుకునేలా రాశాను. దానికి తెలంగాణా సారస్వత పరిషత్తు అవార్డు కూడా వచ్చింది. ఆడియో కూడా చేయించాను. రామాయణ చరితమంత రమ్య రాగ భరితం/ త్యాగాలకు నిలయమైన సకల ధర్మ సహితం/ ఇది పల్లవి.. రామ రామాయన్న రాగాలు ఉదయించు/ రామ రామాయన్న రోమాలు పులకించు/ వ్యాధుని వాల్మీకిగ మార్చిన తారక మంత్రం/ శోకము శ్లోకమ్ముగ తీర్చిన అద్భుత మంత్రం…ఒక హైస్కూలు స్థాయి పిల్లలకి అర్థమయ్యేలాగా రాశాను. దానివల్ల మన సంస్కారం, మన సంస్కృతి గురించి తెలుస్తుంది. బాల సుబ్రహ్మణ్యం గారు దీనికి ముందు మాట రాస్తూ ” ఇంతటి అద్భుతమైన రచనాశక్తి, ప్రతిభ, వ్యుత్పత్తి ఉండి మీకు తగిన పేరు ఇంకా ఎందుకు రాలేదోనని వేదనగా ఉంది నాకు” అని రాశారు. అంతా రాజకీయమే. ప్రతీ దానికి లాబీయింగ్ చేసి సాధించుకోవడం అలవాటైపోయింది.  అది నచ్చకనే జ్యూరీ సభ్యుడిగా వున్నప్పుడు నిష్పక్షపాతంగా వ్యవహరించాను. పల్లకీలు మోయడానికి కొంతమంది శిష్యులు వుంటారు. నాకు ఆ అవకాశం లేదు. పల్లకి పల్లకి గానే ఉండిపోవాలి ఎప్పుడూ. పోతన ఇప్పుడు లేకపోయినా ప్రతీ పద్యాన్ని కళ్లకద్దుకుంటున్నాము. అలా ఉండాలని నా సంకల్పం. దాశరథి గారు రాసిన “ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో” అనే గీతానికి అప్పట్లో పేరు రాలేదు. ఇప్పుడు దాన్ని క్యాలెండర్ లో ముద్రించారు. ప్రతీ దాంట్లో చెప్తున్నారు. ఆయన రాసిన “నీలో దీపం వెలిగించు/ నీవే వెలుగై వ్యాపించు” అన్నదానికి ఎక్కువ పేరు వచ్చింది. దూరదర్శన్ లో కూడా గేయనాటికలు మొట్టమొదట నావే ప్రసారం అయ్యాయి. ఏదైనా రచన బాగుంటేనే కాల గర్భంలో కలిసి పోకుండా నిలిచిపోతుంది. ఆ తర్వాత శాశ్వతంగా ప్రకాశిస్తుంది. అన్నదే నా విశ్వాసం.

ధన్యవాదాలు సార్…విశేష సాహితీ మూర్తులైన మీరు మాకోసం మీ సమయాన్ని వెచ్చించడం మా అదృష్టంగా భావిస్తూ మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతాభివందనాలు..

You may also like

Leave a Comment