ప్రియమైన అన్నయ్య ఆవంచ క్రాంతి కుమార్ కు, నమస్కారములు..
నేను నల్గొండలో కుశలంగా ఉన్నాను.మా మూడవ తరగతి పరీక్షలు ఇంకను రెండు వారాలలో జరగగలవు.నేను బాగా కష్టపడి చదువుతున్నాను.వారం క్రితం మా పంతులు గారు మమ్మల్ని వినోద యాత్రకనీ
కొలనుపాకకు తీసుకొనిపోయారు.ఇది నల్గొండకు ఉత్తరాన 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతి పురాతన పట్టణం.పూర్వం ఇది శైవ మత కేంద్రంగా ఉండి దక్షిణ కాశీ అని గౌరవ నామం పొందిందట.ఇందులో సోమేశ్వర ఆలయం,చండికాలయం,కోటి లింగాలయాలు గొప్పవి.
జైనులకు కొలనుపాక చాలా పవిత్రమైన క్షేత్రం.ఇక్కడి జైన
మందిరంలో మూడు గుళ్ళు ఉన్నాయి.గోపురాలు, శిఖరాలతో అలంకరించి ఉన్న చిత్రాలతో ఈ ప్రదేశం చాలా అందంగా ఉండేది….ఇక సెలవు…
ఇట్లు నీ తమ్ముడు…
ఆవంచ ప్రమోద్ కుమార్…. అడ్రస్…..ఆవంచ క్రాంతి కుమార్..పోస్ట్..చర్లపల్లి….తా.జిల్లా.నల్గొండ..ఆంధ్రప్రదేశ్.
1979 వ సంవత్సరంలో మా నాన్న ఆవంచ సీతారామారావు గారు రాసిన మూడవ తరగతి తెలుగు వాచకం పుస్తకంలోని ఏడవ పాఠ్యాంశం.. శీర్షిక..లేఖ…ఈ లేఖ అప్పట్లో ఒక సెన్సేషన్.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కుప్పలు తెప్పలుగా వచ్చే ఉత్తరాలను మా పోస్ట్ మాన్
రాజయ్య తెచ్చి ఇచ్చేవాడు.రాజయ్యకు బస్టాండ్ దగ్గర
ఒక టీ స్టాల్ కూడా ఉండేది.పక్కనే ఒక బోర్ ఉండేది.
ఆ బోర్ ఊరి జనాల దాహాన్ని తీర్చేది.ఆ పక్కనే బ్రహ్మంగారి గుడి,ప్రతి సంవత్సరం జాతర జరిగేది.ఆ జాతరలో వడ్ల కుమారస్వామి మైకులో
ఘంటసాల మధురగీతాలను అద్బుతంగా పాడేవాడు.
ఒక వారం రోజులు పండుగ వాతావరణం ఉండేది…
కుమారస్వామి బొంగరాలు బాగా తయారు చేసేవాడు.
నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో,చనిపోయాడని తెలిసింది.ఇక పోతే ఆ లెటర్లలో సారాంశం…అన్నయ్య క్రాంతి కుమార్ గారికి….అంటూ కొలనుపాక గురించి రకరకాల ప్రశ్నలు అడుగుతూ మేమూ వస్తాం…మాకు చూపించండీ అంటూ…ఇప్పుడాలోచిస్తే అప్పట్లో మా అన్నయ్య నేనూ చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళమేమో? నేనైతే చాలా చిన్న వాడ్ని,అంతగా జ్ఞాపకం లేదు. నాకూ,మా అన్నయ్యకు నాన్నే పెద్ద హీరో. ఇంతే కాదు మా అన్నయ్య క్రాంతి నా చిన్నప్పటి నుంచి ఎప్పుడూ నా గురించే ఎక్కువగా ఆలోచించేవాడు.నా మంచి చెడులను పట్టించుకునేవాడు.మా అమ్మ బాషలో చెప్పాలంటే, కోపంతో ఒక మాట అన్నా,వెంటనే మర్చిపోయే గుణం మా క్రాంతిది.ఆయన ఇప్పటికీ అలాగే ఉన్నాడు.ఏ మార్పూ లేదు….కట్ చేస్తే…
మా నాన్న లైబ్రరీనీ వెతుకుంటే ఈ మూడవ తరగతి తెలుగు వాచకం పుస్తకం బయట పడింది.అది
పందొమ్మిది వందల డెబ్బై ఏడు,ఎనిమిది సంవత్సరాలలో
రాయడం మొదలై డెబ్బై తొమ్మిదిలో పూర్తయి ఉంటుంది.
అప్పుడు నేను మూడవ తరగతి చదువుతున్నాను.
అప్పట్లో మా ఊర్లో ప్రైమరీ స్కూలు అయిదవ తరగతి వరకే ఉండేది.ఆ స్కూలుకు హెడ్ మాస్టర్ గా మా చిన్నాయన ఆవంచ లక్ష్మారావు ఉండేవారు.ఆయన అంటే ఊర్లో భయం ఉండేది.ఉత్తమ ఉపాధ్యాయుడే
కాదు, మంచి రాజకీయ వేత్త.ఊర్లో ఉన్న కుల పెద్దలంతా
ప్రతిరోజూ సాయంత్రం ఆయనతో సమావేశం కావల్సిందే.
ఊర్లో ఎలాంటి సమస్య అయినా ఆయన తీర్చేవారు.
మా నాన్నకు తోడ ముగ్గురు తమ్ముళ్ళు.నాన్న ఆవంచ సీతారామారావు గారు..మంచి సాహితీ వేత్త.ఆ రోజుల్లో ఆయన దేవులపల్లి రామానుజరావు ఆద్వర్యంలో రాసిన ఎన్నో పుస్తకాలు,అనువాదాలను ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రచురించింది.పెద్ద తమ్ముడు లక్ష్మారావు, డెబ్బైవ దశకంలో చర్లపల్లిలో ఆయనది ఒక ఎరా…ఇటు ఉపాధ్యాయుడిగానూ,అటు ఊరి రాజకీయాల్లోనూ, చురుగ్గా పాల్గొన్న ఆయన చరిత్ర ఒక ప్రభంజనం. తరువాత ఆవంచ వేణుగోపాల్ రావు……నల్గొండ జిల్లాలోనే ప్రముఖ అడ్వకేట్.1969 సంవత్సరంలో తొలి ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సారధి.తన ఉపన్యాసాలతో యువతను ఉత్తేజ పరుస్తున్నాడన్న కారణంగా ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపింది, అప్పటి ప్రభుత్వం.తాను రాసిన అనేక వ్యాసాల ద్వారా ప్రజలను ఉత్తేజ పరచిన పోరాట యోధుడు. తరువాత ఆవంచ మురళీధర్ రావు…ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ విద్యార్థులకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ గా ఉండి బీఏ పబ్లిక్ గైడ్ పుస్తకాలు రచించారు.ఈ నలుగురు సోదరులు ఇంగ్లీషు భాషలో ప్రావీణ్యులు…….కట్ చేస్తే…
ఈ మూడవ తరగతి పుస్తకంలో మొత్తం పదహారు పాఠ్యాంశాలు ఉన్నాయి.అవి..ఓరుగల్లు, తోడేలు- మేకపిల్ల,మర్యాద రామన్న తీర్పు, రామదాసు,ఆవు, దీపావళి,లేఖ, బస్సు ప్రయాణం,సంత, పోస్టాఫీసు,నీతి పద్యములు,హితవులు,సుమతీ సూక్తులు,వేమన పద్యాలు, తెలుగు జాతి ఒక్కటే, తెలుగులందరూ ఒక్కటే…..భాషా బోధన విషయంలో
పిల్లలకు తలకు మించిన భారం ఉండొద్దన్న ఉద్దేశంతో
అప్పటి వరకు అమలులో ఉన్న పాఠ్య పుస్తకాన్ని అయిదు శాతం తగ్గించేందుకు 400 కొత్త మాటలకు బదులు 250 కొత్త మాటలను మాత్రమే ప్రవేశ పెట్టాలనీ
అప్పటి ప్రణాళిక సంఘం ఆదేశాలు జారీ చేసింది.ఆ మేరకు ఒకటి, రెండు తరగతులలో విద్యార్థులకు సుపరిచితమైన మాటలే కాకుండా 250 కొత్త మాటలను
ఈ పుస్తకంలో ప్రవేశ పెట్టారు.
ఈ పుస్తకంలో సంబంధిత పాఠ్యాంశానికి తగ్గట్టుగా ఒకటి, రెండు బొమ్మలు ఉన్నాయి.ఆ బొమ్మలు వేసింది, చర్లపల్లిలో మా ఇంటి వెనకాల లైనులో ఉండే ఫైన్ ఆర్ట్స్ డిస్కంటిన్యూవ్ విద్యార్ధి యద్దు లక్ష్మీ నర్సింహ్మ.వీళ్ళ ఇల్లు కొప్పోలు రంగనాయకమ్మ ఇంటి పక్కనే ఉండేది.యాబైవ దశకంలో
నర్సింహ్మ వాళ్ళ నాన్న చర్లపల్లి స్కూలులో ఉపాధ్యాయు డిగా పనిచేసారు.పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేసే భద్రయ్య, టీచర్ గా పనిచేసే శంకరయ్యలు అన్నయ్యలు.
ఒక అక్క.నర్సింహ్మ మూడు సంవత్సరాల వయసులోనే
తండ్రి చనిపోతే ఇద్దరు అన్నలే పెంచి పెద్ద చేసారు.డిగ్రీ
చదివేప్పుడు టీబీ రావడంతో చదువును మధ్యలోనే ఆపేసాడు నర్సింహ్మ.ఆ గ్యాపులో డ్రాయింగ్ మీద ఉన్న
ఆసక్తితో ఫైన్ ఆర్ట్స్ కాలేజిలో చేరాడు.మళ్ళీ అనారోగ్య
కారణాలతో అది కూడా డిస్కంటీన్యూవ్ చేసాడు.ఆ సమయంలోనే నాన్న రాసిన పుస్తకానికి బొమ్మలు చాలా అద్భుతంగా వేసాడు.ఆ బొమ్మల్లో మీకు నచ్చినదేది అని
అడిగితే ఎనమిదవ లెసన్ బస్సు ప్రయాణానికి గీసిన
బొమ్మలు అని చెప్పాడు.అవే ఎందుకు అని అడిగితే ….
నార్కట్ పల్లి నుండి వచ్చే బస్సులు చర్లపల్లికి వచ్చేసరికి
విపరీతమైన రద్దీ, బస్సు లోపల తొక్కిసలాటతో బస్సు
ఎక్కాలంటే చికాకు కలిగేది….ఆ అనుభవంతో బస్సు ప్రయాణం పాఠ్యాంశానికి వేసిన రెండు బొమ్మలు ఒకటి
బస్సులో తొక్కిసలాట.. రెండవది బస్సులో క్యూ పద్దతి…
ఈ రెండు బొమ్మలు చాలా శ్రద్ధగా వేసాను.మొత్తం పుస్తకం లో ఆ రెండు బొమ్మలే నాకు ఇష్టమైనవనీ నర్సింహ్మ
చెప్పాడు.ఆ తరువాత కొన్ని రోజులకు డిగ్రీ పూర్తి చేసి, కొద్ది కాలం డ్రాయింగ్ టీచర్ గా పనిచేసాడు.ఆ తర్వాత
ఎలక్సిటీ డిపార్ట్మెంట్ లో చేరి, పదేళ్ల క్రితం రిటైర్ అయ్యాడు…
1979 వ సంవత్సరంలో వచ్చిన ఆ మూడవ తరగతి తెలుగు వాచకం పుస్తకాన్ని మా నాన్న రాయడం
అది తవ్వకాల్లో బయటపడడం…ఆ పుస్తకంలో బొమ్మలు
వేసిన లక్ష్మీ నర్సింహ్మ గురించి నలబై సంవత్సరాల తరువాత తెలుసుకుని, ఆయనతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ..ఆ జ్ఞాపకాలను ఆయన రీకలెక్ట్
చేసుకుంటూ మా నాన్న గురించి చెపుతుంటే…. నేను ఇంకా… ఇంకా అంటూ రెట్టింపు ఉత్సాహంతో అడుగుతూ ఉప్పొంగిపోయాను.మా నాన్నకు కొడుకుగా పుట్టినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను…….