లోకులు కాకులు..
అనూహ్యమైన విజయాలు సాధించినా
ఏదో ఒక రకంగా వేలెత్తి చూపటానికే ప్రయత్నిస్తారు..
అందుకే విమర్శలకు కుంగిపోవద్దు.. Don’t Care అనుకుంటూ ధృఢ చిత్తంతో సాగిపోవాలి.. లక్ష్యాన్ని చేరుకోవాలి..
ఇలాంటి సందేశాన్ని పక్కా కమర్షియల్ మాస్ సినిమాలో కన్విన్సింగ్ గా చెప్పారు “చంద్రబోస్”.
అగ్రకథానాయికుడికి అఖండమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది.. ఆ ఫ్యాన్స్ కు మంచి మెసేజ్ ఆ హీరో పాత్ర ద్వారా చెప్పిస్తే మరింతగా జనంలోకి వెళ్తుంది. ఆ ఫల్స్ ను పట్టుకుని “చెన్నకేశవరెడ్డి” సినిమాలో హీరోయిజం ఎలివేట్ చేస్తూ.. చక్కని సందేశం అందించారు గీత రచయిత.
నవ్వే వాళ్ళు నవ్వనీ
ఏడ్చే వాళ్ళు ఏడ్వనీ
పొగిడే వాళ్ళు పొగడనీ
తిట్టే వాళ్ళు తిట్టనీ
don’t care
“లోకో భిన్న రుచి” అని లోకోక్తి.. సమాజంలో విభిన్న వైరుధ్యాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. సక్సెస్ సాధించిన వారిని చూసి.. వారి విజయాన్ని తక్కువ చేయాలనే దుర్బుద్ధి కల వ్యక్తులు.. “ఇదీ ఒక విజయమేనా..? దీనికే అంతగా మురిసిపోవాలా !” అని అక్కసుతో నవ్వే వాళ్ళు ఉంటారు.. అసూయతో ఏడ్చేవారు ఉంటారు.
కనుక Don’t Care.
అద్భుత విజయాన్ని సాధించావు, నీ సక్సెస్ మరో పది మందికి స్ఫూర్తి అని పొగిడేవారూ ఉంటారు. గెలుపుతో వచ్చిన ఆత్మవిశ్వాసాన్ని చూసి, తలపొగరు చూడు అని తిట్టేవారు ఉంటారు. వీటన్నిటినీ చూసి పొంగిపోకు.. కుంగిపోకు..!!
పూలే నీపై చల్లనీ
రాళ్ళే నీపై రువ్వనీ
ఎత్తుకు నిన్నేగరెయ్యనీ
గోతులు నీకై తీయనీ
don’t care… నవ్వే వాళ్ళు
ప్రేరణ ఇచ్చే నీ ఎదుగుదలను చూసి సత్కారాలు, సన్మానాలతో నిన్ను పూల వర్షంలో ముంచెత్తే వారు ఉంటారు.! కంటగింపుగా మారిన నీ ఎదుగుదలకు ఓర్వలేని తనంతో, విమర్శ అనే రాళ్ళను నీపై వేస్తారు. సో Don’t Care.
శ్రమ కోర్చి.. కష్టే ఫలి అని నువ్వు నిర్మించుకున్న విజయ సౌధాన్ని చూసి అంతెత్తున నిన్ను ప్రపంచానికి చూపెడతారు. నీ ఉన్నతిని, అభ్యున్నతిని చూసి తట్టుకోలేని వారు, నిన్ను పాతాళంలోకి నెట్టివేయాలని గోతులు తవ్వుతారు. అందుకే ఇలాంటివి కౌంట్ చేయకు.. కేర్ చేయకు.!
అనుకొన్నది నీవ్వే చెయ్
అనుమానం మాని చెయ్
నీ మనసే గట్టి చెయ్
నీదే రా పై చెయ్
సాధ్య అసాధ్యాలు పరిశీలించి, నువ్వంటూ ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాక వెనుకడుగు వేయకు. సక్సీడ్ అవుతానో లేదో అనే అనుమానాన్ని పెట్టుకోకు. ‘ష్యూర్ నేను సాధిస్తాను’ అని మనసులో గట్టిగా అనుకుని పనిచెయ్.. నీదే పైచెయ్..!! అంటున్నాడు కథా నాయకుడు.
ఎంత ఎదిగినా ఒదగాలన్నది చెట్టును చూసి నేర్చుకో
క్రమశిక్షణ తో మెలగాలన్నది చీమను చూసి నేర్చుకో
చిరునవ్వుతో బ్రతకాలన్నది పువ్వును చూసి నేర్చుకో
ఓర్పు సహనం వుండాలన్నది పుడమిని చూసి నేర్చుకో
మన జీవిత గమ్యానికి.. గమనానికి ప్రకృతి ఒక ప్రతిబింబం.. ఈ చరాచర జగత్తులో మనకు ఎన్నో పాఠాలను ప్రకృతి నేర్పుతుంది.
చెట్టు మనకు నీడనిచ్చి హాయినిస్తుంది.. ఫలాలను ఇచ్చి ఆకలి తీరుస్తుంది.. ప్రాణ వాయువునిచ్చి ప్రాణ ప్రతిష్ట చేస్తుంది. ఆకాశాన్ని అందుకునే మహావృక్షం సైతం తన కొమ్మలను చిగురులను నేలవైపే సారిస్తుంది. కనుక ఎంత ఎదిగినా ఒదిగిఉండాలి అని చెట్టును చూసి నేర్చుకో..
నలిపేస్తే చనిపోయే చీమలు అని మనం చిన్నచూపు చూస్తాము.. కానీ కలిసికట్టుగా ఆ చీమలు చేసే సంఘజీవనం మనకు స్ఫూర్తి కావాలి. అందుకే క్రమశిక్షణతో ఎలా మెలగాలో చలిచీమల నుండి నేర్చుకోవాలి.
పసిడి పువ్వులను చూస్తే మనసు పరవశానికి లోనవుతుంది. అలసిన దేహం ఆ పువ్వులను చూసి సాంత్వన చెందుతుంది. పువ్వులా ఎల్లప్పుడూ పెదవిపై చిరునవ్వు తాండవించాలి. ఆ నవ్వు పదుగురికి పలకరింపు కావాలి.
‘భూదేవి అంత ఓర్పు’ అని నానుడి. సునామీలు, భూకంపాలు, అగ్ని శిఖలు, పాపాలు.. వీటన్నింటినీ పుడమి భరిస్తుంది..మనలను రక్షిస్తూనే ఉంటుంది. మన జీవిత పయనంలో కష్టనష్టాలను భరిస్తూ, పుడమి అంత ఓర్పు నేర్పు ఉండాలని.. ప్రకృతిని నిత్య జీవితానికి అన్వయిస్తూ చెప్పాడు.
ఎంత తొక్కినా .. నిన్నెంత తొక్కినా ..
అంత పైకి రావాలన్నది బంతిని చూసి నేర్చుకో
నేర్చుకొన్నది పాటించేయి, ఓర్చుకొంటూ పనులే చేయి
నీదే రా పై చెయ్
ఎదుటి వారికి అరుదైన విజయం.. చక్కటి జీవితం లభిస్తే తొక్కెయ్యాలని చూసే వ్యక్తులు చాలా మంది ఉంటారు. సో.. నిన్నెంత తొక్కితే అంత పైపైకి రావాలని బంతిని చూసి నేర్చుకో..!
నేర్చుకున్నది ఒక పాఠంగా స్వీకరించు.. మరోచోట అన్వయించుకో అడ్డుతెరలను అధిగమించి.. నేర్చుకుంటూ ఓర్చుకుంటూ నీపని నువ్వు చేసుకో.. చూసుకో..! ఆటోమేటిగ్గా నీదే పైచేయి అవుతుంది.. విజయపరంపర కొనసాగుతుంది.
ఉన్నదున్నట్టు చెప్పాలన్నది అద్దాన్ని చూసి నేర్చుకో
పరులకి సాయం చేయాలన్నది సూర్యుణ్ణి చూసి నేర్చుకో
సోమరితనాన్ని వదలాలన్నది గడియారాన్ని చూసి నేర్చుకో
ప్రేమనందరికి పంచాలన్నది భగవంతుణ్ణి చూసి నేర్చుకో
అద్దం ముందు నిలబడితే.. మన రూపాన్ని, ఆహర్యాన్ని ఉన్నది ఉన్నట్టు చూపెడుతుంది.
నీతి నియమాలతో.. సత్య నిష్టతతో వాస్తవాలను, నిజాలను నిర్భయంగా చెప్పాలి. అంతేకానీ ఎదుటి వారి మెప్పు కోసమో, తాత్కాలిక అవసరం కోసమో మన వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు.
ఈ భూమిమీద ప్రాణికోటికి సూర్యుడు ధాతువు.. మూలాధారం.! సేవా గుణాన్ని సూర్యుడిని చూసి నేర్చుకోవాలి. అందుకే అన్నారు ‘పరులకు చేశావంటే సేవ.. పరమాత్ముడు నువ్వు కావా..!’అని.
నిరంతరం కదులుతూనే ఉంటుంది గడియారం.. అర క్షణం ఆగిపోతే.. ప్రపంచమే స్తంభించిపోతుంది. కనుక సోమరితనాన్ని వదిలి నిరంతరం శ్రమిస్తూ, పరిశ్రమిస్తూ ఉండాలి.
భగవంతుడి దృష్టిలో, సృష్టిలోని ప్రతిప్రాణి ముఖ్యమే. అందుకే తమపర భేదాలు లేకుండా, స్వార్థ చింతన వీడి, భగవంతుని కృపతో జీవించి ఉన్నంత వరకు అందరికీ ప్రేమను పంచు.. ప్రేమతో జీవించు..!
ఎంత చెప్పినా… నేనంత చెప్పినా
ఇంకెంతో మిగులున్నది అది నీకు నీవు తెలుసుకో
నేర్చుకొన్నది పాఠం చేయి నలుగురికీ అది నేర్పించేయి నీదేరా పై చెయ్”..
అని జీవిత సత్యాలను శోధించి, ఆధ్యాత్మికతను అద్ది, తాత్వికతతో బతుకు పోరాటాన్ని, మనుషుల అంతరంగాన్ని, సమాజంలో మెలిగే విధానాన్ని, విజయాలను అధిరోహించే తీరును, నేటి తరానికి అర్థమయ్యేలా ఉదాహరణలతో, బతుకు మలుపును, గెలుపు ఔచిత్యాన్ని ‘అగ్ర కథానాయకుడి’ ద్వారా సూత్రీకరించి.. సమాజానికి చేరవేసే గొప్ప ప్రయత్నం చేసిన చంద్రబోస్ అద్భుతమైన ఇన్స్పిరేషన్ సాంగ్ రాసి మరోమెట్టు చేరారు.