”నెత్తురు పారనిదెన్నడో నా తెలంగాణ పల్లెలో
నేలకు రాలనిదెన్నడో నా తెలంగాణ పల్లెలో”
అని ఎవరన్నారో తెలియదుకాని అచ్చుగుద్దినట్లతుకుతుంది ఈ నేలకు. తెలంగాణ భౌగోళికంగా దక్కన్ పీఠభూమిలో భాగం. పీఠభూమిలోని రాష్ట్రాలలో తెలంగాణ చరిత్ర, వారసత్వం భిన్నమయింది. పీఠభూమిలోని ఇతర ప్రాంతాలన్నీ బ్రిటిష్ పాలనలో ఉంటే తెలంగాణ మాత్రం రాచరికంలో మగ్గింది. కాబట్టి ఇక్కడ ప్రత్యక్షంగా జాతీయోద్యమం లేదు. ఆంగ్ల విద్యలేదు. సంస్కరణలు లేవు. తెలుగు భాషలోని వ్యవహారికవాదం లేదు. వెరసి తెలంగాణ సమాజం 1948 దాకా భూస్వామ్యంలో ఆగిపోయింది. మాంటేగ్ ఛేమ్స్ ఫర్డ్ సంస్కరణలు, భారత స్వాతంత్య్ర చట్టం, ప్రొవెన్షియల్ కౌన్సిల్ కు ఎన్నికలు, పరిమితంగానైనా ప్రజాస్వామిక వాతావరణం ఇక్కడ మృగ్యం. కాబట్టి సామాన్యుడి జీవన వనరు అయిన భూమి భూస్వాముల చెరలో ఉండిపోయింది. సమాజంలో కష్టజీవుల శ్రమను దోచుకోవడం నిరాఘాటంగా కొనసాగింది. శ్రమజీవులు కొద్దిగా వెసులుబాటు కోరుకున్నా పీడన కొనసాగించింది భూస్వామ్యం. గదిలో బంధించి దాడి చేస్తే పిల్లి కూడా తిరగబడినట్లు సామాన్యులు అనూహ్యంగా తిరగబడ్డారు. అదే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. భూమికోసం, భుక్తికోసం, పీడననుండి విముక్తి కోసం సాగిన ఈ పోరాటం భారత దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగింది. కమ్యునిస్టు పార్టీ ఉద్యమానికి గీటురాయిగా లభించిన గొప్ప పోరాటమిది. 11వ ఆంధ్రమహాసభ భువనగిరిలో ఇచ్చిన పిలుపుతో 1944లో మొదలైన సాయుధపోరాటం 1951 వరకు వివిధ రూపాలలో, స్థాయిలలో కొనసాగింది. సాయుధ పోరాటంలో విస్తృతంగా సాహిత్యం వచ్చింది. సాహిత్యంలోని ఇతర రూపాలలో ఈ పోరాటం తక్కువగా చిత్రించబడినా పాటలో మాత్రం అపురూపంగా స్థిరపడింది. పాట సాయుధ పోరాటానికి ఊపిరులూదింది కూడా.
‘ఆపరేషన్ పోలో” పేరుతో భారత ప్రభుత్వం సైనిక చర్య ద్వారా హైదాబాద్ రాష్ట్రాన్ని దేశంలో విలీనం చేసుకున్న తర్వాత సాయుధ పోరాటం పాక్షిక లక్ష్య సాధనతో ముగిసిపోయింది. మొదట మిలటరీపాలనలో జయంతి నాథ్ చౌదరీ, పౌర పాలనలో భాగంగా 26.1.1950 నుండి 6.3.1952 వరకు ఎం.కె. వెల్లోడి హైదాబాద్ రాష్ట్రాన్ని పాలించారు. 1952 మొదటి సాధారణ ఎన్నికల తర్వాత బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసారు. మద్రాసు నుండి విడిపోయిన ఆంధ్రులు కర్నూలులో అరకొర వసతితో పరిపాలన నడుపుతున్న క్రమంలో తెలుగు వారికొకే రాష్ట్రం అనే వాదాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు పావులు కదిపారు ఆంధ్రనాయకులు. అప్పటి హెదాబాద్ నాయకులు కె.వి. రంగారెడ్డి ఆధ్వర్యంలో దాన్ని వ్యతిరేకించారు. వీరి అపోహలను నివృత్తి చేస్తూ పెద్దమనుషుల ఒప్పందం చేసుకొని తెలంగాణకు కొన్ని రక్షణలు ప్రతిపాదించి ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేసారు. తన పదవీకాలం పూర్తి కాకముందే బూర్గుల పదవి పోయింది. నీలం సంజీవరెడ్డి ఆం.ప్ర.కు మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. పెద్దమనుషుల ఒప్పందంలోని ఒక ఒప్పందం ”ఆంధ్రప్రాంతం వారు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ప్రాంతం వారికి ఉపముఖ్యమంత్రి పదవి సృష్టించి ఇవ్వాలి”. నీలం సంజీవరెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే విలేఖరులు ‘ఉప ముఖ్యమంత్రి ఎప్పుడు ప్రమాణస్వీకారం చేస్తారు’ అని అడిగారు. దానికి జవాబిస్తూ నీలం సంజీవరెడ్డి ‘ఉపముఖ్యమంత్రి పదవి ఆరవ వేలు లాంటిది. దాంతో అలంకారమే తప్ప ఏ ప్రయోజనమూ లేదు’ అన్నాడు. ఇలా ఆం.ప్ర. ఏర్పడ్డప్పటి నుండి అన్ని రక్షణ చర్యలను తుంగలో తొక్కారు ఆంధ్ర ప్రాంత పాలకులు. అప్పటికే ముల్కీ ఉద్యమ స్ఫూర్తితో ఉన్న తెలంగాణ విద్యావంతులు ఆంధ్రులకు వ్యతిరేకంగా రగిలిపోయారు. 1969లో జై తెలంగాణ ఉద్యమం మెరుపులా ఆరంభమయింది. హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. 369 మంది విద్యార్థులు, యువత అసువులు బాసారు. ఈ సందర్భంగా సాహిత్యం అపురూపంగా సృజించబడింది. కథలు, కవిత్వం, పాటలు ఉద్యమాన్ని చిత్రించాయి. ఉద్యమాన్ని ముందుకు నడిపించాయి.
జైతెలంగాణ ఉద్యమాన్ని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తీవ్రంగా అణిచివేసి తెలంగాణ వాడైన పీవీ నరసింహారావును ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. తర్వాత పదేండ్లకే తెలుగుదేశం ఆవిర్భవించి ఎన్.టి.రామారావు రాకతో సీమాంధ్రుల వలసలు పెరిగిపోయాయి. చంద్రబాబు, వై.ఎస్. అధికారంలో ఉండగా ఆంధ్రుల ఆధిపత్యం పరాకాష్టనందింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా మేధావులు ఆలోచించారు. భువనగిరి డిక్లరేషన్‌తో దానికొక రూపం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు, ఎన్నికలు, రాజీనామాలతో వాతావరణం వేడెక్కింది. వంటావార్పు, సకల జనుల సమ్మె, సాగరహారంతో తెలంగాణ రాష్ట్ర కాంక్షను కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రేసు పార్టీ స్పష్టంగా గుర్తించింది. సోనియాగాంధీ చొరవతో రాష్ట్రం 2.6.2014 ఆవిర్భవించింది. మలిదశ ఉద్యమ సందర్భంగా సాహిత్యంలోని అన్ని ప్రక్రియలు స్పందించాయి. కథలు, నవలలు, వచనకవిత్వం, పద్యాలు, పాటలు వేలాదిగా పుట్టుకొచ్చాయి. ఉర్రూతలూపాయి.
సాయుధ పోరాట కవిత్వం:
‘అది తెలంగాణలోన దావాగ్ని లేచి
చుట్టుముట్టిన భీకరాశుభదినాలు
అని నిజాము నృపాలుని అండదండ
చూచుకొని నిక్కినట్టి పిశాచి కలలు
నాడు మానవతీ నయనమ్ములందు
నాగ సర్పాలు బుసకొట్టి నాట్యమాడె
నాడు మానవ నవనాగరికత
తన్నుదిన్నది రాక్షసత్వమ్ము తోడ’
అన్న దాశరథి పద్యాలు నిజాం రాజ్యపు చివరిరోజులకు అద్దం పడుతున్నవి. అరాచకాలను, శ్రమదోపిడీని, భూస్వామన పీడనను, పేదరైతులపై పన్నుల భారాన్ని తలపోస్తూ
‘తేనెలు పిండే తెలంగాణము
నెత్తుట ముంచెత్తెదరా?
తెప్పరిల్లిన ఈ తెలంగాణము
కుత్తుక బట్టొత్తెదరా?’
అని ప్రశ్నిస్తాడు భాగి నారాయణమూర్తి, పద్యము, గేయాలలోనే సాయుధ పోరాటపు చిత్రణ చూడవలసి ఉంది. కవిత్వంలో ఆధునిక రూపమైన వచనకవిత్వం బలంగా లేనప్పుడు, సాహిత్య రూపంగా పిలుచుకునే గేయం ప్రజల వాడుకలో మరింత సరళమైన పాటగా మారింది. ఉద్యమ నమోదుకు ఉద్యమ విస్తృతికి పాట మహాశక్తిగా పని చేసింది. సాయుధ పోరాటంలో ప్రధానమైన ఘట్టాలపైన, బందగీ హత్య, దొడ్డి కొమురయ్య కాల్చివేత, చాకలి ఐలమ్మ భూపోరాటంపైన పాటలు వచ్చాయి. అప్పటికే ప్రజా కవులుగా ప్రసిద్ధులైన బండి యాదగిరి, సుద్దాల హన్మంతు, నాజర్ మొదలైన వారు రచించి స్వయంగా పాడి పోరాటాన్ని బలోపేతం చేసారు. గ్రామీణ కూలీలైన జీతగాళ్ళ దయనీయ స్థితిని కళ్ళకు కడుతూ…
‘ఏరన్న రాక మునుపే ఎగువాక వచ్చేరన్నా
ఎవరింట ఉందువన్న బువ లేని జీతగాడ
భూమిని దుక్కిదున్ని పైరులనెల్ల సాకి
సోమరిపోతులను మేపాలి యెల్లకాలం
తెలియార తెలివితోడ కలవారి జీతగాడ’
అని పాడుతాడు నాజర్. ఇంతే దీనగీతాన్ని ఒక పసుల కాపరి మీద కేంద్రీకరిస్తూ
‘పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మొనగాడా
పాలుమరిచీ ఎన్నాళ్ళయ్యిందీ
ఓ పాలబుగ్గల జీతగాడ
కొలువు కుదిరీ ఎన్నాళ్ళయ్యిందీ
ఆకు తేళ్ళు కందిరీగలు అడవిలోగల కీటకాలు
నిన్నేమైనా కాటు వేసాయా’
అని సుద్దాల హన్మంతు రాసిన పాట సాయుధ పోరాటానికి పునాది రాళ్ళను పేర్చింది. పోరాటం నిజాం రాజ్య పతనం మీద కేంద్రీకరించబడ్డాక బండి యాదగిరి రాసిన
‘బండెనుక బండిగట్టి
పదహారు బండ్లుగట్టి
ఏ బండ్లె వస్తవు కొడుకో
నైజాము సర్కరోడా
నాజీల మించినవ్ రో
నైజాము సర్కరోడా’
అన్న గేయం బహుళ ప్రజాదరణ పొందింది. మొదట ఇది ప్రతాపరెడ్డి దొరకు వ్యతిరేకంగా కవి రాసినా ప్రజలు దీన్ని వస్తు విస్తృతి చేసి నిజాం పక్షంగా ప్రసిద్ధం చేసారు. ఈ కోవలో మేర మల్లేశం, ఆకుపత్ని శ్రీరాములు, తిరునగరి రామాంజనేయులు, కోగంటి గోపాలకృష్ణయ్య, నూతి నర్సయ్య, వట్టికొండ రామకోటయ్య, కాంచనపల్లి చినవెంకట రామారావు, నల్ల నరసింహులు, కణ్వశ్రీ, కాళోజీ, కొమరగిరి నారాయణరావు, అలువాల వెంకయ్య, వయ్యా రాజారాం, వానమామలై వరదాచార్యులు, కె.ఎల్. నరసింహారావుల గేయాలు, పాటలు సాయుధపోరాటాన్ని చిత్రించాయి. ఈ కవులే కాకుండా ఇతరులు రాసి పాడినవి ఎన్నో నమోదు కాకుండా పోయినవి. రాతలోకి రాకుండా నేరుగా కైకట్టి పాడుకొని పోరాటంలో పాల్గొన్న గాయక యోధులవి కూడా పోయినవి. నమోదు కాలేదు. కొన్ని పాటలు ప్రసిద్ధమై కర్తృత్వం తెలియకుండా కూడా పోయినవి.
జాల్నా జైలు దరోగాగా పనిచేసిన కూర్రుడు కోదండరాంరెడ్డిని నిందిస్తూ మేర మల్లేశం రాసిన
‘నీవు పెట్టిన హింస మేమెట్ల మరుతుము
వస్తుందిరా ఒక్కరోజు
కోదండ రాంరెడ్డి నిన్నొదిలి పోదు’
అనే పాట అప్పటి ఉద్యమకారుడి వేదనను కళ్ళకు కడుతుంది. ఆకుపత్ని శ్రీరాములు రాసిన
‘భలే మజాగున్నది నిజామోని సంగతి
హిందూ ముస్లీములు నా రెండు కండ్లంటడు
పెద్ద కన్ను చిన్నకన్ను
ఎంతో వికారంగ ఉంటడు’
అనే గేయం వ్యంగ్యంగా, ఆలోచనాత్మకంగా సాగుతుంటది. తిరునగరి రామాంజనేయులు సాయుధపోరాటంలో ‘రాక్షసుడు నైజాము రాజు పిచ్చిగరెచ్చి’ ఏమేం చేసాడో రాసాడు. కోగంటి గోపాల కృష్ణయ్య రాసిన ‘తెలంగాణ ప్రజలంత కలవాలోయ్ / తెగువతో పోరాడి గెలవాలోయ్’ అనే గేయం, వట్టికొండ రామకోటయ్య రాసిన ‘మనకొద్దీ పోలీసు రాజ్యం’ అనే గేయం, కాంచనపల్లి చినవెంకటరామారావు రాసిన ‘ఖరాఖండి’ అనే గేయం, నల్లా నరసింహులు రాసిన ‘జయభేరి మ్రోగించరా ఆంధ్రుడా / జయ పతాకంబెత్తరా’ అనే గేయం, కణ్వశ్రీ రాసిన ‘అది నా తెలంగాణ తొలగర కసాయీ! / అది నా తల్లినేల తొలగర గుండా’ అనే గేయం, కాళోజీ రాసిన ‘నల్లగొండలో నాజీ వృత్తుల / నగ్ననృత్యమింకెన్నాళ్ళు’ అనే గేయం, కొమరగిరి నారాయణరావు రాసిన ‘ఆంధ్రమహా సభ చూడ పోదాము రారండు’ అనే గేయం, అలువాల వెంకయ్యగారి ‘ఆంధ్రమహాసభకరుగుదెంచండి’ అనే గేయం, కె.ఎల్. నరసింహా రావు రాసిన ‘అమరజీవి కొమురయ్య’ గేయం, వానమామలై వరదాచార్యులు రాసిన గేయంలో నిజాం నుద్దేశించి రాసిన ‘చినిగిన గుడ్డలు దొడిగే చిత్రపు ఫకీరువయా / ఇనుమువలెనె బంగారపు ఇటుకలంక గూర్చుమయా’ అనే వ్యక్తీకరణలు ఈ కోవలో ఎన్నదగినవి.
కవిత్వపు నూతన పోకడలు అంతగా లేని ఆ రోజులలో కూడా వినూత్న వ్యక్తీకరణలున్న పాటలు ఇప్పటి పాఠకులను అబ్బురపరచగలిగేవిగా ఉన్నాయి కొన్ని. వయ్య రాజారాం చిలుకా అనే శీర్షికతో తత్వం చెప్పినట్లుగా పోరాటాన్ని చెబుతాడు.
‘మున్నాళ్ళ మురిపెంకు మురిసేవు తరిసేవు
ముందుగతి కానవేచిలుకా
అద్దె కొంపల నుండి గద్దెక్కి నాననుచు
మిడిసి పడకేరామ చిలుకా’
అంటాడు. ఇంకొక పాటలో ‘గురిగింజ గురిమల్లెలో” అనే దరువులతోనే పోరాటం పాటంతా రాస్తాడు. నూతినర్సయ్య ఈ కోవలో ప్రత్యేకంగా చర్చించదగిన కవి. ఈయన ఆలేరు కాల్పులపై బుర్రకథ రాసి ప్రజల పోరాటానికి అనుగుణమైన దర్వులో వీరగాథ చెప్పాడు. తిరునగరి ‘సైసైగోపాలరెడ్డి’ అనేది గొప్ప ఊపునిచ్చే పాట. సుద్దాల దెబ్బకు దెబ్బపాటలు కూడా అదే ఊపు ఉంటుంది. చూడండి.
‘వెయ్ వెయ్ వేయర దెబ్బ
దెబ్బకు దెబ్బ వేయ్ వేయ్
దయ్యపు గుండా గొయ్యలు రజాకార్లు
కయ్యానికి మనపైబడి వచ్చిరి’
వెట్టిచాకిరి మీద, శ్రమ దోపిడి మీద, ఎర్రజెండా మీద, ఉద్యమ కదలికల మీద అనేక పాటలు అజ్ఞాత కవులు రాసినవి కూడా పెద్ద సంఖ్యలో ప్రచారంలో ఉన్నాయి. ‘వేగరావోయి కార్మికా, వేగరావోయి కర్షకా’, ‘కొంగునడుముకు చుట్టనే చెల్లెమ్మ’ తదితర గీతాల కర్తృత్య నిర్ధారణ కోసం సాహిత్య విద్యార్థులు పరిశోధన చేయవలసిన అవసరం ఉంది.
జై తెలంగాణ ఉద్యమ కవిత్వం:
ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఆంధ్రులతో కలిసినందుకు వారి ఆధిపత్యం మొదటి నుండీ అన్ని రంగాలలో కొనసాగింది. భాష, ఉద్య్యోగాలు, చదువులు అన్ని రంగాలలో వారిది పై చేయిగా చేసుకొని పెత్తనం సాగించారు. నిజాం పాలన నుండి మరల వీరి పాలనలోకి వచ్చినట్లయింది తెలంగాణ. అది భరించలేని తెలంగాణ ప్రజలు ‘ఆంధ్ర గోబ్యాక్’, ‘నాన్ ముల్కీ గో బ్యాక్’ పేరుతో 1969లో పెద్ద ఉద్యమం నడిపించారు. విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు అందులో పాల్గొన్నారు. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఆ సందర్భంగా కవులు, సాహితీ వేత్తలు కూడా ఉద్యమంలో గొంతు కలిపారు. అయితే అప్పుడు తెగించి రాసినవి, మాట్లాడినవి అన్నీ రికార్డు కాలేదు. దొరికిన వాటిలో కథలు, కవిత్వం, పాట ద్వారా ఉద్యమం వేడిని అంచనా వేయవచ్చు.
ఆం.ప్ర. ఏర్పాటును స్వాగతించిన ఆనాటి ప్రసిద్ధ కవులలో ఒక్క కాళోజీ మాత్రమే 1969 ఉద్యమాన్ని సమర్థించాడు. తెలంగాణ ఆకాంక్షను కృష్ణుడిగా, అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనందరెడ్డిని కంసునిగా సంభావింపజేస్తూ
”కృష్ణుడివలె ‘తెలంగాణ
మొలుస్తాండు జేలులోన
బ్రహ్మానందుడు కంసుడు
బలుస్తాండు జేలినతల
రాజ్యమంత కాస’య్యల
రాజ్యము అనుకుంటున్నాడు
బ్రహ్మానందుని కాసు
బదనామైనది బజార్లో”
అని ప్రకటించాడు కాళోజీ. ‘తెలంగాణ వేరైతే దేశానికి ఆపత్తా?’ అన్న కాళోజీ ప్రశ్నకూడా అప్పటిదే. సమైక్యమనే రాచపుండుకు సరియైన మందు వేయాలంటూ పేర్వారం జగన్నాథం
‘దిగాలు పడి చూస్తావెందుకు తమ్ముడూ!
మన తల్లికీనాడు
వెన్నులో పుట్టింది రాచపుండు
నాటు వైద్యులూ నర్మ సచివులూ పనికిరారు
ఏదో ఒక విధంగా తగిన చికిత్స చేయమంది
ఇంతలో ఈ వ్రణం మానిపోదు’
అని గొంతెత్తాడు.
‘వేరు పడితే కష్టమనడం
వెనుకటి రోజుల్లో మాట
కలిసిమెలిసి సుఖపడుట
కథల్లో సిన్మాలో నీతి’
అని కుండబద్దలు కొట్టాడు అగ్ని.
‘మేమంతా సిద్ధం
అనవరతం, అనుక్షణం
మా గడ్డ విముక్తి కోసం
మా బతుకులు తృణపాయం’
అన్నాడు వెన్నెల. చరిత్రను సూత్రీకరిస్తూ రుద్రశ్రీ
‘నేను తెలంగాణ పౌరున్ని
నేను తెలుగు మాట్లాడే మానవున్ని
రెండు వందల సంవత్సరాల నుండి
నిండుగా పరపీడన కలవాన్ని’
అని ప్రకటించాడు. ముకురాల రామారెడ్డి జై ఆంధ్రను తొక్కవేసిన అమానుషాన్ని ప్రశిస్తూ అలోచనాత్మకమైన కవిత రాసాడు.
‘నలభై ఎనిమిది నాటి
స్మృతులీనాడు సాక్షి
పాత గోలకొండ పత్రికలు సాక్షి
కులసతి మున్షీ కలము సాక్షి
కుట్రతెరుగని కుర్రలు
అన్నెం పున్నెం ఎరుగని బాబులు
అన్సోషల్ ఎలిమెంట్స్
పేర కాల్చబడ్డారు’
పెరుమాండ్ల సుధాకర్ సరళవాక్యాలు ఆ సందర్భాన్ని ఎలా స్ఫురణకు తెస్తాయో చూడండి.
‘తమ్ముడూ అనివచ్చిన
అన్నను చూసాను
తీపిమాటల చురకత్తుల్ని
విసరడం చూసాను
తల్లి యొడిలోన మంటల్ని
లేపడం చూశాను
తల్లి హృదిలోన పొంగిన
బాధల్ని చూసాను
చూడరానిది చూశాను
చూడాలని చూశాను
చూపుకందని అన్నల అహంకారానికి
అనురాగం లేని అంధుల అన్యాయానికి
అన్న, తమ్ముని యింట
పగవాగే అంటున్నాను’
అప్పుడు కొందరు తెలంగాణ వారు సమైక్యత వైపు కూడా నిలబడ్డారు. వారిని ఉద్దేశించి శీలం రాజేశం ఆలోచనాత్మకమైన కవిత ‘పిల్లికి ఎలుక సాక్ష్యం’ రాసాడు.
‘మంచి మాటలతో
మా ప్రయత్నం లేదా!
దంచి పుచ్చుకుంటాం
మా మంచి తెలంగాణను’
అన్నట్లుగా ఆ రోజుల్లో ఆంధ్రులపై దాడులు, బస్సెక్కి టిక్కెట్టు కొనకుండా జై తెలంగాణ అని కూర్చునుడు నడిచిందట. పిట్టల రామస్వామి అప్పటి ప్రభుత్వ పెద్దలను నిందిస్తూ
‘సిగ్గులేని మంత్రులంత
దోచినారు తెలంగాణను
ఉద్యమాన్ని అణచుటకై
దొంగ ఎత్తులేసినారు’
అని రాసాడు.
కవిత్వం మధ్యతరగతి బుద్ధిజీవులను కదిలిస్తే పాట సామాన్యులలో చైతన్యం రగిలిస్తుంది. 1969 ఉద్యమంలో స్త్రీలు కూడా పోరాట కవిత రాసారు. తెన్నేటి సుధాదేవి
‘తెలంగాణ జన్మ హక్కు
కాదన బ్రహ్మకు తరమా?’
అనడంలో మంచి శ్లేషసాధించింది, ఆనాటి ముఖ్యమంత్రి పేరును సూచిస్తూ, కుమారి కలువకొలను ‘ఎదిరిస్తార’ అనే కవితలో శాంతియుత పోరాటంలో రాష్ట్రం సిద్ధించదని చెప్పి రాసింది. ఈ కందుల జోసెఫ్, బాలాజీ గోగీకర్, నీలా జంగయ్య, కోవెల సంపత్కుమార, రావెళ్ళ వెంకటరామారావు, యస్. రాంబాబు, భారవ, యశోద, గిరి, ఋక్కు, సుంకుశ్రీ, యుగంధర్, శ్రీధర్ రెడ్డి, విద్యార్థి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, కె.ప్రభాకర్, శేషభూషణ రావు, అనుముల శ్రీహరి, జగదీశ్వర స్వామి, బాసిరి, ఆకుపత్ని శ్రీరాములు, చెరుకు సత్యనారాయణరెడ్డి, రాజశేఖరం, కె. భాస్కర్ బాబు, వేణు సంకోజు, బయ్యా నాగరత్నం, చెరబండరాజు, భార్గవ, జి. యశోద, ఎస్వీ సత్యనారాయణ, కసిరెడ్డి వెంకటరెడ్డి తదితర కవులు తెలంగాణ పోరాటం సందర్భంగా కవిత్వం రాసారు. అయితే పోరాటానికి పూర్తి స్థాయి మద్దతు ఇవ్వని వాళ్ళు కూడా ఇందులో చాలా మంది ఉన్నారు. వారు చాలామంది తెలంగాణ ఔన్నత్యాన్ని కవిత్వీకరించారు.
ఆనాటి పాటల్లో బహుళ ప్రజాదరణ పొందిన పాటలున్నాయి. కరృత్వం తెలియని
‘ఓ బ్రహ్మానందరెడ్డి నీ బతుకు బంజర దొడ్డి
పుట్టింది ఆంధ్రపుటుక పెరిగింది తెలంగాణ
మా డబ్బు దోచినావు ఆంధ్రోల్లకిచ్చినావు’
లాంటి పాటలతో పాటు స్వయంగా పాటలు తామే రాసిపాడిన కవులున్నారు. ముచ్చెర్ల సత్యనారాయణ 1952లోనే గైర్ ముల్కీ గోబ్యాక్ అని నినాదం ఇస్తూ ఉర్దూ తెలుగు కలగలిసిన ఈ పాట రాసాడు. చూడండి.
‘సంజీవరెడ్డి మామా
సునోజీ మేరా గానా
కహతా హై తెలంగాణ
ఇన్సాన్ తుమ్ కోమానా
ఐసా కభీ న జానా
బందర్ కే కార్నామా
బాతేఁతో లాక్ బోలా
బహుల్ జల్ద్ మగర్ భూలా
హోగయే తేరా హవాలా
నికల్ గయా దివాలా
ఛోడో జీ తెలంగాణ
చలే జావో రాయలసీమ’
పక్నుద్దీన్ విజయమో వీర్ స్వర్గమో తేల్చుకొమ్మని చెప్పే పాట రాసాడు. ఇది విద్వత్కవి రాసిన కవితలాంటి గేయం.
‘విజయమ్మో లేక వీర మరణమ్మో కాక
వేరొక్కటి నేను గోర వేరెం దున నేను జేర
కదనమ్మో లేక విష్ణు సదనమ్మో కాక వేరు
విషయమ్ముల నేను గోర, వృత్తమ్ముల నేనుజేర’
అని నడుస్తుందీ గేయం. అనుముల శ్రీహరి గేయాలు చాలా శక్తివంతమై ప్రసిద్ధిలోకి వచ్చాయి. మనవాళ్ళు పెద్దమనుషుల ఒప్పందం మీద గుడ్డిగా సంతకం పెట్టారని విమర్శిస్తూ
‘అంతా మన పెద్దవాళ్ళ అల్పబుద్ధి హేతువురా
స్వంత లాభమొకటి చూసి సంతకాలు చేసినారు
చౌ ఎన్ లై వంటి వాళ్ళ సన్నిధిలో చేరినారు
భావి తెలంగాణ ప్రజల బతుకులతో ఆడినారు’
అంటాడు. ఇంకా ఎస్. మాధవీయాదవ్, కమలేకర్ రామచంద్రజీరావు, మంత్రి శేషభూషణ్, ఎం. సుదర్శన్‌రెడ్డి తదితరుల పాటలు కూడా ఈ కోవలో పేర్కొన దగినవి.
మలిదశ ఉద్యమ కవిత్వం:
మలిదశ ఉద్యమారంభాన్ని మలిదశ ఉద్యమ కవిత్వాన్ని ఎక్కడ ఎట్లా పారంభమయిందో చెప్పడం కష్టం. 1995 నుండి ఈ దిశగా మేధావులు, తొలిదశ ఉద్యమ కారుల ప్రయత్నం పునః ప్రారంభ మయింది. జర్నలిస్టులు, కవులు, గాయకులు 2000 సంవత్సరం తర్వాత పూర్తిగా ఈ వాదంపై ఆలోచించడం, రాయడం మొదలయింది. తెరాస ఏర్పాటయ్యాక తెలంగాణ వాదంపై కార్యావళి మొదలయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను 2009, డిసెంబర్ 9న ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి డిసెంబర్, 23న దాన్ని ఉపసంహరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం తెలంగాణ వారికి ఒక షాక్ ట్రీట్ మెంటుగా పని చేసింది. అప్పటి దాకా కొంత ఉదాసీనంగా ఉన్న తెలంగాణ వారు కూడా రాష్ట్రం ఏర్పడి తీరాల్సిందేనన్న ఏకాభిప్రాయానికొచ్చారు. ఇక అప్పటి నుండి ఉద్యమం ఆగలేదు. సాహిత్య సృజన కూడా ఆగలేదు. వేలాదిగా కవితలు, పాటలు పుట్టుకొచ్చాయి. డజనకొద్ది సంకలనాలు, వందలాదిగా సంపుటాలు, ఎక్కడ వీలైతే అక్కడ కవిసమ్మేళనాలు నిర్వహించబడ్డాయి. అనేక సాహిత్య సంస్థలు అందులో మునిగిపోయాయి. తెరవే చేసిన కృషి గొప్పది. మరసం, తెసావే, నీలగిరి సాహితి, పాలమూరు సాహితి, హైకవే తదితర సంస్థలు పనిచేసాయి. పొక్కిలి, మత్తడి, మునుం, జులూస్, ములాఖాత్ వంటి సంకలనాల కొద్దీ కవితలు వచ్చాయి. వీటన్నింటినీ శీర్షికలుగా విభాగించి విశ్లేషించడం కానీ, కవులందరినీ, కవితలన్నింటినీ కనీసం పేర్కొనడం కానీ చిన్న విషయం కాదు. చిన్న వ్యాసంలో కేవలం విహంగ వీక్షణం మాత్రమే చేయగలం. అది కూడా వస్తుకేంద్రంగానే.
తెలంగాణ భాషా హేళనను ధిక్కరిస్తూ ప్రజల జీవభాషగా ఎలుగెత్తిన కవితలు చాలా వచ్చాయి. ఆ రోజుల్లో తెలంగాణ భాష మీది ప్రేమను ప్రకటిస్తూ
‘నా తెలంగాణ భాష
ఊటల తేటనీరసొంటిది
సవ్వారి కచ్చురాల నడకల్లో ఇనిపించే
మువ్వల సప్పుడు సొంటిది
పిల్లంగోయని ఇనిపించే రాగమ సొంటిది’
అంటాడు టీ. కృష్ణమూర్తి యాదవ్. నందిని సిధారెడ్డి ఇంకొక అడుగు ముందుకు వేసి ఆధిపత్య భాషీయులను ధిక్కరిస్తూ
‘మాటకు రంగులద్దిన మాయలోడా
నీ కొంచెపుతనానికి
నా మాట మంచం పట్టింది గదరా
దోసెడు రక్తమిచ్చి బతికించుకుంటా నా మాటను’
అంటాడు. భాషా విచక్షణను పాటలో కూడా ప్రశించాడు లైనేష్ కుమార్.
‘అప్పారావో నీకు లెక్కల్ రావో
అప్పారావో నీకు తెలంగాణ మాటలు రావో
నీవు పిట్టల దొరవ్ పొద్దున పోతవ్
బి.డి. ఎల్.లో డ్యూటీ ఉంటది పిట్టలుగోటె పోత ఉంటది
ఊరూ ఊరూ తిరగపోతవు ఉడకందే తింటనంటవు
తెలంగాణ రాదంటవ్ తెలివిలేని వాళ్లంటవ్’
అన్నది ఆయన పల్లవి. ఎలికట్టె అయిలయ్య ‘తెలంగాణ రథం’ గేయంలో ‘భాషలోని యాస మీద ఎక్కిరింపులేందన్నం’ అని ప్రశ్న వేస్తడు. ప్రసిద్ధి పొందిన కాళోజీ భాషా వెటకారం ఈ ఉద్యమంలో బాగా ప్రచారంలోకి వచ్చింది.
ఒక వేళ తెలంగాణ నిజంగా ఏర్పడితే హైద్రాబాద్ మాత్రం యుటీగా గాని ఉమ్మడి రాజధానిగా గాని ఉంచాలన్న సీమాంధ్రుల ఆశలను తెలంగాణ కవులు అవహేళన చేసారు. భీం వంశీరాం చందర్ అనేకవి మొఖం మీద కొట్టినట్లు జవాబిచ్చాడు.
‘హైద్రబాదు మాదంటే మూతపండు రాలుతాయి
మర్యాదగ పోకుంటే రోకండ్లే ఎగురుతాయి
మీ అబ్బసొత్తు కాదురో హైద్రాబాదు మాదిరో
తెలంగాణ గుండెరో హైద్రబాదునిడువంరో’
అని ఈ కవి రాత వెనుక సుంకిరెడ్డి నారాయణరెడ్డి రాసిన ఒక వ్యాస స్ఫూర్తి ఉందనిపిస్తుంది. ‘హైద్రాబాద్ జనని తెలంగాణ’ ను సుంకిరెడ్డి ఆంధ్రజ్యోతి డైలీలో రాస్తూ హైదాబాద్ నిర్మాణ పనుల్లో తెలంగాణ జిల్లాల శ్రామికుల పాత్ర మాత్రమే ఉందని రాసాడు. హైదాబాద్‌లో పుట్టి పెరిగిన లోకేశ్వర్
‘నా జానె జిగర్ నగర సుందరి కళ్ళు ముక్కు చెవులు చెంపల్ని చెక్కేసి
నామరూపాల్లేని అనామికను చేస్తున్న చట్టబద్ద కోస్తా ఉగ్రమూకలు
పట్నాన్ని ఎకరాలుగా గజాలుగా లెక్కిస్తున్న నయా వలస పాలకులు’
అని నిందిస్తాడు.
తెలంగాణ వనరుల దోపిడీపై చాలా కవిత్వం వచ్చింది. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి దోపిడీని సృజనాత్మకంగా వ్యక్తీకరిస్తూ
‘భూమి ఒక బ్లాంక్ చెక్
నీరు దాని విలువను నిర్ణయిస్తది’
అంటాడు.
‘నిజం దేవుడెరుగు
నీరుకొస్తానెరుగు’
అని కూడా తనే అనగలిగినంత లోతైన అధ్యయనం ఆయనది. అమ్మంగి వేణుగోపాల్ వనరుల దోపిడీ ఇంకొక విధంగా ఆలోచించాడు.
‘సచివాలయం తవ్వి చూడు
తెలంగాణ బొంద కనిపిస్తది’
అన్నాడు.
ఈ ప్రాంతపు మౌలిక విశేషాలను ఆత్మగౌరవాన్ని సగౌరవంగా ప్రకటించారు కవులు. ఇక్కడి పండగ పబ్బాలను నెత్తికెత్తుకోవడంతో పాటు ఇక్కడి ప్రజలను తక్కువ చేసి మాట్లాడే మాటలకు తిరుగులేని జవాబు లిచ్చారు. బతుకమ్మ పండుగనాటి కళను వర్ణిస్తూ దేశపతి శ్రీనివాస్
‘పండుగ రోజులల
లైట్లు లేకపోయినా
పల్లె పల్లెంతా గొప్ప వెలుగే
గాలి నిండా
గునుగులూ తంగేళ్ళ గుసగుసలే ‘
అంటాడు. కాసుల లింగారెడ్డి బతుకమ్మను విప్లవాత్మగా సంబోధిస్తూ
‘భూస్వామ్యాన్ని భూస్థాపితం చేసిన బతుకమ్మ
సమస్త సాంస్కృతిక ఆధిపత్యాల మీద
సరికొత్త ఆయుధం’
అంటాడు. యాభైయ్యేండ్ల తేనెపూసిన పెద్దన్నల ప్రేమను వినూత్నంగా చెబుతూ డా.కొండపల్లి నీహారిణి
‘అక్షరాలు కలిసి ఉన్నట్లే
మనమూ అర్థ శతాబ్దం నుంచి పుస్తకాలు తెరిస్తే మాత్రం
నేను ఒక్క పేజీలోనూ లేను’
తిప్పి పొడుస్తారు. నగర సంస్కృతిని చెబుతూ గంగా జమునా తహజీబ్ ను వర్ణిస్తాడు ఎస్. జగన్ రెడ్డి.
‘ప్రతి బస్తీ చివర
ఒక మజీద్ ఒక మందిర్
అజా పిలుపే మేలు కొలుపు’
ఉద్యమానికి ముందు, ఉద్యమ కాలంలోనూ తెలివైన ఒక ప్రచారాన్ని ప్రవేశపెట్టారు. దానర్థమేమిటంటే ఆంధ్ర వారు చాలా కష్టబోతులు, తెలంగాణ వాళ్ళు సోమరిపోతులు. అదేనిజమైతే వాళ్ళ అక్కడే శ్రమలు దుమికించుకోవచ్చు కదా. వాళ్ళు ఇక్కడికి వచ్చి దోపిడిచేసి మాకు పేరుబెట్టడం ఎందుకని కవులు ప్రశ్నించారు. సాయిచంద్ ఇలా ప్రశ్నిస్తాడు.
‘మా విజయవాడలో కనకదుర్గమ్మ కాసుల రాసులు అడిగినమా
తిరుమల తిరుపతి వెంకటేశుని హుండీ లెక్కలు అడిగినమా
కాకినాడ మీ విశాఖపట్నం ఓడరేవు మేమడిగినమా
కృష్ణా డెల్టా గుంటూరులో గుంటెడు జాగను అడిగినమా’
ఆంధ్రులు కష్టబోతులు, తెలంగాణ వాళ్ళు సోమరిపోతులు అన్న ప్రచారాన్ని ‘వాళ్ళు కష్టపడ్తర్సార్’ అన్న కవితలో చాలా వ్యంగ్యంగా తిప్పికొడతాడు, ఏనుగు నరసింహారెడ్డి. చూడండి.
‘వాళ్ళు
కోనసీమలో కొబ్బరాకులమ్మి
ప్రజ్ఞాపురంలో పత్తితోటకొంటరు
…………….
మనోళ్ళు
చరిత్ర చింతాక్రాంతమైనప్పుడు
రాయి ముక్క అవసరం లేకుండా
చార్మినార్ ను కట్టి చందమాముకు పోటీపెడ్తారు’
మలిదశ ఉద్యమంలో పెను విషాదం విద్యార్థులు, యువకుల ఆత్మహత్యలు. ఉద్యమంలో అమరులైన ఉద్యమకారులమీద విస్తృతంగా కవిత్వం, పాటలు వచ్చాయి.
‘మీ తాతలు
నెత్తురు మోటలు గొట్టిండ్లు
పోరు పంటలే పండించిండు
తుఫానుకు జోరు మనపోరే నేర్పింది
నీళ్ళకాల్వకు రువ్వడి నెత్తుటి కాల్వే నేర్పింది
బిడ్డా! పానం దీస్కున్నవ్
తెలంగానొస్తదా ..?’
అని ఒక తల్లి గొంతుకగా ప్రశ్నిస్తాడు పి.యాదగిరి.
‘వీరులు మరణిస్తే
ఉద్యమాలు బెంగటిల్లుతై
పోరాటాలు మసకబారుతై
మీ బలిదానాలకు
వాళ్ళ కంటి కొలుకుల్లోంచి
ఒక్క దుఃఖపుచుక్కెనా రాలనప్పుడు
గుండె గదిలో రెండు
వేదనా కదలికలైనా పుట్టినప్పుడు
చావుకెందుకు మీకు మీరే
రహదార్లు పరుస్తున్నారు’
ఒక తండ్రిలా ఉదారి నారాయణ అమరులను ప్రశ్నిస్తాడు. ఇక దరువు ఎల్లన్న రాసిన
‘వీరులారా వందనం విద్యార్థి
అమరులారా వందనం పాదాలకు
మా త్యాగధనులారా మంచిపోమూ మేము
గుండెల్ల గుడిగడుతం పోరుదండం బెడుతం’
అనే పాట, మిట్టపల్లి సురేందర్ రాసిన
‘రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా
రక్త బంధం విలువ నీకు తెలియదురా
నుదుటి రాతలు రాసె ఓ బ్రహ్మదేవా
తల్లికొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా
తెలిసుంటె చెట్టంత నా కొడుకును
తిరిగి తెచ్చివ్వగలవా నీ మహిమలు’
అనేపాట, గద్దర్ విప్లవోద్యమంలో భాగంగా రాసి పాడిన
‘ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్లో గలిసినారా
సుక్కలలో గలిసి మీరు సూరులయినా మొలసినారా
ఏ దిక్కులేనోళ్ళకు మా బిడ్డలు
మీరు దిక్కులూపే చుక్కలయ్యిండ్రా మా కూనలు’
అనే పాట మలిదశలో కళ్ళనీళ్ళు పెట్టించాయి. ఇలాంటి సామూహిక స్మృతిగీతాలే కాక వ్యక్తిగతంగా కూడా స్మృతి కవిత్వం, స్మృతి గీతాలు వచ్చాయి. వేదికలను ఉర్రూతలూగించాయి. అందెశ్రీ ఉద్యమంలోనే పాడిన మంగళాశాసనం
‘జయజయహే తెలంగాణ.. జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరితగల తల్లీ నీరాజనం
పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం’
2.6.2014న నిజమయింది. తెలంగాణ రాష్ట్రావిర్భావానంతరం, ఆవిర్భావ సందర్భంగా కూడా పాటలు, కవితలు వచ్చాయి. పత్రికలను అలంకరించాయి.
ఉద్యమం పరిసమాప్తమయ్యాక దాని రూపం ఘనీభవిస్తున్న తరుణంలో చిన్న సంఘటనలు, చిన్న సందర్భాలు, చిన్నచిన్న ఊతాలు మరుపుకు గురవుతాయి. అందులో ఆశ్చర్యం గాని ఆవేదన చెందాల్సిందిగానీ లేదు. కానీ ఉద్యమం సఫలీకృత థకు రాగానే శతృశిబిరం మిత్రులకన్నా ముందు ఉద్యమ కేంద్రానికి చేరుకోవడం అన్యాయం. ఇది ఎక్కువగా రాజకీయులలో ఉంటుంది. కవులకు ఆకాంక్షలుంటాయి. అవి ప్రజాప్రేరితం. ఆశలేమీ ఉండవు. వారి పేరు పుటలలో ఉంటుంది. అంతేచాలు. మలిథ ఉద్యమంలో పేర్కొనాల్సిన కవులు లెక్కకు మిక్కిలి. వారిలో చర్చకు పెట్టాల్సి ఉండి పెట్టలేకపోయిన వారు ఎందరో. అందులో కొందరి పేర్లు.
గూడ అంజయ్య, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, తిరునగరి దేవకీదేవి, మిత్ర, జయరాజు, మల్లావఝుల సదాశివుడు, అనిశెట్టి రజిత, జ్వలిత, వరంగల్ శ్రీనివాస్, నేర్నాల కిషోర్, దయా నర్సింగ్, సురా, దర్వు ఎల్లన్న, దర్వు అంజన్న, కొల్లపురం విమల, కోదారి శ్రీను, ఏపూరి సోమన్న, కొమిరె వెంకన్న, యశ్ పాల్, గిద్దె రాంనర్సయ్య, పాటమ్మ బిక్షపతి, పైలం సంతోష్, వరవరరావు, మురళి మధు, చెన్నాడి వెంకట రమణారావు, వై. వెంకన్న, గోగు శ్యామల, డా.ఏ. జయంతి, అంబటి వెంకన్న, యోచన, వేణు సంకోజు, బెల్లియాదయ్య, షేక్ బాబా, గాజోజు నాగభూషణం, ఎస్.వి. మల్లిక్ తేజ, ఓరుగంటి శేఖర్, జనార్థన్, దేవరశెట్టి జనార్థన్, బుర్ర సతీష్, కందికొండ, నిస్సార్, సినారె, ననుమాస స్వామి, శ్రీరామోజు హరగోపాల్, జూలూరు గౌరీశంకర్, కాశీం, దాసరాజు రామారావు, అయాచితం నటేశ్వర శర్మ, అభినయ శ్రీనివాస్, పిట్టల రవీందర్, పత్తిపాక మోహన్, మౌనశ్రీ మల్లిక్, డప్పు రామస్వామి, కాంచనపల్లి, వేముగంటి మురళీకృష్ణ, వెలపాటి రామరెడ్డి, మండలస్వామి, పెరుమళ్ళ ఆనంద్, పగడాల నాగేందర్, మునాసు వెంకట్, కూకట్ల తిరుపతి, అన్నవరం దేవేందర్, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, గుడిపాటి, రూప్ కుమార్ డబ్బీకార్, నాళేశ్వరం శంకరం, కంశ్రీ, వేముల ఎల్లయ్య, వెల్దంది శ్రీధర్, వఝల శివకుమార్ తదితరులు.
భౌగోళికంగా, సాంస్కృతికంగా ప్రత్యేకమైన అస్తిత్వం గలిగిన తెలంగాణ ఒక రాష్ట్రంగా భౌతికంగా ఏర్పడడం ఇక్కడ ప్రజలందరికీ పండగ రోజు. ఒక ప్రజాస్వామిక వాతావరణం ఇక్కడ పరిఢవిల్లడం కోసం కవుల ఆలోచనల అవసరం ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది.
- డా||ఏనుగు నరసింహారెడ్డి
8978869183
ఉపకరించిన గ్రంథాలు
- నిప్పుల వాగు – సం. అందెశ్రీ – వాక్కులమ్మ ప్రచురణ
- ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కవిత్వం- డా. వెల్దండి శ్రీధర్ – తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురణ
- జనని, తెలంగాణ ఉద్యమ కవితా సంకలనం – సం. రుద్రశ్రీ వెన్నెల – తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురణ
- తెలుగు హిందీ జాతీయోద్యమ గీతాలు-డా. ఏనుగు నరసింహరెడ్డి -నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్, హైద్రాబాద్
- ప్రత్యూష – వివిధ రచయితలు – తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురణ
- పరంపర – సం. నందిని సిధారెడ్డి – తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురణ