Home అనువాద సాహిత్యం ఎలుకల  బోను

ఎలుకల  బోను

by Padmavathi Neelam Raju

మూలం: The Rattrap
AUTHOR: Selma Lagerlof
స్వేచ్చాను వాదం: పద్మావతి నీలంరాజు

……………………….  

నేను నా కధ నే చెప్పుకోవాడానికి మీ ముందుకొచ్చాను. నా కేమి పేరు లేదు. ఇల్లు లేదు. నేనొక తిరుగుబోతుని. మరోలా అర్ధం చేసుకోకండి. నా పొట్టను నింపుకోవడం కోసం ఊరూరూ తిరిగే ఒక బిచ్చగాడిని. నాకీ సమాజంలో ఏ  విలువలేదు. నేను నేనే. స్విట్జార్లాండ్ లోని గనుల ప్రాంతాలలో తిరుగుతుంటాను. అడుక్కొన్నప్పుడు వచ్చిన డబ్బులతో ఎలుకల బోనులు కొన్నింటిని కొని అమ్ముతుంటాను. అలా అని నేనేమి వ్యాపారవేత్తని కాదు. ఎలుకల బోనులను అమ్ముకోవడం నా కున్న గుర్తింపు. ఆ నెపంతో ఊళ్ళు తిరుగుతూ ఉంటాను. కొన్ని సార్లు చిల్లర దొంగతనాలు కూడా చేస్తుంటాను. నన్ను చూసిన వాళ్ళెవ్వరు ఒక్క నిముషం కూడా వాళ్ళ ముందు నిలుచోనివ్వరూ. నన్ను చూస్తూనే చీదరించుకుంటారు. వారి వాకిట్లోనుండి తరిమేస్తుంటారు. ఒక్కో రోజు నాకు వీధి కొళాయి నీళ్ళే  గతి. అంత చలిలోనూ రోడ్డు పక్కనే నా మకాం.  అందుకే నన్ను నేను ఒక బిచ్చగాడిలాగా,చిల్లర దొంగ లాగ, ఎలుకల బోను లను అమ్ముతూ తిరిగే వాడి లాగ పరిచయం చేసుకున్నాను.  
 కానీ, నా గురించి ఒక నిజం మీకు చెప్పాలి. నా జీవితం నాకెన్నో పాఠాలు నేర్పుతుంది. కానీ వాటన్నిటికంటే ఎత్తున పెట్ట గలిగే ఒక “సత్యం”నా జీవితాన్నే మార్చేసింది. నేనంత చదువుకొన్న మేధావిని కాదు. నా ఈ ఎలుకల బోనులే నాకేదో  జీవిత సత్యాన్ని చెపుతున్నట్లనిపిస్తుంది.   వాటిని చూస్తుంటే ఒక విచిత్రమయిన భావన నా మదిలోమెదులుతుంటుంది.  ఈ ప్రపంచం ఒక పెద్ద ఎలకలబోనని. ఈ మడుసులంతా  ఎలుక ల్లాటి వారనీ. ఇందులో ఎలుకని  బట్టి ఎర ఈ బోనులో పెట్ట బడుతుంది. ఆ ఎర కోసం ఆశపడి  లోపలకు పోయిన ఎలుక  అక్కడే శాశ్వతంగ బందీ అయిపోతుంది. ఈ మడుసులు అంతే! ఎదో ఆశ.ఆకర్షణ . ఇలాటివేవీ  లేని నాలాటివాడికి  కూడు, గుడ్డ అనే ఆశను చూపెడుతుంది; అన్ని ఉన్న వాడికి అందం, ఆనందం,సుఖం ఐశ్వర్యం లాంటి ఆశలను రేకెత్తిస్తూ ఆకర్షిస్తుంటుంది ఈ పెపంచకం తన లోకి. పిచ్చి మనిసి!  తనెలాంటి బోనులోకి దూరుతున్నాడో తెలుసుకోలేడు. లోలోపలికి పోతూనే ఉంటాడు. అక్కడే ఇర్రుక్కు పోతాడు. బయటికి రావాలన్న ఆలోచనే కలగదు. ఆ ఆశల మాయ నుండి బయటకు రావాలనే ప్రయత్నం కూడా చేయడు. ఇదే జీవన సత్యం. నేను కూడా కూడు గుడ్డ కోసం వెతుకుతూ  ఈ బోనులోనే  తిరిగాడు తుంటాను ఒక ఎలక పిల్ల లాగ!

                                  ***********************

ఆ రోజు  సాయంత్రం అయిపొయింది. చాలా చల్లటి వాతావరణం. తిరిగి తిరిగి అలిసి పోయిన నేను ఒక మైనింగ్ గ్రామ శివార్లలోకి చేరుకున్నాను. ఆ ఊళ్లోని వాళ్లెవరు నాకు ఒక్క బ్రెడ్ ముక్క వేయలేదు. రాత్రి అవుతున్నది. చలి బాగా పెరిగింది. చివరి ప్రయత్నంగ ఆ గ్రామ శివారులో ఉన్న ఒక పెంకుటి పంచముందు నిలుచున్నాను. ధైర్యం చేసి తలుపు తట్టాను. ఒక పెద్దాయన తలుపు తెరిచాడు.
“ఎవరు?”
“అయ్యా ! నేనెవరయితే ఏముంది. ఈ రాత్రికి మీ పంచన నాకు తల దాచుకోవడానికి అనుమతిస్తారా?”ఎంతో వినయంగా అడిగాను.
“అయ్యో ! అదెంత భాగ్యం!లోపలకి రండి.”అంటూ ఎంతో ఆప్యాయంగా నన్ను లోపలకు ఆహ్వానించాడు.
ఈ సారి ఆశ్చర్యపోవడం నావంతయింది. ఎందుకంటే నన్నందరూ చీదరించుకొని తరిమేసే వాళ్లే.
“ధన్యవాదములు,”అంటూ లోపలకి ప్రవేశించాను. ఆ ఇంటికి ఒక ప్రవేశ ద్వారము , వెనక గోడకు ఊచలు లేని కిటికీ  ఉన్నాయి. మొత్తమంతా ఒకటే గది. ఒక పక్క వంట సామగ్రి తో పాటు ఒక పొయ్యి మండుతూ ఆ గది ని వెచ్చగా  ఉంచుతున్నది.
“చాలా  చలిలో వచ్చినట్లున్నారు,”అంటూ నాకు ఎంతో సాదరంగ బ్రెడ్ సూపు ఇచ్చాడు తాగడానికి.  నాకింకా నమ్మకం కలగడం లేదు. నన్నిలా ఆదరించే మనిసి ఈయనేనా అని.
“భగవంతుడా! నువ్వున్నావు. ఇంకా మానవత్వం,” అని నాలో నేనే అనుకొన్నాను.
 “చూడండి! మీ పేరేమిటో నాకు తెలియదు. మీరెవరో ఎక్కడనించి వచ్చారో నాకు తెలియదు. అయినా  ఈ ఒంటరి బతుకులో , ఈ నిడి  రాత్రి లో నాకోసం ఆ ప్రభువు పంపిన అతిధిగ భావిస్తున్నాను. నాకు కూడు గుడ్డకి   లోటు లేదు. నేనొక ఇనుప కర్మాగారంలో పని చేశాను. పెద్దవాడనవటం చేత పనిచేయలేక మానేసాను. ఆ వచ్చిన డబ్బుతో ఒక ఆవు ను కొనుక్కున్నాను. ఆ  ఆవే  నన్ను పోషిస్తుంది. నాకు ఖర్చులకు పొగా  మిగిలిన కొద్దీ నార్లను (knorr- swiss currency) ఇలా ఈ తోలు సంచీలో భద్ర పరుచుకుంటాను.” అని నాకా తోలు సంచీని తెరిచి అందులో నలిగి ఉన్న ముప్పయి నార్ల (swiss knorrs)  విలువ చేసే మూడు నోట్లను చూపించి ఆ తోలు సంచీని తిరిగి ఆ గోడ కున్న మేకుకే తగిలించాడు.
నాతో కాసేపు మజోలి  (swiss cards game)  కూడా ఆడాడు. నాకు  ఒక పొగాకు చుట్టను కూడా ఇచ్చాడు తాగడానికి. ఆ రాత్రి అంతా  అతను నాకు చాలా  కబుర్లు తన గురించి చెప్పాడు. నేను మగతగా వింటూనే ఉన్నాను.
“చూడు! తెల్లవారుఝామున నేను ఆవు పాలు పితికి అమ్ముకోవడానికి వెళతాను. నువ్వు పడుకో. ఎప్పుడు లేవాలనిపిస్తే అప్పుడే లేవచ్చు. ఎప్పుడు వెళ్లాలనిపిస్తే అప్పుడే వెళ్ళవచ్చు, సరేనా!  కానీ వెళ్లేముందు ఈ  తలుపువేసి  గొళ్ళెం తగిలించి వెళ్ళు.”అని చెప్పి  ఆ పెద్దాయన కూడా నిద్దర పోయాడు.
 ఆయన ఎప్పుడు లేచాడో తెలియదు కానీ నేను లేచేసరికి మాత్రం  లేడు. నేను లేచి నా  కాళ్ళు చేతులు సాగతీసుకొని బయటకు వచ్చి తలుపుకు  గొళ్ళెం పెట్టి, కొంత దూరం నడిచాను. నా మనస్సంతా   ఆ ముప్పయి నార్ల వైపే లాగుతున్నది. “ఆ ముసలాడు లేడు  కదా! నేనే తీశానని ఎవరికీ తెలుస్తుంది!” అనుకొంటూ ఆ ఇంటివైపుకి మళ్లాను. ఈ సారి మాత్రం నేను తలుపు తీసుకొని లోపలకు వెళ్ళలేదు. వెనకవైపున్న కిటికీ గుండా ఇంట్లోకి ప్రవేశించాను దొంగలాగా. ఆ ముప్పయి నార్లను తీసుకొని అలాగే బయటికి వచ్చి వేగంగా నడక సాగించాను.
అప్పుడప్పుడే సూర్యోదయం అవుతున్నది. నా మనసంతా ఆలోచనలతో నిండిపోయింది. ఆ ముసలాయన ఇల్లు చేరుకొని తన రొఖం పోయిన విషయం తెలుసుకోనుంటాడు. అంతేకాదు వెంటనే పోలీసులకి కూడా చెప్పుంటాడు. అందుకే నేను ఇలా రహదారి లో ప్రయాణించ కూడదు.” అనుకొంటూ పక్కనున్న చిన్న  దట్టమయిన అడవి మార్గం లోకి ప్రవేశించాను. అక్కడే అసలు కధ  మొదలయింది.

 ********************  

సాయంత్రం వరకు ఇంకో పల్లె కు చేరే దారి కోసం వెతుకుతూనే ఉన్నాను. ఎంత తిరిగిన అదే చోటుకి చేరుతున్నాను. కానీ ఆ అడవి నుండి బయట పడే మార్గం మాత్రం నాకు కనిపించలేదు. తిరుగుతూనే ఉన్నాను అక్కడే బోనులో పడ్డ ఎలకలాగ. సాయంత్రమై పోయింది దట్టమయిన మంచు. చలి కోరికేస్తున్నది.
 చీకట్లు కమ్ముకొస్తున్నాయి. అలసి పోయి ఒక చెట్టునానుకొని కూలబడ్డాను. నా స్థితి చూసి నాకే జాలనిపించింది. ఈ సారి నేనే  ఆ ముప్పయి నార్ల కోసం బోనులో ఇరుక్కు పోయిన భావన కలిగింది.
అలా నా  పక్కనే ఉన్న ఎలుకల బోనులను చూస్తుంటే, ఇప్పుడు ఇలా బందీ గాఉండటం నా వంతే నెమో అని కూడా అనిపించింది. అలా ఆలోచిస్తూ చుట్టూ పరికించి చూసాను. చాలా దూరము నుండి ఒక మినుకు మినుకు మంటున్న దీపపు కాంతి కనిపించింది. కొద్దిసేపటికి సుత్తి తో ఇనుప ముక్కను కొడుతున్న శబ్దం కూడా వినిపించింది.  మళ్లి  ఆశరేకెత్తింది. అటువైపుగా  ఆ చిరుచీకట్లలోనే నడక సాగించాను. అక్కడక్కడా కాళ్ళకు రాళ్లు  కొట్టుకున్నాయి. ముళ్లకంపలు తగిలి చేతులు గీరుకు పోయాయి. అయినా ఆ దీపం వైపే ఆశగా ఒక దీపపు పురుగులాగా  దూసుకువెళ్లాను. అది ఒక ఇనుప కర్మాగారం. నిప్పుల కొలిమి దగ్గర కూర్చొని ఒక కూలి కాల్చిన ఇనప ముక్కను  సుత్తి తో కొడుతూ  సాగతీస్తున్నాడు. అంతా  చీకటిగానే ఉన్నది. ఆ కొలిమి వెలుగు తప్ప.
“అయ్యా ! నేనొక బాటసారిని. ఈ రాత్రికి ఇక్కడే ఎక్కడయినా కూర్చుని సేద తీరటానికి అనుమతినిస్తారా?” అడిగాను. అతనేమీ మాట్లాడలేదు. కళ్ళతోనే ఒక మూల చూపించాడు. బాగా మసకగా ఉన్నది. అయినా అదే చాలన్నట్లు ఆ మూలకు వెళ్లి నా దగ్గరున్న చింకి రగ్గుని నిండా కప్పుకొని, నా ఎలుకల బోనులను ఒక పక్కనే పెట్టి, మొహం కూడా కప్పుకొని ముడుచుకొని ఆ మూల కూర్చున్నాను.  

                                                    *************  

కొద్దిసేపటికల్లా  ఎవరో వచ్చినట్లనిపించింది. ఆ వ్యక్తి కర్మాగరం మొత్తం చూసిన తరువాత కొలిమి దగ్గరకు వచ్చాడు. ఆ కూలి చాలా మర్యాదగా లేచి నుంచున్నాడు. ఆయన చేత్తోనే నీ పని నువ్వు చేసుకో అన్నట్లు  సైగ చేసి వెళ్ళబోయి నేను కూర్చున్నమూల వైపు చూస్తూ దగ్గరకొచ్చి పరికించి చూసాడు. అయన వెలుగువైపుకి ఉండడంతో నేను గుర్తుపట్టగలిగాను ఆయనని, ఆ కర్మాగారం యొక్క యజమాని రాంసజో(Ramsjo Iron Factory).
“ఎవరు మీరు? ఇక్కడెందుకు కూర్చున్నారు?”
 నాకు భయమేసింది. నేను మాట్లాడితే లేక వెలుగులోకి వస్తే నన్నొక బిచ్చగాడినని గుర్తు పడతాడేమో, అప్పుడు నన్ను అక్కడి నుంచి కూడా తరిమేయొచ్చు. అందుకనే నేను చీకటి వైపే మరింతగా ఒరిగి పోతు మౌనంగా ఉన్నాను.
“మీరు!మీరు!”అంటూ ఎదో గుర్తు చేసుకుంటున్నట్లు చూసి, “మీరా! కెప్టెన్ వన్ స్టాహాలే! ఎన్నాళ్లకు నేను మీకు గుర్తొచ్చాను. నన్ను వెతుకుంటూ ఇంత దూరం వచ్చారా!” అంటూ సంతోషం  ఆశ్చర్యం ముప్పిరిగొనగా, “ఇంత కాలం  ఏమైపోయారు? ఇప్పటికైనా వచ్చారు. అదే సంతోషం! ఇంటికి వెళదాం రండి. చాల మంచి రోజున వచ్చారు. ఈ రోజు క్రిస్టమస్. మనం కలిసి జరుపుకుందాము”   అంటూ ఎంతో ఆనందంతో ఆప్యాయంగా తన ఆప్తమిత్రుడిని కలుసుకున్న ఆనందంతో పిలిచాడు.
నాకు మళ్ళి  భయమేసింది. ఈ మసక చీకటిలో ఆయన నన్ను సరిగా గుర్తించలేదనుకుంటా. నన్నే తన ఆప్త మిత్రుడనుకుంటున్నాడు. ఇది ఒకందుకు మంచిదేలే. నేనేమి మాట్లాడక పోతే, నా గురించి తెలుసుకొనే అవకాశమే ఉండదు. ఎదో లాలచి నన్ను ఆవహించింది. జాలితో అయన నాకు ఇక్కడ ఉండడానికి అనుమతి నివ్వొచ్చు, అలాగే మరో రేండు నార్లు కూడా ఇవ్వచ్చు అన్న ఆశతో మళ్ళి  మౌనంగా ఉండిపోయాను. అయన ఏమనుకున్నాడో ఏమొ  కొద్దీ సేపు నన్ను బతిమాలి నేను రానేమొ  నని అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

********************

రాంసజో, ఇనుప కర్మాగారం యజమాని, ఇల్లు చేరుకున్నాడు. “ఎడ్ల!ఎడ్ల !”అని ఆనందంతో తన కూతురిని పిలిచాడు. ఎడ్ల విలమన్ సన్   రాంసజో యొక్క ఏకైక  కూతురు. భర్తను పోగొట్టుకొని చాలా కాలంనుంచే ఆమె తండ్రి దగ్గరే ఉంటున్నది.
“నాన్న గారు! ఏంటి అంత  సంతొషంగా కనిపిస్తున్నారు. రేపు క్రిస్టమస్ అనా? లేక ఏదైనా విశేషం జరిగిందా మన కర్మాగారంలో?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.
“నీకు తెలుసా ,ఎడ్ల? నువ్వు చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడు నేను స్విస్ సైన్యం లో పని చేశాను. అక్కడ నాకొక మిత్రుడు ఉండేవాడు. చాలా మంచి మనిషి.  ఎదో అవినీతి ఆరోపణలతో అతను పదవి పోగొట్టుకున్నాడు. అంతేకాదు కొంత కాలం అతన్ని  జైల్లో కూడా ఉంచారని వినికిడి. ఎప్పుడు విడుదల అయ్యాడో, ఎక్కడికెళ్ళి పోయాడో ఎవరికీ తెలియదు. నేను కొంత కాలం తరువాత సైన్యం వదిలేసి కర్మాగారం పెట్టుకొని ఇక్కడకు వచ్చేసాను”అని ఊపిరి సలుపుకోకుండా చెప్పాడు.
“ఓహో ! నాన్నగారు! మీరు ఈ  విషయం ఇది వరకు కూడా చాలా సార్లు చెప్పారు. ఇప్పుడేం జరిగిందో చెప్పండి?”అంటూ ఎదురు ప్రశ్న వేసింది ఎడ్ల.
“అదే చెపుతున్న! ఆ కెప్టెన్ మిత్రుడు మన కర్మాగారం లో ఒక మూలాన కూర్చొని కనిపించాడు.
 “అవునా!”  ఆశ్చర్యపోయింది ఎడ్ల.
“నేను రమ్మని ఆహ్వానించాను. రేపు క్రిస్టమస్  కదా ! అతను మన అతిధిగా వస్తే ఎంత బాగుండేది! కానీ బాగా బతికి చెడ్డ మనిషి. అందుకే నాతో రావటానికి సందేహించాడు ”అంటూ వాపోయాడు రాంసజో.
“అయ్యో! మీరంతగా బాధ పడకండి. నేను వెళ్లి అతన్ని మన ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను.” అంటూ ఎడ్ల విలమన్ సన్ గుర్రపు బగ్గీ లో కర్మాగారంకు వెళ్ళింది. ఆమెను చూస్తూనే కూలి చాల సగౌరవంగా నిలుచున్నాడు. ఆమె అతన్ని గమనించకుండానే మూలన కూర్చుని ఉన్న నా దగ్గరకి వచ్చింది.
“నమస్తే! ఈ రోజు రాత్రి నుండి క్రిస్టమస్ వేడుకలు మొదలవుతాయి. మీరు అతిధిగా మా ఇంటికి రావాలి. మా నాన్న గారు చాలా సంతోషిస్తారు.ఏమంటారు?” అంటూ ఎంతో ఆదరం తో పలికింది.
ఆ మసక వెలుతురులో ఎడ్ల ఒక దేవదూత లాగా కనిపిస్తున్నది. తెల్లటి గౌను పైన ఎర్రటి యాక్ ఊలు తో చేసిన కోటు వేసుకొని చాల అందంగ,చాలా హుందాగా కనిపించింది.
అయినా నాకు నా గురించి ఆమెకు చెప్పాలనిపించలేదు. ఎందుకంటే నేను కేవలం ఎలుకల బోనులను అమ్ముకుంటూ తిరిగే ఒక బిచ్చగాడినని తెలిస్తే ఆమె నన్ను ఇక్కడ ఉండనీయదు. అలా కాకపోతే, తన తండ్రి గారి మిత్రుడిగా భావించి నాకు ఒకటో రెండో నార్లను కూడా ఆ ప్రభువు పేరిట దానం చేయొచ్చు. అందుకని నేను నా గురించి చెప్పక పోవటమే మేలు అనుకొని మౌనంగా ఉండిపోయాను.
 అతను ఏమి మాట్లాడకపోవడంతో ఎడ్ల అనుకుంది మనసులో,”ఇతను చాలా భయం లో ఉన్నాడు. ఒకవేళ ఏ దొంగతనం చేయలేదు కదా? లేక పోలీసులకు చెబుతామని భయపడుతున్నాడా?”
ఇలా ఆలోచిస్తూ “చూడండి! మీరు దేనికి భయపడవలసిన పనిలేదు. ఈ ఒక్క రోజుకే మీరు మా అతిధి గ ఉండొచ్చు. విశ్రాంతి తీసుకొని తెల్లవారగానే  మీరు వెళ్లిపోవచ్చు. మిమ్మల్ని ఎవరు నిరోధించరు. మీకే ఇబ్బంది  కలగకుండా చూసుకునే బాధ్యత నాది” అన్నది.  
నాకామె  మాటల్లో  స్వచ్ఛత కనిపించింది. మళ్ళి  ఎదో ఆశ. ఆమె పైన నమ్మకముంచి ఆమె వెనకాతలే వాళ్ళ ఇంటికి వెళ్ళాను.
 కర్మాగారం  యజమాని ఎదురొచ్చి నన్నెంతో ఆప్యాయతతో ఇంట్లోకి ఆహ్వానించాడు. పనివాడిని పిలిచి, “ఈయనకి గడ్డం చేసి, తల జుట్టు ని కూడా సరిగా కత్తిరించి, తలారా స్నానం చేయించమని చెప్పాడు.”
 ఎడ్ల తన తండ్రి గారి ఒక మంచి బట్టల జత నాకివ్వమని కూడా పనివాడి కిచ్చింది. తెల్లటి పొడవాటి అంగి, కింద ఊలు ప్యాంటు పైన ఫర్ కోటు వేసుకున్నాను. జుట్టు కత్తిరించి, గడ్డం తీసేయడం తో నన్ను నేనే పోల్చుకోలేక పోయాను. అలా నేను నా నిజ రూపంలో రాంసజో ముందుకి వెళ్ళాను.
ఆయన అవాక్కయిపోయాడు. మొహం కోపంతో ఎర్రబడింది. “నువ్వు నా కాప్టెన్ మిత్రుడివి మాత్రం కాదు. నువ్వెవరో చెప్పు! లేదా!నేనిప్పుడే నిన్ను పోలీసులకి అప్పగిస్తాను. నిజంచెప్పు. నువ్వెవరో నాకు ముందే చెప్పాలిగదా ! మా ఇల్లు చేరటానికి ఇంత నాటకం ఆడతావా.” అంటూ ఆవేశంతో ఊగిపోయాడు.
ఎడ్ల వారిస్తున్నా వినకుండా,”తక్షణం ఇక్కడనుంచి వెళ్ళిపో “అని ఆదేశించాడు.
“అయ్యా! మీరెంత అమాయకులు. జీవిత సత్యం తెలుసుకోలేక నా మీద అభాండాలు వేస్తున్నారు. నిజం చెప్పాలంటే! నేను మంచి భోజనం, మంచి పడక దొరుకుతాయన్న ఆశలో చిక్కుకొని, మీ అమ్మాయి గారు పిలవగానే వచ్చాను. ఎలక లాగా మీ ఈ బోనులో చిక్కుకున్నాను. మీకు నా మీద కోపం రావడం సహజం. కానీ నేను నా గురించి చెప్పకపోవడానికి కారణం మీరు చూపిన ఎర. మంచి భోజనం కోసం, ఒక్క రాత్రయినా పడుకోవటానికి చోటు కోసం వెదికే నాకు, మీ అమ్మాయి గారి ఆహ్వానం నన్నీఉచ్చు లోకి లాగింది. ఎందుకంటే నేను చాలా అల్పుడిని! మీలాంటి గొప్పోళ్ళకు గొప్పగొప్ప ఆశలు ఆకర్షణలు వేచి ఉంటాయి. నాలాగే మిమ్మల్ని కూడా ఎదో ఒక రోజు ఈ ఉచ్చులోకి లాగుతాయి. నాకి ప్రపంచం అనే బోను వేసే ఎర కేవలం కూడు గుడ్డ మాత్రమే. మీకు అంత కంటే పెద్ద పెద్ద ఎరలను వేస్తుందీ ప్రపంచం,  మిమ్మల్ని కూడా ఈ బోనులోకి లాగటానికి. ఎందుకంటే మీరయినా నేనయినా ఈ ఎలుక లాంటి వాళ్ళమే. ఇలా  ఆశలతో ఈ ప్రపంచమనే బోనులో చిక్కుకు పోయి బతుకుతాము. మనకేదారి కనిపించదు.”అంటూ ఎంతో సంస్కారంగా మాట్లాడాడు. అతని మాటల్లోని సత్యం ఎడ్ల ను ఎంతో ఆకర్షించింది.
“నేను వెళ్ళిపోతాను. నన్ను క్షమించండి. దయతో మీరు రమ్మంటే వచ్చాను. కానీ మిమ్మల్ని మోసగించాలన్న ఆలోచన మాత్రం ఈ అల్పుడిలో లేదు,” అంటూ  నేను వెళ్ళడానికి సిద్ధమయ్యాను నా ఎలుకల బోనులతో సహా.
ఎడ్ల కల్పించుకొని “మీరు మాకు అతిధి. మేము పిలిస్తేనే మీరు వచ్చారు. అందుకని  నాకు మా నాన్నగారితో మాట్లాడేందుకు కొంచం సమయం ఇవ్వండి. అప్పుడు కూడా మీకే వేళ్లాలనిపిస్తే నిరభ్యంతరంగా మీరు వెళ్లి పోవచ్చు.” అంటూ తండ్రి వైపు చూసి, “నాన్న గారు! ఈయన నిజం చెప్పలేదన్న మాటేగాని, అబద్దం కూడా చెప్పలేదు. మనమే ఆయన్ని మీ మిత్రుడిగా భావించి ఈ క్రిస్టమస్ పర్వదినం నాడు ఆహ్వానించాము. మనం నిజమయిన క్రిస్టమస్ పండుగ జరుపుకోవాలంటే ఆ ప్రభువు ఆదేశం పాటించి అన్న్నార్తులకు పట్టెడన్నం  పెట్టాలి. ఈతని రూపం లో ప్రభువు మనకొక అవకాశం ఇచ్చాడు. మనం దానిని సద్వినియోగం చేసుకుందాం.” అంటూ ఎడ్ల నన్ను,ఈ బిచ్చగాడిని, భోజనాల గది  వైపు తీసుకెళ్లింది. కూతురి యొక్క  స్వభావం తెలిసిన రాంసజో మారు మాట్లాడలేదు.
మంచి భోజనం పెట్టిన తరువాత నాకు ఆమె ఒక అతిదులుండే గదిలో పడక ఏర్పాటు చేయించి, “మీరు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి.” అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది.
రాత్రి పన్నెడు గంటలకు నాకు మేలుకు వచ్చింది. చర్చి లోని గంటలు మోగుతున్నాయి ఎక్కడ నుంచో “హల్లేలూయ హల్లేలూయ,హల్లేలూయ,”అన్న కీర్తన చాలా  లయబద్దంగ వినిపిస్తున్నది. ఆ గది నుండి బయటకు వచ్చి పరికించి చూసాను.
పెద్ద హాలు లాగ ఉన్నది. ఒక మూలన చాలా అందంగా క్రిస్మస్ చెట్టు అలంకరించబడి ఉన్నది. ఆ చెట్టు కింద ఎంతో ఖరీదయిన బహుమతులు పెట్టి  ఉన్నాయి. పక్కనే INRI ప్రభువు శిలువ , ప్రభువు చిత్రపటం ఉన్నాయి. ఆ ప్రదేశమంత కొవొత్తుల  కాంతిలో ఎంతో అందంగా ప్రశాంతంగ కనిపించింది. నేను అక్కడ కూర్చోని  ప్రభువు ని కీర్తించాను. ఆయన దయ అపారం. ఆ తరువాత ఇల్లు విడిచి అక్కడి నుండి వెళ్లి పోయాను ఆ నిడి రాత్రిలో వెలుగును వెతుక్కుంటూ.

                                          *****************

ఎడ్ల ,రాంసజో ఇద్దరు, ఆ బిచ్చగాడు నిద్రించగానే చర్చికి బయలు దేరి వెళ్లారు. ప్రార్థనలలో పాల్గొన్నారు. ప్రార్ధనలు ముగిసిన తరువాత అనుకోని విధంగా వాళ్ళ కర్మాగారం లోనే పని చేసిన ఆ పెద్దాయన వారిని కలిసాడు. క్షెమ సమాచార కబుర్లు అయినా తరువాత, ఆయన, ”అయ్యా! నిన్న రాత్రి మా ఇంటికి ఒక ఎలుకల బోనులను అమ్ముకొనే మనిషి ఆశ్రయమివ్వమని సాయంకాలం వేళ  మా ఇంటి తలుపు తట్టాడు. ఒంటరివాడిని కదా! అందుకని ఆ ఒక్క రాత్రయినా నా తోటి మరో మనిషి ఉంటాడన్న ఆశతో ఆ బిచ్చగాడిని ఎంతో ఆదరించాను.”
“ప్రభువు పేరిట మంచి పనే కదా చేసావు” అంది ఎడ్ల.
“అలా కాలేదు తల్లి! ఆ దొంగ వెధవ నేను దాచుకొన్న 30 నార్ల రోఖం పట్టుకు పోయాడు.అతన్ని నేనెంతో  విశ్వసించాను,”అంటూ గద్గద స్వరంతో చెప్పాడు.
“అయ్యో! ఎంత పనైయింది.”అంటూ ఎడ్ల జాలి చూపించింది.
“నేను చెబుతూనే ఉన్నాను. వాడు నిజంగానే దొంగ. ఈ రోజు మన దగ్గరున్న విలువయినవన్నీ  బయటనే ఉంచాము. అతన్ని ఇంట్లో ఒంటరిగా వొదిలేసి వచ్చాము. దొంగకి ఇంటి తాళాలు ఇచ్చినట్లయింది,” అంటూ “పద పద మన ఇంట్లో ఏమి దోచుకొని పోయాడో”  అంటూ ఎడ్ల చేయి పట్టుకొని బగ్గీ వైపుకి లాక్కు పోయాడు రాంసజో.
బగ్గీ ఇల్లు చేరగానే కాపలాదారుణ్ని పిలిచి ,”ఎరా! మన అతిధి వెళ్ళిపోయాడా?” అని వెటకారంగా అడిగాడు.
“యజమాని! ఆయన చర్చి గంటలు మోగిన పది నిముషాలకల్లా వెళ్ళిపోయాడు.
“అవునా ! ఎం పట్టుకెళ్ళాడేంటి?”
“చేతిలో ఒక పాత  గొంగళి, ఎలకల బోనులు. మీరిచిన్న బట్టలతోనే ఆయన వెళ్ళిపోయాడు.
“అయినా సరే! ఎడ్ల! త్వరగా పద ఇంట్లో చూడాలి ఏమి పోయాయో!”అంటూ హడావిడిగా ఇంట్లోకి పరుగుతీసాడు ఆయన.
కాపలాదారుడు వెనకనే వస్తున్నా ఎడ్ల కు ఒక చిన్న ప్యాకెట్, ఒక ఉత్తరం ఇచ్చి,”ఆ అతిధి ఇవి మీకు ఇమ్మని చెప్పి వెళ్ళాడు మేడం,” అని చెప్పాడు.
ఎడ్ల అది తీసుకొని ఇంట్లోకి నడిచింది. ఇల్లంతా అలాగే ఉన్నది. కొవొత్తుల వెలుగులో క్రిస్టమస్ చెట్టు దేదీప్యమానంగా వెలిగిపోతున్నది. ఆమె సంతృప్తి గ తన గదిలోకి వెళ్లి ఆ అతిధి ఇచ్చిన ఉత్తరం తెరిచింది.
 “ప్రియా మైన మీకు ఒక బిచ్చగాడు వినయంగా రాసుకుంటున్న ఉత్తరం. మీ దయార్ధహృదయం   నన్నెంతో ఆలోచింప చేసింది. బతికినంత కాలం ఒక బిచ్చగాడి లాగానో, లేక ఒక చిరు దొంగ గానో బతకవలసిన నన్ను, నా  స్థితి ని మార్చేసింది. మీరు నా మీద చూపిన విశ్వాసం, ప్రభువుపేరిట చూపిన దయ నాకు మార్గ నిర్దేశం చేసాయి. ఈనాటి  నుండి నేను మీరు ఆతిధ్యమిచ్చిన ఒక మంచి వ్యక్తిగా జీవించటానికి ప్రయత్నిస్తాను. ఇది నేను ఆ ప్రభువు పేరిట మీ దయార్ద్ర హృదయానికి ఇస్తున్న మాట. నాయీ చిన్న బహుమతిని స్వీకరించండి. ఆ ముప్పయి నార్లలను ఆ పెద్దయన వద్దకు చేర్చండి.

కృతజ్ఞతతో
మీ
వాన్ స్టాహలే”

ఎడ్ల అతను ఇచ్చిన మరొక చిన్న ప్యాకెట్టును కూడా తెరిచింది. అందులో నలిగిపోయి ఉన్న మూడు స్విస్ నోట్లు కనిపించాయి. వాటితో పాటు ఒక చిన్న ఎలుకల బోను కూడా పెట్టి ఉంది.
“ఒక బికారి మారిపోయి ఈ ప్రపంచపు  బంధాలనుండి విముక్తుడై స్వేచ్చా జీవితాన్ని గడపబోతున్నాడు” అని మనసులోనే  ఆ ప్రభువుకు వందనాలు సమర్పించింది ఎడ్ల.                    

You may also like

Leave a Comment