హరికిన్ పట్టపు దేవి, పున్నెముల ప్రోవర్థంబు పెన్నిక్క చం
దురు తోబుట్టువు భారతీ గిరిసుతల్ దోనాడు పూబోడి తా
మరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భా
సురతన్ లేములువాపు తల్లి సిరి యిచ్చున్ నిత్యకళ్యాణముల్! (భాగవత అవతారికలోని పద్యం)
ఒక వ్యక్తి జీవితం సంపూర్ణం కావాలి అంటే… సంస్కారంతో కూడిన చదువు, వివేకంతో, విచక్షణతో కూడిన ఆచరణ కావాలి, మూలాలను అవగాహన చేసుకోగలిగిన బుద్ధి కుశలత కావాలి. దానినే విద్య అందాము. అలాగే సకల సౌకర్యాలతో కూడిన సమగ్రమైన సంపద కావాలి దానినే అభ్యుదయము అందాము. దానికి తోడుగా సౌభాగ్యం కావాలి.. అంటే ఉన్న దానిని సంతృప్తిగా తాను అనుభవించగలిగి, ఇతరులకు పెట్ట గలిగిన శారీరక మానసిక ఆరోగ్యంతో కూడిన త్యాగ నిరతి కావాలి. దానినే సుభగత్వం అందాము. వీటి నన్నింటినీ అనుగ్రహించేది ఏది? అంటే.. ఆ లలితా పరమేశ్వరియే. ఆమె అంశలే సరస్వతీ దేవి, లక్ష్మీదేవి పార్వతీదేవి. ఆ లక్ష్మీదేవిని స్తుతిస్తున్నాడు, పోతన గారీ పద్యంలో. విద్యలకు సరస్వతిగా, సంపదలకు లక్ష్మీదేవిగా, సౌభాగ్యానికి పార్వతిగా చెప్పారు.
హరి అంటే విష్ణుమూర్తికి పట్టపురాణి, పున్నెములకు ప్రోవు అంటే రాశి, అర్థములకు పెన్నిక్క (పెన్– గొప్పనైన, ఇక్క స్థానము) సిరిసంపదల పెన్నిధి, చందురునికి తోబుట్టువు, భారతీ మరియు గిరిసుతయైన పార్వతి.. వారితోన్, ఆడు, పూబోడి (పూవు వంటి శరీరం కలది), తామర పూలలో నివసించే ముద్దరాలు, జగముల్.. ముజ్జగాలు మన్నించి పూజించే శ్రీ హరి ఇల్లాలు, భాసురతన్.. ప్రకాశవంతమైన చూపులతో తన నారాధించే వారికి లేములు (దరిద్రాలు) తొలగించే తల్లి, సిరి .. లక్ష్మీదేవి నిత్య కళ్యాణములను మాకు అనుగ్రహించుగాక, అంటున్నారు పోతన గారు.
హరి అంటే విష్ణువు.. విష్ణువు అనగా వ్యాప్తిచెందినది.. ఏది వ్యాప్తి చెందుతుంది.. ప్రవహణశీలత ఉన్నదే వ్యాప్తి చెందుతుంది. ప్రవహణ శీలత కావాలి అంటే దానికి చంచలత్వం కావాలి. ఆ సంవ్యాప్త శక్తికి చైతన్యాన్ని ఇచ్చి, కర్తవ్యాన్ని పాలించేందుకు ప్రేరణ నిచ్చి నడిపించేది.. ఆ శక్తికి పట్టపు దేవి. కన్ను ఉన్నది అంటే ఆ ఉండడమే సరిపోదు.. దానికి చూచే శక్తి ఉండాలి. విష్ణువుకు వ్యాప్తమయ్యే శక్తి ఉన్నది కాకపోతే అది క్రియాశీలం కావాలి అంటే అవసరమైన క్రియాశీలక శక్తియే లక్ష్మీదేవి. ప్రకృతిలో రెండు విధాలైన శక్తులు ఉంటాయి.. పురుష శక్తి, స్త్రీ శక్తి. ఒకటి సృజనాత్మకమైనది.. దానినే పురుష శక్తి అంటాము.. రెండవది.. దానిని అనుమోదించేది, అంగీకరించేది. దానినే స్త్రీ శక్తి అంటాము. శ్రీహరి పురుష శక్తి కాగా లక్ష్మీదేవి స్త్రీ శక్తి. రెంటి కలయికతోనే కార్యావిష్కరణ జరుగుతుంది. ప్రతిభ ఎంత గొప్పదైనా దానికి పట్టం కడితేనే దాని ఉనికి సుస్థిరం అవుతుంది. అందుకే విష్ణువు ఎంత గొప్పవాడయినా ఆయన వెంట లక్ష్మీదేవి పట్టపు రాణిగా ఉన్నాప్పుడే ఆయన గొప్పదనం సాధికారికమౌతుంది…
పున్నెములు… భిన్నత్వంలో సామరస్యాన్ని చూడగలగడమే పున్నెము. భిన్నత్వంలో ఏకత్వం అంటారు కాని… ఏకత్వం కాదు కావలసింది సామరస్యత కావాలి. నిజానికి ఏకత్వం అనేది రాచరికానికి, అధికారానికి ప్రతీక కాగా సామరస్యత అనేది ప్రజాస్వామ్యానికి ప్రతీకగా చెప్పుకోవాలి. ఇలాంటి సమరస భావనలకు ప్రోవు.. అంటే సకల భావనల సమాఖ్యయే లేదా సమాహారమే అభ్యుదయము నిస్తుంది. ఆ అభ్యుదయానికి మరోపేరే.. లక్ష్మీదేవి. సమాజానికి ఉపకరించే కార్యాలను నిర్వహించడమే పున్నెము.
అర్థంపు పెన్నిక్క…. మానవ జీవితంలో అర్థ కామాల ప్రాబల్యాన్ని తక్కువ చేయలేము. మానవ స్వభావంలోని గుణదోషాలకు ఈ అర్థకామాలే మూల కారణాలు. అయితే ఈ అర్థకామాలు ధర్మబద్ధాలయితేనే వ్యక్తికి శ్రేయస్సు. అర్థకామాలను ధర్మబద్ధం చేసి సరైన మార్గంలో నడిపించే మహోన్నత గుణమే సమత.. పెన్నిక్క అనడంలో అర్థాన్ని తద్వారా లభించే కామాన్ని, అధికారాన్నీ కూడా సమతా మార్గంలో నడిపించేది అని భావించాలి. దానితో సదాలోచనలు, మనోనిగ్రహం, స్థిత ప్రజ్ఞత్వం అందివస్తాయి. ఆ స్థితప్రజ్ఞతనే “దమము” అనవచ్చునేమో.. దానికి మరోపేరే లేదా దానికి ఆవాస స్థానమే లక్ష్మీదేవి.
చందురు తోబుట్టువు.. చంద్రుడు మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాడు. “చంద్రమా మనసోజాతా” అంటుంది శ్రుతి. చంద్రునిలో ఉన్న మరియొక లక్షణం స్వయం ప్రకాశం లేకపోయినా పరోపకార పరాయణత ఆయన లక్షణం.. సూర్యుని నుండి వేడిని గ్రహించి.. అహ్లాదకరమైన వెన్నెలలను మానవులకు అందించడం చంద్ర లక్షణం… అలాగే లక్ష్మీదేవి కూడా జీవ కోటికి ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుగ్రహిస్తుంది. తోబుట్టువు అనడం వల్ల చందునిలో ఉన్న అన్ని లక్షణాలూ ఆమెలో ఉన్నాయని భావించాలి.
భారతీ గిరిసుతల్ దోనాడు… భారతి విద్యలకు అధిదేవత… గిరిసుత.. సౌభాగ్యానికి అధినాయకి. విద్య ఒక్కటే ఉంటే ఉపయోగం ఉండదు.. దానికి సౌభాగ్యం తోడుకావాలి. ఈ రెండు ఉన్నా ప్రయోజనం పరిమితమే దానికి సంపద తోడవ్వాలి. అందుకే వినయంతో కూడిన విద్యను, సౌభాగ్యాన్నీ తోడుగా ఉంచుకొని ప్రకాశించేది లక్ష్మీదేవి. అంటే ఎవరిలో నైతే సంస్కారవంతమైన విద్య, ప్రయోజనాత్మకమైన సౌభాగ్యం ఉంటుందో వారికి లక్ష్మీదేవి ప్రసన్నమౌతుంది.. లేదా అక్కడ సంపద నిలుస్తుంది. విద్య సౌభాగ్యం ఉన్న చోట ప్రశాంతత ఉంటుంది. ఎవరినీ యాచించే ఉద్దేశ్యం ఉండదు. ఆనందమే పరమావధిగా ఉంటారు. అదే విష్ణువుకు ఆవాస స్థానం. అందుకే లక్ష్మీదేవి సదా సార్వకాలాలలో వ్యగ్రత లేని విష్ణువు పాదాలను ఆశ్రయించి ఉంటుంది. అహంకారం ఉన్నచోట విద్య భాసించదు. అలాగే సౌభాగ్యమూ నిలవదు.
అంతేకాదు… మనం ఎవరితోనైతే అనునిత్యం కలసి ఉంటామో అలాంటి వారి ఆలోచనా పరిమితులలో బంధితులమై ఉంటాము. విద్య సౌభాగ్యం ఎక్కడైతే ప్రభావవంతంగా ప్రకాశవంతంగా ఉన్నాయో.. అక్కడ లక్ష్మీదేవి ఉంటుందనేది నిరూపితమైంది.. భారతీ గిరిసుతల్ దోనాడు పూబోడి, అనడం వల్ల.
తామరలందుండెడి ముద్దరాలు … తామరలు అందమైన పుష్పాలే కాక.. వాటిలో ప్రత్యేక లక్షణం ఉన్నది. ఇవి మట్టి నుండి పైకి లేచినా మట్టి మరకలు పడకుండా ఉంటాయి. కాబట్టి స్వఛ్చతకు చిహ్నాలుగా నిలుస్తాయి. అంతేకాదు అవి నీటిలోనే ఉన్నా తామర ఆకుల పై భాగం నీటితో తడకపోవడం విశేషం. మరొక విశేషం.. ఇవి “మంచి”నీటి చెరువులలోనే ఎక్కువగా దర్శనం ఇస్తాయి. కాడలు సున్నితంగా ఉంటాయి. అంటే వ్యక్తికి పరుల కష్టాలకు స్పందించగలిగిన సున్నితత్వం ఉండాలి. తామరలు మనిషిలోని ఒత్తిడిని తగ్గిస్తాయని చెపుతారు. తామర లందుండెడి … ఐహిక జీవితంలో మన చుట్టూ ఎన్ని మలినాలు చేరినా వాటి ప్రభావానికి లోనుకాకుండా.. ప్రలోభాలు ఎదురైనా వాటికి చిక్కకుండా వ్యక్తి జీవితాన్ని సాగించాలి అనేదే సందేశంగా.. తామరలందుండెడి ముద్దరాలు అనడం ద్వారా పోతనగారు అందిస్తున్నారు. హృదయాన్ని కూడా కమలంతోనే పోలుస్తారు. మూలాధారం నుండి ఆరంభమయిన ప్రస్థానం.. సహస్రారం చేరడంతో ముగుస్తుంది. ఆ సహస్రారమే సహస్ర దళములతో కూడిన పద్మముగా చెపుతారు, యోగులు.
జగముల్ మన్నించు యిల్లాలు… జగము అంటే లోకము, ప్రపంచము. ప్రపంచమే పాంచభూతాత్మకము.. దీనిని చూపేది లోకము అంటే చూపు. అనగా ప్రపంచము శాశ్వతము కాదు.. అశాశ్వతమైన దానిని పట్టించుకోకుండా శాశ్వతమైన దానిని ఆరాధించండి, ఉపాసించండి.. అంటూ ప్రబోధించే దార్శనికులైన ఋషుల చేత మన్నింప బడినది… యిల్లు గలది యిల్లాలు.. ఇల్లు అంటే ప్రపంచమే ఆమె యొక్క ఇల్లుగా గలిగినది. అంటే సకల జగత్తులోనూ వ్యాప్తిచెందినది.
భాసురతన్ లేములు వాపు తల్లి.. లేమి అనేది సంపద లేకపోవడం కాదు.. ఎదుగుదల నుండి సంతృప్తితో కూడిన బ్రహ్మానంద విభూతి వరకు జరిగే ప్రయాణంలో నిత్యమైన, సత్యమైన, శాశ్వతమైన ఆనందాన్ని పొందలేకపోవడమే లేమి. ఎన్ని సంపదలు ఉన్నా ఒక్క క్షణాన్ని కూడా కొనలేము. లభించిన దానిని సమర్ధవంతంగా, ప్రకాశవంతంగా, ప్రభావవంతంగా ఉపయోగించుకోగలగడమే బ్రహ్మానంద స్థితి. దానికి వ్యతిరేకమైనది లేమి.. ఆ లేమిని దూరం చేసి జనన మరణ చక్ర బంధనాల నుండి తప్పించే తల్లి లక్ష్మీదేవి.
సిరి యిచ్చున్ నిత్య కల్యాణముల్… కల్యాణము అంటే శుభము.. శోభనము.. కల్యాణము ఎప్పుడు కలుగుతుంది? పొందదగినది సంపూర్ణంగా పొందినప్పుడు కలిగేదే కల్యాణము. అది ఎప్పుడో ఒకసారి వచ్చేది కాకూడదు.. అనుక్షణం మనకు కావాలి. దానిని ఇవ్వగలిగిన లక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నాడు, పోతన గారు.
* * *
పుట్టం బుట్ట, శరంబునన్ మొలవ, నంభోయాన పాత్రంబునన్
నెట్టం గల్గను, గాళి గొల్వను, బురాణింపన్ దొరంకొంటి మీఁ
దెట్టే వెంట రచింతు తత్సరణి నీవీవమ్మ యో యమ్మ మేల్
పట్టున్ మానకు మమ్మ నమ్మితి జుమీ బ్రాహ్మీ దయాంభోనిధీ! (భాగవతము – పోతన)
“మత్పురాకృత శుభాధిక్యంబు దానెట్టిదో”.. నన్నయ తిక్కనాది కవులు ఈ భాగవతాన్ని ఇప్పటి వరకు తెలుగులో వ్రాయలేదు.. “దీనిం తెనింగించి నా జననంబున్ సఫలంబు సేనెద పునర్జన్మంబు లేకుండగన్” అనే విశ్వాసాన్ని ప్రకటించాడు, పోతన గారు. మరొక జన్మ లేకుండా ఉండేందుకు ఈ భాగవతాన్ని తెలుగులో వ్రాస్తాను.. అంటూ ఆరంభించారు పోతనగారు భాగవతాన్ని ఆంధ్రీకరించడం. ఆ ప్రక్రియలో భాగంగా సరస్వతీ దేవిని ప్రార్థిస్తూ చెప్పిన పద్యమే పై “పుట్టం బుట్ట” అన్న పద్యం..
నమ్రత, వినయ, విధేయతలను వ్యక్తీకరించే విధంగా చెప్పిన పద్యం ఇది. భాగవతాన్ని తెలిసి పలకడం తమ్మి చూలికి కాని శూలికి కాని సాధ్యం కాదని ఒకవైపు చెపుతూనే దానిని తెనిగించేందుకు సన్నద్ధమైన పోతన గారి ప్రజ్ఞాపాటవాలు ఆ సంకల్పంలోనే వ్యక్తమౌతున్నాయి. అయినా .. “ఎట్టే వెంట రచింతు తత్సరణి నీవీవమ్మ” అంటూ భారం ఆమెపైనే పెట్టడం ఆయనలోని సర్వ సమర్పణ భావాన్ని తెలుపుతుంది.
పుట్టలో పుట్ట లేదు.. అంటే పుట్టలో పుట్టిన వాల్మీకిని కాను.. వాల్మీకి తపస్సు చేస్తున్న సమయంలో ఆయన శరీరం అంతా పుట్టలు పెట్టిందట. దానిలో నుండి వెలికి వచ్చిన వాడు కాబట్టి అతను వాల్మీకిగా ప్రసిద్ధుడయ్యాడు. శరంబునన్ మొలవ.. రెల్లుగడ్డిలో జనించిన వాడు.. శరవణ భవుడు లేదా కుమారస్వామి. నేను కుమార స్వామిని కాదు.. అంభస్ అంటే నీరు.. నీటిపై చేసే ప్రయాణానికి అనువైన సాధనము (పాత్ర).. పడవలో సత్యవతికి పరాశరునికి జనించిన వాడు.. వ్యాసుడు.. ఆ వ్యాసుని నేను కాను.. కాళి గొల్వను.. కాళికా మాతను సేవించి ఆమె ప్రసాదంతో మహాకవి యైన వాడు.. కాళిదాసు.. నేనా కాళిదాసును కాను.. అయినా దొరంకొని (పూనుకొని) ఉంటిని.. ఉన్నాను… దేనికి? పురాణింపన్.. భాగవత పురాణాన్ని రచించేందుకు పూనుకొని ఉన్నాను. నిజానికి నాకా సామర్ధ్యం లేదు.. ఎవరికి ఉన్నది? వాల్మీకి, కుమారస్వామికి, వ్యాసునికి, కాళిదాసు లాంటి మాహాత్ములకు మాత్రమే ఉన్నది… అయినా నేనా పనిని సంకల్పించాను. ఎందుకని? నా జననము సఫలము చేసుకోవాలని.. సామర్ధ్యం లేదని తెలిసినా ఎందుకు ప్రయత్నిస్తున్నాను? అంటే నాకు అండగా నీవు ఉన్నావనే నమ్మకంతో…
అమ్మా! నీ అండ చూచుకొని గొప్పనైన కార్యాన్ని తల కెత్తుకున్నాను. అంతేకాదు.. ముందు చెప్పిన మహాత్ములైన వారి వెంట నడుస్తాను.. అయితే ఆ సరణి మాత్రం నీవే నాకివ్వాలి. నిన్ను నమ్ముకున్నాను తల్లి.. “మేల్ పట్టున్ మానకు మమ్మ” మంచి పట్టుగా ఉండవమ్మా… ఓ దయకు సముద్రం లాంటి దానా.. బ్రహ్మీ మాతా అంటున్నాడు, పోతనగారు. దయ ఆలోచనకు పరిమితమైనది కాగా కరుణ ఆచరణకు సంబంధించినది.. ఆలోచన ఆరంభం కాగా.. ఆచరణ ముగింపు…
“మేల్ పట్టున్ మానకు మమ్మ” … ఒక ఇరుకైన చేదబావి పూడిక తీస్తున్నారు.. అది ఒక ఉదాత్తమైన కార్యం.. ఒకడు లోపల ఉన్నాడు.. ఒకడు వెలుపల ఉన్నాడు. లోపల ఉన్నవ్యక్తి బావి లోపలి మట్టిని తీసి తట్టలో వేస్తాడు.. వెలుపల ఉన్న వ్యక్తి దానిని జాగ్రత్తగా పైకి చేది ఆ తట్టలోని మట్టిని బైట పారబోస్తాడు. పైన ఉన్న వ్యక్తి ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా లోపలి వ్యక్తి ప్రమాదానికి గురవుతాడు. మట్టి తట్ట తొణికినా… జారినా.. తాడు తెగినా.. లోని వ్యక్తికి ప్రాణాపాయ స్థితి కలుగుతుంది. అందుకే లోని వ్యక్తి అంటున్నాడు.. అరే జాగ్రత్తగా పైకి చేదుకో… అంటూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని పైన ఉండే వ్యక్తికి చెపుతున్నాడు. లోపలి వ్యక్తి ప్రాణాలు పైన ఉన్న వ్యక్తి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉన్నాయి. అదే విధంగా పోతన గారు దుష్కరమైన కార్యాన్ని తలకెత్తుకున్నాడు. తన సంకల్పం ఉదాత్తమైనది.. అత్యంత గహనమైనది. తానెంత సమర్ధుడైనా.. అమ్మవారి కరుణాదృక్కులు లేకపోతే తన ప్రయత్నం అపహాస్యం పాలవుతుంది. అందుకే మేల్ పట్టున్ మానకు మమ్మ.. అంటున్నాడు.
* * *
బలవంతుండు ధరాసుతుండు గనె శుంభద్రాజ బింబోపరి
స్థల శంపాన్వితమేఘమో యన ఖగేంద్రస్కంధపీఠంబుపై
లలనారత్నముఁ గూడి సంగరకథాలాపంబులం జేయు ను
జ్జ్వలనీలాంగుఁ గనన్నిషంగుఁ గుహనాచంగున్ రణాభంగునిన్!
(పోతన – భాగవతము – దశమ స్కంధము – ఉత్తరభాగము – 168)
మహాబలవంతుడు, ధరా (భూదేవి) కుమారుడునైన నరకాసురుడు చూచాడు. ఎవరిని చూచాడు? ప్రకాశమానమైన చంద్రబింబం ఉపరితలంపైన మెఱపుతీగతో కూడిన మేఘమా అన్నట్లుగా గరుత్మంతుని మూపుపై, ఉత్తమ స్త్రీలలో మణివంటి సత్యభామతో గూడి యుద్ధ విశేషాలను ముచ్చటించుకుంటున్న వానిని, నీలవర్ణంతో శోభిస్తున్న వానిని, వీపుపైన అమ్ములపొదిని దాల్చిన వానిని, రణకోవిదుడైన శ్రీకృష్ణుడిని చూసాడు.
మురాసుర సంరక్షితమైన గిరి, శస్త్ర, సలిల, దహన, పవన దుర్గమమైన దుర్గముల చేత చుట్టబడిన పట్టణంలో ఉండేవాడు నరకుడు. కృష్ణుడు ముందుగా ఆ దుర్గాలను ఛేదించి యుద్ధ సంరంభియై వచ్చిన వాడయిన కృష్ణుని చూచాడు, నరకుడు.
ధరా సుతుడు… వరాహావతార సమయంలో విష్ణువు భూదేవిని ఉద్ధరించిన సమయంలో, ఆ ప్రకృతి పురుషుల సంగమం వలన జనించిన వాడయిన నరకాసురుడు. నరులలో అనుర లక్షణాలు కలిగినవాడు నరకాసురుడు. ప్రతివ్యక్తిలో సుర అసుర రాక్షస లక్షణాలు ఉంటాయి. వాటిలో ఏ లక్షణాలను జాగృతం చేసుకుంటామో ఆ జీవన గతిని లేదా విధానాన్ని సంతరించుకుంటాము. నిస్వార్ధ జీవనం సుర లక్షణమని, స్వార్థం ఉన్నా హింసా ప్రవృత్తిలేనిది అసుర ప్రవృత్తి అని, స్వార్థంతో పాటుగా హింసా ప్రవృత్తిని కలిగియుండడం రాక్షస ప్రవృత్తి యని చెపుతారు.
జీవితం పట్ల, జీవన వైఖరి పట్ల, జీవన లక్ష్యాల పట్ల, విస్పష్టమైన అవగాహన లేక జీవన ప్రయోజనాలను గుర్తించ గలిగిన వికాసం లేనట్టి జఢత్వాన్ని కలిగిన నరుడు.. నరకుడు.
ధర అనగా భూమి అనగా ప్రకృతి.. జఢత్వాన్ని కలిగింది. అంతే కాదు, భూమి పోషణ నిచ్చేది. భూమి నుండి వచ్చే ఆహారమే సమస్త జనులనూ పోషిస్తుంది.. అందుకే నరకుడు భూమి సుతుడయ్యాడు.
మొదట్లో ఇతడు “ప్రాగ్జ్యోతిష పురం” లో ఉండేవాడు.
ప్రాక్ .. సత్యము.. శాశ్వతమైనది, అనాదిగా ఉన్నది.. ఏది అనాది? అనగా ఆత్మ.. ఆత్మజ్యోతిగా ప్రకాశించేది ప్రాగ్జ్యోతిషము. సత్యము చేత ప్రకాశమానమైన పురము లేదా పట్టణము ప్రాగ్జ్యోతిషము.. అలాగే పురము అనగా శరీరము… సత్యప్రకాశమానమైన శరీరంతో వెలుగొందేవాడు. ఆ సత్యాన్ని విస్మరించాడు. దానితో మాహిష్మతీ పట్టణానికి మారాడు. అనగా మహిష ప్రవృత్తికి మారాడు.. జ్ఞానవంతమైన, చైతన్యవంతమైన నరకుడు పశుప్రవృత్తిని స్వీకరించి నరకాసురుడు అయ్యాడు. అక్కడ ముగ్గురు మిత్రులయ్యారు.. వారే మురాసురుడు, నిశుంభుడు, హయగ్రీవుడు… ఈ మువ్వురూ సత్వరజస్తమోగుణాలకు ప్రతీకలు కాగా వారికి మిత్రునిగా ఆ బంధంలో చిక్కుకున్నాడు, నరకుడు.
ఎప్పుడైతే తనకు త్రిగుణ సంపత్తితో బంధం ఏర్పడిందో అప్పుడే అతనికి భయం, కోరికలు జనించాయి. జీవునికి బంధాలు ఉంటాయి.. పరమాత్మకు సంబంధాలు ఉంటాయి అంటుంది భాగవతం. అన్యోన్యమైత్రి కలిగి పతనావస్థకు దిగజార్చే భయం, కోరికల యొక్క బంధనాలలో చిక్కి మోక్షాన్ని కోరుకోవలసిన వాడు అమరత్వాన్ని (చిరకాలం జీవించడం) సాధించాలని తపించాడు.. మరణం లేని జీవితాన్ని పొందలేకపోయినా తన తల్లితో మాత్రమే మృత్యువు కావాలనే వరాన్ని పొందాడు. ఎందుకు? అంటే తనను పోషిస్తున్న తల్లినే మరచి తల్లి ఎవరో తెలియని అజ్ఞానానికి బద్ధుడయ్యాడు. కాబట్టి ఆమెతో తనకు మరణం ప్రాప్తించే అవకాశం లేదని భావించాడు.
నిజానికి మర్త్యుడు అంటే మృత్యువుకు సమీపానికి వెళ్ళేవాడని అర్థం. సృష్టిలో ఏ జీవికీ శాశ్వతంగా ఉండిపోయే అవకాశం లేదు. ఆకృతి ఉన్నదేదయినా కాలాంతరంలో ఆ ఆకృతిని కోల్పోవలసిందే. ఇతనూ నరుడే లేదా మర్త్యుడే శరీరాన్ని వదలవలసిన వాడే.. అయినా అసురలక్షణాలను సంతరించుకున్నవాడు.
ఇక అతను వివాహం చేసుకున్నది చతుర్దశి అనే స్త్రీని. ఆమె “త్వష్ట” అనే ప్రజాపతి కుమార్తె. త్వష్ట అంటే తొలుచునది.. ఏది తొలుస్తుంది అంటే మాయ.. మాయయే మనిషి వివేకాన్ని తొలుస్తుంది. మాయయే ప్రకృతి.. ప్రకృతిలో ఉన్నవి పదునాలుగు భువనాలు.. ఆ పదునాలుగు భువనాలనే చతుర్దశి అన్నారు. ఆ కన్యను వివాహమాడాడు. అంటే పూర్తిగా మాయలో మ్రగ్గిపోయాడు. ఒకవైపు త్రిగుణ బద్ధులైన మిత్ర సంతతి, మరొకవైపు మాయాబద్ధమైన సహచరి.. అతనిలో అభిజాత్యానికి తోడుగా అహంకార మమకారాదులు, అధికార దర్పం లాంటివి వెలుగుచూచాయి. దానితో అదితియొక్క కుండలాలను హరించాడు. అదితి అంటే.. దితి కానిది. “దితి” అనగా ముక్కలు అయ్యేది లేదా ఖండములుగా అయ్యేది.. మరి “అదితి” అంటే ముక్కలు కానిది. ముక్కలు కానిది ఏది? అంటే ఆకాశమే.. ఆకాశమే ఖండములు గాకుండా అనంతంగా అంతటా వ్యాప్తమై ఉండేది.. కుండలాలు అంటే ఆ ఆకాశం ధరించిన సూర్య చంద్రులు. సూర్య చంద్రులు కాలానికి ప్రతీకలు. వాటిని హరించడం అంటే.. కాల స్పృహను కోల్పోవడం. కాలంయొక్క ప్రసరణ లేదా ప్రభావం తనపై లేదని భావించాడు. దుర్మార్గ ప్రవర్తన పెరిగిపోయింది. సకలమూ తనదిగా భావించాడు. “సకల” అనగా పదునారు లేదా షోడష కళలు అంటుంది లలితా సహస్రనామం. అన్ని సంపదలూ తనవిగా భావించి వాటిని నియంత్రించడమూ, బంధించడమూ ఆరంభించాడు. ఈ ప్రవృత్తిని నియంత్రించాలి.
అందుకే కృష్ణుడు యుద్ధ సన్నద్ధుడై వచ్చాడు. సత్యభామా వస్తానన్నది.. ఆమెనూ తీసుకు వచ్చాడు. ఎందుకు అంటే నరకునికి తన తల్లితో మాత్రమే మరణం ఉన్నది.. రుక్మిణి లక్ష్మీదేవి అంశ కాగా, సత్యభామ భూదేవి అంశ. అలా వచ్చిన సత్యభామ, కృష్ణుల నిరువురినీ చూచాడు.. బలవంతుడైన నరకాసురుడు. సత్యభామ అంటే ఎవరు? “సత్య”ము అనగా శాశ్వతమైనది.. ఏది శాశ్వతమైనదో అదే మారనిది. అదే ఈశ్వరుడు. దాని యొక్క “భా” కాంతిచే వచ్చే “మ” సంపద. శాశ్వత సత్యము యొక్క కాంతిచే పొందదగిన సంపద లేదా ఐశ్వర్యము. అది ఎవరి సొత్తు? ఈశ్వరుని సొత్తు. అందుకే సత్యభామ కృష్ణుని ప్రక్కన రాశీభూతమై నిలిచింది. “కృష్” భూవాచకము.. ప్రయత్న సాధ్యమైనది కాగా “ణ” కారం మోక్షానికి ప్రతీక.
ఎప్పుడైతే సత్యమైన ప్రకాశాన్ని దర్శించాడో అప్పుడే నరకునిలో అజ్ఞాన తిమిరం విఛ్ఛిన్నం అయింది. అనంతమైన విష్ణు తేజస్సులో కలసిపోయాడు. మరొక విధంగా చెప్పుకుంటే.. “అ” కార “ఉ” కార “మ” కారాలు సృష్టి స్థితి లయాలకు ప్రతీకలు.. ఎప్పుడైతే సత్య దర్శనం అయిందో అప్పుడే నరకునిలో అజ్ఞానం లయమయిందని భావించవచ్చు. దానినే మనం అమావాస్యగా చెప్పుకుంటాము. “అమా” అనగా కూడి “వాస్య”.. వాసము.. అమావాస్య నాడు నరకునిలోని ఆసురీ ప్రవృత్తి భగవంతునిలో లయం అయింది. త్రిగుణాత్మకమైన ఆసురీశక్తులతో మైత్రిని కొనసాగించిన వేళ అతను ఉపాధిగతమైన జీవాత్మగా ఉన్నాడు. ఎప్పుడైతే భగవత్ దర్శనం జరిగిందో అప్పుడు ఉపాధిరహితమైన విశ్వచైతన్యంలో అనగా నారాయణునిలో లయమై “నరుడే నారాయణుని”గా మారాడు.