– బి.ఎస్. రాములు
ప్రసిద్ధ కథకులు, నవలాకారులు, సాహిత్య విమర్శకులు, సామాజిక తత్వవేత్త బి.ఎస్. రాములు గారి 75 వ జన్మదిన వజ్రోత్సవ సందర్భంగా ‘మయూఖ’ ప్రతినిధి బి.ఎస్.రాములుగారితో ప్రత్యేక ముఖాముఖి
నమస్కారం సార్!
1. సార్ ! మీ గురించి ఎన్నో రచనలు వ్యాసాలు , పరిశోధనలు వెలువడ్డాయి.
1998 ఆగస్టులో యాభయ్యవ జన్మదిన స్వర్ణోత్సవం సందర్భంగా “ఆధునిక భారతీయ సామాజిక తత్వవేత్త బి ఎస్ రాములు” అనే సావనీర్ ను ఆహ్వాన సంఘం వెలువరించి 25 ఏళ్లయింది. ఈ 25 ఏళ్లలో మరెన్నో అనుభవాలు సంతరించుకున్నారు. ఎన్నో రచనలు చేసారు. తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక భూమికలు అందించారు. తెలంగాణ తల్లి రూపకల్పన చేశారు. 2003 నుండి ఉస్మానియా యూనివర్సిటీ పక్కన విశాల సాహిత్య అకాడెమీ కార్యాలయం నిర్వహించారు. ఒక రచయిత, ఇలా తెలంగాణ ఉద్యమానికి, రచయితలకు , ఉద్యమ కారులకు ఒక కేంద్రంగా , థింక్ టాంకుగా, ప్రచురణల కేంద్రంగా వందలాది ఉద్యమ కారులకు అడ్డాగా నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా 2007 లో ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాలు రూపొందించారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నేతృత్వంలో ఒకసారి, గూడ అంజయ్య, పాశం యాదగిరి, గద్దర్ తెలంగాణ సాంస్కృతిక సమాఖ్యతో ఒకసారి, కెసిఆర్ టిఆర్ఎస్ తో మరోసారి చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించడం వెనక మీరే వ్యూహ కర్తగా నిర్దేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా ప్రతి నెలా ఒక పుస్తకం ప్రచురిస్తానని ప్రకటించి ఆ పుస్తకాలను ఉస్మానియా, కాకతీయ విశ్వ విద్యాలయాల్లో పంచారు. టిఆర్ ఎస్. తెలంగాణ భవన్ తో పాటు ప్రతి సభలో పుస్తకాలు, కరపత్రాలు పంచడం ద్వారా విశేష కృషి చేసారు. అదే సమయంలో అంతకన్నా ముందు 1992నుండి దరకమే ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులుగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గాల గొంతుకగా సిద్ధాంతకర్తగా చేస్తున్న కృషిని అంతే ప్రాధాన్యతతో కొనసాగించారు. ఎన్నో రచనలు వెలువరించారు. ప్రసంగాలు చేసారు. మరోవైపు రచయితగా తెలంగాణ ఉద్యమం గురించి బీసీ ఎస్సీ ఎస్టీల జీవితం సంస్కృతి గురించి కథలు నవలలు రాసారు. కథా రచనకు కథకుడి పాఠాలు, స్వాతంత్య్రానంతరం 60 ఏళ్ల తాత్విక, సామాజిక పరిణామాలు వివరిస్తూ యువ రచయితలకు మార్గనిర్దేశం చేసారు.
1990 లో స్థాపించిన విశాల సాహితి అకాడెమీ ద్వారా 190 పుస్తకాలు ప్రచురించారు. అనేక సదస్సులు, సమావేశాలు ఏర్పాటు చేశారు. వందలాది రచయితలకు విశాలసాహితి పురస్కారాలను అందించారు. డా. సినారె, దాశరథి, ఆచార్య కొలకలూరి ఇనాక్, తెలకపల్లి రవి, ఎస్వీ సత్యనారాయణ , రవ్వా శ్రీహరి, ఆచార్య కె. జయశంకర్ తదితరులు చేతులమీదుగా పురస్కారాలు అందజేశారు. కథా వర్క్ షాపులు నిర్వహించారు.
1996లో ‘ప్రవహించేపాట -ఆంధ్రప్రదేశ్ దళిత పాటలు’ అనే సంకలనం ప్రచురించారు. 2004 లో విశాల సాహితి బీసీ ఎస్సీ ఎస్టీల పాటలు, సామాజిక చైతన్య పాటలు, సంకలనాలు వెలువరించారు. 1997 నుండి కరీంనగర్ జిల్లా కథలు నాలుగు సంపుటాలు వెలువరించి 2003లో ‘భారతీయ సాహిత్యం తెలుగు కథలు’ అనే గొప్ప సంకలనాన్ని ప్రచురించారు.
తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ తల్లి రూప కల్పన తోపాటు, డబుల్ బెడ్ రూం పథకం, గురుకుల పాఠశాలల రూపకల్పనలో క్రియాశీల పాత్ర నిర్వహించారు. కుటుంబాన్ని కూడా తీర్చిదిద్దారు. నలుగురు పిల్లలు విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక బీసీ కమిషన్ తొలి చైర్మన్ గా చరిత్ర సృష్టించారు. ఇన్ని పనులు ఏకకాలంలో ఎలా చేయగలిగారు? అసలు మీ సామాజిక జీవితం, రచనా జీవితం ఎలా ప్రారంభం అయిందో యువతరానికి తెలపాలని కోరుతున్నాను.
బి ఎస్ రాములు: మా చిన్నప్పుడు అమ్మ అనేక కథలు చెప్పేది. నిద్ర పోవడానికి, ఆకలి మరిచి పోవడానికి కథలు చెప్పేది. జానపద కళాకారులు శారదకాండ్రు, బుర్ర కథ వాళ్లు ఇంటింటికి తిరిగి కథలు చెప్పేవారు. అలా చిన్నప్పటినుండి కథలంటే చాలా ఇష్టం. అమ్మ చెప్పిన కథలను నాకు తోచినట్టు మరికొంత కల్పించి నా బాల్య స్నేహితులకు చెప్పేవాడిని. అలా కథలు వినడం, కథలు చెప్పడం ఏకకాలంలో ప్రారంభమైంది.
మా సామాజిక జీవితంతో పాఠశాల జీవితంతో మొదలైంది. మా కాలంలో మా పాఠశాల జీవితం ఒక సోషలిస్టు సమాజ నిర్మాణంలో భాగంగా సాగింది. అందరం ప్రభుత్వం పాఠశాలలోనే చదువుకునే వాళ్లు. ఎవరు బాగా మార్కులు తెచ్చుకుంటారో వారికే గౌరవం. కులాలు, ధనవంతులు, తహసీల్దార్ కొడుకు అందరం, అన్ని కులాలవారు, ప్రభుత్వోద్యోగులు, ఉద్యోగుల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువు కునే వాళ్లం సమానమే. ఎవరు బాగా మార్కులు తెచ్చుకుంటారో, ఎవరు బాగా ఆటలు ఆడతారో వాళ్లకు గౌరవం. అది తొలి సోషలిస్టు సమాజ నిర్మాణం. మా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ముద్దు రామకిష్టయ్యగారు ప్రపంచ దేశాలు తిరిగి చదువుకున్న అనుభవంతో నూతన పద్ధతులలో మా జగిత్యాల పాఠశాల విద్యార్థుల వ్యక్తిత్వ వికాసంలో మహోన్నత పాత్ర నిర్వహించారు. ఆ కాలంలో అనగా 1960 లో మా మల్టీ పర్పస్ హైస్కూలులో 2 వేల మంది విద్యార్థులుండే వారు. తెలంగాణలోనే అత్యధిక విద్యార్థులున్న పాఠశాల. శ్రమపట్ల గౌరవం పెంచడానికి స్వయంగా సంపాదించుకోవడం నేర్పడానికి స్కూల్లో స్విమ్మింగ్ పూల్ కట్టిస్తూ, కంకర కొట్టి సంపాదించడానికి ఏర్పాటు చేశారు. కొత్త కొత్త ఆటలు రూపొందించారు. ప్రతిసంవత్సరం విద్యార్థులకు ఆలిండియా టూర్ విజ్ఞాన యాత్రలు నిర్వహించారు. ఆయన జీవితాన్ని, జీతాన్ని విద్యార్థుల కోసమే ఖర్చు పెట్టేవారు. అలాంటి స్వేచ్ఛాయుత వాతావరణంలో మా చదువులు, వ్యక్తి వికాసం సాగినాయి. పాఠశాల జీవితమే మా తొలి సామాజిక జీవితం.
2. మీ జననం, బాల్యం గురించి చెప్పండి.
జ :- నేను 23 ఆగస్ట్, 1949 వ సంవత్సరంలో కరీంనగర్ జిల్లా జగిత్యాలలో చేనేత కుటుంబంలో జన్మించాను. మా నాన్న మిట్టపల్లి నారాయణ, మా అమ్మ బేతి లక్ష్మిరాజు. ఆ కాలంలో మేము పేదలం కాము. మా నాన్న చేనేత కార్మికుడు. బొంబాయిలో మిల్లు కార్మికుడుగా పనిచేశారు. కుటుంబాన్ని తీసుకుపోలేక జగిత్యాలకు వచ్చారు. అక్కడి వాతావరణ పరిస్థితులు, ఆహారం పడక నాన్నకు హెర్నియా వచ్చింది. అప్పుడు వైద్య సదుపాయాలు లేవు. 1955 లో మా నాన్న చనిపోయే నాటికి నాకు ఆరేళ్ళ వయస్సు. మా తమ్ముడు పాలు కూడా మరవలేదు. మేము ముగ్గురం అన్నదమ్ములం. నేను నడిపోన్ని.
మా అమ్మ బీడీలు చేసి మమ్మల్ని పెంచి పోషించింది. మా తాతయ్యకు మా నాన్న మేనల్లుడు. మా చుట్టూ మా మేనమామ, మేనత్త, అమ్మమ్మ, తాతయ్య ఉండడం వల్ల మా అమ్మకు ఒంటరితనం తెలియదు. ఆరోజుల్లో పిల్లలను కొడితేనే చదువు వస్తుందనే దుర్భావన ఉండేది. మా అన్న దెబ్బల బాధ తట్టుకోలేక చదువు మానేసిండు. మా అమ్మ కిరాణా షాపులో జీతం ఉంచింది. తొమ్మిదేండ్ల వయసు పిల్లవాడు కావడంవల్ల షాపులో ఉండలేక పోయాడు. ఇంట్లో అందరూ తిడుతుంటే, కొడుతుంటే దేవుని కోసం ముడుపు కట్టిన గురిగి పగులగొట్టి ఆ డబ్బులతో బొంబాయి పారిపోయాడు. మా ప్రాంతం నుండి చాలామంది బొంబాయికి వెళ్ళి పనిచేసేవాళ్ళు.
3. ఇంట్లో అలాంటి పరిస్థితులు ఉండగా మీ విద్యాభ్యాసం ఎలా కొనసాగింది?
జ :- నేను చిన్నప్పటి నుండీ చదువుపట్ల ఆసక్తి కలిగి ఉండేవాడిని. మా అన్న రాజ నర్సయ్య ఉపాధ్యాయుల పట్ల ఉన్న భయంతో నన్ను కూడా బడికి వెళ్ళొద్దనేవాడు. నేను బాలశిక్ష సాతాని అయ్యోరు పంతులు దగ్గర చదువుకున్నాను. ప్రాథమిక విద్య మర్కజి ప్రైమరీ స్కూల్, జగిత్యాలలో ఐదవ తరగతి వరకు చదువుకున్నాను. దాన్ని సెంట్రల్ ప్రైమరీ స్కూల్ అంటారు. తరువాత మల్టీ పర్పస్ హైస్కూల్ లో 6వ తరగతులు చేరాను. ఆ పాఠశాలలో 12వ తరగతి వరకు ఉండేది. 6వ తరగతి నుండి మల్టీపర్పస్ హైస్కూల్ లో చదివాను. 1967 మార్చిలో 12వ తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. ప్రథమశ్రేణిలో పాసయ్యాను. 9వ తరగతిలో ఎక్కువ మార్కులు వచ్చినవారిని 10వ తరగతి ఆప్షనల్స్ లో ఎమ్ పి సి, బి పి సి గ్రూపులో చేర్చేవారు. తక్కువ మార్కులు వచ్చినవారిని ఆర్ట్స్ గ్రూపులో పెట్టేవారు. నేను ల్యాబ్ ఫీజు 15 రూపాయలు కట్టలేదు. అమ్మనడిగితే చదువు బంద్ చేయుమన్నది. దాంతో సిఇసి తీసుకున్నాను. 7 సంవత్సరాల కాలంలో నేనొక్కడినే ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాను.
4. మీ ఉద్యోగజీవితం ఎలా ప్రారంభమైంది?
జ :- అప్పటి రోజుల్లో ఫస్ట్ క్లాస్ లో పాసయిన వాళ్ళకు. పోస్టాఫీసులో ఉద్యోగం వచ్చేది. అందుకని డిగ్రీ చేయలేదు. నాకున్న మార్కులను బట్టి ఉద్యోగం వస్తుందన్న నమ్మకంతో జగిత్యాలలో టీచర్ ట్రైనింగ్ ఉన్నప్పటికీ జాయిన్ కాలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో టీచర్లకు 96 రూపాయల జీతం ఉంటే పోస్ట్ ఆఫీసులో 240 రూపాయలు ఉండేది. పోస్టల్ ఉద్యోగం రాలేదు. మూడేళ్లు చూసి ధర్మపురిలో ఈవెనింగ్ కాలేజీలో జాయినయ్యాను. పొద్దుటి సమయమంతా న్యూస్ పేపర్ ఏజెంటుగా ఉంటూ, బీడీల కంపెనీలో పని చేసుకుంటూ చదువుకున్నాను. 1970-74 మధ్య ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర కళాశాలలో డి ఓ ఎల్, బి ఓ ఎల్ చేయడం జరిగింది. జై తెలంగాణ, జై ఆంధ్ర ఉద్యమాల వల్ల నాలుగేళ్ళ కోర్సు అయిదేళ్లు కొనసాగింది. 1973లో ఆదిలాబాద్ జిల్లా డిఎస్సీలో డి ఓ ఎల్ అర్హతతో తెలుగు పండిట్ పోస్టుకు ఎంపికయ్యాను. పోస్టింగ్ ఆర్డర్ రాలేదు. పైరవీ చేసి డబ్బులు ఇస్తే పోస్టింగ్ ఆర్డర్ ఇస్తారని అన్నారు. సరేనని ఒకరికి డబ్బులు ఇచ్చాను. ఆయన ఆ ప్రయత్నం చేశాడో లేదో కానీ నాకు ఉద్యోగం రాలేదు. ఆ సెలక్షన్ లెటర్ చూసి నేను పనిచేస్తున్న బీడీ కంపెనీ యజమానురాలు మిట్టపల్లి ఈశ్వరమ్మ మా అక్క కూతురు శ్యామల ఉందని చెప్పి నన్ను ఒప్పించారు. 1973 మే 17వ తేదీన శ్యామలతో పైడిమడుగు లలో పెండ్లి జరిగింది. ఎమర్జెన్సీ విధించిన తరువాత 5 నెలలకు 1975 డిసెంబర్ లో సాంఘిక సంక్షేమ శాఖలో ఎలుగందలలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగం వచ్చింది.
5. ఆర్.ఎస్.ఎస్ పట్ల మీరు ఆకర్షితులవడానికి ప్రేరణ ఏమిటి?
జ :- మా ఇంటిముందే ఆర్ ఎస్ ఎస్ శాఖ నడిచేది. 9 వ తరగతి నుండి శాఖకు వెళ్ళేవాళ్ళం. చెంచు లక్ష్మయ్య, శ్రీధర్ జీ, కళ్ళెపు విద్యాసాగర్ జీ మొదలైన వాళ్ళు ఇతర ప్రాంతాల నుండి వచ్చి శాఖను నడుపుతుండేవారు. మా ఇంటి చుట్టూ మా క్లాస్ మేట్స్, బ్యాచ్ మేట్స్ పల్లెటూళ్ళ నుండి చదువుకోవడానికి వచ్చి ఇక్కడ కిరాయికి ఉండేవాళ్ళు. అందరమూ ఆ శాఖకు వెళ్ళేవాళ్ళం. 1967 నుండి 1970 దాకా నేనే ముఖ్య శిక్షక్ గా శాఖను నడిపేవాడిని. ధర్మపురికి పోయినాక 1972 దాకా అక్కడ కూడా శాఖను నడిపేవాడిని. మేము మతం కన్నా దేశభక్తి గురించి ఆకర్షితులమైనాము.
6. మీ దృష్టి సాహిత్యం వైపు ఎప్పుడు మళ్ళింది?
జ :- నాకు చిన్నప్పటి నుండి సాహిత్యం పట్ల ఆసక్తి. మా ఇంటి సమీపంలోనే శాఖా గ్రంథాలయానికి వెళ్లి పత్రికలు, పుస్తకాలు తెగ చదివేవాళ్లం. 9వ తరగతి నుండి కథలు, పాటలు, పద్యాలు రాసేవాణ్ణి. భాస్కర్ రెడ్డి సార్, కమలాకర్ రావు సార్ బాగా ప్రోత్సహించారు. అట్లా స్కూల్లో వ్యాసరచన పోటీల్లో, ఉపన్యాస పోటీల్లో ముందుండేవాడిని. అనేక బహుమతులు గెలుచుకునే వాడిని. 9వ తరగతి నుండి నేను మాతోటి విద్యార్థులకు త్రైమాసిక, షాన్మాదిక, వార్షిక పరీక్షల జవాబు పత్రాలను దిద్ది మార్కులు వేసేవాడిని. 300 మంది విద్యార్థులలో ఆ అవకాశం నాకు వచ్చింది. తద్వారా నాకు ఎంతో అవగాహన పెరిగి, తోటి విద్యార్థుల స్థాయి ఏమిటో తెలిసేది.
నేను జగిత్యాలలో డిగ్రీ చదవకపోయినా దివాకర్ల వేంకటావధాని గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, సి. నారాయణరెడ్డి గారు వచ్చినపుడు నా స్నేహితులతో పాటు కాలేజీకి వెళ్ళి వాళ్ళ ప్రసంగాలు వినేవాడిని. ధర్మపురిలో కూడా మేము కవిసమ్మేళనాలు జరిపే వాళ్ళం. ముత్యాల విశ్వనాథం, జయధీర్ తిరుమల రావు, మంచాల గంగాధర్, సంగనభట్ల నర్సయ్య ఇట్లా స్థానికులు ఎంతోమంది 20, 25 మంది దాకా కవిసమ్మేళనంలో పాల్గొనేవాళ్ళం. ప్రసంగాలు, ఉపన్యాసాలు నిర్వహించుకునే వాళ్ళం. కార్తీకపౌర్ణమి గోదావరీ తీరాన ఇసుక తిన్నెల్లో ఆటలు పాటలు ఉండేవి. నిరుద్యోగం, నిరాశ, ఇంకోవైపు ఉత్సాహం. నేను దిన, వార, మాస పత్రికలతో పాటు యువభారతి ప్రచురణలను, ఎమెస్కో ప్రచురణలన్నింటినీ తెప్పించేవాడిని. నేను న్యూస్ పేపర్ ఏజెంటును కాబట్టి నాలుగు పుస్తకాలు తెప్పిస్తే ఒక పుస్తకం కమిషన్ గా మిగిలేది. అట్లా నా గ్రంథాలయం తయారైంది. ఆరుద్ర ‘సమగ్రాంధ్ర సాహిత్యం’ పుస్తకాలు మొదలైన ఎన్నో పుస్తకాలు చదివాను. సాహిత్యమంటే ఇదీ అదీ అని కాకుండా అన్ని పుస్తకాలు చదివేవాడిని.
7. మీరు నిర్వహించిన బాధ్యతల గురించి చెప్పండి.
జ :- నేను ఏపని చేసినా అంకితభావంతో చేశాను. అయిదేళ్ల పాటు 1972 దాకా ఆర్ ఎస్ ఎస్ ముఖ్య శిక్షక్ గా పనిచేసి 50 సంవత్సరాలు గడిచినా ఆర్ ఎస్ ఎస్ గురువులు గానీ, నా నుండి శిక్షణ పొందినవారు గానీ, సహచరులు గానీ ఇప్పటికీ స్నేహంగా ఉంటారు.
ఉద్యోగం వచ్చాక ఉద్యోగ సంఘాలను నిర్మాణం చేశాను. ‘సంఘమిత్ర’ అనే పేరుతో పత్రిక నిర్వహించాను. హాస్టల్ వార్డెన్ గా ఉన్న సమయంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం 20 సూత్రాల పథకం కింద 25 మంది ఉండే హాస్టళ్లలో 100 సీట్లకు పెంచుమని ఆదేశాలు జారీ చేసింది. సైకిల్ మీద ఒక స్టాఫ్ ని తీసుకొని మానేరు డ్యామ్ కి అటు ఇటు ఉన్న గ్రామాలన్నీ తిరిగి 100 మందిని చేర్పించాను. సుమారు 40,50 గ్రామాలు తిరిగాము. దానివల్ల నాకు దళిత వాడల్లో వాళ్ళ జీవితాల గురించి తెలిసివచ్చింది. మానేరు డ్యామ్ కడుతున్నందువల్ల బలి ఇస్తారని ప్రచారం చేశారు. హాస్టళ్లలో పురుగుల అన్నం పెడతారనే అపవాదును తొలగించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒక విద్యార్థి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ అయ్యాడు. అతడే ఘంటా చక్రపాణి. అట్లా ఎంతోమందిని చదువు వైపు మరల్చాను. అప్పుడే ‘గ్రామాలకు తరలిరండి’ అనే నినాదంతో విద్యార్థులు ఉద్యమం చేశారు. విప్లవోద్యమాలు ప్రారంభం అయినాయి.
8. మీ మొట్టమొదటి కథ ఏది?
జ:- నేను 1964 నుండి అనేక కవితలు, పాటలు బాల సాహిత్యగేయాలు, పత్రికలకు ఉత్తరాలు రాసేవాడిని. ఆనాటి పత్రికల్లో కొన్ని అచ్చు అయ్యాయి. స్కూల్ మ్యాగజైన్ ‘స్రవంతి’లో 1966లో ప్రకృతి వర్ణన గురించిన పద్యాలు వచ్చాయి. 1968 జనవరిలో బాలమిత్రలో నేను రాసిన కథ ‘జగిత్యాల కథ’ అనే పేరుతో వచ్చింది. అంతకుముందే డిటెక్టివ్ నవలలు, కథలు చదువుతూ ఉండడం వల్ల రాయడం అలవాటయింది. ప్రత్యేకంగా యువతరాన్ని ప్రోత్సహించే వాతావరణం అప్పటికి పత్రికల్లో లేదు. 1979 లో విరసంలో చేరాక కథలు రాసేవాళ్ళు తక్కువున్నారని కథలు రాయాలనుకొని రాయడం మొదలుపెట్టాను. పాటలు, వచన కవిత్వం తగ్గించాను. అట్లా 1979 లో ఆధునిక కథలు రాయడం మొదలైంది. బాలమిత్రలో కథ వచ్చిన తరువాత తొమ్మిదేళ్లకు ‘ఇంటర్వ్యూ’ అనే పేరుతో పత్రికల్లో కథ అచ్చయింది. దాన్నే ‘బతుకు నేర్పిన పాఠం’ గా పుస్తకంలో వేశాను. ఈ కథను విహారి గారు అత్యుత్తమ కథగా పేర్కొన్నారు. కాకతీయ కెనాల్ పనుల్లో చేయిస్తున్న వెట్టిచాకిరీ గురించి రాసిన ‘తిరుగుబాటు కథ’ సృజనలో వచ్చింది. అట్లా విప్లవకథలు రాశాను. ఆ తర్వాత 1990 నుండి బిసి, ఎస్సీ, ఎస్టీల కథలు నవలలు రాస్తూ వస్తున్నాను. 1982లో ‘బతుకు పోరు’ నవల వెలువడింది. అయిదు ముద్రణలు వెలువడ్డాయి. దానిపై 40 వ్యాసాలు, రెండు ఎమ్ ఫిల్స్ ప్రచురించబడ్డాయి. ఈ నవలతో నన్ను ఆంధ్ర గోర్కీ, ఆంధ్ర లూసన్ అని ప్రశంసించారు. 2013లో చూపు నవల 2017లో ‘జీవనయానం’ నవల వెలువడ్డాయి. 175 కథలు రాసినప్పటికీ కొన్ని మాత్రమే దొరికాయి. కొన్ని అచ్చు కాకుండానే పోయాయి. 15 కథల సంపుటాలు అచ్చు వేశాను. 3 కథల సంపుటాలు ఇంగ్లీషులోకి అనువాదమయ్యాయి. ‘బతుకుపోరు’ నవల ఇంగ్లీషులో వచ్చింది. నేను రాసిన 8 నవలల్లో 3 మాత్రమే అచ్చయ్యాయి. కొన్ని పోగొట్టుకున్నాను.
9. తెలుగు సాహిత్యంలో ఇన్ని ప్రక్రియల్లో, తాత్విక రంగంలో దృష్టి సారించడానికి కారణం ఏదైనా ఉందా?
జ :- ఉంది. చరిత్ర పరిణామమే ఆ కారణం. అది చరిత్ర ఇచ్చిన అవకాశం, అనివార్యత.
10. తెలంగాణ సాహిత్యకారునిగా మీరు ఎదుర్కున్న వివక్షతలేమిటి?
జ :- చాలా వివక్షతలు ఎదుర్కొన్నాము. తెలుగు వాళ్లంతా ఒకటి తెలుగు భాష ఒకటి అని 1956 నవంబర్ 1 న ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రం ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటినుండి మా కష్టాలు మొదలయ్యాయి. భాష ఒకటే అన్నవాళ్ళు మా భాష అర్థం కావడం లేదన్నారు. సురవరం ప్రతాపరెడ్డి గారు ఉన్నప్పుడు తెలుగు మాసపత్రిక, స్రవంతి, గోలకొండ పత్రికలలో ఆంధ్ర ప్రాంత రచనలు కూడా అచ్చు వేసేవారు. ఎప్పుడైతే ఆంధ్రప్రాంతం నుండి సంపాదకులు, ఉప సంపాదకులు, సాహితీపరులు వచ్చి ఇక్కడ స్థిరపడుతున్నారో వాళ్లకు ఒక రకమైన గర్వం పెరిగి తెలంగాణ భాషను భాష కాదన్నారు. రాష్ట్రం ఏర్పడిన 4, 5 ఏళ్ళకే మన భాషను తెలంగి, బేడంగి అని అవహేళన చేయడం మొదలుపెట్టారు. తత్వశాస్త్రం పట్ల నాకు చిన్నప్పటి నుండి ఆసక్తి. మా నాన్నతో పాటు బొంబాయిలో బట్టలమిల్లు కార్మికునిగా పనిచేసిన మా మేనమామ ఇంట్లో గృహ గ్రంథాలయం ఉండేది. పురాణాలు, వైద్య గ్రంథాలు, ఉపనిషత్తులు మొదలైనవి తీసుకొని చదివేవాడిని. మా పెదనాన్న అచలతత్వంగా ప్రాచుర్యం పొందిన అద్వైత శాఖకు 50 ఏండ్ల పాటు గురువుగా కొనసాగారు. అయిదారుగురు స్నేహితులం పోటీపడి వందల వేల పుస్తకాలను చదివేవాళ్లం. డిటెక్టివ్ నవలలను కూడా తెగ చదివేవాళ్లం. రవీంద్రనాథ్ ఠాగూర్, మున్షీ ప్రేమ్ చంద్, శరత్ బాబు, కోడూరి కౌసల్యాదేవి, రంగనాయకమ్మ, శ్రీశ్రీ, దాశరథి, సినారె, ఉమర్ ఖయ్యామ్ తదితరుల రచనలను బాగా చదివేవాళ్లం. అలా కథలు, నవలలు, కవిత్వం, సాహిత్య విమర్శ , అర్థశాస్త్రాల మీద ఆసక్తి కలిగింది. చందమామ, బాలమిత్రల్లోని బాల సాహిత్యం మా వ్యక్తిత్వాలను తీర్చి దిద్దాయి. 10వ తరగతిలో ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్ చదువుకోవడం వల్ల ఈ శాస్త్రాలపై విద్యార్థిగా ఉన్నప్పటి నుండే ఆసక్తి పెరిగింది. అలా సాహిత్యం, భావజాల పరిణామం ఎన్ని మలుపులు తిరిగిందో అన్ని మలుపుల్లోనూ వీటన్నిటి గురించి మారిన అవగాహనననుసరించి రాస్తూ వచ్చాను. అలా నా రచనలు, భావాలు, వైవిధ్యభరితంగా పరిణామం చెందుతూ వచ్చాయి.
9. మీ ‘కథలబడి’ పుస్తకాన్ని సాహిత్య అలంకార శాస్త్రంగా పేర్కొనడానికి కారణం ఏమిటి?
జ :- అలా పేరు పెట్టినందుకు డా. సి. నారాయణ రెడ్డి గారు, రావూరి భరద్వాజ గారు ఎంతగానో సంతోషించారు. సినారె గారు దాన్ని ఆవిష్కరించారు. రావూరి భరద్వాజ గారు ముందుమాట రాశారు. ఇద్దరు జ్ఞానపీఠ అవార్డు గ్రహీతల ప్రశంసలు పొందిన పుస్తకం ఇది. నేను డి ఓ ఎల్, బి ఓ ఎల్ పాఠ్యాంశాలుగా కావ్యాలంకార సంగ్రహం, ప్రతాపరుద్ర యశోభూషణం, ఆనంద వర్ధనుడు, భరతుడు, ధ్వని, రస, వక్రోక్తి సిద్ధాంతాలు చదువుకున్నాను. నవరసాలతో పాటు అనంతరసాలు, స్థాయి భావాలతో రససృష్టి గురించి అధ్యయనం చేశాను. ఆధునిక ప్రక్రియలలో వీటిని సాధించడం, సమర్థవంతంగా, ప్రతిభావంతంగా చిత్రించడం కోసం ‘కథలబడి’ సాహిత్య అలంకార గ్రంథం రాయడం జరిగింది.
విప్లవోద్యమంలో పనిచేసినప్పుడు కథలు ఎట్లా రాయాల్నో తెలిపి చాలా మందితో కథలు రాయించాను. 1984 నుండి 1990 వరకు పూర్తి కాలం కార్యకర్తగా పని చేస్తూ దేశమంతటా పర్యటన చేశాను. 1990 ఏప్రిల్ లో బహిరంగ జీవితంలోకి వచ్చాక బిసి ఎస్సీ ఎస్టీ మైనారిటీల సామాజిక అభివృద్ది కోసం భారత రాజ్యాంగ పరిధిలో కృషి చేయడం ప్రారంభించాను. అట్లా 1992లో “దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్య వేదిక” ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వ్యవస్థాపక అధ్యక్షునిగా రాష్ట్రమంతటా సభలు, సమావేశాలు నిర్వహించాం. యువతరాన్ని సాహిత్యకారులుగా తీర్చడానికి కథ, పాట, ప్రసంగం, వ్యాసరచన తదితర ప్రక్రియల్లో శిక్షణా తరగతులు నిర్వహించాం. శిక్షణా తరగతులకు ఒక పాఠ్య ప్రణాళిక ఉండాలని ‘కథలబడి’ రాయడం జరిగింది. అలాగే పాటల గురించి, పాట పుట్టుక గురించి రాయడం జరిగింది. వాటితో వందలాదిమంది యువకులు ఎదుగుతూ వచ్చారు. సమస్త వర్ణ, వర్గ, కుల, లింగ, జాతి, మత, ప్రాంత, దేశ, భాష వివక్షతలను, అసమానతలను నిర్మూలించడానికి ‘దరకమే’ ఐక్య వేదిక సాహిత్య సామాజిక సాంస్కృతిక రంగాలలో కృషి చేస్తుందని ప్రకటించాము. అప్పటిదాకా వచ్చిన కథలు వాటి శైలీ శిల్పం, కథా వస్తువుకు భిన్నంగా మాదైన కథా వస్తువు, శైలీ శిల్పం రూపొందించుకోవాల్సి వచ్చింది. అలా కథా ప్రారంభం, పాత్రలు, సంఘటనలు, కథ ముగింపు మొదలైనవన్నీ ఉత్పత్తి కులాలైన, సేవా కులాలైన శూద్ర, అతి శూద్రుల జీవితం, సంస్కృతి, భాష వారి ఆశలు చిత్రించడం, జీవితం పట్ల ఆశ, విశ్వాసం, ‘we can win’ అనే దృష్టి కోణాన్ని ఇవ్వడం అవసరం. అంతకుముందు సాహిత్యంలో వీరంతా బలిపశువులైనట్లు విషాదాలు, అణచివేత మాత్రమే చిత్రించేవారు. దాన్ని అధిగమించి జీవితాన్ని ఎట్లా గెలుచుకోవాలో చెప్పడం అవసరం. అందువల్ల దరకమే ఐక్య వేదిక ఏర్పడ్డాక మొత్తం సాహిత్యరంగంలో ఒక మార్పు మొదలయింది. అందుకు అలంకార శాస్త్రంగా ‘కథలబడి’ పాఠ్యగ్రంథంగా ఉపయోగపడింది.
10. మీ “గతి తర్క తత్వ దర్శన భూమిక’ రచన ప్రత్యేకత, విశిష్టత, దాని ప్రభావం గురించి తెల్పండి.
జ :- 1977 నుండి 1989 దాకా విప్లవోద్యమంలో పని చేశాను. అప్పుడు విరసంతో సహా మార్క్సిజమ్, లెనినిజం, మావో ఆలోచనా విధానాల గురించి చెప్పేవారు. ఆ ప్రభావంతో 1977-90 దాకా ఉద్యమంలో పని చేశాను. ప్రజల మధ్య పని చేస్తున్న క్రమంలో ప్రజల పట్ల నిర్బంధాలు పెరిగాయి. ఉద్యమం పెరుగుతున్నట్టు కనబడుతూ క్రమంగా కుదించుకు పోవడం జరిగింది. అఖిల భారత పర్యటనలో వరవరరావు, గద్దర్, సంజీవ్, డప్పు రమేశ్, డోలకిస్టు రాజుతో కలిసి 12 రాష్ట్రాలు పర్యటించాము. ఎందరో రచయితలు, కళాకారులు, సాహితీ వేత్తలు, ఉద్యమ కారులు, పౌరహక్కుల సంఘాల వాళ్ళు, జర్నలిస్టులు, పత్రికా సంపాదకులు, ప్రొఫెసర్లు ఎందరో కలిసారు. ప్రపంచ విప్లవోద్యమం గురించి, భారతీయ విప్లవోద్యమం గురించి వాటిలోని ఒడి దుడుకులను గురించి, ఎదురవుతున్న కష్ట నష్టాలు, సమస్యల గురించి చర్చించుకోవడం జరిగింది. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయంలో నక్సలైట్ నాయకుడు కేరళ వేణు, నక్సలైట్ పత్రిక మాస్ లైన్ సంపాదకుల ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ఆ చర్చలో పాల్గొన్నాం. అర్థ భూస్వామ్య వ్యవస్థ, అర్థ వలస వ్యవస్థ అనే దృష్టితో చేసిన ఉద్యమాలన్నీ ఆగిపోయినాయి. అందువల్ల మేము పునరాలోచనలో పడ్డాము. నయా వలసవాదానికి వ్యతిరేకంగా అనగా నేటి ప్రపంచీకరణకు వ్యతిరేకంగా జాతుల ఉద్యమాలు నిర్వహించాలి అన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో నక్సలైట్ ఉద్యమానికి ప్రతి చోట కుల సమస్య ఎదురైందని, ఉద్యమాలు స్తంభనకు గురయ్యాయని చెప్పారు. ఇంకొకవైపు ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో రాజ్ నం ద్ గామ్ లో శంకర్ గుహ నియోగి ఒక విశిష్టమైన, సమగ్రమైన, సామాజిక ఉద్యమాన్ని నిర్మిస్తున్నారు. దాన్ని ప్రత్యక్షంగా చూసాము. ఉద్యమ నాయకత్వమే హాస్పిటల్స్ ను, స్కూళ్లను కమ్యూనిటీ హాళ్లను నిర్మింపచేసింది. మద్యపాన నిషేధాన్ని అమలు జరిపింది. భిలాయి ఉక్కు గని కార్మికులను సంఘటిత పరిచింది. వారి జీత భత్యాలు, జీవన ప్రమాణాలు పెరగడానికి కృషిచేసింది. మహిళల పట్ల వివక్షను నిర్మూలించడానికి మహిళా కమిటీలను వేసింది. ఇలా నిర్దిష్ట ప్రాంతంలో వర్గ సామాజిక విప్లవాన్ని, సమగ్ర సామాజిక వికాసాన్ని ఒక ఉద్యమంగా కొనసాగిస్తున్నారు. అది నన్ను బాగా ఆకర్షించింది. అలా అఖిల భారత పర్యటనతో బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్టు జ్ఞానోదయమైంది. అప్పటినుండి సమస్త వర్గ కుల లింగ జాతి మత భాష వివక్షతలు, అసమానతలు దోపిడీ అణచివేతలకు వ్యతిరేకంగా సమగ్ర సామాజిక వికాసమే సమగ్ర సామాజిక విప్లవంగా కొనసాగించాలని అవగాహనకు వచ్చాను. ఈ అవగాహనతో మార్క్సిజమ్, లెనినిజం, మావో ఆలోచనా విధానంతో పాటు వాటి వ్యూహం ఎత్తుగడలు కార్యక్రమాలన్నింటిలో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయని గమనించాను. వాటిని మార్క్స్, ఏంజిల్స్ లాగానే తత్వశాస్త్రంలో భాగంగా చర్చించడం అవసరమనిపించింది. దాంతో మార్క్సిస్టు తత్త్వ శాస్త్రాలను పున రధ్యయనం చేశాను. సిపిఐ, సిపిఎం విప్లవకారులంతా గతి తార్కిక ఆర్థిక వాదము, గతి తార్కిక భౌతిక వాదము, గతి తార్కిక చారిత్రక వాదము, ఇట్లా ఆర్థిక పరమైన, రాజకీయ పరమైన విషయాలతో పాటు ప్రపంచ పరిస్థితులను గురించి మాట్లాడుతారు. రష్యా, చైనాల్లో లాగా మనదేశ ప్రజలు ఒక వర్గానికి చెందినవారు కారు. ఇక్కడ కుల మత వ్యవస్థలున్నాయి. మరి మనుషులంతా సమానమేనని చెప్పడానికి ఈ ఉద్యమంలో ఏముంది? ఆర్థికం మారితే అన్నీ మారతాయని వాళ్ళ సిద్ధాంతం. మనదేశం ఆర్థికంగా, సాంఘికంగా ఒక్కటేనని చెప్పుకున్నా కులమనేది మూలసూత్రంగా ఉంటుంది. మనిషి హావభావాలు, వేషధారణ, భాష, ప్రవర్తన కూడా కుల సంస్కృతిని సూచిస్తాయి. ఇవన్నీ అణచివేతకు గురవుతున్నాయి. విప్లవం పేదలనుండే వస్తుంది కానీ నాయకత్వం దగ్గర వివక్ష ఏర్పడుతుంది. దీన్ని బట్టి సిద్ధాంత లోపం ఉన్నట్లే కదా! 70 , 80 ఏళ్లనుండి బిసిలు,ఎస్సీ, ఎస్టీలు జెండాలు మోసేవాళ్లుగా, లాఠీ దెబ్బలు తినేవాళ్లుగానే మిగిలి పోతున్నారు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ విషయం. అందువల్ల తత్వశాస్త్రంలో వ్యూహం, ఎత్తుగడల్లో లోపం ఉందని గమనించాను. మార్క్స్ వద్ద ఆగిపోకుండా ప్లేటో, అరిస్టాటిల్, బుద్ధుడు, నాగార్జునుడు, కాంట్, హెగెల్ తత్వశాస్త్ర అధ్యయనం చేయడం జరిగింది. అలా గతి తర్కం యొక్క మౌలిక సూత్రాలను విస్తారంగా చర్చించడం జరిగింది. నేను చదివిన మేరకు ప్రపంచంలో ఈ కోణంలో చర్చించిన మొదటి పుస్తకం ఇదే. ఈ పుస్తకం వచ్చిన తరువాత అన్ని పార్టీలు, సాహిత్య ఉద్యమాలు తమను సవరించుకున్నాయి. మార్చుకున్నాయి.
11. తెలంగాణ ఉద్యమంలో మీరు నిర్వహించిన పాత్ర చాలామందికి తెలియదు. అంతర్గతంగా మీరు నిర్వహించిన పాత్ర ఎటువంటిది?
జ :- మలి తెలంగాణోద్యమం 1995 నుండి ప్రారంభమైంది. 1996 నుండి తెలంగాణోద్యమంలో ముందుగా భాష, సంస్కృతులను తీసుకున్నాం. తర్వాత ఉద్యోగాలు, పదవులు, పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ పాఠ్యాంశాలను ప్రవేశపెట్టడం మొదలైనవి తీసుకున్నాం. రాష్ట్రవ్యాప్తంగా సెమినార్లు నిర్వహించాం. బిసి, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరగడం లేదన్నది ప్రధానంగా తీసుకున్నాం. 1969లో తెలంగాణ ఉద్యమం రావడానికి కారణం మన ఉద్యోగాలు మనకు రావడం లేదని. అందుకే ‘ఆంధ్రా గో బ్యాక్’ అన్నారు. 40 ఏళ్ళలో 40,50 కార్పొరేషన్లు పెట్టి వాళ్లే ఉద్యోగాలు సంపాదించుకున్నారు. వాళ్ళను వెనక్కి పంపితే గానీ ఇక్కడ ఖాళీలు ఏర్పడవు. అందువల్ల వారిని శాంతియుత పద్ధతిలో ఆంధ్ర ప్రాంతంలో ఏర్పడే ఖాళీల్లోకి బదిలీ చేయాలి. వీళ్ళు వెళ్లాలంటే సీనియారిటీ పోతుంది. వాళ్లకు పే ప్రొటెక్షన్, ప్రమోషన్ ప్రొటెక్షన్ ఇస్తూ ఆర్డర్ ఇస్తే ఇక్కడ పోస్టులు క్రియేట్ అవుతాయి.తద్వారా మనకు న్యాయం జరుగుతుంది. అని చెప్పడం జరిగింది. రచయితలుగా, కళాకారులుగా మేమంతా దాన్ని ప్రతిపాదించాం. చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఆధునిక విద్యను అందుబాటులోకి తేవడం, ఇక్కడ కాలేజీలను పెంచడం ఇవన్నీ ఎజెండా. నీళ్ళలో వాటా, ఉచిత కరెంటు నినాదాలు కూడా ముందుకు వచ్చాయి. దళిత బహుజన వర్గాల సంక్షేమాన్ని కాంక్షించే దిశగా ఉద్యమం సాగింది. అధిక శాతం ప్రజలు వీళ్ళే కాబట్టి విద్య, వైద్యం, ఉద్యోగం, ఆ తరువాత గృహవసతి. తాగునీటి సమస్య వ్యవసాయ భూమి ఉన్నవాళ్ల సమస్య. వాళ్ళు”నీళ్లు, నిధులు, నియామకాలు”, అనే నినాదం, దుబాయి, బొంబాయి, సింగరేణికి కూలీలుగా వెళ్ళే వలసలు ఆగాలని ” “దుబాయ్, బొంబాయ్, బొగ్గుబాయ్” అనే నినాదం ముందుకు వచ్చింది. 1996 నుండి 2001 వరకు రాష్ట్రసాధన కొరకు 42 సంఘాలు ఏర్పాటు అయ్యాయి. గద్దర్, పాశం యాదగిరి, గూడఅంజయ్య, గోరేటి వెంకన్న, అందెశ్రీ, మొదలైన వాళ్ళతో కలిసి ముందుకు సాగాము.
2001వ సంవత్సరంలో టిఆర్ ఎస్ ఆవిర్భావం జరిగింది. ఉద్యమం రాజకీయ ప్రయోజనం ప్రాతిపదికగా మారింది. అయినా మేము ఊరుకోకుండా బిసి, ఎస్సీ, ఎస్టీల కోసం గురుకుల పాఠశాలలు ప్రవేశపెట్టడం మొదలైన వాటి గురించి కృషి చేశాం. ప్రతీ నెల ఒక పుస్తకం తీసుకు రావాలనుకున్నాను. ప్రజల్లో చైతన్యం రావాలన్నది ప్రధానంగా పనిచేశాం. 1969 లాంటి ఉద్యమం మళ్ళీ జరగాలన్నదే మా ధ్యేయం. అదీ శాంతియుతంగానే. ఎప్పటికప్పుడు ఉద్యమ తీరులను సమీక్షించుకుంటూ, క్రియాశీలక మార్పులను చేసుకుంటూ ముందుకు నడిచాం. మన తెలంగాణ సాహిత్యం, ఉద్యమ సిద్ధాంతాలను తెల్పుతూ ఎన్నో పుస్తకాలను తీసుకొచ్చాం.
12. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వ చైతన్యం కొరకు మీరు రాసిన ‘కొత్తచరిత్ర’ పుస్తకంలో కీలకమైన అంశాలేవి?
జ :- తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొన్ని వందల వ్యాసాలను రాయడం జరిగింది. అంటే ఈ కొత్త విజన్ ఎలా ఉండాలో, దానికి సంబంధించి నూతన ప్రణాళికలను గురించి మేము చర్చించిన విషయాలను, కేసీఆర్ చేయాలనుకున్న నూతన మార్పులను అన్నింటినీ అయిదు పుస్తకాలుగా వేయడం జరిగింది. అందులో మొదటి పుస్తకం ‘కొత్త చరిత్ర’ రెండవది ‘బంగారు తెలంగాణ’, మూడవది ‘తెలంగాణ విజన్ దేశానికి దిక్సూచి’, నాల్గవది ‘కొత్త సిలబస్’, ఐదవది ‘ఇండియాలో ఫెడరలిజమ్’..కొత్తరాష్ట్రంలో కొత్త విజన్ తో ముందుకు సాగి సమర్థవంతంగా ఆచరణ చేయ గలిగితే దేశానికి ఆదర్శంగా నిలుస్తుందనేది వాటి అంతస్సారం. తెలంగాణ ప్రభుత్వం 416 దాకా ప్రణాళికలను ప్రవేశపెట్టింది. అందులో కొన్నయినా అమలు అవుతాయన్న ఆశ. అయితే ప్రవేశపెట్టడం మాత్రమే జరిగింది. కానీ అమలు చేయలేదు. పైగా అవినీతి, ఆస్తులు పెంచుకోవడం మొదలైన స్వార్థ ప్రయోజనాలను ఎప్పుడైతే ఆశించారో 50 ఏళ్ళ ఉద్యమ ఫలితాలు ప్రజలకు అందలేదు. అట్లాంటి వాటన్నిటినీ చూపిస్తూ ఈ పుస్తకాల్లో విమర్శలు కూడా రాశాను. మంచి జరగలేదని అనను. కానీ ఉద్యమ ఫలితమైతే పూర్తి స్థాయిలో అందలేదు. ఉద్యమకారులకు సరైన న్యాయం జరుగలేదు. కేవలం రాజకీయ నాయకులకు ప్రయోజనం చేకూరింది. అస్సాం వంటి ఇతర రాష్ట్రాల్లో విద్యార్థులు, యువకులు, లెక్చరర్లే మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారు. ఇక్కడ ఆ అవకాశం కొద్దిమందికే దక్కింది.
13. ఇప్పటి వరకు మీ లేఖిని నుండి వెలువడిన పుస్తకాలెన్ని?
జ :- నా రచనలు మొత్తం 120 పుస్తకాలుగా వెలువడ్డాయి. వాటిలో కథలు, నవలలు 21,తత్త్వ శాస్త్రానికి సంబంధించినవి 17, రాజకీయాలు, వ్యక్తిత్వ వికాసానికి చెందినవి 14, అలంకారశాస్త్రాలు, బిసిల గురించి రాసినవి 9, తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలు, చరిత్ర, సంస్కృతికి, రాష్ట్రసాధనకు సంబంధించినవి 42 ఉన్నాయి. మూడు వందలకు పైగా పుస్తకాలకు పీఠికలు రాశాను. సాహిత్య చరిత్రను కొత్తమలుపుతో ఎలా చూడాలని తెలంగాణ దృష్టితో, బిసిల దృష్టితో, తెలంగాణ సాహిత్య చరిత్రను పునర్మూల్యాంకనం చేయడం జరిగింది. అట్లాగే తెలంగాణ కథ, అస్తిత్వం మీద రాయమని సి. నారాయణ రెడ్డిగారు అడిగారు. తెలంగాణ కథల్లో, నవలల్లో తెలంగాణ అస్తిత్వం ఎలా ఉందో దాని గురించి పుస్తకం వేశాను. ఆర్థిక విషయాలను దృష్టిలో పెట్టుకొని అర్థశాస్త్రం మీద రాశాను. స్వీయచరిత్ర కూడా 5 భాగాలుగా రాశాను. 1982 డిసెంబర్, అంటే ఎన్టీ రామారావు ఎన్నికల ప్రచారం చేస్తున్నంతవరకు స్వీయచరిత్ర పూర్తయింది. ఇప్పటికే 1200 పేజీలు అయింది (నవ్వుతూ). మిగతాది పుస్తకరూపంలో రావాల్సి ఉంది. ఉపన్యాసాలివ్వడం, సామాజిక ఉద్యమాలను ఆర్గనైజ్ చేయడం, విప్లవోద్యమంలో పాల్గొనడం, ఇట్లా నా జీవితమంతా పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుండి సామాజిక కార్యకలాపాలతోనే సహవాసం చేశాను. అందువల్ల నేను రాయదలచుకున్న దాంట్లో పదిశాతమే రాయగలిగాననుకుంటున్నా. శరత్ బాబు, ఠాగూర్, మున్షీ ప్రేమ్ చంద్ వీళ్ళలాగా నిరంతరం రాయాలి. కానీ సమాజం, చరిత్ర, ఉద్యమాలు నాకా అవకాశం ఇవ్వలేదు. అన్యాయాన్ని, వివక్షతను ఎదిరించే క్రమంలోనే సమయమంతా గడిచిపోయింది. అందువల్ల తపన ఉన్నా రాయలేకపోయాను.
14. సాహిత్య చరిత్రలో మార్పు తేవాలనుకున్నారు కదా! తీసుకురాగలిగారా?
జ :- కచ్చితంగా వచ్చింది. అన్నింటికన్నా ముఖ్యంగా సాహిత్య చరిత్రను మలుపు తిప్పాలనుకున్నాను. తిప్పాను కూడా. సామాజిక, తాత్విక, సాంస్కృతిక రంగాలలో నూతన కోణాలను ముందుకు తేవడం జరిగింది. మొత్తం సమాజం ఆమోదించింది. 1970 దశాబ్దం విరసం దశాబ్దం.1980-90 వరకు మహిళా దశాబ్దం. 1990 నుండి దళిత బహుజన దశాబ్దం. భారతదేశంలో కులమనేది ఒక వాస్తవం. ఆ కుల సంస్కృతులు పుట్టుక నుండే అలవడుతాయి. అందుకే నేను అలంకారశాస్త్రం రాశాను. ఒక కుటుంబం గురించి కథ రాసినా, నవల రాసినా, సినిమా తీసినా అది తప్పక ఏదో ఒక కులానికి చెందినదై ఉంటుంది. అలాగే దళితులు రాసినటువంటి రచనలు వాళ్ళ కులవృత్తులకు, వారి సంస్కృతులకు సంబంధించినవే ఉంటాయి. ఎప్పటివరకైతే కులం అనేది ఉంటుందో అప్పటివరకు కుల సంస్కృతులు, భాష, ఆహార్యం, జీవనవిధానం ఇవన్నీ ఉంటాయి. చైతన్యం పెరగకపోతే అదే సంస్కృతి కొనసాగుతూ ఉంటుంది. ఆర్థికంగా మెరుగుపడినా పాత సంస్కృతిలో మార్పు రాకపోగా విస్తరించింది. దాన్ని మార్చాలి. ఆ దిశగా చైతన్యులను చేయాలి. అందుకే ఆర్థిక విప్లవం కన్నా భావజాల విప్లవం కోసం కృషి చేశాను. సమస్త వర్ణ, వర్గ, కుల, లింగ, జాతి, మత, ప్రాంత, భాష వివక్షతలకు, అసమానతలకు వ్యతిరేకంగా స్వేచ్ఛ, సమానత్వం కోసం సామాజిక, సాహిత్య , తాత్విక రంగాల్లో కృషి చేస్తున్నాను. భారత రాజ్యాంగ మౌలిక లక్షణం కూడా అదే కదా! మనం ప్రపంచ సాహిత్యాన్ని చదువుతున్నాం. మన భారతీయ సాహిత్యాన్ని, తెలుగు సాహిత్యాన్ని వాళ్ళెందుకు చదవడం లేదు? అందుకే నేను కొన్ని అనువాదాలు చేయించాను. నేను అమెరికాకు వెళ్ళినప్పుడు ఎన్నో పుస్తకాలు చదివాను. అక్కడి జీవితాన్ని కళ్ళారా చూశాను. మన సాహిత్యం వాళ్లకు అంటదని అర్థమైంది. వాళ్లు ఉమ్మడి కుటుంబాల జీవితాలను వదిలేసి వందేళ్ళ పైన అయింది. వాళ్ళకు కులాలు, కుల వృత్తులు లేవు. అందుకే మన పరిస్థితుల కనుగుణంగానే సిద్ధాంతం తయారవ్వాలి. లక్ష్యాలు ఏర్పడాలి. అందుకే అటువంటి సాహిత్యం రాయాల్సి వచ్చింది.
15. ‘విశాల సాహిత్య అకాడెమీ’ ద్వారా మీరు చేస్తున్న కృషి మరికొంత వివరించండి.
జ :- మేము విప్లవ రచయితల సంఘంలో పని చేసినప్పుడు మా పుస్తకాలను అచ్చు వేసుకోవడం కోసం ‘హైదరాబాద్ బుక్ ట్రస్ట్’ స్ఫూర్తితో కరీంనగర్ బుక్ ట్రస్ట్ పేరు పెట్టి ‘నా బతుకు పోరు’ నవలని, అల్లం రాజయ్య ‘భూమి’ కథల సంపుటిని అచ్చు వేయడం జరిగింది. సింగరేణి కార్మికుల ‘సింగరేణి కథలు’ అచ్చు వేశాం. ‘అడవిలో వెన్నెల’ పేరుతో గిరిజనుల కథలను కూడా అచ్చు వేశాం. నేను అజ్ఞాతంలోకి వెళ్ళాక దాన్ని ఎవరూ ముందుకు తీసుకు వెళ్ళలేదు. 1990 లో నేను బయటకు వచ్చాక ‘విశాల సాహిత్య అకాడెమీ’ పేరుతో తిరిగి ప్రచురణలు ప్రారంభించాను. నా పుస్తకాలతో పాటు 75 ఇతరుల పుస్తకాలు కూడా వేశాం. ప్రతీ ఏటా విశాల సాహితీ పురస్కారాలు కూడా ఇస్తున్నాం. వందలాది మంది వాటిని అందుకున్నారు. మా కాలంలో మమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు అలాంటి దుస్థితి ఎవరికీ రాకూడదని శిక్షణా తరగతులు, చర్చలు, సదస్సులు నిర్వహించాం. వారి రచనలను సవరించి చక్కగా ముద్రించి ప్రోత్సహిస్తూ వస్తున్నాం.
16. ‘నడుస్తున్న గ్రంథాలయం’ గా మిమ్మల్ని అభివర్ణించిన గొల్లపూడి మారుతీరావు సాహిత్య సంచికలో మీ ‘బతుకు పయనం’ కథ ఎంపిక కావడం పట్ల ఎలాంటి అనుభూతి చెందారు?
జ :- హెచ్ ఎమ్ టి వి లో ప్రసారమైన ‘నూరేళ్ళ కథ’ అనే శీర్షికను గొల్లపూడి వారు నిర్వహించారు. నేను ఏ కథ ఇవ్వాలా? అని ఆలోచించాను. విభిన్న తరహాలో ప్రత్యేకంగా ఉన్న దానిని తీసుకోవాలి అనుకున్నాను. ‘బతుకుపయనం’ ఒక బట్టలు నేసే పద్మశాలీ సామాజిక వర్గం నుండి ఒక యువకుడు బిటెక్ చేసి, అమెరికాకు ఎట్లా పోగలిగాడో చెప్పే ఒక పరిణామాన్ని
ఆవిష్కరించిన కథ బాగుంటుందనుకున్నాను. . అత్యంత పేదరికం నుండి అత్యున్నతస్థాయి ఉద్యోగం చేసే విధంగా అతని బతుకుపయనం ఎట్లా సాగిందో వివరించే కథ. అందులో బిసిల సంస్కృతి, ఆలోచనలు, పెళ్ళిచూపులు, పెట్టుబడులు మొదలగు ఎన్నో విషయాలుంటాయి.
విశాలాంధ్ర వారి ‘నూరేళ్ళ తెలంగాణ కథ’ పుస్తకంలో నేను రాసిన ‘దక్షయజ్ఞం’ కథ చేర్చారు. దీన్ని నేను ఎంపిక చేసుకోవడానికి కారణం కూడా విభిన్నంగా ఉండడమే. ఇందులో పీడితుల గురించి రాశాను. అంటే ఈ రెండూ కూడా వైవిధ్యంగా ఉన్న కథలు. ఒక చైతన్య స్ఫూర్తితో ఈ రెండింటిని ఎంపిక చేశాను. గొల్లపూడి మారుతీరావు గారు మా ఇంటికే వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసి దాన్ని ప్రసారం చేశారు.
అసలు గొల్లపూడి నన్ను ఇంటర్వ్యూ చేయరనుకున్నాను. మేము తెలంగాణ తల్లి గురించి కొట్లాడుతున్న రోజులు. ఆయనేమో తెలంగాణ తల్లి ఉంటుందా? అంటూ విమర్శ వ్యాసం రాసిన వ్యక్తి (నవ్వుతూ). కలిసి మాట్లాడిన తర్వాత ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు. నా ఆలోచనా దృక్పథం ఆయనకు అర్థమైంది. “ఈ పుస్తకాన్ని గొప్పగా తీర్చిదిద్దాలనుకుంటున్నాను. సహకరిస్తారా? అని కూడా అడిగారు. ఎంతో సంతోషం కలిగింది. ‘వందేళ్ల కథ’ గొప్ప పేరు తెచ్చుకుంది. గొప్ప క్లాసిక్ అది. అటువంటి వాటిల్లో చరిత్ర, సాహిత్యం, సంస్కృతి ఉంటాయి. ఆంధ్రజ్యోతి పత్రిక వాళ్ళు వేసిన ఇట్లాంటి పుస్తకం మరొకటి కూడా గొప్ప పేరును పొందింది. అలాగే వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ సంపాదకత్వంలో 1990 నుండి వెలువరించిన కథా సంకలనాలను రెండు సంపుటాలుగా పునర్ముద్రించారు. అందులో మెరుగు అనే కథ చేర్చుకున్నారు. చీకోలు సుందరయ్యగారు ‘నిచ్చెన’ కథాసంకలనంలో పాలు కథ తీసుకున్నారు. దళిత కథలు ఎనిమిది సంకలనాలు తెచ్చిన డా. కె. లక్ష్మి నారాయణ ‘బందీ’ కథ మొదలుకొని అనేక కథలను సంకలనంలో చేర్చారు. నేను, వనమాల చంద్ర శేఖర్ సంపాదకత్వంలో వెలువరించిన కరీంనగర్ జిల్లా కథలు నాలుగు సంపుటాల్లోను ‘భారతీయ సాహిత్యం- తెలుగు కథలు’ అనే సంకలనం లోను మరికొన్ని కథలను చేర్చడం జరిగింది. ఇలా ఆయా సంకలనాల్లో సామాజిక చరిత్ర పరిణామాలను విస్తృతంగా ప్రతిఫలించే కథలను సూచించడం జరిగింది. ఇంకా అనేక సంకలనాల్లో కథలు చేర్చుకోబడ్డాయి. ‘కథాసాగర్’ సంకలనంలో ‘సదువు’ కథను చేర్చారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారి సంకలనంలో ‘అడవిలో వెన్నెల’ కథ చేర్చారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ అచ్చువేసిన కథా సంకలనాల్లో ‘అడవిలో వెన్నెల’ కథ మొదటిసారిగా అచ్చు వేశారు. తర్వాత అనేక సంకలనాల్లో దీన్ని చేర్చారు. కేంద్ర సాహిత్య అకాడమీ తరఫున ప్రచురించే ఇండియన్ లిటరేచర్ అనే పత్రికలో ‘రియల్ ఎస్టేట్’ అనే కథను ఎంపిక చేసి ప్రచురించారు.
17. మీ కథా వస్తువు శైలీ శిల్పం లోని ప్రత్యేకతను, పరిణామ క్రమాన్ని వివరించండి.
జ :- నా కథా వస్తువులో కాలానుగుణంగా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నా కథలపై 6 ఎమ్ ఫిల్స్, 2 పి హెచ్ డి లు వచ్చాయి. దాంట్లో కథల గురించే కాక కాలక్రమానుగతమైన దశల గురించి, శిల్పంలో క్రమేణా వచ్చిన దశల గురించి వివరించారు. అట్లాగే నా సాహిత్యం మీద ఒక సెమినార్ జరిగింది. వాటన్నిటి సారాంశం ….ఇలా చెప్పుకోవచ్చు.
1.1977 నుండి ప్రారంభదశ, 2. 1980- 1990 విప్లవ సాహిత్యం 3.1990-1995 బహుజన సాహిత్యం 4. 1996-2000 మానవ సమాజ పరిణామం 5. 2001-2005 తెలంగాణ ఉద్యమ ప్రాధాన్యత 2006 నుండి పై అన్ని దశల పరిణామాలు, విశ్లేషణ, సామాజిక పరివర్తన చిత్రణ.
ఇలా కథల వస్తువుల్లో శైలీశిల్పంలో అనేక మార్పులు జరిగాయి. మొదటగా జీవితంలో కష్టాలు, కన్నీళ్ళ గురించి రాశాను. 1980-90 వరకు రాసిన కథలన్నీ విప్లవానికి సంబంధించినవి. అన్యాయానికి, అణచివేతకు గురవుతున్న వారి గురించి రాశాను. విప్లవ సంఘాలు, నక్సలైట్లు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉద్యమకారులు, పౌరహక్కుల సంఘాలు, బిసి,ఎస్సీ,ఎస్టీలు ఇలా అనేక విభాగాలకు సంబంధించిన వారి గురించి రాశాను. విప్లవ కథలతో 1991లో ‘పాలు’ కథల సంపుటి వెలువడింది. ఇది ఆంధ్ర యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలలో ఎమ్ ఏ విద్యార్థులకు పాఠ్య గ్రంథం. ఆతర్వాత మరికొన్ని కథలు కలిపి ‘ఇతర కథలు’ సంపుటి తెచ్చాను. అలాగే విప్లవ కథలతో 2004 లో ‘తేనెటీగలు’ కథల సంపుటి వేశాను. ఆతర్వాత 2013లో అంతదాకా దొరకని కథలు సేకరించి ‘అడవిలో వెన్నెల’ కథా సంపుటి వేయడం జరిగింది. ఇందులో మారుతున్న విప్లవం పట్ల మారిన నా భిన్నమైన అభిప్రాయాలతో ముందుమాట రాశాను. ‘ఉద్యమం ఉద్యమం కోసం కాదు. జీవితం గెలవడం కోసం’ అని కథలు రాశాను. విద్య యొక్క ప్రాధాన్యత, విద్యావ్యవస్థ తీరు, కుటుంబ వ్యవస్థ పరిణామాలు, ప్రాజెక్టులు తెచ్చిన పరిణామాలు, అభివృద్ధి తెచ్చిన పరిణామాలు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, వాటి పరిణామాలు మొదలైనవి కథల్లో నవలల్లో చిత్రించాను. కథల్లో జీవితంలో గెలుచుకున్న విధానాన్ని చూపించాలి కానీ ఓడినట్లు చూపించొద్దని నా అభిప్రాయం. మొదటినుండీ వివక్ష ఎలా ఉంది? దానిని ఏ విధంగా దూరం చేయాలి? సమసమాజ నిర్మాణానికి ఏం చేయాలి? ఇదీ కథల్లో చూపించాల్సింది. దీన్ని ‘సోషలిస్టు వాస్తవికత’ అంటారు. అనగా జీవితం ఎలా వుందో చెప్పడంతో పాటు, ఎలా ఉంటే బాగుంటుందో కూడా చిత్రించాలి. ఏం జరిగింది? ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? ఎక్కడ జరిగింది? ఆ పరిణామం ఎందుకు అనివార్యమైంది? అనే విషయాలు అన్ని కథల్లో చిత్రించగలిగితే ఆ కథా వస్తువు శైలీ శిల్పం ప్రారంభం, ముగింపు చక్కగా కుదిరితే అది గొప్ప కథ. ఇలాంటి కథలు క్లాసిక్స్ గా ప్రతిభాషలో ప్రపంచ సాహిత్యం లో కలకాలం నిలిచిపోతాయు. ఇదే విషయాన్ని ‘కథలబడి’ కథా సాహిత్యాలంకారంలో విశ్లేషించాను. నా కథల్లో వీలైన మేరకు వీటిని చిత్రించాను. ఆపిల్ ను కోసి ఎంత చిన్న ముక్క చేసినా దాని రుచి మారదు. అలాగే జీవితంలోంచి ఏ చిన్న అంశం తీసుకున్నా మొత్తం సామాజిక స్వరూప స్వభావాలు ఆపిల్ ముక్కలో ఉండే రుచిని చెప్పగలిగేటట్లు ఉండాలి. ఇదే విషయాన్ని నిర్వచించడానికి ‘సమగ్ర సామాజిక కథ’ అని పేరు పెట్టడం జరిగింది. ‘సమగ్ర సామాజిక కథ 50 ఏళ్ల తెలుగు కథ తీరుతెన్నులు’ పుస్తకాన్ని 2003 లో వెలువరించాను. 2004లో ‘సాహిత్య చరిత్రను కొత్త చూపుతో తిరగ రాయాలి’ అనే పుస్తకాన్ని ప్రచురించాను. ఇలా నేను కథల్లో, నవల అంత కథావస్తువును ఒక శైలీ శిల్పంతో కథలుగా మలిచాను. ఇదే మాటను విపుల, చతుర సంపాదకులు చలసాని ప్రసాద రావుగారు అడిగారు. మా తెలంగాణ కథలు, నవలలు అచ్చు వేయడానికి వివక్షతకు గురవుతున్నాయి. నిరంతర ఉద్యమాలతో చురుకైన పాత్ర నిర్వహించడం వల్ల సమయం సరిపోవడం లేదు. ఒకపేజీ కథ రాసుకొని రెండు గంటల సినిమా తీస్తున్నారు. వంద ఏపిసోళ్ల టివి సీరియల్ తీస్తున్నారు. ఈ నాలుగు కారణాల వల్ల కథ వస్తువు ఇతివృత్తం ఎంత విశాలమైనదైనప్పటికీ కథలుగా, కథానికలు గా మలిచాను. ఇదే నా కథలోని కథా వస్తువు, శైలీ శిల్పం, ప్రెజెంటేషన్ ప్రత్యేకత. యువ రచయితలు పరిణతి పొందే క్రమంలో ఈ దశకు తప్పనిసరిగా ఎదగాలి. 1968 లో అచ్చయిన ‘జగిత్యాల కథ’ కూడా ఒక మొత్తం సమాజ పరిణామాన్ని కుటుంబ సంబంధాలను ఉమ్మడి కుటుంబం, వ్యక్తి కుటుంబసలుగా విడిపోతున్న తీరును చిత్రించిన కథే. అందుకే అలాంటి మార్పు కోసం నా కథలను కూడా దశలవారీగా, పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేసుకుంటూ చైతన్యాన్ని కలిగించేలా రాశాను.
18. మీ కథా కథనాన్ని విశ్లేషిస్తూ విహారి గారు రచించిన ‘నవ్య కథాశిల్పి- బిఎస్ రాములు’ పుస్తకంలోని విశేషాలు ఏవి?
జ :- కథా వస్తువు ఎవరిది? ఆ పాత్రలు, సంఘటనలు ఎవరివి? ఎవరి జీవితం గురించి రాశారు? వీటిని వివరిస్తూ ‘నవ్య కథా శిల్పి-బిఎస్ రాములు’ అని సుప్రసిద్ధ సాహితీ వేత్త విహారి గారు ఎంతో ప్రేమతో ఆ పుస్తకం రాశారు. కాలం తెచ్చిన మార్పు, గెలుచుకున్న జీవితం, చికాగోలో నానమ్మ అనే మూడు కథా సంపుటాలను తమ పరిశీలనకు తీసుకున్నారు. ఆ కథల్లో ఏ ఏ వృత్తులున్నాయో వాటిని చిత్రించారు. మహిళల పట్ల, విద్యార్థుల పట్ల, బిసి ల పట్ల, చేతి వృత్తుల పట్ల సహానుభూతితో జీవితాలను, సంస్కృతిని చిత్రించారని ప్రతి కథ గురించి చక్కగా విశ్లేషించారు. అది ఒక రకంగా ఎమ్ ఫిల్, పి హెచ్ డి సిద్ధాంత గ్రంథంతో సమానమైనది. వారు విశ్లేషించిన తీరు, పరిణతి అనితరసాధ్యం . కథలు రాయడం నేర్చుకున్న తర్వాత మంచి కథలు రాయడానికి, గొప్ప కథలు రాయడానికి ఈ పుస్తకం తప్పక చదవాలి. అసలు అలాంటి వారికోసమే ఈ పుస్తకం విహారి గారు రాసినట్టున్నారు. నేను ‘కథలబడి’ లో కథారచనకు కథకుడి పాఠాలు అనే అలంకార శాస్త్రాలలో చెప్పిన అంశాలు, విశ్లేషణలు వీటి తరువాత ఇంకేం చెప్పాలో? ఇంకేం చదవాలో? అనే పరిశీలనా విశ్లేషణ విహారి గారు అందించారు.
19. సామాజిక తత్వవేత్తగా, రచయితగా, సాహితీ విమర్శకులుగా ప్రసిద్ధి పొందిన మీరు దేన్ని ఎక్కువ ఇష్టపడతారు? ఎందుకు?
జ :- మొట్టమొదట కథలు అచ్చులో చూసుకోవాలని కథలు రాయడం ప్రారంభించాను. తర్వాత ఎదిగిన క్రమంలో సిద్ధాంతాలను అధ్యయనం చేసి సమాజం, దేశం బాగుపడాలని ఆర్ ఎస్ ఎస్ లో చేరాను. మత ప్రాధాన్యత పెరగడం చూసి, బయటకు వచ్చాను. పేద ప్రజలకు మేలుచేయడం, సామాజిక న్యాయం కోసం విప్లవోద్యమంలోకి వచ్చాను. దాంట్లో తీరుతెన్నులు మారడంతో ఇలా కాదని బయటకు వచ్చాను. బిసి,ఎస్సీ, ఎస్టీలు అధికారంలోకి రావాలనుకున్నాను. దాని కంటే ముందు తెలంగాణ రావాలనుకొని తెలంగాణ రాష్ట్రోద్యమంలో ప్రవేశించాను. అన్యాయమైన మన ప్రాంతం గురించి ఆలోచన. అంటే నా భావజాలంలో మార్పు వచ్చింది కదా! దానికి ఎంత సంఘర్షణ జరిగి ఉండాలి? ఎంత సంఘర్షణ జరిగితే ఒక ఆస్తికుడు నాస్తికునిగా మారతాడు? ఎంత భావజాలంలో మార్పు వస్తే పురుషాధిక్యత నుండి స్త్రీ వాదాన్ని కొత్త కోణంలో అందించా గలుగుతాడు. ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతాలను, జాతీయోద్యమాన్ని, కాంగ్రెసును, ఆర్థిక శాస్త్రాన్ని, అంబేద్కరిజాన్ని అన్నింటినీ అధ్యయనం చేశాను. 1977 నుండి బౌద్ధ అధ్యయనం మొదలుపెట్టాను. సాంప్రదాయిక, వైదిక సాహిత్యం ఆర్ ఎస్ ఎస్ నుండి మొదలుకొని మొన్నటి విప్లవ సిద్ధాంతాల వరకు చేసిన అధ్యయనంతో తాత్వికత ఏర్పడింది. మా పెదనాన్న మిట్టపల్లి రాజయ్య 50 ఏళ్ళ పాటు అచలతత్వ గురువు. ఆయనకు మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాల్లో వేలాదిమంది శిష్యులుండేవాళ్ళు. బాల్యంలో ఆ ప్రభావం నామీద పడింది. “బౌద్ధం సోషలిజం మార్క్సిజం అంబేడ్కరిజం ప్రతీత్య సముపాద్య” అనే పుస్తకంలో రెండున్నర వేల ఏళ్లుగా సాగుతూ వస్తున్న సోషలిస్టు భావ పరిణామాన్ని, నిర్మాణాలను, అవగాహనలను వివరించాను. 11 వ శతాబ్ది వరకు బౌద్ధమే సోషలిజాన్ని ఏవిధంగా చూపించిందో రాస్తూ, అంబేద్కర్ భారత రాజ్యాంగంలో సమసమాజాన్ని, లౌకిక తత్వాన్ని, శాంతియుత పరివర్తన, సామాజికన్యాయం గురించి ఏమని చెప్పాడో క్రోడీకరించాను. మార్క్సిజం వెలికి తెచ్చిన అంశాలను వివరించాను. భావజాల పరిణామం లేకుండా మార్పు జరగదు. తాత్వికరంగంలోనే మొదట మార్పు రావాల్సి ఉంటుంది. అందువల్ల ఆ రంగంలో ఎక్కువ కృషి చేశాను. అది చదివిన వారు ఎదిగారు. వారి కథల్లో, నవలల్లో మార్పులు తెచ్చుకున్నారు. నా రచనల్లో తాత్వికత ఎక్కువ. అంతర్లీనంగా అన్నిచోట్లా అది కనిపిస్తుంది. అందుకు కారణం తాత్విక రచనలు చేయడమే. ఏక కాలంలో ఫిలాసఫీతో పాటు ఫిక్షన్ రాయడం అవసరమైంది. జీన్- పాల్ స్రాత్రే కూడా అలాగే రెండురాయాల్సి వచ్చింది. రెంటిలోను మేము విజయమే సాధించామని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
20. మీ జీవితంలో విభిన్న పార్శ్వాల్లో ఉన్న అంతస్సూత్రం ఏమిటి?
జ :- అనేక కోణాల్లో నేను కూడా ఈ ప్రశ్నను అనేక సందర్భాల్లో వేసుకున్నాను. ఈ పరిణామాల అంతస్సూత్రం, ఏక సూత్రత ఏమిటి? అని. మిత్రులు, సాహితీ వేత్తలు, నేను చర్చించుకున్నాం. సామాజిక న్యాయం ద్వారా సామాజిక మార్పు సాధించడం, అసమానతలు తొలగిపోయి వివక్ష వెలివేతలు నిర్మూలించబడి, సమస్త వర్ణ వర్గ కుల మత భాష వివక్షతలన్నీ తొలగిపోయి మనుషులందరు సమానమే. మానవులంతా ఒక్కటే. అనే మానవీయ దృష్టి ఈ పరిణామాలన్నింటిలోను కొనసాగిన అంతస్సూత్రం. అలా బౌద్ధ, హిందూత్వ, మార్క్సిజం, అంబేడ్కరిజం, బహుజన వాదం, స్త్రీ వాదం, మానవతా వాదం వీటి యొక్క సంశ్లేషణయే వీటన్నిటిలో కొనసాగిన పార్శ్వాలు. అభివృద్ధి చెందిన వారికి, అధికారాలు అందిన వారికి, అభివృద్ధి, అధికారం అందని వారికి, అందుకోలేనివారికి, అందుకోవాలనే విషయం కూడా తెలియని వారికి నిరంతరం అసమానతలుంటాయి. వాటిని పరిష్కరించు కుంటూ పోవడమే సోషలిజం. సమసమాజ నిర్మాణం, స్వేచ్ఛ సమానత్వం, సౌభ్రాతృత్వం అందరికీ సమాన హక్కులు, అవి అందుకోలేని వారికి ప్రత్యేక ప్రాతినిథ్య ఏర్పాట్లు రిజర్వేషన్లు మొదలైనవి. భారత రాజ్యాంగం ఈ మౌలిక అంశాలకు పెద్ద పీట వేసింది. భారత రాజ్యాంగం ప్రవేశికలోనే ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. బహుళ పార్టీ వ్యవస్థలో శాంతియుతంగా ఈ లక్ష్యాలను సాధించుకోవడమే భారత రాజ్యాంగం ఉద్దేశించబడింది. అందువల్ల రాజ్యాంగ పరిధిలో సాధించుకోవాల్సిన అన్నిటినీ ఎలా సాధించుకోవాలో చెప్పడం, నాయకత్వం వహించడం కర్తవ్యంగా స్వీకరించిన వారే ఈ దేశానికి నిజమైన నాయకులు, గురువులు. ప్రతీ మనిషికి ఒకే విలువ, ఒకే ఓటు అనే తాత్వికతకు సంబంధించిన తత్వశాస్త్రం ఇంకా పుట్టలేదు. ‘గతి తర్క తత్వ దర్శన భూమిక’, ‘బౌద్ధం సోషలిజం మార్క్సిజం అంబేడ్కరిజం’, ‘బహుజన తత్వం’, ‘అంబేడ్కరిజం-సోషలిజం’ మొదలైన తాత్విక రచనలు ఈ ప్రయత్నంలో వెలువడినవే. సామాజిక తాత్విక సాహిత్య రంగాలలో ఏక కాలంలో కృషి చేశాను. అందుకే ఈ మూడు రంగాలు నాకిష్టమైనవే. నా జీవితమంతా వీటి చుట్టూతా పెనవేసుకొని సాగింది.
21. బిసి కమిషన్ చైర్మన్ గా మీరు ప్రజల కోసం ఏ విధమైన పనులు చేపట్టారు?
జ :- బిసి కమిషన్ చైర్మన్ గా పని చేయడం జీవితంలో మరచిపోలేని ఒక మహత్తర అధ్యాయం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కలిసి పని చేసిన క్రమంలో నేను కేసీఆర్ ఎదురెదురుగా మూడవ వ్యక్తి లేకుండా వందల, వేల గంటలు కొన్ని సంవత్సరాల పాటు చర్చించుకున్నాము. మేము చర్చించని విషయమంటూ లేదు. “సాహచర్యంలో 6 నెలల్లో వారు వీరవుతారు. వీరు వారవుతారు” అని సామెత ఉండనే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నేను అనుకున్నదానికన్నా ఎన్నోరెట్లు ఉత్తమమైన బాధ్యతను అప్పగించారు. 3కోట్ల డెబ్భై లక్షల జనాభాలో రెండు కోట్ల 20 లక్షలు బిసిలే. బిసి కమిషన్ చైర్మన్ గా సగం ముఖ్యమంత్రితో సమానం అని కేసీఆర్ ప్రశంసించారు. బాధ్యత అప్పగించారు. బిసి కమిషన్ ఛైర్మన్ గా పదవీ స్వీకారం చేశాక చాలా విషయాలు కొత్తగా అర్థమైనాయి. ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో చాలా దగ్గరగా, సన్నిహితంగా చూడడం జరిగింది. ఛైర్మన్ అయిన తరువాత భాష మారింది భావ వ్యక్తీకరణ మారింది. సామాజికోద్యమాల్లో మాట్లాడినప్పుడు నా భాష వేరు. ప్రశ్నించడం, ఎదిరించడం ఉత్తేజపరచడం ఆనాటి పద్ధతి. బిసి కమిషన్ చైర్మన్ గా అప్పుడు వేటినైతే ఎదిరించానో దాన్ని పరిష్కరించే బాధ్యత ఏర్పడింది. అందువల్ల భాష కూడా మారుతుంది. కథల్లో, నవలల్లో, విమర్శలో, వ్యాసాలలో ఈ మార్పు గమనించవచ్చు. భారత రాజ్యాంగ విలువ తెలిసింది. ‘భారత రాజ్యాంగ ముఖ్యాంశాలు’ అనే పుస్తకం కూడా రాశాను. ఇతర రాష్ట్రాల బిసి కమిషన్ నివేదికలను అనువాదం చేసి ముద్రించడం జరిగింది. మండల కమిషన్, ఎమ్ ఎస్ జనార్దనం కమిషన్, అనంతరామన్ కమిషన్, మురళీధరరావు కమిషన్ మొదలైన వాటిని తెలుగు చేసి ప్రచురించడం జరిగింది. ‘భారత రాజ్యాంగం ముఖ్యాంశాలు’ పుస్తకంలో రాశాను. ఇంకా ఏం చేయాలి ముందు మాటలో రాశాను. వీటన్నింటినీ చూస్తే విప్లవంలో జరుగుతున్న లోపాలు మరిన్ని తెలిశాయి. విప్లవోద్యమాలు చేసేవాళ్లు ప్రతి ఒక్కరు కనీసం భారత రాజ్యాంగం గురించి వేసిన బుక్ చదివితే ఒక చక్కటి అవగాహన కలుగుతుంది. కమిషన్ ఛైర్మన్ గా అవగాహన, పరిణతి పెరిగి పరిభాష మారింది. ఏది రాసినా రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ను అనుసరించి రాయడం జరిగింది. అంతకుముందు ఛైర్మన్ గా పని చేసిన వాళ్ళను గురించి చదవడం, రాజ్యాంగాన్ని అధ్యయనం చేయడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. సాధికారికంగా ప్రజల దగ్గరకు వెళ్ళి వారి కష్టనష్టాలను తెలుసుకున్నాను. వాటికి సంబంధించిన నివేదికలు ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. అత్యంత పేదరికంలో ఉన్న 17 కులాలను గుర్తించి 14 కులాలను బిసి(ఎ) లో, 3 కులాలను బిసి(బి) లో చేర్పించడం జరిగింది. అన్ని రంగాలలో వారికి అవకాశాలకు అర్హత కల్పించాము. కొంతమంది మతం మార్చుకున్నప్పటికీ కులవృత్తులు మారలేదు. అటువంటి బిసి (ఇ) గ్రూపులో ని 14 కులాల వారికి రిజర్వేషన్ శాతం పెంచాలని ప్రభుత్వానికి నివేదిక అందించడం జరిగింది. దాన్ని మంత్రిమండలి ఆమోదించి కేంద్రానికి పంపింది. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు, నేను అనేక చర్చలు చేశాము. దేశంలోనే మన రాష్ట్రం ఆదర్శవంతంగా ఉండేలాగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణ పథకం గురించి చర్చించాము. అందులో రెండు బర్రెలను, ఇంటి వెనుక 100 వనరాజ, గిరిరాజ కోళ్లను పెంచుకుంటే. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. ఆ దృష్టి తో చర్చించాము. బలహీన వర్గ విద్యార్థులకు హాస్టళ్లకు బదులుగా రెసిడెన్సీ స్కూళ్ళు ఏర్పాటు చేయాలనేది నా 35 ఏళ్ళ కల. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఆ కల నెరవేరింది. ఇప్పుడు 1000కి పైగా రెసిడెన్షియల్ స్కూళ్ళు, కాలేజీలతో ఐదున్నర లక్షల మంది బాలబాలికలు చక్కని సౌకర్యాలతో నాణ్యమైన విద్య అందుకుంటున్నారు. వారికి రెసిడెన్సీ స్కూల్లో చేరగానే రెండు నెలల పాటు ఇంగ్లీషు మీడియంలో ఇంగ్లీషులో మాట్లాడే ఉచ్చారణ హాండ్ రైటింగ్ అందంగా కుదిరేలా రాయడం నేర్పుతారు. 9వ తరగతికి వచ్చేసరికల్లా పిల్లలు ప్రపంచ జ్ఞానాన్ని అందుకొని చక్కని వక్తలుగా ఎదుగుతున్నారు. ఇది ఒక గొప్ప కాంట్రిబ్యూషన్. తెలంగాణ తల్లి’ అస్తిత్వం ఉండాలని 8 నెలలు కష్టపడి అనేక రూపాలనుండి తెలంగాణ తల్లిని ప్రస్తుత రూపానికి తీసుకురావడం జరిగింది. ఉద్యమంలో ఉన్నప్పుడు చేయాలనుకున్నవి కొన్ని ప్రభుత్వంలోకి వచ్చాక సాధికారికంగా చేయడం జరిగింది. ప్రభుత్వంలో ప్రోటోకాల్స్ ద్వారా అత్యున్నత గౌరవాలు అందుకున్నప్పుడు కలిగే ఆనందం, పెరిగే బాధ్యత మనిషిని ఉన్నతీకరిస్తుంది. అలా గవర్నర్, ముఖ్యమంత్రి , మంత్రులు, ఐ ఏ ఎస్ అధికారులు వందలాదిమందిని కలుసుకొని చర్చించడం జరిగింది. పలు కుల సంఘాల నాయకులకు ఆయా రాష్ట్రాల బిసి కమిషన్ నివేదికల అనువాదాలను పంచి, ఉచితంగా వచ్చే సౌకర్యాలను వివరించడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బిసి కమిషన్ ప్రతిష్ఠను, ప్రాచుర్యాన్ని కలిగించడంతో పాటు గొప్ప స్ఫూర్తిని నింపింది. ఇలా ప్రభుత్వాన్ని ప్రభుత్వ పథకాలను ప్రజలకు సాన్నిహిత్యం చేయడం జరిగింది. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో బిసి ఉద్యోగులు, వారి శాతం, బిసిల కోసం పెట్టే నూతన పథకాల అవకాశాలు , ఉద్యోగాల ఖాళీలను ఎలా నింపుతున్నారు తెలుసుకోవడం జరిగింది. పారిశ్రామికీకరణ వల్ల యంత్రాల వినియోగం వల్ల లక్షలాదిమందికి ఉపాధి లేకుండా పోయింది. సుమారుగా 45 శాతం ప్రజలు ఉపాధి కోల్పోయి ఇతరుల మీద ఆధారపడి బతకడం జరుగుతున్నది. ఉన్న ఊరు వదిలి, ఇళ్లను వదిలి ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు skilled, un skilled labour గా వలస బతుకులు బతకాల్సి వస్తున్నది. వీరికి జిల్లా పరిధిలో ఉపాధి కల్పించే అవకాశాలు పెంచడం ఎలా? ఈ అంశాలను ప్రాతిపదికగా చేసుకొని 97 డిపార్టుమెంట్ల ఉన్నతాధికారులను, ప్రిన్సిపాల్ సెక్రెటరీలను పిలిచి మాట్లాడడం జరిగింది. అన్ని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్ లర్లను బిసి కమిషన్ కార్యాలయానికి పిలిచి విద్యార్థులలో బిసిలు, ఉద్యోగులలో బిసిలు,ఖాళీలు, ఉపాధికల్పనకు సంబంధించిన విషయాలను చర్చించడం జరిగింది. బిసి రిజర్వేషన్ కోటాను పాటించని వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆయా వ్యక్తులకు, సామాజిక వర్గాలకు సంబంధించిన విజ్ఞప్తులు వచ్చినప్పుడు వాటిని పరిశీలించి పరిష్కరించేలా కృషి చేశాము. ఆసరా పథకం, కళ్యాణలక్ష్మి, బీడీ కార్మికులకు ఆసరా, ఆర్ టి సి కార్మికుల సమస్యలు మొదలైనవెన్నో మా దృష్టికి వచ్చాయి. ఎప్పటికప్పుడు వాటిని ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. బిసిల చైతన్యం పెంచడంలో బిసి కమిషన్ నిర్వహించిన పాత్ర మహత్తరమైనది. అలా మూడేళ్లు బిసి కమిషన్ ఛైర్మన్ పదవీ కాలం జీవితంలో మరచిపోలేని అధ్యాయం.
22. సీనియర్ సాహితీ వేత్తలైన మీరు మా మయూఖ పత్రిక ద్వారా నేటి రచయితలకు ఏవైనా సూచనలు ఇవ్వండి.
జ :- నా సూచన ఏమిటంటే బాగా చదవాలి. ప్రజల జీవితాలను ప్రత్యక్షంగా పరిశీలించాలి. రాజకీయాలతో, ప్రభుత్వ నిర్ణయాలతో, సామాజిక ఉద్యమాలతో సైన్స్ అండ్ టెక్నాలజీతో, ప్రపంచీకరణ ప్రయివేటీకరణతో, ప్రచార, ప్రసార దృశ్య మాధ్యమాలతో, మానవ జీవితంలో, కుటుంబ సంబంధాల్లో సంస్కృతిలో , ఆలోచనల్లో , ఆశయాల్లో వస్తున్న మార్పులను పసిగట్ట గలగాలి. వాటిని కథల్లో నవలల్లో దృశ్య మీడియాలలో చిత్రించగలగాలి. బాధితుల, పీడితుల వైపు నిలబడి వారికి మద్దతుగా వారి ఆత్మవిశ్వాసం పెంచే విధంగా రచనలు చేయాలి. ఆత్మహత్యలు ఆగిపోయి, ఆ కష్టాలను అధిగమించి, జీవితాన్ని గెలుచుకోగలం అనే విశ్వాసాన్ని కలిగించాలి. నిరాశా నిస్పృహలు కలిగించే సాహిత్యం, భయపెట్టే సాహిత్యం, పిరికివారిని చేసే సాహిత్యం మంచి సాహిత్యం కాదు. వేల సంవత్సరాలుగా శూద్రులు, అతి శూద్రులు ఆదివాసులే సమస్త సంపదల సృష్టికర్తలు. సమస్త నైపుణ్యాలు వారు అభివృద్ధి పరచినవే. ఖనిజాలు, లోహాలు వెలికి తీశారు. కత్తులు, ఆయుధాలు, కోటలు ,దుర్గాలు దేవాలయాలను నిర్మించారు. సంగీతం, కళలు సామూహిక ప్రదర్శనలు వారు సృజించిందే. ఆధునిక పారిశ్రామిక అభివృద్ధి 1810 నుండి విస్తరించి వీరందరూ ఉపాధి కోల్పోతూ వస్తున్నారు. ఈ సమాజ సంపద సృష్టికర్తలు ఇవాళ వెనుకబడిన తరగతిలో వర్గీకరించబడ్డారు. వీరంతా దేశ జనాభాలో 70 శాతానికి పైగా ఉంటారు. వారికి విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి, ఉన్నత జీవన ప్రమాణాలు నూతన నైపుణ్యాలు అందించడం ప్రభుత్వంతో పాటు అందరి బాధ్యత. ఇవి ఏ మేరకు అందుతున్నాయో, అందలేక పోతున్నాయో కథల్లో, నవలల్లో చిత్రించినపుడే అవి సామాజిక వాస్తవికతను ప్రతిబింబిస్తాయి. నేడు ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఇంగ్లీషు కథలు, నవలలు చదవాలి. మంచి సినిమాలు చూడాలి. ఇప్పుడు నవలలకు ప్రాధాన్యత పెరిగింది. పాశ్చాత్య సాహిత్యంలో వాళ్ళు ఎలా రాస్తున్నారో తెలుసుకోవాలి. వాళ్ళవి ఎదిగిన జీవితాలు. అయినా శైలీ శిల్పం, జీవితాలను పరిశీలించే తీరు ఇవన్నీ గమనించాలి. రచయితలు ఒక కుటుంబానికి పరిమితం కాకుండా ప్రభుత్వాలు, పథకాలు, వాటి అమలు, చట్టం, న్యాయం, రాజకీయ పరిణామాలు, ఉద్యమాలను అవి మలువుతున్న తీరును రాయాలి. రచయితలు సామాజిక శాస్త్రాలను, ఆర్థిక శాస్త్రాలను చదవాలి. ప్రతి ఏటా కథలకు, నవలలకు ఎన్నో సంస్థలు బహుమతులు ఇస్తుంటాయి. అలాంటి భారతీయ రచనలను అంతర్జాతీయంగా ఇస్తున్న ‘బుకర్ ప్రైజ్’ గెలుచుకున్న రచనలను చదవాలి. సోవియట్ రష్యా, అమెరికా, యూరప్ సాహిత్యం చాలా గొప్పవి. ‘మొపాసా’ అనే ఫ్రెంచ్ రచయిత 150 ఏళ్ళ క్రింద రాసిన సాహిత్యం చదివితేనే ఇంత గొప్పగా ఎలా రాయగలిగారు? అనిపిస్తుంది. మరి మనం ఆ స్థాయికి ఎప్పుడు ఎదుగుతాం? ఇతర దేశాల్లో వ్యక్తి కుటుంబాలు ఉంటాయి. మన దగ్గర సమిష్టి కుటుంబాలు, కులాలు ఇవన్నీ ప్రాధాన్యం వహిస్తాయి. రచనల్లో ఆ ప్రభావం తప్పక ఉంటుంది. వాస్తవిక చిత్రణల్లో రచన చేయగలగాలి. డా. కేశవరెడ్డి ‘అతడు అడవిని జయించాడు’ అనే అద్భుతమైన నవలను రాశాడు. అది చదివినప్పుడు పందుల వెంట మనమే వెళ్తున్న భావన కలుగుతుంది. అంత చక్కగా పాఠకులను పాత్రలోకి సంలీనం చేయగలిగారు. ‘వేట’ కథ రాసిన అల్లం శేషగిరావు క్రూర మృగాలను గురించి వాస్తవాలు చిత్రించాడు. ఏం జరిగింది? ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? ఎక్కడ జరిగింది? అనివార్యం ఎందుకైంది? ఆ అనివార్యం ఎందుకైందో చెప్పడమే తాత్వికత. పాఠకులు పాత్రలతో మమేకమై పోవాలి. అందుకే ఆ స్థాయి రచనల కోసం మనం ప్రయత్నించాలి. ప్రపంచ భాషల సాహిత్యాన్ని మనం చదువుతున్నాం. “తెలుగు సాహిత్యాన్ని చదవాలి” అని ప్రపంచ దేశాలు వారి భాషల్లోనికి అనువదించుకొని చదవాలి. అనే ఆసక్తి కలిగినప్పుడు మన తెలుగు సాహిత్యం ప్రపంచస్థాయికి ఎదిగినట్టు లెక్క.