అవధాని శ్రీ ముత్యంపేట గౌరీశంకర శర్మ గారి తో ముఖాముఖీ- రంగరాజుపద్మజ
సాహిత్య ప్రయోజనం హృదయాన్ని స్పందింపచేయాలి.. సాహిత్య ప్రయోజనం జాతీయ ప్రయోజనమైనప్పుడు.. స్పందించే హృదయాలు సంస్కారాలను పెంచుకొని, మంచి పౌరులుగా తయారవుతారు. అలా ఉన్నతులైన వారు మరింతమందికి జీవిత విధానాలకు మార్గదర్శకులుగా .. సమాజానికి ప్రేరణ ఇచ్చేవారిగా చేయడం సాహిత్య లక్ష్యం!
సాహిత్యం పాఠకుని సంస్కారాన్ని పెంచే ప్రక్రియలో నూతనత్వం యొక్క అవసరాన్ని గమనించి ప్రతి తరంలో కవి పండితులు ఆయా ప్రక్రియలలో రచనలను సృష్టించారు… ఆ కోవలోనే చక్కటి పద్యాలను అవధానాల రూపంలో అందిస్తూ… అటు భాషామ తల్లికి, ఇటు సమాజానికి సాహిత్య సేవకులుగా.. అందిస్తున్న కవి పండితులు శ్రీ ముత్యంపేట గౌరీ శంకరశర్మగారు మన మయూఖ ద్వైమాసిక పత్రిక పాఠకుల ఆత్మీయ అతిథులు.
సామాజిక ప్రయోజనం లేని సాహిత్యం వ్యర్థమని పెద్దలు చెప్పే మాట ! దానితో నేను ఏకీభవిస్తూ..
ఆ దిశగా మన సాహిత్య ప్రక్రియలను బతికి బట్టకట్టిస్తున్న సృజన కారులను గౌరవిస్తూ… రేపటి తరానికి మార్గదర్శకులుగా చూపించాలనే చిరు ప్రయత్నమే ఈ ముఖాముఖి!! ఆస్వాదించండి!
అష్టావధాన కార్య మ
దృష్టముచే గాక యెట్లు దీర్పంగ వచ్చున్
కష్టమో సుఖమో యది యు
తృష్ణ మనుషులే యెఱింగి కీర్తింతురిలన్॥
మన తెలుగు సాహిత్య పరిణామంలో ఎన్నెన్నో ప్రక్రియలు రూపొందాయన్నది అందరికీ తెలిసిన విషయమే!
పరిచయమే అక్కరలేని ప్రముఖ అవధాని గారిని పరిచయం చేయడం మంటే రేపటి తరానికి ప్రేరణ కల్పించడానికే! ఈనాటి మన ముఖాముఖీన కార్యక్రమంలో
బహుముఖీన విద్యా విశారదులు, జంట అవధానులుగా తెలుగు రాష్ట్రాలలో పేరుపొందిన సంస్కృత అవధానులు ,
1,మహాకాళీ సుప్రభాతం ,2. శ్రీరామచంద్ర సుప్రభాతం, 3.శ్రీ శివానందోదాహరణం, 4.శ్రీనోరి నరసింహోదాహరణము, వంటి బహుపుస్తక గ్రంథకర్తలు, మాన్యులు ముత్యంపేట గౌరీశంకరశర్మగారు. శ్రీయుత గౌరవనీయులైన ముదిగొండ అమర్నాథశర్మ గారితో పాటు సంస్కృత- తెలుగు అవధానాల నెన్నిటినో అలవోకగా చేసిన కవి, పండితులు , సాహితీవేత్త గారి ముఖతః గా వారి సాహితీ యాత్ర గురించి తెలుసుకుందాము. పద్మజ. నమస్కారమండీ!
ముత్యంపేట గౌరీశంకర శర్మ:- నమస్కారం.
పద్మజ :- మీవంటి సరస్వతీ స్వరూపులకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రుల గురించి, మీ నేపథ్యం గురించి మయూఖ పాఠకులకు తెలియచేస్తారా?
గౌరీశంకర శర్మ: మా స్వగ్రామం లచ్చపేట, దుబ్బాక మండలం ॥సిద్దిపేట జిల్లా, మా తల్లిదండ్రులు నాగలింగ శాస్త్రి- రాజ్యలక్ష్మి గారలు. మా నాన్నగారు సంస్కృతాంధ్ర పండితులు. న్యాయ వేదాంతాయుర్వేదాభిజ్ఞ బిరుదు వారికి. వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. ఇద్దరు అక్కయ్యలు తర్వాత నేను, తమ్ముడు.
పద్మజ :- మీ విద్యాభ్యాసము, వృత్తి, ప్రవృత్తుల గురించి వివరిస్తారా?
గౌరీశంకర: నా విద్యాభ్యాసం మా నాన్నగారు సంస్కృత పండితులు కాబట్టి, నాకు కూడా సంస్కృతం నేర్పించాలనే ఉద్దేశంలో శ్రీ రాజరాజేశ్వర సంస్కృత పాఠశాల కళాశాల వేములవాడలో చేర్పించారు. ఆరవ తరగత నుండి బి ఏ ఎల్ వరకు పది సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా విద్యను పూర్తి చేశాను.సంస్కృతం,సాహిత్యం, తర్క, వ్యాకరణాలు, మొదలగు వాటితో పాటు ఈశ్వర గారి కిష్ఠయ్య ఘనాపాఠీ గారి దగ్గర వేదం కొంత భాగం నేర్చుకోవడం జరిగింది. మా కళాశాలలో మంచి విద్వద్దిగ్గజా ల్లాంటి గురువులు ఉండేవారు. ఆ తర్వాత భాగ్యనగరంలో తెలుగు M A సంస్కృతం MA phd చేసి, 2002లో ఉద్యోగం లభించింది వృత్తిపరంగా వైదిక కార్యక్రమ నిర్వహణం.
పద్మజ : ఉపాధ్యాయ వృత్తిలో ఏవైనా పురస్కారాలు అందుకున్నారా? విశిష్ట సేవలందించినందుకు బిరుదులు గానీ పొందారా?
గౌరీశంకర : వృత్తిలో 2014లో జిల్లా స్థాయి [మెదక్] ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, తెలుగు మహాసభలలో అవధానంలో [మహబూబ్ నగర్] లో అవధాన తిలక అనే బిరుదునిచ్చారు. అలాగే శ్రీశైల పీఠం ఆస్థాన పండితుడిగా, శ్రీ పుష్పగిరి పీఠానికి కూడా ఆస్థాన పండితులుగా శ్రీ విద్యా శంకర భారతి స్వామి వారు నియమించడం నా సుకృతం.
పద్మజ :- పద్య ప్రాశస్త్యాన్ని మీరెలా సమర్ధిస్తారు? దానిని ఎలా కాపాడుకోవచ్చు? విద్యా ప్రావీణ్యత చూపేందుకే పద్యరచన చేస్తారా? ఎందుకంటే ఆంగ్లమాధ్యమంలో కొనసాగుతున్న నేటి విద్యా బోధనా విధానంలో తరగతి గదిలో పాఠ్యాంశాలలో ఇదివరకు వలె పద్య పాఠాలు కనపడడం లేదన్నది ఒక వాదన వినిపిస్తున్న ఈ తరుణంలో పిల్లల చేత పద్య రచన ఎలా కొనసాగించ గలం ?
గౌరీశంకర శర్మ :- “పద్యము తెలుగువాడిలో భాగమగును భాగమే కాదు మనిషికి భాగ్యమగును” అన్నట్లుగా ఆత్మానందానికి ప్రతీక పద్యం! పద్యం చదువుతుంటే ఆందోళనలు అన్ని తగ్గి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆంగ్లమాధ్యమంలో చదివినా విద్యార్థులకు మంచి, మంచి వేమన పద్యాలు, సుమతీ శతక పద్యాల ద్వారా నీతిని బోధించాలి. ఇదివరకటిలాగా కాకుండా మా పాఠశాలలో నైతే పిల్లల చేత కొంతవరకు రచన చేయిస్తున్నాను
పద్మజ. :- ఉభయ భాషలలో పట్టు సాధించడానికి ఎలాంటి కృషి చేసారు?
గౌరీశంకర ( జ):- ఉభయ భాషలలో పట్టు -అమరకోశం – శబ్ధమంజరి- బాల బోధిని, కావ్య ప్రబంధ పఠనం మొదలైనవి చాలా దోహద పడినవి.
పద్మజ :– నోరి నరసింహోదాహరణము రచించడాని గల ప్రేరణఏమిటి? అసలు ఉదాహరణములను ఎలా చెప్పుకోవచ్చు?
గౌరీశంకర ( జ):- సద్గురు శివానంద మూర్తిగారు మా శైవపీఠానికి పీఠాధిపతిగా ఉండేవారు. వారు లోక గురువులు. ఆధ్యాత్మిక భావనా సంపన్నులు. ఎందరో గొప్పవారు వారికి శిష్యులుగా ఉన్నారు. ఒకసారి వారి ఆశ్రమం భీమిలి [విశాఖపట్నంలో] సభలు జరిగిత వెళ్ళాం. ఊరికే ఎలా వెళ్లడం? అని ఆలోచించి వారికి ఏదైనా సమర్పిస్తే బాగుంటుందని భావించి వారిపై ఉన్న భక్తికి నిదర్శనంగా విభక్తి కావ్యం ఉదాహరణ కావ్యం రచించి వారి సమక్షంలో ఆవిష్కరణ చేసి, వారికే అంకితం ఇచ్చాను.దీంట్లో సంబోధన విభక్తితో కలిసి, ఎనిమిది విభక్తులతో ఒక్కొక్క విభక్తి ఒక్కొక్క పద్యం, అలాగే కళిక- ఉత్కళిక, రగడలతో స్తుతి కావ్యాన్ని సంతరించి గురు పాదాలకు సమర్పించడం జరిగింది. పాల్కురికి సోమనాథుడు వేసిన సంప్రదాయమిది. కవిసామ్రాట్ నోరి నరసింహ శాస్త్రి గారి కుమారులు నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు వారి తండ్రి గారి పేరుతో ఒక చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ప్రతి సం॥ పురస్కారాలు ఇస్తున్నారు. అలా మాకు కూడా ఇచ్చారు. వారి పైన సంస్కృతంలో మిత్రుడు అమర్నాథ్ శర్మ, తెలుగులో నేను రచించి వారికి సమర్పించుకున్నాము.
పద్మజ :- మహా కాళీ సుప్రభాతం రచనా నేపథ్యం చెప్పండి?
గౌరీశంకర :- అది 1990 సంవత్సరంలో వేములవాడలో విద్యాభ్యాసం కాగానే నాచారంలో శ్రీ మహా కాళి దేవాలయంలో వాస్తు జ్యోతిష పండితులు శ్రీ వేదాంతం నరసింహమూర్తి గారి దగ్గర శిష్యరికం, పురోహితం చేస్తూ అమ్మవారిపై శ్రీమహాకాళి సుప్రభాతం రచించి శ్రీమతి కే .కమల ఆచార్య రవ్వ శ్రీహరి గారు ముదిగొండ వీరభద్రయ్య గారి చేతుల మీద ఆవిష్కరణ జరిగింది.
పద్మజ :- అవధానాలే కాక ఇతర కళారంగాలలో మీ పాత్ర- వాటి విశేషాలు వివరించండి!
గౌరీశంకర శర్మ:- మా గురువుగారు మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ తిగుళ్ళ శ్రీ హరి శర్మ గారు వేముల వాడలో మాకు సాహిత్యాన్ని బోధించేవారు. వారు అష్టావధానులు వారి వద్ద మెలుకువలు నేర్చుకున్నాము అలా అవధానాలు చేస్తున్న సమయంలో ప్రాచీన కావ్యములు పఠించడం జరిగేది ఆ పద్యవాసన వల్లనే ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారు దివాకర్ల వేదిక తరపున భువన విజయాలు వేసేవారు. ఒకసారి నన్ను దూర్జటి పాత్ర వేయమన్నారు. ఆ పాత్ర వేసి
రక్తి కట్టించేసరికి అలా అన్ని పాత్రల పద్యాలు కంఠస్థం చేయవయ్యా! నీకు ఏ పాత్ర అవకాశమిస్తే ఆ పాత్ర వేయాలి అనేవారు. అలా రాయలు, తిమ్మరసు తప్ప అన్ని పాత్రలు వేసేవాడిని. ముఖ్యంగా పెద్దన, ధూర్జటి, మల్లన పాత్రలు వేసేవాడిని అలాగే ప్రతాపరుద్ర నాటకంలో విద్యానాథుడి పాత్ర కైలాస సాహితీ సభలో శ్రీనాథుడి పాత్ర ఇలా పోషిస్తూ కళా రంగంలో కృషి చేయడం జరిగింది
పద్మజ :- అవధాన విద్య నేర్చుకోవాలనే అభిలాష కలవారికి మీరేమైనా మార్గదర్శనం చేస్తారా?ఇంకా ఇతరులెవరైనా ఆ దిశగా కృషి సల్పుతున్నారా? వారికి మీరిచ్చే సలహా ఏమిటి?
గౌరీశంకర శర్మ:- అవధాన విద్యనేర్చుకోవాలనే తపన గల వారికి మామిత్రులు మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు అవగాహన కళాపరిషత్తు స్థాపించి ఎందరికో ఔత్సాహికులకు అవధానులచేత శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రతి సంవత్సరం దాంట్లో నేను కూడా పాల్గొని శిక్షణ ఇచ్చాను. నా సలహా ఒకటే పద్యాలు బాగ నేర్వాలి ఇతరులవి కూడా చదవాలి అదే ఆలోచన ఉండాలి. శ్రద్ధ, ఏకాగ్రత మొదలైనవి ఉండాలి!
పద్మజ :- కళలకు సమయం వెచ్చిస్తే చదువు కుంటుపడుతుందనే విద్యార్థుల తల్లిదండ్రులకు మీరిచ్చే సలహా ఏమిటి?
గౌరీశంకర శర్మ : కళలకు సమయం వెచ్చిస్తే చదువుకుంటు పడుతుంది అనేది కేవలం వారి అపోహ మాత్రమే! అటు చదువుతూ ఇటు సంగీతం, నాట్యం, కరాటే, వాయిద్యాలు పిల్లలు నేర్చుకోవడం లేదా? ఇప్పుడు అలాగే ఈ పద్యరచన కూడా!!
పద్మజ :- తెలుగుభాష నేర్చుకుంటే జీవనోపాధి కష్టమనే ఒక అపోహ ప్రజలలో ఉన్నది. దానికిమీరేమంటారు?
గౌరీశంకర శర్మ : తెలుగు భాష నేర్చుకుంటే జీవనోపాధి కష్టం అనేది కూడా ఒక అపోహనే! ఇప్పటికీ తెలుగుతో పాటు ఆంగ్లభాష నేర్చుకుని ఉద్యోగాలు సంపాదిస్తున్నారు కదా! కేవలం తెలుగైతే తెలుగు పండితులుగా భాషావేత్తలుగా అయ్యే అవకాశం ఉంది.
పద్మజ :- కొసమెరుపుగా మీరు తెలుగు భాష- విద్యా బోధన ఎలా ఉండాలనుకుంటారు? అంటే పిల్లవాడికి తనంత తానే తెలుగు భాష మీద మక్కువ పెంచుకునేలా ఏమి చేయవచ్చు? దానిని ఆచరణలో ఎలా పెట్ట వచ్చు? దాని మీద మీ అభిప్రాయం చెప్పగలరా?
గౌరీశంకర శర్మ :- పిల్లవాడికి తెలుగు భాష మీద మక్కువ కలగాలంటే మనం కొన్ని భాష చమత్కారాలు, పొడుపు కథలతో కూడిన పద్యాలు అనుప్రాసాలంకార శోభితమైన పద్యాలు ముందు మనం చదువుతూ, పాడుతూ, ఆడుతూ నేర్పిస్తే నేర్చుకుంటారు. మా పాఠశాలలో పిల్లలకు పద్యంతాక్షరి పోటీలు పెట్టి బహుమతులు ఇస్తాను. వాటికోసం పద్యాలు కంఠస్తం చేస్తారు.
పద్మజ : అటు వృత్తి ఇటు ప్రవృత్తి రెండింటికీ సమన్యాయం ఎలా చేయగలుగుతున్నారు? అలాగే సమయ సద్వినియోగం గురించి రెండు మాటలు చెప్పండి!
గౌరీశంకర శర్మ : వృత్తి- ఉద్యోగం -ప్రవృత్తి -వైదిక కార్యక్రమాలు- సాహిత్య- అవధాన, కళారంగాలపై అవగాహన సమయం సెలవులు ఉంటే వాటిని సార్థకం చేస్తున్నాను.
క్షణశఃక౯శశ్చైవ- విద్యామర్ధంచ సాధపేత్! అని మా నాన్న గారు చెప్పేవారు. ఊరికే ఉండొద్దు అంటే సంపాదన. అయితే విద్యాదానం ఇలా…
పద్మజ :- మీరు మెప్పు పొందిన అవధానం గురించి, ఛందోభాషణం కానీ అప్రస్తుత ప్రసంగం సందర్భంగా మీరు చెప్పిన పద్యాలు మా మయూఖ పాఠకులకు చెప్పండి!
గౌరీశంకర శర్మ :- అవధానములో మెప్పు పొందిన అవధానం రవీంద్రభారతిలో ప్రపంచ తెలుగు మహాసభలలో చేసిన అవధానం 17-12- 2017 లోజరిగింది. దానిని శ్రీ నాగ ఫణి శర్మగారు ప్రత్యక్షంగా విని మెచ్చుకున్నారు. అలాగే ఒక అవధానంలో ఒక సమస్యను ఇచ్చారు!
హనుమత్పుత్రుడు భీష్మ సూనను వివాహంబాడె రారండహో!
వినుమా! నేడిట కృష్ణ దివ్య కథలావిష్కారమున్ జేసెదన్
ఘన వంశాంబుధి నోలలాడిన మహా గాంభీర్య తేజస్విమున్
అనుమానింపకు మమ్మ! శౌరి మతడే యాశ్చర్యమౌ దివ్య దే
హనుమత్పుత్రుడు …..అంటూ నందుడు గోపవనితలలో తన కుమారుడు రుక్మిణిని వివాహం చేసుకున్నాడని చెప్పే సందర్భం కొంచెం ఇబ్బంది అయినా బాగా వచ్చింది. అలాగే రచించిన మహాకాళేశ్వర శంకరా! అనే ఏకప్రాస శతకానికి ముందు మాట చెప్పి పద్యంతో ఆశీర్వదించారు ద్వి సహస్రావధాని నాగపణిశర్మ గారు.
మతి మన్మంజులమై, శివా కరుణమై, మాధుర్యమై ధుర్యమై
సతత త్ర్యంబక పాదభక్తివశమై సమ్మాన్యమై మాన్యమై
కృతి మన్మంగళమై సదాశివద గౌరీ శంకర ప్రోక్త- వా
క్యతపః పూర్ణమునౌ శతాత్మకము శ్రేయః ప్రేమముల్ గూర్చుతన్!
అంటూ ఆశీఃపూర్వకముగా అభినందించారు.
దాదాపు అవధాన వరేణ్యులందరి అవధానములలో పాల్గొన్నాను.
నాగఫణిశర్మగారు, గరికపాటి వారు, వద్దిపర్తి వారు, మేడాసాని వారు, జీఎం రామ శర్మ గారు, ఆముదాల, కడిమిళ్ళ వారిలాంటి పెద్దవారితో అవధానాలలో పాల్గొనే అవకాశం లభించింది.
చివరగా మయూఖపత్రికా ప్రశంస
ఈ మయూఖము శిఖరమై యిలను నిలిచి
బహుముఖీనము గాంచుచు భద్రమగుత!
సాహితీ సుధ వెలయించి శాశ్వతమగు
కీర్తినందుచుభవితకు స్ఫూర్తినిడుత!
ఈ అవకాశాన్ని కల్పించిన సహృదయ వరేణ్యులు ఆర్ష ధర్మ ప్రదీపిక రంగరాజు పద్మజ గారికి కృతానేక కృతజ్ఞతా పూర్వక ధన్యవాద నమస్సులు.
శుభం.
రంగ రాజు పద్మజ:- గౌరవనీయులైన అవధాని గారిచే చక్కని సాహిత్య విశేష విషయాలను తెలుసుకున్నాం! మనమూ ఆ దిశగా అడుగులు వేద్దాం!
మాన్యులు అవధాన శిఖామణి శ్రీయుత గౌరీశంకరశర్మ గారితో ముఖాముఖీ భాగ్యం కల్పించిన మయూఖ పత్రిక సంపాదకురాలికి ప్రతేక ధన్యవాదములు తెలుపుతూ…
జయతు ! తెలుగు భాషామతల్లీ! జయతు !