Home ఇంట‌ర్వ్యూలు రంజింపజేసే రచన ఉండాలి – ముక్తవరం పార్థసారథి

రంజింపజేసే రచన ఉండాలి – ముక్తవరం పార్థసారథి

by Aruna Dhulipala

ప్రసిద్ధ నవలాకారులు, కథకులు, అనువాదకులు ముక్తవరం పార్థసారథి గారితో మయూఖ ముఖాముఖి

                                   – అరుణ ధూళిపాళ

ప్రపంచ సాహిత్యాన్ని ఆకళింపు చేసుకొని అందులోని  విభిన్నమైన రచనలను తెలుగువారికి అందించాలనే సదాశయంతో అనేకమైన రచనలను తెలుగులోకి అనువదించిన ప్రముఖ అనువాదకులు, కథకులు, నవలాకారులు ముక్తవరం పార్థసారథి గారి సాహిత్య ప్రస్థానాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం.

నమస్కారం సార్!

1. మీ బాల్య విశేషాలను తెలుపుతూ మీ కథాపఠనం ఎక్కడ, ఎలా మొదలైందో వివరించండి.
జ :-    నా బాల్యమంతా భువనగిరిలో గడిచింది. నా చిన్నతనంలో మా ఇంటికి ‘నవ్వులు- పువ్వులు’, ‘పాపాయి’ ‘గోల్కొండ’ పత్రికలు వచ్చేవి. నేను ఆ పత్రికలు చదివేవాడిని. అలా తొట్టతొలుత నా కథా పఠనం ప్రారంభమైందనుకుంటా. మాఇంట్లో కూడా వావిళ్ళవారి భారతం, రామాయణం, మనుచరిత్ర ఇలాంటి పుస్తకాలు ఉండేవి. వాటిని చూస్తూనే ఉన్నప్పటికీ పద్యాలు అంటే భయం వల్ల చదవకపోయేవాడిని. మా మామయ్య అక్కడే స్కూల్ టీచర్ గా పనిచేసేవాడు. కృష్ణదేవరాయ నిలయం ప్రోత్సాహంతో మామయ్య లైబ్రరీ ప్రారంభించారు. బహుశా పది, పదకొండు ఏళ్ళ వయస్సులో పుస్తకాలు చదవడం ప్రారంభమైంది. ఇంచుమించు తెలుగు పుస్తకాలన్నీ చదివేశాను. కథాప్రపంచం, కథాసాగరం అని వాల్యూమ్స్ వచ్చేవి. పాలగుమ్మి పద్మరాజు, కొడవటిగంటి కుటుంబరావు, రావూరి భరద్వాజ, ధనికొండ హనుమంతరావు వంటి వారి రచనలు చదివాను. నవలలూ చదివాను. నాకు కూడా రాయాలనిపించింది. ఆ విధంగా రచనలు చదవడం మొదలయింది.

2. పత్రికల్లో వచ్చిన మీ మొట్టమొదటి రచన ఏది?
జ :-    ఇందాక చెప్పినట్టు పుస్తకాలు చదువుతుంటే రాయాలనే ఆసక్తి కలిగి 1959లో నేను 9వ తరగతిలో ఉండగా, వేసవి సెలవుల్లో ఒక కథ రాశాను. పేరు గుర్తు లేదు. గోల్కొండ పత్రికకు పంపించాను. పత్రికకు ఎలా పంపించాలో తెలియదు. పేజీకి వెనుకవైపు రాయకూడదనే నియమం తెలియదు. ఒక చిన్న కవర్ కొని అందులో కుక్కి పెట్టి పోస్టులో వేశాను. 20 రోజుల తర్వాత పత్రికలో వచ్చింది. ఆరోజుల్లో హైదరాబాద్ నుండి భువనగిరికి పత్రిక రావడానికి మధ్యాహ్నం అయ్యేది. భోజనాలు చేస్తున్న సమయంలో పత్రిక వచ్చింది. మా మామయ్య చూసి తిట్టాడు. స్కూల్లో చదువుకునే కుర్రాడు ఈ కథలు రాయడంలో ఏమైపోతాడోనని ఆయన భయం. గ్రాంథికం రాయాలని, ఛందోబద్ధమైన, భక్తి పద్యాలు రాయాలని ఆయనకుండేది. పిల్లలకు ఇటువంటి ఆలోచనలు రావద్దని ఆయన ఉద్దేశ్యం. ఇంట్లో సంప్రదాయకమైన వాతావరణం ఉండేది కాబట్టి అట్లాంటి భయాలు ఉండేవి. ఆ రోజుల్లో భువనగిరిలో కథలు రాసేవాళ్ళు లేరు. అందువల్ల మా మామయ్య నన్ను తిట్టినప్పటికీ మా అల్లుడు కథలు రాస్తాడని స్కూల్లో చెప్పుకునేవాడు (నవ్వుతూ).
        అదే 1959లో ఒక పోటీలో ప్రముఖ రచయిత వేణు పిళ్ళై కథకు ప్రథమ బహుమతి వచ్చినట్టు గుర్తు. నేను కూడా ఆ పోటీకి కథ పంపాను. ఆయన కథకు బాపు అద్భుతమైన బొమ్మ వేశాడు. మాస్టర్ పీస్ అది. నా స్కూల్ చదువు అయిపోయాక పియుసి కోసం హైదరాబాద్ కు వచ్చాను. ఇంగ్లీషు మీడియంలో చదివాను. అప్పటికే తెలుగు పుస్తకాల్లో ఇంగ్లీష్  రచయితల పేర్లు అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు, బుచ్చిబాబు, చలం రచనల్లో రచయితల పేర్లు, కొన్ని పదాలు ఇంగ్లీష్ లో కనబడుతుండేవి. అఫ్జల్ గంజ్ సిటీ లైబ్రరీకి రోజూ వెళ్ళేవాడిని. మొదటిసారి ఆ పుస్తకాలను చూసినప్పుడు నేను చదివిన బుచ్చిబాబు, చలం రచనల్లోని పేర్లు అక్కడ చూశాను. ఇంగ్లీషు రాదు. కానీ చదవాలి. అప్పటికి దక్షిణ భారతదేశ హిందీ ప్రచార సభ వాళ్ళు వేసిన ‘స్రవంతి’ పత్రిక వచ్చేది. దివాకర్ల వేంకటావధాని దానికి సంపాదకులు. ఒక గేయం రాసి పంపాను. అచ్చయింది. ఇంకోటి రాసి పంపితే అది కూడా అచ్చయింది. ఎందుకో నాకు పోయెట్రీ ఇరుకుగా, ఫ్రీగా చెప్పలేకపోతున్నట్టు అనిపించింది. అందుకే కథలు రాయాలనుకున్నాను. కథలు రాసేందుకు కాగితాలు కొనుక్కోవడానికి, పంపడానికి కావలసిన డబ్బులు లేవు. ఈలోపు లీవ్ వేకెన్సీ కింద స్టేట్ గవర్నమెంట్ లో తాత్కాలికంగా చిన్న ఉద్యోగం వచ్చింది. కథలు రాయడం ప్రారంభించాను.

పార్థసారధిగారితో అరుణదూళిపాళ

3. ఆ తరువాత మీ కథారచన కొనసాగిన విధానాన్ని తెలపండి.
జ :-    జాబ్ లో చేరిన తర్వాత స్టేట్ లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు చదవడం వలన ఇంగ్లీషు అలవాటయింది. William Somarset Maugham రచించిన  ‘Of Human Bondage’ వెయ్యి పేజీల పుస్తకం. దాన్ని చదివాను. అది చదివాక ధైర్యం వచ్చింది. వాళ్ళ పుస్తకాలు పక్కా ఇండ్ల లాగా ఉంటాయి. వాళ్ళు ఫాంటసీని కూడా పక్కాగా రాయగలరు. అప్పుడు18 ఏళ్ల వయస్సు. ఇంట్లో కూర్చొని రాయడం మొదలు పెట్టాను. కిరోసిన్ దీపం పెట్టుకొని రాసేవాడిని. తర్వాత పోస్టాఫీసులో కొంతకాలం ఉద్యోగం చేశాక రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. ఇక ఆర్థిక సమస్యలు తీరిపోయాయి. దీపావళి, ఉగాది కథలు నవలల పోటీకి రాసేవాడిని. ఒక అద్భుతమైన విషయం మీకు ఇక్కడ చెప్పాలి. ఉద్యోగం రాకముందు ‘అభిసారిక’ అనే పత్రికకు కథ రాసి పంపితే వాళ్ళు “మీరు రాసిన దాంట్లో అభ్యంతరకరమైన వాక్యాలున్నాయి. గవర్నమెంట్ మీమీద ఏమైనా చర్యలు తీసుకోవచ్చు”. అని ఒక కార్డ్ రాశారు. ఏదైనా సరే అన్నాను (నవ్వుతూ). వాళ్ళు దాన్ని అచ్చు వేసి పాతిక రూపాయలు పంపించారు. ఆ రోజుల్లో అది చాలా ఎక్కువ. నెలంతా సరిపోయేది.
         1969లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక ఉగాది నవలల పోటీకి ‘రంగులవల’ అని ఒక నవల రాశాను. దానికి విద్వాన్ విశ్వం సంపాదకుడు. ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని టెలిగ్రామ్ వచ్చింది. 5500 రూపాయల నగదు బహుమతి ఇచ్చారు. ఎమెస్కోలో ఎమ్.ఎన్.
రావుగారు అని వుండేవారు. ఆయన 3000 రూపాయలు ఇచ్చి, దాని కాపీ రైట్స్ అన్నీ తీసుకొని వేశారు. బి. గోపాలం అనే సినిమా దర్శకుడు 2000 ఇస్తానని కథ ఇవ్వమని అడిగి తీసుకున్నాడు. మా అంకుల్ ఒకాయన సలీంనగర్ లో 4500 రూపాయలకు 400 గజాల ప్లాట్ ఉంది తీసుకో! అన్నారు. నేనాయన మాటలు వినలేదు. రచయితల గురించి, పుస్తకాల గురించి ఆలోచించడం తప్ప డబ్బులు ఏం చేసుకుంటాం? అన్నట్టు ఉండేది నాకు. కథలు రాస్తే అందరూ నన్ను పిచ్చివాడిలా చూసేవారు. దానికి Utility Value ఉన్నదని వాళ్లకు తెలియదు. ఇంగ్లీష్ సాహిత్యంలో విశేషం ఏంటంటే ప్రపంచ భాషల సాహిత్యమంతా తెలుగుతో సహా ఇంగ్లీషులోకి వస్తోంది. ఆ రుచి మరిగిన తరువాత దాంట్లో మునిగిపోతాం. ఇన్ని లక్షలమంది దృక్పథాలు, అభిప్రాయాలు, స్పందనలు, ఆలోచనలు, సాంస్కృతిక పరమైన వైరుధ్యాలు, మార్పు కోసం చేసిన పోరాటాలు ఇవన్నీ మనకు ఆ సాహిత్యం చదివితే అర్థమవుతుంది. అందువల్ల వాటిని చదివిన తరువాత రాయడం కొనసాగుతూనే వచ్చింది.

4. చలం గారితో మీకు పరిచయం ఎలా ఏర్పడింది?
జ :-   నేను కథలు రాయడం ప్రారంభించిన తర్వాత, రెండు మూడు అచ్చు అయినప్పటికీ ఇంట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా సరిగా దృష్టి పెట్టలేకపోయాను. ఏం చేయాలో తెలియలేదు. ఇంట్లోంచి వెళ్లి పోవాలనుకున్నాను. 1962 మే నెల. నాంపల్లి స్టేషన్ కు వెళ్ళాను. అప్పుడు మద్రాసుకు 16రూ. టిక్కెట్టు ఉండేది. ఆ సమయంలో ‘అష్టగ్రహ కూటమి’ ఒకటి వస్తుందని, దానివల్ల అందరూ మునిగిపోతారని ప్రచారం జరుగుతోంది. ‘ప్రజాతంత్ర’ అనే పత్రికలో శివం అనే ఆయన చలం గారిని ప్రశ్నలు అడుగుతుండేవాడు. అలా చలం గారు తిరువణ్ణామలైలో ఉంటారని తెలిసింది. ఆ పత్రికలో ‘అష్టగ్రహ కూటమి’ వస్తున్నది కాబట్టి దానినుండి రక్షించుకోవాలనుకునే వారు, తిరువణ్ణామలైకి రావాలని చలం చెప్పాడు. నేను ఆయన రచనలు చదివాను కానీ నా వయసుకు మించిన వర్ణనలు కాబట్టి నాకు అర్థం కాక మొదట ఆయన పట్ల ఆకర్షితుడిని కాలేదు. ఇక నేను ఎలాగూ ఇల్లు వదిలాను కాబట్టి ఎలాగో అలా తిరువణ్ణామలై చలం ఇంటికి చేరుకున్నాను. అదొక గొప్ప అనుభవం. అక్కడొక నర్తకి, ఆయన పెంపుడు కూతుళ్లు, సొంత కూతురు చంపక ఉండేవాళ్ళు. నా ప్రశ్న ‘డబ్బులెలా వస్తాయని?’ ఈశ్వరుడి అనుగ్రహం ఉంటే అన్నీ వస్తాయి అనేవాడు. నీకుంది కానీ నాకు లేదు కదా! అని మొండిగా వాదించేవాడిని. ఓపిగ్గా వినేవాడు. ఇంట్లో పదిమంది దాకా ఉండేవాళ్ళం. డబ్బున్నా లేకున్నా ఉన్నది అందరం పంచుకొని తినడం, అందరూ పని చేయడం వాళ్ళ పద్ధతి. గర్భవతులు వంటింట్లోకి రాకూడదు అని నియమం ఉండేది. అలా వాళ్ళింట్లో వారం రోజులు ఉన్నాను. తిరిగి వచ్చి చిన్న ఉద్యోగంలో చేరాను.

5. చలం గారితో మీ అనుబంధం ఎంతవరకు కొనసాగింది? మీ మీద చలం గారి ప్రభావం ఉందని అనుకోవచ్చా?
జ :-    చలంతో అనుబంధం పదేళ్లు కొనసాగింది. ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. నేను రిజర్వ్ బ్యాంకులో పని చేయడం వల్ల మద్రాసులో ప్రతీ సంవత్సరం పని ఉండేది. అందువల్ల శనివారం మధ్యాహ్నం భోజనం చేసి తిరువణ్ణామలైకి వెళ్ళిపోయి అదివారమంతా అక్కడ గడిపి తెల్లవారి బ్యాంకుకు వచ్చేవాడిని. అయిదారేళ్ళు ఇలా గడిచింది. ఆయన రచన విభిన్నమైనది. అందువల్ల ఆయన రచనకంటే వ్యక్తిత్వం నన్ను ప్రభావితం చేసింది. సమాజం పట్ల, వ్యవస్థ పట్ల, ప్రభుత్వం పట్ల అతనికున్న కోపం, తీవ్రత, వ్యంగ్యం ముందు ఆయన మిగతా విషయాలన్నీ చిన్నవి. జంతువుల లాగా బతికేకన్నా స్త్రీ స్వేచ్ఛగా ఉండడం కావాలన్నాడు. అందరూ అదొక ఉద్యమంలాగా చూశారు. కాదు. అది ఆయన వ్యక్తిగతమైన బాధ. తన చెల్లెలు భర్త ఆమెను ప్రతిరోజూ గదిలో బంధించి కొడుతూ ఉంటే అలా బాధపడే కంటే స్వేచ్ఛగా బతికితే బాగుంటుంది కదా అన్న ఆవేదనతో కూడిన ఆయన వ్యక్తిగత ఆలోచనే తప్ప సంఘ ఉద్ధరణ కోసం చేసింది కాదు. రెండు, మూడుతరాల స్త్రీలు ఈ రకంగా తమ వ్యక్తిత్వాలను కోల్పోతే ఎంతో సామాజిక నష్టం జరుగుతుంది. స్త్రీల జీవితాలు సమాజానికి ఉపయోగపడకుండా వంటింటికి పరిమితమై వాళ్ళ సామర్థ్యమంతా వృథా అయిపోతే ఎంత బాధాకరం? అన్నది ఆయన ఉద్దేశ్యం. టాలెంట్ అనేది స్త్రీ పురుషులిద్దరికీ సమానమే. అది పురుషులకు మాత్రమే పరిమితం కాదు. అలాంటప్పుడు స్త్రీలు నిర్బంధంగా ఎందుకుండాలి? అని ఆయన వాదన. నిజానికి ఆయన తిరువణ్ణామలైకి వెళ్లడం వల్ల ఆధ్యాత్మిక చింతన ఏర్పడిందని కాదు. 1927లో ఆయన ‘అరుణ’ అనే పుస్తకం రాశాడు. అందులో చివరగా “ఆమెకోసం స్వర్గ ద్వారాలు తెరుచుకున్నాయి” అని రాశాడు. అప్పటికే ఆ దృష్టి ఆయనలో ఉంది. ఆయన బ్రహ్మసమాజి. రవీంద్ర నాథ్ ఠాగూర్ తండ్రి దేవేంద్రనాథ్ స్థాపించిన కొత్త మతం ‘బ్రహ్మసమాజం’. అంటే ఏకోపాసన. కృష్ణశాస్త్రి కూడా దీనికి అనుయాయి.
        1730 ప్రాంతంలో బ్రిటిష్ సమాజం స్త్రీని ఒక వ్యక్తిగా కూడా గౌరవించలేదు. ఆస్తిహక్కు గానీ కన్న బిడ్డల మీద కూడా ఆమెకు అధికారం లేదు. అటువంటి సమాజంలో పుట్టిన స్త్రీ Mary wollstone craft. ఆమె ఇంగ్లాండులో తొలి స్త్రీవాద రచయిత్రి. ఆమె కూతురును ప్రముఖ రచయిత షెల్లీ వివాహం చేసుకున్నాడు. మేరీ ‘A vindication of the rights of Women’ అనే పుస్తకాన్ని రాసి స్త్రీల హక్కుల గురించి అనేక విషయాలు వివరించింది. కానీ ఇలా రాసినందుకు స్త్రీలే నన్ను తిడుతున్నారని ఆమె బాధకు గురయింది. అంటే స్త్రీలే ఆ స్వేచ్ఛను కావాలని కోరుకోవడం లేదు.  చలం స్వచ్ఛమైన మనస్సు ఉన్నవాడు కాబట్టే సమాజాన్ని చూసి కలత చెందాడు. బానిసత్వం అనేది మనసులో ఉంటుంది. ఇతరులకు బానిసత్వం అనిపించినది అనుభవిస్తున్నవాళ్ళకి  అనిపించక పోవచ్చు. అనిపించినా బయట పడకపోవచ్చు. ధైర్యంతో స్వేచ్ఛగా తనకు నచ్చినట్లు బతకాలంటాడు ఆయన. అందుకే అలా రాసాడనిపిస్తుంది. ప్రపంచ సాహిత్యంతో ఉన్న పరిచయాలు, ఇంగ్లీషు భాషలో ప్రావీణ్యం కలవాడు. ఆయన ఎప్పుడూ, ఏ రకమైన సంకెళ్లను ఇష్టపడలేదు.

6. మీరు భారతీయ సాహిత్యం కంటే కూడా ప్రపంచ సాహిత్యంపై ఎక్కువ అనువాదాలు చేయడానికి కారణం ఏమిటి?
జ :-     మామూలుగా ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే, ఒకసారి నేను Arthur Millar రాసిన ‘I don’t need you any more’ (short stories) అనే పుస్తకాన్ని చదువుతున్నప్పుడు కథా ప్రారంభం చాలా బాగా అనిపించింది. ఎందుకో దాన్ని తెలుగులో రాయాలనిపించింది. మనవాళ్లకు దాని గురించి తెలియజెప్పాలనిపించింది. మనకెవరికైనా ఏదైనా చదివినప్పుడు, ఏదైనా ఒక సినిమా చూసినప్పుడు ఎవరికైనా దాన్ని చెప్పాలని, వాళ్ళు విన్నా వినకపోయినా ఆ అనుభూతిని పంచుకోవాలనిపిస్తుంది. ఇది మరో భాషలో ఉండడం వల్ల అనువాదం అంటున్నాం. అలా ప్రపంచ సాహిత్యం చదివినప్పుడు నాకు నచ్చినవి తెలుగులో అనువాదం చేయాలని, మనవాళ్లకు చెప్పాలని కోరిక కలిగింది. అందుకే చేశాను.

7. అసలు అనువాదం అంటే ఏ విధంగా ఉండాలో తెలపండి.
జ :-     అనువాదాల నియమాల గురించి చాలా పుస్తకాలున్నాయి. రాచమల్లు రామచంద్రారెడ్డి రాసిన ‘అనువాద సమస్యలు’ పుస్తకానికి కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది. అందులో అన్ని విషయాలను ఆయన చెప్పారు. నేననేది ఏంటంటే మూలానికి భిన్నం కాకుండా textual గా యథాతథంగా చేసే అనువాదం వేరు. కానీ నేను చేసేది అలా కాదు. నా టార్గెట్ తెలుగు రీడర్. నేను రాసింది తెలుగు పాఠకులకు నచ్చుతుందా లేదా? అన్నది నా మొదటి ప్రాధాన్యత. పాశ్చాత్య రచయితలు ఎక్కువగా వర్ణనలకు ప్రాధాన్యం ఇస్తారు. ఉదా:- ఒక పెళ్లిని వాళ్ళు అనేకంగా వర్ణిస్తారు. అది తెలుగు పాఠకులకు అవసరం లేదు. ఒకవేళ వాటిని నేను రాస్తే పాఠకులు అవి వదిలి చదువుతారు. అందుకని నేనే వదిలేసి రాస్తే బాగుంటుంది కదా! రచయిత ఏ ఉద్దేశ్యంతో రాశాడో అది స్పష్టంగా తెలియజేస్తే చాలు.
         ‘కాసుల కమ్ముడు పోయిన కళలు – సాహిత్యం’ అని నేనొక అనువాదం చేశాను. మూడువేల సంవత్సరాల పాశ్చాత్య సాహిత్య కళారంగాల గురించిన సర్వే. ఆ రచయిత పాశ్చాత్య రచయితలు, కళాకారులు పాఠకులకు ముందే తెలుసుననుకొని వాళ్ళ గురించి ఎలాంటి వివరం ఇవ్వకుండా వ్యాఖ్యానం రాశాడు. నేను అనువాదంలో రచయిత అభిప్రాయాన్ని, ఆయన కాలం, ఆయనను గురించి రచయితలు ఏమనుకున్నారు? వీటన్నింటినీ వివరిస్తూ రాశాను. అప్పుడే దానికి ఒక సమగ్రత వస్తుంది. రచయిత గురించే పాఠకులకు తెలియకపోతే నేనెంత వ్యాఖ్యానం చేసినా లాభముండదు. రచయిత ఉద్దేశాన్ని స్పష్టంగా పాఠకులకు చెప్పగలిగినట్లయితే అంతకంటే వివరాలు చెప్పవలసిన అవసరం లేదు. మన విచక్షణలో కథ ఎక్కడా పక్కకు జరుగకూడదు. చాలామందికి ప్రముఖుల రచనలు అనువాదం చేసేటప్పుడు అంత పెద్దవాళ్లు రాసిన దాంట్లో ఏ ఒక్క వాక్యమైనా మనం వదిలేయడం బాగుండదనే భయం ఉంటుంది. వాళ్ళు పాఠకులను రంజింపజేసేందుకు రాస్తున్నారు. మనం కూడా మన పాఠకులను రంజింపజేసేందుకు రాస్తున్నాం. అందుకే అవసరమైతే పెంచాలి. అనవసరమనుకున్నవి వదిలేయాలి.

8. అనువాద సాహిత్యం వల్ల చేకూరే ప్రయోజనాలు ఎటువంటివి?
జ :-    ఇతర భాషల నుండి వచ్చిన అనువాదాలు చదవడం వల్ల మన దృక్పథం విశాలమవుతుంది. ఆ సాహిత్యంలో ఉన్న విషయాలకు మన భాషలో ఉన్న విషయాలకు తేడాలు అర్థమవుతాయి. అయితే ఎటువంటి రచనలు చదవాలన్న విషయం వ్యక్తి అభిరుచిని బట్టి ఉంటుంది. అనువాదం అనే మాట అనడానికి పునశ్చరణ అంటే బాగుంటుంది. అంటే మనం చదివి, ఆనందించి, జీర్ణించుకొని తిరిగి దాన్ని స్నేహితునికి వివరించడం లాంటిది. ‘Re telling’ అన్న మాట. అసలైన రచయితను ఆ సమయంలో మర్చిపోవాలి. చదివి అనుభూతి చెందిన దాన్నే చెప్పాలి. కృష్ణశాస్త్రి పోయెట్రీని ఇంగ్లీషులోకి అనువదించలేము. మాండలికంలో రాసేవాళ్ళున్నారు. మాండలికాన్ని చదివి ఆనందించగలుగుతామే తప్ప దాన్ని మరోభాషలోకి అనువదించలేము. ఇక్కడ కథ చెప్పే పద్ధతి ముఖ్యం. అందుకే నేను నాకు నచ్చినవి ఆ దశలో వ్యాసమో, కథో, నవలో ఏదైనా కావచ్చు, అదే నేను చేశాను. తెలుగు పాఠకులకు అందించే ప్రయత్నం చేశాను.

9. వరవరరావు గారికి, మీకు మధ్య ఉన్న అనుబంధం ఎటువంటిది?
జ :-    నేను 1962లో చలం గారి దగ్గరకు వెళ్లి వచ్చిన తర్వాత చలం గారు వరవరరావుకు హైదరాబాద్ లో పార్థసారథి అనే వాడుంటాడు. కలవమని ఉత్తరం రాశారు. ఆయన అప్పుడు ఎమ్. ఏ చదువుతున్నాడు. ఆయన, అంపశయ్య నవీన్, ఇంకో ఇద్దరు కలిసి నా దగ్గరకు వచ్చారు. ఆ పరిచయంతో అప్పటినుండి ఇప్పటివరకు మా మధ్య స్నేహం అలాగే కొనసాగుతున్నది. అప్పుడప్పుడు ఆర్థికంగా నాకు సహాయం కూడా చేసేవాడు. నా ‘శూన్యం’ నవలకు ఆయన ముందుమాట రాశాడు.

10. జాక్ లండన్ రచించిన ‘ఐరన్ హీల్’ అనే నవలను ‘ఉక్కుపాదం’గా అనువదించారు కదా! ఇందులోని ఇతివృత్తం ఎవరికి సంబంధించింది?
జ :-   వరుసగా రచనలు చేస్తున్న సమయంలో మా స్నేహితుడు చోడవరపు వెంకటేశ్వరరావు 1908లో జాక్ లండన్ రచించిన ‘Iron Heel’ పుస్తకాన్ని చదవమని ఇచ్చాడు. నేను చదవలేదు. చూసీ చూసీ “నువ్వు చదవకపోతే నేను నీతో మాట్లాడను” అన్నాడు. నాకు పుస్తకం కంటే నా మిత్రుడు ముఖ్యం. అందుకే చదివాను. బాగా ఆకర్షించింది. తెలుగులో రాయడం మొదలుపెట్టాను. మొదటి పేరా అంతా ప్రకృతి వర్ణన. పదిపేజీల తర్వాత కథ మొదలవుతుంది. మార్క్సిస్టు సిద్ధాంతాన్ని కథా రూపంలో అద్భుతమైన నాటకీయతతో రాసినటువంటి సోషియో ఫాంటసీ నవల అది. దాన్ని మార్క్సిస్టు వాళ్ళే కాక సామాన్యులూ అంగీకరించారు. శ్రమ శక్తిని గౌరవించడం, మనకెదురుగా మనలను దోపిడీ చేస్తున్న వాళ్ళను గ్రహించే నేర్పు ఉండడం, చూసి పోట్లాడ గలగడం ఇవన్నీ తెలుసుకోవాలి. పెట్టుబడిదారీ వ్యవస్థ వికృత రూపాన్ని ఇందులో ఆయన చూపించాడు.
          శ్రీనివాసాచార్య అనే ఆయన దీనిలో కొన్ని ప్యాసేజ్ లను పద్యరూపంలో అనువాదం చేశాడు. 1970 లో హ్యాండ్లూమ్ వీవర్స్ నాయకుడైన జి.సి కొండయ్య అనువాదం చేశాడు. ఆ తర్వాత నేను చేశాను. చెరబండరాజు వారానికి ఒకసారి నా దగ్గరికి వచ్చి అడిగి మరీ తెలుగు అనువాదాన్ని వినేవాడు.  సి.కె నారాయణ రెడ్డి అనే లెఫ్టిస్టు నాయకుడు. ఆయన నాతో మాట్లాడుతూ ఒకసారి నా పుస్తకం వేస్తానన్నాడు. అది రాకముందే సహవాసి అనే ఆయన దానికి అనువాదం చేశాడు. నా పుస్తకానికి ముందే అది పుస్తకంగా వచ్చింది.  అయితే ‘Iron Heel’ పుస్తకానికి ఒక Particular Technique ఉంది. ఈ పుస్తకంలో ఉన్న కథ 20 వ శతాబ్దానికి చెందినది. అది అప్పటి పాఠకుల కోసం రాసినది. కాబట్టి ఆ శతాబ్దికి చెందిన వివరణలు ఇస్తూ కథ సాగుతుంది. కథ సగం ఉంటే మిగతా సగం ఆ వివరణలు ఉంటాయి. నిజానికి ఆ రెండు కలిపి చదివితేనే కథ అర్థమవుతుంది. ఈ ముగ్గురు అనువాదకులు వాటిని వదిలివేసి కేవలం కథను అనువాదం చేశారు. చేస్తే మొత్తం చేయాలన్నది నా ఉద్దేశ్యం. అందుకే ఫుట్ నోట్స్ తో సహా మొత్తం నేను అనువాదం చేశాను. రత్నమాల అనే ఆవిడ తన ‘నూతన’ అనే పత్రికలో వరుసగా దీన్ని వేశారు. ఆ తర్వాత వికాసం వాళ్ళు పుస్తకంగా వేశారు. మార్క్సిస్టు సిద్ధాంతాన్ని పాఠకరంజకంగా, విజ్ఞానదాయకంగా, ఆసక్తికరంగా, థ్రిల్లింగ్ ఉండేలా సోషియో ఫాంటసీగా జాక్ లండన్ రాసిన నవల.

11. అమెరికన్ రచయిత రాసిన “Burn my heart at Wounded Knee’ కి మీరు చేసిన తెలుగు అనువాదం గురించి చెప్పండి?
జ :-   అమెరికన్ కవి రాసిన కవితలోని ఒక పంక్తి ఇది. అమెరికన్ సామ్రాజ్యాన్ని 400 సంవత్సరాలు జర్మన్, ఫ్రెంచ్, ఇంగ్లీష్, ఇటాలియన్ వాళ్ళు వచ్చి అమాయకులైనటువంటి స్థానికులను, ఆదివాసీలను, మోసం చేస్తూ దొంగ వాగ్దానాలు చేసి, హత్యలు చేసి వాళ్ళ భూభాగాలను లాక్కొని వాళ్ళు అమెరికా సంయుక్త రాష్ట్రమనే దేశాన్ని ఏర్పరచుకున్నారు. చివరకు వాళ్ళను బోనులో జంతువుల లాగా చిన్న చిన్న కాటేజెస్ కట్టించి ఇచ్చారు. ఇప్పటికీ కొంతమంది అలాగే బతుకుతున్నారు. డీబ్రౌన్ అనే వ్యక్తి పరిశోధన చేసి ఈ విషయాలన్నీ పుస్తకంగా రాశాడు. చాలామంది దాన్ని “గాయపడిన మోకాలి దగ్గర నా హృదయాన్ని ఖననం చేయి” అన్నట్టు అనుకుంటారు. అది సరైనది కాదు. అక్కడి నేటివ్ అమెరికన్ తెగల వాళ్ళు పెట్టుకున్న పేరది. Flying eagle, running bul ఇలా ఉంటాయి ఆ పేర్లు. వాటిని అనువాదం చేయలేం. షికాగో అనేది కూడా ఒక తెగ. ఇప్పుడది ఆధునిక నగరంగా మారింది. మిన్నె సోటా కూడా అటువంటిదే. అలా అనేకమైన తెగలను ఆక్రమించుకొని తెల్లవాళ్ళ రాజ్యంగా మార్చుకున్నారు. ఆ హృదయ విదారకమైన గాథని  డీబ్రౌన్ రాశాడు. దానికి నేను చేసిన అనువాదం ‘నరహంతకుని స్వగతం’ అనే పేరుతో వచ్చింది.

పార్థసారథిగారి రచనలు

12. ‘ప్రపంచ రచయిత్రుల కథలు’ సంపుటిలో ఎటువంటి అంశాలకు చోటు కల్పించారు?
జ :-    ప్రత్యేకంగా ఇదీ అని చెప్పలేను. కానీ నేను చదివిన టిల్లీ ఆల్సెన్, గ్రేస్ పాల్ మొదలైన ప్రపంచ రచయిత్రులు ఒక 14 మంది రచించిన కథలను అనువాదం చేసి ఈ పుస్తకం వేశాను. ఇవన్నీ విపుల మాసపత్రికలో అచ్చయినాయి. చెప్పాలనుకున్నది అనువదించాను. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానని చెప్పడానికి గీటురాయి అంటూ ఏదీ లేదు. అందుకే కారణాలు చెప్పలేను.

13. ‘కథల వాచకం’ అనే పేరుతో రాసిన రచనలో 14 దేశాలకు చెందిన 20 కథలు ఒకే కోణంతో రాసినవా? విభిన్న కోణాలను ఆవిష్కరించేవా? అవి ఏ విధమైనవి?
జ :-   ఇది కూడా ప్రత్యేకంగా ఈ కోణంలో మాత్రమే అనేవిధంగా తీసుకున్నవి కావు. నేను ముందే చెప్పాను కదా! నాకు నచ్చినవి, మనకు అభిరుచికి తగినవి తెలుగువారికి అందజేయడం కోసమే నేను అనువాదాలు చేశాను. అలా నాకు నచ్చిన 20 కథలు ఇంగ్లండ్, రష్యా, ఈజిప్టు, సింగపూర్, ఇండోనేషియా, నైజీరియా, చెక్, పోలిష్/ ఇడ్డిష్, చైనా, ఇటలీ, బ్రెజిల్, కరీబియన్, కొలంబియా, యు ఎస్ ఎ దేశాలనుండి తీసుకొని ఈ పుస్తకం వేయడం జరిగింది. వివిధ పత్రికల్లో ఇవి ప్రచురింపబడ్డాయి.

14. ‘బెస్ట్ సెల్లర్స్’ బుక్ పుస్తకాలకు సంబంధించిన ఎటువంటి నేపథ్యాన్ని తెలుపుతుంది?
జ :-   కథ అనేది ఒక ఊబి లాంటిది. ఒకసారి మనం చదవడం ప్రారంభిస్తే అది మనలను లోపలికి లాక్కోవాలి. అది కథకు ఉండే లక్షణం. అది లేకపోతే అది కథ కాదు. కథలన్నీ భావోద్వేగాలు, మానవ సంబంధాలు, మనిషికి, సమాజానికి ఉన్న సంబంధాలను చెప్పగలిగేవి. అలా చెప్పలేనివి మంచి కథలు కావు. ఆ విధంగా ప్రపంచంలో మంచి పుస్తకాలుగా, బాగా అమ్ముడుపోయిన 60 పుస్తకాలకు సంబంధించి చేసిన పరిచయం ఈ పుస్తకం. ఆయా రచయితలు, రచయిత్రులు ఆ పుస్తకం రాయడానికి గల నేపథ్యాన్ని వివరిస్తూ రాసినది. ఒకరకంగా ఆ కథల వెనుక ఉన్న వెతలను కూడా తెలిపేది. ఇవన్నీ ‘నవ్య’ వారపత్రికలో ప్రచురితమయ్యాయి.

15. రష్యన్ విప్లవం గురించి రాయాలనుకోవడానికి కారణం ఏమిటి?
జ :-    కారల్ మార్క్స్ తో నాకు పరిచయం ఆలస్యంగా అయింది. అమెరికా సాహిత్యంలో మునిగిపోయాను. తర్వాత కారల్ మార్క్స్ రాసింది నిజాయితీగా ఉందనిపించింది. స్టీమ్ ఇంజన్ వచ్చిన తర్వాత ఫ్యాక్టరీలు ఏర్పడడం సులభమైంది. ఒకే రూఫ్ కింద వందలమంది కార్మికులు యంత్రాల ద్వారా పనిచేసే సామర్థ్యం వచ్చింది. చేతివృత్తులను వదిలి అందరూ వాటికి మొగ్గు చూపారు. యంత్రం అనేది రోజు రోజుకూ ప్రగతి చెందుతూనే ఉంటుంది. అందువల్ల యంత్ర సామర్థ్యం పెరిగింది. కార్మికులు చేసే పనిగంటలు పెరగకపోయినా చేసే పని ఒత్తిడి పెరిగింది. జీతాలు పెరగలేదు. వచ్చే లాభం యజమానికే తప్ప వీళ్లకు ఎలాంటి అధికారం, హక్కు ఉండవు. అదే దోపిడి. మార్క్సిజం  సిద్ధాంతానికి మూలం. ఈ శ్రమ దోపిడి ఆగినప్పుడే సమసమాజం ఏర్పడుతుంది. దీనికోసం పోరాడాలంటే ఒక్కరితో కాదు. అందువల్ల లెనిన్ దీనికొరకు రష్యాలో విప్లవం తీసుకొచ్చాడు. లక్షలమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇవన్నీ చరిత్రలో పుస్తకాలుగా వచ్చాయి. Mary Gabriel రాసిన ‘ Love and Capital’ ను నేను ‘ప్రేమ- పెట్టుబడి’ గా అనువదించాను. రష్యన్ విప్లవం ప్రజల చరిత్ర, కారల్ మార్క్స్ బయోగ్రఫీ రాశాను.

16. మీ ‘నోబెల్ తారలు’ పుస్తకాన్ని గురించి చెప్పండి.
జ :-  ఆల్ఫ్రెడ్ నోబెల్ గురించి అందరికీ తెలిసిందే. తాను కనుక్కున్న డైనమెట్ దుష్పరిణామాలకు చింతించి తన మరణానంతరం నోబెల్ శాంతి బహుమతి కోసం తన యావదాస్తిని ఇచ్చేసాడు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసినవారికి ఇది ఇవ్వడం జరుగుతుంది. నేను ఈ బుక్ లో నోబెల్ బహుమతి పొందిన 32 మంది గురించిన కథానికలు రాశాను. ఇవి కూడా వివిధ పత్రికల్లో అచ్చు వేయబడ్డాయి.

17. ప్రత్యేకంగా ‘విట్ గన్ స్టైన్’ స్మృతి కవిత రాయడానికి కారణం ఏంటి?
జ :-  Wittgenstein గణిత శాస్త్రజ్ఞుడు. అందులో గణిత తార్కికతలో బాగా పరిశోధన చేసినవాడు. Bertrand Russell అనబడే గొప్ప గణిత శాస్త్రజ్ఞునికి గణిత శాస్త్రంలో నోబెల్ పురస్కారం లేకున్నా దానికి బదులుగా సాహిత్యంలో ఇచ్చారు. ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉన్నప్పుడు విట్ గన్ స్టెయిన్ ఇతనికి శిష్యుడు. కొద్దిరోజుల్లోనే రస్సెల్ తో నువ్వు చెప్పిందంతా తప్పు అని చెప్పిన గొప్ప మేధావి. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో స్టెయిన్ కొంతకాలం పాఠాలు చెప్పాడు. ఒక్కోసారి క్లాస్ లో పాఠాలు కూడా చెప్పకుండా ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. ఆయన పాఠం చెప్పదలచుకున్నప్పుడు విద్యార్థులను ఉదయం 6 గంటలకే రమ్మనేవారు. అంతటి మేధావి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసి ఆసక్తి కలిగి ఆయన మీద ఒక పెద్ద వ్యాసం రాశాను. దాంతో పాటు మరికొన్ని వ్యాసాలు కూడా కలిపి పుస్తకం వేశాను. ఇవన్నీ ‘మిసిమి’ పత్రికలో వచ్చినవే.

18. సాహిత్యం పలు రకాలుగా పరిణామం చెందుతున్న ప్రస్తుత కాలంలో వస్తున్న రచనల పట్ల మీ అభిప్రాయం ఏమిటి? ఈనాటి రచయితలకు ఏవైనా సూచనలు ఇవ్వండి.
జ :-    ఇప్పుడొస్తున్న సాహిత్యాన్ని ఒక యూనిట్ గా చూడలేము. వేలమంది రాస్తున్నారు. అన్నిరకాల పుస్తకాలు అనేక ప్రక్రియలతో వస్తున్నాయి. ఇదొక సూపర్ మార్కెట్ లాంటిది. Lu Xun అని గొప్ప చైనీస్ రచయిత. ఆయన ఒక మాట అంటారు. “పుస్తకాల షాపులో ఒకటి విప్లవానికి సంబంధించినది, దాని పక్కనే లవ్ స్టోరీకి సంబంధించిన పుస్తకం ఉంటుంది. ఈ రెండింటిలో ఎవరికి ఇష్టం ఉన్న పుస్తకాన్ని వాళ్ళు కొంటారు. నీ పుస్తకానికి విలువ ఏముంది?” అని. అంతే కదా! ఒక్కొక్క పుస్తకాన్ని ఒక్కో కోణంలో చర్చించలేము. అనేక కోణాలుంటాయి. కానీ అవసరాలు ఎన్నున్నాయో తెలియదు కదా! అందుకే ఇది మంచి చెడు అని చెప్పలేము. ఎవరికి ఇష్టమైంది వారు రాసుకుంటారు. మీకు చెప్పాను కదా! రచన ఏదైనా పాఠకులను రంజింపజేసేదిగా ఉండాలి. మనకు ఇష్టమైనది రాసినా, పాఠకులకు ఆకర్షణీయంగా, ఆలోచింపజేసేదిగా ఉండాలి. చాసో గొప్ప రచయిత. ఒక్కొక్క పదాన్ని చెక్కుతాడు. రాసి అక్కడ పెడతాడు. మళ్లీ మళ్లీ చూస్తాడు. మార్పులు చేస్తాడు. అందుకే వ్యర్థమైన పదం ఒక్కటి కూడా కనిపించదు. కాబట్టి మనలను మనం సరిదిద్దుకుంటూ రచన చేయాలి. అప్పుడే మంచి పుస్తకం రాగలుగుతుంది.

సంతోషం సార్, మా కోసం ఎంతో ఓపికగా మీ విలువైన సమయాన్ని కేటాయించి, మీ సాహితీ యాత్రా విశేషాలను తెలియజేసినందుకు మా తరపున, మా మయూఖ పాఠకుల తరపున కృతజ్ఞతలు నమస్కారాలు🙏🏼

You may also like

Leave a Comment