“అనగనగా ఒక పెద్ద చెట్టు , చెట్టు తొర్రలో ఒక పెద్ద పక్షి…,”” ఆకు వేసి నీళ్లలో మునిగి పోతున్న చీమను కాపాడిన పావురం…” ఇవి ప్రపంచం గురించి తెలిపిన పంచతంత్రం కథలు, “ఏక్ కవ్వా ప్యాసా థా…”, బళ్ళో హిందీ సారు మొదటి కథా పాఠం, “ఊ ఊ .. ఆయమ్మ్మా ..పిట్ట రావే పిట్ట .. పిల్లల్ల తల్లి ” అని తమ్మునెత్తుకొని అమ్మమ్మలు తీసే రాగం, అలిగి విస్తట్లో మెతుకు ముట్టని కాకిలా నానమ్మ… బేరమాడి కొన్న కంజు పిట్టలు వండక ముందే ఎగిరి పోయినప్పుడు ఇంట్లో జరిగిన కొట్లాట…గంప కింద కమ్మి కాపు గాసిన కోడి పిల్లలు..సివంగిలా దూకే పిల్లల కోడి పెట్ట …ఇలా ఏ కార్టూన్ పాత్రలు కబ్జా చేయని చిన్నతనంలో పక్షులే గొప్ప హీరోలు.
భూతల జీవులు స్థానువులు అంటే వృక్షాలు, జంగామలు అంటే ఒకచోట నుంచి మరో చోటకి వేల్లగలిగేవిమనకు తెలుసు. భూమి మీదనే ఉంటూ గగనతలంనుంచి తన జీవితాన్ని కొనసాగించే మరో వర్గం జీవులు విహంగాలు.పక్షులకు మనకు అవినాభావ సమ్భంధం ఉంది. మన సాహిత్యంలోనూ వాతిక్ తగిన స్థానం ఉంది. సోహం కాస్తా హంసగా ఓం కారంగా మనం గుర్తుచేసుకునేది పక్షినే. ప్రసిద్ద ఇతిహాసం రామాయణం పక్షివేటతోనే మొదలౌతుంది. పక్షులు మన ఆహారంగానూ, వార్తహరులుగానూ, ఆహ్లాదం పంచె సాధుజీవులుగానూ మన జీవనాన్ని సులభాతరాన్ చేసాయి. అయితే ప్రాచీన పక్షిశాస్త్ర పరిశోధనలు,అన్వయాలు, స్వభావ పరిశీలనలకు చెందిన వివరాలు ఉన్నప్పటికీ ఆధునిక కాలానికి తగిన పరిశోధనలు చేసి, విలువైన సమాచారమేంతో నిబద్దతతో సేకరించి అందించిన సలీంఅలీ మనదేశపు పక్షి శాత్రవేత్తలలో అగ్రగణ్యుడు.పక్షుల చెలికాడు, అలుపెరుగని యాత్రికుడు.సలీం అలీ గురించీ ఆయన చేసిన అపూర్వ పరిశోధన గురించి తెలుసుకొనే ప్రయత్నంలో ఆరేళ్ల క్రితం ఆయన తన ఎనభై ఏడేళ్ల ఏళ్ల వయసులో రాసుకున్న ఆత్మ కథ The Fall a Sparrow చదివాను. ఈ మధ్య వచ్చిన రోబో 2.0 సినిమాలో సూటిగా మన మీద వదిలిన ప్రశ్న ‘యాభై గ్రాముల పక్షి నీతో కలిసి జీవించలేనప్పుడు నీదేమి అభివృద్ధి ..?’మరొక్క సారి సలీం అలీని గుర్తుచేసింది. పక్షులే జీవితంగా తొంభై ఏళ్ళ తన జీవితంలో దాదాపు ఎనభై ఏళ్ల జీవితాన్ని ధారపోసి భారతదేశంలో ఉన్న పక్షి జాతుల వివరాలను గ్రంథస్థంచేసి భారతీయ పక్షి పితామహుడిగా పేరుగాంచిన సలీం అలీ ఆత్మ కథ అది.
సలీమ్ అలీ 1896లో ప్రస్తుత ముంబై లో మొయిజుద్దీన్ , జీనత్ ఉన్నీసా దంపతులకు 9 వ సంతానం. సలీం పుట్టిన ఏడాదిలో తండ్రినీ మూడేళ్ల వయసులో తల్లినీ కోల్పోతే తల్లి తరపు మేనమామ అమీరుద్దీన్ త్యా బ్జి వద్ద మిగిలిన నలుగురు అన్నలు , నలుగురు అక్కలతో పాటు పెంపు చేయబడతాడు. మేనమామ నిస్సంతు కాగా ఆయన చేరదీసిన పిల్లలు చాలా మంది వీరితో పాటు ఉండేవారు. సాంఘికంగా ఉన్నతంగా ఉన్న నవాబుల కుటుంబం వారిది. ఇంట్లో పిల్లలు ఎక్కువగా ఉండడం వల్ల ఆటపాటలతో గడిచేది. సంప్రదాయ ముస్లిమ్ కుటుంబపు ఆచారం ప్రకారం ఆహారంగా స్వీకరించ దగిన పక్షులు, జంతువుల్ని మాత్రమే హలాల్ చేసేవారు. పిచ్చుకలను తినడం ఇస్లాం ప్రకారం అనుమతించి బడింది కనుక చాలా సార్లు వాటిని వండడం అతనికి తెలుసు .కనుక అతని పాటు ఉండే పిల్లలు పిచ్చుకల్ని, ఇతర పక్షుల్ని, గుడ్లని వెతుక్కుంటూ వాటిని గమనిస్తూ గడిపేవారు.
సలీం తొమ్మిదేళ్ళ వయసులో వాళ్ళ మేన మామ అతనికి ఒక వేటకు ఉపయోగించే తుపాకీని బహుమతిగా ఇస్తాడు. ఆ కాలంలో వేట అతి సాధారణమైన ఆటవిడుపు. కనుక పిల్లలు పిచ్చుకల్ని వేటాడుతూ వెంబడిస్తూ గడిపేవారు. ఒకసారి పొదల్లో ఉన్న పిచ్చుక గూడు వైపు గురిపెట్టి గూడు ముందు కాపలా ఉన్న మగ పిచ్చుకను కాల్చేస్తాడు. అప్పటికి గూడులోపల ఆడ పిచ్చుక గుడ్లను పొదుగుతోంది. మగ పిచ్చుక చనిపోయిన వెంటనే ఆడ పిచ్చుక ఎగిరిపోయి మళ్లీ వస్తుంది. చనిపోయిన మగ పక్షికి బదులు మరో మగ పక్షి గూటికి కాపలాగా వస్తుంది.సలీం మళ్లీ ఈ మగ పక్షిని కూడా కాల్చేస్తాడు. ఆడ పక్షి మళ్లీ ఇంకో మగ పక్షిని వెంటనే కాపలాకి తెస్తుంది. ఇలా ఎనిమిది పక్షుల్ని సలీం కాల్చేస్తాడు. ఆశ్చర్యపోతాడు.తాను చంపిన ప్రతి సారీ మరో మగ పక్షి గూటికి కాపలా ఉంటోంది. ఇంత చిన్న పక్షి గూటికి కాపలా కోసం ఎంత పట్టుదలతో ఉందని.ఇది మొదటి సంఘటన.
మరో సారి వంట కొరకు తెచ్చిన పక్షుల్లో పసుపురంగు మెడ కలిగిన పిచ్చుక కనిపిస్తుంది. సలీం మనసులో ఒక అనుమానం .ఇది ఎప్పుడూ వండే పిచ్చుకలా లేదు .మెడ కింద పసుపురంగుతో ఉంది. దీన్ని తినడానికి ఇస్లాం అనుమతించిందా లేదా తెలుసుకోవాలని మేనమామ వద్దకు వెళ్తాడు. ఇది రెండో సంఘటన. ఆయన పక్షిని బాగా పరిశీలించి దీన్ని తినడానికి వీలులేదని తేల్చి బాంబే నాచురల్ హిస్టరీ సొసైటీ సెక్రటరీ వాల్టర్ శామ్యూల్ మిల్లార్డ్ వద్దకు వెళ్ళమని చెపుతాడు. సలీం మేనమామ BNHS స్థాపించిన సభ్యుల్లో ఒకరు. కనుక బ్రిటిష్ వారు తమను తాము గొప్పగా ప్రకటించుకొని ఏర్పరచుకున్న మిథ్యా కుడ్యాలను దాటి అంత చిన్న వయసులో మిల్లార్డ్ ని కలుసుకునే అవకాశం దొరుకుతుంది. అది మొదలు సలీం పక్షుల గురించీ, వాటిని ఈ విధంగా సేకరించాలి అనీ, దాని చర్మం ఒలిచి శాస్త్రీయ అవసరాలకోసం భద్ర పరచడం , వాటి ఆవాసాలను, అలవాట్లను, జీవన విధానాన్ని గ్రంధస్తం చేయడం ఇలా పక్ష్షులకు చెందిన అనేక విషయాలలో నేర్పరి అవుతాడు.
సలీం 1914 నుంచి 1917వరకు బర్మాలో దగ్గరి బంధువుల వద్ద ఉంటాడు. 1918లో తెహ్మినా ను వివాహం చేసుకొని ముంబైలో కాపురం ఉంటాడు. 1924లో అప్పటికి BNHS ద్వారా కొత్తగా మొదలైన నాచురల్ హిస్టరీ మ్యూజియంలో గెస్ట్ లెక్చరర్ గా అవకాశం వస్తుంది. ఆ తర్వాత పక్షుల అధ్యయనాన్ని కొనసాగించడానికి మెరుగైన శిక్షణ కోసం బెర్లిన్ వెళ్తాడు.అక్కడ ఎర్విన్ స్ట్రెస్ మన్ పర్యవేక్షణలో శిక్షణ పొందుతాడు.
1930లో ఇండియాకి తిరిగి వచ్చాక BNHS ద్వారా పక్షుల సర్వే చేయాలని నిర్ణయించి అప్పటివరకు పక్షులకు సంబంధించినటువంటి విషయాలలో తక్కువ తెలియబడిన హైదరాబాద్ సంస్థానాన్ని ఎంచుకొని హైదరాబాద్ స్టేట్ ఓర్నితోలోజికల్ సర్వే నిర్వహిస్తాడు.అందుకు గాను అప్పటి హైదరాబాద్ ఆర్థిక మంత్రి అక్బర్ హైదరి మూడు నెలల కాలానికి మూడువేల రూపాయలు గ్రాంటుగా మంజూరు చేస్తాడు. ఆదిలాబాదు జిల్లా ఉట్నూర్ ప్రాంతంలో వీరి బృందం బస చేసింది. 1931లో ఇప్పటి మహబూబ్నగర్ మన్ననుర్ ప్రాంతంలో కూడా బస చేసింది. 1897 వరకు వేటకు ఎవరైనా వెళ్ళవచ్చు కానీ 1914లో నిజాం ఇచ్చిన నియమాల ప్రకారం ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరూ వన్యప్రాణులను వేటాడడానికి వీలు లేదు. నిజాం ప్రభువుకు అతని కుటుంబీకులకు, జాగీ ర్థార్లకు ఇందుకు మినహాయింపు. 1931 నుంచి సలీం అలీ హైదరాబాద్ సంస్థానంలో చేసిన పరిశోధనలను BNHS వారు ప్రచురించారు. హైదరాబద్ సంస్థానం అప్పట్లో పులుల వేటకు ప్రసిద్ది చెందింది. అమ్రాబాద్, ఉట్నూర్, పాకాల్ , ములుగు ఎక్కువగా వేటాడే ప్రాంతాలు.1930 లో గిజిగాడు లేదా వీవర్ బర్డ్ మీద రాసిన ఆర్టికల్ సలీం కి ఎంతో పేరు తెచ్చింది.
సలీం తర్వాత 1935 నుంచి 1939 వరకు డెహ్రాడూన్ లో ఉంటాడు. 1939 లో భార్య అనారోగ్యంతో మరణిస్తుంది. డెహ్రాడూన్ వెళ్ళేటప్పటికి చేతిలో ఉన్న Economic Ornithology ప్రాజెక్టును విరమించు కుంటాడు. పక్షుల ఆవాసం, ఆహారపు అలవాట్లు , అటవీ మరియు వ్యవసాయం మీద వాటి ప్రభావం పరిశోధించాలని భావిస్తాడు. ఆ తరవాత ఆఫ్ఘనిస్తాన్ ,మానస సరోవరం , కచ్ ప్రాంతం, భరత్ పూర్, బస్తర్, ప్రాంతాలలో పరిశోధనలు కొనసాగిస్తాడు.తన పరిశోధనల సారాన్ని 1941 లో బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్ ను , పది సంపుటాలు కలిగిన హ్యాండ్ బుక్ ఆఫ్ ది బర్డ్స్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్థాన్ ను, 1967 లో కామన్ బర్డ్స్ అన్న ఫీల్డ్ గైడును , 1985లో తన జీవిత చరిత్రను రాశాడు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నకాలంలో అంతరించిపోయిందని అనుకున్న కలివికోడిని తిరిగి గుర్తించిన కడప జిల్లాలో ఆ పక్షిని పరిశీలించడానికి అయన స్వయంగా వచ్చారు. దురదృష్టవశాత్తు ఆ పక్షి బతకకపోయినా దానిని గుర్తించడం ప్రపంచం మొత్తం మన దేశంవైపు చూసే పరిస్థితి కల్పించింది. ఆప్రాంతం ఇప్పుడు లంక మల్లెశ్వర అభయారణ్యంగాప్రకటించి సంరక్షణ చేస్తున్నారు. ఇలా పసితనం నుంచి చివరిదాకా ఆయన పక్షుల్తోనే సహజీవనం చేసాడు. చిరకాల చెలికాడయ్యాడు.
సలీంఅలీ విలువైన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1958లో పద్మ భూషణ్ ను, 1976లో పద్మ విభూషణ్ ను ఇచ్చి సత్కరించింది. ఈ మహనీయ పరిశోధకుడు తన తొంభై ఏళ్ళ వయసులో 1987 జూన్ మాసంలో మరణించాడు.సలీం అలీ పేరు మీద తమిళనాడులోని అనైకట్టిలో భారత పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ , BNHS ఆధ్వర్యం లో SACON సలీం అలీ సెంటర్ ఫర్ ఓర్నితొలజీ అండ్ నాచురల్ హిస్టరీ అన్న సంస్థను 1990 లో నెలకొల్పారు.అతనిని మొదటి సారి పరిశోధనా రంగానికి పరిచయం చేసిన యెల్లో త్రోటెడ్ స్పారో / పసుపు రంగు మెడ కలిగిన పిచ్చుక “సలీం అలీ ” పక్షిగా పిలవబడుతుంది. అంతే కాదు సలీం అలీ ఆంగ్లంలో మంచి పట్టుగల వ్యక్తి.అతను రాసిన వ్యాసం అప్పటి ఉస్మానియా యూనివర్సిటీ ఆంగ్ల విభాగం ప్రచురించిన ఇండియన్ మాస్టర్స్ ఆఫ్ ఇంగ్లీష్ సంకలనంలో ప్రఖ్యాత రచయితలు రవీంద్రనాథ్ టాగోర్, సరోజినీ నాయుడుల సరసన చోటు సంపాదించుకున్నది.
ఈనాటికీ పక్షుల గురించిన ఏ సమాచారం కొరకు అయినా సలీం అలీ పుస్తకాలు ఎంత ప్రామాణికమైనవో , నేటి విద్యార్థి లోకానికి గొప్ప సందేశాన్ని ఇచ్చే అతని జీవిత చరిత్ర అంతే తలమానికమైనది.