Home కథలు నమ్రత

నమ్రత

by chittiprolu Subbarao

హోటల్ అశోకా. నగరం నడిబొడ్డు లాంటి లక్డీ కా పూల్ లోని ఒక మోస్తరు హోటల్. పాతతరం వారికి బాగా తెలిసిన హోటల్. కొత్తగా బిల్డింగులు వచ్చీ రోడ్డు మధ్యలో ఎత్తైన మెట్రో కట్టీ ఇప్పుడు అంతగా బయటకు కనిపించని హోటల్. అయినా కొంతమందికి ఇప్పటికీ హైదరాబాద్ లో విడిది అంటే అశోకా హోటలే.

ఖద్దరులాల్చీ తొడుక్కుని నూలుపంచె కట్టుకున్న ఆ పెద్దమనిషి హోటల్ నుండి బయటకొచ్చాడో లేదో అప్పుడే సన్నగా మొదలైంది వర్షం. ఆలస్యమవుతుందనిపించినా ఎందుకైనా మంచిదని వెనక్కిమళ్ళి హోటల్ లాంజ్ లోకి వెళ్లారు. ఆయన్ని చూసి విషయం గ్రహించింది రిసెప్షనిస్టు కుశాగ్ర. తమ హోటల్ అతిథుల సౌకర్యం కోసం అలమరాలో సిద్ధపరచిన గొడుగుల్లోంచి ఒకటి తీసిచ్చింది. ఇటువంటి చిన్న విషయాలను కూడా పట్టించుకుంటున్న యాజమాన్యం శ్రద్ధ వల్లనే ఈ హోటల్ ఇప్పటికీ రాణిస్తుందనుకుంటూ పంచెకట్టుమనిషి మళ్ళీ బయటకు నడిచాడు.

సాయంకాలం ఆరుగంటలవుతోంది. అందరూ ఆఫీసుల నుండి ఇళ్ళకెళ్ళే సమయం. ఇళ్ల నుండి పార్కులకూ సినిమాలకూ వెళ్లే సమయం కూడా. అందువల్ల కార్లతో ఆటోలతో రద్దీ ఎక్కువగానే ఉంది. వర్షం వల్లనేమో స్కూటర్లూ మోటార్ సైకిళ్ళూ కొంచెం తక్కువగా ఉన్నాయి.

రోడ్డుకు బాగా ఎడమ ప్రక్కగా అడుగులేస్తూ వర్షానికి తడవకుండా గొడుగు పట్టుకుని రవీంద్రభారతి వైపు వడివడిగా నడుస్తున్నాడు అరగంట ముందే గమ్యం చేరుకునే అలవాటున్న ఆ పంచెకట్టుమనిషి. తనను హైదరాబాద్ కి ఆహ్వానించినవాళ్ళు కారు పంపిస్తామని చెప్పినా ఇంత తక్కువ దూరం కోసం వృధాఖర్చని తనే వద్దన్నాడు.

ఇంకో నాలుగడుగులు వేసేసరికి అంత ట్రాఫిక్ లోనూ రోడ్డుకు ఒక వారగా ఆగిపోయిన పెద్దకారొకటి కనిపించింది. తల మీద టోపీ పెట్టుకుని తెల్లటి యూనిఫామ్ ధరించిన డ్రైవర్ వానలో తడుస్తూ తెరిచిపెట్టిన బోనెట్ లో ఏవో వైర్లు సరిచేస్తున్నాడు.

కారు బ్యాక్ డోర్ ఓపెన్ చేసిన సూటూబూటుమనిషితో కళ్ళూకళ్ళూ కలిశాయి పంచెకట్టు మనిషికి. క్షణం సేపట్లోనే అర్థమైంది సూటూబూటుమనిషి భావం ‘గొడుగులో నాకూ కాస్త చోటిస్తారా’ అని.

“ఇక్కడే రవీంద్రభారతిలో అర్జెంట్ ప్రోగ్రాముంది. నన్నక్కడిదాకా తడవకుండా మీ గొడుగునీడలో తీసుకెళ్తారా! ప్లీజ్!”

“ఈరోజే కొట్టించుకున్న కోటు. మీరేమీ అనుకోకపోతే …”

విషయం గ్రహించిన పంచెకట్టుమనిషి గొడుగు నుండి కొంచెం బయటకొచ్చి తన దుస్తులు ఒక భాగం తడుపుకుంటూ నడుస్తున్నాడు. అంతలో వెనుక నుండి ఆ పెద్దకారు వచ్చి సూటూబూటుమనిషి ప్రక్కన ఆగింది. అతడు వేగంగా డోర్ తీసి అంతకంటే వేగంగా ‘థాంక్స్’ చెప్పి కారులో కూర్చుని రయ్యిమన్నాడు.

“పోనీలే పాపం. కారు స్టార్టయ్యింది. లేదంటే ఆ డ్రైవర్ కి ఇంకెన్ని తిట్లు పడేవో” అనుకుంటూ ఇక ఏమాత్రం తడవకుండా నడక సాగించాడు పంచెకట్టుమనిషి, కళాభవన్ ప్రాంగణం దాటుకుంటూ.

తన కొత్తకోటు తడవనందుకు చాలా సంతోషంగా ఉంది కారులో పోతున్న సూటూబూటుమనిషికి. ముంబైలో రేమాండ్స్ షాపుకు తనే స్వయంగా వెళ్లి తనకు నచ్చిన ఒకలాంటి బ్లూ కలర్ క్లాత్ కొనుక్కుని హైదరాబాద్ లోని ఖరీదైన టైలర్ తో మనసుపడి కొట్టించుకున్న కోటు మరి. “ఈ రోజు ప్రోగ్రాం కోసమే కుట్టించుకున్న కోటు తడిసిపోయుంటే … ?” తడవనందుకు చాలా రిలీఫ్ ఫీలై టై నాట్ మరికొంచెం క్రిందికి లాక్కున్నాడు.

రవీంద్రభారతి ఆవరణ లోకి అడుగుపెడుతుండగా గేటుకు ఒకప్రక్కన కట్టిన ప్లాస్టిక్ బ్యానర్ కనిపించింది పంచెకట్టుమనిషికి. నగరంలో పెద్దపేరున్న ‘చంద్రవంక కళావాహిని’ సంస్థ వారు ఒక సంగీతవిద్వాంసుడికి ఒక పెద్ద ఆఫీసర్ చేతుల మీదుగా చేస్తున్న సన్మానం. అదీ ఆ బ్యానర్ సారాంశం.

రవీంద్రభారతి హాల్లో ముందువరుస సీట్ల వైపు వెళ్ళబోయి స్టేజి మీద సూటూబూటుమనిషిని చూసి లిప్తపాటు ఏదో ఆలోచించుకుని సన్నగా నవ్వుకుంటూ తల మీద ఉత్తరీయం కప్పుకుంటూ వెళ్ళి హాల్లోని చివరివరుస సీట్లో కూర్చున్నాడు.

“ఈనాటి సభకు కథానాయకులైన ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ ప్రాచీనమూర్తి గారు సభకు ఏ క్షణమైనా రావచ్చు. ముఖ్య అతిథీ సన్మానకర్తా ప్రభుత్వ సాంస్కృతికశాఖ అధ్యక్షులూ శ్రీ అధునాతన్, ఐ.ఏ.ఎస్. గారు సభకు ఇప్పటికే విచ్చేశారు. వేదిక మీదే మీ ముందున్నారు. మీ కరతాళధ్వనుల మధ్య వారికి మరొక్కసారి స్వాగతం పలుకుతూ … వారికి ముఖ్యమైన మరో ప్రోగ్రాం ఉన్నందువలనా సమయాభావం వలనా ప్రకటించిన సమయానికి ముందుగానే ఇప్పుడే తమ ప్రసంగం వినిపించి వెళ్ళిపోతారు. …” సభానిర్వాహక కార్యదర్శి పరిచయవాక్యాలు పలికి మైకును శ్రీ అధునాతన్ గారికి అందజేశారు.

“సభాసరస్వతికి నమస్సులు. నేను తెలుగువాణ్ణే. ఇంట్లో మాతృభాషే మాట్లాడాలన్న నియమం పెట్టుకున్న కుటుంబం నుండి వచ్చాను. కానీ పుట్టిందీ పెరిగిందీ మొన్నటిదాకా ఉద్యోగం చేసిందీ ఇతర రాష్ట్రాల్లో కాబట్టేమో నాకు తెలుగు సంగీతవిద్వాంసుల గురించి పెద్దగా తెలియదు. సాంస్కృతిక శాఖ అధ్యక్షుడిగా ఈరోజే బాధ్యతలు తీసుకున్న నేను శ్రీ ప్రాచీనమూర్తి గారి ప్రాభవం గురించి విన్నాను గానీ వారి పాండిత్యం గురించి ఇంకా తెలుసుకోవలసి ఉంది. ఈ సాయంత్రం మనం సన్మానించుకోనున్న ఆ మహనీయుణ్ణి నేనిప్పటిదాకా చూడనే లేదు. వారెక్కడన్నా తారసపడ్డా గుర్తుపట్టలేని అశక్తుణ్ణి నేను. తాము బసచేసిన హోటల్ నుండి బయలుదేరారట. ఏ క్షణమైనా ఇక్కడకు రావచ్చట. వస్తూవస్తూ దారిలో వారు అమృతవర్షిణి రాగం ఆలపిస్తున్నారేమో. అందువల్లనే ఇక్కడ వర్షం కురుస్తోందేమో. రాగానే వారితో దీపక్ రాగం పాడించుకోవాలి. వాతావరణం వెచ్చబడుతుంది. …” ప్రసంగం ముగించి ప్రేక్షకుల చప్పట్లతో ప్రతిధ్వనిస్తున్న సభామందిరాన్ని నలువైపులా తిలకిస్తూ కోటుజేబుల్లో చేతులుపెట్టుకున్నారు శ్రీ అధునాతన్ గారు గర్వంగా.

రిస్ట్ వాచ్ లో టైం చూసుకుని తల మీది ఉత్తరీయం తీసి వేదిక వైపు నడిచాడు పంచెకట్టుమనిషి. అల్లంత దూరం నుండే ఆయన్ను చూసిన సభానిర్వాహకులు పరుగుపరుగున వచ్చి పంచెకట్టుమనిషిని సాదరంగా వేదిక మీదికి తోడ్కొనివెళ్ళారు.

పంచెకట్టుమనిషీ సూటూబూటుమనిషీ వేదిక మీద పక్కపక్కనే కూర్చున్నారు. మరోసారి కలుసుకున్న ఆ రెండుజతల కళ్ళు ఏం మాట్లాడుకున్నాయో తెలియదుగానీ ఎవరిలోనూ తొట్రుపాటు లేదు. ఇంతకుముందొకసారి కలుసుకున్నామన్న భావనే లేదు ఇద్దరి ముఖాల్లో.

మరో ప్రోగ్రాం కోసం త్వరగా వెళ్ళిపోవాలన్న శ్రీ అధునాతన్ గారు సభ ఆసాంతం ముందువరుస కుర్చీలో కూర్చుని ప్రాచీనమూర్తి గారి రాగాలన్నీ వింటూ మైమరచిపోయారు. పాటపాటకూ మధ్య వచ్చే కొద్ది క్షణాల విరామంలో తననెవరూ గమనించకుండా తన కోటును తానే పదేపదే ప్రశ్నార్థకంగా చూసుకున్నారు.

చివరగా పాడిన దీపక్ రాగం తరువాత సన్మానకార్యక్రమం మొదలైంది.

మళ్ళీ వేదిక మీదికి వచ్చిన శ్రీ అధునాతన్ గారు సరాసరి వేదిక ప్రక్కనున్న గదిలోకి వెళ్లి రెండు నిమిషాల తరువాత తిరిగివచ్చారు. ఇప్పుడతడి శరీరం కొంత తేలికపడింది. మనసు బాగా తేటపడింది.

శ్రీ అధునాతన్ గారు శ్రీ ప్రాచీనమూర్తి గారికి పూలమాల వేసి శాలువా కప్పి సన్మానపత్రం సమర్పిస్తున్నప్పడు వారిద్దరి చూపులు మళ్ళీ నిశ్శబ్దంగా మాట్లాడుకున్నాయి.

ఇంటికొచ్చిన భర్త అధునాతన్ ను మురిపెంగా చూసుకుంది అతడి అర్థాంగి. అతడి ప్రసంగాన్నీ సన్మానకార్యక్రమాన్నీ టీవీలో కళ్ళార్పకుండా చూశానంది. స్వంత రాష్ట్రం లోకి వచ్చిన మొదటి రోజే అధునాతన్ ఇంత గొప్ప సభలో ముఖ్య అతిథిగా పాల్గోవటం మనసుకు తృప్తినిచ్చిందనీ, ఆ సభను తాను ప్రత్యక్షంగా తిలకించలేకపోవటం తన దురదృష్టమనీ కళ్ళు తిప్పుకుంటూ భర్తతో చెప్పుకుంది.

అంతగా మనసుపడి కుట్టించుకున్న కోటును సన్మానం చేసే సమయంలో వేసుకోలేదేంటని అడిగింది. జరిగిన విషయం ముచ్చటించుకుని ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు.

ఎండైనా వానైనా పగలైనా రాత్రైనా, టైనీ కోటునూ ఏమాత్రం విడవని దర్పం భర్తది. తనెన్నో సార్లు చెప్పి చూసింది అవసరం లేని సందర్భాల్లోనూ ఈ డాబుసరి వేషమెందుకని. కానీ ఫలితం లేకపోయింది. అదృష్టవశాత్తు ఈరోజు తన కోరిక తీరింది.

దొడ్డతనానికి దుస్తుల కంటే వ్యక్తిత్వమే నిజమైన గీటురాయని తన భర్తకు కనువిప్పు కలిగించిన వర్షానికీ పంచెకట్టుమనిషికీ మనసులోనే కృతజ్ఞతలు తెలియజేసుకుంది శ్రీమతి నమ్రత.

You may also like

Leave a Comment