నమ్ముకున్న వృత్తిపై మమకారంతో బతుకు జీవన బాటలో నిత్యం శ్రమిస్తున్న నేతన్నల జీవిత చిత్రంలోకి తొంగి చూస్తే మరెన్నో కథనాలు కనిపిస్తాయి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కథనాన్ని ఒకసారి మనం తెలుసుకుందాం…
సిరిసిల్ల అంటేనే తెలంగాణలో అతిపెద్ద వస్త్ర పరిశ్రమకు కేంద్రంగా ఎంతో ప్రత్యేకమైనది. వేల సంఖ్యలో కార్మికులు మరమగ్గాలపై వస్త్ర ఉత్పత్తి సాగిస్తారు. ఇక్కడ చేనేత మగ్గాలపై ఒకప్పుడు వస్త్ర పరిశ్రమ కుటీర పరిశ్రమతో అనేక ఉత్పత్తులు చేస్తూ కాలానుగుణంగా మరమగ్గాలుగా ఇంగ్లీష్ లూంలు సురూ, గపూర్, రమేష్, మేకర్లు, కండెలు చుట్టే మిషన్లు, సైజింగ్లు, వార్పింగ్ మిషన్లు, ట్విస్టింగ్ మిషన్ లు, రేపర్ లూంలు, ఇలా ఆటోమేటిక్ మర మగ్గాలు అనేక రకాలుగా వారి వారి ఉత్పత్తులకు అనుగుణంగా నిర్మించుకుని యజమానులు, ఆసాములు, కార్మికులుగా మూడు తరహాలుగా విభజింపబడి వస్రోత్పత్తి ఏళ్లుగా కొనసాగుతుంది. ఇలా ఉత్పత్తి అయిన వస్త్రాలను సిరిసిల్లలో డయింగ్ వ్యవస్థ అంటే ఉత్పత్తి అయిన కాటన్ గుడ్డ అద్దకంతో కేస్మేట్, పాప్లిన్ వస్త్రాలుగా తయారు చేయబడి ఆర్డర్ పై పెట్టికోట్స్, సారీస్, బ్లౌజ్ పీస్ లు పలు గార్మెంట్లుగా సరఫరా చేస్తూ వస్రోత్పత్తిదారులు నేరుగా అమ్మకం దారులుగా వివిధ అనేక రాష్ట్రాలతో వ్యాపార సంబంధాలు కుదుర్చుకొని అమ్మకాలు జరుపుతున్న నేపథ్యం ఒక కోణం అయితే, అందులో పాలిస్టర్ వస్త్రాన్ని తయారు చేయడం మరో విభాగం అని చెప్పవచ్చు. పాలిస్టర్ గుడ్డను తయారు విషయంలో బోస్ కి, లైనింగ్, షూటింగ్, షర్టింగ్ , సారీస్ గ్రే ఇలా పలు రకాలుగా తయారు చేసి హైదరాబాద్ ఏజెంట్ల ద్వారా, యజమానులకు అమ్మి దానిని ప్రాసెసింగ్ తో ఫినిషింగ్గా సిల్క్ మిల్లుల ద్వారా ఏర్పడి అనేక హోల్సేల్, రిటైల్ దుకాణాలకు సప్లై జరిగుతున్నాయి. కాటన్ వ్యవస్థ, పాలిస్టర్ వ్యవస్థ రెండు విభాగాలుగా సిరిసిల్ల మరమగ్గాల వస్త్ర పరిశ్రమలో వేల సంఖ్యలో కార్మికులు, వందల సంఖ్యలో ఆసాములు, యజమానులు ఉత్పత్తి రంగంలో మనుగడ కొనసాగుతున్న క్రమంలో ఒకవైపు ఉపాధి, మరోవైపు నైపుణ్యం, కళాత్మకత వివిధ రకాలుగా అంతర్లీనంగా ప్రాముఖ్యతను సంతరించుకొని అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నది. అందుకు ప్రధాన కారణం ఉత్పత్తిదారుడే అమ్మకందారుడుగా మారి తయారుచేసిన గుడ్డను యజమాని నేరుగా మార్కెట్ సెంటర్లలో కొందరు నేరుగా, మరికొందరు ఏజెంట్ల ద్వారా అమ్మకాలు జరిపిన తరుణంలో అక్కడి మార్కెట్ పరిస్థితుల యొక్క ప్రభావం పోటీగా దేశంలోనే అతిపెద్ద ఉత్పత్తి కేంద్రాలుగా పేరుగాంచిన తిరుపూర్, సూరత్, అహ్మదాబాద్, సోలాపూర్ లతో పోటీకి ధీటుగా నిలిచే ప్రయత్నాలు సిరిసిల్ల వస్త్ర యజమానుల వస్త్ర ఉత్పత్తులు అంతగా నిలువలేకపోయాయి. దానికి ప్రధాన కారణం ఏదేని ఒక వస్త్ర పరిశ్రమకు కావలసినటువంటి రవాణా మార్గాలైన ప్రధాన రైల్వే మార్గాలు , అతిపెద్ద అంగడి మార్కెట్లు చేరువలో లేక పెద్ద మొత్తంలో భారాన్ని. మోస్తున్నది. దిగుమతిగా తయారు చేసే విషయంలో, ఎగుమతి చేసే విషయంలో కానీ భరించి ప్రధాన పోటీ ఇవ్వలేకపోగా అయినా సిరిసిల్ల ప్రాంతంలో అతిపెద్ద సామాజిక వర్గం పద్మశాలి వర్గం ఉండడం వల్ల వారికి ప్రధాన వృత్తి చేనేత వృత్తి అవ్వడం ఆటుపోట్లు ఎదుర్కొన్న గానీ నమ్మిన వృత్తిని వదలక, మరో కొత్త వృత్తిలో అనుభవం లేక ఒక్కోసారి తీవ్ర విపత్కర పరిస్థితులు అయిన ( మందం)లను ఎదుర్కొన్నది. అప్పుడు నమ్ముకున్న వృత్తితో వారి జీవనం గడపలేక ఆత్మహత్యలు చేసుకోవడం అనేకమందిని దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఆ సమయంలో ప్రభుత్వ నేపథ్యం సిరిసిల్లకు ఎంతైనా అవసరం అని భావించి పలు ఉపాధి పథకాలు కొన్ని ప్రత్యేకమైనవి కార్మికులకు, ఆసాములకు, యజమానులకు ప్రభుత్వాలు కల్పించినవి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందు గతంలో చేనేత కార్మికులు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్న ఆ సమయంలో అప్పటి ప్రభుత్వ అధికారులు గోడలపై “జోట కూసున్నదని ఊరుకోకు, పూట గడుస్తలేదని ఉరి వేసుకోకు ” ఈ అక్షరాలు రాయించిన సందర్భంలో వివిధ ప్రాంతాల నుండి బస్సులలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు చూసి ఏమిటి ఈ పరిస్థితి అని చాలా మందిని ఆలోచింపజేసింది. చేనేత కార్మికుల యొక్క ఆత్మహత్యలు జరుగుతున్న సందర్భాన్ని అప్పట్లో గ్రహించిన సినీ నటుడు చిరంజీవి సిరిసిల్లకు విచ్చేసి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారా? నేత కార్మికులను ఉద్దేశించి తన సానుభూతి మాటలు తన ప్రసంగంలో వినిపించాయి. తెలంగాణ ఉద్యమం ఉధృతమైన సమయంలో సిరిసిల్ల ప్రాంత పరిస్థితులలో ప్రధాన సమస్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, మరియు పలు సమస్యలకు పరిష్కార దిశగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం “బతుకమ్మ చీరల తయారీ” పథకాన్ని రూపొందించి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో వెలుగులు నింపే ప్రయత్నం చేయటంలో ప్రధాన భాగం అయింది.
మార్పు దిశగా” బతుకమ్మ చీరల తయారీ పథకం “
దశాబ్దాల నుండి యజమానులు, ఆసాములు, కార్మికులు మూడు విభాగాలుగా సిరిసిల్ల సామాజిక వర్గం లో ప్రధానంగా పద్మశాలి వర్గం ఉత్పత్తిని కొనసాగిస్తున్నది. అయితే సొంత వ్యాపారాలను అనాదిగా కోనసాగిస్తున్న ప్పటికీ అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నది. కానీ బతుకమ్మ చీరల తయారీ పథకం సిరిసిల్ల సమాజంలో మార్పు దిశగా అడుగులు వేసింది. గతంలో ఇతర రాష్ట్రాలలో,ఇతర ప్రాంతాలలో వ్యాపారాలతో తలమునకలుగా ఆటుపోట్లు ఎదుర్కొన్న కష్టాలకు ఇక చరమగీతం పాడి ఒక కొత్త మార్గంలో ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరల తయారీ సంవత్సరంలో ఎక్కువ రోజులు పని కల్పించడం ఒక భాగమైతే, ఆర్. వి.ఎం ఆర్డర్లైనా స్కూల్ యూనిఫామ్ లు గుడ్డ తయారు కూడా కొంత భాగమైంది. చేనేతన్నలకు ఉపాధి కోసం ఏర్పాటుచేసిన బతుకమ్మ చీరల తయారీ పథకం అనేక సంస్థలు ఇట్టి ప్రయోగాన్నిఅభినందించడం జరిగింది. పెద్ద మొత్తంలో నేత అనుబంధ సంఘాలలో అనేక మార్పులుగా మ్యాక్స్ సొసైటీలు గా ఏర్పడి ప్రభుత్వ ఆర్డర్లను తయారుచేసి గతంలో కంటే చీరల ఉత్పత్తిపై సిరిసిల్ల నేత కార్మిక వర్గం ఎక్కువగా సుముకత చూపింది. ఇది శాశ్వత పరిష్కార మార్గంగా మారాలని యోచించింది.
నేత కళాత్మకత ఒక ప్రత్యేకం
నేతతో అనేక కళాత్మకాలను సృష్టించిన ఘనత కూడా సిరిసిల్ల వాసులకే దక్కడం ఒక ప్రత్యేకత. అగ్గిపెట్టలో అమర్చేంత చీరను తయారుచేసిన కళాకారులు సిరిసిల్ల లో ఉండడం యావత్ ప్రపంచాన్ని ఆలోచింపజేసింది. సిరిసిల్ల ప్రాంత నేత కళాకారులకు ఒక ప్రత్యేక తర్ఫీదు ఇప్పిస్తే మరిన్ని నూతన ఆవిష్కరణలను చూసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
అనుబంధ సంఘాల ఆవేదన
కాటన్ ప్రభుత్వ చీరలు రావాలి!
కాటన్ పరిశ్రమను కాపాడాలి!!
వస్త్రోత్పత్తికి అనుబంధంగా నిలిచిన సైజింగ్ పరిశ్రమ, అద్దకం పరిశ్రమ ప్రధాన ఇబ్బందులను ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఇటీవల కాటన్ వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఐక్యవేదిక ఆవేదన వ్యక్తం చేసింది. కళాత్మకత సృజన కలిగిన కార్మికులు పెద్ద సంఖ్యలో సిరిసిల్ల కార్మిక వర్గం ఆధారపడి ఉందని వారికి చేయూత అవసరమని, అందుకు ప్రభుత్వ పథకాలైన ఆర్డర్ల ఆవశ్యకమని తెలుపుతూ ఇటీవల దసరా పండుగ సందర్భంగా కాటన్ ప్రభుత్వ చీరలు రావాలి! కాటన్ పరిశ్రమను కాపాడాలి!! అంటూ ఫ్లెక్సీలతో సిరిసిల్ల లో దసరా పండుగ వాతావరణంలో పట్టణం మొత్తం అనుబంధ సంఘాల ఆవేదనను వ్యక్తం చేయడం గమనించదగ్గ విషయం.
సిరిసిల్లకు ప్రభుత్వ పథకాలే ఆధారం
యార్న్ డిపో ఏర్పాటు మరో మలుపు
సిరిసిల్ల చేనేత వస్త్ర పరిశ్రమ రూపాంతరాలు చెంది మరమగ్గాలపై అనేక కళాకృతులు ఇతర ఉత్పత్తులు తయారుచేసిన దశాబ్దాల చరిత్ర కలిగిన సిరిసిల్ల నేత కార్మికులకు ఉపాధి విషయంలో శాశ్వత పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న విషయం అందరికీ తెలుసు మరో . కొత్త కోణంలో నేటి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి వస్త్రోత్పత్తికి అవసరమైన యార్న్ డిపో ఏర్పాటు చేయుటకు నిర్ణయం తీసుకున్న సంగతి సిరిసిల్ల వస్త్ర వ్యాపారులలో మళ్లీ మరో కొత్త కోణంలో నేత ఉత్పత్తులపై ఆశలు చిగురించాయి.
రెక్కాడితే గానే డొక్కాడని జీవితాలను గడుపుతున్న నేత కార్మికులకు గతంలో ఉత్పత్తి, మార్కెట్ మాంద్యం లాంటి అనేక పరిస్థితుల ప్రభావం కార్మికులపై పడగా ఆ పరిస్థితుల మార్పుకై మొదటగా “బతుకమ్మ చీరల తయారీ పథకం ” గత ప్రభుత్వం ప్రవేశపెట్టి కొత్త మార్గంతో సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టగా నేడు “యార్న్ డిపో” ద్వారా వస్ట్ర ఉత్పత్తికి ప్రధాన భాగంగా నిలిచే నూలును ప్రభుత్వం అందించే ప్రయత్నం మరో నూతన ఆవిష్కరణకు, మార్పుకు మార్గం చూపుతోందని భావిస్తున్న సిరిసిల్ల చేనేతన్నల ఆశాభావం. పడుగులను నమ్ముకున్న నేతన్నల బతుకు జీవన చిత్రంలో నూతన ఆవిష్కరణలు వారి నుండి వెలువడాలని ఆశిద్దాం.