యాసంగి ముచ్చట్లు పుస్తక సమీక్ష
“యాసంగి ముచ్చట్లు” అనే శీర్షిక తెలంగాణ రైతు నిఘంటువులోని అరుదైన శబ్ద ప్రయోగం మరియు మొత్తం సంపుటి తెలంగాణ అస్తిత్వానికి కవితోదాహరణము. ఈ పుస్తకం నిండా తెలంగాణ మాండలిక పరిమళము విభిన్న దృక్పథాల, భిన్న కోణాల నుండి వ్యాపించి యాసంగి పేరిట తెలంగాణ అస్తిత్వాన్ని దృశ్యీకరించింది. తెలంగాణ సాధనకై జరిగిన తొలి,మలి,దశల ఉద్యమస్ఫూర్తిని రచయిత్రి డాక్టర్ వాణి దేవి దేవులపల్లి తన సాహితీ వస్తువుగా ఎంచుకొని మొత్తం తెలంగాణ ఉద్యమ సమరంలో నుండి అంకురించిన అభ్యుదయ విప్లవాగ్నులను ఒక సంకలనంగా ప్రచురించడం అత్యంత ప్రశంసనీయం.
ఈ సంపుటి కవులు తెలంగాణ యాస పైన ముఖ్యంగా మాండలికం పట్ల వారి అభిమానాన్ని ప్రతి పేజీలో చాటుకున్నారు. తెలంగాణ కవిత్వంలో ఆత్మగౌరవ చైతన్య స్వరూపం “యాసంగి ముచ్చట్లు”. తెలంగాణ సాహిత్యం అనేది కేవలం కవిత్వ పరంపర కాదు. అది ఒక సామాజిక చరిత్ర, ఒక ప్రతిఘటన స్వరం, ఒక ఆత్మగౌరవ ఉద్యమం. అటువంటి సాహిత్య ప్రవాహంలో వెలువడిన ముఖ్యమైన కవితా సంపుటి “యాసంగి ముచ్చట్లు”. డా. దేవులపల్లి వాణీదేవి గారి సంపాదకత్వంలో రూపొందిన ఈ సంపుటి, తెలంగాణ ఉద్యమానికి ముందు తరువాత కాలాల్ని అనుసంధానిస్తూ, తెలంగాణ ప్రజల జీవన చైతన్యాన్ని కవిత్వంగా మలిచిన అరుదైన ప్రయత్నం.తెలంగాణ ఉద్యమం ఈ సంపుటి కవిత్వానికి ప్రాణాధారం. “యాసంగి ముచ్చట్లు” సంపుటిలోని కవితలు తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ సంఘటనగా కాకుండా ప్రజల జీవన అనుభవంగా ఆవిష్కరిస్తాయి. నీళ్లు, నిధులు, నియామకాల వంటి సమస్యల వెనుక ఉన్న మానవ వేదనను ఈ కవితలు హృదయపూర్వకంగా చూపిస్తాయి.

దాశరథి గారి “నా తెలంగాణ” వంటి కవితలు ఉద్యమానికి మూల వేదనను ప్రతిబింబిస్తే, ఉద్యమానంతర కవితలు ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తాయి. ఇలా ఈ సంపుటి ఉద్యమాన్ని కాలప్రవాహంలో చూపగలిగింది. తెలంగాణ యాస భాష మాత్రమే కాదు, సాంస్కృతిక ప్రతిఘటన “యాసంగి ముచ్చట్లు” సంపుటిలో ముఖ్యంగా గమనించాల్సిన అంశం తెలంగాణ యాసకు ఇచ్చిన ప్రాధాన్యం. ఇక్కడ యాస కేవలం భాషా వైవిధ్యంగా కాదు, ఆధిపత్య భాషలపై ఒక సాహిత్య తిరుగుబాటుగా నిలుస్తుంది. కవులు యాసను అలంకారంగా కాకుండా ఆలోచనా పద్ధతిగా స్వీకరించారు. దీనివల్ల తెలంగాణ ప్రజల మాటలు, పలుకులు, అనుభవాలు సహజంగా కవిత్వంలోకి వచ్చాయి. ఇది “యాసంగి ముచ్చట్లు” సంపుటిని ప్రత్యేకంగా నిలబెట్టే ప్రధాన బలం. యాసంగి భూమి నుంచి పుట్టిన ఆత్మగౌరవం ఈ సంపుటిలో కేవలం భౌగోళిక సంకేతం కాదు, అది రైతు చెమటతో తడిసిన భూమి, కూలీ శ్రమతో గట్టిపడిన నేల, అమరవీరుల రక్తంతో పవిత్రమైన తల్లి. అనేక కవితల్లో మట్టి తల్లిగా, సాక్షిగా, సంరక్షకురాలిగా దర్శనమిస్తుంది. ఈ మట్టితో మనిషికి ఉన్న అనుబంధాన్ని కవితలు భావోద్వేగపూరితంగా ఆవిష్క రించాయి.
మచ్చుకు కొన్ని “ప్రాంతం వాడే దోపిడీ చేస్తే” అన్న కాళోజీ కవితలో అణచివేతకు నైతిక ప్రతిఘటనను స్పష్టంగా ప్రకటిస్తారు. ఇతర ప్రాంతాల వారు దోపిడీ చేస్తే అది అన్యాయం కానీ, స్వంత ప్రాంతపు పాలకులే దోపిడీ చేస్తే అది ఘోర నేరం అని కవి నిర్భయంగా చెబుతాడు. ఇది ప్రాంతీయ చైతన్యాన్ని నిద్రలేపే కవిత. ప్రధాన భావం దోపిడీ ఎవరు చేసినా తప్పే స్వంతవారే దోపిడీ చేస్తే మరింత బాధాకరం ప్రజల మౌనం కూడా నేరమే. కవితా ప్రత్యేకత,నేరుగా మాట్లాడే శైలి,అలంకారాల్లేని వాక్యాలు,సత్యవచన పలుకుబడుల కవిత్వం.
“మట్టి పూల పరిమళం” అరుణంపూడి లక్ష్మిగారి కవితలో కవయిత్రి తెలంగాణ పల్లె జీవనాన్ని సున్నితమైన భావాలతో చిత్రిస్తారు. మట్టి నుంచి పుట్టిన పువ్వుల పరిమళంలా, పల్లె జీవితం సాధారణంగా కనిపించినా అంతర్లీనంగా గొప్ప సౌందర్యం, ఆత్మీయత దాగి ఉందని తెలియజేస్తారు.నిజమైన సౌందర్యం నగరాల్లో కాదు మట్టిలో దాగి ఉంది అని సందేశం. కాకతీయ వైభవం కవితలో, చెరువుల సంస్కృతి, పల్లె పండుగలు, జానపద సంప్రదాయాలు,ఇవి అన్నీ ఈ సంపుటిలో బలంగా ప్రతిఫలించాయి.
కాకతీయ వైభవం వంటి కవితలు తెలంగాణకు చరిత్ర లేదన్న అపవాదును ఖండిస్తాయి. చరిత్రను గర్వంగా గుర్తుచేస్తూ, సమకాలీన తెలంగాణకు ఆ వారసత్వం అవసరమని సూచిస్తాయి. మహిళా కవిత్వం ఒక నిశ్శబ్ద విప్లవంగా కనిపించింది. ఈ సంపుటిలో మహిళా కవుల కవితలు ముఖ్యమైన భాగం. వారు తెలంగాణ ఉద్యమాన్ని తల్లి, భార్య, కూలీ, రైతు మహిళల దృష్టితో చూశారు. మహిళా అనుభవాలను విలాపంగా కాకుండా చైతన్య స్వరంగా మార్చడం ఈ సంపుటిలోని విశేషం. దీని వల్ల “యాసంగి ముచ్చట్లు” మరింత సమగ్రంగా రూపుదిద్దుకుంది.
విమర్శనాత్మకంగా సమీక్ష అనంతరం కొన్ని కవితల్లో నినాదాత్మకత ఎక్కువగా కనిపించినా, అది ఉద్యమ సాహిత్య సహజ లక్షణమే. భావ ప్రాధాన్యత వల్ల కొన్ని చోట్ల నిర్మాణ సౌష్టవం prose in poetry లా కనిపించినా సంపుటి ఉద్దేశాన్ని అది తగ్గించలేదు. ఎందుకంటే ఈ కవితలు సాహిత్య అలంకారాల కోసం కాకుండా సామాజిక బాధ్యత కోసం రాయబడ్డాయి. యాసంగి ఒక కవితా సంపుటి మాత్రమే కాదు. ఇది తెలంగాణ ఉద్యమానికి సాహిత్య రూపం, ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక, భవిష్యత్ తరాలకు చరిత్రగా నిలిచే పత్రం.
తెలంగాణను మర్చిపోకుండా గుర్తుచేసే, పోరాట స్పూర్తిని నిలబెట్టే సాహిత్య కృషిగా ఈ సంపుటి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.తెలంగాణను అర్థం చేసుకోవాలంటే రాజకీయ చరిత్ర లో భాగంగా “యాసంగి ముచ్చట్లు” వంటి కవిత్వాన్ని కూడా చదవాలి.
“యాసంగీ ముచ్చట్లు” సంపుటిలోని మొత్తం కవిత్వానికి స్పష్టంగా, అంశాల వారీగా సమగ్రంగా విశ్లేషిస్తే, సంపుటి అనేది కేవలం కవితల సమాహారం కాదు.
ఇది తెలంగాణ చరిత్ర,స్మృతి,పోరాటం, ఆత్మ గౌరవం ప్రజల యాస, నేల, జీవన తత్వం, రాష్ట్ర సాధన తర్వాత కూడా కొనసాగాల్సిన ఆత్మగౌరవ చైతన్యం కలిసిన ఒక సాంస్కృతిక పత్రం. తెలంగాణ ఒక భౌగోళిక గుర్తింపు కాదు,అది చైతన్యపు స్థితి, తెలంగాణ ఉద్యమం చరిత్రగా కాదు, జీవన స్మృతి. ఈ కవితల్లో ఉద్యమం గురించి మాట్లాడేటప్పుడు తేదీలు, నినాదాలు కాదు, రక్తం, కన్నీరు, త్యాగం, నిశ్శబ్ద గౌరవం, ప్రధానంగా కనిపించేది విద్యార్థి, ఉద్యమం, రైతు, ఆకలి, నిరుద్యోగ యువకుడి తిరుగుబాటు, అమరవీరుల మౌనకేక, ఉద్యమాన్ని గతంగా కాక వర్తమాన బాధ్యతగా చూపిన దృష్టి ఇది. ఈ సంపుటిలోని ముఖ్యమైన సాహిత్య బలం తెలంగాణ యాస. యాస భాష కాదు, ప్రతిఘటన ఇక్కడ యాస అలంకారం కాదు, కవితా ప్రయోగం అంతకంటే కాదు, అది నిఖార్సయిన ప్రజల ఉచ్ఛ్వాస నిశ్వా సాల వ్యక్తీకరణ. ఈ సంపుటిలో కవులు యాసను వాడలేదు, యాసలోనే ఆలోచించారు. ఇది ఆధిపత్య భాషపై నిరాకరణ,పల్లె భాషకు గౌరవ పీఠిక, సాంస్కృతిక స్వాతంత్ర్య ప్రకటన. భూమి మాత్రమే కాదు శ్రమ, జ్ఞాపకం, శరీరం,రైతు, కూలీ, పల్లె మహిళ అందరి చెమట ఈసంపుటిలో కలిసినట్టు కవితలు చూపిస్తాయి.ఈ సంపుటిలో మహిళా కవుల భాగస్వామ్యం చాలా బలంగా కనిపిస్తుంది.వారి కవితల్లో బాధను విలాపంగా కాదు తిరుగుబాటుగా, ప్రశ్నగా, స్వరంగా, తెలంగాణ ఉద్యమాన్ని స్త్రీ దృష్టితో చూడటం ఈ సంపుటిని మరింత సంపూర్ణం చేస్తుంది. ఈ సంపుటిలో ఉన్న కవితలు భావకవిత్వం,ఉద్యమ కవిత్వం, సాంస్కృతిక కవిత్వం, చారిత్రక స్మరణ సమకాలీన రాజకీయ వ్యాఖ్య అన్ని కలిసి ఒకే దారిలో నడుస్తాయి.

కొండపల్లి నిహారిణి గారి “అక్షర దీపం” కవిత ఒక సామాజిక స్పూర్తిని కలిగించే కవిత. అక్షరాల శక్తిని గుర్తు చేస్తూ, ప్రతి వ్యక్తి జీవితంలో విద్య ఎంత కీలకమో భావగర్భితంగా తెలియజేస్తుంది. ఇది చదివిన పాఠకునిలో ఆలోచనను రేకెత్తించే, బాధ్యతను గుర్తు చేసే కవిత.ఉపమానాలు, రూపకాలు సమర్థంగా ఉపయోగించబడ్డాయి భాష సులభం అయినా భావం లోతైనది సామాజిక చైతన్య కవిత్వ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి.
బాలబోయిన రమాదేవి గారి “గేయాల గొంతులు” కవిత శబ్దం, స్వరం, పాట అనే బాహ్య మాధుర్యం వెనుక దాగి ఉన్న సామాజిక వాస్తవంను ప్రశ్నించే భావగర్భితమైన రచన. ఇది కేవలం పాటల గురించి కాదు మనుషుల గొంతుల్లో వినిపించే నకిలీ మాధుర్యం, మోసపూరిత స్వరాలపై గట్టి వ్యాఖ్య.“గేయాల గొంతులు” ఆధునిక సమాజంలో మాటల మాయను ఎండగట్టే ప్రభావవంతమైన కవిత. ఇది పాఠకుడిని వినేవాడిగా కాక, ఆలోచించే వ్యక్తిగా మారుస్తుంది.
డాక్టర్ పోరెడ్డి రంగయ్య గారు రచించిన ‘ఉనికి‘ అనే కవితలోఉపయోగించిన భాషా ప్రయోగం ‘ఒడ్డు లేని నదికి ఉనికి ఎక్కడిది’, ‘అక్షరం భిన్న రూపాల కూడలి కదా’ రచయిత యొక్క సాహిత్య పరిణితి తెలుపుతోంది
‘కర్నాల బంకు’ అనే కవిత రచించిన స్వప్న కృష్ణ గారు ఉపయోగించిన తెలంగాణ మాండలిక శబ్దాలు ‘ఎగిలివారంగానే, మాపటేలికి, అంబటాళ్లకు, పొద్దాక, ఆకిట్ల, తెలంగాణ అస్తిత్వాన్ని కి నిలువెత్తు రూపాలుగా నిలిచాయి. రచయిత తన బాల్యపు జ్ఞాపకాలలో అరుగు ఎంత ఆకర్షించిందో ఎన్ని విషయాలకు సాక్ష్యం అయ్యిందో,వర్తమానంలో కవి ఎంత మిస్ అవుతున్నాడో తన కవితలో అద్భుతంగా వర్ణించారు.
‘తరగనినిధి’ అనే కవితలో రచయిత్రి శారదా హనుమాన్లు గారు భారతీయ సాంప్రదాయ నారి వర్ణనలో ఉపయోగించిన పదచిత్రాలు ‘నిలువెత్తు శ్రమ సౌందర్యదివిటి ,అంగిటిలో రచించిన ఆశుకవిత సంపుటి, దిగుట్లో ఎల్గిలీను దివ్వె, తెలంగాణ తల్లికి ప్రతిరూపాలుగా నిలిచాయి.
కవయిత్రి వకుళా వాసు గారు వ్రాసిన ‘అంటుకోని కుంపటి’ లో ఓ అవ్వ, దినసరి కూలి, తన కాయకష్టముతో రోజంతా శ్రమించి సంపాదించిన కూలి డబ్బులు తాగుబోతు వ్యసనపరుని పాలయినందున, పొయ్యి మండలేదు, అన్నం ఉడకలేదు అని చెప్పటంలో తెలంగాణ సగటు పల్లె కూలి నిత్య రోదన చిత్రాన్ని ఆవిష్కరించింది. ఒక స్త్రీ పడుతున్న వేదనకు దర్పణంలా, కవయిత్రి సామాజిక బాధ్యతను తెలిపింది. డాక్టర్ కాసర్ల రంగారావు గారి ‘అభివృద్ధి జాగృతి తెలంగాణలో’ అనే కవిత,ఉద్యమానికి ఉన్న లోతు, తీవ్రత, నిజాయితీని తెలిపింది. అలాగే ఐక్యత, నిరంతర, జాగృతి ఉంటేనే నిజమైన బంగారు తెలంగాణ సాధ్యం అని కవి అభిప్రాయం.
‘వసంత స్వప్నం’ అనే కవితలో డాక్టర్ అసనాల శ్రీనివాస్ గారు అభ్యుదయ భావజాలంతో ఒక భావ కవితను తన వ్యక్తిగత అనుభవము, సామాజిక చైతన్యము, తెలంగాణ ఆశయాలు, ఈ మూడు అంశాలత్రయంలో వ్యక్తీకరించారు. తన వసంత స్వప్నంలో మార్పు, విప్లవం, అభ్యుదయం, ప్రగతిశీల వాదాన్ని బలపరుస్తూ ఒక అద్భుతమైన భావావేశాన్ని వెల్లడించారు.
డుంబై శేష పణి గారు రచించిన ‘తెలంగాణ వైభవంలో’ పండుగల గురించి మరియు తెలంగాణ వైతాళికుల గురించి తెలంగాణకు వన్నెతెచ్చిన ప్రకృతి పూల పరిమళాల గురించి ఒక భావ కవిత్వాన్ని తనదైన సంప్రదాయ శైలిలో వెలువరించారు.
దేవనపల్లి వీణా వాణి గారు రాసిన కవిత “పురోగమి” కవితలోని ప్రధాన ఇతివృత్తం చైతన్యం. సమాజంలో అన్యాయం లేదా అశాంతి అనే చీకటి అలుముకుంటున్నప్పుడు, భయపడి ఇంట్లోనే కూర్చుంటే ఆ చీకటిని ఎవరూ ఆపలేరు. “దీపం వెలిగించడం” అనేది ఇక్కడ ఒక బాధ్యతకు ప్రతీక. మన చుట్టూ జరుగుతున్న తప్పులను చూసి స్పందించకపోవడం కూడా ఒక నేరమేనని కవయిత్రి నొక్కి చెప్పారు. “రోజులు మారుతుంటాయి” అనే పంక్తి ఈ కవితకు వెన్నెముక వంటిది. ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా, సందిగ్ధాలు ఉన్నా, వాటన్నింటినీ దాటుకుని కొత్త రోజులు వస్తాయని కవయిత్రి భరోసా ఇస్తున్నారు. చీకటిని మింగే సూర్యకిరణం లాగా, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని, కాలం ఎప్పుడూ నిశ్చలంగా ఉండదని ఈ కవిత చెబుతుంది. ముసుగు లేని నిజాయితీ అవసరము అని, మనిషి తన లోపల ఒకటి పెట్టుకుని, బయటకు మరొకలా నటించడాన్ని,ద్వంద్వ ప్రవృత్తిని,హిపోక్రిసీనీ ఈ కవిత విమర్శిస్తుంది. మన తప్పుడు ప్రవర్తనను మన అంతరాత్మ అనే అద్దం చూసి ఎగతాళి చేస్తదని అలా బతకడం ఒక మానసిక భారమని హెచ్చరిస్తుంది. అలాగే, వ్యవస్థను నాశనం చేసే శక్తులను గుర్తించి, వాటిని ఎదిరించడమే నిజమైన “పురోగమి” అని వివరిస్తుంది.ఈ కవిత కేవలం ఒక ఫిర్యాదు కాదు, అదొక హెచ్చరిక మరియు ప్రేరణ. అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండటం నేరమని కవిత హెచ్చరిస్తోంది, పాత ఆలోచనలను, అయోమయాన్ని వీడి, కొత్త చూపుతో (New perspective) లోకాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలనీ ఒక ఆశావాదం optimal కోణం ప్రదర్శిస్తుంది. మొత్తానికి పద ప్రయోగంలో సంక్లిష్టత ఉన్నా అద్భుతమయిన వ్యక్తీకరణ ఉంది. ఈ కవిత కవయిత్రి యొక్క సాహితీ పరిణితికి అద్దం పట్టింది.
డా. వాణిదేవి దేవులపల్లి గారు రచించిన “యాసంగి ముచ్చట్లు”. తెలంగాణ పల్లెల్లో యాసంగి (రెండవ పంట కాలం) సీజన్లో కనిపించే ప్రకృతి సౌందర్యాన్ని, సామాజిక మార్పులను మరియు రైతుల ముఖాల్లోని ఆనందాన్ని ఈ కవిత అద్భుతంగా ఆవిష్కరించింది.కవయిత్రి పల్లెలోకి అడుగుపెట్టగానే “సంపెంగల వాసన” గుప్పుమన్నట్లు చెప్పడం ద్వారా గ్రామీణ పరిమళాన్ని గుర్తుచేశారు. ఊరంతా ఒక పండుగ వాతావరణం నెలకొందని, పల్లె తల్లి “పచ్చని చిలకపచ్చ చీర” కట్టుకున్నట్లుగా పొలాలు కళకళలాడుతున్నాయని వర్ణించడం కవితాత్మకంగా ఉంది. కవితలో ఒక ముఖ్యమైన మలుపు “మిషన్ కాకతీయ” ప్రస్తావన. ఎండిపోయిన చెరువులకు పూర్వ వైభవం రావడం, “కన్నీళ్లు కూడా రాల్చని పల్లె బతుకుల్లో పన్నీటి కాల్వలు గట్టించడం” అనే మాటలు తెలంగాణలో జరిగిన నీటి వనరుల పునరుద్ధరణను సూచిస్తున్నాయి. తరాల కరువుతో తల్లడిల్లిన ప్రజల గుండెల్లో ధైర్యం నింపిందని కవయిత్రి భావోద్వేగంగా చెప్పారు. పంటలు బాగా పండటంతో పల్లెల్లో కుల వృత్తులకు మళ్ళీ పని దొరికిందని కవిత పేర్కొంది. పొలాల్లో నాట్లు వేస్తున్న మహిళల పాటలను, వారి చేతి గాజుల సవ్వడిని కవయిత్రి జానపద శైలిలో వర్ణించారు. “దుక్కి దుక్కి దున్నంగ ఓ రాచగుమ్మడి…” వంటి పాటల ప్రస్తావన తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. శ్రమను కూడా ఒక వేడుకగా మార్చుకునే పల్లె పడుచుల ఉత్సాహం ఇక్కడ కనిపిస్తుంది. కవిత చివరలో పల్లె తల్లిని ఒక ముత్తైదువలా వర్ణించారు. కళ్లకు “సంతోషపు కాటుక” పెట్టుకుని, నిండుగా ఉన్న పల్లెను చూసి కవయిత్రి మురిసిపోయారు. ఎన్నాళ్లకో పల్లె ముఖం మీద ఈ నవ్వులు కనిపిస్తున్నాయని ఆవేదనతో కూడిన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కవిత నిండా అల్లుకున్న పదబంధాలు యాసంగి ముచ్చట్లు, గుండె తడి మత్తడి దున్నితే అలుగు వెల్లుగ బారింది కవితకు అదనపు ఆకర్షణ.
డా. దేవులపల్లి వాణీదేవి గారి సంపాదకత్వం ఈ సంపుటికి ‘దిశ‘ ఇచ్చింది. యాదృచ్ఛిక కవితల ఎంపిక క్రమపద్ధతి, భావాత్మక ఏకత్వం,ఒక సాహిత్య ఉద్యమానికి రూపము. ఇవి అన్నీ సంపాదక బాధ్యతలో ప్రతి బింబించాయి. ఈ కసరత్తులో సంపాదకురాలు ప్రథమ శ్రేణి ఉత్తీర్ణులు.విమర్శాత్మకంగా చూసినప్పుడు కొన్ని కవితల్లో భావం బలంగా ఉన్నా, నిర్మాణం సడలింది,కొన్ని చోట్ల నినాద స్వభావం పెరిగింది కానీ ఇది సంపుటి ఉద్దేశానికి లోపం కాదు ఉద్యమ సాహిత్యంలో ఇది సహజ లక్షణం. మొత్తం కవితలలో తెలంగాణ మాండలికం ప్రయోగం జరిగినా అక్కడక్కడ గ్రాంథికం నల్ల వెంట్రుకలలో తెల్ల వెంట్రుకలుగా కనిపించింది. “యాసంగి ముచ్చట్లు” తెలంగాణ ఉద్యమానంతర కవిత్వానికి ఒక డాక్యుమెంట్, భవిష్యత్ తరాలకు ఒక సాంస్కృతిక సాక్ష్యం, ఆధిపత్య భాషా సంస్కృతి మీద ఒక సాహిత్య ప్రతిఘటన,ఈ సంపుటి చదవడం అంటే కవితలు చదవడం కాదు,తెలంగాణను తిరిగి గుర్తుచేసుకోవడం.ఇది మర్చిపోతున్న చరిత్రకు జ్ఞాపకం,అలసిపోతున్న ఆత్మగౌరవానికి మేల్కొలుపు, భవిష్యత్ తెలంగాణకు దిశాసూచి. మొత్తంగా “యాసంగి ముచ్చట్లు” అనే సంపుటి ఒక “మాండలిక ఉప్పెన”
