Home ఇంట‌ర్వ్యూలు అఖిల పురషార్ధాలకు నిలయం సంస్కృతం

అఖిల పురషార్ధాలకు నిలయం సంస్కృతం

ముదిగొండ అమర్నాథశర్మ

ముదిగొండ అమర్నాథశర్మ:– అమ్మా నమస్సులు.

పద్మజ:– మీ నేపధ్యం మయూఖ పాఠకులకు వివరిస్తారా?

అమర్నాథశర్మ:– మా మాతా పితరులు సిద్ధమణీ- రామనాథశాస్త్రి గారు. మా తండ్రిగారు సంస్కృతాంధ్రాలతో పాటు వేదాధ్యయనం చేసి, పంచ శతాధిక చండీయాగాలు, దేవాలయ ప్రతిష్టలు చేసినవారు. నా జన్మస్థలం లచ్చపేట. దుబ్బాక మండలం పూర్వం మెదక్ జిల్లా… ప్రస్తుతం సిద్దిపేట.

పద్మజ:– మీ విద్య- వృత్తి- ప్రవృత్తుల గురించి వివరిస్తారా?

శర్మ గారు:- నేను లచ్చ పేటలో ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి పూర్తి చేసుకొని, ఇంట్లో అమర కోశం, శబ్ద మంజరి అధ్యయనం చేసి, కొంత పునాది పడగానే వేములవాడకు వెళ్లి ఆరవ తరగతి నుండి
బి ఏ (ఎల్) వరకు శ్రీ రాజరాజేశ్వర సంస్కృత పాఠశాలలో- కళాశాలలో 1980 నుండి 1990 వరకు విద్యాభ్యాసం పూర్తి చేసాను.

పద్మజ:– సంస్కృత భాష పై మీకు అనురక్తి ఎలా కలిగింది?

శర్మ గారు:– మా గురువుగారు శ్రీమాన్ కల్వకుంట్ల నరసింహచార్యుల ఆశీస్సులతో సంస్కృత భాషపై అనురక్తి, పట్టు కలిగింది. తదుపరి కళాశాల స్థాయిలో మా గురువు గారు సంస్కృతాంధ్ర విద్వన్మణి బ్రహ్మశ్రీ తిగుళ్ళ శ్రీహరి శర్మ గారి సాహిత్య, అలంకారిక, న్యాయ, వేదాంత, వ్యాకరణాది పాఠాలు వింటూ అనుష్ఠుప్ ఛందస్సులో శ్లోక రచనకు శ్రీకారం చుట్టాను. నాకు ప్రేరణ శ్రీహరి శర్మ గారు.

పద్మజ:– మీరు ఏ యే రచనలు చేసారు?
శర్మ గారు:– చాముండేశ్వరి అష్టకం, సుప్రభాతం;

శ్రీ మహాకాళీ సుప్రభాతం;
శ్రీరామచంద్ర సుప్రభాతం;
శ్రౌతశైవగణార్చన;
నరసింహోదాహరణం,
శిరీష సమీరం;
విశ్వేశ్వర శతకం (మందాక్రాంత వృత్తంలో) సద్గురు శివానంద స్తోత్రం; శివ కళ్యాణోత్సవ ప్రకరణం మొదలైనవి రచించాను.]

పద్మజ:– మీకు ఇష్టమైన కవి ఎవరు? రచనా వ్యాసంగం ఎలా ప్రారంభమైంది? ఎలా కొనసాగుతున్నది?

శర్మ గారు:– నాకు ఇష్టమైన కవి మహాకవి కాళిదాసు. నా రచన సంస్కృతంలో నిరంతరం కొనసాగుతుంది. ఇప్పటికీ రోజుకు ఒక శ్లోకమైనా రచించినది నిద్రపోను! ఇంకో మహా గ్రంథం త్వరలో రాబోతున్నది…..

పద్మజ:- మహా గ్రంధం రాబోతున్న సందర్భంలో మీకు శుభాకాంక్షలు తెలుపుతూ…

ప్ర :– సంస్కృతం విద్యార్థులు క్షుణ్ణంగా నేరుస్తున్నారా?
బయట ఒక అపవాదు ఉన్నది. ఏమిటంటే మార్కుల కోసం, తరగతులను ఉత్తీర్ణులు కావడం కోసమే సంస్కృత భాషను ఐచ్ఛికంగా ( option) గా తీసుకుంటున్నారని అనుకుంటున్నారు… దీనిలో ఎంత వరకు నిజం ఉందంటారు?

శర్మ గారు:– మీరన్నట్టు సంస్కృతమును మార్కుల కోసమే ఐచ్చికంగా తీసుకుంటున్నారనే అపవాదు కొంతవరకు నిజం. కానీ నేను 30 సంవత్సరాలుగా సికింద్రాబాద్ నడిబొడ్డున ఉన్న సర్దార్ పటేల్ కళాశాలలో సంస్కృత ఉపన్యాసకునిగా, విభాగ అధ్యక్షుడిగా, వైస్ ప్రిన్సిపాల్ గా, ప్రిన్సిపాల్ గా 1993 నుండి వివిధ హోదాలలో పని చేస్తున్నాను. మా విద్యార్థిని విద్యార్థులకు మాత్రం మార్కుల కోసం కాకుండా జీవితంలో మార్పు కోసం పాఠాలు చెబుతూ శుభోదయం అంటూ పలకరిస్తాను. వాళ్లు అలాగే.. సంస్కృతంలోనే జవాబిస్తారు. వారితో సంస్కృతంలో చిన్న చిన్న ప్రసంగాలు చేయిస్తాను. శ్లోక పఠనంచేయిస్తాను. వ్యక్తిత్వ వికాసం, నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, మానవతా విలువల గురించి సంస్కృత సాహిత్యంలోని మహాకవుల కావ్యాలను సులభ శైలిలో వివరిస్తాను.

పద్మజ:- సంస్కృత వ్యాకరణం బోధించే పండితుల కొరత ఉందని ఒక మాట అనుకుంటారు నిజమేనా? ఒక వేళ కొరతను ఎలా తీరుస్తారు?

శర్మ గారు:– సాధారణంగా సంస్కృతం, తెలుగు ,హిందీ భాషలంటే పిల్లలు తరగతులకు సక్రమంగా హాజరు కారు. కానీ పిల్లలే అధ్యాపకులకు ఫోన్ చేసి మరీ పిలుస్తారు క్లాసులకు రమ్మని,అంటే చక్కని బోధకులున్నట్టే కదా! కొరతేమీలేదు!

పద్మజ:- సంస్కృత పరిషత్తు ద్వారా ముద్రింపబడుతున్న గ్రంధాల కొనుగోలు ఎలా ఉంది? ముద్రించుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి ఆశావహ పరిస్థితులున్నాయా?

శర్మ గారు:–ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్న సంస్కృత పరిషత్తు వ్యాకరణాన్ని బోధిస్తూ, ప్రాచీన సంస్కృత గ్రంథాలను పరిశీలించి, ప్రచురిస్తున్నారు. ఇటీవల కాలంలోనే అర్థ శతాధిక గ్రంథాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దిశగా సంస్కృత అకాడమీ డైరెక్టర్ ఆచార్య కే. నీలకంఠం గారు నిరంతర కృషి చేస్తున్నారు.

రంగరాజు పద్మజ:- ప్రాచీన సంస్కృత గ్రంథాలను పరిష్కరించే దిశగా కృషి ఎలా సాగుతున్నది?

శర్మ గారు:– కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులతో సంస్కృత పరిషత్తు గ్రంథాలను ముద్రిస్తుంది.

పద్మజ:–భాషా పరిరక్షణలో భాగంగా ఇంకా ఏం చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం?

శర్మ గారు:– భాషా పరిరక్షణ కోసం పాఠశాల స్థాయి నుండి వ్యక్తిత్వ వికాసం కోసం, మానవతా విలువల కోసం సంస్కృతి సంప్రదాయ రక్షణ కోసం వాల్మీకి, వ్యాస, కాళిదాస, విష్ణుశర్మ వంటి మహాకవుల రచనలను పాఠ్య ప్రణాళికలో చేర్చాలి. ఈ పరిస్థితి మన రాష్ట్రంలో కొరవడింది. మిగతా రాష్ట్రాల్లో కొంతవరకు ఆశాజనకంగా ఉంది.

రంగరాజు పద్మజ:- సంస్కృత భాషా విద్యార్థులకు మీరిచ్చే సలహాలు, సూచనలేమిటీ?

శర్మ గారు:– నేను మా విద్యార్థినీ విద్యార్థులకు “సంస్కృతాన్ని సరిగ్గా ఉచ్ఛరిస్తే మన శరీరంలోని 72 వేలనాడులు సరిగ్గా పనిచేస్తాయి. దానివల్ల ఆరోగ్యంగా ఉంటారు. సంస్కృతం మాట్లాడడం వల్ల ఆదర్శంగా ఉంటారని” అని చెబుతుంటాను. 1985లో సుప్రసిద్ధ కన్నడ సినిమా దర్శకుడు జీ వి అయ్యర్ ఆదిశంకరాచార్య అనే సినిమాను రూపొందిస్తే ఆ సీనిమాకు పలు జాతీయ పురస్కారాలు లభించాయి. కర్ణాటకలోని శివమొగ్గ అనే జిల్లాలో మొత్తం సంస్కృత
భాషలోనే మాట్లాడతారు.

రంగరాజు పద్మజ:- సంస్కృత భాషను ప్రభుత్వ కార్యకలాపాలలో వాడుతారా? దానికి మీరు ఎలాంటి చర్యలు అవసరమనుకుంటున్నారు?

శర్మ గారు:– సంస్కృతాన్ని నేటి ప్రపంచీకరణ యుగంలోనూ నేర్పుగా ఉపయోగించుకోవచ్చు. కంప్యూటర్లలో ఒదిగి ఉండే సాంకేతిక సౌలభ్యం సంస్కృతంలో బలంగా ఉందని భాషా శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పవచ్చు. నేటి పరిస్థితులలో సంస్కృత భాషా ప్రాముఖ్యత గతంలో కంటే ఎక్కువగానే గుర్తిస్తున్నారని తర్కబద్ధంగా కూడా చెప్పవచ్చు.

పద్మజ:– సంస్కృత భాషకు పూర్వ వైభవం తేవడానికి మన వంతు కర్తవ్యాలు ఏమిటి? అంటే పాఠశాలలు – కళాశాలలు కానివ్వండి ఎలాంటి కృషి చేస్తున్నాయి? ముఖ్యంగా సిద్ధాంత గ్రంథాలు సంస్కృత భాషలోనే రాస్తున్నారా? లేక అన్య భాషలలో రాస్తున్నారా?

శర్మ గారు:– సిద్ధాంత గ్రంథాలు దేవ నాగరలిపిలోనే రాస్తున్నారు. నేనైతే నా MPhil మరియు Phd రెండు కలిపి నా దస్తూరీలో దేవనాగర లిపిలో సుమారు 1000 పేజీల గ్రంథం వ్రాసి సమర్పించాను. శైవాగమంలో చంద్రజ్ఞాన ఆగమంపై తెలంగాణలో మొదటి శోధ ప్రబంధం నాది. అది తిరుపతి విద్యాపీఠంలో చేశాను.

పద్మజ:- సంస్కృత భాషాభిమానులు రాసిన గ్రంథాలకు ప్రజల ఆదరణ ఎలా ఉంది?

శర్మ గారు:– సంస్కృత భాషాభిమానులు చాలానే ఉన్నారు. నేను మందక్రాంత వృత్తంలో సంస్కృతంలో విశ్వేశ్వర శతకం రాస్తే ఏక బిగిన చదివి అభిప్రాయాలు తెలియజేసిన వారు చాలామంది పండితులు, పామరులు ఉన్నారు.

పద్మజ:- సంస్కృతం కేవలం పండితులకే పరిమితం అనే ఒక అపవాదు ఉంది దీన్ని మీరు ఎలా భావిస్తున్నారు?

శర్మ గారు:– కేవలం పండితులకే పరిమితం అనే ఒక అపవాదు ఉంది. లేక ఒక వర్గం వారికే అనే మరో వాదన ఉంది. అది ముమ్మాటికి నిజం కాదు. సంస్కృతం పట్ల ఆంగ్లేయుల పాలనా కాలంలో వ్యతిరేకత అంకురించింది. ఆంగ్లేయులు (ఇంగ్లీషు భాషను) వ్యాప్తి చేసుకోవడానికి సంస్కృతాన్ని వ్యూహాత్మకంగా బలహీనం చేశారు. ఇది కేవలం సంప్రదాయ పండితులకే పరిమితం అన్న దుష్ప్రచారాన్ని పెంపొందించి, ఆర్యభాషగా ప్రచారం చేశారు. ఇది నిజం కాదు!

పద్మజ:– మీకు అవధానం చేయడానికి ప్రేరణ ఎలా కలిగింది?

శర్మ గారు;– అవధాన ప్రక్రియ మెతుకుసీమ (మెదక్) కోలాచలంలో ఇప్పుడు కొల్చారంలో మల్లినాథ సూరి తాతగారు శతావధానం చేశారు. ఆయన పేరు కూడా మల్లినాథసూరే! ఆయన సంస్కృతంలో శతావధానం చేశారట. మేము కూడా మెదక్ జిల్లా వాళ్ళం కావడంతో వారి గురించి విని అలా మాకు కొంత ప్రేరణ కలిగింది.

పద్మజ:—మీరూ మరియు మాన్యులు బ్రహ్మశ్రీ ముత్యంపేట గౌరీ శంకరశర్మ గారు కలిసి జంట అవధానాలు చేయాలని ఎందుకు అనిపించింది ?

శర్మ గారు:– మేమిద్దరం కలసి సంస్కృతాంధ్రాలను, శాస్త్రాలతో పాటు అధ్యయనం చేసాం! మా ఇద్దరి భావాలు, పద్య-శ్లోక ఎత్తుగడ, ధార, ధారణ మొదలగు విషయాలలో ఇద్దరిలోనూ సామ్యం ఉంది, కాబట్టి ఇలా యుగళ (జంటగా) అవధానం చేయాలనే సంకల్పం కలిగింది.
2013లో రవీంద్రభారతిలో అవధాన సప్తాహం జరిగింది. ప్రతిరోజు నిర్వాహకులు ప్రముఖ అవధానులచే అవధానం నిర్వహిస్తున్నారు . ఒకరోజు ఒక శతావధాని (వద్దిపర్తి పద్మాకర్ గారు ) రాలేదు… అకస్మాత్తుగా వారికి బదులుగా మా యుగళావధానం ఏర్పాటు చేశారు. గొప్పగొప్ప విద్వాంసుల మధ్య.

రంగరాజుపద్మజ:– కొత్తగాఅవధానాలు చేయబోయే… చేస్తున్నవారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు?

శర్మ గారు:– ప్రాచీన సాహిత్యాన్ని కూలంకషంగా అధ్యయనం చేయాలి. నిరంతర రచన కొనసాగాలి, ధారణ కోసం ఫోన్ నెంబర్లు, వస్తువుల జాబితా మొదలగునవి యంత్ర సహాయాన్ని లేకుండా గుర్తు పెట్టుకోవాలి. ప్రతిభ, ఉత్పత్తి , అభ్యాసం, సమయస్ఫూర్తి , ధైర్యస్థైర్యాలు, ఆర్షవాజ్ఞ్మయ అధ్యయనం, ఇవీ నేను భావి అవధానులకిచ్చే సలహాలు!

పద్మజ:– తెలుగు భాష గురించి ఒక్క మాటలో ఏంచెప్తారు?
శర్మ గారు:–
తెలుగు భాషకన్న గొప్ప వెలుగు లేదు
అదియె రాని యేయెడల నంధకారమే యంత!

పద్మజ:– సంస్కృతం గొప్పదనం గురించి ఏం చెప్తారు?
శర్మ గారు :– లలిత కళలకు , అఖిల పురషార్ధాలకు నిలయం సంస్కృతం ! అలాంటి సంస్కృతాన్ని మనమందరం కాపాడుకోవాలి.

పద్మజ:– అవధానం అనేది తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైన ప్రక్రియ. సంస్కృతం -తెలుగు కాకుండా వేరే ఏ ఇతర భాషలలో ఈ ప్రక్రియ లేదు. అతి కష్టమైన సమస్యలను అలవోకగా, చమత్కార పూరణలను అవలీలగా పూరిస్తూ, అసంబద్ధ, అసంధర్భ ప్రశ్నలను సమర్ధవంతంగా ఎదుర్కొని, ఆశువుగా పద్యాలతో పూరిస్తూ, అవధాని సభలోని శ్రోతలను ఆనందింప చేయడం అనేది అవధాని ప్రత్యేకత. వీటన్నిటిని ఏకకాలంలో అవధాని చేసే సాహితీ విన్యాసమే అవధానము.
అవధానం ఓ సాహితీ వినోదం!
మనసును పూర్తిగా విషయం పై లగ్నంచేసి, తన కిచ్చిన సమస్యలను పూరించడం ఏకాగ్రత తోనే సాధ్యం!
అవధాని సంగీత పరిజ్ఞానం కలవారైతే చమత్కారాలతో, శ్రావ్యంగా గానం చేయడంతో సభను రంజిల చేయగలుగుతాడు.
ఈ అష్టావధానంలో అనేక అంశాలుంటాయి. ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క పండితుడు నిర్వహిస్తాడు. అతనిని పృచ్ఛకుడు అంటారు. అవధాని గారి పాండిత్యాన్ని, సమయస్ఫూర్తిని పరీక్షించడానికి ప్రశ్నలను వారు అడుగుతారు.
ఇందుకుగాను ధారణాశక్తి ఎంతో ఉపయోగకరం.
అవధానాన్ని విద్యార్థులు చూసినా, నేర్చుకున్నా జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచుకోవచ్చును. వారు రాసే పరీక్షలలో ఎంతగానో సహాయకారిగా ఉంటుంది. సాధన చేయడం నేర్పుతుంది. ఈ అవధాన ప్రక్రియ. మెదడు కంప్యూటర్ పనిచేసినట్టు ఏ సబ్జెక్ట్ ఆయా గడులలో నిక్షిప్తం చేసుకోవచ్చును.
సాహితీ ప్రియులకు అవధానిగారి చతురోక్తులు, పద్యాలు ఆనందాన్ని కలిగిస్తుంది.
మహిళలకైతే ఏకకాలంలో ఎన్ని పనులైనా చేయగల ఆలోచన కలుగ చేస్తుంది.
అటువంటి అవధాన ప్రక్రియలో సాటి లేని మేటి నేటి మన మయూఖ పత్రిక అతిథులైన ముదిగొండ అమర్నాథ శర్మగారితో ఈనాటి ముఖాముఖీ ద్వారా చక్కగా ఎన్నో విషయాలు తెలిసాయి.
వారిచ్చిన అమూల్యమైన సలహాలు, సూచనలు రేపటి తరానికి ప్రేరణనిచ్చే గొప్పవిషయాలు…
మనం చదివి వదిలేయకుండా ఆచరణలో పెట్టే ప్రయత్నం చేద్దాం!

You may also like

Leave a Comment