మయూఖతో ముఖాముఖి
నమస్కారం మేడం..మీతో ఇలా ముఖాముఖిలో కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ అధికార భాషా సంఘు అధ్యక్షురాలిగా మా పాఠకులకు మిమ్మల్ని పరిచయం చేయాలని అనుకున్నాం. ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..
1. మీరు పుట్టిన తేదీ, మీ సొంత ఊరు, మీ విద్యాభ్యాసం గురించి చెప్తారా?
జ: నేను పుట్టింది నవంబర్ 2, 1971… పాలమూరు నా జన్మస్థలం. కానీ పెరిగింది మాత్రం నల్లగొండ. నా విద్యాభ్యాసమంతా అక్కడే జరిగింది. మీకందరికీ తెలిసిందే. ఎన్నో ప్రత్యేకతలు ఉండి ప్రముఖమైన కళాశాలగా పేరు పొందిన నాగార్జున కాలేజీ లో బి ఎస్ సి బి జడ్ సి కోర్స్ లో డిగ్రీ చేసాను. తర్వాత అన్నామలై యూనివర్సిటీ నుండి ఎమ్ ఎస్ డబ్ల్యూ ( మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్) పట్టా అందుకున్నాను.
2.. మీ తల్లిదండ్రుల పేర్లు,మీ కుటుంబ నేపథ్యంచెప్పండి.
జ: మా నాయిన పేరు మంత్రి శేషభూషణ్ రావు. అమ్మ మంత్రి రాధాదేవి. పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలో. కానీ మా నాయిన ప్రభావం వల్ల పెరిగింది విప్లవ అభ్యుదయ భావజాలంతో. చదువనేది సర్టిఫికెట్ల కోసం, మార్కులు, ర్యాంకుల కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం, పేదల అభ్యున్నతి కోసం, సంస్కారవంతమైన చదువు చదవాలని, మనిషికి వాక్భూషణమే సుభూషణమని, ఏ అలంకారాలూ మనిషిని మనిషిగా నిలబెట్టలేవని తెలియజేసిన ఘనత మా నాయినది. అటువంటి కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన నాకు నేటికీ సమాజ సేవా కార్యక్రమాలంటే ఎంతో ఇష్టం.
3. మీరు బహుముఖ కళాకారిణి అని విన్నాం. మీ కళా ప్రావీణ్యత గురించి తెలుసుకోవచ్చా?
జ: అది మీ అందరి అభిమానం. అందుకు ధన్యురాలిని. నాకు సంగీతం, సాహిత్యం, నృత్యం మొదలగు రంగాలలో ప్రవేశం ఉంది. పాఠశాల, కళాశాల స్థాయిలోఎన్నో ప్రదర్శనలిచ్చాను. ఝాన్సీ లక్ష్మీ బాయి ఏక పాత్రాభినయం, నాటికల్లో రకరకాల పాత్రలు, లంబాడీ నృత్యాలు, దేశభక్తి గీతాల మీద నృత్యాలు ప్రదర్శించేదాన్ని. పాటలు, వ్యాసాలు, వక్తృత్వం, నృత్యం వీటిల్లో ఎప్పుడూ ప్రథమస్థానంలో ఉండేదాన్ని. వాటిపై ఎన్నో ప్రశంసలు, బహుమతులు అందుకున్నాను.
4. సాహితీ రంగంలో మీ ప్రవేశం ఎలా జరిగిందో తెలుసు కోవచ్చా?
జ: పువ్వు పుట్టగానే పరిమళించినట్టు బాల్యదశలోనే అన్ని రంగాలలో ముందుండాలని సాహిత్య, సామాజిక రంగాలలో మక్కువ కల్పించిన మా గురువు కీ.శే. కట్టా రామచంద్రారెడ్డి గారిని నేనెప్పుడూ మర్చిపోలేను. బాల్యంలోనే కలం పట్టి కవితలల్లి పలువురి ప్రశంసలు పొందడం నాకు ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని పెంచింది. అంతే గాక మా నాయిన వల్ల కూడా తెలుగు భాషపై మక్కువ ఏర్పడింది. అలా సాహితీ సౌరభాలతో సాగుతున్న నేను ఇవాళ అధికార భాషా పీఠాన్ని అధిరోహించడమంటే సామాన్య విషయం కాదు. ఒక సాధారణ ఉద్యమకారిణికి మన మాన్య ముఖ్యమంత్రి బాపూ కేసీఆర్ గారు ఇంత బాధ్యతను ఇచ్చారంటే దానికి కారణం నేను నిబద్ధతతో బాల్యం నుండి ఇప్పటివరకు సాహిత్య రంగంలో కృషి చేయడమేననిపిస్తుంది.
5. మీరు ఈ పదవిలోకి వచ్చాక వేదికల మీద మీ ఉపన్యాసాలు విన్నాము.. అద్భుతమైన సాహితీ ధారతో, వాక్పటిమతో మీరు మాట్లాడడం మమ్మల్ని అబ్బురపరిచింది. ఇంతటి ప్రతిభావంతులైన మీరు ఏవైనా రచనలు చేశారా?
జ: చిన్నప్పటి నుండే నాకు పుస్తకాలు చదివే అలవాటు ఉండేది. తెలుగు భాషాభిమానంతో రామాయణ, భారత, భాగవతాలు చదివాను. అనేక కథల పుస్తకాలు, వీరుల గాథలు చదివేదాన్ని. శ్రీశ్రీ, దాశరథి కవిత్వం పట్ల ఆరాధనా భావంతో పెరిగాను. ఏడవ తరగతిలోనే గేయ రచనలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి పొందాను. ఇప్పటికీ సమయం చిక్కినప్పుడల్లా చదువుతుంటాను. ఎన్నో కవితలు, గేయాలు వ్యాసాలు రాసాను. రాయడం జరిగింది కానీ పుస్తకం వేసుకోవాలనే దృష్టి ఎప్పుడూ లేదు (నవ్వుతూ). అందువల్ల ఏవీ పుస్తకరూపం దాల్చలేదు. ఎప్పుడో రాసిన రైతుల ఆకలి వెతలు, కన్నీటి గాథలు, దేశానికి రైతే వెన్నెముక అనే భావనతో రైతుల అభివృద్ధి గురించి రాసిన కవితలతో ‘ మాగాణి తేజస్సు’ అనే కవితా సంపుటి ముద్రణకు సిద్ధంగా ఉంది. అమరవీరుల స్మృతిలో ఉద్యమ చైతన్యం గురించి రాసిన కవితలతో ‘ప్రజా గొంతుక గళమెత్తాలి’ అనే కవితాసంపుటి కూడా ప్రచురణకు సిద్ధమై ఉంది. ఇక తెలంగాణ అంశాల మీద, సంక్షేమ పథకాల మీద, జరుగుతున్న అభివృద్ధి పైన రాస్తున్న కవిత్వంతో ఆచంద్ర తారార్కం’ అనే కవితా సంపుటిని తీసుకురావాలనుకుంటున్నాను. త్వరలోనే అది పూర్తవుతుంది.
6. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో మీ క్రియా శీలక పాత్ర ఏమిటి?
జ: మా నాయిన తెలంగాణను సాధించుకోలేమని నిరాశతో ఉండేవాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చూడలేదు. నేను ఉద్యమ కాలంలో నా నేల, నావారు అంటూ అహర్నిశలు శ్రమించాను. ఎన్నో పోరాటాలు చూసాను. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన మాదిగ దండోరా, మాల మహానాడు ప్రజా సంఘాలు జరిపిన పలు ఉద్యమాల్లో పాల్గొన్నాను. 2004లో తెలంగాణ రాష్ట్ర సమితి టీఆరెస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రతి ఉద్యమంలో పాల్గొని, అప్పటినుంచి ఇప్పటివరకు బాపు కేసీఆర్ వెంటే నడిచాను. ఆయన పిలుపునిచ్చిన ప్రతీ ఉద్యమ సభలు, సమావేశాలకు హాజరయ్యాను. ఏ ధర్నా జరిగినా, ఏ ఉద్యమం జరిగినా అందరికంటే ముందు ఉండేదాన్ని. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగర హారం, వంటావార్పు, మానవ హారం, రైల్ రోకో, 48 గంటలు తెలంగాణ బంద్, నిరాహారదీక్ష, సత్యాగ్రహం, ఇలా అన్ని పోరాట సందర్భాల్లో కార్యకర్తగా పాల్గొనడమే కాకుండా సమావేశాలు, సభలు నిర్వహించినం. సోషల్ మీడియాలో తెలంగాణపై, ఆంధ్ర మీడియా, ఆధిపత్యవాదుల కుట్రలను, చేసిన విషప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టినం.’ బాపూ కేసీఆర్ దళం’ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి తెలంగాణ కు జరుగుతున్న అన్యాయాన్ని అడుగడుగునా చైతన్యం చేసాం. దాదాపు ఆ తరం వారంతా ఆశలు వదులుకున్న సమయంలో అప్పుడొక ఆశాకిరణం ఉద్భవించింది. ఆ వెలుగు జిలుగుల ప్రతిరూపమే మన తెలంగాణ ఆవిర్భావం. దీనికి గత 60 సంవత్సరాల నేపథ్యమే కాక 14 సంవత్సరాల (2001-2014) నిరంతర కృషి, అనితర సాధ్యమైన ఒక నాయకుని ఉద్యమ నేతృత్వమే మన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేసింది. ఆ నాయకుడు కారణజన్ముడు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అతడు వేరెవరో కాదు. తెలంగాణ సాహితీ సమరాంగణ చక్రవర్తి కేసీఆర్.
7. తెలంగాణ ఉద్యమంలో మీ రచనలకు కానీ, మీ భాగస్వామ్యానికి లభించిన స్పందన ఎలా ఉండేది?
జ. మా తాతయ్య మంత్రి రంగారావు. నాయిన, చిన్నాయినలు 1969 ఉద్యమకారులు. వారి ఉద్యమ నేపథ్య ప్రభావం వల్లనే నేను సైతం మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం జరిగింది. ఒక మహిళగా, రచయిత్రిగా, ఉద్యమకారిణిగా పాల్గొన్న నాకు నాయకుల నుండి, బంధు మిత్రుల నుండి సానుకూల స్పందన లభించడం నన్ను మరింత ముందుకు నడిపింప జేసింది. అప్పుడు మా అందరి కల, లక్ష్యం కేవలం తెలంగాణ ఏర్పాటు. మన ప్రజల కోసం మనం పోరాడాలి. మన గడ్డ కొరకు మనం పాటు పడాలి. అనే ఉద్దేశ్యాలతో ముందుకు సాగాం. అసాధ్యమనుకున్న దాన్ని సుసాధ్యం చేసుకున్నాం.
8. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర ప్రగతిపై మీ అభిప్రాయం?
జ: దేశచరిత్రలో ప్రత్యేకంగా గుర్తుంచుకోదగిన మహో ద్యమాన్ని సాగించి, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా దూసుకెళ్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అతి తక్కువ కాలంలోనే మన ముఖ్యమంత్రి బాపు కేసీఆర్ గారి నాయకత్వంలో సమగ్రమైన ప్రగతి పరుగులు పెడుతున్నది. ఎవరెన్ని కేసులు పెట్టినా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అయ్యింది. చెరువులన్నీ జల సముద్రాలు అయినాయి. బీళ్లు పచ్చని పంటలతో పోశమ్మ ఆకుపచ్చ చీర కట్టుకున్నట్లు పొలాలు దర్శనమిస్తున్నాయి. చెలిమల్లో చేపలు, జల పుష్పాల ఉత్సాహం, హరిత హారాలు అన్నీ మనం చూస్తున్నాం. ఒక్కటేమిటి? అనేకమైన అభివృద్ధి పథకాల ద్వారా దేశానికి నమూనా అయి, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి, తెలంగాణ అంతటా సుభిక్షమైన పాడి పంటలతో వర్ధిల్లుతున్నది. నిన్నటి వలసలను, దుఃఖాన్ని శాశ్వతంగా నివారించడంతో పాటు రేపటి ఆశయాల సాధనకు పతాకం రెపరెపలాడుతున్నది. పరి పాలనలో వెనుదిరుగని పట్టుదల ప్రజా సంక్షేమాకాంక్షలతో నూతన భవనం డా. బి. ఆర్. అంబేద్కర్ సచివాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది. అద్భుతమైన భవనంగా ప్రశంసలను అందుకుంటున్నది. బాపు కేసీఆర్ ఏది చేసినా ఒక నమూనాగా మారి జాతీయ స్థాయిలో నెంబర్ వన్ గా నిలుస్తున్నది. నాడు కలలు గన్న తెలంగాణ నేడు సస్యశ్యామల తెలంగాణగా విరాజిల్లుతున్నది.
9. అధికార భాషా సంఘ అధ్యక్ష పదవిని స్వీకరించడంపై మీ అనుభూతిని, మీకు లభించిన సహకారాన్ని వివరించ గలరా?
జ: అధికార భాషా సంఘ అధ్యక్ష పదవిని స్వీకరించడం అనేది ఒక అధికారంగా భావించడం లేదు. అభ్యర్ధనే నా అభిమతం. చిన్నారులు, విద్యార్థినీ విద్యార్థులు, యువతీయువకులు, కార్యాలయాలు అన్నింటా మన తెలంగాణ తెలుగు భాషా వికాసం ఆమనిగా విరబూస్తే ఈ కోయిలలన్నీ తెలుగు పలుకులు గానం చేస్తుంటే అప్పుడు నా కృషి ఫలించినట్లు భావిస్తాను. అనునిత్యం తెలంగాణ తెలుగు తల్లికి నీరాజనాలు అర్పిస్తాను. భరతమాత బిడ్డగా గర్విస్తాను. తెలుగు భాషపై అమోఘ మైన పట్టువున్న నాయకుడు బాపు కేసిఆర్ గారు నాకు ఇచ్చిన ఈ బాధ్యతను తెలుగు భాషాభివృద్ధి కోసం నా శాయాశక్తులా కృషి చేస్తానని వాగ్దానం చేస్తున్నాను.
10. అధికార భాషా సంఘ అధ్యక్షురాలిగా భాషా వికాసం పట్ల మీ అభిప్రాయం ?
జ: ప్రజాకవి కాళోజీ జన్మదినమైన సెప్టెంబర్ 9వ తేదీని ప్రతి ఏడాది తెలంగాణ భాషా దినోత్సవంగా జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014 సెప్టెంబర్ 9న వరంగల్లులోని కాజీపేట నిట్ కళాశాలలో జరిగిన కాళోజీ నారాయణరావు 100వ జయంతి సభలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళోజీ నారాయణ రావు జన్మదినం సెప్టెంబర్ 9వ తేదీని ‘ తెలంగాణ భాషా దినోత్సవం’ గా ప్రకటించారు. తెలంగాణ యాస వినసొంపుగా ఉంటుంది. నిజాం పాలనలో ఉర్దూ ప్రాబల్యాన్ని తట్టుకొని మరీ నిలబడింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక ఉర్దూ కలగలిసిన తెలంగాణ ప్రజల యాసను కొందరు గేలి చేశారు. దీన్ని తెలంగాణ కవులు తీవ్రంగా విమర్శించారు. అలాంటి వారిలో కాళోజీ నారాయణ రావు ముఖ్యులు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన తెలుగు భాషపై, తెలంగాణ యాసపై ఎనలేని ప్రేమ కనబరిచారు.
తెలంగాణ ‘యాస’ నెపుడు యీసడించు భాషీయుల
‘సుహృద్భావన’ ఎంతని వర్ణించుట సిగ్గుచేటు
అని తెలంగాణ యాసను విమర్శించే వారికి కాళోజీ దీటుగా బదులిచ్చారు. వీర తెలంగాణ నాది. వేరు తెలం గాణ నాది అన్న కవి కాళోజీ. తెలంగాణ భాష తేనె పలుకుల జీవధార. అధికార భాషా సంఘం, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇంటి భాష, వ్యవహారిక భాష, గ్రాంధిక భాష ఇలా… ఎన్నో.. ప్రజాకవి కాళోజీది పలుకుబడుల భాష. తెలంగాణ భాషకు మాండలికం ప్రాణం. తెలుగు సాహిత్యంలో తెలంగాణ ప్రాంతకవులు, సాహితీవేత్తలు చేసిన కృషిని చాటి చెప్పడానికి, కనీవినీ ఎరుగని రీతిలో ప్రపంచ తెలుగు మహాసభలు 2017లో నిర్వహించాం. స్వయంగా సీఎం కేసీఆర్ ఈ సభలను ముందుండి నడిపించి తెలంగాణ సాహితీ, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. తెలంగాణ ప్రాంతం సాంస్కృతికంగా, సాహిత్య పరంగా, కళల పరంగా ఘనమైన చరిత్ర కలిగి ఉంది. తెలంగాణ సకల కళలకు నిలయం. సామాన్యుడి భాష, యాస ద్వారా సమస్యలపై గళం విప్పిన కాళన్న స్ఫూర్తితో తెలంగాణ భాషను ముందుకు తీసుకుపోతాం.
11. తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో మాండలిక భాష ఎక్కువగా కనిపిస్తుంది కదా? మరి విద్యా సంస్థల్లో కానీ నిత్య జీవితంలో కానీ మాండలికభాష ఉపయోగించడం మంచిదేనంటారా?
జ: ఏ విద్యార్థికైనా తన మాతృభాషలో నేర్పిస్తే భాష సులువవుతుంది. అని శాస్త్రవేత్తల అభిప్రాయం. ప్రామాణిక భాష అని ఏర్పరచి ప్రాంతీయ భాషల విలువను తగ్గించడం సరియైనది కాదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రాంతీయ భాషకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మన మాతృభాష తెలుగు కాబట్టి తెలుగు అధిక ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఒక ప్రాంతంలో ఎక్కువమంది మాట్లాడే భాష ఆ ప్రాంతపు మాండలికం అవుతుంది. అది ప్రధానభాషలో ఒక భాగమవుతుంది. ఇది వ్యవహార ప్రధానంగా ఉంటుంది. కాబట్టి దానిని ఉప యోగించడం వల్ల భాష అవగాహనకు సులువుగా ఉంటుంది.
12 . తెలుగు మాతృభాషగా విద్యనభ్యసించిన విద్యార్థులకు భావప్రసార నైపుణ్యాలు, ప్రతిభా సామర్థ్యాలు ఉన్నప్పటికీ ఆంగ్లభాష సమస్య వలన ఆశించిన ఉద్యోగాలు దొరకడం లేదని ఆవేదన పడడం వింటున్నాం.. దీనిపై మీ స్పందన?
జ: ఉద్యోగంలోకి తీసుకునే విషయంలో, ఆ ఉద్యోగాల ప్రకటన చేసిన సంస్థలలో ముందుగా మార్పు రావాలి. అభ్యర్థులకు ఉద్యోగానికి సంబంధించిన విషయం మీద అవగాహన ఉందా, లేదా అన్నది కూడా ముఖ్యంగా గమనించవలసిన విషయం. ఆధునిక సమాజాలకే పరిమితం కాక ఏ సమాజానికైనా భాష ప్రాధాన్యత చాలా అవసరం. ఎందుకంటే భాష ద్వారానే భాష వినిమియం జరుగుతుంది. కాబట్టి మాతృభాషలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ బడుగు, బల హీన వర్గాల పిల్లలు ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కు కోవాలంటే మాతృభాషతో పాటు ఇంగ్లీషు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
13. భాష, యాసలపై మీ అభిప్రాయం?
జ: భావవ్యక్తీకరణకు భాషే సరైన సాధనం. అయితే ఎంత భాషాభివృద్ధి జరిగినా భాషకి మూలమైన సంజ్ఞల ద్వారానే మానవాళి ఇప్పటికీ ఎప్పటికీ కళ్ళు, కాళ్ళు, చేతులు, ముఖం ఆంగికమైన కదలికలతో భావ ప్రకటన చేస్తూ ఉంటుంది. మాతృభాషలో విద్యార్జన సులభ గ్రాహ్యంగా ఉండడమే కాక జ్ఞప్తికి సులువుగా వచ్చే వీలుంటుంది. అందుకేనేమో జపాన్ వాళ్ళకి తమిళనాడు ప్రజలకి భాషాభిమానం ఎక్కువ. తెలివి తేటలలో కూడా అగ్రగణ్యులే. భాషను ఉచ్చరించే తీరు, దీర్ఘాలను, హ్రస్వాలు గాను, హ్రస్వాలను దీర్ఘాలు గాను పలికే తీరును బట్టి యాస అనడం జరిగింది. ఈ యాస ఏర్పడడానికి ఆ భాషను మాట్లాడేవారి భౌగోళిక, సాంస్కృతిక అంశాలు, ఆహారవిహారాలు, జీవన విధానాన్ని బట్టి యాస ఏర్పడుతుంది. తెలంగాణ జనులు తమ భాష, యాసలను శ్వాస, ధ్యాసలుగా భావిస్తారు.
14. ఆధునిక సమాజంలో భాష ప్రాధాన్యత ఏమిటి..అసలు భాష..యాస అనేది ఎలా ఏర్పడింది..??
జ: ఆధునిక సమాజంలో భాష ప్రాధాన్యత మునుపటికన్నా మరింతగా పెరిగింది. ప్రాచీన
సమాజంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. మనుషులు తమ మనసులోని ఆలోచనలను ఇతరులతో పంచుకునే తీరికా, వెసులుబాటు ఉండేవి. ఆధునిక సమాజంలో మానవుడు దాదాపు, ఒంటరిగా మిగిలిపోయారు. ఈ ఏకాకిని సాంత్వన పరుస్తున్నది ఇవాళ భాష మాత్రమే! ఐతే భాష తన రూపాలను మార్చుకున్నది. తెల్లవారున లేవగానే మనం ఫేస్ బుక్కులోనో వాట్సాప్ మొదలైన వాటిలోనే పోస్టులు చదువుతున్నాం. పెడుతున్నాం. యూట్యూబ్ మొదలైన ఆధునిక మాధ్యమాల ద్వారా ఇష్టమైన పాటలు వింటున్నాం, కార్యక్రమాలు వీక్షిస్తున్నాం లేదా పుస్తక పఠనంలో నిమగ్నమవుతున్నాం. థియేటర్ లో సినిమాలు చూస్తున్నాం, ఇవాళ వేగం బాగా పెరిగి సమయాభావం వల్ల ఇతరులతో కలిసి ముచ్చటించ లేని పరిస్థితుల్లోకి మనిషి నెట్టబడ్డాడు. సామాజిక మాధ్యమాల మంచిచెడ్డల ప్రస్తావన అలా ఉంచండి. మొదటి నుండి మనిషికి భాషతో ఒక అవినాభావ సంబంధం ఉంది. అసలు… ఈ సమస్త ప్రాణికోటిలో ఒక మానవుడికే భాషకు ఆధారమైన జన్యువులు వారసత్వంగా సంక్రమించాయి. ఐతే, మనుషులు తాను పరస్పరం సంభాషించుకునేలా మునుపటి పరిస్థితులు వస్తేనే ఆది మానవీయంగా ఉంటుంది. మార్కెట్ సంబంధాలే యావత్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఈనాటి ఆధునిక సమాజంలో మానవ సంబంధాలను పునః ప్రతిష్ఠ చేయగలిగిన భాషకు మరింత ప్రాధాన్యత పెరిగిందనేది కాదు అనలేని సత్యం. ఇక భాష, యాసల ఏర్పాటు ఎలా జరిగిందంటారా? దాదాపు 50,000 సం, క్రిందట ఎక్కడో ఆఫ్రికా ఖండంలో ప్రాచీన మానవుడు మాట్లాడినట్లు చెబుతున్నారు భాషా శాస్త్రవేత్తలు. క్రీ.పూ 8000 ల నాటికి 20,000 భాషలు ప్రపంచంలో ఉండేవట! ఆ తర్వాత కొన్నేళ్ళకు లిపి బద్దం చేసారు భాషను. ఐతే, భాష ఎలా పుట్టింది అన్న విషయకంగా చాలా సిద్ధాంతాలున్నాయి. అందరూ అంగీకరించిన ఏకైక అంశం … భాష అనేది శ్రమ నుండి ఆవిర్భవించిందని! పనిలోంచి పాట పుట్టింది. పాటతో మాటలున్నాయి. తీరుబడిగా కథలు చెప్పుకున్నారు. సమస్త కళలూ ఆ తర్వాత రూపుదిద్దుకోవడం మనందరికి తెలిసిందే! “యాస” అనేది… భాషలోని మాటలు మారిన రూపం. అంటే ఉచ్చారణలో పదస్వరూపం కొందరిలో మారుతుంది. అట్లా మారేందుకు నిరక్షరాస్యతా, సామాజిక అంతరమూ, మాట్లాడంలో వేగము ఏదైనా కారణం కావచ్చును. చదువుకున్న వాళ్ళు ” వేప ” అంటారు. మిగిలిన వాళ్ళు “యాప” అంటారు. ” యాప” అన్న వాళ్ళను చూసి, నవ్వుకోవద్దు. నిజానికి మీరడిగిన యాస” అనే 2 అక్షరాల పదమే ‘యాస’గా ఉంది. అది నిజానికి “ఏచ ” అనే మాట. భావోచ్చారణలో ప్రాంతీయంగా కనిపించే ప్రత్యేకత లేదా వ్యత్యాసం ” యాస అని శబ్దరత్నాకరం చెబుతున్నది.
15. భాషకు, యాసకు ఉన్న వ్యత్యాసాలు… అవి వ్యక్తుల ఉనికిని ఎలా నిర్దేశిస్తాయి?
జ: ఇందాక చెప్పుకున్నాం వీటి గురించి. గ్రామీణంలో ‘యాస’ ఎక్కువగా వినిపిస్తుంది. కారణం నిరక్షరాస్యత. ‘యాస’లో వంకరగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళను తక్కువగా చూడరాదు. శ్రమజీవన సౌందర్యంతో గొప్ప జీవనానుభవంతో నైగనిగ్యంతో సహజంగా పల్లీయుల నోటి నుండి వెల్వడే వాగ్దార అది. భాష చక్కగా, నిర్దుష్టంగా, స్పష్టంగా, మాట్లాడగలిగిన వాళ్ళు మాత్రమే సంస్కారవంతులు అనటం సరైనది కాదు. భాష, యాస, మాండలికం.. ఏదైనా నిర్దుష్టమైనదే. ఇది దుష్టమా, ఇది నిర్దుష్టమా అనే పాతకాలపు కొలమానాలు ఈనాటి సభ్య సమాజానికి పనికి రావు.
16. మన తెలంగాణ యాసలో సొబగులేమిటి? కొనసాగింపునకు మీ చర్యలు?
జ: తెలంగాణ వాళ్ళకు తెలంగాణ ” యాస ” అనేది యాస కాదండి. అది ఇతరులకు. “యాస”, మనకు “భాష” అది అలా ఉంచండి, కాసేపు తెలంగాణ భాష… ఆ మాటకొస్తే ప్రపంచంలోని ఏ భాషకైనా దానిదైన ప్రత్యేక సొగసు ఉంటుంది. ఐతే తెలంగాణ భాష సొగసు కొంత ప్రత్యేకం. ఎందుకని? అది… తెలుగు భాషకు బాగా దగ్గర. “దేశ భాషలందు తెలుగులెస్స కదా! ఆ ” లెస్స “తనం తెలంగాణలో ఉంది. తెలుగు భాషకు ప్రత్యేకమైన “నిండుసున్న ” తెలంగాణలో ఉంది. అది భాషను నాదమయం చేస్తున్నది. ఉదా॥ నాగుంబాము, ఆంబోతు, తాబేలు మొదలగునవి. మరో సొగసు… యతిని కోల్పోక పోవడం, ” తెట్టన తెల్లారింది, పట్టన పలిగిండు .. ఇలాంటివి. కొన్ని మాటల్లో ద్విత్వ అక్షరం ఊనిక కోసం కావాలని ఉంచడం. ఉదా: మస్రీ, మస్సాల మొ. వి. ఇంకా అనేక అర్థవంతమైన పదాలు, అచ్చ తెనుగు పదాలూ ఉన్నాయి ఉదాహరణకు ” పాముపడిగె చెట్లు” (నాగజెముడుకు బదులుగా) ఈ సొగసైన మాటల కొనసాగింపు కొరకు ఈ పదాలతో కూడిన భాషనూ, సాహిత్యాన్ని ప్రోత్సహిస్తాం. ఉదాహరణకు… ఒక ఊళ్ళో ఉన్న మనుషుల పేర్లు, చెట్ల పేర్లు, జంతువులు పేర్లు పెద్ద తరం వాళ్ళతో సేకరించవచ్చు. సొరకాయకు బదులు ” ఆనిగెపుకాయను” సేకరించి రికార్డు
చేయవచ్చు. “ఒంటె”కు ” లొటపేట” నమోదు చేయాలి. సమ్మక్క, సారక్క, ఐలయ్య మొదలైన వ్యక్తుల నామాలను సేకరణ చేయవచ్చు.
17. తెలంగాణ సాహిత్యం, భాష, యాస… అణచివేతకు గురైందా?
జ: అనుమానమా ఇంక! అణుమాత్రమూ అనుమానం లేదు. తెలంగాణ మలిదశ ఉధృత ఉద్యమ సందర్భంలోనూ పోతన్నను మరలా ఒంటిమిట్టకు లాక్కుపోయారు. ఇంకా… ఇతర కవుల స్థానాలూ, గౌరవాల గురించి ఏం మాట్లాడగలం. నీళ్ళు, నిధులు, నియామకాల్లో అన్యాయకారణంగానే తెలంగాణ ఏర్పాటు జరిగిందని చెప్పలేం కదా!! భాష పట్ల వివక్ష సైతం తెలంగాణ రాష్ట్ర అవతరణకు ప్రధాన కారణం. అల్లం రాజయ్య వంటి గొప్ప రచయితల రచనల్ని దిద్దారు. ఇటువంటి అంశాలు లోగడ మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం.
18. భాషా ప్రాతిపాదిక రాష్ట్రాలు ఏర్పడటం వెనుక ఉన్న అంతరార్థం?
జ: ఇది చాలా లోతైన అంశం. సున్నితమైన విషయం, ఈ ఏర్పాటు సరైనది కాదని అభిప్రాయాలు ఉన్నాయి. ఐతే గొప్ప భాషా శాస్త్రవేత్తలైన ఎమెనో, బరోలు ప్రపంచంలో ” ఇండియా ఒక మంచి, బహు భాషా ప్రదేశం ” అన్నారు. ఈ అనేక భాషల భారతంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు ప్రజలకు… అంటే ఏకభాషీయులకు సులువు. పాలన సులభంగా కొనసాగుతుంది. న్యాయవ్యవహారాల్లో, బోధనలో, ఇతర విషయాల్లో ఒకే భాష మాట్లాడగలిన వ్యవహార కర్తలకు పనులు చాలా సుగమంగా సాగిపోతాయి. ఇదే ఈ ఏర్పాటులో పునాది అంశం.
19. జీవభాష అని దేనిని అంటాం… భాషను సజీవంగా ఉంచడంలో సాహిత్యం, మేధావులు ఏం చేయాలి?
జ: దైనందిన వ్యవహారంతో ఉండేది జీవద్భాష. భాష ప్రవాహిని. గడ్డ కట్టుకుని పోతే భాష కాదు. భాష అనే నదిలో పాత నీరు, కొత్త నీరు ఉంటుంది. ఏ నీరు ఎంత అవసరమో కాలానుగుణంగా ప్రజలు, మేధావులు, పండితులు, పాత్రికేయులు, విద్యాధికులు, ప్రభుత్వాలు. అందరూ కలిసి నిర్ణయించాల్సి వుంది. క్రొంగొత్త వస్తువులు వస్తున్న కొద్దీ కొత్త కొత్త మాటల అవసరం ఉంటుంది. ఆ పదాల్ని వీలున్నంతవరకు తల్లిభాష నుండి సృష్టించాలి. అలా సాధ్యం కాని పరిస్థితుల్లో పలుమాటలు గ్రహించాలి. సాహిత్యం కూడా అనేక రూపాల్లో భాషను మనుగడలో ఉంచుకుంది. కవిత్వం, కథ, నవల, నాటకం, సామాజిక మాధ్యమాలు, ఇంకా అనేక ఇతర ప్రక్రియల ద్వారా భాష పరిపుష్టం చేయాలి. ముఖ్యంగా అనువాదాలు రావాలి, కొత్త పదాల పుట్టుక జరగాలి, ఉదాహరణకు ఇజ్రాయిల్ దేశంలో హిబ్రూ, ఇద్దిస్ భాషల పరిరక్షణకు దాదాపు 40 సం.లు కష్టపడి ఆంగ్లంలోఉన్న సాహితాన్ని, శాస్త్ర సాంకేతిక గ్రంథాల్ని తమ భాషల్లోకి అనువదించుకున్నారు. ముఖ్యంగా భావి పాఠాల్ని తయారుచేయ గల్గితేనే భాష బతుకుతుంది. బాగా చదవగల్గిన వాళ్ళు బాగా రాయగలిగే అవకాశం ఉంది. అందుకని పఠన లేఖనాల గురించి అందరూ గంభీరంగా ఆలోచించాల్సిన తరుణమిది.
20. ఆధునికత ప్రభావం భాషపై ఎలా ప్రతిఫలిస్తున్నది?
జ: ఆధునికత ప్రభావం మానవ జీవితాన్నే ప్రభావితం చేస్తున్నప్పుడు, భాష మీద కూడా ఆ ప్రభావం తప్పదు, సామాజిక మాధ్యమాలు పురుడు పోసుకున్న వైనం ఆధునికత కారణంగానే అనేది మన అనుభవంలో ఉన్నది కదా! ఆధునిక కాలంలో ప్రపంచ భాషలన్నీ నిత్యం మారుతున్నాయి. ఈ వేగంలో, ఆంగ్ల ప్రభావంలో కొన్ని భాషలు అంతర్ధానమయ్యాయి. కొన్ని రాటుదేలాయి. కొన్ని ప్రమాద ఘంటికల్ని వింటున్నాయి. మన తెలుగు డిజిటలైజు కావాలి. అందరికీ అందుబాటులోకి మన భాషను తేవాలి. పాతకాలం నాటి “వచ్చియున్నవాడు” వచ్చి యున్నాడు” గానూ, “వచ్చినాడు” గానూ, “వచ్చాడు” గానూ, “వచ్చిండు” గానూ మారింది. ఈ రూపాలన్నిటిని ఈ రికార్డు చేయాలి. అన్నీ ప్రామాణికమే అని చెప్పాలి. “అచ్చిండు” అనే రూపమూ నమోదు చేయాల్సిందే! శేషసాయి లాంటివాళ్ళే “ఆంధ్ర భారతి” పేర నిఘంటువుల్ని ఉంచారు. వాళ్ళ సైటులో “సెల్లు”లోని, ఆ సైటులో సెర్చ్ లోకి వెళ్ళి టైపు చేస్తే ఏదైనా పదాన్ని, ఆ పదానికి అర్ధం తెలుస్తుంది. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు సైతం తెలుగులో పదానికి సమానార్థకమైన మాటల్ని కొన్ని ఇతర భాషల్లో, తెల్సుకునేలా ఏర్పాటు కల్గించారు, యాంత్రికానువాదమూ ఇటువంటిదే కదా….
21. తెలంగాణ సాహిత్యాన్ని పదిలపరచడానికి, ముందు తరాలకు అందించడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది?
జ: తెలంగాణ సాహిత్య అకాడమీని ఏర్పాటు చేసింది పూర్వాధ్యక్షులు నందిని గారు ఉన్నప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి, అపురూప గ్రంథాల ప్రచురణ అయ్యింది. ఇటీవలే సమగ్ర తెలంగాణ సాహిత్య చరిత్ర వచ్చింది. జూలూరి వారు పిల్లల కథలూ, ఊర్ల చరిత్ర మొదలగు పనుల్లో ఉన్నారు. భాషా సాంస్కృతిక శాఖా తరఫున అనేక గ్రంథాలు ప్రచురించారు. సభలూ, సమావేశాలు అధికార భాషా సంఘం తరఫున మేమూ మా ప్రయత్నాలను ముమ్మరం చేస్తాం.
22. చరిత్రలో నిలిచిన తెలంగాణ వాగ్గేయకారులు, రచయితల గురించి ఈ తరానికి ఎలా అవగాహన కలిగిస్తారు?
జ: గొప్ప కర్ణాటక సంగీత వాగ్గేయకారుడైన మంగళంపల్లి బాల మురళీ కృష్ణ గారు చనిపోతూ కూడా “ఏ తీరున నను దయజూసెదవో ఇనవంశోత్తమ రామా” అనుకుంటూ కన్ను మూసారట! అది భద్రాచల రామదాసు కీర్తన కదండీ! ఆ రామదాసు … కర్ణాటక సంగీత మూర్తిత్రయంలో ప్రథముడైన త్యాగరాజుకు స్ఫూర్తి, ఆ పదకవితా పితామహుడు అన్నమయ్య గొప్పవాడే. కానీ. ఆ ప్రవాహంలో రామదాసును ఆ స్థాయిలో నిలుపుకోలేకపోతున్నాం ఈనాటికీ. ఇక రచయితలు.. దాశరథి, కాళోజీ, అలిశెట్టి, వానమామలై సోదరులు, సురవరం ఇటువంటి రచయిత రచనల్ని ఈ తరానికి మరింత అందుబాటులో ఉంచుతాం, వారి జీవిత చరిత్రల్ని నాలుగైదు పేజీలకు మించకుండా ఈ తరానికి అందిస్తాం.
23. తెలుగుభాషలో ఉన్న సాహిత్యమంతా వెలుగులోకి వచ్చిందని భావిస్తున్నారా?
జ: సాహిత్యమంతా ఎక్కడ వెలుగులోకి వచ్చింది? కేవలం పరీక్షలలో ఉత్తీర్ణత పట్ల వుండే శ్రద్ధ భాష మీద భావం మీద కూడా పెడితే సాహిత్యపు విలువలు తెలుస్తాయి. సాహిత్యం బయటకు రావాలి. మనకు అద్భుతమైన సాహిత్యం ఉంది. అది బయటకు వచ్చినపుడు సంస్కృతీ సాంప్రదాయాల విలువ కూడా మనవాళ్ళు తెలుసుకుంటారు.
24. టి.ఆర్. యస్. ఇప్పుడు బి. ఆర్. యస్. గా ఎదగటం పై మీ స్పందన ?
జ: అహర్నిశలు ప్రజాక్షేమాన్ని కాంక్షిస్తూ, ప్రజా సేవలో తలమునుకలయ్యే జన హృదయాధినేత
రాష్ట్రాభ్యున్నతే కాకుండా దేశాభ్యున్నతి అభిలషించడంలో ఆశ్చర్యం అణుమాత్రం లేదు. ఇదే తెరాసా భారాసాగా రూపుదిద్దుకోవడంలోని బహిరంగ రహస్యం. అంత గొప్ప నాయకునికి నేను సైతం చంద్రునికో నూలుపోగులా బాపు దళం స్థాపించి సామాజిక మాధ్యమం ద్వారా కందకాలలో దాక్కున్న కువిమర్శకులను వెంటాడి అక్షర శరాఘాతాలతో అణిచివేసే బృహత్ ప్రయత్నాన్ని నా మిత్రుల సహకారంతో కొనసాగిస్తున్న..
25. నేటి బాలల్లో, యువతలో తెలుగుభాషాసక్తిని, సాహితీ విలువలను ఎలా పెంపొందించగలం ?
ఇందులో ప్రభుత్వ, ప్రజల పాత్ర ఎలా ఉండాలని మీ భావన ?
జ: చిన్నపిల్లలకు చిన్నప్పటినుండి మాతృభాష మీద అవగాహన, అభిరుచి కలిగించాలి. యువతకు సాహిత్యం పట్ల మక్కువ కలిగించి, వారిని ఆ దిశగా ప్రోత్సహించి సాంస్కృతికోద్ధరణ వైపుగా వారిలో ఆసక్తిని పెంపొందించాలి. ఆ విషయంలో కొన్ని అవార్డులు, రివార్డులు ప్రకటించాలి తద్వారా కూడా సాహితీ విలువలు పెరుగుతాయి. కుటుంబ పెద్దలు తెలుగు మాట్లాడటం, తెలుగు పుస్తకాలు చదవటం వంటివి అలవాటు చేయాలి. తెలుగు సాహిత్యంలో ఎన్నో కొత్త ప్రక్రియలు, సంప్రదాయాలు మన తెలంగాణ కవుల నుంచే మొదలయ్యాయి. మల్లియ రేచన, పంపన, బండారు అచ్చమాంబ వంటి తెలంగాణ సాహితీ మూర్తులు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. తెలంగాణ సకల కళలకు నిలయం. కాబట్టి ఇక్కడి బిడ్డలు కళాకారులై విశ్వానికి వెలుగులు నింపాలని నా ఆకాంక్ష
26. అనేక రచనలు చేసి, వివిధ సాహిత్య కార్యక్రమాలలో పాల్గొన్న మీరు ఆధునిక కవిత్వంలో గమనించిన లోటుపాట్లు తెలుపగలరా ?
జ: ఆధునిక కవిత్వంలో లోటుపాట్లు ఏవంటే వచనాన్ని విరుగగొట్టి, ముక్కలు చేసి దాన్నే కవిత్వం అంటున్నారు . అదేవిధంగా చదివిందే మళ్లీ మళ్లీ చదివి ప్రేక్షకులలో సహనానికి పరీక్షలు పెడుతున్నారు. సాహిత్యంలో తెలుగు తప్ప మరే భాషకు స్థానం ఉండకూడదు . నంబర్ల వాడకం అసలు ఉండకూడదు. వీటిని గమనించుకుంటే చక్కటి సాహిత్యాన్ని అందించగలుగుతాం.
27. భాషకు – ప్రగతికి గల సంబంధాన్ని వివరించండి ?
జ: ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే, ఆ దేశపు భాష సంస్కృతి కూడా చాలా ముఖ్యం. భాషకు గుర్తింపు వస్తే భావం అర్థమవుతుంది. అప్పుడు విలువ పెరుగుతుంది . తద్వారా విజ్ఞాన సంబంధమైన విషయాల్లో కూడా మంచి రచనలు ప్రాచుర్యంలోకి వస్తాయి . ఉదాహరణకు…. శాస్త్రాలు. మన భారతదేశం వేద భూమి, కర్మభూమి, తపోభూమి . ఎన్నో సంవత్సరాలు మన మహా ఋషులు ఘోరమైన తపస్సు చేసి సంపాదించిన విజ్ఞానం మనది. ఆ విజ్ఞాన సర్వస్వం అంతా కూడా వేదాల రూపంలో పొందుపరిచారు . అవే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఒక్కొక్క వేదం ఒక్కొక్క శాస్త్రాన్ని చెస్తోంది. ఆ శాస్త్రాన్ని విదేశీయులు కొన్నిటిని తాళపత్ర గ్రంథ రూపంలో ఉన్న వాటిని ఇక్కడి నుంచి దోచుకు వెళ్లి వాటిని డీకోడ్ చేసి తిరిగి మనకి ఎక్కువ రేటులో అందజేసి దానివల్ల వచ్చే లాభాలను, పేరును, ప్రతిష్టను అన్ని వాళ్లే పొందుతున్నారు కానీ నిజానికి అదంతా మన జ్ఞానసంపద. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకే ఎవ్వరికైనా తమ మాతృభాష పట్ల అభిమానం, గౌరవం ఉండాలి. అభ్యాసం చేయాలి. మన తెలుగు భాష ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఏ భాష నైనా తనలో కలుపుకునే సౌలభ్యం. ఎన్ని భాషలు నేర్చు కున్నా ఆ జ్ఞానాన్ని మన భాషాభివృద్ధికి వినియోగించాలి.
28. ఆధునిక సమాజంలో స్త్రీ పాత్రను విశ్లేషించండి?
జ: ఆధునిక సమాజంలో స్త్రీ విషయమంటారా? ఈనాడు మహిళ ఆధునిక సమాజంలో గొప్ప కీలక పాత్ర వహిస్తున్నది. అన్ని రంగాల్లో కూడా సత్తా చాటుకుంటున్నది. అన్ని శాస్త్రాలను ఔపాసన పట్టి, అద్భుత విజ్ఞానాన్ని సంపాదించి, మహోన్నతంగా విశ్వ వేదిక మీద కూడా తన ప్రతిభను చాటుతున్నది.” ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్” అన్నట్లు ఆఖరికి వేదాధ్యయన కాలంలో వేదాలు కూడా నేర్చి, దీటుగా నిలబడుతున్నది .ఉదాహరణకు గార్గి, మైత్రి వంటి వారు. మీరాబాయి భక్తి ఉద్యమంతో ప్రాశస్త్యం పొందింది. అట్లాగే అక్క మహాదేవి…నేడు ఆధునిక కాలంలో చూసుకుంటే అన్నా చండి కేరళ హైకోర్టు ప్రథమ మహిళా న్యాయమూర్తిగా పేరు తెచ్చుకుంది . సుచేతా కృపలాని ఉత్తరప్రదేశ్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆమె పేరు తెచ్చుకుంది. అట్లాగే విజయలక్ష్మి పండిట్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో స్థానం సంపాదించుకున్న తొలి మహిళగా గొప్ప స్థానాన్ని పొందింది. ఇక సరోజినీ నాయుడు భారత జాతీయ కాంగ్రెస్ లో అధ్యక్షత వహించిన తొలి మహిళ. కిరణ్ బేడీ తొలి ఐపీఎస్ అధికారిణి. ఇలా ఎందరో మహిళలు ఇంకెందరో గొప్ప స్థానాన్ని తమ జ్ఞాన సంపదతో సంపాదించడమే కాకుండా చరిత్రలో ఆదర్శమూర్తులుగా మిగిలిపోయారు. ప్రస్తుతం ఎంతో మంది మహిళలు ఉపాధ్యాయినులుగా, డాక్టర్లుగా నర్సులుగా, పోలీసు ఉద్యోగాల్లోనే కాక శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎనలేని జ్ఞానాన్ని సంపాదించి అనేక పదవులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
29. సమాజానికి మీరిచ్చే సందేశం ఏమిటి ?
జ: సమాజం అంటే వ్యక్తుల సమూహం లేదా సామూహిక జీవన విధానం.
ఇందులో భిన్నమైన వ్యక్తిత్వాలు, విభిన్నమైన మనస్తత్వాలు కల గలిసిన మనుషుల జీవితాలు కొన్ని కట్టుబాట్లకు, విధివిధానాలకు లోబడి సమూహాలుగా సమాజంలో కొనసాగించడం.
బతకడానికి తినడం, తినడానికి సంపాదించడం, సంపాదనకోసం ఉద్యోగ వ్యాపారాలు, విలాసాలు, కుటుంబాలు, బాధ్యతలు ఇలా గానుగెద్దు జీవితాలుగా కాకుండా సమాజం పదికాలాలపాటు పచ్చగా జీవించడానికి మనవంతు కృషి ఏమిటి..? అని ప్రతి వ్యక్తీ ఆలోచించుకోవాలి.. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దానధర్మాలు, ప్రేమైక జీవనవిధానం, సేవాతత్పరత ఇలాంటి పెద్ద మాటలు కాకుండా ఒకరికొకరు సాయపడాలనుకోవడం, పడి పోయిన వ్యక్తిని చూసి హేళన చేసో, జాలిపడో వెళ్ళిపోయేబదులు చేయూతనిచ్చే ప్రయత్నం చేయాలంటాను. మనకెందుకులే.. అని మరలిపోయే మనస్తత్వం మారాలంటాను. మనిషిగా పుట్టినందుకు మానవత్వపు విలువలు పెరగాలంటాను.
30. మహిళా దినోత్సవాలు జరుపుకోవడం అవసరమంటారా?
జ: స్త్రీ స్థితిగతులు బాగుపడనిదే సమాజం బాగుపడదు,ఏ పక్షి అయినా ఒంటి రెక్కతో ఎగరలేదు. అన్నారు స్వామి వివేకానంద. ఆకాశంలోసగం,అవకాశాల్లో సగం నేడు మహిళ అన్ని రంగాల్లో పురుషునితో పోటీ పడుతుంది, రాణించ గలుగుతుంది, అంతరిక్షంలో కూడా అడుగుపెట్టింది నేడు మహిళలేని రంగంలేదు. శాస్త్ర, సాంకేతిక, రాజకీయ, వ్యాపార,క్రీడా రంగాల్లో నేటి ఆధునిక మహిళ అద్భుతమైన ప్రతిభాపాటవాలు చూపుతుంది,అయినా నేటి పితృస్వామ్య వ్యవస్థ స్త్రీని ఆటవస్తువుగానూ,ఒక అలంకార వస్తువుగానూ చూస్తుంది. ఈ రాకెట్ యుగంలోకూడా స్త్రీ గృహహింసకు, అత్యాచారాలకు గురవుతూనే ఉంది.ఆర్థిక స్వావలంబనే స్త్రీ విముక్తికి మార్గం. సమాన పనికి సమాన వేతనం. పనిగంటలు తగ్గించాలనే డిమాండ్ తో న్యూయార్క్ లో మహిళలు సాగించిన పోరాటం మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. స్త్రీ ఆత్మగౌరవం ప్రతీకగా మార్చి 8 ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.పక్కవాడు మనవాడే అనే భావన అలవరచుకోవాలంటాను….. 1908 సంవత్సరం లో న్యూయార్క్ లోని పదిహేను వేల మంది శ్రామిక మహిళలు సమానపనికి సమానవేతనం,పనిగంటలు తగ్గించాలి,మహిళలకు ఓటుహక్కు కల్పించాలనే డిమాండ్ తో కదంతొక్కారు. గౌరవం, గుర్తింపు కోసం స్త్రీలు ప్రాణాలొడ్డి పోరాడారు. తమ హక్కులు సాధించుకున్నారు. 1910 లో డెన్మార్క్ లోని కోపెన్ హాగన్ లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్స్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో జర్మనీకి చెందిన మార్క్సిస్టు సిద్దాంతకర్త క్లారాజట్కిన్ అనే మహిళ న్యూయార్క్ మహిళలు సాగించిన వీరోచిత పోరాటానికి గుర్తుగా మార్చి 8 ని అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవంగా జరుపుకోవాలని ప్రతిపాదించారు,దీనికి సభ ఆమోదం తెలిపింది, అప్పటినుండి ప్రపంచమంతా మార్చి 8 ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. దీనిని 1975 లో ఐక్యరాజ్యసమితి కూడా గుర్తించింది. కాబట్టి మహిళా దినోత్సవాలు సమాజంలో చైతన్యాన్నినింపాలి.
చాలా సంతోషం మేడం. మీ విలువైన సమయాన్ని మాకోసం, మా పాఠకుల కోసం వెచ్చించి ఎన్నో విషయాలు మాకు తెలియజేసినందుకు మీకు మా అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.. నమస్కారాలు.
1 comment
ఇది అరుణ ధూళిపాళ గారు జరిపిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూ. మంత్రి శ్రీదేవి మేడమ్ గారు ఓపిగ్గా సమంజసంగా బ్యాలెన్స్డ్ గా సమాధానాలు ఇచ్చారు. ఇద్దరూ అభినందనీయులే.