రచయితలు చేతులెందుకు దాచుకుంటరు
కలం లోంచి సిర పారుతనే ఉంటది
కాలానికి కలానికి విరమణ లేదు
నానినంకనే గింజనుంచి మొలక
పదను తాకితేనే పద్యం కమ్మని వాసన
వేదన పడితెనే పదపదం వికాసం
రాస్తున్న పెన్నుకు ఇరాం లేదు
సామరస్యం కుదిరేదాకా ఎక్కుడే
పరిపూర్ణత సాధిస్తేనే ప్రశాంతత
కవికూడా చరిత్రకారుడే
కవిత్వం నడుస్తున్న ఇతిహాసం
తెల్లకమ్మల నిండా చిలుకుతున్న స్వేదం
తరతరాల జన జీవన చిత్రిక
వాక్యం వెంట వాక్యం నడక
జోరుగా సాగుతున్న భావ ధార
సామాజిక ఆకాంక్షల సింగిడిపూత
అంతరంగం ఒక చంచల వీరంగం
చిక్కనైన ఆలోచనల కోసం
చిన్నమంటమీద తీగపాకం
రగిలే అక్షరాలు నిత్యం చలించే నిష్కలు
మౌనం ఒక చిన్న కునుకు
కైత్వం ఆరిపోని అగ్గిదీపం
సాహిత్యం ఆగి ఆగి కురిసే వర్షం .