“ఆత్మానాం మానుషం మన్యే రామం దశరథాత్మజం” అన్నది శ్రీరాముడు పలికిన వాక్యమని చెప్పబడింది. అంటే నేను దశరథ పుత్రుడను..నా పేరు రాముడు..నేను కేవలం మానవుడినే అని. శ్రీ రాముడిని దేవునిగా తలుస్తూ నిత్యం స్మరించే మన లాంటి సామాన్య భక్తులకు ఇది అంత సులువుగా నమ్మే విషయం కాదు.వాల్మీకి మహర్షి కూడా శ్రీ మద్రామాయణంలో ఎక్కడా రాముణ్ణి దేవునిగా చిత్రీకరించలేదు. కానీ మానవాతీతమైన ఎన్నో కార్యాలు సంకల్ప బలం చేత సాధించిన వ్యక్తిత్వంగా మనకు పరిచయం చేశాడు. సామాన్య మానవుడు పడే కష్టాల కన్నా ఎన్నో రెట్లు కష్టాలు అనుభవించిన ఒక అత్యున్నత వ్యక్తిని దర్షింపచేశాడు. రామో విగ్రహవాన్ ధర్మః అన్నట్టు అన్ని ఆదర్శాలకు ఉదాహరణగా నిలిపి, మర్యాదాపురుషోత్తముడైన మానవుని కథగా మనకు అందించాడు.
రామాయణము ఒక భక్తి కావ్యం అని, దైవ చరిత్ర అని అనుకుంటే అది ఒక కోణం.కానీ దానిని ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథంగా, ఒక వైజ్ఞానికమైన విశేషాలకు,రాజకీయ పరిజ్ఞానాన్ని పంచే గ్రంథంగా చూసే వారికి మాత్రం, ఎన్నో విషయాలకు వేదికగా నిలుస్తుంది.
ఒక రాజ్యానికి సమర్థవంతమైన రాజు యొక్క అవసరం,ఆ రాజుకు ఉండాల్సిన నాయకత్వ లక్షణాలు,ఆ రాజు తెలుసుకోవాల్సిన బాధ్యతలు , తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుస్తాయి. ఒక విజ్ఞానవంతుడైన రాజు లేక పోవడం వల్ల ఆ రాజ్యం లో జరిగే అనర్థాలు, అటువంటి రాజ్యంలో ప్రజల మానసిక స్థితి ఎప్పుడూ ఎలా ఉంటుందన్నది,యుగాలు మారినా,తరాలు మారినా
ఒక్కలాగే ఉంటుందన్నది మహాకవి వాల్మీకి వేరు వేరు పాత్రల ద్వారా ఈ విషయాన్ని చెప్పించిన తీరు చూస్తే సుస్పష్ట మవుతుంది. రాజు లేని రాజ్యం లో వెల్లువెత్తే అరాచక పరిస్థితుల్ని, రాజ్యంలో ధర్మం తప్పడం ,సత్య సంధత లేకుండా ఉండడం,నేరాలు, మోస ప్రవృత్తి పెరుగడం, సజ్జనుల నిరాదరణ, దొంగతనాలు,అపరిశుభ్రత మొదలైనవి పెరిగి దేశం చిన్నాభిన్నమయ్యే స్థితి వస్తుందని దీని సారాంశము.
అలాగే ఒక రాజనీతిజ్ఞత గల రాజు యొక్క లక్షణాలని, అవలంబింప వలసిన వ్యూహాలని, వనవాసం లో ఉన్న తనను మళ్లీ అయోధ్యకు రాజుగా ఉండమని వేడుకొంటున్న భరుతుడి కి రాముడు కుశల ప్రశ్నలు వేసే ప్రక్రియలో చేసిన సూచనల ద్వారా చెప్పిస్తారు వాల్మీకి. ఒక రాజు, విశ్వాసపాత్రులైన అధికార గణాన్ని ఎలా ఎన్నుకోవాలి, అంతర్గత, బాహ్య శత్రువులపైన,గూఢచార వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉండాలి, నేరాలకు తగిన శిక్షలు వేయకుండా లంచాలకు లోబడే చట్ట,న్యాయ వ్యవస్థను ఎలా క్రమబద్ధీకరించాలి, దేశంలో ఉన్న మేధావులను,విజ్ఞానవంతులను,ఎలా,గౌరవించాలి, యుద్ధ,దండ నీతి, దేశం యొక్క నైసర్గిక పరిస్థితులను బట్టి వాటిని సమర్థవంతంగా ఎలా వాడుకోవాలి, అన్న విషయాల విచారణ చేస్తారు శ్రీ రామచంద్రమూర్తి.
ఇక వైజ్ఞానిక,సాంకేతిక విషయాలు రామాయణంలో ఎన్నో చెప్పబడ్డాయి.రాముణ్ణి తిరిగి తీసుకు వచ్చి పట్టాభిషక్తుణ్ణి చేస్తానని భరతుడు, వనానికి వెళ్ళడానికి సిద్ధపడే నేపథ్యంలో ఆ ప్రయాణం సుఖంగా జరగడానికి, ఏకంగా పెద్ద రహదారి నే నియమింప జేశాడని, ఆ పనిలో ఎంతో మంది నిష్ణాతులు,యంత్రాలు నడిపే,కొలతలు వేసే నిపుణులను,వినియోగించారని, వారు మధ్య మధ్య విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా దారి ప్రక్కన, ఎన్నో విశ్రాంతి భవంతులు నిర్మించి, నదుల నుండి తాగునీటికి కాలువలు, మరియు నూతులు త్రవ్వించారని, ఆ దారి వాడుతుంటే పాడవకుండా, గట్టి సున్నంతో దారులు నిర్మించారని, అదికూడా అతి తక్కువ సమయంలో నిర్మించారని చెప్పడం చూస్తే రామాయణ కాలంలోనే ఎంత విజ్ఞానం అభివృద్ధి చెందిందో తెలుస్తుంది.
అట్లాగే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి మానవుడిలో, స్ఫూర్తిని పెంచి, జీవితాన్ని సరైన దృక్పథంతో మలుచుకోవడానికి ఉపయోగ పడే కాలానికి వీగిపోని ఎన్నో హితోపదేశాలను మహాకవి వాల్మీకి శ్రీ మద్రామాయణం లో పొందుపరిచారు.తండ్రి మాటను ఆచరించడమే ముఖ్య ధర్మమని శ్రీరాముడు, అన్నమాట జవదాటని తమ్ముళ్లు,ధర్మాచరణం యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ ఇది తమకే కాక సమస్త మానవాళికి శిరోధార్యమని చెపుతారు. మానవాళికి క్షమా గుణమే గొప్ప అలంకారమనీ, ,దానం, యజ్ఞం, కీర్తి, చివరకు ధర్మం కూడా క్షమకు ప్రతి రూపాలు అని హితవు పలుకుతారు.మరోచోట మానవప్రయత్నం కన్నా దైవేచ్ఛనే మిన్న, అన్ని కష్ట సుఖాలకు దైవాశ్రయమే సరియైన దారి యన్న సందేశమూ ఉంటుంది. ఎక్కువ మంది మూర్ఖులకన్న ఒక్క పండితుడు ఇచ్చే సూచన శ్రేయస్కరమని, అలాగే దక్షుడు, శూరుడైన ఒక్క మంత్రి చాలు రాజ్యానికి మంచి చేయడంలో అనీ బోధిస్తారు. చెట్లు ఋతువులను బట్టి పూతనూ, కాయలను బొందినట్టు, ప్రాణులు తమ కర్మ ఫలితాన్ని సమయం రాగానే పొందుతారు. స్వలాభ పరులు రాజుకు ఎప్పుడూ ప్రియవచనాలే పలికి తమపని చక్కపెట్టు కుంటారు.అటువంటి వారిని రాజులు గుర్తించాలని, మోయగలిగిన బరువునే తలకెత్తుకోవాలి, జీర్ణమయే ఆహారాన్నే భుజించాలి,లేకున్నట్లైతే అది వ్యాధి కారకమవుతుంది. దుఃఖం, ఆర్థిక నష్టం, ప్రాణానికి ముప్పు ఉన్నప్పుడే, ధైర్యవంతుడు తన బుద్ధితో వాటిని ఎదుర్కోవాలి. రాజద్రోహి , గోబ్రాహ్మణ , నిరపరాధుల హంతకుడు, చోరుడు, లోభి, అన్నకు ముందు పెండ్లి చేసుకునే వాడు, మిత్రద్రోహి,గురుద్రోహి, ఖచ్చితంగా నరకానికి పోతారు. ఎవ్వరితో నైననూ ఎక్కువ ప్రీతి, ఎక్కువ ద్వేషమూ మంచిది కాదు.
కోపి పాపం చేయకుండా ఉండడు.సజ్జనులను, దూషించకుండా ,కష్టపెట్టకుండ ఉండడు,అంటూ కోపం వలన వచ్చే నష్టాలు హనుమ ద్వారా చెప్పిస్తారు.
ధనం గలవానికే ఎక్కువ మంది స్నేహితులు ఏర్పడి, అతడు ఒక ఉత్తముడుగా,గొప్ప గుణవంతుడు గా, తెలివికలవాడుగా పొగడ బడుతాడు. నిజంగా బుద్ధి కుశలుడు వీటినుండి తెలివిగా తప్పించుకోగలడు అని ఒక చోట సందేశం ఉంటుంది. రాజు, ధర్మం , ధనార్జన, వాటిని వినియోగం చేయడంలోనూ, పుణ్యపాపకార్యాల భేదాల్లోనూ మార్గదర్శకుడు. రాజు ధర్మాచరణాన్ని పాటిస్తే ప్రజలు కూడా వారిని అనుసరిస్తారు కదా. యథా రాజా తథా ప్రజా అన్న సూక్తి కూడా మనకు రామాయణంలో నిదే.
ఇలా శ్రీమద్రామాయణ కావ్య రూపంలో ఉన్న రామకథ సాక్షాత్తు అన్ని వేదాల సారం అని చెప్పవచ్చు. జ్ఞాతవ్యాలు, కర్తవ్యాలుగా చెప్పబడే జ్ఞానకాండ,కర్మకాండల సారం రామాయణము. భూమిపై పుట్టిన ప్రతి మానవుడు, తెలుసుకోవాల్సిన, జీవించినంత కాలం తప్పక ఆచరించవలిసిన విషయాల సమాహారమే శ్రీ రామకథ… శ్రీ రాముడు దేవుడైనా, పురుషోత్తముడైనా, ఎలా అనుకున్న భక్తిగా ఆరాధించడం లో ఉన్న తాదాత్మ్యత మనకు ఆదర్శమే కదా..
చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్
ఏకైక మక్షరం పుంసాం మహపాతక నాశనమ్
Author