తెలంగాణ అంటేనే బతుకమ్మ పండుగ వంటిది. పువ్వులను పూజించడమనే ప్రత్యేక సాంప్రదాయం తెలంగాణ ప్రాంతంలో కనిపిస్తుంది. సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం . ప్రకృతిని పూజించడం మన సాంప్రదాయం. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న పండుగ బతుకమ్మ .బతుకమ్మ అనే పదానికి బతుకు అంటే జీవితం, అమ్మ అంటే అమ్మ అని అర్థం. బతుకమ్మ అనగా జీవం పోసే తల్లి . ఈ పండగ ప్రధానంగా పుష్పాలతో నూ, మధురమైన పాటలతో నూ మహిళలు సామూహికంగా ఆనందభరితంగా జరుపుకునే పండుగ .
బతుకమ్మ పండగ కంటే ముందే బొడ్డెమ్మ పండుగను జరుపుకుంటాం. బొడ్డెమ్మ పండుగను భాద్రపద బహుళ పంచమి నాడు ప్రారంభమై మహాలయ అమావాస్యం వరకు తొమ్మిది రోజులపాటు జరుగుతారు. బొడ్డెమ్మ అంటే బొడ్డె అని, అంటే చిన్న అని అర్థం. బొడ్డెమ్మ అనగా చిన్నపిల్ల అని అర్థం. కొన్ని ప్రాంతాలలో బొడ్డ పదానికి అత్తి చెట్టు,. మేడి చెట్టు ,జాదుంబర వృక్షం అని పిలుస్తారు. ఇవే కాకుండా ధాన్య రాశి, ధాన్యం కుప్ప అని వాడుకలో ఉంది. బొడ్డెమ్మ పండుగను బాలికలు, పెళ్ళికాని అమ్మాయిలు జరుపుకుంటారు. కన్నెపిల్లలు మంచి భర్త రావాలని, వైవాహిక జీవితం బాగుండాలని భక్తిశ్రద్ధలతో గౌరీదేవిని ప్రార్థిస్తారు. బొడ్డెమ్మ నోములను కూడా నిర్వహిస్తారు . ఇది “తీజ్ ” పండుగను పోలిఉంటుంది. మనిషి, మట్టి,ప్రకృతికి ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది బొడ్డెమ్మ పండుగ.

తెల్లవారుజామున తడి జల్లులో తడుచుకుంటూ అమ్మాయిలందరూ కలిసి చేను చెల్కల నేలలో తిరిగి , పుట్టమన్ను తీసుకువచ్చి ఆ మన్నుతో బొడ్డెమ్మ ను తయారు చేస్తారు. ఒక్కో ఇంటికి ఒక్కో ఒంతు ఉంటుంది. అంటే ఆనవాయితీ ఉంటుంది. పీట మీద త్రిభుజాకారంలో గానీ చతురస్రాకారంలో గాని, వలయాకారంలో గాని మూడు,ఐదు, తొమ్మిది వరుసలు అంటే అంతెలుగా పేర్చి, పైవరకు గోపురం ఆకారంలో చేస్తారు. రాగి కలశంలో బియ్యం పోసి, కొత్త వస్త్రం పెట్టి పసుపుతో గౌరమ్మని తయారు చేసి తమలపాకులో పెడుతారు . ఇంటి ముందు శుభ్రం చేసి ఎర్రమన్నుతో అలికి, పిండితో ముగ్గులు వేస్తారు. పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. ఆకాశంలోని నక్షత్రాలను కలుపుకుంటూ ముగ్గు వేసి నట్టు చుక్కల ముగ్గులు, గీతాలు ముగ్గులు వేసి, మధ్యలో బొడ్డెమ్మను పెట్టి రుద్రాక్ష,కాకర, కట్ల,బీర మొదలైన విభిన్న రకాల పువ్వులతో అలంకరిస్తారు. పువ్వుల నవ్వులను చూస్తూ ముందుకు అడుగులు వేస్తూ వలయాకారంలో తిరుగుతూ …..
బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్..
నీ బిడ్డ పేరేమి కోల్..
నా బిడ్డ నీలగౌరు కోల్..
నిచ్చెమల్లె చెట్టేసి కోల్..
చెట్టుకు చెంబేడు కోల్..
నీళ్లనూ పోసి కోల్..
కాయల్లు పిందేలు కోల్..
గనమై కాసెను కోల్..
అందుట్ల ఒక పిందే కోల్..
ఢిల్లీకి పాయెనూ కోల్..
ఢిల్లీలో తిప్పరాజు కోల్..
మేడా కట్టించే కోల్..
అంటూ ముందుకు సాగుతూ
బొడ్డెమ్మ బిడ్డ పేరు నీల గౌరి. ఆమె , నిత్యమల్లె చెట్టు పెట్టి ,నీళ్లు పోసేది . వాటికి వచ్చిన కాయలను పండ్లును తెంపి ,యాదగిరి నరసన్నకు, ఐలోని మల్లన్నకు, వేములవాడ రాజన్నకు ,భద్రాచలం రామన్నకు , కొమ్మలనరసింహ స్వామికి పంపించగా ,ఎవరు వాటిని సేవించలేదు చివరికి వరంగల్ భద్రకాళి మాత్రం తీసుకుందని తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా వరంగల్ జిల్లాలో ఈ విధంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను తలుచుకుంటూ పాట పాడుతారు. బాలికలు , అమ్మాయిలు , మహిళలు సంధ్య వేళలో ప్రారంభించి రాత్రి వరకు ఇట్లా పాడుతూ ఆడుతారు.
ఇలా రూపం లో, ఆకారంలో ఐదు రకాల బొడ్డెమ్మలను తయారు చేయడం , పాటలను పాడుతూ ఆటలాడటం జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్య విషయం ప్రాంతాన్ని బట్టి బొడ్డెమ్మను పీట బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ ,పందిరి బొడ్డెమ్మ, బాయి బుడ్డమ్మ, అంతరాల బొడ్డెమ్మ తయారు చేయడం అనే పద్ధతి ఉన్నది.
సుఖదుఃఖాలను పాట రూపంలో మలిచి గౌరీదేవిని పూజిస్తూ…
నిద్రపో బొడ్డెమ్మ నిద్రపోవమ్మా
నిద్రకు నూరేళ్లు నీకు వెయ్యిళ్లు
నిన్ను కన్నా తల్లికి నిండు నూరేళ్లు …..
అంటూ ప్రతి రోజూ చేస్తారు. ఎందుకంటే రోజూ బొడ్డెమ్మ నిమజ్జనం చేయరు ఇంట్లోనే ఉంటుంది కాబట్టి! ఇక చివరగా ఎనిమిది రోజులు పాడుతూ తీసేముందు ఈ పాటనే ” పోయిరా బొడ్డెమ్మ పోయిరావమ్మా మళ్లీ ఏటికి మరలిరావమ్మా” అంటూ తర్వాత దేవుడి ముందు పెడతారు. లేదా కొందరు బావిలో నిమజ్జనం చేస్తారు. ఎనిమిది రోజులు పాటు, దేవుడి ముందు పెడతారు , చివరి రోజు తీసేస్తారు.
ప్రతిరోజు పోటీపడి ఆడపిల్లలు అలంకరించుకుంటారు. పట్టులంగాతో,లంగావోనితో తయారైన ఆడపిల్లల సందడితో వీధులన్నీ కలకలాడుతాయి. వీరి మధ్య స్నేహం బలపడి ఆప్యాయత అనురాగాలకు పునాది వేయడం జరుగుతుంది . ఈ కాలంలోఒక పోస్ట్ కి ఎక్కువ లైకులు, ఫాలోవర్లు వస్తేనే వారు ఆనందంగా కలిసి అంటున్నారు మరియు సుడిగుండంలో చిక్కిన సీతాకోకచిలుకలు అవుతున్నారు. ప్రస్తుత కాలంలో ఆదరణ తగ్గిపోయి కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచీకరణ ప్రభావంతో సోషల్ మీడియాకి అలవాటు పడ్డారు బాలికలు యువత. ఫోన్ ఓపెన్ చేసి వాట్సాప్ లో, ఫేస్బుక్, స్నాప్ చాట్, టెలిగ్రామ్,ఇంస్టాగ్రామ్, ఏఐలో అంతర్జాల మధ్యలో లోకాన్ని మర్చిపోతున్నారు. తొమ్మిది రోజులపాటు పెట్టే ఆరోగ్యకరమైన ప్రసాదాలే ఉంటాయి. బెల్లం, నువ్వులు, పప్పు, కొబ్బరి, మొదలైనవి ఆడపిల్లల శారీరక పుష్టికి ఉపయోగపడతాయి .కానీ ఇప్పుడు స్విగ్గి, జొమాటో ఆర్డర్ చేసుకొని తినే విధానానికి అలవాటు పడిపోయారు,ఈనాటి కాలం వారు. చివరి రోజు రాగి చెంబులో పోసిన బియ్యంతో పప్పు బెల్లంతో నైవేద్యంగా తయారు చేసి ప్రసాదం పంచి .అందరూ కలిసి చెరువు దగ్గరికి తీసుకొని వెళ్లి
పోయిరా బొడ్డెమ్మ ….
పోయిరావమ్మా …అంటూ
నిమర్జనం చేసిన అనంతరం పసుపు గౌరమ్మని పిల్లలకు గంధం బొట్టుగా, చెంపలకు పూస్తారు, ముత్తైదులు మంగళ సూత్రాలకు పెట్టుకుంటారు. బొడ్డెమ్మ నిమర్జనం చేసిన తర్వాత రోజు నుండి బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. బతుకమ్మ పండుగ భద్రపద అమావాస్య నుండి దుర్గాష్టమి వరకు కొనసాగుతుంది. బొడ్డెమ్మ పండుగ ఆనందంగా జరుపుకునే పండుగ.
