కుర్చీలోంచి విసురుగా లేచాడు రమణ.
“గాయత్రీ..! ఫర్ గాడ్స్ సేక్.. మళ్లీ నీ ఎపిసోడ్ మొదలెట్టకు. వినీవినీ విసుగొచ్చింది. నువు ముందా ఏడుపు మానెయ్యి. ఐ కాంట్ టేక్ ఎనీమోర్ ఆఫ్ దిస్” చిరాకునంతా ముఖంలో ప్రదర్శిస్తూ అన్నాడు.
అతని అనవసర ఇరిటేషన్ నాకూ కోపం తెప్పించింది. కానీ సర్దుకున్నాను.
“నేను చెప్పేది ఎపిసోడ్ లా అనిపిస్తుందా నీకు?”
“కాదామరి, మాట్లాడితే మన పెళ్లి ఎప్పుడంటావు. అసలా బాండింగ్ కోసం ఎందుకంత తొందర?”
“ తొందర కాదు, అవసరం. మనం కలిసుందామని డిసైడైనప్పుడు అది కొద్దిరోజులు మాత్రమే అనుకున్నాం. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ ఇప్పటికి ఏడాదిన్నర దాటింది. నువ్వుగా ప్రస్తావన తేవు. నేను పెళ్లి మాటెత్తితే దాటేస్తావు. దీనివల్ల మనమధ్య మనస్పర్థలు, దూరం పెరుగుతున్నయి. మన ప్రేమ మీద ఇష్టంతో, భవిష్యత్తు మీద నమ్మకంతో సహజీవనానికి ఒప్పుకున్నా. ఇప్పుడేమో నువు పెళ్ళిని తేలిగ్గా తీసుకుంటున్నావు. అసలు నీ మనసులో ఉన్నదేమిటో స్పష్టం చెయ్యి. ఒక క్లారిటీ వస్తే మంచిది”
“జస్ట్ షటప్ ఐసే.. నీ సోది మళ్ళీమళ్ళీ వినే ఓపిక నాకు లేదని ముందే చెప్పాను. ఇంట్లో ఉంటే ఒక్కక్షణం మనశ్శాంతిగా ఉండనీవు. అందుకే వెళ్లిపోతున్నా” మాట పూర్తిచేస్తూనే విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. అతని వెనుకే పెద్దచప్పుడుతో తలుపు మూసుకుంది.
గత కొన్నిరోజులుగా జరుగుతున్నదే మళ్లా ఈరోజూ జరిగింది.
ఒక సందర్భానికి తనకు అనుకూలమైన విధంగా ముగింపు పలికి అతడు తప్పుకున్నాడు. చిక్కని నీడలాంటి మరో సాయంత్రం నాముందు పరుచుకుంది. ఇల్లంతా నిండిన నిశ్శబ్దం… నన్ను కావలించుకునే ఒంటరితనం. నిస్సహాయతతో ఏడుపొస్తుంది. కానీ ఇప్పడేడ్చి లాభమేమిటి?
అనుకోకుండా మొదలైన మా సహజీవనం మరొకలా రూపం మార్చుకుంది. అప్పటికి ఇద్దర ఒకే కంపెనీలో పనిచేస్తున్నాం. అంతకుమించి మంచి స్నేహితులం. మామీద ఆఫీసులో, బయటా ఏవేవో రూమర్స్ పుట్టేంత సన్నిహితులం.
ఒకరోజు లంచ్ టైములో కేంటీన్లో చెప్పాడు రమణ.
“ఇంకో వారంలో నేనుండే ఇల్లు వెకేట్ చేయాలి గాయత్రీ ..! ఎంత ప్రయత్నించినా నాకు సూటయ్యే మరో కొంప దొరకడం లేదు. ఈ నగరంలో సరైన ఇల్లు, అందులోనూ మన స్తోమతకు తగింది దొరకడం కష్టమని తేలిపోయింది”
“ఇల్లు కోసం వెతుకుతున్నావా ఏమిటి..?”
“అవును. ఇల్లు సౌకర్యంగా ఉందనిపిస్తే అద్దెలు ఎక్కువున్నయి. తక్కువలో కావాలనుకుంటే అసౌకర్యంగా, మన ఆఫీసుకు చాలా దూరంగా ట్రాన్స్ పోర్టుకు ఇబ్బంది అయ్యేలా ఉన్నాయి”
“ఇది అందరికీ ఎదురయ్యే సమస్యనే. ప్రత్యేకించి నీకొక్కడికే కాదు” నవ్వాను.
“అందుకే మరెవరినైనా కలుపుకొని షేరింగులో మంచి ఫ్లాట్ తీసుకుంటే బాగుంటుందనే యోచనలో ఉన్నా”
“నాదగ్గరో మంచి ఐడియా వుంది..చెప్పనా?”
“చెప్పు.. సందేహం ఎందుకు?”
“మరి నువు షేర్ చేసుకునే హౌస్ మేట్ నేనే అయితే ఎలా ఉంటుంది..?”
రమణ ఒక్కక్షణం అయోమయంగా నాముఖంలోకి చూసి ఆశ్చర్యపోయాడు. ఇబ్బంది పడినట్టు కనిపించాడు.
“ ఇది మంచి ఐడియా యెలా అవుతుంది? అందరూ ఏమనుకుంటారు? ముఖ్యంగా మీ తల్లితండ్రులకు తెలిస్తే…”
“ఏమీ కాదు. నేనేం చేసినా అది నాయిష్టం. నాకు సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ ఉంది. పైగా మనం ఒకర్నొకరు
బాగా సన్నిహితులం. మన భవిష్యత్తుకూ, పరస్పరం సంపూర్ణంగా అర్థం చేసుకునేందుకూ ఇదో అవకాశంగా భావించు.”
“నీతో కలిసివుండటం ఒక అద్భుతం, కానీ…”
“ఇంకేం ఆలోచించకు. నేను కూడా పీజీ నుంచి ఖాళీ చేయాల్సివుంది. ఇద్దరం కలిసి మంచి ఇల్లు వెతికి ఈ వీకెండుకే చేరిపోదాం”
“నువు నిజంగానే నాతో కలిసుండాలనుకుంటున్నావా?” అతనిలో ఏదో సంశయం.
రమణకు వివరంగా సర్దిచెప్పాను. అట్లా ఎక్కువకాలం ఉండాల్సిన అవసరం లేదన్నాను. త్వరలోనే మనకూ ఒక కుటుంబం ఏర్పడి అంతా సెటిలైపోతుందని చెప్పాను. ఆవిధంగా ఇద్దరం ఒకచోట వుండాలనుకున్నాం. నేనప్పటికే అతన్ని ఇష్టపడి ఉన్నాను. పైకి అనకపోయినా రమణ కూడా అంతేనని నాకు తెలుసు. అయితే ‘మనం వెంటనే పెళ్లి చేసుకుందామని’ మాత్రం చెప్పలేకపోయాను.
మేము కలిసివుండటం మా అమ్మా నాన్నలకు ఇష్టంలేకపోయింది.
“కలిసివుండటం ఎందుకు? ఇద్దరూ ఇష్టపడ్డారు. పెళ్లిచేసుకోవచ్చుగద. మిమ్మల్నెవరు కాదన్నారు?” అమ్మ అన్నది.
“ కొద్దిరోజులే మమ్మీ..! తొందర్లోనే మ్యారేజీ చేసుకుంటాం. రమణ చాలా మంచివాడు”
“ ఏ మాత్రం బెడిసికొట్టినా నష్టపోయేది స్త్రీ మాత్రమే. ఆ సంగతి గుర్తుంచుకో బేబీ”
నాన్న ఎందులోనూ లోతుగా జోక్యం చేసుకోడు. ఈ విషయంలో నన్ను సున్నితంగా హెచ్చరించాడు.
“అతను మంచివాడే కావొచ్చు బేబీ..! కానీ సహజీవనమంటే కాలక్రమంలో అతనికి నీమీద గౌరవం పోవొచ్చు. ఇప్పుడున్న ఆపేక్షలు ముందు ముందు ఉండకపోవచ్చు. నా సలహా ఏమంటే మీరు పెళ్లి చేసుకుంటేనే మంచిది.”
“ అదేం కాదులే నాన్నా. నేను అన్నీ ఆలోచించాను. నా నిర్ణయంలో మార్చులేదు”
“తప్పు చేస్తున్నావు బేబీ..! ఏదోరోజు బాధపడే స్థితి తెచ్చుకోకు. ఎదురుదెబ్బలు తినకుండా చూసుకో” అమ్మ చివరి హెచ్చరికగా అన్నది.
నేను వాళ్ళ జాగ్రత్తలు, హితవచనాలను పట్టించుకోలేదు. అమ్మానాన్న నన్ను సరిగా అర్థం చేసుకోలేదనిపించింది. నాజీవితాన్ని నేనే మలుచుకోవాలని భావించుకున్నాను. నేను రమణని ప్రేమించాను. అతనితో కలిసి నాకిష్టమైనట్టుగా బతకాలనుకున్నా. జీవితం రొటీన్ కావడం నాకు నచ్చదు. రమణతో సహజీవనంలో ఒకరినొకరు అర్థం చేసుకొని, ఆ తర్వాత పెళ్లిచేసుకోవడం, నా సంసారం.. పిల్లలు.. ఇదే నాక్కావలిసింది.
గడియారం వంక చూశాను. పది గంటలు దాటింది. రమణ ఇంటికి రాలేదు. మరునాడు కూడా రాలేదు. ఆవేశమూ ఆవెనుకే నిస్సహాయతా నన్ను కుదిపివేశాయి. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. అతనిప్పుడు పనిచేసే కంపెనీకి కాల్ చేస్తే సరైన రెస్పాన్స్ లేదు. పెళ్లి విషయంలో అతన్నుంచి పదేపదే తిరస్కార స్థితిని ఎదుర్కోవడం ఓటమిగా అనిపించి ఆవేదన పెరిగింది. మనసులో అలుముకున్న నా గోడు వెళ్లబోసుకుంటే తప్ప బరువు దిగదనిపించింది. నాన్నతో మాట్లాడే ధైర్యంలేక అమ్మకు కాల్ చేశాను. వెంటనే ఫోనెత్తింది.
“హలో మమ్మీ..!”
“హలో బేబీ..! ఎలా ఉన్నావు. బిజీ అనుకుంటా.. మొన్న ఫోన్ చేస్తే లిఫ్టు చేయలేదు”
“నేను బాగానే ఉన్నాను మమ్మీ”
“మరి నీ గొంతు అట్లా ధ్వనించడం లేదే”
అమ్మ మాటకు తెలియకుండానే ఏడుపొచ్చింది. దుఃఖం గొంతులోంచి జారకుండా సర్దుకున్నాను.
“అవును మమ్మీ..! మేము మళ్ళీ గొడవపడ్డాం. మొన్న ఇంట్లోంచి వెళ్ళిన రమణ ఇంకా రాలేదు”
తల్లికి ఏం అర్థమైందో, ఎలా ఫీలయిందో తెలియదు, కొద్దిసేపు మౌనంగా ఉండిపోయింది.
“చాలారోజులుగా నీకు అబద్ధం చెపుతూ వొచ్చాను. నిజానికి రమణ పెళ్ళికి సిద్ధంగా లేడు మమ్మీ. అడిగితే దాటేస్తున్నాడు.
లేదా ఘర్షణపడి బయటికి పోతాడు. అతనితో సహజీవనం విషయంలో మీరొద్దన్నా వినకుండా తొందరపాటు నిర్ణయం
తీసుకున్నాననిపిస్తుంది”
“పెళ్లి గురించి నువు ఖచ్చితంగా అడిగావా?”
“చాలాసార్లు అడిగాను. అతనిలో ఆ ధ్యాసే లేదు. పెళ్లి, పిల్లలు, ఒక కుటుంబం కోసం నేనెంత ఇష్టంగా ఆరాటంగా ఉన్నదీ చెప్పినా అతడు వినిపించుకోవడం లేదు. రమణ నేను ఊహించుకున్న వ్యక్తి కాదు. నన్నతడు వాడుకుంటున్నాడని అనిపిస్తుంది”
“మీరిలా గొడవలకుపోతే సమస్య తీవ్రమవుతుంది. ఇద్దరూ ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోండి. అతని ఉద్దేశ్యమేమిటో తెలుస్తుంది. అంతేకాదు, నీ పరిస్థితేమిటో.. నువ్వెక్కడున్నావో కూడా నీకు అర్థమవుతుంది” అమ్మ చెప్పింది.
సహజీవనం తొలుత స్వర్గతుల్యం అనిపించింది. ఎంతో అన్యోన్యంగా గడిపాం. ఒకరిమీద ఒకరు ఎంతో ఆపేక్ష కనబరిచాం. రోజులెట్లా గడిచాయో తెలియలేదు. గంటలకొద్ది కబుర్లు, సినిమాలు, షికార్లు, వీకెండ్ విహారాలు, మోహాలు, తాపాలు, సుఖాలు. కానీ కాలక్రమంలో సహజీవన చిత్రం రంగు మారసాగింది. నెలలు గడిచినా రమణ ఏనాడూ పెళ్లి మాటెత్తలేదు. భవిష్యత్ జీవితం, పెళ్లి గురించి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా అతడు విషయం దాటేస్తూ వొచ్చాడు. పెళ్లి.. సంసారం.. పిల్లలు అంటే అనాసక్తిగా ఉండేవాడు. నాకు అసహనం పెరగసాగింది. అసలు రమణ నన్ను ఇష్టపడ్డాడా అనే సందేహం చాలా రోజులకుగానీ నాకు కలుగలేదు. అతన్ని గట్టిగా నిలదీసి అడుగలేకపోయాను.
అందుకు అతడు నాకు ద్రోహం చేస్తాడన్న ఊహ నాలో లేకపోవడమే. ఎంత వొత్తిడి చేస్తున్నా అతడు తేలిగ్గా తీసుకున్నాడు.
“పాతకాలపు ఆడపిల్లలా ఏమిటి నీ చాదస్తం..! మనకు పెళ్లి అవసరమేముంది.. ఇప్పుడు బాగానే ఉన్నాముగా”
అతని ధోరణిలో నాకు నిర్లక్ష్యం కనిపించి హృదయం విలవిలాడుతుంది. ఒక అభద్రతా భావన మొలకెత్తి బలపడసాగింది.
అతడు మరో అమ్మాయివేపు మొగ్గుతున్నాడా? వేరే పెళ్లిచేసుకోవాలని చూస్తున్నాడా అనే అనుమానం. ఆ ప్రభావం క్రమేపీ మా సహజీవనం మీద చూపుతున్నది. అతడు అనవసరంగా చిరాకుపడటం, కోపగించుకోవడం సాగించాడు. ఇంట్లో ఉండటం తగ్గించి ఎక్కువగా బయటకు వెళ్లి వొస్తున్నాడు. ఇక ఆలస్యం చేయకూడదనిపించింది. అమ్మ చెప్పిన సలహా ప్రకారం అతన్ని నిలదీసి మనోగతం తెలుసుకోవాలి.
***
నాలో ఒక అభద్రతా భావం పెరుగుతున్నది. దానికితోడు నేనిప్పుడు గర్భవతిని.
“రమణా.. అట్లా కూర్చో. మనం సీరియస్ గా ఒక విషయం మాట్లాడుకోవాలి” అతన్ని నిలదీశాను.
కోపంతో ఇంట్లోంచి వెళ్ళిపోయి రెండ్రోజుల తర్వాత తిరిగొచ్చిన గిల్టీ గానీ, ఇబ్బంది పడుతున్న స్థితిగానీ అతనిలో కనిపించలేదు. రమణ అసహనంగా చూస్తూ “ఏంమాట్లాడాలి? పాత పాటేనా? నువు పెళ్లి.. పిల్లలు.. సంసారం అన్నావంటే సారీ..! నాకు వినే ఓపిక లేదు”
“నేను మళ్ళీమళ్ళీ అనేందుకు ఏముంది? ఈ సమస్య కొత్తది కాదు. ఎన్నోరోజుల ముందే మొదలైంది.”
“ఇందులో సమస్య ఏముంది? మనకేం గొడవలు లేవు. హాయిగా ఉంటున్నాం. సగటు ఆడపిల్లలా ఆలోచించి సమస్యను నువ్వే సృష్టించుకుంటున్నావు”
“అయితే పెళ్లి వద్దంటావు. కలిసి కాపురం చేయగాలేంది పెళ్ళంటే అభ్యంతర మేమిటి? అసలు నీ మనసులో ఎమున్నదీ చెప్పు”
“నాకు ఎలాంటి బాదరబందీలు ఇష్టం లేదు గాయత్రీ ..! జీవితాన్ని ఎంజాయ్ చేయాలన్న మనస్తత్వం నాది. నేను ఇంటరు చదువుతున్నప్పుడే మానాన్న పోయాడు. మా అమ్మే కష్టపడి నన్ను చదివించింది. ఉద్యోగంలో చేరిన తర్వాత కుటుంబం బరువులన్నీ నామీద వేసుకున్నాను. ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లిచేశాను. ఇందుకోసం చాలా సర్దుబాటుతో బతికాను. ఇప్పుడు అమ్మ కూడా పోయింది. ఒంటరిని. నాకే బంధనాలు లేకుండా హాయిగా గడపాలని అనుకున్నాను. అందులో భాగంగానే నీతో కలిసి ఉండేందుకు ఒప్పుకున్నా. మనం పరస్పర ఇష్టంతోనే సహజీవనానికి సిద్ధపడ్డాం. ప్రేమ, పెళ్లి, సంసారం, బంధాలు ఇవన్నీ నాకు నచ్చనివి. నువు ఏవేవో ఊహించుకొనివుంటే అందుకు నేను బాధ్యున్ని కాదు. ఇక పిల్లలంటావా.. దానికి ఏనాడూ అంగీకరించను. నాకే జంజాటాలు వొద్దు. జీవితంలో మొదటిసారి స్వేచ్ఛను అనుభవిస్తున్నా. నాకు దీన్ని కోల్పోవడం ఇష్టం లేదు. మళ్లా బరువులెత్తుకోవడం నావల్ల కాదు.”
“ఈ ఆలోచన ఉన్నవాడివి నాతో సహజీవం ఎందుకు? ఎంజాయ్మెంటులో ఇదీ భాగమేనా? పెళ్లి విషయంలో నీకిప్పుడే జ్ఞానోదయమైందా? అంటే… ఇంతకాలం నన్ను ఉద్దేశపూర్వకంగానే వాడుకొని..” మాట్లాడుతుంటే దుఃఖంతో నాకంఠం వొణికింది.
“ నన్ను మాత్రమే దోషిని చెయ్యాలని చూడకు. నీకిష్టం లేకనే నాతో సహజీవనం చేశావా? నాతోపాటు నువ్వూ ఎంజాయ్ చేశావు కదా. కొత్తగా ఈ పెళ్లి.. పిల్లలు అంటూ ఏళ్లతరబడి బాధ్యతలు మోయలేను..సారీ”
“నీ సంసారం, నీకుపుట్టే పిల్లలు భారం ఎట్లా అవుతుంది? నిన్ను ప్రేమించినట్టే ఇల్లు, సంసారం, పిల్లలంటే నాకు ప్రేమ. రమణా.. అర్థం చేసుకో”
“అయాం సారీ..! ఈ విషయంలో నువు ఎప్పటికీ నిరాశచెందక తప్పదు”
ఒకరోజు అతనికి అసలు విషయం వెల్లడించాను.
“అయామ్ ప్రెగ్నెంట్ రమణా..” చిన్నగా చెప్పినా నాగొంతు స్పష్టంగా ఉంది.
విషయం తెలిసి సంతోషిస్తాడనుకున్నా. కానీ ఏదో వినకూడనిది విన్నట్టు నావైపు తీక్షణంగా చూశాడు. సోఫాలో కూర్చొని ఫోనులోకి చూస్తున్నవాడల్లా ఆపేసి పూర్తిగా నావైపు తిరిగాడు. కోపంగా తల విదిలించి “నో..! అలా జరగడానికి వీల్లేదు. ఈ విషయం ఇన్నిరోజులు ఎందుకు దాచావు? నాకెందుకు చెప్పలేదు?”
“ఇందులో రహస్యం ఏముంది.. సంతోషపడే సంగతే కద. నాకిప్పుడు మూడోనెల”
“కాదు, నువు కావాలనే దాచావు. దీన్నడ్డం పెట్టుకొని నువు అనుకున్నది సాధించాలనుకున్నావు. కానీ పెళ్ళీ, పిల్లలూ నాకెంతమాత్రం ఇష్టంలేదు. నేను టాలరేట్ చేయను అంతే..”
“రమణా.. ఏమిటి నీ ధోరణి? వాట్స్ రాంగ్ విత్ యూ?”
“నో.. ఐ కాంట్ డు దిస్. నువ్వెంత చెప్పినా అస్సలు ఒప్పుకోను. నేను ఒక భర్తగా, తండ్రిగా సెటిలయ్యే మనిషిని కాదు. నా కోరికలు వేరు, జీవితం వేరు. ఐనా ఇప్పుడేమైంది? ముందు కడుపు తీయించుకో. వెంటనే ఆస్పత్రికి పోతే అబార్షన్ చేస్తారు”
“ఇడియట్..!” గట్టిగా అరిచాను. “నీకు బుద్ధుందా? అసలు మనిషివేనా? గర్భం తొలగించుకోమంటావా? బిడ్డకు తండ్రిగా ఇదా నీ మాట? కనీస మానవత్వం కూడా లేదా? పుట్టబోయే బిడ్డలను చంపేస్తూ మనం మాత్రం హాయిగా ఎంజాయ్ చేద్దామంటావా? పశువులా బిహేవ్ చేయకు..” మాటలంటుంటే నన్ను నేను కంట్రోలు చేసుకోలేక ఏడిచాను.
“నువ్వెంత సెంటిమెంటలైనా, నీ ఫీలింగ్స్ ఏవైనా నాకు సంబంధం లేదు. ఏడ్చి గగ్గోలు పెట్టినా లాభంలేదు. నా మనసు మారదు. గుర్తుంచుకో”
దుఃఖం ఆపుకొని నార్మల్ అయ్యేందుకు ప్రయత్నిస్తూ అన్నాను: “ నిజమే.. నువు మారవు. ఇదంతా నీ తప్పుకాదు, నాది. మొదటినుంచీ నీ మనసులో నిర్ణయాలు ఉన్నాయి. నన్ను నువు ప్రేమిస్తున్నావని నేనే తెలివితక్కువగా నమ్మి మోసపోయాను. జీవితంలో మనిద్దరం రెండు వేర్వేరు ఇష్టాలతో భిన్నమైన అంశాలను కోరుకున్నాం. నిజానికి నీకు నేనంటే ఏనాడూ ప్రేమ అనేదే లేదని నాకనిపిస్తుంది”
“అయితే ఏమిటిప్పుడు..? నన్ను వెళ్లిపొమ్మంటావా?”
“ నువ్వెందుకు.. నేనే వెళ్లిపోతాను. మనమిప్పుడు చేయగలిగేది అదొక్కటే. ఇంతజరిగి.. అసలు వాస్తవం తెలిశాక ఇక మనం ఒకే గూట్లో వుండటం అసందర్భం.. అసాధ్యం” కళ్లవెంట నీరు కారుతున్నా నాస్వరం కటువుగా పలికింది.
మరోమాట లేకుండా అతడు బయటికి వెళ్ళిపోయాడు. రెండ్రోజుల తర్వాత ఫోన్ చేసి తనకు బెంగళూరు బదిలీ అయిందని, వెళ్లిపోతున్నానని తెలిపాడు. శాశ్వతంగా గుడ్ బై అనికూడా చెప్పాడు.
నాకర్థమైపోయింది ఇక అతడు తిరిగిరాడని. ఏమీచేయలేని నిస్సహాయురాలిగా దుఃఖమొచ్చింది. కొంతసేపటికి తేరుకొని మామూలయ్యాను. చేయవలసిన దానిగురించి ఆలోచించాను. జీవితాంతం కలిసి బతకాలనుకున్న మనిషి అసలు రూపం బయటికొచ్చింది. ఒక సంకుచిత నిర్ణయాన్ని అతడు తీసుకున్నాడు. నాకు తోడు కాలేకపోయాడు. అతనికోసం దేబిరిస్తూ.. ఎదురుచూస్తూ ఎందుకుండాలి? బంధాలు వద్దనుకున్నవాడు పెళ్ళికి ఒప్పుకుంటాడా? అతన్ని ప్రేమించడం, నమ్ముకోవడం నాదే తప్పిదం. జీవితంలో సవాళ్ళు ఎదుర్కొంటూ నేనుగా ముందుకు సాగాలనుకున్నా. ప్రెగ్నెన్సీ నిలుపుకోవాలని, బిడ్డను కనాలనే నిర్ణయించుకున్నా. ఆఫీసుకి సెలవుపెట్టి పుట్టింటికి వెళ్లిపోయాను.
***
కాలం అన్ని గాయాలను మాన్పుతుంది. నాకిప్పుడు ముద్దులు మూటగట్టే పాప ఉన్నది. రమణ ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, అతని గురించి గుర్తుచేసుకునే తీరికా.. ఇష్టమూ ఇప్పుడు నాలో లేవు. అతడు వెళ్ళిపోయాడు ఇంట్లోంచి, నా బతుకులోంచి. కొత్తదారిలో చాలాదూరం వొచ్చేశాను. ఆశలు వెతుక్కుంటూ బతుకుబాటలో నాదైన రీతిలో సాగిపోతున్నాను.
కాలింగ్ బెల్ చప్పుడువిని వెళ్లి తలుపు తీశాను. అతడు నన్ను దాటుకొని లోపలికొచ్చాడు.
“బాగున్నావా గాయత్రీ..” అంటూ నా జవాబు కోసం చూడకుండా వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు.
గుర్తుపట్టాను.. రమణ. బాగా మారిపోయాడు. “ఇక్కడికెందుకొచ్చావు? ఎవరు చెప్పారు నేనిక్కడున్నట్టు” చిరాకుపడుతూ అన్నాను.
“మనసుంటే మార్గాలకేం? తెలుసుకోలేననుకున్నావా?”
“మళ్లీ ఎందుకొచ్చావు? ఇంకా ఏంచేద్దామని? నా బతుకేదో బతకనివ్వవా?”
“నీకు కీడు చేద్దామని రాలేదు డియర్. నేనిప్పుడు మారిపోయాను. నీకు మేలుచేద్దామనే వొచ్చాను”
“ఇప్పటివరకు నువు చేసిన మేలు చాలు. నన్నిట్లా వొదిలెయ్యి. బెంగళూరు నుంచి స్టేట్స్ వెళ్ళినట్టు నీ పాత కొలీగ్ అప్పుడెపుడో చెప్పాడు. మళ్లా ఎందుకొచ్చావు?”
“ అవును, నెలరోజుల క్రితమే ఇండియా వొచ్చాను. ఇప్పుడేమో నీకోసం వొచ్చాను”
“ఏం.. ఇంకెవరూ ఆడవాళ్ళు దొరుకలేదా? నేను నీకోసం తయారుగా ఉంటాననుకున్నావా?”
“అంత కటువుగా మాట్లాడకు డియర్ ..! మీ ఊరువెళ్ళి మీ అమ్మ నాన్నను కలిసి నేను చేసిన తప్పు గురించి చెప్పాను. తప్పును
తెలుసుకున్నట్టు కూడా తెలిపాను. సరిదిద్దుకుంటానన్నాను. వాళ్లు నన్ను క్షమించారు. నువు కంపెనీ మారినట్టూ.. ఒంటరిగానే
ఉంటున్నట్టూ చెప్పారు. నీ అడ్రసు తెలుసుకొని నేరుగా వొచ్చాను”
నేను మాట్లాడకుండా అతనివైపు చూశాను. రంగుతేలి బాగా లావయ్యాడు. డాలర్లు వొంటికి పట్టి దర్జా అలవడినట్టుంది. నన్ను వెతుక్కుంటూ వొచ్చిన అతనిపట్ల నాలో ఏమాత్రం స్పందన లేదు.
“ఎట్లా ఉండింది అమెరికా జీవితం..? ముఖ్యంగా నీ స్వేచ్ఛా జీవితం”
నామాటల్లోని వ్యంగ్యానికి అతడేమీ నొచ్చుకున్నట్టు కనిపించలేదు.
“మా పెద్ద చెల్లెలు న్యూజెర్సీలో వుంది. ఆమె దగ్గర కొన్నిరోజులు వున్నాను. తర్వాత మరో ఇద్దరితో కలిసి షేరింగ్ ఫ్లాట్ తీసుకొని వున్నాను. ఎక్కువ సంపాదన, కొత్త స్నేహాలు, అమ్మాయిలు.. బాగానే ఎంజాయ్ చేశాను”
“మరింకేం, అక్కడే హాయిగా ఉండకుండా ఇండియాకు ఎందుకొచ్చావు?”
“డబ్బు, స్వేచ్ఛ, ఇవేవీ జీవితంలో అసలైన ఆనందాలు కావని గ్రహించాను. చుట్టూ ఎంతమంది అమ్మాయిలున్నా వాళ్ళెవరూ నావాళ్ళనిపించలేదు. వారిలో ప్రేమానురాగాలు, కన్సెర్న్ లేవు. పరిచయాలైనా, స్నేహాలైనా అన్నీ అవసరపూర్తివే. కొందరు నావెనుకున్న డబ్బునుచూసి కమిట్ అయ్యేందుకు సిద్ధపడితే, ఇంకొందరు నాకంటే మెరుగైనవాడి కోసం వెతుక్కున్నారు. ఎవరి స్నేహమైనా కొద్దిరోజులకన్నా మిగల్లేదు. ఒక బంధంలో ఇరుక్కోవడం ఎవరికీ ఇష్టంలేక పోయింది. నాకనిపించింది.. అంతపెద్ద దేశంలో మాచెల్లెలు ఒక్కరు తప్ప నాకోసం నిజాయితీగా తలచేవారెవరూ కనిపించలేదు”
“ దాదాపు రెండేళ్లు అమెరికాలో వుండి వొచ్చావు. ఎవరినీ తోడు తెచ్చుకోలేదేం..? బాదరబందీ ఎందుకనుకున్నావా? బంధాలు, బాధ్యతలు నీకు సరిపడవు కదా”
నా ఎగతాళి, ఎత్తిపొడుపు రమణ గ్రహించినా పట్టించుకోనట్టు కనిపించాడు.
“ఈపాటికి నువు పెళ్లిచేసుకొని ఉంటావనుకున్నా. కానీ ఒక్కదానివే ఇలా. నీ తెగువను మెచ్చుకుంటున్నా. అన్నట్టు పాప పుట్టిందటగదా. ఏదీ మన పాప..? నాకు చూపించవా?”
“మన పాప కాదు.. నాపాప” నా మాటల్లో కఠినత్వం.
“అయాం సారీ గాయత్రీ ..! నీపట్ల నేను చేసిన ద్రోహానికి ఎంత చింతించానో నీకు తెలియదు. ఏ అమ్మాయితో వున్నా నువ్వే గుర్తొచ్చేదానివి. నేన్నీకు చేసిన అన్యాయం గుర్తొచ్చేది. నిన్ను తలుచుకోకుండా, నీ ఫోటో చూస్తూ నీతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా లేను. అప్పుడు అర్థమైంది నీ ఉనికి.. నీ విలువ. అంతేకాదు, నిన్ను ఎంత ప్రేమించానో కూడా నాకు తెలిసింది. మనం సంతోషంగా వున్నప్పటి రోజులు పదేపదే జ్ఞాపకమొచ్చి బాధపడ్డాను. దయచేసి నన్ను క్షమించగలవా?”
“క్షమించడానికి నేనేవరు..? నిన్ను ప్రేమించడం, అట్లాగే నీ మనోగతం తెలుసుకోకుండా, నువ్వూ నన్ను ఇష్టపడ్డావని నమ్మడం నాదే తప్పు. మనిద్దరం జీవితంలో వేర్వేరు అంశాలను కోరుకున్నాం. అది తెలుసుకోలేక చాలారోజులు భ్రమలో నీతో కలిసి బతికాను. అసలు వాస్తవం ఆలస్యంగా గ్రహించినందుకు సిగ్గనిపించింది. నువు కొట్టిన ఎదురుదెబ్బ పాఠం నేర్పింది. నీమీద నాకేం కోపం లేదు. నిన్ను మర్చిపోయాను కూడా. ఇక క్షమించడాలెందుకు? ఎవరి దారులు వారివి. ఎవరి జీవితాలు వాళ్లవి.”
“అట్లాఅనకు..! ప్లీజ్.. ఫర్ గివ్ మీ. నేను చేసిన తప్పును ఇప్పటికైనా దిద్దుకోనీ. మనం మళ్లా కలిసివుందాం. కాదు, పెళ్లిచేసుకొని మనకంటూ ఒక ఇల్లు, పిల్లలు, కుటుంబంతో ఆనందంగా ఉందాం”
“ఇందులో తప్పు నీ ఒక్కడిదే కాదు. నేను కోరుకున్నదే నువ్వూ కోరుకుంటావని భావించి దెబ్బతిన్నాను. ఇది తెలుసుకునేసరికే నష్టం జరిగిపోయింది”
“నేను మారిపోయాను గాయత్రీ ..! మనం మళ్ళీ అన్యోన్యంగా ఉండగలం. నాకిప్పుడు భార్యా.. పిల్లలూ.. ఇల్లు అన్ని బంధాలు, బాధ్యతలు కావాలి. అన్నిటికంటే ముఖ్యం.. నాకు నువ్వు కావాలి. ఐ లవ్ యూ సోమచ్. నిన్నెప్పటికీ ప్రేమిస్తూనే వుంటా. నన్ను ప్రేమించగలవా?” అంటూ అతడు నాచేరువగా వొచ్చి రెండు భుజాలపైన చేతులు వేశాడు.
“నువు స్వీకరిస్తావనే నమ్మకం వందశాతం వుంది. అందుకే మళ్లా వొచ్చాను” అన్నాడు.
అతని ధోరణికి దిగ్భ్రాంతి చెందాను. కొద్దిక్షణాలు బొమ్మలా వుండిపోయాను. అది తనకు సానుకూలంగా భావించినట్టున్నాడు రమణ. నా ముఖం మీదుగా వొంగి పెదాలను నోటితో అందుకున్నాడు. నాకు కడుపులో తిప్పినట్టయింది. అతనిమీద ఎంత విముఖత ఉందో నా శరీర ప్రతిస్పందన చెప్పింది. అతన్ని ఉన్నపాటున వెనక్కి తోసేశాను.
“బయటికి వెళ్లిపో రమణా..! ఇంకెప్పుడూ నాకు ముఖం చూపించకు” గట్టిగా అరిచాను.
బాధపడుతూ చూశాడు రమణ. అతని ముఖంలో పశ్చాత్తాపం లాంటిది చూశాను. కానీ ఇప్పుడు నా బతుకును తప్ప దేన్నీ నమ్మలేని స్థితి. నాదారిలో నేను చాలాదూరం వచ్చేశాను.
***
గతమూ, వర్తమానమూ అలలుగా కదిలిపోతూ కళ్లు చెమ్మగిల్లాయి.
చేతుల్లో ముఖం కప్పుకున్నాను. నాకు తెలుసు భవిష్యతు పూలపాన్పు కాదని. దారిలో ఎన్నో ముల్లు.. చిక్కుముడులు. కానీ ఎవరి ఆసరా లేకుండా బతకడం నేర్చుకుంటున్నా. ఇప్పుడు నాకు తోడుగా నా ఏడేళ్ళ పాప. నాబిడ్డ నాకో వరంలా వొచ్చింది. నాకున్న ధైర్యంతో, నా చిన్నారి ప్రేమతో ముందుకు సాగుతాను. కష్టం కావొచ్చు. కానీ సాధిస్తాను.
———————–