మౌనం
ఖాళీగా తిరిగే సోమరి కాదు
ఏ క్షణంలోనూ రక్తం మరిగి.
పరుష పదజాలం
ముఖంలో పారకుండా కట్టుకున్న ఆనకట్ట.
మెడలో భయం వ్రేలాడుతూ
నెత్తిన పెట్టుకున్న నిజాలే బరువుగా
మెత్తగా కనిపిస్తూ మత్తుగా నటించే స్థితి.
లోపల ఎర్రని కోపాన్ని నాలుకే మూటకట్టి
బొట్టు చూపు కన్నెర్ర చేయకుండా
శరీరాన్ని బిగించే అరుదైన సందర్భం.
ఆలోచనలు విగ్రహాల్లా బిగుసుకుపోయి
నరాల్లో చైతన్యం పిడచగొట్టుకుపోయి
పాదాలు నేల స్పర్శ మరచే విచిత్రం.
మౌనం
మాట దిమ్మరి కాదు
మనసు కాపలా