నా జీవన మాధుర్యం నీవు
నీ మనుగడ లోని చేదు నేను
నా అశాంతి కుపశాంతివి నీవు
నీ హృదయాని కశాంతిని నేను
నా అలపున విశ్రాంతివి నీవు
నీకొక తీరని అలసట నేను
నను నిమిరే అతిమృదులత నీవు
నేను కసిరే మతికఠినత నేను
తల్లివి, చెల్లివి, మల్లివి నీవు
కల్లను, పొల్లును, డొల్లను నేను
నా స్వేచ్ఛకు చలనానివి నీవు
నిను కట్టే శృంఖలాన్ని నేను
దీనమైన ధీరురాలు నీవు
ధీమాగల దీనుణ్ణి నేను
నా కాలంబన బలిమివి నీవు
నీ కాలంబన భంగిమ నేను
నను నిలిపిన మహాకరుణ నీవు
నిను నలిపిన మృషాచరిత నేను
కాలం ప్రేమకు పాత్రవు నీవు
కాల క్రుద్ధనేత్రాన్ని నేను
మహావ్యక్తి! మహామూర్తి! మహిళా ఓ మహిళా!
నీవెక్కడ నేనెక్కడ! భావిస్తే ఇలా ఇలా
ప్రథితోన్నత హిమశైలం నీవు
వట్టిరాళ్ల చిరుగుట్టను నేను
తలెత్తి చూసేందుకసలు తరం గాని ఎత్తు నీవు
చూడలేక నీ తల వేలాడించే జిత్తు నేను
మహావ్యక్తి! మహామూర్తి! మహిళా ఓ మహిళా!
నీవెక్కడ నేనెక్కడ! భావిస్తే ఇలా ఇలా