ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు శ్రీదాస్యం లక్ష్మయ్యగారు 1979లోనే మంచిర్యాల నుండి వెలువడిన ‘మంచిరాల వెలుగు’ పత్రికలో తమ మొదటి కవితను అచ్చులో చూసుకున్నారు. అదే సంవత్సరం మంచిర్యాల కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న సందర్భంలో కళాశాల వార్షికోత్సవ కవితల పోటీలో ప్రథమ బహుమతిని పొందడం విశేషం! అలా మొదలైంది లక్ష్మయ్యగారి కవితాయానం.. తొలినాళ్ళలో.. డిగ్రీ చదివే రోజుల్లో జమ్మికుంట నుండి వెలువడే ”రచ్చబండ” వారపత్రికలో ఆయన తన రెండో కవితను అచ్చులో చూసుకుని.. మురిసిపోవడమే గాక వివిధ పత్రికలకు తమ రచనలను కవితల రూపంలో పంపడం, అవి ప్రచురింపబడటం.. కవిగా కొనసాగాలన్న కాంక్ష బలపడి.. ఇక వెనుదిరిగి చూసుకోకుండా నిరంతరం కవిత్వ సృజన చేస్తూ.. ముందుకు సాగడం ముదావహం.. ‘ప్రసారిక’ మాసపత్రిక సంపాదకులు నమిలికొండ బాలకిషన్ రావు, సాహితీవేత్త డా|| టి.శ్రీరంగస్వామి గారల ప్రోత్సాహంతో లక్ష్మయ్యగారు తమ కలానికి పదును పెట్టుకుంటూ.. క్రమబద్ధంగా కవిత్వరచనలో పరిణతి సాధిస్తూ.. ఉదయసాహితి సాహిత్య సంస్థను ప్రారంభించి.. తాను కవిత్వం రాయడంతో పాటు అనేకమంది వర్ధమాన, ప్రవర్ధమాన కవుల రచనలను ఏర్చికూర్చి కవితా సంకలనాలను వెలువరించి.. సాహితీ వికాసానికై కృషి చేయడం అభినందనీయం. ఉదయ సాహితీ ఆధ్వర్యంలో ‘నేటికవిత’ అంతర్జాల సమూహాన్ని ఏర్పాటుచేసి వందలాది మంది రెండు తెలుగు రాష్ట్రాలలోని కవులు, రచయితలకు అండగా నిలిచి, పలు వైవిధ్యమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ.. సాహితీ సేవలో తరిస్తున్నారు. చిన్ననాటి నుండే సామాజిక అంశాల పట్ల స్పందించడం.. అభ్యుదయ భావాలను పుణికి పుచ్చుకోవడం వల్ల కవిత్వ సృజన పట్ల లక్ష్మయ్యగారు ఆకర్షితులై.. నిరాటంకంగా తమ సాహితీయానం కొనసాగిస్తూ.. నేడు ఓ కవిగా, రచయితగా, విమర్శకునిగా అందరి మన్ననలు పొందడం అభినందనీయం.. పాత్రికేయునిగా పనిచేసిన కాలంలోనూ.. లక్ష్మయ్య గారు వార్తా రచనతో పాటు కవిత్వ సృజన పట్ల మక్కువను పెంచుకోవడం విశేషం.. ఇక ఆయన నాలుగు థాబ్దాలుగా రాస్తున్న కవిత్వం గురించి పరిశీలిస్తే.. జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.ఎస్సీ రెండో సం|| చదువుతున్నప్పుడే 1982లో తమ తొలి కవితా సంపుటి ”భావచిత్రాలు” పేరుతో వెలువరించి అందరి దృష్టిని ఆకర్షించారు.. సమాజం గురించి ఇంకా పూర్తి అవగాహన పొందకముందే.. సమాజంలోని లోపాలను ఎత్తి చూపిన ఘనత ఆయనకు ఉంది.
మినీ కవితల సమాహారంగా రూపుదిద్దుకున్న ‘భావచిత్రాలు’ కవితా సంపుటిలోని కవితల్లో లక్ష్మయ్యగారి కవితా పటిమను చూసి అందరు ఆశ్చర్యపోయేవారు. సామాజిక, రాజకీయ అంశాలపై ఆయన మినీ కవితల రూపంలో ప్రకటించిన భావాలు.. సామాజిక చైతన్యానికి దోహద పడేలా కొలువుదీరాయి.. ప్రభువుల పాలనను ఎండగడుతూ.. లోకంలోని అసమానతలపై ధ్వజమెత్తుతూ.. సూటిగా.. ఘాటుగా.. పదునుగా ఆయన రాసిన మినీ కవితలు కవిగా సాహితీలోకంలో నిలదొక్కుకోవడానికి మార్గాన్ని సుగమం చేశాయి. ‘భావచిత్రాలు’లోని కవితల్లో భావతీవ్రతను, చక్కని భాషతో భావాలకు మెరుగులద్దడం.. వంటి అంశాలను చూస్తాం.. ‘బ్రహ్మరాక్షసి’ శీర్షికతో రాసిన మినీ కవితలో లక్ష్మయ్యగారు నిరుద్యోగంపై రాసిన భావాలు ఇలా ఉన్నాయి.
నిరుద్యోగం ఒక పీడ
దేశ ప్రగతికిది అడ్డుగోడ
అరాచకాలకు జాడ
పడకూడదు సుమా ఈ నీడ! అంటూ దేశప్రగతికి అడ్డుగోడైన నిరుద్యోగ నిర్మూలనకై పాలకులు శ్రద్ధ చూపాలన్న అర్థం ధ్వనించే విధంగా రాయడం విశేషం !
”భావచిత్రాలు” పుస్తకంలోనే ”కలికాలం” శీర్షికతో రాసిన కవితలో మనిషి స్వభావంపై ధ్వజమెత్తారు.
మనిషిని
సాటి మనిషే
నమ్మని ఈ కాలంలో
ఇక…
ఈ మనిషి బతికుంటేనేం?
చస్తేనేం? అని వ్యాఖ్యానించారు.
మానవత్వం చూడని మనిషి మనుగడ నిరర్థకమని చెప్పకనే చెప్పారు. ”అసలు విషయం” కవితలోనూ లక్ష్మయ్యగారు ఆలోచనాత్మక భావాలకు చోటు కల్పించారు.
పచ్చని ఆకు
రాలి పోతుంటేనే
‘అయ్యో’ అనని జనం
పండుటాకు
రాలిపోతుంటే మాత్రం
‘పాపం’ అంటుందా? అని ప్రశ్నించారు.
‘నిజం’ మినీ కవితలో ఉద్యోగం లేక.. నిరుద్యోగి పడే వ్యథలను మూడు ముక్కల్లో చెప్పారు. అంత్య ప్రాసలతో సాగే ఈ కవిత అందరినీ ఇట్టే ఆకట్టుకునే విధంగా ఉంది.
నిరుద్యోగి
ప్రారంభిస్తే ఉద్యోగాల వేట
ఖాళీగా
లేవంటారడిగిన చోట
టిది
ప్రతి ఆఫీసులో పాడే పాట
నిజం కాదంటారా ఈ మాట అంటూ రాయడం బాగుంది.
”భావచిత్రాలు” కవితా సంపుటి తర్వాత లక్ష్మయ్యగారు చాలాకాలం పాత్రికేయ వృత్తిలో బిజీగా ఉండటం వల్ల తమ రచనలను గ్రంథరూపంలో తీసుకరావడానికి సమయం చిక్కలేదు.. 2002లో ఆయన ”తండ్లాట” పేరుతో తమ రెండో కవితా సంపుటిని సాహితీలోకానికి అందించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేపథ్యంలో వెలువరించిన గ్రంథమిది! ఈ సంపుటిని వరంగల్‌లో జరిగిన తెలంగాణ రచయితల వేదిక రెండో రాష్ట్ర మహాసభల్లో.. పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావుగారి చేతుల మీదుగా ఆవిష్కరింపబడటం విశేషం. ఇందులోని కవితల్లో పేగుబంధం విలువనే కాదు, బతుకు బందీఖానాలో బలిపీఠమెక్కి కూర్చున్న దగాపడ్డ జీవితపు జ్ఞాపకాలు, నీవెన్ని గుసగుసలు చేసినా.. మా రుసరుసల్ని చల్లార్చలేవంటూ చేసే ధిక్కార స్వరాలు.. అడుగడుగునా కానవస్తాయి. ఇంకా చిరునవ్వుల బేరాలను.. మాతృభాషా సుగంధ పరిమళాలను, బద్ధలైన బంగారు కలలను ”తండ్లాట” కవితల్లో మనం గమనిస్తాం.. ఇంకా..
”మనస్సులో ఆలోచన తళుక్కుమన్నప్పుడు
భావం భళ్ళున కక్కేస్తుందంటూ”
”ఆనవాళ్ళు” కవితను రూపుదిద్దారు.
”బంగారు పంటల పల్లెసీమల్లో
మేడల మిద్దెల నగర వీధిలో
హుషారు మత్తుకు, నిషా జగత్తుకు
వృథాగా కాలం విడవకండి” అంటూ
”నీతికి ప్రాణం పోయండి” కవిత ద్వారా హితవు పలికారు.
”పేగుబంధం” కవిత ఆద్యంతం ఆర్ద్రంగా మలచబడింది.
ఉసిల్ల పుట్టలా సమస్యలదండు తరుముకొస్తుంటే..
అవస్థలతో ఆపసోపాలు పడుతూ ప్రాణం సగం చచ్చిపోయింది.
అంటూ ఈ కవితను ఎత్తుకున్న తీరు బాగుంది. బాధల సుడిగుండంలో నుండి బయటపడే మార్గంలేక విలవిలలాడుతోందని వాపోయారు. సత్తువలేని ఎముకలగూడు.. కాడెక్కెందుకు కళ్లింతలు చేసుకొని చూస్తోందనీ.. పేగు పంచిన జీవాలు- పేదరికమే నీ కర్మ అని.. అన్ని బంధాలు తెంచుకుని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాయని అంటూ కొనసాగించి అందరి హృదయాలను కదిలించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోస్తూ.. ”తొవ్వ జూసుకోండ్రి!” కవితను రూపుదిద్దారు.
మేం తలుసుకుంటే
మీకంటే మా దండిగనే మాట్లాడుతం
మాకు శాని రాదు గాని సక్కటిభాషే మాది
అంటూ స్వాభిమానాన్ని చాటారు.
దాచుకోవడం మా తెలంగాణలో లేదనీ దోచుకోవడం తెల్వనే తెల్వదని తేల్చిచెప్పారు.
చెప్పాలనుకున్నవి సూటిగానే జెప్పుతం..
ఎవ్వలకు తలొగ్గాల్లో- ఎక్కడ తగులాన్నో
గక్కడనే తగిలేటట్లు జేస్తం..
మా నాల్కలు తాడిమట్టలు కావు
మనుషుల్లెక్క మసలుతాం
మనసుపెట్టి మాట్లాడుతాం అంటూ కొనసాగించారు.
మాకెవ్వల సొమ్ము అక్కర్లేదు
మాయి మాకు దక్కితే సాలు…
అణగి మణిగి పడ్డది సాలు
మాకు సోయి లేదనుకోకుండ్రి
అనుభవాలు మాకు అన్ని నేర్పినయి
లొల్లిని షురువు జేత్తాన్నం..
తొవ్వ జూసుకోండ్రి
తోక ముడుసుకోండ్రి అంటూ నినదించారు.
తెలంగాణ ఉద్యమానికి ఉడుతాభక్తిగా లక్ష్మయ్యగారు తమ భావాలను అక్షరాల్లో నిక్షిప్తం చేసి.. ఈ కవితకు జీవం పోశారు. ”తండ్లాట” కవితా సంపుటి తర్వాత కొంత విరామం తో మళ్ళీ 2006లో ”బుర్కపిట్టలు” పేరుతో నానీల సంపుటిని వెలువరించారు. డాక్టర్ ఎన్.గోపిగారు సృష్టించిన నాలుగు పాదాల నానీల కవితా రూపాన్ని సుసంపన్నం చేస్తూ కవిగా తమ భావాలను నానీల్లో ప్రకటించి సామాజిక చైతన్యానికి కృషి చేశారు.
మట్టి లోపల గింజ
గింజుకుంటేనే కదా
మట్టిపై
పొట్టకొచ్చేది అంటూ లక్ష్మయ్యగారు బలమైన నానీకి జీవం పోశారు. విత్తనం గురించి పైకి చెప్పినప్పటికీ మనిషికీ వర్తించేలా నర్మగర్భంగా చక్కని సందేశాన్ని అందజేశారు.
కృషితో నాస్తి దుర్భిక్షం అన్న నానుడిని గుర్తు చేశారు. దేన్నైనా సాధించాలంటే పట్టుదల, కృషి అవసరమని తెలియజేశారు.
లక్ష్మయ్యగారు స్వయాన ఉపాధ్యాయుడు కనుక.. ప్రతినిత్యం తాను ఉపయోగించే సుద్దముక్కను సైతం కవితామయం చేసి అర్థవంతమైన నానీని సృష్టించారు.
వేళ్ళ మధ్య
చాక్‌పీస్ అరిగింది
పిల్లల మెదళ్ళలో
విజ్ఞానం పెరిగింది అంటారు. నిజమే కదా!
మరో నానీలో…
వలసలు
ఆకలి చావులు
తెగిన పోగులు
నేతన్నల బతుకులు .. అంటూ నేతన్నల వ్యథాభరిత జీవితానికి అద్దం పట్టారు.
ధిక్కారమే
నీ స్వరం
కాళన్నా
నువ్వు తెలంగాణకే వరం అంటూ కాళోజీ పట్ల కవిగా తమ గౌరవాన్ని చాటుకున్నారు.
ఇలా నాలుగు పాదాల్లో ఇరవై నుండి ఇరవై ఐదు అక్షరాల్లో కవితాత్మకంగా నానీలను రాసి అందరినీ మెప్పించారు.
ఆ తర్వాత 2017లో ‘గునుక పువ్వు’ కవితా సంపుటిని వెలువరించారు. ఈ సంపుటిలో 75 కవితలు వైవిధ్యమైన కవితా వస్తువులతో కొలువుదీరాయి. అభివ్యక్తిలో కొత్తదనాన్ని ప్రదర్శిస్తూ లక్ష్మయ్యగారు రాసిన కవితలన్నీ బాగున్నాయి..
ఆటలలో ఆటనై
కోలాటపు పాటనై
అమ్మలక్కల గొంతులోన
స్తుతియించెడి గీతీనై అంటూ
‘గునుక పువ్వు’ అంతరంగాన్ని చక్కగా ఆవిష్కరించారు.
అమ్మ ఒడిని మించింది
అవనిలోనే లేదు…
అమ్మ ఋణం తీర్చువారు
భువిలోనే లేరంటూ…
”అమ్మంటే” కవిత ద్వారా అమ్మ యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పారు.
కవిత్వానికి కాదేదీ అనర్హం అని శ్రీశ్రీ నుడివినట్లు.. లక్ష్మయ్యగారు చీపురుపై కవితరాసి మెప్పించారు.
చిందర వందర చేసిన
చెత్తనంత పోగు చేసి
చీదరించుకోకుండా
చికాకు పడకుండా
చక్కని శోభను కూర్చే
చీపురూ.. నీకు వందనం అంటూ రాసిన తీరు బాగుంది.
అలాగే ”చిలుక్కొయ్య”, ”అలుకు పిడచ”పై కూడా కవితలను రాయడం విశేషం.
మనిషితనమంటే మనిషిని మనిషిగా చూడటమే.. మనిషితనమంటే మనిషి మంచితనంగా మసలుకోవడమే. మనిషి మనిషిగా, మనిషి మనీషిగా మారకపోతే మనిషి మనుగడ ప్రశ్నార్థకమే అంటూ ”మంచితనం-మనిషితనం” కవితను రాశారు.
”వేకువ” కవితలో వేకువ కువకువలు విశాల ప్రపంచానికి.. వెచ్చని ఊపిరిని ఊదుతూ, కొత్త యుగానికి, యుగాదికి.. కొంగ్రొత్త స్వాగత గీతికను పాడుతూ… నవ పల్లవాలకు నాందీ పలుకుతున్నాయంటూ దుర్ముఖి నామ సంవత్సరానికి స్వాగతం పలికారు.
”రైతు ఎతలు పోవాలి” కవితలో ఓదార్పుమాటలు కాదు.. ఓట్ల రాజకీయాలసలే కాదు.. రైతు బతుకులు ఆగం కాకముందే రైతు జీవితాలలో వెలుగులు నింపే నిఖార్సయిన ఆలోచనలతో పాలకులు ముందుకు రావాలని కాంక్షించారు.
‘సర్వం సహచరిమయం’లో కవి లక్ష్మయ్యగారు తమ జీవిత భాగస్వామి గోదాదేవి గారి గురించి రాసిన పంక్తులు వారి అన్యోన్య దాంపత్యానికి అద్దం పట్టాయి.
సహచర్యం సంకలనమై
సమధర్మం సమ్మిళితమై
సమన్యాయం సంసేవితమై
సమదృష్టి సంవీక్షణమైతే
సర్వం సహచరి మయమే… అంటూ ప్రారంభించి
అక్షరించలేని ఆప్యాయత
విపులీకరించలేని వినయం
సంప్రదింపుల సలహా మణిహారం
సంతృప్త జీవనచిత్రం
అది సహచరి సమాదరత్వం అంటూ తమ శ్రీమతితో పెనవేసుకున్న బంధాన్ని తెలియజేశారు.
ఇల్లు ఇల్లాలుకు భాష్యం పలికి
కంటికి వెలుగైన నేస్తం
గోదాదేవి నా ప్రియనేస్తం
నా సర్వం నా సహచరి మయం అంటూ ముగించారు.
”ఆలోచన” కవితలో… ఆలోచన.. మనసుకో సులోచనమవ్వాలనీ.. మంచికి మార్గదర్శనం చేయాలని మనోనేత్రానికి ప్రతీక కావాలనీ కాంక్షించడం బాగుంది.
‘కవిత్వం-ఒక జీవన స్పర్శ’ కవితలో కవి లక్ష్మయ్యగారికి కవిత్వం పట్ల ఉన్న భావనలను చక్కగా విశ్లేషించారు. మనసు పొరల్లో చిక్కిన.. మర్మ భావనలను తొలగించేది.. తరిగిపోని అనుభూతుల స్మరణీయం చేసేదని వివరించారు. కవిత్వం- జీవధార కవిత్వం- ఒక హృదయ శ్వాస అంటూ కొనసాగించారు. కవిత్వం- ఒక ఆలాపన, కవిత్వం – ఒక జీవన స్పర్శ అని తేల్చిచెప్పారు. కవిత్వం ఒక వాహిని అనీ.. అదే నా ఊపిరి అని మంచి ముగింపునిచ్చారు. మరో కవితలోనూ.. కవిత్వం అమృతధారలను రుచి చూపిస్తుందనీ.. అమ్మలాలనను మరిపిస్తుందని ఆత్మీయతను అందిస్తుందని తెలియజేశారు.
2020లో ‘కనురెప్పల సవ్వడి’ కవితా సంపుటిలో 65 కవితలను పొందుపరిచారు. కవిత్వం మనిషి అంతరాత్మతతో సంభాషణ వంటిది.. ఈ సంభాషణ కవిలోనే ఉన్న కవితాత్మక ధ్యానంలో కొనసాగుతుంది. ఈ సంభాషణం ఫలితమే కవితగా వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే లక్ష్మయ్యగారు ”కనురెప్ప సవ్వడి”లో చోటు కల్పించిన కవితల్లో ఆయన ఉత్తమ వ్యక్తిత్వాన్ని.. సున్నిత మనస్తత్వాన్ని.. సామాజిక దృక్పథాన్ని అడుగడుగునా గమనిస్తాం.
ప్రకృతి యొక్క ప్రాశస్త్యాన్ని ప్రస్తావిస్తూ… ”సంతృప్తగానం” కవితను రాశారు. సంతృప్తి.. మనిషి స్వరమైతే.. సంతోషాలు వెన్నంటే ఉంటాయని తేల్చి చెప్పారు. ప్రకృతి మించిన పరిపూర్ణతకై పరుగు ఎండమావి వంటిదని పేర్కొన్నారు. మమతల మాధుర్యమే నీ సొంతం.. అదే కదా జీవిత మకరందం అంటూ కవితను ముగించడం బాగుంది.
భార్యాభర్తల బంధాన్ని ప్రతిఫలింపజేస్తూ ”సంసార గీతం” కవితను రమణీయ భావాలతో తీర్చిదిద్దారు.
సప్తపదుల సరిగమలు
సరాగాల మాధుర్యంలో
సరససల్లాపాల క్రీడాంగనం
అలుపేలేని జీవన యానానికి
ఆదరువయ్యే ఇంధనమంటూ
కవితను చక్కగా ఎత్తుకున్నారు.
ఆలుమగల యుగళగీతం అనురాగార్ణవాలకు ఆనంద హేతువులనీ.. మనసులు కలబోసుకొని.. మమతలు ముడి వేసుకుని.. కలిమిలేముల కాలాన్ని.. అనువుగా మలచుకునే ఇష్టపదుల గీతం అని తేల్చి చెప్పారు.
పెద్దలెన్ని సుద్దులు చెప్పినా
ఆలుమగలు అణకువతో
ఒద్దికగా దిద్దుకునే కాపురమే
అనురాగ గోపురం
అంటూ చక్కని భావాలకు అక్షరాకృతినిచ్చారు.
మంచు కురిసే వేళలో
మదిని దోచే భావ సమీరాలు
హేమంత గీతికల కచేరీలో
రాగ రంజితమౌ ఖజానాలు అంటూ ”భావవీచికలు” కవితను రూపుదిద్దారు.
”మనోహర దృశ్యం” కవితలో లక్ష్మయ్యగారు చక్కని భావుకతతో చిక్కని కవిత్వాన్ని రాశారు. అరుణ కిరణాల నులివెచ్చని స్పర్శకు అమలిన ఆహార్యపు తుషార బిందువులు.. ముగ్ధమనోహర ప్రకృతి వీడి.. నీరుగారి పోతున్న తీరు
ధరిత్రి ఒడిలో
తుషార బిందువులను జల్లి
తడి తడి తమకంతో తళుకులీని
శ్వేతవర్ణపు యవనికలను
తెరలు తెరలుగా పంపిస్తూ
మంచు దుప్పటిలా
మనోహర దృశ్యాన్ని ఆవిష్కరించింది అని రాయడం ఆయన కలం బలాన్ని సూచిస్తుంది.
లక్ష్మయ్యగారు తాను స్థాపించి నిర్వహిస్తున్న ‘నేటికవిత’ సమూహంపై రాసిన ‘500 సుమగంధాలు’ కవిత అందరినీ ఇట్టే ఆకట్టుకునేలా ఉంది.
నేటి కవితతో
సహజీవనం చేస్తూ పరిమళాలు
సాహితీ సౌరభాలు పంచుతున్న
సమస్త సాహితీ దురంధరులు అంటూ కవితను ప్రారంభించిన తీరు బాగుంది.
నేటి కవితే శ్వాసగా
సమూహమే బాసటగా
అక్షర నైవేద్యాలతో
అయిదు వందల రోజులుగా
నన్ను నడిపిస్తున్న
నాతో నడిచివస్తున్న
నేస్తాలందరితో
అల్లుకున్న పరిమళాలను
ఆనందంతో ఆస్వాదిస్తున్నానంటూ చక్కగా ముగించారు.
”ఆలుమగల ఆల్బం” కవితలో…
కంటికి ఇంపైన కానుక
ఒంటరితనపు నిగళానన్ని చెరిపేసి
జంటగా వెంటవచ్చిన నేస్తం
మనసుతో పలికే మౌనగీతమే
మనోహర దృశ్యకావ్యం అని వ్యాఖ్యానించారు.
చెట్టాపట్టాలేసుకుంటూ
అలుపూ సొలుపూ ఎరుగక కడకు
అన్యోన్యతనే నిలుపుకు సాగే
మధుర భావనల మంజుల సర్వమే
ఆవిష్కృతమౌ ఇలలోనా… అంటూ రాసి ఆలుమగల బంధాన్ని అక్షరాల్లో నిక్షిప్తం చేశారు.
‘కనుపాపకే తెలిసేది’ కవితలో…
కాటుక చాటున దాగిన
కమనీయ కెమెరాలకు
చలువదనం చెమరించే
సుతిమెత్తని పార్శ్వం
చెప్పే ఊసులు, బహిర్గతం చేసే రహస్యాలు
మరో కంటికి కనబడనీయని
కనురెప్పల సవ్వడి.. కంటి పాపకే కదా తెలిసేది అంటూ రాయడం బాగుంది.
2021లో ”హృదయనది” పేరుతో తమ ఆరో కవితా సంపుటిని వెలువరించారు. ఈ పుస్తకంలో 96 కవితలు భిన్నమైన కవితా వస్తువులతో ముస్తాబై రావడం విశేషం.
కలకు ఇలకు సౌమ్యం కుదరని
అందీ అందని అందలాలనూ గుర్తించని
అసమర్థుని ఆవేదనా సవ్వడి
అపరిపక్వ చేష్టల గారడి అంటూ
‘హెచ్చరిక’ కవితను తీర్చిదిద్దారు.
బతుకెంత విచిత్రం…
నింగినీ నేలనూ ఎదురెదురు దిక్కులని
దిక్కుతోచని సమాధానాల సుడిలో నేలరాలిన వసంతం..
అసంతృప్తిలోనే ముగిసిన జీవనయాత్ర..
గతి తప్పని సూరీడు గమనాన్ని
మననం చేసుకోని మసలు తీరు
చరిత్రలో ఒక పేజీగా
గుణపాఠం మూటవుతుంది
చక్రభ్రమణమై గోచరిస్తుంది
మనిషి మనిషికీ హెచ్చరికవుతుంది
అంటూ గొప్ప సందేశాన్ని అందించారు.
”పసిడి మనసు” కవితలో అన్నెం పున్నెం.. కల్లాకపటం.. ఈర్ష్యా ద్వేషం.. అహంభావం.. దరి చేరనీయని బాల్యం గురించి చక్కగా ఆవిష్కరించారు.
బోసినవ్వుల ఆరాటం
చెలిమి కలిమికై ఉబలాటం
ఆనంద డోలికలో సహవాసం
పసిడి పాపల సర్వస్వం అంటూ నవ్వుల పువ్వులు పంచే చిన్నారులను అందంగా ఆవిష్కరించారు.
”ఎంత హాయి” కవితలో రమణీయ భావాలకు చోటు కల్పించారు.
తెల్లని పిండార బోసిన
వెండి వెలుగుల జిలుగుల్లో
ఇంటి డాబాపై మల్లెల సౌరభాలను
మోసుకొస్తూ వీచిన గాలులు
మేనును తాకినపుడు
మనసు పరవశంతో
మధురగానం పాడదా? అంటూ లక్ష్మయ్యగారు చక్కని భావుకతను ప్రదర్శించారు.
ప్రవహించే నదిలా
రుధిర సంగమాల వేణిలా
మలినాల మాటల్ని తేటపరిచి
వర్ణాలు వేరైనా రక్తవర్ణమొక్కటనే
సందేశాన్ని సమాజానికి ప్రసరింపజేద్దాం
అంటూ ”హృదయ నది” కవిత ద్వారా పిలుపునిచ్చారు.
ఒక నీవు – ఒక నేను
తీరాలు – దేహాలు వేరైనా
వెన్నుదన్నుగా నిలిచిన మనోస్థైర్యంతో
చిత్రంగా మన ఇరువురి గుండెలయ
ఒకే గీతం ఆలపిస్తున్నాయంటూ నువ్వు నేనూ ఒక్కటేనన్న సమైక్య వాదాన్ని ప్రకటించడం ప్రశంసనీయం.
”స్వప్న జగత్తుకు నీరాజనాలు” కవితలో.. అస్తిత్వ భావనలు.. అంకురించి.. థాబ్దాల కలగా ప్రత్యేక రాష్ట్రం.. సాకారమై ఆవిర్భవించిన సందర్భం.. కలలకు హారతి పట్టిన నేపథ్యం.. చేతనత్వ ప్రతిబింబాలుగా ప్రతిఫలించి – స్వప్న జగత్తుకు నీరాజనాలు పలుకుదాం అంటూ పిలుపునిచ్చారు.
”కమనీయ చిత్రం” కవిత ద్వారా ఉమ్మడి కుటుంబాల ఆవశ్యకతను నొక్కి చెప్పారు.
అనురాగ బంధాలతో… ఆత్మీయతల కలబోతతో.. ఆప్యాయతా పలకరింపులతో.. వరసైన పిలుపులతో అలరారే ఆనందాల హరివిల్లు ఉమ్మడి కుటుంబాల లోగిళ్ళు సమాజంలో మళ్లీ చిగురు తొడగాలని కాంక్షించారు. వృద్ధాశ్రమాలను దృశ్యమానం చేస్తూ ”మమతల కూడలి” కవితను రూపుదిద్దారు.
ఆ నేలనేలంతా అనుభవాల సారవంతం
మమతల మాధుర్యాలు కురిపించి
బ్రతుకు పండించుకున్న పండుటాకులు
ముదిమి తోడై మురిపాలకు దూరమై
వృద్ధాశ్రమాలకు చేరువైన ఊడలు
ఆప్యాయతానురాగాలు కరువై
ఆశగా నిత్యం గేటువైపు చూసే కళ్ళు అంటూ
కవి లక్ష్మయ్యగారు ఆర్ద్రమైన భావాలకు చోటు కల్పించారు.
జీవన్నాటక ప్రయాణంలో
ఆత్మీయ బంధాల మైలురాళ్ళను దాటి
అనుబంధ సుగంధాల రాదారిలో
మజిలీలన్నీ మమతల కూడలులేనని
వ్యాఖ్యానించారు. నిజమే కదా!
”అద్దం’ కవితలో.. అద్దం.. నా అందచందాలకు చెలికత్తె.. వీలు చిక్కినప్పుడల్లా.. చూస్తూ.. మురిసి పోయే సమయాలు.. నేను యాది మరువని క్షణాలు అని కవితను ఎత్తుకున్న తీరు బాగుంది.
”మా ఇంటి వాలు కుర్చీ” కవితలో చిన్నప్పుడు మడత కుర్చీతో తమ నాన్నకున్న అనుబంధాన్ని అందంగా ఆవిష్కరించారు.
మా ఇంటి మడత కుర్చీ
అదే తట్టు కుర్చీ
పేరేదైనా మా యింటి దర్పం మా వాలు కుర్చీ…
మా నాన్నకది సుఖాసనం
వాలుకుర్చీకి జనుపవస్త్రం తొడుగు
పొడవాటి చేతులు
పక్కనే ముక్కాలు పీట
దానిపైన పాన్ దానా అంటూ
వాలుకుర్చీతో ముడిపడి ఉన్న పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
పై ఆరు కవితా సంబంధ గ్రంథాలే కాక.. లక్ష్మయ్యగారు ఉదయసాహితి పక్షాన.. తమ సంపాదకత్వంలో బ్యాలెట్ బ్యాలెట్, బాల్యం-బతుకమ్మా, ఉదయకిరణాలు, తెలుగు వెలుగు, ఆకాశంలో సగం, చెలిమి, వసంత రాగాలు, గురువు, సహచరి, ముదిమి, వివాహబంధం వంటి కవితా సంకలనాలను వెలువరించారు. ”నేటి కవిత” అంతర్జాతీయ సమూహానికి సారథ్యం వహిస్తూ లక్ష్మయ్యగారు తమ సంపాదకత్వంలో కవిత్వం, కథలు, గేయాలు, చిత్రకవితలు వంటి అంశాలకు సంబంధించిన గ్రంథాలనూ ప్రకటించడం ప్రశంసనీయం – ఇలా శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్యగారు తమ కవితాయానం కొనసాగిస్తున్నారు. సామాజిక చైతన్యం కోసం అనేక సందేశాత్మక, కవితాత్మక కవిత్వాన్ని సృజన చేసి సాహితీ క్షేత్రాన కవిగా తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని పదిలపరుచుకోవడం ప్రశంసనీయం.
లక్ష్మయ్యగారి జీవితం, వ్యక్తిత్వం, వ్యవస్థా ప్రియత్వం అందరికీ ఆదర్శప్రాయం – జూలై 31, 2024న ఉపాధ్యాయులుగా ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.