అటువైపు వెళ్లకు తల్లీ!
పురుగూ పుట్రా ఉంటాయి-
అవి నీ నునుపైన చర్మాన్ని ఒరుసుకుని
నీకు తెలీకుండానే నిన్ను కుట్టి
రక్తం తాగుతాయి
బహిర్భూమికైనా
ఎటువైపుకీ వెళ్లకు తల్లీ!
అక్కడ ఆడ వాసన కోసం
నిరంతరం కాచుకున్న తోడేళ్లుంటాయి-
అవి నీ అవయవాల కోసం చొంగ కారుస్తూ
అదును చూసి మీదికి ఉరుకుతాయి
మేకలు మేపుకునేందుకైనా వెళ్లకు తల్లీ!
అక్కడ నీ రక్తం కళ్లజూసేందుకు
సిద్ధంగా ఉన్న పులులుంటాయి
అవి కళ్లల్లో ఆకలి నింపుకుని
నీలాంటి ఒంటరి మేక పిల్ల కోసమే
ఎన్నాళ్లుగానో కాపుకాసి ఉంటాయి
పరపరా చర్మాన్ని గోళ్లతో చీల్చి
కోరపళ్ల కింద యవ్వనాన్ని కరకరా నమిలేస్తాయి
ఎటు వైపుకీ వెళ్లకు తల్లీ!
చుట్టూ మగ మృగాలే ఉన్నాయి
అవి నీ నాలుక తెగ్గోసి
మెడా, నడుం విరిచి
రాక్షస క్రీడలు సల్పుతాయి
పక్కింటికైనా వెళ్లకు తల్లీ!
చివరికి
ఇంట్లో కూడా
జాగరూకతగా ఉండు తల్లీ!
చుట్టూ మగ పశువులున్నాయి
అవి
మావయ్యలు గాను, చిన్నాన్నలు గాను
అన్నయ్యలుగాను, తమ్ముళ్లు గాను
చివరికి
కన్నతండ్రి గాను
నీ పసితనాన్ని చిదిమేస్తాయి
కాపాడుకో తల్లీ
నిన్ను నువ్వు నిరంతరం కాపాడుకో
పురుగుల్నించి, పుట్రల్నించి
తోడేళ్ల నించి, పులుల్నించి
అన్ని వైపులా కాపుగాసిన
మానవమృగాల్నించి
ఇంటా బయటా
కాపాడుకోవడం నేర్చుకో
నిన్ను నువ్వు
కాపాడుకోవడానికే
ఏ విద్యయినా నేర్చుకో
నడుములు విరిచినా
గునపాలతో పొడిచినా
భీకరంగా ఎగిసిపడే సముద్రానివై
ప్రచండ శక్తితో
పెళ పెళా విరిగిపడే ఆకాశానివై
కాపాడుకో-
నాలుక తెగ్గోసినా
నిలువునా చీల్చేసినా
వెయ్యి నాల్కలతో
అంతకంతా
ప్రజ్వలమయ్యే
అగ్నిజ్వాలవై
నిన్ను నువ్వు
నిర్భయంగా కాపాడుకో