“ఈ ఫోటోలోని మహిళ పేరు స్వరూప. వయసు 28 సంవత్సరాలు. మతిస్థిమితం బాగాలేక గతవారం తప్పిపోయింది. ఎక్కడైనా కనిపిస్తే కింది నెంబర్లో తెలుపగలరు.. ఇట్లు పంకజ్” వాట్సాప్‌లో ఫార్వాడెడ్గా వచ్చిన ఆ మెసేజ్, అందులోని ఫోటో చూసి హృదయ్ ఒక్కసారిగా షాకయ్యాడు?
ఎదురు సోఫాలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్న అనిత భర్త ముఖంలో టెన్షన్ గమనించింది. పుస్తకం పక్కనబెడుతూ “ఏమైందండీ” అని ప్రశ్నించింది. అదుర్దాగా భార్య ముఖంలోకి చూస్తూ చేతిలో ఫోన్ అనిత ముందుకు చాచాడు హృదయ్.
అనిత ఆ మెసేజ్ చదివింది. “ఈమె మనూరామెనే గదా” అడిగింది అనిత. శూన్యంలోకి చూస్తూ అవునన్నటట్టు తలూపాడు. “అసలే పిచ్చిది. ఎటు వోయిందో ఏమో” అంటున్న భార్య మాట విని ఆమె వైపు ఉరిమినట్టు చూశాడు. “ఓహ్ సారీ అండీ పొరపాటుగా అన్నాను” అపాలజీ చెప్పింది అనిత. హృదయ్‌కి తన చిన్ననాటి స్నేహితులు అందరూ ఎంతో ఇష్టమనే విషయం అనితకు అప్పుడే స్ఫురణకు వచ్చింది.
ఎప్పుడు టైం దొరికినా వాళ్లతో ఆడిన ఆటల గురించి చెప్పడం.. యాదగిరి, సీను, గోపి, నసీమా, లతీఫా, సాయవ్వ, పోషవ్వ, ముజ్జు, సంగవ్వ, లచ్చిమి, రవి, శివుడు, సాదక్, పంకజ్, స్వరూప (బక్క) ఇలా భర్త చెప్పిన చిన్నప్పటి స్నేహితుల పేర్లన్నీ అనితకు బాగా నోటెడ్ అయ్యాయి.
ఆలోచనలో పడిపోయింది కాసేపటివరకు. బక్క గురించి ఆలోచిస్తోంది. ఊరు వెళ్లినప్పుడు ఒకట్రెండు సార్లు బక్కను కలిసిన రోజులను గుర్తు చేసుకుంది. బక్క రూపం కాసేపు కళ్లల్లో మెదిలింది. బక్క అందరిలాంటి పిల్ల కాదని దిగులు చెందుతోంది. హృదయ్ మథనం కూడా అదే. కాసేపటికి “అనిత” అన్న హృదయ్ పిలుపుతో ఠక్కున వాస్తవంలోకి వచ్చింది అనిత.
భర్త వైపు చూసింది. “ఏం ఆలోచిస్తున్నవు” అడిగాడు. ఏం లేదన్నట్టు తలూపింది. హృదయ్ తన ఫోన్‌తో పంకజ్‌కు కాల్ కలిపాడు.
పంకజ్ ఫోన్ ఎత్తాడు. “బక్క కనిపిస్తలేదురా” అని వలవలా ఏడ్చేస్తున్నాడు.
“ఎన్ని రోజులైందిరా?” కంగారుగా అడిగాడు హృదయ్. “మూడు రోజులైందిరా. దానికి ఎర్వ పర్వ ఏం తెల్వది. ఎటువోయిందో ఏమో. ఇంట్ల అమ్మానాయిన గుండె వల్గుతున్నరు” అని ఏడుస్తూనే మాట్లాడుతున్నాడు పంకజ్.
“నువ్వేం టెన్షన్ వడకు యాడికి పోదు” హృదయ్ మాట పూర్తి కాకుండానే పంకజ్ అందుకుని “అసలే బయట కరోనా రోగం పార్సుకపోయి ఉన్నది. ముట్టుకుంటే అంటుకుంట అన్నట్టే ఉన్నది. దీనికి ఆ రోగం దెల్వది, మాస్కులు, శానిటైజర్ల గురించి అసలే దెల్వది. సరిగ్గా మాట్లాడలేదు. నత్తి నత్తి మాట్లాడుకుంట ఎటెటు తిర్గుతున్నదో ఏమోరా” గాద్ఘధికమైంది పంకజ్ గొంతు.
“పోలీస్ స్టేషన్ల కంప్లైంట్ ఇచ్చినవార”
“ఇచ్చినరా. కరోనా టైంల గా పిచ్చిదాన్ని సరిగ్గా సూస్కోరా అని ఎస్సై ఉల్టా తిట్టిండు. ఇసుంటి టైంల దమాక్ మంచిగ లేనోళ్లను ఇంట్ల కట్టేశి పెట్టాలె అని అన్నడు. ఈ టైంల పోలీసోల్లకు ఇరువై నాలుగ్గంటలు కరోనా డ్యూటీ జేస్తందుకే సరిపోతున్నరు. ఇప్పుడు ఇసుంటి కొత్త కేసులు యాడ వట్టించుకుంటర్ర” విచారించాడు పంకజ్.
హృదయ్ ఏం చెయ్యాలనే ఆలోచనలో పడ్డాడు.
మళ్లీ అతనే అందుకుంటూ..”పోలీసోల్లు ఇప్పుడు ఏం జెయ్యరనే ఇషారతోని సోషల్ మీడియాను నమ్ముకున్న. ఎవరికైన కానస్తే ఫోన్ జేస్తరుగదా” “అవును మంచిపని చేసినవురా. నువ్వు పరేషాన్ అయి అమ్మానాయినలను పరేషాన్ చెయ్యకు సరేనా”
“మంచి మంచోళ్లనే దిక్కులేని సావు సంపుతున్న కరోనా మన బక్కవ్వను ఏం జేస్తదోనని గావర అయితున్నదిర. గదొక్కటే బుగులు నాకు”
“నువ్వు అంతదాక ఆలోశించుకొని మైండు కరాబ్ జేస్కోకు” ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు హృదయ్.
“లాక్డౌన్ ఉండుంటే నాకేం రంది లేకుండేరా. లాక్డౌన్ తెరిశినకాన్నుంచి పాజిటివ్ కేసులు శానా పెరుగుతున్నయి. అదే నా భయం. హైదరాబాదులనే ఉన్న ఆ మహమ్మారి ఇప్పుడు జిల్లాలకు గూడ పాకింది. మనూర్ల గూడ ఒకోళ్లకు కరోనా అచ్చింది. అచ్చినోడు గాంధీల నవుస్తున్నడు. ఈడ ఇంటిల్లాదులంతా 28 రోజులు హోం క్వారంటైన్ల ఉన్నరు. దీంతోని ఊరంతా తాయిమాయి అయితున్నరు. ఏం పాడు గత్తరోనని కుదెం వెట్టుకున్నరు. ఈ టైం ఎసుంటిదో దానికి తెల్వది. ఇంట్లున్నప్పుడే యాల్లకు బువ్వ తినది. ఇప్పుడు బయట ఏం తింటున్నదో, ఎటేటు తిరుగుతున్నదో. ఈ టైంల మంచిగ తిని ఇమ్యూనిటీ పెంచుకోవాలని మనకు తెలుసు గనీ, దానికేం తెలుసురా? ఆ సాడేసాతోని పేరు తలుసుంట అది ఇంకింత పిచ్చిపిచ్చి జెయ్యవట్టిందిర” వణుకుతోంది పంకజ్ స్వరం.
సాడేసాతోడు అనగానే ‘కిరణ్’ అనే పేరు ద్యోతకమైంది హృదయ్‌కి. “పెండ్లి ఏమంట అయిందో కిరణూ కిరణూ.. ఇదే దాని నోటి నుంచి అచ్చిన పేరు. ఇది పిచ్చిదని, ఎత్తుపండ్లు ఉన్నయని, ఒంటె పెదవులు ఉన్నయని, మాట్లాడ్తె నోట్లెకెల్లి సొల్లు కారుతున్నది, తుంపిర్లు వడ్తున్నయని, చెవులకెల్లి చీము కారుతున్నదని.. ఇట్ల శానా వంకలన్ని తీశి దీనితోని సంసారం జెయ్యనంటే చెయ్యా అంటున్నడు ఆడు. ఎడ్డిదాన్ని అంటగట్టినమని ఉల్టా మామీద కేసు వెడ్తా అంటున్నడురా. అల్ల అని దాన్ని ఈడ నూకిపెట్టి ఆడు మిర్యాలగూడకు ఎల్లిపోయిండు. సంసారం చెయ్ బావా అని వాని కాల్లు మొక్కుతమా. పోని అని ఊకున్నం కనీ, ఇది వాన్ని మచ్చంవోయిన మరుస్తలేదు. పన్నా లేశినా కిరణ్ తప్పిచ్చి దాని నాల్కె మీద వేరే పేరే ఉంటలేదు. దీనిది నిజంగనే పిచ్చి ప్రేమరా. ఆడు దీన్ని ఇడసవెట్టి రేపు ఇంకోదాన్ని ఏలుకుంటడు. మా అమ్మా నాయినలు చెప్తే ఇనకుంట దాని లగ్గం చేశిర్రు. ఇయాల్లరేపు లోపం ఉన్న ఆడపిల్లలను ఎవడు పెండ్లి చేసుకుంటడు చెప్పు?”
“అవున్రా బక్క లగ్గం జేశి తప్పు జేశిర్రు. అట్లనే ఉంటుండె” హృదయ్ అన్నాడు.
“లోకం బాధకు అమ్మా నాయినలు దాని బొండిగె కోశిర్రు. పిల్ల పెయిమీదికి 28 ఏండ్లు అచ్చినయి. ఇంటి మీద బెలుగు లెక్కట ఇంకా ఆ పిల్లను ఎన్నొద్దులు ఉంచుకుంటరు. ఆమెకు తగ్గ పొలగాన్ని లెంకి అటు ఎత్తి ఇయ్యుర్రి అని మా మేనమామలు, పెద్దమ్మలు గూడ జోరీగల లెక్క పోరిర్రు. ఆల్ల బాధ పడలేక ఎత్తిచ్చినట్టు అయింది” వాపోయాడు పంకజ్.
“అయిందేదో అయిపోయిందిరా. తలరాత ఎట్ల రాసుంటే అట్లనే అయితది. విధిరాతను ఎవరం మార్చలేం గదా” సముదాయించే ప్రయత్నం చేస్తున్నాడు హృదయ్.
ఇంతలో పంకజ్ మరింత వెక్కడం వినిపించింది. “అరేయ్ పంకజ్ ఊకె ఏడ్వకురా. నువ్వు భయపడుతున్నంత ఏంగాదు. నేను గూడ వాట్సాప్ గ్రూపులల్ల, ఫేస్‌బుక్‌ల షేర్ జేస్త సరేనా. వీలైతే టీవీల గూడ వార్త ఏపిద్దాం. నువ్వు అంతలోపు ఎసుంటి పిచ్చి పిచ్చి ఆలోచన్లు వెట్టుకోకుంట ధైర్యంగ ఉండు. నిన్నిట్ల జూస్తె ఇంట్ల అందరు పరేషాన్ అయితరు. ఇంటికి పెద్దోనివి నువ్వఉ ఏం గుండెవల్గకు” అన్నాడు హృదయ్.
వెక్కుతూనే “థాంక్స్ రా ఉంటమరీ” “సరే.. బాయ్” అని ఫోన్ కట్ చేసి అనితను చూస్తూ నిట్టూర్చాడు. వాళ్ల డిస్కషన్ మొత్తం విన్న అనిత ఏం చెప్పాలా అని ఆలోచిస్తోంది.
ఇంతలో హృదయ్ నెర్వస్‌గా అంటున్నాడు. “ముందు నుయ్యి వెనుక గొయ్యి లెక్కటుంది మన పరిస్థితి. హైదరాబాద్‌ల కేసులు శితాం బుక్ అయితున్నయి. ఏమన్న బయటకు వోయి ట్రై జేద్దామంటే కరోనా భయం ఉన్నది” హృదయ్ గొంతులో జీర.
“అనవసరంగా ఆ పిల్ల పెండ్లి చేశిర్రు. నాకు పెండ్లి చెయ్యుర్రని ఎల్లాడినట్టే చేశిర్రు. చెయ్యకపోయినా గట్లనే ఉండేది. అసుంటోల్లు చాలా సెన్సిటివ్ ఉంటరు” అంటున్న అనిత వైపు చూస్తూ అవునన్నట్టు తలాడించాడు.
“ఎంత మంచిది పాపం. ఎటు వోయిందో.. ఏమేం గోస వడుతున్నదో. కరోనాల గూడ కొందరు కావురాలు వట్టిన బాడ్కావ్గాళ్లు పాపాలకు పాల్పడుతున్నరు. ఎడ్డిది, గొడ్డుది అంటలేరు. అదే టెన్షన్ అయితున్నది” అంటున్న భర్త భుజం మీద చేయి వేసింది అనిత.
“ఇప్పటిదాకా మీ దోస్తుకు ధైర్యం జెప్పి ఇప్పుడు నువ్వే ఇట్ల గావరైతే ఎట్ల? ఏంగాదు అనవసరంగ ఆలోచించకు” అంది భుజాన్ని నొక్కుతూ.
“ఎంటనే ఊరికి పోవాలనిపిస్తున్నది. కనీ పోలేం. పోంగ తొవ్వల కరోనా యాడ అంటుకుంటదోనని భయం. వర్క్ ఫ్రం హోమ్తోని మెసలకుంట పని అయితున్నది. ఇంత పని జేశినా సగం జీతమే ఇస్తున్నది కంపెనీ. ఇట్ల దేశంల ప్రతీ కంపెనీ దివాళా తీశింది. ఇంటి కిరాయోల్లు ఆగరు, కర్సులు మోపవుడు ఆగయి. ఎసుంటి దినాలు అచ్చినయి. ఇట్ల అయితదని ఊహించలేం. అవునూ పోరలేరి?” ఇంట్లో అటూ ఇటూ చూస్తూ అడిగాడు హృదయ్.
“ఇస్కుల్లు లేక దినాం ఆటనే అయింది వాళ్లకు. కింద ఆడుకుంటున్నరు” తాపీగా అంది అనిత.
“గేటుకు తాళం ఏశిర్రు గదా” “ఆ వేసే ఉంచిన. ఈ కరోనాతోని పాపం పోరగాళ్లను గూడ జైల్ల పెట్టినట్టు అయిపోతున్నది. ఈ అపార్ట్మెంట్ల కిందికి మీదికి ఆడుకుంటున్నరు అంతే” నిట్టూరుస్తూ అంది.
ఇంక మరో మాటకు ఆస్కారం లేకుండా తన ఫోన్లోంచి బక్క మెసేజ్ ఫార్వాడ్ చేశాడు. తన ఫోన్లోని అన్నీ గ్రూపుల్లో పెట్టాడు. అలాగే ఎఫ్బీ, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ యాప్స్‌లో కూడా ఫార్వాడ్ చేశాడు.
కొంతమంది తన హైదరాబాద్ స్నేహితులకు ఫోన్ చేసి మరీ చెప్పాడు.
* * *
బక్క అసలు పేరు స్వరూప. చిన్నప్పుడు కాస్త సన్నగా ఉందని వాళ్లమ్మ ‘బక్కవ్వ’ అని పిలుచుకునేది.
దీంతో అదే నిక్ నేమ్ అయిపోయింది. బక్కవ్వను కాస్త తోటి పిల్లలందరూ కలిసి ‘బక్క’ అని పిలవడం మొదలుపెట్టారు.
బక్కకు ముందు ఒక అక్క, ఇద్దరు తమ్ముళ్లున్నారు. పంకజ్ బక్కవ్వకు పెద్ద తమ్ముడు. పంకజ్ టీచర్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ప్రస్తుతం ఓ స్కూల్లో విద్యా వాలంటీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.
ఇంటి దగ్గర పిల్లలకు ట్యూషన్లు కూడా చెబుతున్నాడు. బక్క వాళ్ల నాన్న అంగళ్లు తిరుగుతూ ఉల్లి, వెల్లుల్లి, అల్లం అమ్ముతుంటాడు. వాళ్లమ్మ ఇంట్లో చిన్నగా కిరాణా కొట్టు పెట్టుకుంది. పుట్టడమే బక్క మతి స్థిమితం లేకుండా పుట్టింది.
అలాగనీ మరీ మతిస్థిమితం లేనిదేమీ కాదు. తను మాట్లాడే మాటల్లో స్పష్టత లేకపోయినా అర్థమయ్యేవి. ఇతరులు చెప్పింది కూడా అర్థం చేసుకునేది.
ఇల్లు, వాడకట్టు తప్ప వేరే ప్రపంచం తెలియదు. అందరి పిల్లల్లాగ బట్టలు సరిగ్గా వేసుకోవడం, తల దువ్వుకోవడం వంటివి చేసేది కాదు. వాళ్లమ్మే అవన్నీ చేసేది.
అంతా బాగానే సాగుతున్న వారిని ఇరుగుపొరుగు వారు, బంధువులు బక్క పెళ్లి ప్రస్తావన తెచ్చి వారి కుటుంబంలో అశాంతికి కారణం అయ్యారు.
మిర్యాలగూడలో కిరాణా కొట్టు ఉంది మంచి అబ్బాయని కిరణ్‌ను చూశారు. కిరణ్ కూడా పెద్ద అందగాడేమీ కాదు. అతనికి పోలియోతో ఒక కాలు కుంటిగా ఉంది.
దీంతో అతనికి పిల్లను ఇచ్చేవారు కరువయ్యారు. ముప్ఫై ఐదేళ్ల వయసొచ్చింది. తనకింక ఈ జన్మకు పెళ్లి కాదని దిగులు పెట్టుకున్నాడు. ఈ క్రమంలో బక్క సంబంధం అతనికి వరంలా అనిపించింది.
బక్కను చూడగానే ఆతృతగా సంబంధం ఖాయం చేసుకుందాం అన్నాడు. ఈ జన్మకు తమ బిడ్డకు పెళ్లే కాదనుకున్న బక్క అమ్మానాన్నలకు ఈ సంబంధం ఖాయం అవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అటు కిరణ్ అమ్మానాన్నలు కూడా ఆనందంగా ఉన్నారు. వాళ్లు అడిగినదాంట్లో కొసరుతూ తమతో అయినంతలో పెళ్లి చేశారు. పెళ్లయ్యాక రెండు నెలలు సజావుగానే ఉన్నారు.
ఆ తర్వాత కోడలు పిచ్చిదని అత్తామామలు, పిచ్చిదాన్ని నాకు అంటగట్టారని కిరణ్ పోరడం మొదలుపెట్టారు. “దానికి వంటావార్పు వచ్చు. మాటలు జర తొతరతొతర వోతయి. ఇంటి మట్టుకు అన్ని పనులు సగవెడ్తది” అని బక్క వాళ్ల అమ్మానాన్నలు ఎంత సర్ది చెప్పినా కిరణ్ వినిపించుకోలేదు.
చివరికి వదిలేస్తానని ఖరాఖండిగా చెప్పాడు. దీంతో బక్క వాళ్ల అమ్మానాన్నలు మహిళా మండలిలో ఫిర్యాదు చేశారు. వారొచ్చి చెప్పారు, చివరికి పోలీసులతో కూడా కౌన్సెలింగ్ ఇప్పించారు.
అయినా అతని తీరులో మార్పులేదు. మరోవైపు దేశంలో కరోనా వైరస్ కేసులు ప్రారంభ దశలో ఉన్నాయి. బక్కకు ఏవో కబూర్లు చెప్పి రాత్రి ఇంటిదాక దిగబెట్టి అటునుంచి అటే బస్సెక్కి తన ఊరు వెళ్లిపోయాడు కిరణ్.
భర్త మళ్లీ వస్తాడనే ధ్యానంలో ఉండిపోయింది బక్క. కిరణ్ చేసిన పనికి మండిపోయిన పంకజ్, కిరణ్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ వస్తోంది.
వదిలించుకున్నాడని నిర్ధారించుకున్నారు. ఇంతలో దేశంలో, రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలో కేంద్రం పక్షం రోజుల సంపూర్ణ లాక్డౌన్ విధించింది.
ఇది అయిపోయాకే కిరణ్‌తో మాట్లాడదామని భావించాడు పంకజ్. వైరస్ తీవ్రత, కరోనా మరణాలు రేటు పుంజుకోవడంతో లాక్డౌన్ పొడిగించింది ప్రభుత్వం. ఈ మధ్యలో బక్క కిరణ్‌ను తలుచుకోని రోజు లేదు.
ఇవాళ వస్తాడు, రేపు వస్తాడు అని నచ్చజెప్పుకుంటూ వస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. మరణాలు కూడా ఎక్కువే.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వికృత రూపం దాల్చి కరాళనృత్యం చేస్తోంది. ఎందరో బలి అవుతున్నారు. మాస్కులు, శానిటైజర్లు, భౌతిక దూరం వంటి జాగ్రత్తలతో ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అప్రమత్త చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా పాజిటివ్ కేసుల దృష్ట్యా లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నారు.
ఎటుచూసినా కరోనా హాహాకారాలే. లాక్డౌన్ వల్ల ప్రభుత్వాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. మరోవైపు వలస కార్మికులు కూడా ఆకలికి అల్లాడుతున్నారు. పనుల్లేక తమ సొంతూళ్లకు కాలినడకన, సైకిళ్ల మీద వందలు, వేల కిలోమీటర్లు వెళుతున్న గుండెలు కలిచివేసే సంఘటనలు ఎన్నో.
చైనావాడి నిర్వాకంతో ప్రపంచం మొత్తం పరేషాన్ అవుతోంది. ఇలా మూణ్నెల్ల కాలం గడిచిపోయింది. ‘ఇక లాక్‌డౌన్‌ను ఎత్తివేయాల్సిందే.. లేదంటే మరింత సంక్షోభంలో కూరుకుపోతాం’ అని భావించాయి ప్రభుత్వాలు.
లాక్‌డౌన్‌ను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
ఈ క్రమంలో ఎక్కడెక్కడో చిక్కుకుపోయిన ప్రజలు తమతమ స్వస్థలాలకు రాకపోకలు సాగించారు. దీంతో హైదరాబాద్‌లో కేసుల సంఖ్య మరింత పెరిగింది. రోజుకు వందలు నుంచి వేలకు వేలు కేసులు నమోదవుతున్నాయి.
ఎటు వెళ్లాలన్నా ఎవర్ని ముట్టుకోవాలన్నా ఒక రకమైన భయం అందరిలో. బక్క, కిరణ్ నామస్మరణను ఇంకా పెంచింది. ఆ పేరే ఆమె నోటివెంట జపమైంది. ‘కిరణ్.. కిరణ్..,’ అంటూ అటూ ఇటూ పరుగులు పెడుతుంటే ఇంట్లో కట్టేశారు.
అయినా తాడు తెంపుకొని ఎదురైన బస్సులో ఎక్కి వెళ్లిపోతోంది. ఒకసారి మెదక్‌లో, ఒకసారి నర్సాపూర్‌కు వెళ్లి పట్టుకొచ్చాడు పంకజ్. స్థానిక డాక్టర్‌కి చూపిస్తే “క్రాక్ అయిపోయింది. తీసుకెళ్లి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్పించండి” అని చెప్పాడు.
నిద్ర కోసం ఏవో మాత్రలు రాసిచ్చాడు. అలా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్న క్రమంలో ఓరోజు రాత్రి హైదరాబాద్ బస్సెక్కింది. తన భర్తతో ఎలా వచ్చిందో కాస్త గుర్తు పెట్టుకున్నట్టుంది. అలాగే వెళ్లిపోదామని భావించి బస్సెక్కింది.
- + +
పక్షం రోజులు అవుతోంది బక్క తప్పిపోయి. నిత్యం సోషల్ మీడియాలో పంకజ్, హృదయ్ ఆ పోస్టును షేర్ చేస్తూనే ఉన్నారు.
ఇంతలో హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో హైదరాబాద్ మట్టుకు మళ్లీ లాక్డౌన్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
అప్పటికే సోషల్ మీడియాలో హైదరాబాద్ డేంజర్ జోన్లో ఉందనీ.. ఊళ్లకు వెళ్లిపోయి ప్రాణాలు కాపాడుకోండనే వార్తలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.
హృదయ్ తన పిల్లల గురించి ఆందోళన చెందుతున్నాడు. తనకేమైనా, పిల్లలకు ఏమైనా తట్టుకోలేడు. అసలే మధ్య తరగతి జీవితాలు. కరోనా సోకితే గాంధీలో కాకుండా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటే ఉన్న ఇల్లు అమ్ముకోవాల్సిందే.
అనిత కూడా ఊరెళ్లిపోదామని అంటోంది. వెళ్లడమే బెటర్ అనుకుంటుండగా బక్క గురించి తెలిసి ఆగిపోయాడు. బక్క ఆచూకీ తెలిశాక ఊరు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇంతలో ఓరోజు శంషాబాద్‌లో ఉండే మితృడు రాజు అనుకోకుండా ఫోన్ చేసి బక్క శంషాబాద్ బస్టాండ్‌లో కనిపించిందని చెప్పాడు. వెంటనే రమ్మన్నాడు.
ఆతృతగా హృదయ్ ఫోన్ కట్ చేసి బయలుదేరడానికి హడావిడి పడుతున్నాడు. అనిత వెంటనే చేతులకు గ్లౌజులు, ఫేస్ మాస్క్, గాగుల్స్, శానిటైజర్ సీసా తెచ్చి హృదయ్‌కి అందించింది. అవన్నీ తీసుకుని ఇంట్లో కాలు బయట పెడుతుండగా పిల్లలిద్దరూ “డాడీ మేమూ వస్తాం” అని హృదయ్ కాళ్లను అల్లుకుపోయారు. “డాడీ ఇప్పుడే అస్తరు. మీరు ఉండుర్రి” అంటూ అనిత వాళ్లిద్దరినీ పట్టుకుంది. హృదయ్ ఒక్క ఉదుటున బయటపడ్డాడు.
బైక్ కిక్ కొట్టాడంటే శంషాబాద్ చేరేవరకు ఎక్కడా ఆగలేదు. శంషాబాద్ బస్టాండ్ వద్దకు వెళ్లి బక్కను చూసి షాకయ్యాడు హృదయ్. జుట్టంతా చింపిరైంది. ఒంటిమీద దుస్తులు మైలబారి, చిరిగిపోయాయి. ఆ స్థితిలో బక్కను చూసి హృదయ్ మనసు తరుక్కుపోతోంది.
ఇంతలో పోలీస్ జీపు, అంబులెన్స్ వాహనాలు వచ్చాయి. హృదయ్ ఉండబట్టలేకపోయాడు మాస్క్ తొలగించి “బక్కా” అని గట్టిగా అరిచాడు. హృదయ్ పిలుపు విని తలతిప్పి చూసింది బక్క. హృదయ్‌ని గుర్తుపట్టిన బక్క ముఖంలో ఆనంద చారికలు.
“అరేయ్ చిన్నా” అని ఏడుపందుకుంది. ‘చిన్నా’ హృదయ్ నిక్ నేమ్. హృదయ్ దగ్గరకు పరుగెత్తుకు వస్తున్న ఆమె చేతిని నిండా పీపీఈ కిట్ ధరించిన అంబులెన్స్ సిబ్బంది గట్టిగా పట్టుకుంది.
“చిన్నా చిన్నా” అని ఏడుస్తూ దగ్గుతోంది బక్క. “వదలండి సర్ తను మా ఫ్రెండ్ వాళ్ల సిస్టర్. మెదక్ దగ్గర గోపాల్పేట్ ఊరు తనది” గట్టిగా అరుస్తూ చెప్పాడు హృదయ్. “ఓకే బట్ ఆమెకు కరోనా సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. ఇలాగే వదిలేస్తే తాను చచ్చింది గాక ఇతరులను చంపుతుంది” మాస్కులో ఉన్న ఎస్సై అన్నాడు.
హృదయ్ ఖిన్నుడయ్యాడు. “ఈ ఏరియాలో గత వారం నుంచి కేసులు బాగా పెరుగుతున్నాయి. ఈమె వల్ల కేసులు పెరుగుతున్నాయని ఇక్కడి స్థానికులు మాకు సమాచారం అందించారు. అందుకే గాంధీకి తీసుకెళ్తున్నాం. మీ ఫోన్ నంబర్ ఇవ్వండి ఏమైనా ఉంటే చెబుతాం” అన్నాడు ఎస్సై.
“సర్ తనకు మామూలు సర్ది, దగ్గు కావచ్చు. గోలీలేసుకుంటే తక్కైపోతది” కంగారుగా హృదయ్ అన్నాడు. “అవన్నీ పరీక్షలు చేస్తేనే కదా తెలిసేది తప్పుకో” హృదయ్‌ని పక్కకు నెట్టాడు ఎస్సై. అంబులెన్స్ సిబ్బందికి రాజు, హృదయ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాడు.
‘‘ఈవారం నుంచి స్వరూప ఈ బస్టాండ్లనే ఉంటున్నదట. ఆకలైతే ఇండ్ల పొర్త వోయి అడుక్కచ్చుకొని తింటున్నదట. రాత్రింబగళ్లు కిరణ్ పేరే తల్సుకున్నదని ఇక్కడోల్లు చెప్పిర్రు. ఈ నాలుగైదు రోజుల సంది దగ్గుతుంది, తుమ్ముతుందట. ఇక్కడోళ్లందర్కి ఆమెకు కరోనా అచ్చిందని అనుమానం కలిగి పోలీసోళ్లకు ఫోన్ చేశిర్రంట. ఇసుంటి గోస పగోనికి గూడ రావొద్దుర” అంటున్న రాజు ముఖంలోకి చూస్తున్న హృదయ్ ముఖంలో దుఖ్ఖం పొంగుకొచ్చింది.
‘చిన్నా చిన్నా’ అంటూ ధీనంగా ఏడుస్తున్న బక్కను అంబులెన్స్‌లో వేసుకుని వెళ్లిపోయారు. వెంటనే పంకజ్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. తాను హైదరాబాద్ బయలుదేరి వస్తున్నానని పంకజ్ చెప్పాడు.
* * *
పంకజ్, హృదయ్ ఇంటికి వచ్చినప్పటి నుంచి తన ధ్యాసంతా గాంధీలో ఉన్న బక్క మీదే పెట్టాడు. తినడం లేదు. పదేపదే గాంధీకి వెళ్లొద్దాం అంటున్నాడు. అక్కడ ఎవర్నీ రానివ్వడం లేదని హృదయ్ చెబుతున్నాడు.
“బక్కవ్వకు నిజంగనే కరోనా అచ్చిందంటవార” ఈ ప్రశ్న ఇప్పటికి వందసార్లు అడిగుంటాడు పంకజ్. “ఎహె రాదుర బై. అచ్చినా మన బక్కవ్వ దులిపేస్తది” ధీమాగా చెప్పాడు హృదయ్.
“ఏమోరా భయమైతున్నది. ఎటెటు తిరిగిందో.. ఎట్ల గడిపిందో తలుసుకుంటే దుఖ్ఖం ఆగుతలేదు” అని వలవలా ఏడుపందుకున్నాడు.
“అన్న నువ్వు అనవసరంగ ఆలోచించి మైండు కరాబ్ జేస్కోకు ఊకో” అని అనిత అంది.
ఇద్దరికి భోజనం వడ్డించింది. పంకజ్ కరుచుకుంటూ తిన్నాడు. పక్షం రోజుల తర్వాత గాంధీ నుంచి హృదయ్ ఫోన్‌కు కాల్ వచ్చింది. “స్వరూపకు నెగెటివ్ అని వచ్చింది. వచ్చి తీసుకుపోండి” ఆమాట వినగానే పోయిన ప్రాణం తిరిగొచ్చినంత పనైంది హృదయ్‌కి.
అదే మాట పంకజ్కి చెప్పగానే “పోదాం పా” అని కంగారు పెడుతున్నాడు. ఇద్దరూ ఆటోలో గాంధీ ఆసుపత్రికి వెళ్లారు. డిశ్చార్జ్ అయ్యేవారిని వెనుక గేటు నుంచి పంపిస్తున్నారని చెబితే ఆ వైపే వెళ్లారు.
అక్కడ రిసెప్షన్ సీట్లో కూర్చున్న ఓ డాక్టర్ వీళ్లిద్దర్నీ పిలిచాడు. “సారీ టు సే.. మీ స్వరూపకు కోవిడ్ లక్షణాలు ఏమీ లేవు. అసింప్టమాటిక్ ఉండే. అంటే ఎలాంటి లక్షణాలు లేకపోయినా పాజిటివ్‌గా వస్తుంది. కానీ, మా డ్యూటీ మేము చెయ్యాలి కదా. ఈ వారం రోజులు తనను స్పెషల్ వార్డులో మంచానికి కట్టేసి ట్రీట్మెంట్ చేశాం. ఇమ్యూనిటీ కోసం మంచి ఫుడ్ ఇచ్చాం” అని చెప్పారు.
ఇంతలో బక్క లోపలి నుంచి వస్తోంది. బలహీనంగా వస్తున్న బక్కను చూడగానే పంకజ్‌కు ఉద్విగ్నంతో కన్నీళ్లు ఆగలేవు.
“బక్కవ్వ” అన్నాడు. ఆ మాట విని తలెత్తి పంకజ్‌ను చూసి “తమ్మూ” అని ఉద్వేగంతో పరుగెత్తుకుంటూ వస్తోంది బక్క. దగ్గరికొచ్చి పంకజ్‌ను గట్టిగా పట్టుకొని వెక్కుతోంది. ఇంతలో ఏమైందో అకస్మాత్తుగా “కిరణ్.. కిరణ్” అని లీలగా అంటోంది.
ఆ పేరు వినగానే పంకజ్ పళ్లు పటపటా నూరుతున్నాడు. “అగో కిరణ్.. కిరణ్” అని గట్టిగా అరుస్తూ గేటు వైపు పరుగులు తీసింది. పంకజ్, హృదయ్‌కి ఏం అర్థం కాకుండా ఉంది. ఏం జరుగుతుందో తెలియక తికమక పడుతున్నారు. డిశ్చార్జ్ అయి బయటకు వెళుతున్న పేషెంట్లను తప్పించుకుంటూ బక్క ఏకధాటిగా పరుగెత్తుతోంది.
ఆమె వెనకాల పంకజ్, హృదయ్ పరుగులు తీశారు. ఆ గుంపులో నిండా శాలువా కప్పుకుని నీరసంగా నడుస్తున్న వ్యక్తిని అనుసరిస్తోంది బక్క. పంకజ్, హృదయ్‌లకు ఏం అర్థం కావడంలేదు.
శాలువా కప్పుకున్న వ్యక్తి భుజం మీద చేయి వేసి తన వైపు లాగింది ‘కిరణ్ కిరణ్’ అంటూనే. ఆ కుదుపులకు అతను తూలుతూ బక్క వైపు తిరిగాడు. బక్క అనుమానమే నిజమైంది. అతను కిరణే. బలహీనంగా, నీరసంగా ఉన్నాడు.
కిరణ్‌ను చూసి పంకజ్, హృదయ్‌లు షాక్ అయ్యారు. తూలుతున్న కిరణ్‌ను గట్టిగా పట్టుకుంది బక్క. బక్క ముఖంలో ఎక్కడలేని ఆనందం తాండవిస్తోంది.
ఇన్ని రోజులు తను దేనికోసమైతే ప్రాణం పెట్టి ఎదురుచూస్తుందో అదే తన ముందు ఉండేసరికి బక్క ఆనందం నింగినంటింది. బక్కను చూసిన కిరణ్‌లో మునుపటి అసహ్యం, ఏవగింపు ఎక్కడా కనిపించడం లేవు. బహుశా అతనూ బక్క కోసం ఎదురు చూస్తున్నట్టే అతని కళ్లల్లో ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది. “సరూపా” అని గట్టిగా అరిచి బక్కను అలుముకుని పొగిలి పొగిలి ఏడుస్తున్నాడు.
అక్కడున్న వారంతా వీళ్లను చూస్తూ “కరోనా తగ్గిందనే సంబురంల ఉన్నట్టున్నరు” అని అనుకున్నట్టు వెళ్లిపోతున్నారు.
వాళ్లని హృదయ్, పంకజ్ అలా నిల్చుని చూస్తున్నారు. “ఇప్పుడు బక్క ప్రపంచం కిరణే. బావను మంచిగ జూస్కుంటే అక్కను మంచిగ సూస్కున్నట్టే” అంటున్న హృదయ్ వైపు నిర్లిప్తంగా చూశాడు పంకజ్.
ఆకాశం నిర్మలంగా ఉంది. గాలి రివ్వున వీస్తోంది. కాసేపటికి వాళ్లను అనుసరించారు పంకజ్, హృదయ్. పంకజ్‌ను చూడగానే కిరణ్ మరింత భావోద్వేగంతో వెళ్లి కౌగిలించుకుని
“నన్ను క్షమించు పంకజ్. నేను తప్పు జేశిన. సరూపను అరార గోస వెట్టిన. ఆ పాపం ఊకెనే పోలేదు. అమ్మానాయినలకు కరోనా అచ్చి సచ్చిపోయిర్రు. ఆల్ల శవాలు గూడ ఇయ్యలేదు. ఏడ బొంద వెట్టిర్రో గూడ తెల్వది. నాకు గూడ కరోనా అచ్చింది. ఈ గాంధీలనే ఉండి కోలుకున్న. ఇయ్యాల్ల డిశ్చార్జ్ చేశిర్రు. అనవసరంగ మంచిగైన.. నేను గూడ ఈ రోగంతోని పోయుంటే బాగుండేది. మాకు కరోనా అచ్చిందని ఏ సుట్టపోల్లు గూడ పల్కరిచ్చే పాపాన పోలేదు. ఒంటిగాన్ని అయిపోయిన” అని గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు.
అదంతా విని కిరణ్ మీదున్న కోపం మొత్తం పోయింది పంకజ్‌లో.. జాలి కలుగుతోంది. “అయిందేదో అయిపోయింది బావా బాధపడకు. నీకు మేము లేమా” అన్నాడు గాద్ఘధిక స్వరంతో.
బక్కకు తన అత్తామామలు చనిపోయారని అర్థమై ఏడుస్తోంది. “నా పెండ్లాం పిచ్చిదని దాన్ని సతాయించిన. కనీ అది నిజంగనే పిచ్చిది. నేనంటే దానికి పిచ్చి ప్రేమ. నన్ను సంటి పొలగాని లెక్కట సూసుకుంటది. దాని స్వచ్ఛమైన ప్రేమను నేను అర్థం జేస్కోలేకపోయిన.
ఇంతగానం పెండ్లాం ప్రేమ ఈ ప్రపంచంల ఏ మొగోన్కి గూడ దొరకదేమో” అంటున్న కిరణ్ కళ్లు ఏరుధారలయ్యాయి. “సై మాట చెప్పినవ్ బావా. ఈడినుంచి నీకంతా మంచే జరుగుతది. కరోనా నీలో మార్పు తీసుకచ్చింది. పా ఇగ ఇంటికి వోదాం. మిర్యాలగూడల ఒక్కోనివి యాడుంటవు. గోపాల్పేట్లనే దుకాణం పెట్టుకొని ఉందువు పా ఆడనే” హృదయ్ మాటలకు కళ్లు తుడుచుకుంటూ గుండెలో ఆత్మస్థైర్యాన్ని ప్రోది చేసుకుంటూ.. బక్క వైపు ఎనలేని ప్రేమతో చూస్తూ ముందుకు నడిచాడు కిరణ్.
కిరణ్ మీద నుంచి దృష్టి మరల్చని బక్కవ్వ అతని అడుగులో అడుగు వేసింది.