నీళ్ళల్లో అలజడి కలిగి
జలం జ్వలించి జ్వాల పుట్టదా
తొక్కిన కొధ్ధీ మట్టి
గట్టిపడి రాయిలా మారదా!
నాటిన విత్తనం నేలను చీల్చుకొని
గెలుపును సూచించదా
ఒత్తిడిలో కుక్కర్
ఈల పాట పాడదా!
గాయమైన గుండె
హాయిగొలిపే గేయాలు రాయదా
కాలికి కట్టిన గజ్జె
గుండెల్లో శబ్ధం చేయదా!
బాధలు రోదనల నీడలు కారాదు
అవి జీవితానికి దారిచూపే బోధనలు
భయం పిల్లిని చేస్తుంది
ధైర్యం పులిని ఎదిరిస్తుంది!
అడుగులు ముందుకు వేస్తే
దూరం దగ్గరయి పలుకరిస్తుంది
విజయం బాట వేసి పిలుస్తుంది
ఆనందం ఆలింగనం చేసుకుంటుంది!