ప్రముఖ కవయిత్రి, రచయిత్రి జ్వలిత రచించిన ‘ ఎర్రరంగు బురద‘ నవల ధారావాహికంగా వస్తుంది. చదువు లేకపోవడం వలన వెనుకబడి పోయిన మనుషులకు ఈ సమాజం లో ఎన్నెన్ని ఈతిబాధలు ఉన్నాయో అక్షరాక్షరాన చూపించారు జ్వలిత. ముందుకెళ్ళాలంటే చదువుల బాటలే పడాలి, పడ్తాయికూడా అనే ఆశావహ దృక్పథం కూడా వ్యక్తీకరించారు. ఆడవాళ్ళ కు ఆపదలు వస్తే ఎలా ఉపాయం గా ఎదుర్కోవాలో చెప్తుంది ఈ నవల . వారం వారం మిమ్మల్ని పల్లీయుల సంభాషణ లతో ఉత్కంఠ మైన కథతో అలరించడానికి వస్తున్నది సీరియల్ గా ఈ నవల ….. చదవండి .. – సంపాదకులు
మొదటిభాగం
“ఓ టీచరమ్మా.. మీ తరగతిల పద్మను పిలసక రమ్మన్నది మా పెద్ద మేడం” అన్నది ఆయమ్మ రొప్పుకుంట.
“లెక్కల క్లాసు నడుస్తున్నది.. తర్వాత పంపుత పో..” ఆయమ్మ రొప్పుడు పట్టిచ్చుకోకుండా అన్నది పదో తరగతి లెక్కల టీచర్ ప్రగతి.
“కాదమ్మా.. వాల్ల అక్క బిడ్డకు ఫిట్స్ వచ్చినయి డాక్టరు తొందరగ పిలిపిచ్చమన్నడు… ” అన్నది ఆయా భయపడుకుంటనే.
“సరే.. వెళ్ళు పద్మా..” కసిరి పంపింది టీచర్.
“ఏమయింది ఆయమ్మా.. మా పుష్పకు ?” అన్నది పద్మ ఆత్రంగ బయటికొచ్చి .
“ఏమో అమ్మ నాకు తెలవదు, పెద్ద మేడం పిలసకరమ్మన్నది” అన్నది ఆయా.
హైస్కూల్ పక్కన ప్రైమరీ స్కూలుంటది, హాస్టల్ పిల్లలే ఎక్కువుంటరు అందుల.
పద్మకూడా ఆస్కూల్ల సదువుకొనే హైస్కూలుకు పోయింది.
ప్రైమరీ స్కూలు హెచ్చెమ్, పక్కనే ఉన్న హైస్కూల్లో పదోతరగతి చదువుతున్న పద్మను పిలుచుక రమ్మని ఆయాను పంపి, బయట వరండాల నిలబడి ఉన్నది, పద్మను సూసి ” రా.. రా.. తొందరగా.. డాక్టర్ ఎదురు చూస్తున్నరు.. పుష్ప వాళ్ళ అమ్మా నాన్నలను పిలిపించమంటున్నరు..” అన్నది.
“అసలేమయింది మేడం..?” అడిగింది పద్మ.
“రేపు హోలీ పండగ కదా వాళ్ళ క్లాస్ పిల్లలు సీసాలల్ల రంగు నీళ్ళు కలుపుకొని తెచ్చుకున్నట్టున్నరు, బ్యాగుల్ల ఉన్నయట టీచర్లు సూడలే, ఇంటర్వెల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ రంగు నీళ్ళు సల్లుకుంటుంటే పక్కనే ఉన్న పుష్ప, అది సూసి గట్టిగ అరుసుకుంట పడిపోయింది. డాక్టరు దగ్గరికి తీసుక పోయినం..” అన్నది హెచ్చెమ్.
“మనం పొయ్యి సూద్దాం మేడం ఇప్పుడెట్లున్నదో…” అన్నది పద్మ.
“డాక్టర్ వాళ్ళ అమ్మా నాన్నను పిలిపిచ్చమన్నడు కదా..”
“వాళ్ళ నాన్న లేడు, అమ్మ ఉన్నది, పిలిపిద్దాం ముందు మనం సూద్దాం రండి మేడం” అన్నది పద్మ.
“ఔనమ్మా.. పుష్ప ఇప్పుడెట్లున్నదో సూసొద్దామమ్మా..” అన్నది ఆయమ్మ.
“సరే సూద్దాం పదండి..” అంటూ…
డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అందరూ కలిసి.
*
పక్క బజార్ల ఉన్నది ప్రైవేట్ క్లినిక్, అందులనే మందుల షాపు కూడ ఉంటది. చిన్నపాటి నర్సింగ్ హోమ్, డాక్టర్ సుధాకర్ నడుపుతున్నాడు దాన్ని. ఆయన లయిన్స్ క్లబ్ మెంబర్ కావడం వల్ల, హాస్టల్ పిల్లలకు ఉచితంగా వైద్యం చేస్తాడు. పది అంగల్ల ఆగమాగంగ అక్కడికి పోయిన్రు వాళ్ళు ముగ్గురు.
పుష్ప దగ్గర వాళ్ళ క్లాసుటీచర్ కూర్చుని ఉన్నది.
పుష్ప కళ్ళుమూసుకుని పండుకొని ఉన్నది. పుష్ప ఎనిమిదేళ్ల పిల్ల. ఇంతకు ముందెపుడూ స్కూల్లో ఎవరికీ అట్లా జరగ లేదు. టీచర్లు గాబర గాబర పడ్తాన్రు భయంతో..
“పుష్పా..” అని పిలిసింది, చెయ్యి పట్టుకొని పద్మ.
కళ్ళు తెరిచి చూసి పద్మను పట్టుకొని ‘పద్మక్కా..’ అని ఏడవడం మొదలు పెట్టింది.
వేరే పేషుంటును చూస్తున్న డాక్టరు, పుష్ప ఏడుపు విని అక్కడి కొచ్చి “మళ్ళీ ఏమయింది ?” అన్నాడు.
“ఏం కాలేదు డాక్టర్… వాళ్ళ అక్కను చూసి ఏడుస్తున్నది” అని చెప్పింది టీచర్.
“తల్లి దండ్రిని పిలిపించమన్నా కదండీ..” అన్నాడాయన. “హాస్టలు పిల్లలు కదా డాక్టర్, తల్లిదండ్రులు ఊర్ల ఉంటరు.. రేపు పిలిపిద్దామండీ.. ఆ అమ్మాయి అక్క వచ్చింది. పద్మ అనీ.. హైస్కూల్లో చదువుతుంది” వివరించింది హెచ్చెమ్.
“ఓ.. పద్మా.. నాకెందుకు తెలవదు వాళ్ళ హాస్టల్ లీడర్ కదా..
సరే ఇంకా ఇద్దరు పేషెంట్లున్నారు, వాళ్ళయి పోయినంక నేను మట్లాడుతా.. భయమేమి లేదు” అంటూ వెళ్ళాడు డాక్టర్.
“నేనుంట మీరెళ్ళండి టీచర్” అని హెచ్చెమ్ పుష్ప వాళ్ళ టీచర్ను పంపించి అక్కడే కుర్చీలో కూర్చుంది.
అర్థగంట తరువాత డాక్టరు వచ్చాడు.
“ఆం.. పద్మా… చెప్పు.. ఈ అమ్మాయి మీ చెల్లెలా…” అన్నాడు.
“కాదు డాక్టర్.. మా అక్క బిడ్డ”
“వాళ్ళ నాన్న ఏమి పని చేస్తాడు ?”
“మా బావ లేడు, చచ్చిపోయిండు” అన్నది పద్మ.
“అయ్యో ఎట్ల చచ్చిపోయాడు..?
ఇంతకుముందు ఇట్ల ఎప్పుడైన ఫిట్సు వచ్చాయా?” సానుభూతిగా అన్నాడు డాక్టర్.
“నాకు తెలవదు డాక్టర్… ప్లీస్ బెటర్ టు అవాయిడ్ ద టాపిక్, బిఫోర్ ద కిడ్ డాక్టర్…” అన్నది చేతులు జోడించి..
“ఓకే.. ఐ అగ్రీ. రేపు సెలవే కదా.. రేపు మాట్లాడుదాము. పుష్ప కూడా ఇప్పుడు ఓకే. ఓకే కదా.. పుష్పా.. ఇంటికి పోతావా హాస్టల్ కు పోతావా..” అన్నాడు.
“ఇంటికే పోతా.. మా తాతొస్తడు సాయంత్రం. రేపు హోలి పండగ కదా..” అన్నది హుషారుగా.
“వెరీ గుడ్.. అయితే మీ తాతను నా దగ్గరకు తీసుకొస్తవా..”
“సరే డాక్టర్ ఇప్పుడు నేను స్కూల్ కు పోనా మరి… రా పద్దక్కా..” పద్మ చెయ్యి పట్టుకొని లాగింది.
“సరే డాక్టర్.. వెళ్ళొస్తాం..” అని చేతులు జోడించింది హెచ్చెమ్.
పద్మ కూడా “రేపు కలుస్తాను డాక్టర్..” అని నమస్కారం పెట్టింది..
ముగ్గురూ బయటకొచ్చారు..
దారిలో “డాక్టర్ తో భలేగా ధైర్యంగా ఇంగ్లీష్ మాట్లాడావు పద్మా.. భయం లేకుండా..” అన్నది..
“భయమెందుకు మేడం.. డాక్టర్ గారే మాకు మోటివేషనల్ క్లాసులు చెప్తారు..
స్పోకెన్ ఇంగ్లీషు కోసం ట్యూటర్ ని పెట్టారు… మమ్మల్ని చాలా ప్రోత్సాహిస్తారు కూడా..” చెప్తుండగా స్కూలొచ్చింది.
“వస్తా మేడం..” అంటూ తన స్కూల్ కు వెళ్ళింది పద్మ.
డాక్టర్ తో తనెందుకు మాట్లాడాలిసి వచ్చిందో గతం గుర్తు చేసుకుంది పద్మ..
*
తెలుగు రాష్ట్రాల్లో అతిసామాన్య మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఊరది. నాగరికతకు లోటు లేకున్నా మూఢనమ్మకాలకు దురలవాట్లకు అలవాటైన జనవాసం. రాజ్యాంగ సౌలభ్యాలు, రాజకీయ హామీలు నోచుకోని జాతిలో మనుషులు కొందరు.. శ్లేష్మంలో వాలిన ఈగల్లా.. కుడితిలో పడ్డ ఎలకల్లా.. జీవనారాట పోరులో కొనసాగుతున్నారు ఆ ఊర్లో. అందులో ఒక ఈగ వంటి, ఒక ఎలుక వంటి ఎరికలి నాంచారి అనే అర్భకురాలు. ఎరికల ఈరన్న, తిరుపతమ్మలకు పెద్ద బిడ్డ నాంచారి, చిన్నది పద్మ. నాంచారి పెనిమిటి ఏదులు. కాలం నాంచారి మొగణ్ణి దారుణంగా మింగింది. భర్త పోయినంక తన చిన్నబిడ్డ పుష్పని తన తల్లిదండ్రుల దగ్గర వదిలి పెట్టి కొడుకులను తీసుకొని ‘నసూర్లపాడు’, తన అత్తగారి ఊరికి పోయింది నాంచారి, నిజామాబాద్ జిల్లాలో ఒక పల్లెటూరది. మొదట్ల పుష్ప ఉషారుగనే ఉండేది. కానీ అప్పుడప్పుడు ఫిట్స్ వచ్చేది. మూర్ఛలు అనుకున్నరు. కానీ డాక్టర్లు మూర్చ కాదు అన్నారు.
ఒక శుక్రారం నాడు తిరపతమ్మ స్నానం చేసి అంతకు ముందు వారం ‘బాలగామ’కు పెట్టిన ఎర్రచీరకట్టుకుంది. బయట ఆడుకొని ఇంట్లకు అప్పుడే వచ్చిన పుష్ప, తన అమ్మమ్మను సూసి కెవ్వున అరిసి పడిపోయింది. మొకాన నీళ్ళు చల్లంగనే కండ్లు తెరిచి చూసి అరిసి మళ్ళీ పడిపోయింది. ఇట్ల ఒక్క రోజులనే ఆరుసార్లు అయింది. పిల్లకేదో గాలి తగిలిందని అనుకున్నది తిరపతమ్మ. ఒక సారి అరిసినప్పుడు వాంతి కూడా అయింది. చీరంత పాడయిందని, పిల్ల మూతి తుడిచి పండ పెట్టి, చీర ఇప్పి మరొక చీరకట్టుకొని వచ్చిందామె.
ఈసారి కళ్ళు తెరిసి సూసింది పుష్ప. మల్లీ ఫిట్స్ వస్తయేమో అని భయపడ్డది తిరుపతమ్మ. కానీ మల్ల రాలేదు. ప్రశాంతంగా నవ్వుకుంట కూసున్నది.
ఆరోజు ఈరన్న ఊళ్ళె లేడు. పిల్లలను హాస్టల్ కు పంపడానికి పట్నం పోయిండు.
సాయింత్రం ఈరన్న వచ్చినంక డాక్టర్ దగ్గరికి తీసకపోయి అంతా చెప్పిన్రు.
“అన్నిసార్లు ఎందుకు వచ్చాయి. ఏమన్న భయపడ్డదా.. తిండి తేడా వచ్చిందా..” అని అడిగిండు డాక్టర్ రమేష్.
“ఏంలేదు పప్పన్నం తనకిష్టం అదే తిన్నది. సంతోషంగా పలక మీద రాసుకునేది ఉన్నట్టుండి అట్లయింది” అన్నది తిరపతమ్మ.
వాల్ల పక్కింటామెకు జరమొచ్చిందని వచ్చింది అక్కడికి.. డాక్టర్ మాటలిని.. “బాలగావకు పెట్టిన చీర కట్టినవు ఒదినే పొద్దుగాల.. దేవత మాయనే అది.. మొక్కుకో ఒదినె, పిల్ల బాగయితది” అన్నది.
డాక్టర్ కసిరిండు “మీ మూఢ నమ్మకాలు అయ్యన్ని.. అదికాదు గని, అన్ని సార్లు ఫిట్స్ రాకూడదు. పరీక్షలు చేయించాలె.. పరీక్షలు రాస్తూన్న” అన్నడు.
సరే అని ఈరన్న అన్ని పరీక్షలు చేయించిండు. తెల్లారి రిపోర్టులు తీసుకొని మళ్ళా డాక్టర్ దగ్గరికి పోయిండు.
ఈరన్న తెచ్చిన రిపోర్ట్ లు డాక్టర్ చూసాడు.
“అన్నీ బాగున్నాయి. మరి అట్ల ఎందుకు జరిగిందో” అనుకుంటూ.. తన ఎదురుగా ఉన్న తన స్నేహితుడు డాక్టర్ ప్రసాద్ కు రిపోర్టులందించాడు. ఆయన హేతువాద నాయకుడు, మానవ హక్కుల కార్యకర్త. అన్నీ చూసి “రిపోర్టులన్నీ బాగున్నాయే…” అన్నాడు.
అక్కడే ఉన్న కంపౌండర్ “సార్ వాళ్ళ నాయినే పట్టుంటడు.. అర్థాంతరంగ సంపింన్రు కదా..” అన్నాడు.
అక్కడే ఉన్న కంపౌండర్ “సార్ వాళ్ళ నాయినే పట్టుంటడు.. అర్థాంతరంగ సంపింన్రు కదా..” అన్నాడు.
“నీ మొకం నోరు మూసుకో. నిన్నొకామె దేవతన్నది.. నువ్వేమో దయ్యమంటున్నావ్.. అసలు కారణం అంతుపట్టట్లేదు..” అన్నాడు డాక్టర్ రమేష్.
ఆయన స్నేహితుడు కలగజేసుకొని “మనం ఒక సారి వాళ్ళింటికి పోదాము. సైకలాజికల్ గా ఆ అమ్మాయిని ఏమి డిస్ట్రబ్ చేస్తున్నాయో చూద్దాము” అన్నాడు.
“సరే రేపు ఉదయం క్లినిక్కు వచ్చేటప్పుడు పోదాము,
ఉదయం తొమ్మిదిన్నరకు నీ దగ్గరకు వస్తాము మీ ఇల్లెక్కడ” అని అడిగాడు ఈరన్నను.
“ముత్త్యాలమ్మ గుడి దాటిన తర్వాత కుడిపక్క మొదటిల్లు డాక్టర్. పెద్ద ఏపచెట్టుంటది మా ఇంటి ముందల..” ఈరన్న చెప్పిండు.
*
అన్నట్టుగానే తెల్లవారి పొద్దునే ఇద్దరు డాక్టర్లు ఈరన్న ఇంటికి వెళ్ళారు.
అంతా ప్రశాంతంగా ఉంది. శుభ్రంగా కూడా ఉన్నది. పందుల పెంపకం పై ఆధారపడే ఎరుకల కులం అయినా శుభ్రంగానే ఉన్నది.
గుడిసె లోపల బయిట కూడా.. అమ్మాయి అనారోగ్యానికి
కారణాలేవీ కనపడలేదు.
పుష్ప వాకిట్ల ఆగిన కారును చూసి కేకేసి పడిపోయింది.
“అగో మళ్ళీ ఫిట్స్ వచ్చినయి..” అని ఈరన్న పిల్లను ఎత్తుకొచ్చి మంచంల పండేసి నీళ్లు చల్లిండు. కొద్ది సేపటికి కళ్ళు తెరిచి చూసి నవ్వింది. “ఇపుడెట్లున్నదమ్మా..” అన్న డాక్టర్లతో..
‘బాగానే ఉన్న..’ అన్నట్టు తలూపింది… నెమ్మదిగి లేచి కూర్చున్నది.
ఇదేం వింతో అంతు పట్టట్లేదు.
“సరే మేము బయిల్దేరతము..” అని డాక్టర్లిద్దరూ బయిటికి వచ్చారు. వాళ్ళతో పాటు ఈరన్న కూడా వచ్చాడు.
తాతెనక బయటకు వచ్చిన పుష్ప మళ్ళీ ఫిట్సు వచ్చి పడి పోయింది. అందరు వెనక్కి వచ్చారు… డాక్టర్ ప్రసాద్ గమనించాడు.
కారును చూసి పుష్ప కేకేసి పడి పోయింది. నీళ్ళు చల్లి లేపారు ఆమెను.
‘తాతను పిల్లనెత్తుకొని బయటకు పొమ్మన్నారు’.
పుష్పనెత్తుకొని నడుస్తున్న తాతను గట్టిగ పట్టుకొని వాకిట్లకు సూసి గట్టిగ అరిసి స్పృహ తప్పింది.
డాక్టర్ ప్రసాద్ కు ఈ సారి విషయం అర్థమయింది..
“సరే మేము వెళ్ళిన తర్వాత నీళ్ళు చల్లి లేపవయ్యా… సాయంత్రం దావఖానాకు తీసుకురా మందులిస్తాడు డాక్టర్..” అన్నాడు ప్రసాద్.
డాక్టర్ రమేషుకిదంతా గందరగోళం అనిపించినా, ఈరన్న ముందు ఏమీ మాట్లడకుండా బయటకు నడిచాడు..
ఇద్దరూ కారులో కూర్చున్న తరువాత ప్రసాద్ వివరించాడు. “మన కారు రంగును చూసి భయపడింది.. ఆ అమ్మాయికి ‘ఎరిథ్రో ఫోబియా’.. ” అన్నాడు..
“ఎరిథ్రో ఫోబియా.. అంటే..? ఎక్కడో చదివినట్టు గుర్తు.. వివరంగా చెప్పు” రమేష్ ఆలోచిస్తూ అన్నాడు.
“కొందరికి కొన్ని రంగులంటే భయం వుంటుంది. కారణాలు అనేకం… ‘ఎరిథ్రో ఫోబియా’ ఉన్న వాళ్ళు ఎరుపురంగంటే భయపడతారు…” కారణం చెప్పాడు ప్రసాద్.
“నిజమే ఆమె తండ్రి హత్య జరిగిందని, చనిపోయి రక్తంలో పడున్న తండ్రిని చూసినప్పుడు మొదటి సారి ఫిట్స్ వచ్చినాయని, వాళ్ళ తాత ఈరన్న చెప్పాడు..” గుర్తు చేసుకున్నాడు డాక్టర్ రమేష్. మళ్ళీ తనే “మరిప్పుడు ఏమి చెయ్యాలి, పట్నం తీసుక పొమ్మని చెప్పనా..” అనడిగాడు స్నేహితుణ్ణి.
“అవసరంలేదు.. ప్రమాదం ఏమీ లేదు. కొంచం వయసు పెరిగిన తర్వాత సరైన కౌన్సిలింగ్ తోపాటు.. మెడికేషన్ తో తగ్గించవచ్చు. అంత వరకు ఆ రంగు చూడకుండా ఉండేటట్టు జాగ్రత్త పడితే సరిపోతుంది.. అరెరె.. కారాపు నేను దిగాలిక్కడ..” అన్నాడు ప్రసాద్.
డాక్టర్ రమేష్ మిత్రుణ్ణి దింపి ముందుకు సాగాడు.
ఆరోజు సాయంత్రం ఈరన్నకు విషయాలన్నీ వివరించాడు డాక్టర్ రమేష్. అప్పట్నించి మళ్ళీ పుష్పకు ఫిట్స్ రాలేదు..
ఈరోజు స్కూల్లో. ఆ ఎర్ర రంగు నీళ్ళు చూసి మళ్ళా ఫిట్స్ వచ్చినయి.
ఈ సంగతులన్నీ పద్మకు కూడా తెలుసు. అందుకే డాక్టరుతో అట్లా మాట్లాడింది..
తెల్లారి డాక్టర్ సుధాకర్ హాస్టల్ కు వచ్చినప్పుడు పద్మను అడిగాడు.. “పుష్ప సంగతి ఏమిటమ్మా పద్మా..” అంటూ..
పద్మ కొంత టూకీగా చెప్పి.. “మీకొక విచిత్రం చూపిస్తాను డాక్టర్. ఎల్లుండి మా నాన్న వస్తాడు. ఇద్దరం. కలిసి మీ దగ్గరికి వస్తాము” అన్నది.
మిగిలిన పిల్లల ముందు ఆ విషయం మాట్లాడటం ఇష్టంలేక. అది గమనించిన డాక్టర్ సుధాకర్ ఇంకేమీ అడగలేదు.
*
అన్నట్టుగానే మూడురోజుల తర్వాత తండ్రితో కలిసి డాక్టర్ సుధాకర్ దగ్గరికి వెళ్ళింది పద్మ. చేతిలో ఒక లావుపాటి నోట్ బుక్ తీసుకొని.
గ్లాస్ చాంబర్ నుండి వాళ్ళను చూసి… పేషంట్లను ఒక్క నిమిషం ఆగమని, వాళ్ళను లోపలికి పిలిచాడు డాక్టర్ సుధాకర్..
ఇద్దరూ డాక్టర్ కి నమస్కరించారు.
“మీ పద్మ చాలా తెలివైనదయ్యా బాగా చదివించాలి…” అన్నాడు.
“మీ అందరి ఆశీర్వాదంతో తప్పకుండ చదివిస్తా డాక్టర్..” అన్నడు ఈరన్న.
“ఆం.. పద్మా మీ పుష్ప ఎట్లున్నది..”
“బాగుంది.. బడిల తోలొచ్చిన డాక్టర్” అన్నడు తండ్రి.
“చెప్పు పద్మా.. ఏదో విచిత్రం అన్నావు.. పుష్ప సంగతేమిటి..” డాక్టర్ కుతూహలంగా అన్నాడు.
“మీ అన్ని ప్రశ్నలకు ఈ పుస్తకంలో సమాధానాలున్నాయి సార్.. మా నాన్న చెప్తుంటే నేను రాశాను. మీరు చదవండి… ఇదొక జాతి జీవిత చరిత్ర..” అన్నది ఉద్వేగంగా..
ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకొని పేరు చూశాడు… ‘ఎర్రరంగు బురద’ గుండ్రటి అక్షరాలు ముత్యాలు పేర్చినట్టున్నాయి.
“నీ హాండ్ రైటింగ్ చాలా బాగుంది పద్మా.. తప్పకుండా సాయంత్రమే చదవడం మొదలు పెడతా.. చదివిన తరువాతే మాట్లాడుతాను” అన్నాడు డాక్టర్..
తండ్రీ బిడ్డలు ఆయనకు నమస్కారం పెట్టి బయటకొచ్చారు.
క్లినిక్ నుండి వచ్చిన డాక్టర్ ఆ రోజు క్లబ్బుకు వెళ్ళలేదు..
త్వరగా భోజనం ముగించి పద్మ ఇచ్చిన పుస్తకం చదవడం మొదలు పెట్టాడు.
**
అదొక పూరిగుడిసె వంటి, ఒంటి నిట్టాడు ఇల్లం. ఇంటి చుట్టూ చెట్ల మీద పచ్చులన్నీ రకరకాలుగా అరుస్తున్నయి.. పక్కనే పందుల గుడెసెల గున్నలు గుర్ గుర్ అంట అడ్డం పెట్టిన రాయిని ముట్టెలతో నెడ్తన్నయి. రాయిని నెట్టడానికి వాటిబలం సరిపోట్లేదు.. కోళ్ళ గూళ్ళ నుంచి గోలగోలగా అలుపులు మొదలైనయి.. మబ్బుల్ని తోసుకుంట సూర్యుడు తొంగిచూస్తున్నడు..
అప్పుడే లేసిన తండ్రీ కొడుకులు పందుం పుల్లేసుకొని, గుడిసె సూరు కింద అరుగు మీద కాళ్ళమీద కూసొని ఉన్నరు. తండ్రి సంగడు, వాని కొడుకు ఎంకడు.
“అయ్యా వాడు నిన్ను తిడతాండే ..” కొడుకు.
“కొత్తేంది కొడకా..” తండ్రి.
“కానీ.. నాకు అవమానమయితాందే.. దోస్తుల ముందల తల కొట్టేసినట్టయితాంది..” కొడుకు.
“నాకు సుత గట్లనే ఉన్నది. వాడి కూతలు తిట్లు నాకేమన్న సంబరం ఐయితందనుకున్నవా..” తండ్రి.
“తెర్లి తెర్లి గుచ్చుకుంటున్నయి.. కంటి మీద నిద్ర లేకుండయ్యింది” కొడుకు.
“వానికి అన్నాయమయింది.. మనవల్ల వాని తల్లి సచ్చిందని కోపం.. కడుపు మంటకు అనే మాటలు పట్టిచ్చుకోకు కొడకా..” అనుకుంట గుడిసెల నుంచి జాలారికెల్లి పోయింది ఆడమనిసి..
“గుడెసెకు అడ్డమున్న చెట్టును కొట్టేద్దామయ్యా..” అన్నడు కొడుకు.
మడతేసి కూసున్న తండ్రి కాలు ఒక్క సారి సాగింది.
బిత్తర చూపులు చూసిండు, ఎవరన్న ఇన్నరా అని.. కొడుకు మొగంకేసీ ఓపాలి సూసి.. లేసి పార పోయిండు తండ్రి.
కొడుకు కాసేపు ఆడ్నే కూసోని నెత్తిగోక్కుంట లేసి గోలెం కాడికి పోయిండు. జాలాట్లున్న తల్లి తన మాటిన్నదేమోనని.. తల్లిని పరికించిండు. తలొంచుకొని తల్లెలు తోముతాందంటే, ఇనలేదన్న ధైర్యంతో బైటకు నడిచిండు కొడుకు.
*
ఊరంత ఎవలి పనిల వాల్లున్నరు… అంబటాలయింది.
“మా అమ్మను సంప్పిండు, మరోదాన్ని మరిగి మాకు తల్లి లేకుంట సేసిండు…. మా అక్కను బొంబయికి తోలిండు.. నేనేకాకినయిన.. నాకు దిక్కూ లేకుంటయింది” సగం మత్తుల గునుక్కుంటాడు ఏదులు.
గుడిసె నిట్టాడికి ఆనుకుని కూసున్నా, పక్కకు ఒరుగుతాండు..
“ఎన్ని పొద్దులు దుఃఖ పడతవు ఊకో యయ్యి.. నీకు ముగ్గురు పిల్లలయిన్రు కదా! నువ్వొంటరోనివెట్లయితవు.. ఊకో యయ్యి” అనుకుంట.. పొయ్యి కాడ కూసున్న ఏదులు భార్య మొగని కోసం తల్లెల ఉడుకుడుకు అన్నం ఏసుకొచ్చి ముందల పెట్టింది. రాతెండి సెంబుల నీళ్ళు తెచ్చి తల్లె దగ్గర పెట్టింది. పాలు తాగే పిల్లను వల్లేసుకుని ఏదులు పక్కనే కూసున్నది. ‘తల్లి తర్వాత తల్లోలె ఆకలి దూప అరుసుకొనేదే ఆలి’ అనే మాటను నమ్మింది నాంచారి.
“మనకొక కుటుంబమున్నది నీసుట్టు నీ బలగమున్నది. నువ్విట్ట దుఃఖపడితే పిల్లలు బెంగటిల్తన్రు. నాకు బుగులయితంది” అన్నది.
“నా దుఃఖం మరవలేనిది.. మా అవ్వ అన్నాయంగ సచ్చిపోయింది. మా అయ్య ఆ మచ్చల పొట్టిదానితోనే ఉండేటోడు. మా అవ్వ ఆ మనాదిల… మొగని అన్నాయం ఎవరికి సెప్పలేక కుమిలి కుమిలి పోయేటిది. ‘మనోవ్యాధిని మించి మరణం లేదన్నట్టు’ ఆ మనాదితోటే చేదగ్గు రోగమొచ్చింది.. మంచినాడే మంచి చెడ్డ అరుసుకోని మా అయ్య రోగ మొచ్చినంక ఆయింత ఇంటికొచ్చుడే మరిసి పోయిండు, మా పెద్దక్క బువ్వండి పెడుతుండె… ఈతాకు సమురుకొస్తుండె. మా అమ్మ మంచంల కెల్లి లేవకుంటయినంక. మీ నాయిన, అమ్మమ్మ వచ్చి దావఖాన్ల సెరీకు చేసిన్రు.. అప్పటికే రోగం ముదిరింది లాభం లేదన్నరు డాక్టర్లు, ఇంటికి గొంచబొమ్మన్నరు. ఇంటికి తెచ్చినంక నెలరోజులు నవిసి నవిసి పేగులు బయటికొచ్చేట్టు దగ్గి దగ్గి ఊపిరొదిలింది. మా అవ్వ… మామే దానం చేసిండు. అవ్వ సచ్చిన మూడోనాడొచ్చిండు కఠినాత్ముడు మాయయ్య. పాపిష్టోడు.. నల్ల బండరాయి గుండె వానిది. మా అవ్వను పొట్టన పెట్టుకున్నడు.. కాదు కాదు వాని సుఖానికి మా అవ్వను బలిచ్చిండు. మమ్ముల దిక్కులేని పచ్చుల చేసిండు. వాన్ని సంపుత ఎప్పటికైనా.. నా సేతులనే వాని సావు..” తనల తను మాట్లాడుకున్నట్టు మాట్లాడుతున్నడు ఏదులు.
పక్కనే కూసున్న పెళ్ళాం ఒల్లె ఉన్న పిల్లను పక్కకు జరిపి, మొగని కండ్ల నీళ్ళు తుడిసింది…
“అత్తకు జరిగింది అన్నాలమే గని, నా బిడ్డలకు, నాకు అన్నాయం సేస్తవా… మీ అయ్యను సంపి నువు జైలుకు పోతే.. మాగతేంది ? నేను, నా పిల్లలు దిక్కు లేనోల్లం అయితం. జర సోంచాయించు.. నీ కొడుకు సుత నీ ఓతిగ మనాది పడడా…. మనసు శాంతం జేసుకో ఆడదాని మాటేంది ఇనేది అనుకోకు.. జర చిత్తంబెట్టి ఇచారించు.. ఊరటిల్లు.. గుండె ధైర్యం తెచ్చుకో… మా మొగం చూడు.. నీకేమన్నయితే నేను పిల్లలు ఏం కావాలే.. మనాది ఒదిలి ఓ ముద్ద సోరు కుడువయ్యా..” అని అన్నం తల్లె చేతులకు తీసుకుని అన్నం కలిపి ముద్ద జేసి మొగని నోటికందించింది.
తలకాయ పక్కకు తిప్పుకున్నడు ఏదులు దుఃఖంతో..
“నీ బాంచెనయిత జరంత సోరుకుడు..” అంట బలవంతంగా రెండుముద్దలు తినిపిచ్చింది. మంచి నీల్లు తాగిచ్చి, “జర చల్లబడు… శాంతంగుండు.. కాసేపు అట్ట పండు..” అన్నది.
ఏదులు లేసి గుడిసె బయిటికెల్ల బారిండు. సంగడి మొదటి పెళ్ళాం కొడుకు ఏదులు.
* * *
ఎండ మటమట లాడుతాంది. పొద్దు నెత్తి మీదికెక్కింది. ఏదులు ఆలోచిస్త అడుగులేస్తున్నడు. నిజమే తన పెండ్లం చెప్పినట్టు… తనకు తండ్రికి తేడా ఏమున్నది. ఏదో అఘాయిత్యం చేసి తను జైలుకు పోతే పిల్లల గతేంది.. తనకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ. వాళ్ల మంచి చెడు ఎవరు సూత్తరు. తన కొడుకులు సుత తనోతిగనే దుఃఖ పడతరు కదా.. అనుకున్నడు. ఆలోచిస్తూ నడుస్తున్న ఏదులు చెరువు గట్టుకు చేరిండు. చెరువుకు దిగువన, చెరువు కట్టెమ్మటి, జెండా పండగకు సోల్పుగ బడిపిల్లలు నించున్నట్టు వరసగ ఈత చెట్లున్నయి. రొంటిల దోపిన వంక కత్తితీసి ఈతమట్టలు చెలిగి మోపు కోసం కుప్పేసిండు. పక్కనే వరిపొలం గట్ల మీదన్న దుస్సేరు తీగలు మరిన్ని చెలిగి ఈత మోపు మీదేసిండు. రెండు తీగలు తీసి మోపు గట్టిండు. ఇంక జరంత ముందుకు నడిచి ముదిరిన సర్కారు తుమ్మలల్ల రాగోల తీరున్నదాన్ని ఎంచుకొని నరికిండు.. ఆ కొమ్మకున్న ముళ్ళను ఆకులను చెలిగి నున్నగా రాగోల తయారు చేసి ఈతమట్టల మోపుకు గుచ్చిండు, అమాంతం లేపి భుజానేసుకుని ఇంటి దారి పట్టిండు. ఎంత మోర్దోపుగ ఆలోసించిన ఇన్ని దినాలు. అయ్య మీది కోపంతోని, నా బిడ్డల అనాధల సేసుకుందును వుత్తపున్నానికి…. అనుకుంట ఇంటి దారిపట్టిండు.
మాట్లాడకుండా ఇంట్ల నుంచి బయటకు పోయిన ఏదులు యాడ తాగొచ్చి ఎంత లొల్లిసేస్తడోనని బిక్కు బిక్కు మనుకుంట కూసున్నది ఏదులు పెండ్లాము నాంచారి. అల్లంత దూరాన ఏదుల్ని సూసి దమ్ము తీసి వదిలింది గుండెలనిండా.. ఉప్పుస తీరిందామెకు. “దేవుడా.. ఎంకన్నసామీ..” అంట రెండు చేతులెత్తి మొక్కింది.
నెత్తి పట్టుకొని కూసున్నదల్లా ఏదులొచ్చేది చూసి దిగ్గున లేసి గుడిసెలకు పోయి రాతెండి లోటతో కుండల నీళ్లు ముంచుకొచ్చి మొగనికి అందిచ్చింది “ఎంటోసునవే.. జర తెన్నికుడు” అంట. (ఎక్కడికి పొయినవే.. గిన్ని నీల్లు తాగు)
ఎండకు అలిసి పోయిండో.. ఆలోచనలకు గొంతు తడారిపోయిందో.. ఎత్తిన లోట దించకుండా నీళ్లన్నీ తాగి ఖాళీ లోటా అరుగు మీద పెట్టి, అక్కడే కూలబడ్డడు ఏదులు.
నాంచారి గుడిసెలకు దూరి పొయిల కట్టెలు ఎగేస్తంది.. బయటి నుంచి పెద్ద పెద్ద అరుపులు వినపడ్డయి..
——–సశేషం——