అలల హొయలున్నాయి అలజడి ఉంది
తీరం వెంట పడి లేచే ఉరుకులు పరుగుల్లో ఉత్సాహం ఉంది
ఒడ్డుకు కొట్టుకొని ముందుకు వెళ్లలేని అసహాయత ఉంది
కొండ అడ్డంగా వస్తే చుట్టూ తిరిగి
కదలి వెళ్లే నేర్పరితనం ఉంది
అడ్డంకులు అధిగమించే సాహసం ఉంది
కెరటాల గమకాల్లో శ్రావ్య సంగీతం ఉంది
చెప్పలేని ఏదో బాధల హోరు ఉంది
వెలుగును వెన్నెలను తాగి ఊగుతుంది
వేదనలు దాచుకోలేక
అప్పుడప్పుడు మూలుగుతుంది
భీష్మ గ్రీష్మం చురుకైనప్పుడు వీచికాంతరంగాన్ని మూసుకొని శోషిల్లుతుం ది
వర్ష హర్షం చినుకైనప్పుడు తరంగాల గంతులు వేస్తుంది
హేమంత శిశిరాలు సమీపిస్తే
కాలోర్మికలతో జోకొడుతూ సహిస్తుంది
అన్ని ఋతువుల్లోనూ అదే నడక
ప్రవాహం లయాత్మకం
ప్రయాణం ఆపదు
గమనం ఆగదు
ప్రవాహమే జీవితం
జీవితమే కాల ప్రవాహం
వెలుగు వెంట చీకటి ,చీకటి వెంట వెలుగు
వినోద విషాదాల సమ్మే లనమే జీవనం.
Jyostna Prabha
ఆ కలం జన గణాలకు జయకేతనమైంది
అతడు అడుగుపెట్టిన చోటు శాంతినికేతనమైంది
విశ్వాన్ని వెలిగించిన రవీంద్రుడు
కవిత్వాన్ని శ్వాసించిన
విశ్వకవీంద్రుడు .
అతడి కోసం నీలి మేఘాలు తేలి వచ్చాయి
వర్షంగా కురవడానికో
తూఫాన్ గా భయపెట్టడానికో కాదు
అతని జీవన సంధ్యా రేఖను వర్ణమయం చేయడానికి..
నిద్రించి కలగన్నాడు
జీవితమంటే సంతోషమేనని
మేలుకొని తెలుసుకున్నాడు
జీవితమంటే ” సేవేనని”..
ఎక్కడ మనసుకు భయం ఉండదో
ఎక్కడ శిరస్సు సమున్నతంగా నిలబెడతామో
ఎక్కడ జ్ఞానానికి స్వేచ్ఛ ఉందో
అక్కడ స్వాతంత్ర్యం పరిమళిస్తుందన్నాడు
కడలి అలలను చూస్తూ కలవరపడక
.కడదాకా ఈది
ఆవలి గట్టును చేరుకోవాలన్నాడు
చిగురాకులపై నర్తించే మం చు బిందువుగా
కాలమనే అంచులపై కదలి సాగమన్నాడు
అతడు ఆత్మవిశ్వాసాన్ని అనుశాసించాడు
అతడు ఆధ్యాత్మికతను ఆస్వాదించాడు
అందరి మనసులో అమరుడైనాడు
హృదయాన్ని గీతాంజలిగా అక్షరీకరించాడు
అందరి హృదయాంజలి అందుకొన్నాడు.
ఒక వేకువ ఉదా రంగు కిరణమై
హృదయంలో నాదం మోగిస్తుంది
ఒక నీలిమ అనంత ఆకాశమై
మనసులో ప్రశాంత భావాన్ని మీటుతుంది
ఒక గాఢ నీలం విశాల సంద్రమై
వేయి కెరటాలుగా సంచలిస్తుంది
ఆకుపచ్చదనం అవనిపై పరిచిన వృక్షజాలమై
ఆహ్లాదాన్ని పెంచుతుంది
ఒక పసిమివర్ణం తీయని ఆమ్రమై
మాధుర్యం పంచుతుంది
ఒక నారింజ రంగు సాయం సంధ్యా కిరణమై
వేయి రాగాలు దిద్దుతుంది.
ఒక రక్త వర్ణం అనురాగమై
అంత రంగాలను స్పృశిస్తుంది
ప్రపంచమంతా సప్త వర్ణమయం
ఇది హోలీ ఇది వసంతోత్సవం.
ఇది ఆమని పలకరింత.
ఒక్కో వర్ణం జీవితాన్ని రంగులమయం చేస్తుంది
విషాద ని శీధాలను వదలి వేస్తూ ఉల్లాస ఉదయాలకు ఊపిరి పోస్తూ
ప్రతి ఏటా ఉత్సాహం పంచుతుంది హోలీ బ్రతుకులు రాగరంజితం చేసుకోమంటుంది ఈ రంగుల కేళి.