ఉగ్రవాదం ఓ ఉప్పెన
తీవ్రవాదం తీరొక్క హింస
ఆశ నిరాశల మధ్య కొట్టుకలాడే రక్తదాహం
ఆశ చిగురిస్తూ నిరాశ అంతమవుతుంది
శాంతి వెల్లివిరుస్తూ ఆగ్రహం చప్పున చల్లారుతుంది
ఆకాశంలో ఎగురుతున్న రాబందు రెక్క తెగిపడుతుంది
సముద్రంలో ఈదులాడుతున్న సొరచేప వలకు చిక్కుతుంది
ఆకాంక్షల చుక్కానికి తీరం అందుతుంది
ఆతీయతకు లైట్ హౌజ్ దారి చూపుతుంది
రాతియుగపు పనిముట్లలో మనం ఆనవాళ్లు వెతుక్కుంటాము
ఆరుద్ర పురుగుల్లో పర్యావరణపు ఆచూకిని శోధిస్తుంటాము
వెలుగు మన ముఖం మీదకు ప్రసరిస్తుంటుంది
కళ్లు పెద్దవై చూపును సారిస్తుంది
అనేకానేక సూర్యుళ్లు దారి చూపిస్తుంటాయి
కళ్ల కింద నేల తన్మయత్వంతో ముద్దాడుతుంటుంది
రాలుతున్న నీటిబిందువుల్లా చెట్లపైని
ఆకులు ఒకటొకటి రాలుతూ జీవితాన్ని ఎరుకపరుస్తుంటుంది
దూరంగా ఓ గది మనకోసం ఎదురుచూస్తుంటుంది
సగం తెరచిన తలుపు నుంచి ఆత్మీయహస్తం చాస్తుంది
సమస్త విశ్వంలోకి మనల్ని లాక్కుంటూ
మానవ నాగరికతను మనముందు ఆవిష్కరిస్తుంది
నింగి నేల నీరు విప్పారిన దేహమవుతుంది
ఈ కవిత నా సొంతం. దేనికి అనుకరణ, అనువాదం కాదు. ఇంతవరకు ఏ పత్రికలోనూ. అంతర్జాల పత్రికలలోనూ ప్రచురితంగానీ, పరిశీలనలోగానీ లేదు.
నాగురించి
జీవితమే కవిత్వమని విశ్వసించే నేను ఈనాడు, వార్త, మన తెలంగాణ తదితర దినపత్రికలలో వివిధ హోదాల్లో రిపోర్టర్ గా పనిచేశాను. 2014లో ’సగం సగం కలసి‘ కవితా సంపుటిని, 2020లో ’కరోనా@లాక్ డౌన్.360 డిగ్రీస్‘ పేరుతో 59 వ్యాసాలతో కూడిన సంపుటిని వెలువరించాను. ప్రస్తుతం సాంఘిక, భౌగోళిక, రాజకీయ చరిత్రతో కూడిన శాసనసభ నియోజకవర్గాలతో కూడిన పుస్తకాలను వెలువరించడంలో నిమగ్ నమయ్యాను. ఇప్పటికే హైదరాబాద్ లోని ’అంబర్ పేటః ఆకాశానికి పూసిన మందారం‘ పేరిట పస్తకం 2019లో వెలువడింది. ముషీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి త్ వరలో వెలువడనుంది. అలాగే మరో కవితా సంపుటి రానుంది.