ఈరోజు వివేకానంద స్వామి వర్ధంతి.ఆధ్యాత్మిక భాష లో చెప్పాలంటే మహా సమాధి లోనికి ప్రవేశించిన రోజు.ఈ సందర్భంగా ఆయన రాసిన ఓ వ్యాసం అనువాదం చేయాలనిపించింది.అది యూరపు ఖండం గురించినది,ఇంకా ముఖ్యం గా చెప్పాలంటే పారిస్ నగరం గురించినది.ఆయన చికాగో ఉపన్యాసం నిమిత్తం అమెరికా కి మాత్రమే ప్రయాణించినట్లు చాలా మందికి తెలుసు కాని యూరపు లోని పలు దేశాల్లో కూడా ఆ తర్వాత పర్యటించారు. చాలా ఆసక్తికరం గా అనిపించింది. మరి అనువాదం లోపలికి వెళదామా..! సరే…!!
* * *
“అసలు యూరప్ అంటే ఏమిటి..? ఎందుకని నల్లని వారు,కాంస్య,పసుపు రంగుల లో ఉన్నవారు,ఆసియా,ఆఫ్రికా,అమెరికా ఖండాల లో ఉన్న సమస్త నివాసితులు ఈ యూరోపియన్ల కి తలవంచారు..? ఈ కలియుగం లో ఎందుకని వీరు తిరుగులేని పాలకులయ్యారు..? ఈ యూరప్ ని అర్ధం చేసుకోవాలంటే ముందు ఫ్రాన్స్ ని అర్ధం చేసుకోవాలి.అవును దాని ద్వారానే రావాలి. పశ్చిమ దేశాల్లోని ప్రతి సమున్నత భావం ఇక్కడ అత్యున్నత స్థాయిని చేరుకుంది.ప్రపంచాన్ని శాసించే గొప్ప శక్తి యూరప్ అయితే దానిలోని ప్రధాన కేంద్రం పారిస్ నగరం.పాశ్చాత్య సంస్కృతి కి పట్టుగొమ్మ.
యూరపు కి సంబంధించిన నైతిక విషయాలు,మర్యాదలు,ఆచారాలు ఇంకా మంచీ చెడు వెలుగు చీకటి అన్నీ కూడా ఇక్కడ ఫలప్రద దశ ని పొందాయి.ఇది ఒక మహా సముద్రం వంటిది.దీనిలోపల ఎంతో విలువైన వజ్రాలు,పగడాలు,ముత్యాలు ఉన్నాయి.అదే విధంగా భయంకరమైన సముద్రజీవాలు,షార్క్ లు వంటివీ ఉన్నాయి. ఈ ఖండం అంతటికి కర్మ క్షేత్రం వంటిది ఫ్రాన్స్ దేశం.
చిత్తరువు లా తీర్చిదిద్దినట్లు ఉండే దేశం ఇది.మరీ చల్ల గా గానీ,మరీ వేడి గా గానీ ఉండదు.సారవంతమైన నేల.ఆకాశం నిర్మలం గా ఉండి,సూర్యుడు ఎంతో హాయి గా అనిపిస్తాడు. ఓక్,ఎల్మ్ వృక్షాలు విరివిగా ఉంటాయి.గడ్డి భూములు,మనోహరమైన పర్వతాలు, పారే సెలయేళ్ళు ఎంతో అందం గా ఉంటాయి. చైనా లోని కొన్ని ప్రాంతాల్లో తప్పా ఇంత అందమైన దేశాన్ని నేను ఎక్కడా చూడలేదు. ఆ నీటి లోని సౌందర్యం,ఆ భూమి లోని మోహ భావం,ఆ గాలి లోని వెర్రితనం, ఆ ఆకాశం లోని ఉన్మత్త ఆనందం…ఆహా..!
ధనికులు,పేదలు ఇంకా యువకులు వృద్ధులు అందరూ తమ ఇళ్ళని,గదులని,వీథులని,తోటలని,ఇతర ప్రదేశాల్ని ఎంతో అందం గా,కళాత్మకం గా ఉంచుకుంటారు.మొత్తం దేశం అంతా కూడా చిత్తరువు లా ఉంటుంది. ప్రకృతి పట్ల,కళ పట్ల అటువంటి ప్రేమ ని ఒక్క జపాన్ లో తప్పా ఇంకెక్కడా నేను చూడలేదు.మహా నిర్మాణాలు ,తోటలు ఇంద్రుడి స్వర్గాన్నే తలపిస్తాయి. రైతులు పండిచే ఆ భూముల్లో కూడా…ప్రతి దాంట్లోనూ ఒక కళాత్మకతని ప్రయత్నించి సఫలమయ్యారు.
పారిస్ నగరం యూరపు ఖండ నాగరికత కి అత్యున్నత శిఖరం.గంగా నదికి గోముఖి ఎలాగో అలా.ఆ మహా నగరం ఎల్లవేళలా ఆనందం తో పొంగిపొర్లుతూ భూమి మీద స్వర్గం లా ఉంటుంది.లండన్ లో గాని,బెర్లిన్ లో గాని ఇంకెక్కడ గాని అలాంటి విలాసవంతమైన,ఆనందకరమైన జీవనం మనకి కనబడదు.అయితే ఒకటి నిజం…లండన్ లోనూ,న్యూయార్క్ లోనూ అపారమైన సంపద ఉన్నది.బెర్లిన్ లో గొప్ప జ్ఞాన సంపద ఉన్నది. అయితే వాటిల్లో ఎక్కడా ఫ్రాన్స్ వంటి నేల లేదు,ఫ్రెంచ్ వారిలో ఉండే జీనియస్ లేదు.సమృద్ధి గా ధనం ఉండవచ్చు గాక,జ్ఞానం ఉండవచ్చుగాక,ప్రకృతి సౌందర్యం ఉండవచ్చు గాక…కానీ మనిషి అనే వాడు ఎక్కడ..?
ప్రాచీన గ్రీకు ల యొక్క అంశయే ఈ ఫ్రెంచ్ ప్రజల్లో ఉన్నది. అప్పుడు మరణించి మళ్ళీ వీరి లో మొలకెత్తింది. ఎప్పుడూ సంతోషం గానూ,ఉత్సాహం గానూ ఉంటారు.దేనిపట్ల పట్టింపులేనట్లు గానూ,సిల్లీ గానూ ఉంటారు.మళ్ళీ కొన్నిసార్లు చాలా విచారం గానూ,పట్టింపు ఉన్నట్లు గానూ,ప్రతి పని పట్టుదల తో చేయాలనట్లు గా ఉంటారు.ఏ మాత్రం ఎదురుదెబ్బ వచ్చినా నిరుత్సాహం గా అయిపోతారు.అయితే ఆ నిరుత్సాహం కాసేపు మాత్రమే,మళ్ళీ ఆ ఫ్రెంచ్ వ్యక్తి మొహం కొత్త ఆశ,నమ్మకం తో కళకళ వెలుగులీనుతుంది.
యూరపు లోని యూనివర్సిటీలు అన్నిటికీ పారిస్ యూనివర్సిటీ యే మోడల్ అని చెప్పాలి.ప్రపంచం లోని అన్ని వైజ్ఞానిక అకాడెమీ లు ఫ్రెంచ్ అకాడెమీ కి అనుకరణలే.వలస దేశాల్లో సామ్రాజ్యాల్ని ఏర్పరచడం లో తొలిగురువు ఫ్రాన్స్ దేశమే.మిలటరీ,ఆర్ట్ విషయా ల్లో ఉపయోగించే పదసంపద చాలా వరకు ఫ్రెంచ్ పదాలే.చాలా యూరోపియన్ భాషల్లో ఉపయోగించే శైలీ విలాసం,పద బంధాలు ఫ్రెంచ్ భాష లో నుంచి తీసుకున్నవే.సైన్స్,తత్వశాస్త్రం,కళలు వంటి విషయాల్లో పారిస్ ఒక గని వంటిది అని చెప్పాలి.
ప్రతి చోట ఫ్రెంచ్ వారి నుంచి తీసుకున్న అనుకరణలు కనిపిస్తాయి.ఆయా విషయాల్లో ఫ్రెంచ్ వారు పట్టణ ప్రజలు కాగా మిగతా వారు గ్రామీణులు అనవచ్చు.ఫ్రెంచ్ వాళ్ళు ప్రారంభించినదాన్ని జెర్మన్లు,ఇంగ్లీష్ వాళ్ళు అనుకరిస్తుంటారు.అది యాభై ఏళ్ళ తర్వాత కావచ్చు, ఇరవై ఏళ్ళ తర్వాత కావచ్చు, విద్య లో గాని, సాంఘిక విషయాల్లో గాని, కళ ల్లో గాని…జరిగేది అదే..!
స్కాటిష్ రాజు ఇంగ్లండ్ కి రాజు అయినపుడు ఈ ఫ్రెంచ్ నాగరికత స్కాట్ లాండ్ దాకా పాకింది.అప్పుడు ఇంగ్లాండ్ లో గొప్ప తిరుగుబాటు భావాలు పెల్లుబికినాయి.ఇంగ్లాండ్ లో రాయల్ సొసైటీ లాంటి గొప్ప సంస్థలు స్కాట్ లాండ్ కి చెందిన స్టూవర్ట్ వంశపు రాజులు పాలించిన కాలం లోనే రూపుదిద్దుకున్నవి.
మళ్ళీ ఇంకొకటి,ఫ్రాన్స్ దేశం స్వేఛ్చ కి పుట్టినిల్లు.ఇక్కడ,ఈ పారిస్ నగరం నుంచే ప్రజాశక్తి ప్రవహించి యూరపు లోని పునాదుల్ని కంపింపజేసింది.ఆ రోజు నుంచి యూరపు యొక్క ముఖ చిత్రం మారిపోయి,కొత్త యూరపు ఉనికి లోకి వచ్చింది.స్వేఛ్చ,సమానత్వం,సౌభ్రాతృత్వం అనేవి ఇకమీదట వినిపించవు,కారణం ఇపుడు ఫ్రాన్స్ వేరే భావాల్ని ఇతర లక్ష్యాల నిమిత్తం అనుకరిస్తున్నది.అయితే ఫ్రాన్స్ వెదజల్లిన ఆ విప్లవ భావాలు యూరపు లోని అన్నిదేశాల్లోనూ తమ పని తాము చేసుకుంటూపోతూనే ఉన్నాయి.
ఒకరోజు ఇంగ్లాండ్ కి చెందిన ఓ ప్రసిద్ధ శాస్త్రవేత్త తో మాట్లాడాను. పారిస్ నగరం తో ఏ దేశం సంబంధం పెట్టుకుంటుందో ఆ దేశపు జనుల ప్రగతి లో ఆ మార్పు కనబడుతుంది.ప్రపంచానికి కేంద్ర బిందువు వంటిది అది అని ఆయన చెప్పాడు.వినడానికి కొంత అతిశయోక్తి లా ఉన్నా కొంత నిజమూ లేకపోలేదు. ఎవరు ప్రపంచానికి ఏ కొత్త భావాన్ని ఇవ్వాలన్నా పారిస్ చాలా అనువైన ప్రదేశం.
పారిస్ ఒక విషయాన్ని అంగీకరించిందంటే చాలు,మొత్తం యూరప్ అంతా కూడా దాన్ని ఆమోదిస్తుంది.ఒక శిల్పి,చిత్రకారుడు,సంగీతకారుడు,నృత్యకారుడు ఇంకా ఏ కళాకారుడు గాని మొదట పారిస్ లో పేరు తెచ్చుకోగలిగితే మిగతా అన్ని దేశాల్లో అతడు కీర్తిని గౌరవాల్ని పొందుతాడు.
మనదేశం లో పారిస్ నగరం యొక్క చీకటి కోణాన్ని మాత్రమే ప్రచారం చేశారు.అది భయంకరమైన ప్రదేశమని,భూలోక నరకమని..! కొంతమంది ఇంగ్లీష్ జాతీయుల అభిప్రాయం అది.ఇంద్రియ సుఖాలు తప్పా మరేది లేదనుకునే కొంతమంది ధనికులకి,సహజం గానే పారిస్ అంటే భోగ సంస్కృతి కి పర్యాపదం లా కనిపిస్తుంది.
పశ్చిమ దేశాల్లోని అన్ని పెద్ద నగరాల్లోనూ ఇవి సహజమే.అది లండన్,బెర్లిన్,న్యూయార్క్ ఏదైనా గానీ.అయితే తేడా ఏమిటంటే,మిగతా దేశాల్లో ఈ ఇంద్రియ సుఖాలు పొందే విధానాలు చాలా వల్గర్ గా ఉంటాయి. పారిస్ లోని దుమ్ము సైతం బంగారు ఆకుల తో కప్పినట్టుగా ఉంటుంది.మిగతా నగరాల్లోని విధానాలు బురద లో పొర్లాడే పంది లా ఉంటే,పారిస్ లో విధానాలు నెమలి సుతారం గా పింఛం విప్పి ఆడినట్లుగా ఉంటుంది.
సంతోషం గా, ఆనంద జీవనం గడపాలని ఏ దేశం మాత్రం కోరుకోదు..? అలా కానట్లయితే పలు ప్రదేశాలనుంచి ధనికులు అంతా ఇక్కడికి, ఈ పారిస్ కి ఎందుకు వస్తున్నట్లు..? ఎందుకని గొప్ప చక్రవర్తులు,రాజులు మారుపేర్ల తో ఇక్కడ నివసిస్తూ ఇంద్రియ సుఖాల్లో ఓలలాడుతుంటారు..?ప్రతి దేశం లోనూ ఎవరైనా సుఖమే గదా కొరుకునేది,తేడా ఏమిటంటే ఫ్రెంచ్ వాళ్ళు సుఖం పొందే విధానాల్ని ఒక సైన్స్ లా అభివృద్ధి చెసుకున్నారు.ఈ నిచ్చెన లో వాళ్ళు బాగా పై స్థాయి కి చేరుకున్నారు.