సాహిత్యంలో అనేకరకాల ప్రక్రియలున్నాయి. అందులో చాటువులు కూడా ఒక భాగం. చాటువుకు నైఘంటికార్థం ప్రకారం ‘ప్రియమైనమాట (చాటు: ప్రియవచనం). ఆ చాటువు (ప్రియమైనమాట) వచనరూపంలో, గేయరూపంలో, పద్యరూపంలో ఎలా అయినా ఉండవచ్చు (ప్రస్తావన, సంస్కృతాంధ్ర చాటుమణిమాల). చాటువుల్లో చిరుధాన్యాల గురించి తెలుసుకుందాం.
చిరుధాన్యాలు: నైఘంటికార్థం
చిఱు:
చిఱు : వై. విణ. వృత్తి యందు చిఱుత శబ్దమునకు మీది వర్ణము లోపింపగా మిగిలిన రూపము. ఉదా. చిఱుగజ్జె,
చిఱుగెంపు, చిఱుచెమట, చిఱుచేప, చిఱుగాలి మొదలైనవి. చిఱుత – చిఱు చిరు
ధాన్యము(0):
ధాన్యము (0) వ 1. కొలుచు (నవధాన్యములు – గోధుమలు, యవలు, పసలు, సనగలు, కందులు, బొబ్బరలు, నువ్వులు, మినుములు, ఉలవలు), 2, దనియాలు (శ.ర). భాషాపరంగా చూస్తే చిరుధాన్యాలు, సిరిధాన్యాలు(శ్రీ-సిరి, ధాన్యాలు) దుష్టసమాసాలు.
సాహిత్యంలో ఒక భాగమైన చిరుధాన్యాల గురించి తెలుసుకుందాం. ఆంగ్లకొలమానం ఎక్కువగా వాడుకలోకి రాక పూర్వం ఏ ధాన్యాలనైనా కొలపాత్రలతో – తవ్వ, పేరు, మానిక, అడ్డ, కుండతో మొదలైన వాటితో కొలిచేవారు. ఈ కారణంగానే ‘కొలుచు’ అనునది ధాన్యానికి మారుపదంగా నిఘంటువుల్లో చేరిందని చెప్పవచ్చు. పదాలకు సంకోచవ్యాకోచాలు చెందుతుంటాయి. అది సహజం. అందువల్లనే ‘నన్నయనాటి కంపు మనకు ఇంపుగాదు’ అని ఈనాడు అంటున్నాం. నన్నయ నాడు (క్రీ.శ.11వ శతాబ్దం) కంపు పదానికి కేవలం ‘వాసన’ అనే అర్థం ఉండేది. ఈ నాడు కంపు అంటే ‘ముక్కు మూసుకునేంత దుర్వాసన’ అనే అర్థంలో ప్రయోగిస్తున్నాం. అలాగే ధాన్యం అనే పదం యొక్క అర్థం ‘కొలుచు’ అనే క్రియాపదం ‘కొలిచే పంట’కు పర్యాయపదంగా మారిందనవచ్చు.
ధాన్యాలు అనేకరకాలు. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. వాటిని మనం అనేకరకాలుగా – ఆకారస్వరూపం, పంటపండే కాలం, వంటవండించే పద్ధతులు, విత్తేపద్ధతులు, ఉపయోగం మొదలైన వాటిని బట్టి విభజించవచ్చు. గత థాబ్దం నుండి ‘చిరుధాన్యాల’నే పదం విపరీతంగా వాడుకలోకి వచ్చింది. దానికి అనేక కారణాలున్నాయి. వాటన్నిటి గురించి ఇక్కడ చర్చించడం భావ్యం కాదు.
చిరుధాన్యాలుగా ప్రధానంగా రాగులు, ఊదలు, కొర్రలు, సజ్జలు, జొన్నలు మొదలైనవాటిని మాత్రమే మనం పరిగణిస్తున్నాం. రాగులు, కొర్రలు మొదలైనవి 90 రోజుల్లోనే చేతికి వస్తాయి. కాని వీటి కన్నా సజ్జలు, జొన్నలు ఎక్కువ కాలం తీసుకుంటాయి. ఇప్పుడు ఇక్కడ కేవలం జొన్నలు, వాటితో చేసిన అంబలి గురించి మాత్రమే తెలుసుకుంటున్నాం. చాటువుల్లోనూ, శిష్టసాహిత్యంలోనూ వీటి ప్రస్తావన గురించి తెలుసుకుందాం.
జొన్నకూడు, అంబలి:
కావ్యయుగం(క్రీ.శ.14-15వ శతాబ్దం)లో శ్రీనాథుడు మిక్కిలి పేరుపొందినవాడు, కవిసార్వభౌమునిగా ప్రసిద్ధుడు. అతను చిరుధాన్యాల్లో భాగమైన జొన్నలతో తయారైన ఆహారం గురించి ఏం చెప్పాడో తెలుసుకుందాం.
కంద పద్యం:
రసికుడు పోవడు పలనా
డసగంగా రంభయైన ఏకులె వడకున్
వసుధేశుడైన దున్నును
కుసుమాస్త్రుండైన జొన్నకూడే కుడుచున్ (సంస్కృతాంధ్ర చాటుమణిమాల)
(పలనాడులో రంభ వంటి అందగత్తె కూడా ఏకులే వడకుతుంది. అక్కడి దొరలు (వసుధేశుడు, రాజు) కూడా (నాగలి పట్టి),పొలం దున్నుతాడు. మన్మథుడైనా జొన్నకూడే తింటాడు. కాబట్టి రసికుడు ఎవరైనా పలనాడు పోడని అన్నాడు)
పలనాడులోని పరిస్థితి:
శ్రీనాథుడు రాజాస్థానాల్లో తిరుగుతూ, భోగలాలసాలను అనుభవించినవాడు, రసిక జీవనం గడిపినవాడు. ఆయన ఒకసారి పలనాడు వెళ్లాడు. అక్కడి ప్రజల ఆహారం, ఆచారవ్యవహారాలు మోటుగా ఉండేవనీ, మోటువాడైనా, సుకుమారుడైనా జొన్నకూడే తింటారనే విషయాన్ని పరిహాసంగా పై పద్యంలో చెప్పాడు.
ఉత్పలమాల:
పుల్ల సరోజ నేత్ర యల పూతన చన్నుల చేదు ద్రావి నా
డల్లదవాగ్ని మ్రింగితి వటంచును నిక్కదవేల తింత్రిణీ
పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్నకూటితో
మెల్లన యొక్క ముద్ద దిగ మ్రింగుము నీ పస గాననయ్యెడున్II
‘కృష్ణా! ఆనాడు నీవు చనుబాలవిషాన్ని తాగి హరించుకున్నావనీ, కార్చిచ్చును నోటిలో మింగి, చల్లార్చావనీ గొప్పలు చెప్పుకుంటున్నావు. అదేమంత గొప్ప విషయం కాదు. నీకు చేతనైతే జొన్న అన్నంలో చింత చిగురు వేసి వండిన బచ్చలికూరను కలుపుకొని, ఒక్క ముద్ద తిని చూడు. అప్పుడు నీ సామర్థ్యం తెలుస్తుంది).
శ్రీనాథుడు పలనాడులో తిరుగుతూ ఒకరింటికి ఆతిథ్యానికి వెళ్లాడు. అప్పుడాయనకు జొన్నన్నం, బచ్చలికూర భోజన0లో వడ్డించారు. ఆ సందర్భంలోనే కృష్ణుణ్ని సవాలు చేస్తూ, పై పద్యం చెప్పాడు.
శ్రీనాథుని మాటలను బట్టి చూస్తే విషాన్ని అయినా సులభంగా జీర్ణం చేసుకోవచ్చు కానీ జొన్న అన్నం, చింతచిగురు వేసి వండిన బచ్చలికూర తొందరగా జీర్ణం కాదనే విషయం తెలుస్తుంది. అంతేగాకుండా పలనాడు వాతావరణ పరిస్థితులు, ప్రజాల ఆర్థికపరిస్థితిగతులు, వర్షాధారపంటలు, ఆహారపు అలవాట్లు, ప్రజలస్థితిగతులు తెలుస్తున్నాయి.
శార్దూలం:
కుల్లాయుంచితి కోక చుట్టితి మహాకూర్పాసముం దొడ్లితిన్
వెల్లుల్లిం దిలపిష్టము న్మెసవితి న్విశ్వస్త వడ్డించగా
చల్లాయంబలి త్రావితిన్రుచుల దోసంబంచు పోనాడితిన్
తల్లీ కన్నడ రాజ్యలక్ష్మి! దయలేదా? నేను శ్రీనాథుడన్
(సంస్కృతాంధ్ర చాటుమణిమాల)
(కుల్లాయి కట్టుకున్నాను, చీర(కోక) ధరించాను, పొడుగు చేతుల పెద్ద చొక్కా తొడుక్కున్నాను. పూటకూటింటిలో విత0తువు వడ్డించగా వెల్లుల్లిని, నువ్వుపిండిని తిన్నాను. చల్లతో కూడిన అంబలిని తాగాను. రుచులను ఆశించడం తప్పని మానుకున్నాను. ఓ తల్లీ కన్నడరాజ్యలక్ష్మీ! నేను శ్రీనాథుడిని, దయలేదా అని అంటూ ఆ కన్నడతల్లికి తన దుర్దశను శ్రీనాథుడు రాజదర్శనానికి ఎదురుచూస్తున్న రోజులలో విన్నవించుకున్నాడు).
ఒకనాడు శ్రీనాథుడు కన్నడదేశానికి వెళ్లినప్పుడు రాజసన్మానం తొందరగా లభించని సందర్భంలో శ్రీనాథుడు కన్నడరాజ్యలక్ష్మితో మొరపెట్టుకున్న పద్యమిది. అని అంటారు. శ్రీనాథుడు పలనాడులోనే గాకుండా కన్నడనాడులో కూడా కష్టాలుపడ్డట్లు తెలుస్తుంది.
ఆటవెలది:
వంగతోట నుండు వరిమళ్లలో నుండు
జొన్నచేల నుండు చోద్యముగను
తలుపుమూల నుండు తలమీద నుండును
దీని భావమేమి తిరుమలేశI
పై పద్యం చదువగానే వంగతోటలో, పరిమళ్లలో, జొన్నచేలలో, తలుపుమూల, తలమీద ఉండేది ఏమిటి అనే ప్రశ్న,ఆలోచన మన మనసులో మొలకెత్తుంది. కాని కొంచెం లోతుగా ఆలోచిస్తే అందులోనే మనకు జవాబు కూడా లభిస్తుంది. పదాల విరుపును గమనిస్తే అసలు విషయం బోధపడ్తుంది.
వంగ తోటన్ ఉండు – తోటలోన వంగ ఉండు
వరి మళ్లలో నుండు – మళ్లలోన వరి ఉండు
జొన్న చేల నుండు – చేలన్ జొన్న ఉండు
తలుపు మూల నుండు – మూలన్ తలుపు ఉండు
తల మీద నుండును – మీదన్ (పై భాగాన) తల ఉండును (ఉంటుంది)
వేసవికాలం – అంబలి ప్రస్తావన:
చంపకమాల:
తెలినులి వెచ్చ యోగిరము దీయని చేరులు దిమ్మనంబులున్
బలుచని యంబళుల్ చెఱకుబాలెడ నీళ్లు రసావళుల్ ఫలం
బులును సుగంధ శీతజలమున్ నడపిందెలు నీరు చల్లయున్
వెలయగ బెట్టు భోజనము వేసవి జందనచర్చ మున్నుగన్బబ
(వేసవికాలంలో అతిథులకు ముందుగా తాపం చల్లార్చే గంధపుపూతపెట్టి, ఆయా పదార్థాలు వడ్డిస్తున్నారు.
కొంచెం వేడి గల అన్నం, తియ్యనిచారు, తీపిపదార్థాలు, పలుచని అంబళులు, చెరకుపాలు, కొబ్బరినీళ్లు, తీపి భక్ష్యాలు, పండ్లు, వాసనగల చల్లనినీరు, వేసవి వడను పోగొట్టడానికి ఊరవేసిన మామిడి పిందలు, నీరులెక్కువగా కలిపిన మజ్జిగతో తృప్తికలిగే విధంగా (విష్ణుచిత్తుడు అతిథులకు భోజనం పెట్టును. (ప.81, ప్రథమాశ్వాసం, ఆముక్తమాల్యద) (పైన చెప్పిన పదార్థాలన్నీ వేడిని పోగొట్టే పదార్థాలు), సజ్జ వేడి, జొన్న చలువ అంటారు.
పై పద్యాలను బట్టి చిరుధాన్యాల వైశిష్ట్యం, వాటిని తినడానికి రసికులు పడే కష్టాలు, ప్రజల స్థితిగతులు తెలుస్తున్నాయి. అంతేగాకుండా ‘ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయనే నానుడి కూడా ఈ చిరుధాన్యాలకు వర్తిస్తుంది. ఒక నాడు తినడానికి అయిష్టపడేవారు ఈనాడు ఆరోగ్య కారణంగా రొట్టెలు, ఉప్మా, గట్క, అంబలి, జావా రూపంలోతప్పనిసరిగా తినవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
జొన్నలు పండే ప్రాంతానికి జొన్నలగడ్డ(గెడ్డ) అనే పేరు ఉన్నట్లుగానే ఆ పేరుతో ఇంటిపేర్లు కూడా ఉన్నాయి. జొన్నలగడ్డ(గెడ్డ), జొన్నాడ అనే ఇంటిపేర్లు రెడ్లలో, బ్రాహ్మణుల్లో కనిపిస్తున్నాయి (బ్రాహ్మణుల గోత్రములు, ఇండ్లపేర్లు -శాఖలు). జొన్నలగడ్డ ఇంటి పేరుతో ఉన్న వ్యక్తులు ‘ఇంటర్ నెట్’ లో కూడా కనిపిస్తారు. జొన్నలగడ్డ గ్రామం గు0టూరుజిల్లాలో ఉంది. చిరుధాన్యాలలో భాగమైన జొన్నలు భోగిపండ్లలోనూ, తలంబ్రాలలోనూ కలుపుతారు. జొన్నలు కేవలం ఆహారం మాత్రమే గాకుండా ఒకసాంస్కృతిక వస్తువు అని కూడా చెప్పవచ్చు. వరిధాన్యాన్ని పొట్టుధాన్యంగానూ, సజ్జలు. జొన్నలను గట్టిధాన్యంగానూ పరిగణిస్తారు. వీటిలో పొట్టురూపకంగా ధాన్యం వృధా కాదు.
ఇలా జానపదుల రామాయణం కథలో భరతునికి పన్ను ఎగవేయడానికి (మోసగించడానికి కూడా ఈ జొన్న ఉపయోగపడింది. భరతుడు ‘మంచి ఫిలాసఫర్ (తత్త్వవేత్త). కాని సమర్థుడైన పరిపాలకుడు కాడు. హరతుని మంచితనాన్ని అలుసుగా తీసుకొని రైతులు పంటలు పండలేదని, పన్నులు ఎగవేస్తుంటారు. మంత్రులు ఈ విషయాన్ని భరతుని దృష్టికి తీసుకు వస్తారు. అప్పుడు భరతుడు ‘పంట పైకి కనిపించే విధంగా) వంగడాలు వేయమని చాటింపు వేస్తారు. రైతులు మొక్కజొన్న వేస్తారు. రైతులు మొక్కజొన్నలు విత్తి, మధ్యనున్న కంకులు తెంపుకొని, పంట పండలేదనిభరతునికి చూపిస్తారు.
భరతుడు ఈ సారి మొక్కమధ్యలో కాత కాసే పంటలు వేయమంటాడు. అప్పుడు రైతులు ఉల్లిగడ్డ, వేరుశనగ మొదలైనవి వేస్తారు. వీటికి పైన పూలు వస్తాయి. కాని భూమిలోపల (మొక్కకింద) కాపు వస్తుంది. రైతులు భూమిలోని గడ్డలు తెంపుకొని, మొక్కలను చూపించి పంట పండలేదని చెప్తారు. ఈసారి భూమిలోపల పండే పంటలు వేయమంటాడు. అప్పుడు రైతులు ‘జొన్న’ వేస్తారు.
జొన్నకర్ర, మొక్కజొన్నకర్ర చూడడానికి ఒకే విధంగా ఉంటాయి. రైతులు జొన్నమొక్క పైభాగంలోని కంకులు తెంపుకొని, పంట పండలేదని చెప్తారు. ఈ విధంగా జొన్నపంట పరిపాలకులను మోసం చేయడానికి కూడా పనికివచ్చింది.అందుకే పరిపాలకులకు క్షేత్రపరిజ్ఞానంకూడా ఉండాలంటారు. ఇలా ఒక్కొక్క ధాన్యం, ఆహారపదార్థం గురించి ఎంతైనా చెప్పుకుంటూ పోవచ్చు.
(అంబలి – చిరుధాన్యాలపిండి, నూకలు లేదా బియ్యం చేర్చి జాలువారుగా వండిన ఆహారం., గటక(గట్క) – చిరుధాన్యాలతో గట్టిగా వండిన వంట.
బర్పట – రవ్వలాగ విసరిన ధాన్యం.
ఆధార గ్రంథాలు:
1. సంస్కృతాంధ్ర చాటుమణిమాల
2. ఆముక్తమాల్యద
3. బ్రాహ్మణుల గోత్రములు, ఇండ్లపేర్లు – శాఖలు
4. శబ్దరత్నాకరం