ఆ చేతిలో అచ్చులు పరుసవేదులు
హల్లులు మల్లెలు మొల్లలు
ఆ ఊహలు ఉయ్యాల్లు ఉషోదయాలు
ఆ మేధస్సు ఇంద్రధనుస్సు
భావాలు కురంగాలు తురంగాలు
ఆ మనసు నిండా మ్రోస్తుంటాయి సదా మృదంగాలు
అతడొక స్వేచ్ఛా విహంగం
ప్రేయసి వలపులు ప్రేమ తలపులు
ఆ మస్తిష్కంలో క్రొంగొత్త చిగుళ్ళు తొడుగుతాయి నిరుపేదల నిట్టూర్పులు ఆకలి కేకలు
లావాలు చిమ్ముతాయి
సమతా సౌమ్యత అతని రెక్కలు
చుక్కల్లో విహరిస్తాడు
మరుక్షణం కన్నీటి చుక్కై కరుగుతాడు
నేల రాలతాడు
కటిక దారిద్ర్యాలు పలకరిస్తాడు
ముక్కంటి శూలం తను
ముక్కోటి వేదం తను
దామోదరుడి చక్రం ఉపేంద్రుడి వజ్రం తను సౌందర్యాల్ని స్వప్నించి ఔదర్యాలు వర్ణించి
ఔచిత్యాల ప్రశ్నించి నిప్పులు వర్షించడం
అతడి బలం
ప్రణయాలు ప్రణవాలు
ప్రళయ లయలు విలయ ఝంఝలు
అతడి పరికరాలు
అతని కలం పరమేష్టి హలం
అక్షరాలు నాటి అక్షరసస్యాల పండిస్తాడు
పిల్లగాలుల ఆస్వాదన
భీకరార్భటుల ఆలాపన ప్రేలాపన
అలకపాన్పులు ఆక్రందనలు
అతని రంగస్థలాలు
మనస్చితిలో ప్రాయోపవేశం చెయ్యడం
అతనికే చెల్లు
వాస్తవానికి అతడో మహా మల్లు
అతడు కవి
భావనోత్తుంగ తరంగరంగితానురంజిత
ప్రతిభా ప్రభాభాసుర మణిరత్న గవి
మహా ఠీవి మహా జీవి.
————