నదికి సాటి నదేనని
ప్రాణి ప్రపంచపు పుట్ట పగిలింది
నది పరీవాహకం పొట్టలోంచేనని
నరుడు నాగరికత నేర్చుటలో
ప్రముఖ పాత్ర వహించినది
నదేనని విన్నాను
నదిని తల్లిలా కీర్తిస్తూ
దేవతలా పూజిస్తున్న ఆస్తికుల్ని చూశాను
నదులను భూమండలానికి నరాలుగాను
నీటిని రక్తంతోను పోల్చిన
వైజ్ఞానిక వేత్తలను చదివాను
ధరించినవి పుట్ట గోచీలే అయినా
తింటున్నవి కారం గొజ్జు మెతుకులే అయినా
రేపటిని గూర్చి ఆలోచనల్లేని మనుషులున్నంత వరకు
అవరోధముల భారిన పడకుండా
సురక్షితంగా., సుఖోజయంగా ఉరకలెత్తి
కడలి కౌగిట కరిగిపోయింది నది
లోకజ్ఞానం మచ్చుకు తెలియని
ఒంటరి మహిళ నది
నిస్వార్ధం నేలపై ప్రవహిస్తే నదిలానే ఉంటుంది
ఉన్నవి, ఉత్తమమైనవి, ఉత్తవి చేయడమే
ఉత్తమ పురుషుల లక్షణమైపోయాక
నది ఆస్తి తప్ప అలజడులు తెలియని దొంగలంతా
దొమ్మీ చేసినట్టు తోడేళ్ల గుంపులా మీద పడిపోయి
అధికార దర్ప ఇనుప పంజాలతో
నది ఇసక కండరాలను చచ్చిన ఎద్దు మాంసంలా
పర్రచింపుకు పోయాక
నదిది పాదాల్లేని నడక, క’న్నీళ్లు’ లేని ఏడుపైంది
నదిని దోచుకోవడం అంటే
తల్లి గర్భసంచిని కోసుకెళ్లడమని
తనను, తోటి పరివారమును వరుసపెట్టి
చేజేతులా చంపుకోవడమేనని
వంతులేసుకొని గొంతు చించుకుంటున్న
ప్రకృతి ప్రేమికుల హిత వచనాలు
కొమ్ములు తిరిగిన కంత్రీగాళ్ళ కర్ణభేరికి
అడ్డంగా పెరిగిన దుర్మాంస పొరల ముందు
శబ్ద రహితమయ్యాయి
దుష్టునికి ధర్మాత్ముడికి
ఒకే రకం ఆతిథ్యమిచ్చే చెట్టులాగ
తనలో నుంచొని ఒంటేలికి పోసిన వారిని
తన కోసం ఒంటికాలిపై నుంచొని తపస్సు చేసిన వారిని
ఒకేలా చూసి తప్పు చేసింది నది
పర్యవసానం వందితలు పెరిగి
నది ఇప్పుడు కంపచెట్ల పొదల మధ్య
మట్టి పడకేసిన మా తాత సమాధిలా ఉంది
ఇంకా చెప్పాలంటే..,ఇవాల్టి చాలామంది మదిలా
డంపింగ్ యార్డుకు డబల్ రోల్ లా అగుపిస్తోంది
నదుల విలువ వాటిని పోగొట్టుకున్న వారికి
నదులంటూ లేని వారికే కదా తెలుస్తుంది.