యుగానికో యుగపురుషుడు ఉద్భవిస్తాడు. త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో బుద్ధుడు, యేసు. వారితో సరిసమాన స్థాయిని సంపాదించుకున్నవాడు గాంధీజీ.
గాంధీ గుజరాత్ లోని పోర్ బందర్ లో 1869 అక్టోబర్ 2న కరంచంద్ పుత్లీబాయిల బిడ్డగా జన్మించాడు. ప్రాథమిక విద్య రాజకోటలో పూర్తి చేసి న్యాయ శాస్త్ర విద్యనభ్యసించడానికి బ్రిటన్ వెళ్ళాడు. వకీలు వృత్తి కొనసాగించడానికి దక్షిణాఫ్రికా వెళ్ళాడు. దక్షిణాఫ్రికాలో అక్కడి ప్రజల చేతుల్లో భారతీయులు అనుభవించే అన్యాయాలు, అక్రమాలు, జాతి వివక్షత హీనస్థితి చూచి చలించి ఆందోళన సాగించాడు. దక్షిణాఫ్రికాకు వలస వెళ్ళినవారికి ఓటు హక్కు లేదు. వారికోసం నిర్దేశించిన స్థలాల్లో తప్ప వేరే నివసించడానికి వీలు లేదు. ఈ దారుణ పరిస్థితులకు వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని నడిపాడు. గాంధీజీ 1893-94 మధ్య జాత్యహంకారాలకు అధికార మదాంధులకు వ్యతిరేకంగా అహింసాయుతంగా పోరాడాడు.
సత్యం, అహింసలే అతని ఆయుధాలు. చెడును ప్రతిఘటిస్తూనే చెడు చేసే వాణ్ణి ప్రేమించేవాడు. నిజమైన సత్యాగ్రహికి ద్వేషించడమనేది అతని నైజానికే విరుద్ధం. గాంధీజీ నిర్భయుడు. ఎన్ని కష్టాలెదురైనా చెడు ముందు తలవంచడు. ఆయన దృష్టిలో అహింస అనేది బలహీనుల, భీరువుల ఆయుధం కాదు, ధైర్యవంతులు, శక్తివంతులు మాత్రమే దాన్ని ఆచరించగలరు అని చెప్పేవాడు. 1920లో యంగ్ ఇండియా అనే తన వారపత్రికలో ”పిరికితనం కంటె చావు మేలు” అంటూ అహింస గురించి ఒక అద్భుతమైన వ్యాసం వ్రాశాడు. ”హింస మృగానికి ధర్మమైనట్లుగా అహింస మనిషి యొక్క ధర్మం” అంటారు గాంధీజీ. ”బలప్రయోగాలతో ఒకదాన్ని సాధించవలసి వస్తె నేను బలప్రయోగానికే అనుకూలం” అన్నారు. భారతదేశం తన అవమానాన్ని పిరికితనంతో నిస్సహాయంగా చూస్తూ కూర్చోవడం కన్నా తన గౌరవ రక్షణకు ఆయుధం పట్టడం మేలన్నాడు గాంధీజీ. ”నాకు మానవాతీత శక్తులు అక్కరలేదు, ధర్మం, సత్యం, అహింసలే నా ఆయుధాలు” అన్నారు బాపూజీ. తన సిద్ధాంతాన్ని ఆచరణ నుండి, విశ్వాసాన్ని కార్యాచరణ నుండి వేరు చేయడు. అది గాంధీజీ దృక్పథంలోని ముఖ్య లక్షణం.
1915లో తన 46వ ఏట గాంధీజీ ప్రజలకు సేవ చేయాలనే తాపత్రయంతో భారతదేశానికి తిరిగి వచ్చాడు. తన కార్యక్షేత్రాన్ని నిర్ణయించుకోబోయె ముందు దేశ పరిస్థితులను అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నారు. 1916 అహ్మదాబాదులో సబర్మతీ ఆశ్రమాన్ని నెలకొల్పాడు. రాజకీయాలకు అతీతంగా విశ్వమానవ కళ్యాణానికి ప్రాముఖ్యతనిచ్చి ఈ ఆశ్రమాన్ని నడపాలని నిర్ణయించాడు. సత్యం, అహింస, బ్రహ్మచర్యం, స్వశక్తి పైన జీవించడం అనేవి ఆశ్రమవాసులు విధిగా ఆచరించాలి. ఈ సిద్ధాంతాలు పాటించేవారు మాత్రమే ఆశ్రమంలో నివసించడానికి అర్హులు. 1917లో మొట్టమొదట తన మహత్తర సత్యాగ్రహ ఆయుధాన్ని బీహార్ లోని చంపారన్ జిల్లాలో ప్రయోగించాడు. ఆ జిల్లాలో నీలిమందు తయారు చేసే రైతాంగం యూరోపియన్ తోటల యాజమాన్యంతో తీవ్ర హింసా పీడనలకు గురవుతుంది. పండించిన నీలిమందును వాళ్ళు నిర్ణయించిన ధరకే అమ్మాలని రైతులపై ఒత్తిడి తెచ్చారు. గాంధీజీ దక్షిణాఫ్రికాలో నిర్వహించిన సత్యాగ్రహోద్యమాన్ని గురించి విన్న చంపారన్ రైతులు గాంధీజీని తమకు తోడ్పడమని అర్థించారు. బాబు రాజేంద్రప్రసాద్, మజర్-ఉల్-హక్, కృపలాని, మహదేవ్ దేశాయ్ లతో కలిసి గాంధీజీ 1917లో చంపారన్ చేరుకొని రైతాంగ స్థితిగతులను గురించి సంపూర్ణ సర్వేక్షణ జరిపాడు. ఆయన రాకకి ఆగ్రహించిన జిల్లా అధికారులు గాంధీజీని చంపారన్ ను విడిచి వెళ్ళమని ఆదేశించారు. వారి ఆదేశాన్ని ధిక్కరించి కారాగార శిక్షను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు.
దాంతో అధికార్లు ఉత్తర్వును రద్దు చేసుకొని ఒక విచారణ సంఘాన్ని నియమించారు. అందులో గాంధీజీ సభ్యుడు. అంతిమంగా రైతులు తమ బాధలనుండి బైట పడ్డారు. ఇది గాంధీజీ తన సత్యాగ్రహ సమరంలో సాధించిన తొలి విజయం.
1918లో మిల్లు కార్మికులకు యజమానులకు మధ్య ఏర్పడిన ఒక వివాదంలో గాంధీజీ జోక్యం కల్పించుకున్నాడు. ఉభయ వర్గాల మధ్య రాజీ కోసం ఆయన ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు.
వాస్తవానికి సామాన్య ప్రజల జీవితంలో తన జీవితాన్ని జీవన సరళిని మమేకం చేసిన మొట్టమొదటి భారత జాతీయ నాయకుడు గాంధీజీ. అనతికాలంలోనే ఆయన దరిద్ర భారతదేశానికి, జాతీయ స్ఫూర్తివంతమైన భారతదేశానికి, ఎదురుతిరిగే భారతదేశానికి ప్రతీక అయ్యాడు. గాంధీజీకి అత్యంత ప్రియమైనవి మూడు అంశాలు. మొదటిది హిందూ ముస్లిం ఐక్యత, రెండవది అస్పృశ్యతా వ్యతిరేక పోరాటం, మూడవది భారత మహిళా సామాజిక హోదా పెంపుదల. ఆయన నిష్టాపరుడైన హిందువు. ఆయన సాంస్కృతిక మత దృక్పథం విశ్వజనీనమైందే గాని సంకుచితమైనది కాదు. భారతీయ సంస్కృతి అన్నింటి సమ్మేళనం. ”సకల దేశాల సంస్కృతి వాయువులు నా ఇంట స్వేచ్ఛగా వీచాలనే నా కోరిక అంతేగాని అవి నన్న పెకలించి తీసుకుపోవడానికి నేను వ్యతిరేకిని. ఇతరుల కడ బానిసగా బ్రతుకడానికి నేను నిరాకరిస్తాను” అంటారు గాంధీజీ. ఇతర జాతీయ వాదుల వలెనే రౌలత్ చట్టాన్ని వ్యతిరేకించాడు. 1919 ఫిబ్రవరిలో ఆయన సత్యాగ్రహ సభను రౌలట్ చట్టాన్ని ధిక్కరించడానికి స్థాపించాడు. దీంతో ఒక నూతన పోరాట పద్ధతి మొదలయింది. పెద్ద పెద్ద సభలు, ప్రదర్శనలు, ప్రభుత్వంతో సహాయ నిరాకరణ, విదేశీ వస్త్ర బహిష్కరణ లేదా వ్యక్తిగత టెర్రరిస్టు చర్యలు మాత్రమే అప్పటివరకు జాతీయవాదులకు తెలిసిన రాజకీయ కార్యాచరణ రూపాలు. సత్యాగ్రహం వెంటనే ఉద్యమాన్ని ఒక నూతన, ఉన్నత స్థాయికి కొనిపోయింది.
1919 మార్చి ఏప్రిల్ ల్లో భారతదేశంలో ఒక అపూర్వ రాజకీయ జాగృతి కానవచ్చింది. ఏప్రిల్ 6న బ్రహ్మాండమైన హర్తాళ్ కు పిలుపిచ్చాడు గాంధీజీ. ఆ పిలుపుకి ప్రజలు అపూర్వ ఉత్సాహంతో కదలివచ్చారు. ప్రజలకు ప్రియతమ నాయకులైన డా|| సైఫుద్దిన్ కిచ్లూ, డా|| సత్యపాల్ అరెస్టు నిరసనగా అమృత్ సర్ జలియన్ వాలాబాగ్ లో 1919 ఏప్రిల్ 13న నిరాయుధులైన ఒక బ్రహ్మాండమైన జన సందోహం గుమిగూడారు. డయ్యర్ దురంతంతో వేలాది మంది మరణించారు, గాయపడ్డారు. 1919-22 ఖిలాఫత్ ఉద్యమంతో జాతీయోద్యమంతో క్రొత్త స్రవంతి వచ్చి కలిసింది. గాంధీజీ ఖిలాఫత్ ఆందోళనని నూరేళ్ళకైనా కలగని హిందూ ముస్లిం ఐక్యతకు అవకాశంగా భావించాడు. ఖిలాఫత్ ఉద్యమ నాయకుల్లో ఒకడయ్యాడు గాంధీజీ.
1920లో బాలగంగాధర తిలక్ మరణం కాంగ్రెస్ సంస్థకు ఒక దెబ్బ. ఆయన స్థానాన్ని గాంధీజీ, చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ భర్తీ చేశారు. పత్రికా స్వాతంత్య్రం మీద బ్రిటిష్ ప్రభుత్వ నిర్బంధాలు సడలని పక్షంలో తాను బ్రహ్మాండమైన ప్రజా సత్యాగ్రహోద్యమాన్ని ప్రారంభించ గలనని గాంధీజీ 1922 ఫిబ్రవరి 1న ప్రకటించాడు. 1922 మార్చి 10న గాంధీజీ అరెస్టు అయ్యారు. ఆయనకు ఆరు సం||రాలు కారాగార శిక్ష పడింది. కోర్టులో గాంధీజీ ఇచ్చిన ఒక ప్రకటన చరిత్రను సృష్టించింది. ప్రాసిక్యూషన్ వారి అభియోగానికి సమాధానంగా దోషినని ఒప్పుకొంటూ చట్ట ప్రకారంగా వీలయినంత కఠినాతి కఠినమైన శిక్షను విధించ వలసిందిగా కోర్టు వారిని అభ్యర్థించాడు. ”చట్టం దృష్టిలో బుద్ధిపూర్వకమైన నేరం, నా దృష్టిలో ఒక పౌరుని ఉత్తమోత్తమమైన ధర్మంగా గోచరిస్తుంది” అని అన్నాడాయన. ”మంచికి సహకారం ఇవ్వటం ధర్మమైనట్లే చెడుతో సహాయ నిరాకరణ పాటించటం అంతే ధర్మం” అని గాంధీజీ కోర్టులో తన ప్రసంగాన్ని ముగించాడు.
శాసన సభల్ని ఉపయోగించుకొని ప్రజల్లో ఉత్సాహాన్ని దీపింపజేయాలని చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ కోరారు.
మార్పులు కోరని పక్షంగా అభివర్ణింపబడ్డ సర్ధార్ వల్లభాయి పటేల్, డా|| అన్సారీ, బాబు రాజేంద్రప్రసాద్ ప్రభృతులు శాసనసభలో పునఃప్రవేశానికి ప్రతిఘటించారు. శాసనసభ రాజకీయాలు జాతీయావేశాన్ని నిర్వీర్యపరుస్తాయని, నాయకుల మధ్య స్పర్థలు సృష్టిస్తాయని వారు హెచ్చరించారు. కాబట్టి నూలు వడకడం స్వయంపోషణ, ముస్లిం-హిందూ ఐక్యత, అస్పృశ్యతా నిర్మూలనం వగైరా నిర్మాణాత్మక కార్యక్రమాలకు వారు ప్రాధాన్యత ఇచ్చారు. భిన్నాభిప్రాయాలు భిన్న వ్యక్తిత్వాలు వున్న వ్యక్తులతో ఏకత్వం సాధించి అందరిని ఒకే గొడుగు క్రింద నడిపించిన విశిష్ట వ్యక్తిత్వం కల నాయకుడు గాంధీజీ.
1924లో ఫిబ్రవరి 5వ ఆరోగ్య కారణాల వల్ల విడుదలైన గాంధీజీ ఉభయ పక్షాలను ఐక్యపరచడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 1924 సెప్టెంబర్లో హిందూ ముస్లిం ఐక్యతకై మళ్ళీ ఢిల్లీలోని మౌలానా మహ్మదాలీ గృహంలో 21 రోజుల పాటు ఉపవాసం చేసాడు. అయినా ఫలితం కన్పించలేదు. ఇక గాంధీజీ అన్ని చాలించుకొని ఏకాంతవాసం చేయసాగాడు.
1927లో ఉద్యమం ఊపందుకొంది. 1928లో రైతాంగంలో, కార్మికుల్లో కదలిక ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్ లో కౌల్దారి చట్టాల సవరణ గురించి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన జరిపారు. భూమిశిస్తు పెంపుదలకు వ్యతిరేకంగా ప్రతిఘటించారు. ఈ సమయంలోనే సుప్రసిద్ధ బార్డోలి సత్యాగ్రహం జరిగింది. 1928లో అనేక సమ్మెలు జరిగాయి. సం||రం మొత్తంలో 5 లక్షల మందికి పైగా కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 3న సైమన్ కమీషన్ బొంబాయి చేరింది. కమీషన్ సభ్యులు ఎక్కడికి వెళ్ళినా హర్తాళ్ళు, నల్ల జెండాల ప్రదర్శనలు ఎదురయ్యాయి. సైమన్ గోబ్యాక్ అనే నినాదాలు మిన్ను ముట్టాయి. పోలీసులు విశృంఖలంగా దాడి చేశారు. సైమన్ కమీషన్ కు వ్యతిరేక ఉద్యమం వెంటనే ఒక విస్తృత రాజకీయ పోరాటానికి దారి తీయలేదు. ఎందుకంటే జాతీయోద్యమానికి ఎదురులేని నాయకుడు గాంధీజీ ఎటూ తేల్చుకోలేదు. పోరాటానికి సమయం ఆసన్నమైందని నమ్మకం కలుగలేదు. కాని దేశంలో మరోసారి పోరాట మనస్తత్వం పెంపొందింది. ప్రజల ఉత్సాహావేశాల్ని అదిమిపెట్టి వుంచడం అసాధ్యమని తేలింది.
1928 డిసెంబర్లో మళ్ళీ క్రియాశీల రాజకీయాలలో ప్రవేశించాడు గాంధీజీ. 1930 జనవరి 26 ప్రప్రథమంగా స్వాతంత్య్ర దినంగా నిర్ణయింపబడింది. బ్రిటిష్ పాలనకు ఇంకా లొంగి వుండడం మానవునికి దేవునికి అపచారం అని ప్రమాణం చేస్తూ ప్రజలంతా ఆరోజున పూర్ణ స్వరాజ్య జయంతిని జరుపుకున్నారు. ఇది నెహ్రూజీ ఆధ్వర్యాన జరిగింది.
మళ్ళీ మరోసారి గాంధీజీ నాయకత్వాన జాతీయోద్యమం ప్రభుత్వంతో తలపడింది. 1930 మార్చి 12న చరిత్ర ప్రసిద్ధమైన దండియాత్రలో రెండవ సత్యాగ్రహం సమరానికి నాంది పలికాడు. ఇదే భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో ఉప్పు సత్యాగ్రహంగా ప్రసిద్ధికెక్కింది. గాంధీజీ తాను ఎంపిక చేసుకున్న 72 మందితో 200 మైళ్ళు బయలుదేరి గుజరాత్ సముద్రతీరంలో ఉన్న దండి గ్రామానికి చేరుకున్నారు. ఉప్పు చట్టాల్ని ఉల్లంఘించి ఉప్పు తయారు చేశారు. నిరాకరణ చర్యకు ప్రతీకగా.
”భారతదేశంలో బ్రిటిష్ పాలన ఈ మహత్తర దేశాన్ని నైతికంగా, భౌతికంగా, సాంస్కృతికంగా ఆధ్యాత్మికంగా భ్రష్టం చేసింది. ఈ పాలనని నేను పీడగా పరిగణిస్తాను. ఈ ప్రభుత్వ వ్యవస్థను అంతం చేయడానికి నడుం కట్టాం. రాజద్రోహం ఇప్పుడు నా మతం. మాది అహింసాయుత సమరం. మేము ఎవరిని చంపం. కాని ఈ ప్రభుత్వం యొక్క పీడను తుడిచి పెట్టడం మా ధర్మం” అంటూ గాంధీజీ ప్రకటించాడు.
గాంధీజీతో పాటు ఇతర కాంగ్రెసు నాయకులను 90,000 సత్యాగ్రహుల్ని ప్రభుత్వం జైళ్ళలో నెట్టింది. గాంధీ టోపిని పెట్టిన వారిని పోలీసులు చావబాదారు. చివరకు 1931 మార్చిలో లార్డ్ ఇర్విన్ గాంధీజీలు పరస్పరం సంప్రదింపులు జరిపి ఒక ఒప్పందానికి వచ్చారు. ఈ ఒప్పందం మూలంగా ప్రభుత్వం రాజకీయ ఖైదీలందర్ని విడుదల చేసింది.
1931లో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి ఇంగ్లాండ్ వెళ్లాడు గాంధీజీ. ఆ సమావేశం విఫలమైంది. 1942లో సర్ స్టాఫర్డ్స్ క్రిప్స్ ఆధ్వర్యంలో ఒక రాయబారాన్ని ఇండియాకు పంపాడు. సాధ్యమయినంత సత్వర స్వపరిపాలన ప్రసాదించడమేనని నచ్చచెప్పాడు. కాని ఆయనకు కాంగ్రెసు నాయకులకు మధ్య నడిచిన సమగ్ర సంప్రదింపులు విఫలమయ్యాయి. తిరిగి 1942 ఆగస్టు 8న బొంబాయి సమావేశంలో చరిత్ర సుప్రసిద్ధమైన క్విట్ ఇండియా తీర్మానం ఆమోదించ బడింది. గాంధీజీ నాయకత్వాన ఒక అహింసాయుత ప్రజా పోరాటాన్ని ప్రారంభించాలని నిర్ణయం జరిగింది. ఈ తిరుగుబాటులో 10,000 మంది మరణించారు.
1946 ఆగస్టులోను, ఆ తరువాత ప్రజ్వరిల్లిన మత కలహాగ్నులలో స్వాతంత్య్రం రానున్నదన్న ఉత్సాహం కాలి బూడిదైపోయింది. దాంతో గాంధీజీ విచారంలో మునిగిపోయాడు. మత దురావేశాలకు వ్యతిరేకంగా విఫల పోరాటం జరిగింది.
1947 మార్చిలో భారత వైస్రాయిగా వచ్చిన లార్డ్ మౌంట్ బాటన్ కాంగ్రెస్ ముస్లిం లీగ్ నాయకుల్తో మాట్లాడి ఒక రాజీ పథకం రూపొందించాడు. దాంతో దేశం స్వతంత్రమవుతుంది కానీ, సమైక్యంగా ఉండదు. హిందూ ముస్లిం విభజన పోరాటం వల్ల 1947 జూన్ 3వ తేదీన భారత్, పాకిస్తాన్ స్వతంత్ర దేశాలుగా అవతరిస్తాయని ప్రకటన వెలువడింది. దేశాలు విడిపోవడం వల్ల లక్షలాది మంది శరణార్థులై ఇక్కడి వారక్కడికి అక్కడి వారిక్కడికి వరదెత్తుతున్నారు.
1947 ఆగస్టు 15న భారతదేశం తన తొలి స్వాతంత్య్ర దినోత్సవం ఆనందోత్సాహాలతో జరుపుకున్నది. జాతీయ మహోత్సవంలో విషాదానికి ప్రతీకగా గాంధీజీ శోకమూర్తిగా మిగిలాడు. భారత ప్రజలకు సత్యం, అహింస, ప్రేమ, ధైర్యం ప్రబోధించిన మహాత్ముడు, భారతీయ సంస్కృతిలో సర్వోత్కృష్టమైన ప్రత్యంశానికి సంకేతమైన మహాత్ముడు కృంగిపోయాడు. అర్థంలేని మత మారణహోమం ద్వారా స్వాతంత్య్రానికి మూల్యం చెల్లించే అశేష బాధిత ప్రజల్ని ఓదారుస్తూ బెంగాల్ లో పాదయాత్ర చేశాడు. ఉత్సవ ఉత్సాహపు కేకలు, కేరింతలు ఇంకా ముగియక ముందే 1948 జనవరి 30న నాథూరాం గాడ్సే కాల్చి చంపాడు. గాంధీజీ తన యావజ్జీవితాన్ని అంకితం చేసిన హిందూ ముస్లిం ఐక్యతాదర్శ సాధనలో వీరమరణం పొందారు.
ఆయన సిద్ధాంతాలను దేశం, ప్రపంచం నలుమూలలా విస్తరింపజేసి సత్యం, అహింస, శాంతి, ధర్మమార్గాలను మనకు చూపిన ఆదర్శమూర్తి బాపూజీ. జాతికే తండ్రియైనాడు. నిర్మల నిష్కళంక నిరాడంబర మహా మనీషి బాపూజీ.
సకల జనులకు ఆదర్శం గాంధీ చూపిన మార్గం. అతడు ప్రపంచమంతటికి చిరస్మరణీయుడు. కనుకనే అతని జన్మదినాన్ని ప్రపంచమంత చిరస్మరణీయుడు. కనుకనే అతని జన్మదినాన్ని ప్రపంచమంత అహింసా దినోత్సవంగా జరుపుకుంటుంది. అతడు చూపిన మార్గంలో పయనించి ప్రపంచంలో శాంతి, ధర్మం, సత్యం, అహింస సిద్ధాంతాలను నెలకొల్పడమే ఆ మహాత్మునికి మనం ఇచ్చే నివాళి.
జై హింద్