అభివృద్దికి నోచని అడవుల్లో
ఆనవాళ్ళు కరువైన వన్యప్రాణులు
ఆకాశం నిండా
ఆనందంతో స్వేచ్ఛగా
రెక్కలల్లార్చి ఎగరాల్సిన పిల్లపక్షులు
కాలుష్య కాసారాలలో
చిక్కుకు పోతున్న వైనాలు
హాస్టల్ ఇరుకుల గదుల్లో
కోల్పోతున్న చురుకుదనాలు
మార్కుల మహాపందేరంలో
మసకబారుతున్న మస్తిష్కాలు
ర్యాంకుల సాధనే ధ్యేయంగా
శరవేగ మవుతున్న పరుగులు
ధన సంపాదనే లక్ష్యంగా
విలువలకు తిలోదకాలు..
బాల చంద్రుల భవితవ్యంలో
కల్హారాలు మొలిపిస్తున్న
కార్పోరేట్ విద్యా సంస్థలు
ప్రపంచానికి వెల్గులు పంచినోళ్ళం
కంటి దీపాల్ని కొడగట్టించడమేంటి?
చీకటి ఛాయలేవి
అలముకోనీకుండా
రేపటి పౌరుల మేధస్సులో
విలువల జ్యోతుల్ని వెలిగింపజేయాలి
చదువును వ్యాపారం చేస్తున్న
వ్యవస్థలకిక పిండ ప్రధానం చెయ్యాలి.