మనిషి ఎదురుపడితే
పులి ఎదురుపడ్డట్టే
ఆత్మీయ ఆలింగనాలు
సోదర కరచాలనాలు కాదు
‘ఆత్మకు శాంతి కలుగుగాక ‘
సానుభూతుల వెల్లువ –
కడప దాటితే
అమావాస్య అడవిలో ఆగమయినట్టే
ఏ ముట్టడి నుండి
ఏ స్ట్రైన్ కమ్ముకుంటుందో (స్ట్రెయిన్)
భయపడినట్టే ఇల్లు ఇల్లంత వేడెక్కి
ఎవరికి వారు ఒంటరై
అంబులెన్సుల్లో ఆసుపత్రుల్లో
వింత వింత శబ్దాల మధ్య
నల్ల బజార్లో, ప్రార్థనా స్థలాల్లో
ప్రాధేయపు చూపుల ఆశల మిధ్య –
చివరికి శ్వాసకూ శ్వాసకూ మధ్య
ఊపిరాడని పెనుగులాట
చావుకీ బతుక్కీ మధ్య
సమయం దోబూచులాడుతుంది
అది విముక్తో
ఈ నేలను విడిచి పోతున్న విషాదమో –
జీవితమంతా ‘క్యూ’ ల్లో నిలబడీ నిలబడీ
చితి మంటల సాక్షిగా
చివరి యాత్ర ‘క్యూ’ల్లో చిక్కుకుంది
ఇప్పుడు ఏ ఓదార్పులు లేవు
ఓటికుండలు లేవు
ప్రభుత్వాలకు మనం ఒక అంకె మాత్రమే
ఇంతకూ మన ఊపిరితిత్తుల మీద
మృత్యు సంతకం చేస్తున్నది ఎవరు !?
అంతిమ సంస్కారాలకు అడ్డు పడుతున్నది ఎవరు !??