కలిసి నడిచే మనం-కాదులే చెరిసగం
పతిదేవుణ్ణి నేను-చరణదాసివి నువ్వు
ఆధిపత్యం నాది : నాదే పైచేయి
ధర్మపత్నివి నీవు- నీవే నీతల కొంత దించు
నిన్ను వీధిలో అమ్మే దృశ్యాల తాలూకు కమురు వాసన
నిన్ను జనారణ్యంలోనెట్టిన వెగటుదనం
జూదంలో ఒడ్డిన పురాణ మై తోస్తున్నది
పాతివ్రత్యం పరమ భూషణమనే పాత కథ విన్న చెవులు
కొత్త చరిత్రలేమి వింటాయి ?
అన్యమైనవో అనన్య సామాన్యమైన వో
నిను ఏం తీరున చూపెడతాయి
వంశాన్ని నిలబెట్టడమె
కదా నీ వంతు-మాంగల్యం తంతు
నటి గా సఖి గా దాసిగా దాదిగా నీకెన్నో రూపాలు
అయినా దూతికగా
నీజాతి తోనే నిను తార్చాలనుకుంటున్న
మాయాప్రపంచం లో నీవు
తననుగని పెంచేటి సామర్థ్యం నీకు
ఎంతున్నా
అబలవే అంటాడు
అపహాస్యం చేస్తాడు
శీల సంస్కారమే
తగునమ్మ నీకసలు అంటాడు తరుణీ అవే నీ నగలని నమ్మిస్తాడు
తన పనులు వికటించే దాకా
నిన్ను గుర్తింపు గుచ్ఛాలలో విరిసే
“ముగ్ధ”వే నీవంటు ముచ్చటగా పిలుస్తాడు
నీవు మరణిస్తే వేరొకతె నాకు సతి నేను చనిపోతేను సతి నీవంటు నీకు “బ్రతుకు చితి ” అనీ తీర్మానిస్తాడు