ఏడుపన్న నేల ఏవగింపు కలుగు?
ఏడ్పు నందు ముదము నేల గనరు?
ఏడ్పులందు మంచి ఏడ్పులున్నవి గదా!
ఏడ్పు గొప్ప దనము నెరుగ రేల?
అప్పుడ పుట్టు బిడ్డ తన అమ్మ శరీరము వీడి, తానుగా
నిప్పుడమిన్ స్వతంత్రమగు నింద్రియముల్ గల రూపమందునన్
ఎప్పుడు చేరు, నప్పుడిక ఏడుపు తోడనె ఆగమించడే?
గుప్పున వాని ఆప్తు లట గూడి ముదంబున తేలియాడగాన్!
క్రొత్తగ పెండ్లియై మదిని కోరిక లూరు పడంతి శోభనం
పత్తరు వాసనల్ నడుమ, హాయిగ తా తొలిసారి భర్తనే
హత్తుకొనంగ, నాతడు రసార్ద్రతతో రమియింప, సౌఖ్యమున్
ఎత్తుగ కొండ నెక్కినటు లేర్పడ, కంటను నీరు గారదే?
నవమాసంబులు గర్భ ధారణమునన్ నానా విధుల్ కష్టము
ల్లవి యెన్నో భరియించి, నొప్పులను తాళం జాల కేడ్పేడ్చియున్,
భువిపై బిడ్డకు జన్మ నిచ్చి, పిదపా పుట్టుం గనన్, మోదమే
స్రవియించున్ కనులందు నొక్కపరి బాష్పాలౌచు సంవేదనన్!
దిక్కు దివాణమున్ గనక దీనుడునైన అభాగ్యు డొక్కడున్
ఎక్కడ లేని ఓర్పు గొని, ఎంతయొ కష్టపడంగ, చేరి తా
నెక్కుచు మెట్టుపైన మరి యింకొక మె ట్టటు లగ్ర పీఠమున్ –
ఒక్కపరిన్ గతంబు గన, నొల్కవె చుక్కలు కంటి కొల్కులన్?
తాను గన్న సుతుడు తన కళ్ళ ముందరే
ఇంచు కించు కిటుల యెదిగి తుదకు,
అందనంత యెత్తు నగుపించుచున్నచో
తండ్రి కనులు నీట తడిసిపోవె?
ఏడ్పు గొప్పదనం బెవ్వ రెరుగకుండ –
హీనముగ జూతు; రది గాంచి ఏడ్పు వచ్చు!
ఏడ్పుకే ఏడ్పు దెప్పింతు రీ హీన జనులు!
ఏడ్పును, నను, మా ఏడ్పు మమ్మేడ్వనిండు!!
-డా.ఆచార్య ఫణీంద్ర