ఎనిమిదేళ్ల అమ్మాయికి
చాక్లెట్ ఆశ చూపి లైంగికంగా, అత్యాచారం చేయబోయిన పదిహేడేళ్ల అబ్బాయి.
ప్రేమించిన వ్యక్తిని
తన తల్లిదండ్రులు వద్దన్నారని,
కూతురు ఆత్మహత్య.
అబ్బా..పొద్దున లేచి పేపరు చూస్తే చాలు ప్రతిరోజు ఇలాంటి వార్తలే ఎక్కువయ్యాయి.
అనుకుంటున్న ధరణికి
ధరణీ…!
అన్న భర్త పిలుపుతో
ఏంటండీ..! అన్నది చికాకుగా ధరణి.
ఏందిరా! పొద్దున్నే వేడి వేడిగా కనిపిస్తున్నావు అన్నాడు భర్త మధుకర్.
ఏంటో..? చెప్పండి !
మీకు వేడివేడిగా టీ ఇవ్వాలి. అంతేగా.. వస్తున్నా అంటూ పేపర్ అక్కడ టీపాయ్ పై పడేసి కిచెన్ లోకి వెళ్లి భర్తకు అల్లం టీ ఇష్టం కాబట్టి అల్లం వేసి, టీ..కాచి తీసుకొనివచ్చి మధుకర్ కి ఇచ్చింది ధరణి.
నీ చేతితో చేసిన చాయ్ అమృతమోయ్ అన్నాడు మధుకర్.
అవును మరి అమృతం తాగుతూ వెయ్యిళ్లు బతుకుదాం ఈ కలియుగంలో జరిగే అరాచకాలను చూస్తూ అన్నది ధరణి చిరు కోపంతో..
నిజంగా నీవు పేరుకు తగ్గట్టే నా పాలిటి వరం ధరణి. భూదేవి అంత ఓర్పు, సహనం కలిగిన భార్యను నాకు అందించాడు ఆ దేవుడు. ఎన్నడూ లేనిది
ఎందుకో నా శ్రీమతి ఈరోజు చిటపటలాడుతుంది అన్నాడు ఓరకంట ధరణిని చూస్తూ మధుకర్.
ఏం లేదండి ! మీ అమృతం చల్లారిపోతుంది ఆస్వాదించండి అన్నది ధరణి.
టీవీ ఆన్ చేసి టీ తాగుతున్నాడు మధుకర్.
టీవీ లో కూడా పేపర్లో వచ్చిన న్యూస్ లే రిపీట్ గా వస్తున్నాయి.
టీవీ లో కూడా అవే న్యూస్ లు మనసుకు బాధగా ఉంది. చానెల్ మార్చండి అన్నది ధరణి.
ఏందిరా? ధరణీ!
ఈరోజు డిసప్పాయింట్ గా ఉన్నావ్ ఏంది సంగతి అన్నాడు మధుకర్.
ఏముందండీ…!
ఏ పేపర్ వార్తలు చూసినా, ఏ ఛానల్ న్యూస్ విన్నా, ఏమున్నది గర్వకారణం
నరజాతి సమస్తం
అత్యాచారాలు, ఆత్మహత్యలు.. మానవత్వాలను మరిచి
మనసును తొలిచే వార్తలు
అన్నది ధరణి.
వాహ్వ వాహ్వ సూపర్ రా!
వార్తలపై కూడా కవిత్వం
చెప్తున్నా ఓయ్ నువ్వు అన్నాడు ధరణిని నవ్వించాలని మధుకర్.
మీ పరిహాసం చాలు కానీ,
ఈరోజు నాకు శ్రీ శారద కళాశాల వాళ్ళ వార్షికోత్సవం ఇన్విటేషన్ ఉంది. త్వరగా వెళ్లాలి. మీరు కొంచెం నన్ను అక్కడ డ్రాప్ చేసి సచివాలయానికి వెళ్ళండి అన్నది ధరణి.
నీవు నీ కారు తీసుకుని రాముని తీసుకొని వెళ్ళు అన్నాడు మధుకర్.
ఎందుకండీ! మీరు వెళ్ళే దారిలోనే కదా ఆ కాలేజ్ వున్నది.ఇంధనం ఖర్చు దండగ చేయడం. రోడ్డుపైన మన రెండవ వెహికిల్ వల్ల ట్రాఫిక్ ,పొల్యూషన్ చేసుకుంటున్నాము.
అత్యవసరం లేకున్నా బయటికి వెళ్లడం వల్ల రోడ్డు పైన వాహనాలు ఎక్కువై, మనిషి నడిచే దారి కూడా లేకుండా వాహనాలు ఎక్కువగా ఉంటున్నాయి. అన్నది సామాజిక బాధ్యత గల ధరణి.
వచ్చేటప్పుడు ఎట్లా వస్తావు అన్నాడు మధుకర్.
ఏదో ఒక ఆటో లో వస్తాను.
నేనిచ్చే ఆటో డబ్బు వల్ల
ఆటో వాడి కుటుంబ అవసరాలకైనా
డబ్బు ఇచ్చినదాన్ని అవుతాను అన్నది.
నేను అందుకే చెప్పాను. ఇంట్లో ఒక కారు ఉంటే చాలు రెండవ కారు వద్దు అని.
ఒక ఇంట్లో రెండు మూడు కార్లు కొనుక్కొని, మన పర్యావరణాన్ని రోడ్లను, ఇంధనాన్ని పాడు చేసుకుంటున్నాము. వాయి కాలుష్యాన్ని మనకు మనమే పెంచుకుంటున్నాం అన్నది ధరణి.
అందరూ నీలాగే ఆలోచిస్తే బాగానే ఉంటది. కానీ, వాళ్ళ స్టేటస్లు
వాళ్ళ అవసరాలు, డబ్బుంది కదా అని కారు కొనడం జరుగుతుందేమో అన్నాడు మధుకర్.
ఇట్లానే ప్రతి ఒక్కరు అనుకోవడం వల్లనే మన ఇండియాలో రోడ్లు చిన్నవిగా వాహనాలు ఎక్కువగా అయ్యాయి. రోడ్లు పాడైతే బాగుచేసే నాధుడే లేడు. ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా వాళ్లు బాగుపడడం తప్ప, మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటుంది అన్నది ధరణి.
వాచ్ వైపు చూసి
అమ్మో టైం అవుతుంది. మనం వెళ్ళాలి పదండి.త్వరగా
రెడీ అవ్వండి అన్నది ధరణి.
మధుకర్ వెళ్లే దారిలో
శ్రీ శారద కళాశాలలో
ధరణిని డ్రాప్ చేసి వెళ్ళాడు మధుకర్.
శ్రీ శారద జూనియర్ కళాశాల ప్రోగ్రాం స్టార్ట్ అయింది.
ఆ కళాశాల మేనేజ్మెంట్ కరస్పాండెంట్ దిలీప్ కుమార్ గారు మాట్లాడుతూ
మా విద్యార్థిని, విద్యార్థులకు
మీ యొక్క అమూల్యమైన సలహాలు, వారి యొక్క భవిష్యత్తుకి మార్గదర్శకాలు ఇస్తారని ఆశిస్తూ ప్రముఖ సైక్రియాటిస్ట్
ఎన్నో అవార్డులను పొందిన
డాక్టర్ ధరణి మధుకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అన్నాడు కరస్పాండెంట్ దిలీప్ కుమార్ గారు.
డాక్టర్ ధరణి గారు లేవడంతో అక్కడ ప్రదేశమంతా, కరతాళధ్వనులతో స్వాగతం పలికారు.
డాక్టర్ ధరణి మాట్లాడుతూ
చదువులతల్లి, జ్ఞానజ్యోతి అయిన సరస్వతీ దేవి పేరు మీద శ్రీ శారద జూనియర్ కళాశాల వారు ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుని తొమ్మిదవ వసంతానికి విచ్చేసిన శ్రీ శారద కళాశాల డైరెక్టర్ కరస్పాండెంట్ దిలీప్ కుమార్ గారికి,
గ్రూప్ ఆఫ్ డైరెక్టర్ ప్రిన్సిపాల్ గారికి టీచింగ్ స్టాఫ్ అందరికీ
నా నమస్కారాలు.
శ్రీ శారద కళాశాలకి వన్నె తెస్తున్న విద్యార్థినీ, విద్యార్థులకు
నాయొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
ఇక్కడి వేదిక అంతా చూసిన తర్వాత కొంతమంది ప్రసంగాలు ఇచ్చారు.
నేను అంత గొప్పగా మెసేజ్ లు ఇచ్చేదాన్ని కాదు అనుకుంటున్నాను.
నేను ఏడవ క్లాస్ నుండి మెడికల్ కాలేజ్ వరకు ఆర్టీసీ బస్సులో అన్ని సంవత్సరాలు ప్రయాణం చేస్తూ స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం వారికి కేటాయించిన సీట్లను వారినే కూర్చొనిద్దాం.
అని బస్సులో రాసిన దానికి నేను ఇంప్రెస్ అయ్యేదాన్ని. ఇక్కడ కూడా అలాంటి
సత్ సంప్రదాయమే చూపించిన మగపిల్లల అందరికీ హ్యాట్సాఫ్ టు యు.
అప్పటినుండి మీ అందరిని చూస్తూనే ఉన్నాను. టూ అవర్స్ నుండి అబ్బాయిలు అందరు నిల్చున్నారు. అమ్మాయిలు అందరూ హ్యాపీగా కూర్చున్నారు.
స్టేజ్ పైన అబ్బాయిలు, అమ్మాయిలు ప్రదర్శించిన ప్రోగ్రామ్స్ ని,
పెద్దవాళ్లు ప్రసంగించిన ప్రసంగాలను వింటూ.. ఎలాంటి కామెంట్స్ లేకుండా ఎక్సలెంట్ డిసిప్లేన్ గా ఉన్న
శ్రీ శారద జూనియర్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు అందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను.
“విద్య దదాతి వినయం” అంటారు.
ఆ వినయ విధేయతలు ప్రతీ విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శిస్తే మన సమాజము చాలా బాగుపడుతుంది.
ఈ సందర్భంగా మీకు ఒక చిన్న కథ చెప్పాలి అనుకుంటున్నాను.
మీ ముందుండే భవిష్యత్తుకి ఆలోచన చేయాలని ఈ స్టోరీ చెప్తున్నాను చెప్పమంటారా అన్నది ధరణి.
స్టేజి ముందు నుండి పిల్లలందరూ ఏకధాటిగా చెప్పండి మేడం అన్నారు.
ఒక ఊరు ఉందంట. అందులో చుట్టూ ప్రకృతి అందాలతో కూడిన చెట్లు
వాటి మధ్య నదులు, అన్ని వనరులతో కూడిన స్థలాలు ఉన్నాయి.
ఆ ఊరిలో భారతమ్మ అనే మహిళ ఉంది. ఆ భారతమ్మ స్థలాన్ని కబ్జా చేయాలన్న ఆలోచనతో ఒక దొర
ఆ భారతమ్మ దగ్గర ఉన్న ఆ వూరి మనుషులను తనవైపు తిప్పుకొని
స్వార్థంతో ఆ స్థలాన్ని కబ్జా చేశాడు.
కానీ, భారతమ్మ పట్టుదలగల మనిషి. తన పిల్లలను చూసుకోవాలి.
తాను పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని అనుకుంది.
తన ఆస్తిని కాపాడుకోవాలని, ఉద్యమాలు చేసి ధర్నాలు చేసి ఎంతో ధైర్యంతో కష్టపడి పోరాడి మొత్తానికి ఆ కబ్జా చేసిన దొరని
బయటికి పంపింది. తన స్థలాన్ని తాను కాపాడుకోగలిగింది.
ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారంట. ఆ ఇద్దరు కూతుళ్ళని పెళ్లిళ్లు చేసి తన ఆస్తిని ఇచ్చి గొప్ప వాళ్ళను చేసింది.
ఆ తర్వాత కొద్ది రోజులకు భారతమ్మ స్వర్గస్తురాలయింది.
పెద్ద కూతురు పిల్లలు పెద్ద కుటుంబంలో ఉంటూ.. మంచి సాంప్రదాయాలతో.. వినయవిధేయతలతో… భారతమ్మ కుటుంబానికి వన్నె తెచ్చే విధంగా
పెరిగి పెద్దవాళ్ళు అయ్యి బాగా చదువుకొని మానవత్వంతో.. మెదులుతూ.. గొప్పగా ఎదిగి భారతమ్మ కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టారు.
చిన్న కూతురు పిల్లలు మాత్రం కొత్త పోకడలకు అలవాటు పడి మద్యానికి, మత్తు పదార్థాలకు బానిసలై, కొత్తగా వచ్చే వింత రోగాలు తెచ్చుకొని మానవత్వపు విలువలను మరిచి అక్రమాలు, అత్యా చారాలు చేస్తూ భారతమ్మ కుటుంబానికి చెడ్డపేరు తీసుకొచ్చే దశలో ఉన్నారు.
పైనున్న భారతమ్మ ఆత్మకి
పెద్ద కూతురు పిల్లలను చూసి ఆనంద పడాలో… చిన్నకూతురు పిల్లలను చూసి బాధపడాలో..అర్థం కాలేదట.
ఎప్పుడు కూడా తల్లి తన పిల్లలు ఆనందంగా, సుఖంగా ఉన్న పిల్లలను చూసి సంతోష పడడం కన్నా..,చెడుదారిలో తిరిగి చెడ్డపేరు తెచ్చుకుంటున్న పిల్లలను చూసి బాధ పడడమే ఆ తల్లి యొక్క లక్షణం.
కాబట్టి పైనున్న భారతమ్మ ఆత్మకు పెద్దకూతురు పిల్లలు చేసిన మంచి పనులకన్నా..,
చిన్నకూతురు పిల్లలు చేస్తున్న చెడ్డ పనులకు.. ఆమె ఆత్మ ఎప్పుడు క్షోభిస్తుందంట.
ఆ భారతమ్మ మరెవరో కాదు. మన భారతమాత.
అని డాక్టర్ ధరణి గారు మాట్లాడుతూ వుంటే
వెంటనే అక్కడి వాళ్ళందరూ
తమ చేతులతో చప్పట్లు కొట్టారు.
విద్యార్థిని ,విద్యార్థులకు మిగతా సందేశాన్ని అందించాలని తిరిగి మళ్ళీ మాట్లాడింది ధరణి.
భరతమాత మొదటి పిల్లలు ఇంత కష్టపడి తెచ్చుకున్నదే స్వాతంత్ర్యం.
ఆ స్వాతంత్ర్యం తెచ్చుకున్న తర్వాత చాలా మంది మహనీయులు ఎన్నో త్యాగాలు చేసి భారతదేశానికి ఒక విశిష్టమైన స్థానాన్ని తీసుకువస్తే…
రెండో పిల్లల వారసులుగా ఉన్నటువంటి కొంతమంది కొత్త తరహా పోకడలకు బానిసలై భరతమాతని అవమానించేలా… అత్యాచారాలు ,హత్యలు అక్రమాలు చేస్తూ మానవ విలువలను మరిచి
ఆ తల్లిని బాధ పెడుతున్నారు.
ప్రతి విద్యార్థిని, విద్యార్థులు
ఆ భారతమ్మ పెద్ద కూతురు పిల్లలుగా ఉండి భారతదేశానికి వన్నె తెచ్చే విధంగా ఉండాలి.
మీరు ఎంచుకున్న రంగంలో..
ఆ రంగం ఏదైనా కానివ్వండి…
పాలిటిక్స్ కావచ్చు.. స్పోర్ట్స్ కావచ్చు పోలీస్ ఆఫీసర్ కావచ్చు.. టీచర్స్ కావచ్చు…వాట్ ఎవర్..?
ఇట్ ఇస్.. మీరు ఎంచుకున్న రంగంలో ముందుగా..మీ కుటుంబానికి… సమాజానికి, భారతదేశానికి మంచి పేరు తీసుకువచ్చేటటువంటి స్టేజీలో మీరందరూ ఉండాలి.
ఇంటర్మీడియట్ అంటేనే ముందువచ్చే మీ భవిష్యత్తుకి ఒక బ్రిడ్జి లాంటిది.
ఆ బ్రిడ్జికి ఖచ్చితంగా…
మంచి అనే గట్టి పునాదులు ఉండాలి.
అట్లా ఉన్నప్పుడే సమాజానికి
మీరు బంగారు బాటలు వేయగల దిశలో ఉంటారు .
ఇది ఎందుకు చెప్పాలనుకున్నాను అంటే..
ఈ సమాజంలో జరిగే చెడు విషయాల పై ఒక తల్లి పడే ఆవేదన ఇది.
ఇండియా ఇస్ ఏ ల్యాండ్ విచ్ యాజ్ రిచ్ రిసోర్సెస్ ఆఫ్ ఎవ్రీథింగ్.
నాలెడ్జి లో మనం నెంబర్ వన్.రిసోర్స్ లో మనం నెంబర్ వన్. నేచురల్ రిసోర్స్ లే కాకుండా.. హ్యూమన్ రిసోర్స్ కూడా..
ఇండియా ఇస్ ది బెస్ట్ కంట్రీ.
ఆ హ్యూమన్ రిసోర్స్ లో పెద్ద స్థానం వహిస్తున్న వారెవరో.. కాదు.అది మీరే..
విద్యార్థినీ, విద్యార్థులు.
అందుకే మీకంటూ.. ఒక విశిష్టమైన స్థానం ఉంది.
ఈ స్టేజ్ లో మీరు నడిచే మంచి మార్గంలో.. రేపు మీ కుటుంబమే, కాకుండా మన రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు కూడా..
మీ పై ఆధారపడి ఉంది అనడంలో అతిశయోక్తి లేదు.
విద్యార్థులు ఇప్పుడున్న పరిస్థితుల్లో సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ని సెల్ ఫోన్ ద్వారా మిస్ యూజ్ చేసుకుంటున్నారు.
ఒక రాయిని ఇద్దరికీ చెరోకటి ఇస్తే..
తెలివైన విజ్ఞత కలిగినవాడు దానిని శిల్పంలా చెక్కి.. అతని విజ్ఞానాన్ని ప్రూవ్ చేసుకుంటాడు.
అదే తెలివిలేనివాడు ఆ రాయిని
ఏం చేయాలో తెలియక ఎవరి తల పలగొట్టాలా..అని ఆలోచిస్తాడు.
అట్లా ఉంది ఇప్పుడున్న సైంటిఫిక్ టెక్నాలజీ.
మీ వయసు నుండి ఆ సెల్ఫోన్ అనే విప్లవాన్ని మంచి దారిలో పెట్టి
మీరు సమాజంలో మంచి బాటలో నడవాలి.
నేను చెప్పే ఈ సెల్ ఫోన్ మిస్ యుజ్ గురించి… మీరు.. నన్ను అడగొచ్చు.
ఏంటి..? మేడం..!
సైంటిఫిక్ అనే టెక్నాలజీనీ అందరూ.. మిస్ యూజ్ చేసుకుంటున్నారా..? అని…
అందుకే నేను ముందే చెప్పాను మీకు.
ప్రతి తల్లికి బాగుపడిన కొడుకు,కూతురు కంటే చెడిపోయిన వారి గురించే ఎక్కువగా.. ఆవేదన చెందుతుందని.
సాంకేతికంగా మన భారతదేశం
చాలా ముందడుగు వేస్తుంది.
మేము మా జనరేషన్ లో చూసిన దానికన్నా.. మీరు మీ జనరేషన్లో
చూసే సాంకేతిక పరిజ్ఞానాలు చాలా ఉన్నాయి.
నేను చిన్నప్పుడు ఒక ఎస్సై రైటింగ్ కాంపిటీషన్ కి ప్రిపేర్ కావాలంటే..
గ్రామం నుండి దగ్గరలో ఉన్న సిటీకి వెళ్లి లైబ్రరీ బుక్స్ చదివి తెలుసుకునే వాళ్లం.
ఈరోజు మీరు గూగుల్ సెర్చ్ ఆన్ చేసి అందులోని ఇన్ఫర్మేషన్ని తీసుకొని ఈజీగా వెళ్లగలిగే పరిస్థితి ఉంది.
అంటే మీరు ఎంత మంచి స్థితిలో ఉన్నారో.. ఆలోచించండి.
మేము లైబ్రరీలో బుక్స్ అన్నీ చదివి
ఒక రోజంతా కష్టపడి ఒక పేజీ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసే వాళ్ళం.
అట్లాంటి పరిస్థితుల్లో మేము చదువుకుని వచ్చాం.
మీరు కేవలం ఒక క్లిక్కుతో…
మీ కళ్ళ ముందు పెట్టుకొనే, అద్భుతమైన పరిస్థితి ఉంది.
ఈ అద్భుతమైన స్థానాన్ని ఎంతవరకు మనము మంచికే.. ఉపయోగించాలి. అని మీరు మీ..మనోభావాలకు వేసుకునే ప్రశ్న…?
దాన్నే.. ఇంట్రాస్పెక్షన్ అంటారు.
అంటే అంతర్మధనం అన్న మాట.
మన ప్రకృతికాని సమాజంగాని
దేశంకానీ, తల్లిదండ్రులుకానీ,
అందరూ ఇచ్చినటువంటి అవకాశం మనం ఏవిధంగా సద్వినియోగం
చేసుకుంటున్నాము.
అనేది ఈ రోజు మీరంతా ఆలోచనచేసి దానికి అనుగుణంగా మీరు ప్రవర్తిస్తే మన సమాజంలో చెడు అనేది జరగకుండా ఉంటుంది అనేది
నా భావన.
నేను ఎందుకు మీకు..
ఇట్లా.. చెప్తున్నానంటే..
నా దగ్గరికి ఒక పేరెంట్స్ తన కూతుర్ని తీసుకొని వచ్చారు.
ఆ అమ్మాయి చిన్నప్పట్నుండి చాలా బాగా చదువుకున్న తెలివికల అమ్మాయి.
ప్రతి దాంట్లోనూ.. మెరిట్ గా
ఉండేదంటా..
అలాంటి అమ్మాయి యుక్తవయస్సు వచ్చినాక,..సాంప్రదాయాలను మరిచి విదేశీ స్టైల్లో… దాచుకోవలసిన శరీర భాగాలను దాచుకోకుండా..
డిగ్నిటీ అనే పదాన్ని మరిచి వస్త్రధారణ చేసుకుంటూ…
అదో ట్రెండ్ గా స్నేహితులతో
చెడు మార్గంలో పడింది. ఆ అమ్మాయి పరిస్థితి చూసి తల్లిదండ్రులు వద్దని వారించినా… వినకుండా..
నా రైట్స్ నాకు ఉన్నవి.
నా స్వేచ్ఛను, నా నిర్ణయాన్ని నేను తీసుకోగలను. అంటూ.. సెల్ ఫోన్ తోనే గడిపేదంటా.
సెల్ ఫోన్ తీసి ఆ అమ్మాయికి దూరంగా ఉంచితే..
నేను మేజర్ ని మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు.నాకు కొన్ని హక్కులు వున్నాయి. అంటూ తల్లిదండ్రుల్ని ఎదిరించి చెడుబాటలో పయనించింది.
పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్న వాడితో ప్రేమ పేరుతో మోసపోయి డ్రగ్స్ కి బానిసై డిప్రెషన్లోకి వెళ్లి పోయింది.
ఆ పరిస్థితుల్లో ఉన్న కూతురిని చూస్తూ ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంమై వాళ్లు ఏడ్చుకుంటూ.. వచ్చారు.
ఇది ఎందుకు చెప్పానంటే..
ఈ రోజుల్లో వందకి యాభై శాతం మంది పిల్లలు వాళ్ళ బాధ్యతలను మరిచిపోయి హక్కులకోసం పోరాడుతున్నారు.
మీకు సోషల్ జస్టిస్,మోరల్ జస్టిస్
మీ దగ్గరే ఉంటాయి.
హక్కులకోసం ఎట్లా..? అయితే కొట్లాడుతున్నారో… అట్లాగే బాధ్యతలు కూడా ఉంటాయి అనేది గ్రహించాలి.
ఏ రాజ్యాంగం అయితే మనకు హక్కులు ఇచ్చిందో… అదే రాజ్యాంగం మనకు బాధ్యతలు కూడా ఇచ్చింది.
ఈ రోజు మీరు ఉండే విధానమే,
మీ ముందు తరానికి ఆదర్శం కావాలి.
తల్లిదండ్రుల పైన బాధ్యత,
సమాజం పైన బాధ్యత,
దేశం పైన బాధ్యత..
డిగ్నిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ ఇవన్నీ…
మీరు చేస్తూ.. మంచి బాటలో పయనించాలి.
మన ఈ సమాజాన్ని మంచి దారిలో నడిపిస్తారని ఆశిస్తూ… ఆకాంక్షిస్తూ.. సెలవు తీసుకుంటున్నాను.
అని చెప్పింది డాక్టర్ ధరణి.
డాక్టర్ ధరణి గారు చెప్పిన అమూల్యమైన వాక్యాలకు
అక్కడ ఉన్న పెద్దలు, విద్యార్థిని విద్యార్థులు వాళ్ల కరతాళధ్వనులతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.
