ఎందరో
మేధావులు…
సమతా వాదులు…
సంఘ సంస్కర్తలు…ఈ
పుణ్యభూమిలో జన్మించి
మెరుగైన సమాజం కోసం…
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం…
ప్రజల్లో సామాజిక చైతన్యం కోసం…
ఎన్ని సందేశాలిచ్చినా…
ఎన్ని హెచ్చరికలు చేసినా…
తమ జీవితాలను ఫణంగా
పెట్టి ఎన్ని ఉద్యమాలు
ఎన్ని పోరాటాలు చేసినా…
ఎంతగా పరితపించినా…
ఎంతగా ఆశపడినా…
ఎంతగా ఆరాటపడినా…
“విప్లవాత్మకమైన
మార్పులు” రాకపోవడానికి…
“ఆశించి ప్రగతి”
కనిపించక పోవడానికి
కారణాల చిట్టా చూద్దామా…
పేదవాళ్లలో…
ధైర్యం లేకపోవడం…
సాహసం చేయకపోవడం…
అంతులేని అమాయకత్వపు
అజ్ఞానాంధకారంలో మునిగిపోవడం…
మధ్యతరగతి వారికి…
సమయం లేకపోవడం…
సమిష్టిగా స్పందించక పోవడం…
ధనవంతులకు దాసోహం అనడం …
పేదవారిపై పెత్తనం చెలాయించడం…
చైతన్య రహితులై మౌనవ్రతం దాల్చడం…
ధనవంతులకు…
అవసరం లేకపోవడం….
చీకటి వ్యాపారాలు చేసి
దొరికినంత దోచుకోవడం…
స్విస్ బ్యాంకుల్లో దాచుకోవడం…
అట్టడుగు వర్గాల్ని అణగద్రొక్కడం…
మధ్యతరగతి వారిని మాయచేయడం…
ప్రభుత్వాలను గుప్పిట్లో పెట్టుకోవడం….
మరి …
సమసమాజం నిర్మాణ స్థాపనెప్పుడు?
దేశంలో శాంతిసౌభాగ్యాలు వర్థిల్లేదెప్పుడు?
మనిషి మనిషిలో…
మానవత్వం వికసించినప్పుడు…
పేదలు…
ఆర్థిక అసమానతలనుండి బానిసత్వపు
భావనలనుండి విముక్తి పొందినప్పుడు…
మధ్యతరగతి ప్రజల్లో…
విజ్ఞాన జ్యోతులు వెలిగినప్పుడు…
విప్లవజ్వాలలు రగిలినప్పుడు…
ధనవంతుల చేతుల్లో…దాతృత్వం
గుండెల్లో…దైవత్వం పొంగి పొరలినప్పుడు.