అవును
నన్ను పట్టి చూపింది
ఆ పువ్వే.
నా ఆనవాళ్లు ఆ పువ్వే
నాది బతుకమ్మ జాతి.
ఖరీదైన పువ్వులు
ఎన్నైనా ఉండొచ్చు!
కొప్పులకు ఎక్కే పువ్వులు
కోకొల్లల్లుండొచ్చు!
ఆత్మగల్ల పువ్వు మాత్రం
అదొక్కటే.
ఈ మట్టి సంస్కృతిని
పట్టి చూపిన పువ్వు.
వానకు పసుపుపచ్చ
ముత్యమై మురిసింది.
ప్రకృతి చీరపై
పట్టు అంచుగా మెరిసింది.
ఆమే ఓ పార్వతి
ఆమే ఓ శక్తి స్వరూపిణి .
పెతరమాస నాడు
ఎంగిలి పువ్వై,
సద్దుల బతుకమ్మ నాడు
తాంబాల మంతై ,
వనం లోంచి వనం
ప్రకృతి లోంచి ప్రకృతి
ఆమెకే చెల్లింది.
అడవిని కాస్తున్న తల్లి ఆమె.
సబ్బండ వర్ణాల
మనసుల్లో నిలిచిన పువ్వు.
నా యాసకు
నా భాషకు
తానే నిలువెత్తు ప్రతీక.
రుద్రమ్మ పౌరుషం
సమ్మక్క సారక్క వీరత్వం
ఐలమ్మ ఆక్రోశం
వీరనారీల ఒక్కరూపు
మా బతుకమ్మ.
ఆడబిడ్డల
మనసుల్లో నిలిచింది.
వాళ్ళ గొంతుల్లో
పాటై పరుగులెత్తింది.
అస్తిత్వ పోరాట
ఆయుధ మైంది.
బతుకమ్మను
ఒక్కసారి తలకెత్తుకో
నువ్వెవరో నీకే తెలుస్తుంది.