నరసింహపురం అనే గ్రామంలో రాము, సోము అనే ఇద్దరు బాలురు ఉండేవారు. వారిద్దరూ మంచి మిత్రులు. వారు ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారు.
ఒకసారి వారిద్దరికి పొరుగూరుకు వెళ్లవలసిన అవసరం కలిగింది. వెంటనే వారు ఇంటిలో చెప్పకుండా కాలినడకన అక్కడికి ప్రయాణం ప్రారంభించారు. వారు ఎన్నడూ ఆ దారిలో అంత దూరం నడిచి ఎరుగరు . వారికి చాలా ఆకలి అయింది . దారిలో వారికి దోసకాయలు కనిపించాయి. వారు ఆకలితో ఆ రెండు దోసకాయలు తెంపుకొని తిని తిరిగి బయలుదేరారు. మరికొద్ది దూరం వెళ్లేసరికి వారికి మళ్ళీ ఆకలైంది . వెంటనే వారు దారిలో కనిపించిన మొక్కలకు ఉన్న టమాటాలను తీసుకొని తిన్నారు . ఆ తర్వాత వారు తిరిగి ప్రయాణం సాగించారు.
ఇంకా కొంత దూరం వెళ్లేసరికి వారికి తిరిగి ఆకలి అయింది. ఒక గ్రామ సమీపంలో వారు మళ్ళీ ఒక తీగకున్న రెండు కాయలను చూసి వాటిని కోసుకొని తిన్నారు. ఆ తర్వాత వారు వాంతులు చేసుకున్నారు. వెంటనే ఒక బాటసారి వారిని చూసి ఆ గ్రామంలో గల వైద్యుని వద్దకు తీసుకొని వెళ్ళాడు . ఆ వైద్యుడు వారిని ఏమి తిన్నారని ప్రశ్నించాడు . వారు దోసకాయలు, టమాటాల పేర్లు చెప్పారు. తర్వాత వైద్యుడు వారిని ఇంకా ఏమి తిన్నారని ప్రశ్నించాడు. అప్పుడు వారు మూడవసారి తిన్న కాయల పేర్లు తమకు తెలియదని అన్నారు.
అప్పుడు వైద్యుడు వారిని మందలించి “ఓ పిల్లలూ! మీరు ఇంట్లో అమ్మా నాన్నలకు చెప్పకుండా రావడం మీ మొదటి తప్పు. మీరు ఎవరిని అడగకుండా దొంగతనంగా ఆ కాయలను తినడం మీ రెండవ తప్పు. ఆ కాయలు విషతుల్యమైనవి. సమయానికి మీ అదృష్టం కొద్దీ ఈ బాటసారి తీసుకొని రావడం వల్ల మీకు మంచి జరిగింది. అంతేకాకుండా సమయానికి నేను చికిత్స చేయడం వల్ల మీరు బ్రతికారు. మీరు ఎవరిని అడగకుండా ఆ విషపు కాయల మంచి చెడులు తెలుసుకోకుండా తినడం మీ మూడవ తప్పు. నేను ఇలా అంటున్నానని మీరు ఏమీ అనుకోకండి. మీ మంచి కోరే నేను ఈ మాటలను అంటున్నాను. మరొకసారి ఇలా దొంగతనంగా ఆ విషపు కాయలను తెంపి తినకండి. అది మీకే నష్టం”అని మందలించాడు.
వారు సరేనని అప్పటినుండి తాము తినబోయే కాయల గురించి ఇతరులను అడిగి తెలుసుకుని అవి కోసుకొని తినడం ప్రారంభించారు. అందుకే పిల్లలూ! మనకు కనబడిన ప్రతి కాయను, పండును తినకూడదు. ఆ తెలియని కాయలను, పండ్ల గురించి ఇతరులను అడిగి తెలుసుకోవాలి. లేకుంటే ఇలాంటి ఇబ్బందులు తప్పవు.
సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,
సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,
సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ఇంటి నెంబర్ 11-52, గోదావరి రోడ్ , ధర్మపురి - 505 425 ,జగిత్యాల జిల్లా, తెలంగాణ . మొబైల్: 9908554535 9392248587. సంగనభట్ల చిన్న రామకిష్టయ్య గారు 1959 వ సంవత్సరంలో తెలంగాణ లోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో జన్మించారు. వీరు ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేసి 2017 లో పదవీ విరమణను పొందారు. వీరు గత 20 సంవత్సరాలుగా బాల సాహిత్యాన్ని వ్రాస్తున్నారు. వీరి రచనలు అనేక పత్రికలలో ప్రచురితమైనాయి. వీరు ఇంతవరకు 450 పైన పిల్లల కథలు వ్రాశారు. వాటిలో చాలావరకు కథలు ప్రచురింప బడ్డాయి. ఇంకా ప్రచురింపబడుతూనే ఉన్నాయి. వీరికి బాలసాహిత్యంలో ఇప్పటివరకు రెండు అవార్డులు కూడా వచ్చాయి. అవి రంగినేని ట్రస్ట్ సిరిసిల్ల వారి ప్రతిభా పురస్కారం- 2019 మరియు శ్రీ వాణి సాహిత్య పరిషత్ ,సిద్దిపేట వారి పెందోట బాల సాహిత్య పురస్కారం - 2019. వీరు ఇంతవరకు 2 శతకాలు, 3 బాలల కథా పుస్తకాలను ప్రచురించారు. ఇంకా రెండు పుస్తకాలు ప్రచురణలో ఉన్నాయి.
నరహరిపురం లోని శరభయ్య పొలం పనిచేసి సాయంత్రం తన మిత్రుడైన రామయ్యతో ఇంటికి తిరిగి వస్తున్నాడు. అతని చేతిలో ఒక పెద్ద కర్ర ఉంది. దారిలో ఒక నాగుపాము అతనిని కరవడానికి వచ్చింది. శరభయ్య తన చేతిలోని కర్రను చూపి దానిని బెదిరించాడు . ఆ కర్రచప్పుడుకు ఆ పాము భయపడి వెనుకకు తిరిగి పారిపోయింది. తర్వాత ఆ శరభయ్య మరికొంచెం దూరం వచ్చేసరికి ఒక కుక్క అతని వద్దకు వచ్చింది. వెంటనే శరభయ్య తన చేతిలోని కర్రను చూపి దాన్ని కూడా బెదిరించాడు. అది కూడా భయపడి పారిపోయింది.
ఆ తర్వాత అతడు ఇంటి పొలిమేరల వద్దకు వచ్చేసరికి అతని వద్దకు ఒక లేగ దూడ పరిగెత్తుకుంటూ ఎదురుగా వచ్చింది. వెంటనే శరభయ్య తన చేతిలోనున్న కర్రను కింద పడవేసి ఆ లేగ దూడను తన చేతులతో ఆప్యాయంగా ఎత్తుకున్నాడు .
అప్పుడు ఇదంతా చూసిన రామయ్య ” ఏమయ్యా శరభయ్యా! నాకొక సందేహం వచ్చింది. ఎందుకో నాకు నీ వాలకం అర్థం కాలేదు. ఆ పామును, కుక్కను నీవు నీ చేతనున్న కర్రతో బెదిరించావు. మరి ఈ లేగదూడనేమో నీ చేతులతో ఎత్తుకున్నావు. ఇదేమిటి! పోనీ ఆ పాము విషపురుగు కనుక బెదిరించావు. సరే! కానీ ఆ పెంపుడు జంతువైన ఆ కుక్కను కూడా నీవు ఎందుకు బెదిరించావో నాకు అర్థం కాలేదు” అని అన్నాడు.
అప్పుడు శరభయ్య ” ఔను. నీవన్నది నిజమే. ఆ పాము విషపురుగు. అందులోనూ అది నన్ను కాటేయడానికి వచ్చింది. అందుకే దానిని నా కర్రతో బెదిరించాను. అందువల్లనే అది వెనుకకు తిరిగి పారిపోయింది. ఇక ఆ కుక్క నన్ను కరవడానికి వచ్చింది. అది పెంపుడు జంతువే. కాదనను. కానీ అది పిచ్చికుక్క. మనను పిచ్చికుక్క కరిస్తే ఎంత ప్రమాదమో నీకు తెలియంది కాదు. అందుకే దానిని కూడా నా చేతిలోని కర్రతో బెదిరించాను. అదీ భయపడి పారిపోయింది. అవి రెండు నాకు హాని చేయడానికి వచ్చాయి. అందువలననే వాటిని కర్రతో బెదిరించవలసి వచ్చింది.
ఇక ఈ లేగ దూడ సంగతి అంటావా! అది మొన్న మొన్ననే పుట్టింది. దాని వల్ల మనకు ఎలాంటి కీడు లేదు. అది నాకోసం ప్రేమతో పరిగెత్తుకొని వచ్చింది . మన కోసం ప్రేమతో వచ్చిన చిన్నవారిని మనం దండిస్తామా చెప్పండి. అందువల్లే అలా చేశాను” అని అన్నాడు. అతని వివరణకు రామయ్య ఎంతో సంతోషించాడు. అందుకే పిల్లలూ! మనకు ఏదైనా సందేహం వస్తే దానిని పెద్దవారిని అడిగి నివృత్తి చేసుకోవాలి.
ఉపయోగపడిన విద్య
నరసింహపురంలోని శరభయ్య మిక్కిలి ధనవంతుడు . అదే గ్రామంలో కాంతయ్య అను ఒక బలశాలి ఉండేవాడు. అతడు చక్కని కండల పుష్టితో ఉన్నవాడు. అంతేగాకుండా అతడు మల్లయుద్ద విద్యను కూడా నేర్చుకున్నాడు. ఒకసారి అతడిని చూసిన శరభయ్య అతనితో" ఈ మల్లయుద్ద విద్య నేర్చుకోవడం ఎందుకు? శుద్ధ దండగ. వ్యర్థంగా ఈ కండలు పెంచడం నాకైతే నచ్చలేదు ? "అని అన్నాడు. అది విని కాంతయ్య ఏమీ మాట్లాడలేదు . ఒకసారి శరభయ్యకు అత్యవసరంగా పొరుగూరు వెళ్లవలసిన అవసరం కలిగింది. అతడు తన వెంబడి చాలా డబ్బును తీసుకుని వెళ్లాలని అనుకున్నాడు. అతడు ఆ పొరుగూరికి వెళ్లాలంటే అడవి మార్గం గుండానే నడచి వెళ్లాలి . అక్కడ ఖచ్చితంగా దొంగలు ఉంటారనీ, అందువల్ల ఒంటరిగా పోరాదని ఆ గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. కానీ శరభయ్యకు ఇప్పుడు తోడు ఎవరూ లేరు. దేవునిపై భారం వేసిన శరభయ్య పొరుగూరుకు తన డబ్బు మూటగట్టుకొని ఒంటరిగా తన నడకను కొనసాగించాడు. కొద్ది దూరం పోగానే అతనికి తన ముందు వెళ్లుతున్న కాంతయ్య కలిశాడు . వెంటనే శరభయ్య కు ఒక ఉపాయం తోచింది. అతడు కాంతయ్యను కుశల ప్రశ్నలు వేసి తాను చాలా పిరికి వాడిననీ, తన డబ్బును ఒకవేళ దొంగలు అడ్డుకుంటే వారి బారి నుండి దానిని కాపాడమని అతడు వేడుకున్నాడు. కాంతయ్య సరేనని ఆ డబ్బును తీసుకొని తన వద్ద పెట్టుకున్నాడు. కొద్ది దూరం పోగానే శరభయ్య ఊహించినట్లుగానే దొంగలు శరభయ్యను అటకాయించారు. శరభయ్య తన వద్ద ఏమీ లేదని తెలిపాడు. అయినా దొంగలు అతనిని సోదా చేశారు. వారికి అతని వద్ద ఏమీ దొరకలేదు. తర్వాత వారు శరభయ్య ను వదిలిపెట్టి కాంతయ్య వద్దకు వెళ్లారు. అతనిని తన వద్ద ఉన్న డబ్బు అంతా ఇమ్మని బెదిరించారు. కాంతయ్య బలశాలి మాత్రమే కాకుండా మల్లయుద్ద వీరుడు కూడా కాబట్టి వారి పైన దాడి చేశాడు. అతని దెబ్బల బలానికి వారు భయపడి పారిపోయారు. ఆ తర్వాత శరభయ్య కాంతయ్యతో " నిన్ను గతంలో ఈ కండలు పెంచడం ఎందుకు? శుద్ద దండగని దెప్పిపొడిచాను. అందుకు నన్ను క్షమించు. వాటి అవసరం ఇప్పుడు నాకు తెలియవచ్చింది. నా డబ్బును నీ భుజ బలంతో కాపాడావు. నీ మేలు మరచిపోలేను. నీ ప్రాణాలకు త్యజించి వారితో పోట్లాడి నా డబ్బును కాపాడావు. నీకు ప్రతిఫలం గా ఈ వెయ్యి రూపాయలు ఇస్తున్నాను తీసుకో!" అని అన్నాడు. అప్పుడు కాంతయ్య ” చూడు మిత్రమా! నాకు నీ డబ్బు వద్దు. సాటి మనిషికి సాయం చేయడంలోనే ఎంతో ఆనందం ఉంది. నా విద్య ఇక్కడ ఉపయోగపడింది. నీవే కాకుండా మరికొందరు కూడా ఈ కండలు పెంచడం ఎందుకు అని నన్ను దెప్పిపొడిచారు. అది ఆత్మరక్షణకే కాకుండా నీలాంటి వారికి సాయపడుతుందని వారికి తెలియదు. నీ మీద నాకేం కోపం లేదు. ఏ విద్యనైనా నేర్చుకుంటే అది మన అవసరానికి ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది. నేను మనను కాపాడుకునెందుకే వారి పై దాడి చేశాను తప్ప నాకు వారిపై కూడా ఎలాంటి కోపం లేదు” అని అన్నాడు . అప్పుడు శరభయ్య ” నీవు నేర్చుకున్న విద్య ఆత్మ రక్షణకే అనుకున్నాను . కానీ ఇలా నాలాంటి వారికి సాయపడుతుందని కూడా నేను ఎన్నడూ అనుకోలేదు ” అని అన్నాడు . శరభయ్య అతనికి ధన్యవాదాలు తెలిపి తన డబ్బును తీసుకొని వెళ్లి పోయాడు.
నరసింహపురం అనే గ్రామంలో శరభయ్య అనే ఒక రైతు ఉండేవాడు. ఆ గ్రామం గత మూడు సంవత్సరాలుగా వర్షాలు లేక కరువు కాటకాలతో సతమతమైంది. ఆ సంవత్సరం ఆ శరభయ్య పొలం కూడా వర్షం లేక పైరు ఎండిపోయింది. అతడు దాన్ని చూసి బాధపడుతున్న సమయంలో అక్కడి నుండి ఒక సన్యాసి పోతూ ఆ రైతును పిలిచి ఎందుకు బాధపడుతున్నావని ప్రశ్నించాడు . ఆ రైతు తన పొలం ఎండిపోయిందని,తాను ఎలా బ్రతికేదని బదులిచ్చాడు . అప్పుడు ఆ సన్యాసి ఒక సన్నాయిని తన సంచిలో నుండి తీసి బిగ్గరగా ఊదాడు . వెంటనే ఆ పొలం పచ్చగా నిగనిగలాడింది.
ఆ రైతు ఎంతో సంతోషించి ” మహాత్మా! ఒక్క నా పొలం పచ్చగా ఉంటే సరిపోదు. మా ప్రజలందరి కడుపులు నిండాలంటే మీరు మా గ్రామంలో గల అన్ని పంటచేలను పచ్చగా చేయాలి” అని కోరాడు. ఆ రైతు పరోపకార బుద్ధికి ఆ సన్యాసి ఎంతో సంతోషించి ఆ సన్నాయిని ఇస్తూ ” ఓ. ఉపకారీ! ఈ సన్నాయి నేను ఊదితే ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది. అడిగిన వారి కోరికను తీరుస్తుంది. కానీ ఇప్పుడు అది ఇక నా చేతిలో పనిచేయదు. అందువల్ల దీనిని నీకు ఇస్తున్నాను. తీసుకో! దీనిని నీవు ఊదితే అది మూడు సార్లు నీ కోరికలను తీరుస్తుంది. కానీ ఒక్క షరతు. నీవు ఇప్పుడు కోరినట్లే ఇతరులకు ఉపయోగపడే కోరికలను మాత్రమే కోరాలి. స్వార్థంతో నీవు ఏ కోరిక కోరినా ఇది పనిచేయదు” అని దానిని ఆ రైతుకి ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
ఆ రైతు సంతోషంగా దాన్ని తీసుకొని తమ తోటి రైతుల పొలాలన్ని పచ్చగా ఉండాలని, పంట బాగా పండాలని కోరి దానిని ఊదాడు. వెంటనే మిగతా రైతుల పొలాలన్ని పచ్చదనంతో నిగనిగలాడాయి. ఒక కోరిక ఆ విధంగా నెరవేరింది. తర్వాత ఎండాకాలం తమ గ్రామంలోని చెరువులన్నీ ఎండిపోవడం చూసాడు. మూగజీవాలకు నీటి కటకటను గమనించాడు. తమ గ్రామంలోని చెరువులన్నీ నిండాలని తన కోరికగా కోరి తిరిగి ఆ సన్నాయిని ఊదాడు. వెంటనే ఆ గ్రామంలో గల చెరువులన్నీ ఆశ్చర్యంగా నిండిపోయాయి. ఆ తర్వాత మూడవ కోరికగా అడవిలోని, గ్రామంలోని ఎండిపోతున్న చెట్లన్నీ ఆకుపచ్చదనంతో కళకళలాడుతూ ఉండాలని ఆ సన్నాయిని ఊదాడు. వెంటనే ఆ అడవిలో,గ్రామంలో ఉండే చెట్లన్నీ ఆకుపచ్చదనంతో నిగనిగలాడాయి. మూడు కోరికలు పూర్తి కావడంతో ఆ సన్నాయి తన మహిమను కోల్పోయింది. ఆ చెట్ల వల్ల భారీ వర్షాలు పడి ఆ గ్రామంలో పంటలు చాలా పండాయి. దానితో ఆ గ్రామం కరువు కాటకాలు తీరిపోయాయి. తమ గ్రామ కరవుకాటకాలు పోగొట్టిన ఆ రైతును గ్రామస్థులు అందరూ అభినందించారు.
సుందరవనం అనే అడవిలో ఒకసారి పక్షుల సమావేశం జరుగుతున్నది. ఆ సమావేశంలో ఒక నెమలి చాలా అద్భుతంగా నాట్యం చేసింది . ఆ నాట్యాన్ని చూసిన పక్షులు అన్నీ దానిని అభినందిస్తూ కరతాళ ధ్వనులను చేశాయి. కానీ ఒక్క కాకి మాత్రం కరతాళ ధ్వనులను చేయలేదు . అది చూసిన దాని ప్రక్కనున్న పక్షులు ” ఓ కాకీ! నీ బుద్ధిని పోనిచ్చుకున్నావు కాదు. ఆ నెమలి అంత అద్భుతంగా నాట్యాన్ని చేస్తే నీవు కరతాళ ధ్వనులను కూడా చేయలేదు. నీకు ఇదేం బుద్ధి? నీకు కళాభిమానం కొంచెం కూడా లేదు. నీకు నాట్యం గురించి ఏం తెలుసు గనుక ? నీవు దానివలే నాట్యాన్ని చేయగలవా !”అని ప్రశ్నించాయి.
అప్పుడు ఆ కాకి” నా దృష్టిలో అది నాట్యాన్ని చక్కగా చేయలేదు. అందుకే నేను దాన్ని అభినందించలేదు . ఆ సంగతి నాకు తెలుసు. అది తను చేసే నాట్యంపై ఈరోజు ఏకాగ్రతను ఉంచలేదు. దానిలో చాలా ప్రతిభా పాటవాలు ఉన్నాయి. కానీ వాటిని ఈరోజు మీకు చూపలేదు. నేను ఎలాంటిదాన్నో దానినే మీరు అడగండి. దానికి లేని కోపం మీకెందుకు ?”అని అంది.
అది విన్న నెమలి ” ఔను. ఆ కాకి అన్నది నిజమే . మీరు తొందరపడ్డారు. దాన్ని ఏమీ అనకండి . నేనే పరధ్యానం వల్ల నాట్యం చేసేటప్పుడు కొంత తడబాటు పడ్డాను. దానిని ఇది గుర్తించింది. ఇది నా శ్రేయోభిలాషి . అదే నన్ను ఇటువంటి ఉన్నత స్థాయికి తెచ్చింది. ఈ కాకి చిన్నప్పుడు నా ఆసక్తి గమనించి నన్ను ఒక గొప్ప గురువు వద్దకు తీసుకుని వెళ్లి నాకు ఈ నాట్యాన్ని నేర్పించింది . దానికి నేను ఏమిచ్చినా దాని రుణం తీరదు. అది పైకి అలా ప్రవర్తించినా నేనంటే దానికి వల్లమాలిన అభిమానం . ఎల్లప్పుడూ అది నా బాగోగులు కోరుకుంటుంది. దానికి నాట్యం చేయరాకున్నా నాట్య రీతులన్నీ బాగా తెలుసు. అది ఎంతో మంది గొప్పవాళ్ల నాట్యాలని చూసి చాలా విషయాలను తెలుసుకుంది. నన్ను కూడా గొప్పదానిగా చేయాలన్నదే దాని ధ్యేయం “అని అంది. ఆ మాటలకు పక్షులు ఆశ్చర్యపోయి కాకిని మన్నించమన్నాయి. అందుకే పిల్లలూ! అసలు విషయం తెలుసుకోకుండా తొందరపాటు తో ఇతరులను నిందించరాదు.
అన్నదమ్ముల ఆదర్శం
అది నరసింహపురం లోని ఒక పాఠశాల. అక్కడికి రంగయ్య తాత వచ్చి రాఘవయ్య మాస్టారుతో “మాస్టారూ! మీ తరగతిలో అందరికన్నా ఎక్కువ మార్కులు సాధించిన ఒకే ఒక్క ఉత్తమ విద్యార్థికి నేను బహుమతిని ఇవ్వదలుచుకున్నాను. వారెవరో మీరు నిర్ణయించండి “అని అన్నాడు. రాఘవయ్య మాస్టారు ఆలోచనలో పడి సరేనన్నాడు .
ఆయన తరగతి మాస్టారుగా ఉన్న ఐదవ తరగతిలో రాము ,సోము అనే ఇద్దరు విద్యార్థులు ఉండేవారు. వారు అన్నదమ్ములు మరియు కవలలు కూడా! వారిద్దరూ పోటీపడి చదివే వారు. వారితో పాటు ఆనంద్ అనే విద్యార్థి కూడా వీరికి పోటీగా నిలిచేవాడు. రాఘవయ్య మాస్టారు రంగయ్యతో “సరేనండీ! వారెవరో నిర్ణయించిన తర్వాత మీకు కబురు చేస్తాను “అని అన్నాడు. రంగయ్య తాత అక్కడి నుండి వెళ్ళిపోయాడు .
రాఘవయ్య మాస్టారు పిల్లలకు ఎన్నో రకాల పరీక్షలు పెట్టాడు. అన్నింటిలో రాము ,సోము ప్రథములుగా నిలిచారు. వారిలో ఎవర్ని ప్రథములుగా నిర్ణయించాలో మాస్టారుకు అంతుపట్టలేదు. చివరికి ఆయన ఒక గదిలో ఒంటరిగా కూర్చుండి రామును పిలిపించాడు. ” ఒరేయ్ ! నేను ఒక బహుమతిని నీకు ఇప్పించాలని అనుకుంటున్నాను . అది నీకు ఇప్పించాలా! మీ తమ్మునికి ఇప్పించాలా!” అని అడిగాడు. అప్పుడు రాము ” మాస్టారూ! ఆ బహుమతిని మా తమ్మునికే ఇప్పించండి”అని అన్నాడు. అప్పుడు రాఘవయ్య మాస్టారు ” అది నీకు ఎందుకు వద్దురా!” అని ప్రశ్నించాడు. అప్పుడు రాము ” మాస్టారూ! మా తమ్ముడు చాలా మంచివాడు. నేను చెప్పింది వింటాడు. అందువల్ల అతనికే ఇప్పించండి ” అని అన్నాడు.
ఆ తర్వాత మాస్టారు సోమును తన గదికి పిలిపించి అతనిని ఇదే ప్రశ్న అడిగాడు. అప్పుడు సోము “మాస్టారూ! ఈ బహుమతి నాకు వద్దు. మా అన్నయ్యకే ఈ బహుమతిని ఇప్పించండి. ఎందుకంటే మా అన్నయ్య నాకు తాను తినకుండా చాక్లెట్లు, ఐస్ క్రీములు నాకోసం దాచిపెట్టి ఇస్తాడు . తాను డబ్బుతో ఏమి కొనుక్కున్నా లేదా ఎవరైనా అతనికి తినుబండారాలు ఇచ్చినా వాటిలో ఎక్కువ భాగం నాకే ఇస్తాడు” అని అన్నాడు. మాస్టారుకు ఏమి చేయాలో పాలు పోలేదు.
వెంటనే మాస్టారుకు ఒక ఆలోచన వచ్చింది . అతడు వెంటనే రంగయ్య తాతను పిలిపించి తాతతో ” తాతా! వారిద్దరూ సమానస్కందులే. వారిద్దరిలో ఈ బహుమతిని ఎవ్వరికీ ఇవ్వాలో నాకు అర్థం కావడం లేదు. మీరే నిర్ణయించండి . ఎందుకంటే వారిద్దరికీ మార్కులు సమానంగా వచ్చాయి. దానితోపాటు వారిద్దరి స్వభావం కూడా ఇతరులకు ఆదర్శంగా ఉంది . వారిద్దరిలో ఒక్కరిని నిర్ణయించడం నాకు చాలా కష్టంగా ఉంది “అని అన్నాడు. అప్పుడు రంగయ్య తాత ” అయ్యో మాస్టారూ! ఈమాత్రం దానికి నన్ను అడగడం దేనికి? ఆ ఇద్దరికీ బహుమతులను ఇవ్వండి. నేను నాకు తెలియక ముందు ఒక్కరికే అన్నాను. ఎలాగూ ఆర్థిక సాయం చేసెందుకు నేను ఉన్నాను కదా! పిల్లలను అలా నిరాశపరచకండి . వారిద్దరూ చాలా ఉత్తములైన విద్యార్థులు. అంతేకాదు. ఇతరులకు ఆదర్శంగా ఉండే అన్నదమ్ములు. అన్నదమ్ములంటే అలా ఉండాలి “అని ఆ ఇద్దరికీ బహుమతుల కొరకు డబ్బును ఇచ్చి వెళ్ళాడు . మరునాడు మాస్టారు ఆ బహుమతులను రాము ,సోములకు ఇస్తూ ” వీరిద్దరూ అన్నదమ్ములందరికీ ఆదర్శం ” అని అన్నాడు. అప్పుడు తరగతి పిల్లలు వారిద్దరిని కరతాళ ధ్వనులతో మిక్కిలి అభినందించారు.
సుందరవనం అనే అడవిలో ఒక బుజ్జి కుందేలు ఆహారం కొరకై బయలుదేరింది. అది పెద్దపులి గాండ్రింపు విని భయంతో పరుగెత్తి పొరపాటున ఒక పెద్ద గోతిలో పడింది. ఆ పెద్దపులి అక్కడికి రానే లేదు. అది ఎటో వెళ్లి పోయింది. అయినా ఆ బుజ్జి కుందేలు ప్రాణభయంతో ” కాపాడండి! కాపాడండి!” అని గట్టిగా అరచింది. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక జిత్తులమారి నక్క దానిని చూసి కూడా చూడనట్టు నటించి దానిని ఎవరు కాపాడుతారో అని అక్కడనే వేచి ఉంది.
అప్పుడే ఆ కుందేలు పిల్ల అరపులు విని అక్కడికి పరుగున వచ్చిన ఏనుగు అది చూసి ఆ బుజ్జి కుందేలును తన తొండంతో లాగి ఆ గోతి నుండి కాపాడింది. తర్వాత అది ఆ నక్కతో ” ఓ నక్కా! ఈ పిల్ల కుందేలు ఆపదలో ఉంటే నీవు కాపాడకుండా ఎటో చూస్తున్నావు. ఇది నీకు తగునా! అది కాపాడమని అంటే వినరానట్టు ఉంటావా !”అని అంది. అప్పుడు నక్క ఏమి మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది.
కొన్ని రోజులకు ఒక బుజ్జి నక్క కూడా దూరంగా ఒక చిరుతపులి అరపు విని భయంతో పరుగెత్తి ఇదే చోటకు వచ్చి అదే గోతిలో పొరపాటున పడింది. అది కూడా తనను కాపాడమని గట్టిగా అరిచింది. దూరం నుండి ఇది చూసిన ఒక పెద్ద కుందేలు పరుగున వచ్చి ఆ బుజ్జి నక్కను ఒక కర్రను అందించి దాని సాయంతో కాపాడింది . వెంటనే దాని తల్లి పెద్దనక్క పరుగున అక్కడికి వచ్చింది. అప్పుడే అక్కడికి వచ్చిన ఇదివరకటి ఏనుగు ఇది చూసి ” ఓ కుందేలా! నీవు ఈ బుజ్జి నక్క ప్రాణాలు కాపాడి దానికి చాలా మేలు చేశావు. ఈ నక్కనే గతంలో నీ బిడ్డను కాపాడలేదు. అయినా అది మనసులో పెట్టుకోకుండా ఒక తల్లి మనసును అర్థం చేసుకున్నావు. అపకారికి ఉపకారమంటే ఇదే “అని అంది. అప్పుడు కుందేలు ” ఓ గజమా! ఆపదలో ఉన్న ఎవరినైనా కాపాడడం మన ధర్మం. అందులో అది చిన్న పిల్ల. పొరపాటున ఆ గోతిలో పడింది. మరేదైనా క్రూర మృగం చూస్తే దీని ప్రాణాలు దక్కవు. అందువల్లనే నేను దానిని కాపాడాను. అది సాయం చేయలేదని నేను కాపాడకుంటే ఒకవేళ దాని ప్రాణం పోతే తిరిగి వస్తుందా! అందుకే ఈ చిన్న మేలు చేశాను” అని అంది.
అప్పుడు నక్క తాను గతంలో కుందేలు బిడ్డకు చేసిన అపకారం గురించి చెప్పి కన్నీళ్లు కార్చింది. తన బిడ్డను బ్రతికించినందుకు ఆ కుందేలుకు తన ధన్యవాదాలు తెలిపింది. ఆ కుందేలు ఆ నక్క కన్నీళ్లను తుడిచింది. తర్వాత ఆ నక్క పశ్చాత్తాపపడి మరోసారి ఎటువంటి తప్పు చేయలేదు. అంతేకాదు. ఆ కుందేలుతో అది చాలా స్నేహపూర్వకంగా మెలగింది. అందుకే అపకారికి ఉపకారం చేస్తే స్నేహం పెంపొందుతుంది.
సుందర వనం అనే అడవిలో ఒక కోతి వర్షంలో తడుస్తూ దారిలో నిలబడింది . ప్రక్కనే చెట్టుపై ఉన్న కాకి దానిని చెట్టు కిందకు రమ్మని ప్రేమతో పిలిచింది. కానీ కోతి ఆ మాటలు వినిపించుకోలేదు. ఆ కాకి తిరిగి దానిని రమ్మని పిలిచింది. అప్పుడు ఆ కోతి కోపంతో కాకి వైపు వచ్చి ఆ చెట్టును ఎక్కి దాని గూడును లాగి క్రింద పడవేసింది. అదృష్ట వశాత్తు అందులో దాని పిల్లలు లేవు. ఆ కోతి కోపానికి కాకి ఆశ్చర్య పోయింది.
అది గమనించిన ఒక పావురం “ఓ కాకీ! అటువంటి మూర్ఖురాలైన కోతిని నీవు రమ్మనడం, దానికి ఉపకారం చేయాలని అనుకోవడం పెద్ద తప్పు. నీవు మంచి చెప్పినా అది వినే స్థితిలో లేదు” అని అంది. ఈ మాటలను విన్న కోతి కోపంతో ఆ పావురంపై దాడికి వచ్చింది. ఆ పావురం వెంటనే ఆకాశంలోకి ఎగిరింది.
అది చూసిన కాకి ” ఓ కోతీ! నీ ప్రతాపం నీకన్నా చిన్నగా ఉన్న మా పక్షులపైన కాదు . నీకు బలం ఉంటే అదిగో ఆ కనబడుతున్న ఆ పెద్ద జంతువు ఆ గాడిదపైన నీ ప్రతాపం చూపించు” అని అంది. వెంటనే కోతి ” నాకేం భయమా ! దాని సంగతి కూడా నేను తేలుస్తాను. దాని వెనుక కాలును లాగుతాను. చూడు” అని ఆ గాడిద వైపు వెళ్ళింది.
అది అక్కడికి వెళ్లి గాడిద వెనుకవైపు వెళ్లి ఆ గాడిద కాలును లాగింది. ఆ గాడిదకు కోపం వచ్చి ఆ కోతిని తన వెనుక కాళ్లతో బలంగా ఒక్క తన్ను తన్నింది. దాని బలానికి ఆ కోతి కళ్లు బైర్లు కమ్మి గాలిలో గిరగిరా మూడు తిరుగుళ్లు తిరిగి క్రింద పడింది. ఆ కోతికి నడుం విరిగినంత పని అయింది.
వెంటనే తేరుకున్న కోతి ” అమ్మో! ఈ గాడిద జోలికి మనం వెళ్లకూడదు. దీనికి చాలా బలం ఉంది. ఇదే కాదు. మరొకసారి ఎవరి జోలికి పోకూడదు. నాకు తగిన శాస్తి జరిగింది ” అని అనుకొని ఇంటి దారి పట్టింది. అప్పుడు ఆ పావురం, కాకులు దానికి బుద్ది వచ్చినందుకు సంతోషించి ఆ గాడిదతో ” మిత్రమా! ఆ పొగరుబోతు కోతికి తగిన గుణపాఠం చెప్పావు. అది మరొకసారి ఎవ్వరి జోలికి పోకుండా చేశావు. నీకు మా ధన్యవాదాలు” అని అన్నాయి.
అప్పుడు ఆ గాడిద” నా జోలికి వస్తే నేను ఊరుకుంటానా! అది మీతో దురుసుగా ప్రవర్తించడాన్ని నేను ఇక్కడి నుండి కళ్లారా చూశాను. పాపం! మీరు చిన్న ప్రాణులు. అందుకే దానికి తగిన గుణపాఠం చెప్పాను” అని అంది. అందుకే పొగరు ఉన్న వారికి ఎప్పటికైనా భంగపాటు తప్పదు.
గోదావరి నది పొంగి ప్రవహిస్తోంది. ఆ నదిలో ఒక కుక్క ఒకటి కొట్టుకొని వచ్చింది. దానికి ఈత వచ్చు. ఆ ప్రవాహ వేగంలో అది కొట్టుకొని వచ్చి దిగువన ఉన్న ఒక గ్రామానికి చేరింది. అది ఆ గ్రామంలోకి ప్రవేశించింది . ఆ కుక్కను చూసి ఇతర కుక్కలన్నీ వెంబడిపడి మొరగడం ప్రారంభించాయి . అయినా అది వాటిని లెక్క చేయలేదు. ఆ తర్వాత అది ఒక ఇంటిలోనికి ప్రవేశించింది . ఆ ఇంటి యజమాని చాలా దయార్ద్ర హృదయుడు. వెంటనే అతడు ఆ కుక్కకు ఆహారం పెట్టాడు. అది తిన్న కుక్క ఆ యజమాని ఇంటి బయటనే ఉండసాగింది.
ఒకసారి ఆ యజమాని తన కుటుంబంతో సహా ఒక ఊరుకు వెళ్లాడు . ఆ కుక్కను ఇక్కడనే ఉంచిపోయాడు. ఆ సమయంలో ఒక పెద్ద త్రాచుపాము వారి ఇంటిలోనికి దూరడానికి ప్రయత్నించింది. ఇది గమనించిన ఆ కుక్క మొరుగుతూ ఆ త్రాచు పామును అడ్డుకుంది . ఆ కుక్కకు భయపడిన ఆ త్రాచుపాము దూరంగా ఉండి ఆ ఇంటిలోనికి ఎలాగైనా ప్రవేశించాలని తాపత్రయపడింది . కానీ ఆ కుక్క ముందు దాని ఆటలు సాగలేదు.
ఇంతలో ఆ ఇంటి యజమాని ఊరినుండి వచ్చాడు. ఆ కుక్క ఎందుకు మొరుగుతున్నదోనని అతడు చూశాడు. అక్కడ అతనికి ఒక విష సర్పం తన ఇంటిలోనికి ప్రవేశించడానికి చేస్తున్న ప్రయత్నాన్ని చూశాడు. దానిని కుక్క అడ్డుకుంటున్న సంగతి కూడా గమనించాడు . అది చూసి వెంటనే అతడు పాములు పట్టే వ్యక్తిని పిలిపించాడు. అతడు ఆ పామును పట్టుకొని ఒక సీసాలో బంధించాడు. తర్వాత ఆ యజమాని ఇచ్చిన డబ్బును తీసుకొని దాన్ని తీసుకుని వెళ్లి దూరంగా అడవిలో వదిలిపెట్టాడు.
మరొక్కసారి యజమాని, ఆయన భార్యా పిల్లలు అర్దరాత్రి నిద్రలో ఉన్నారు. అప్పుడే కొందరు దొంగలు వారి ఇంట్లో ప్రవేశించి వారు ఉన్న గది తలుపు బయట గడియ పెట్టి వారి ఇంటిలోని డబ్బు, బంగారం దోచుకెళ్లారు. ఈ సమయంలో ఆ కుక్క ఎక్కడికో వెళ్లింది. ఇంతలో ఆ యజమాని కి తెలివై బిగ్గరగా ” దొంగలు, దొంగలు” అంటూ కేకలు వేశాడు. ఆయన వేసిన ఆ కేకలకు ఆ వీధిలోని వారు మేల్కొని వారి ఇంటికి వచ్చి తలుపు గడియ తీశారు. అప్పటికే ఆ దొంగలు పారిపోయారు. వారి బీరువా తలుపులు తెరచి ఉన్నాయి. అప్పుడు యజమానికి తన కుక్క ఏమైందని జ్ఞాపకం వచ్చింది. వెంటనే అతడు ఇరుగు పొరుగు వారితో “నా కుక్క కనిపించిందా !”అని అడిగాడు. వారు లేదని చెప్పారు. వెంటనే ఆ యజమాని కుక్క కొరకై బయటకు వచ్చి చూశాడు. అప్పుడే ఎక్కడినుండి యో వస్తున్న ఆ కుక్క నోటిలో ఒక డబ్బు, నగల మూట కనిపించింది. అది తీసుకుని విప్పి చూశాడు. అది తన బంగారం, డబ్బులే. ఆ యజమాని జరిగినది ఊహించాడు. ఇరుగు పొరుగు వారికి తన కుక్క ఆ దొంగల వెంటబడి వారిని తరిమి తన బంగారం, నగదును పట్టుకుని తెచ్చిందని చెప్పి సంబరపడ్డాడు. ఇరుగు పొరుగు వారు ఆ కుక్క చేసిన పనికి ఎంతగానో సంతోషించారు. తర్వాత ఆ ఇంటి యజమాని తను పెట్టిన ఆహారం తిని తన పట్ల తన కుటుంబం పట్ల విశ్వాసం చూపిన ఆ కుక్కను ప్రేమతో దాని తలపై నిమిరాడు.
రంగడు సోమరి. అతడు ఏ పనీ పాటా లేకుండా స్నేహితులతో తిరిగేవాడు . అతనికి ఒక్క అవ్వ తప్ప నా అన్న వాళ్లెవరూ లేరు . ఆమె వృద్ధురాలు. ఆమె ” నా మనవడు కష్టపడి వృద్దిలోకి రాకపోతాడా!” అని ఇన్నేళ్లు ఎదురు చూసింది. కానీ రంగనిలో మార్పు రాలేదు . ఒకరోజు ఆమె ” ఒరేయ్! ఈ సోమరితనం వదిలిపెట్టరా! కష్టించి పనిచేయడం నేర్చుకో” అని అంది. అప్పుడు రంగడు “అవ్వా! నేనేం చేయాలో నీవే చెప్పు” అని అన్నాడు. అప్పుడు ఆమె ” ఒరేయ్! నీకు ఇష్టమైన పని చేయరా! అది మన కడుపు నింపేదైతే చాలు ” అని అంది. “సరేలే అవ్వా! నాకు చేపలు పట్టడం అంటే చాలా ఇష్టం . నేను రేపు చేపలు పట్టడానికి పొరుగూరిలో గల చెరువుకు వెళతాను” అని అన్నాడు. ఆ అవ్వ ఎంతగానో సంతోషించింది.
మరునాడు అతడు తన అవ్వ బాధ పడలేక పొరుగు గ్రామంలోని చెరువుకు తన వలను తీసుకొని చేపలు పట్టడానికి వెళ్ళాడు . అతడు చేపలు పట్టడానికి ఆ వలను నీటిలో వేశాడు. అప్పుడు ఆ వల కొంచెం బరువుగా అనిపించి రంగడు ఎంతో సంతోషపడ్డాడు. కానీ ఆ వలను తీసి చూస్తే అందులో అన్ని కప్పలు కనిపించాయి. ” అయ్యో! ఇక్కడ పెద్ద పెద్ద చేపలు ఉన్నాయని ఎవరో చెప్పగా విన్నాను. కానీ నాకు ఒక్క చేప కూడా వలలో పడలేదు. ఈ కప్పలను నేను ఏం చేసుకోను” అని వాటిని తీసి తిరిగి నీటిలోకి వదిలి మళ్లీ వలను వేశాడు. ఈసారి వల ఇంకా బరువుగా అనిపించింది. అతడు తన పంట పండిందని అనుకున్నాడు. కానీ ఈసారి కూడా అతనికి నిరాశనే ఎదురైంది. అందులో పెద్ద తాబేలు పడింది . “అయ్యో! ఈ తాబేలును నేను ఏం చేసుకోను “అని దాన్ని కూడా నీటిలోకి వదిలాడు.
ఆ తర్వాత అతడు ఈసారి తప్పకుండా తనకు పెద్ద చేప పడుతుందనే ఆశతో తన వలను మళ్ళీ నీటిలోకి వేశాడు. ఈసారి ఆ వల చాలా బరువుగా అనిపించింది. దాన్ని అతి కష్టం మీద లాగాడు . అందులో ఒక చిన్న మొసలి పిల్ల కనిపించింది . “అమ్మో !మొసలీ “అని భయపడి రంగడు ఆ వలను మొసలితో సహా నీటిలోకి వదిలిపెట్టి ఇంటికి పరుగెత్తి జరిగిన విషయం తన అవ్వకు చెప్పాడు. ఆమె అతడిని ఊరడించి ఉత్సాహపరచి ” ఒరేయ్! ఆ వల పోతే పోని! మరొక వలను తీసుకొని వెళ్లు. నీ ప్రయత్నం మానకు. కష్టపడితే తప్పకుండా నీకు ఫలితం వస్తుంది చూడు!” అని అంది.
మరునాడు రంగడు పట్టువీడకుండా ఎలాగైనా కష్టపడి ఆ పెద్ద చేపను పట్టుకుంటానని తలచాడు. వెంటనే పొరుగింటి వారిని మరొక వలను అడిగి తీసుకొని అదే చెరువుకు వెళ్లి ఆ వలను నీటిలో వేశాడు . ఈసారి ఆ వలలో ఒక పెద్ద చేప పడింది . అక్కడే ఉన్న గ్రామస్థులు అది చూసి “అబ్బో! నీ పంట పండింది . మాకు ఎవ్వరికీ వలలో పడని పెద్ద చేప నీకు పడింది. ఈ రకం చేప కొరకు చాలా మంది ప్రయత్నం చేశారు. కానీ ఎవ్వరికీ ఇది దొరకలేదు. నీవు చాలా అదృష్ట వంతుడివి. ఇది చాలా ఖరీదు చేస్తుంది. దీన్ని అంగడిలో అమ్ముకో!” అని అన్నారు. రంగడు సంతోషించి వెంటనే వెళ్లి ఆ చేపను అంగడిలో విక్రయించాడు. దానికి చాలా డబ్బు వచ్చింది . అతడు తన అవ్వకు ఆ డబ్బును చూపాడు. ఆమె ఎంతో సంతోషించింది. తర్వాత అతడు” మా అవ్వ చెప్పినట్లు ఎంతో కష్టపడితేనే చివరకు ఫలితం దక్కుతుందన్నమాట . ఎన్నిసార్లు వేసినా నన్ను కరుణించని ఆ పెద్ద చేప ఈసారి మాత్రం నాకు దొరికింది . పట్టుదల ఉంటే సాధించలేనిది అంటూ ఏమీ లేదు ” అని ఆనాటి నుండి తన సోమరితనాన్ని వీడి కష్టపడడం నేర్చుకున్నాడు . అతడు సోమరితనం వదలిపెట్టినందుకు అతని అవ్వ ఎంతగానో సంతోషించింది.
