(తెలంగాణా ప్రభుత్వం చేత ”కాళోజీ అవార్డు (2021)” అందుకున్న డా. పెన్నా శివరామకృష్ణ)
అతి సాధారణమైన వేషధారణ, చురుకైన చూపు, నిత్యచైతన్యశీలి, అలుపెరుగని సాహిత్య సృజనకారులు, తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియలలో ప్రయోగాలు చేసిన నిజమైన ప్రయోక్త. అతడే పెన్నా శివరామకృష్ణశర్మ. సాహితీ సృజనకారులకు, విమర్శకులకు తెలుగు సాహిత్యలోకంలో సుపరిచితమైన పేరు. వారు నల్గొండలో సహాధ్యాయి కావడం వలన, కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని, వచన కవిత్వం, (తెలుగు) గజళ్ళు, రుబాయీలు, హైకూలు, విమర్శ గ్రంథాలు సమాంతరంగా సృష్టించి తెలుగు సాహిత్యంలో తనదైన స్థానాన్ని పరచుకున్న తెలంగాణా కవి శ్రీ పెన్నాగారు. నిరంతర చదువరి, సమసమాజాన్ని చాలా లోతుగా పరిశీలించి, వాచ్యంగా కాకుండా వ్యంగ్యంగా, ధ్వనిపూర్వకంగా విషయాలను వచన కవిత్వం ద్వారా తెలిపిన కవి. ఛంథ్శాస్త్రంలో, ఆలంకారిక శాస్త్రంలో నిష్ణాతులు, ఆంగ్ల, ఉర్దు సాహిత్య పరిచయం ఉన్నవారు.
అలల పడవలమీద, నిశ్శబ్దం నా మాతృక మొబబన కవితా సంపుటాలు వచన కవిత్వానికి గీటురాళ్ళుగా నిలుస్తాయి. దీపఖడ్గం కవితా సంపుటి వారి కవితా మాధుర్యానికి నిదర్శనాలు. రహస్య ద్వారం, దేశదేశాల హైకు – అన్న హైకూ ప్రక్రియా సామర్థ్యానికి ప్రతీకలు. ఆ తరువాత ఈనాడు హైకూలు రాస్తున్న కవులకు మార్గదర్శకులయ్యారు.
సాహిత్య విమర్శ ఎంతో ఇష్టంగా వారు ఎంచుకునే ప్రక్రియ. డిగ్రీ చదివే నాటికే ప్రాచీన సాహిత్యంతో పాటు, ఆధునిక సాహిత్యాన్ని ఆసాంతం చదివారు. శేషేంద్ర, ఆరుద్ర, శ్రీశ్రీ, సినారే, శివారెడ్డిల కవిత్వాలను, వ్యక్తిత్వాలను చదివినవారు. వారు శేషేంద్ర కవిత్వానుశీలనం’ పేరుతో పరిశోధన గ్రంథాన్ని వెలువరించారు. రచనలద్వారా వారి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారు. సినారే కవిత్వాన్ని, శివారెడ్డి కవిత్వాన్ని తన ఆలోచనాలోచనలతో పరిశీలించారు.
ఈ మధ్య 2017, 2020లలో గోరటి వెంకన్న కవితా పరామర్శ, ఎన్. గోపీ తత్త్వవివేచన అనే సాహిత్య విమర్శను వెలయించారు. వచన కవిత – ఆలంకారికలు (2018లో) వచన కవిత్వంలో పదచిత్రాలు, భావచిత్రాలు సాధారణంగా చెప్తారు. కానీ ఆలంకారికత గురించి విశ్లేషించడం పెన్నా పెన్ను విశేషం.
అలాగే సినారే విశ్వంభరలో ఆర్థయుక్తిని విశ్లేషించారు. గోరటి వెంకన్న గేయాల్లో సాహిత్యాన్ని లోకానికి చూపించారు.
వీటన్నింటికీ వేరవుతూ, కొన్ని ప్రక్రియలు విలక్షణంగా చేపట్టి కృతకృత్యులయ్యారు పెన్నా. వాటిలో ఉర్దూ మూలంగా తెలుగు భాషలోకి దాశరథి, సినారే వలన తెలుగులో కాలూనిన గజల్, రుబాయీ. వీటిని ఉర్దూ భాషా మాధుర్యాన్ని ఛందస్సు రీత్యా పూర్తిగా తెలుగులోకి తీసుకొచ్చిన కవి పెన్నా. గజళ్ళలో సల్లాపం, శిశిరవల్లకి కవిత్వం మనసుకు హత్తుకుంటాయి.
గజల్ కి ఒక ప్రత్యేకమైన ఛందస్సు, భావం, పదజాలం ఉంటాయి. ఇవన్నీ బాగా అవగాహన చేసుకుని, గజల్ ప్రక్రియని ఫలవంతం చేశారు. గజళ్ళు, రుబాయీలు విషయంలో ఏమైనా సందేహాలున్నప్పుడు వారి గురువులైన నోముల సత్యనారాయణ, సామల సదాశివ గార్లతో సంప్రదించి, రచనలు చేశారు.
ఈ షేర్ చూడండి-
ఎపుడూ కొనగోటనైన మీటబోకు నాతనువు,
అణువణువున నీపేరే మారుమోగిపోతుంది. (29) ”సల్లాపం”
ప్రియుడు ఏకపక్షంగా ప్రియురాలి గురించి విరహంతో, తన ప్రేమను అద్భుతంగా తెలియచేయడమే.
గజల్. అదే మార్గంలోనే వారి గజల్ రచన సాగుతుంది.
‘నవ్వబోకు నా చెలియా’ నా వయసు ఆగిపోతుంది.
నీ నవ్వు ననుకరించాలని ఏరు ఆగిపోతుంది’. అని అద్భుతంగా షేర్ రాసారు.
”శిశిర పల్లకి” నుండి మరొక షేర్
‘నిన్ను మరచిన నన్ను మరచుటె అనుచు తానే పలికెను
నను మరచిపొమ్మని తేలికగ’నే చెప్పివెళ్ళెను ప్రేమతో
నిను మరచిన నన్ను మరచినట్లే అన్న ప్రేయసి, మరచిపొమ్మని తనను తేలికగా చెప్పి వెళ్ళిందట. గజల్ కి చమత్కారం ప్రధానం, ఇలాంటి చమత్కారాలు వారి ఎన్నో షేర్లలో కన్పిస్తాయి.
‘ఆశ్రువంటే ఆణిముత్యమె, విలువ ఎరిగిన మంచిది.
ఒక్క బిందువు కూడ రెప్పను దాటనీయకు మిత్రమా!’
కన్నీటి కుండను గుండెలోనే దాచుకోమంటున్నాడు కవి. గజళ్ళలో అశ్రువు అనే పదం పలుమార్లు వస్తుంది.
ఇక రుబాయీల విషయానికి వస్తే, తెలంగాణా రుబాయీలు, అశ్రుధార రెండు ఉన్నాయి. తెలంగాణా ఉద్యమం ఊపందుకున్న సమయంలో రాసినది తెలంగాణా రుబాయీలు, అవి ఆ కాలానికి సరిపోయేవే. ”ఆశ్రుధార” 2021లో వచ్చిన రుబాయీల కవిత్వ పుస్తకం. ఇది కవిత్వపరంగా, రుబాయీ, లక్షణ పరంగా, భావపరంగా అద్భుతమైనది. ఇవి కాక గజళ్ళు, రుబాయీల పై లక్షణ గ్రంథాలనదగిన ”తెలుగు గజళ్ళు-రుబాయీలు, గజల్ సౌందర్యదర్శనం” కూడా గజళ్ళు, రుబాయీలు నేర్చుకునే వారికి మార్గదర్శక గ్రంథాలు, అశ్రుధార నుండి ఒక రుబాయీ.
”కనిపించే గాయమైతే తడమకనే తెలిసేది!
లోలోపల వేదన ఒక తలగడకే తెలిసేది!
అవ్యక్తపు ఆర్తులన్ని చితిదాకా అనాథలే!
సాంధ్య ఘోష అంతా ఒక పడమరకే తెలిసేది!”
మరొక రుబాయిలో చివరి రెండు పాదాలు
”కడదాకా అశ్రు అగ్ని గర్భ అక్షరమే!
భగ్నహృదయ శకలాలకు కడతీరం అయినది”
ఇలా విషాద మాధుర్యాన్ని రుబాయీల్లో ఒలకబోసారు.
ఇక ఎన్ గోపి కవితా తత్త్వవివేచన విమర్శ గ్రంథంవైపు చూస్తే. ప్రతి ఒక్క కవి మీదా పెన్నాగారికి ఒక ప్రత్యేకమైన అభిప్రాయం కనిపిస్తుంది. ఇది దానికి నిదర్శనం.
‘పాఠకుడు భావుకుడు.
కాలటం తెలిసిన కట్టెలాంటివాడు.
కరగడం తెలిసిన వెన్నలాంటి వాడు!
నేను రాసిన కవిత సగమే!
అతనికి అందినపుడే అది సంపూర్ణ కవిత!” – అంటారు గోపీ గారు.
దానికి పెన్నాగారి విమర్శ – ”కాలటం తెలిసిన కట్టెలాంటివాడు పాఠకుడు అని చెప్పడం భరతుని నిర్వచనాన్ని గుర్తుచేస్తాయి. ”యో ఆర్థో హృదయ సంవాదీ తస్య భావో రసోద్భవః| శరీరం వ్యాప్యతే తేన శుష్యం కాష్ట మివాగ్నినా” భరతుడు రసానుభవాన్ని ఎండుకటైకు అగ్ని వ్యాపించడంతో పోల్చాడు. ”కాలటం తెలియడం” లోనే భావుకత్వమూ, కావ్యానుశీలనానుభవమూ ఇమిడి ఉన్నాయి. అని తీర్మానిస్తారు పెన్నా నవ్యంగా చెప్పారు.
గోపీ అంటారు –
”కవి కావడంలో సుఖం లేదు.
అది నిత్యారుణమైన గుండెకోత” – అంటారు గోపి. దీనిని సాదరంగా ఆహ్వానిస్తారు పెన్నా, ఏదైనా గోపీ ఆశావాది అని, ప్రగతిశీల మానవతావాది, వచన కవిత్వాన్ని కొత్తదారుల్లో నడిపించినవాడు గోపీ యని పెన్నా సద్విమర్శ చేస్తారు.
ఇవే కాకుండా, కవితా సంకలనాలకు సంపాదకులుగా ఉన్నారు. తెలుగువారికే కాకుండా అందరికీ పనికొచ్చేట్లుగా ”రోజు రోజుకో చరిత్ర” ”జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు”, ”తారీఖుల్లో తెలంగాణ” వంటి సాధారణ ప్రజ్ఞకు సంబంధించిన విషయాలతో పుస్తకాలు రాసారు.
కవిత్వం – 12. సాహిత్య విమర్శ – 9. ఇతర రచనలు – 6. సహసంపాదకత్వం – 8. ఇలా వారి సాహిత్య ప్రస్థానం కొనసాగింది. ఇంకా కొనసాగుతుంది.
సాహిత్యంపై నిజమైన ప్రేమతో, నిజాయితీగా, నిబద్ధతతో రచనలు చేసే కొద్దిమంది రచయితల్లో, కవుల్లో డా. పెన్నా శివరామకృష్ణ గారు ఒకరు. ఎన్నో పురస్కారాలు వీరిని వరించాయి. ఇలా తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని, ముఖ్యంగా ఆధునిక ప్రక్రియలలో తనదంటూ విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న ”పెన్నా” తెలంగాణా కవిగా, తెలంగాణా భాషాదినోత్సవం, కాళోజీ జయంతి సందర్భంగా కాళోజీ అవార్డును తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పొందడం అభినందనీయం.