ఆకులు తిని బతికిన ఆదిమకాలంనుండీ..
అరనిమిషంలోనే అనంత విశ్వాలను
అరచేతిలో చూసుకునే కాలమొచ్చినా…
అన్నమో రామచంద్ర అన్న
‘ఆకలి కేకలు’ … ఎప్పటిలాగే…!
కంపెనీలు సృష్టించిన కల్తీ వస్తువుల ధరలు
పైపైకి పాకీ ఆకాశానికి తాకుతున్నా..
మట్టి నుండి బువ్వను సృష్టించిన
కష్ట జీవి చెమటచుక్కల విలువ
పాతాలంలోకీ పోతునే ఉన్నయ్..ఎప్పటిలాగే..!
స్వాతంత్ర్య దినోత్సవాలెన్ని జరుపుకున్నా..
పాలకులు ప్రకటించిన పథకాలు ఎన్ని ఉన్నా..
ప్రభుత్వ విజయాల పరంపర లెక్కలెన్నున్నా..
సగటు మనుషుల సాదా జీవనం ఎప్పటిలాగే…
అధికారంలో అనంత శిఖరాలను అధిరోహించినా..
ఈఫిల్ టవరంత ఎత్తు ఆస్తులు కూడబెట్టినా..
ఆశ చావని అదుపులేని అవినీతి ఊడలు
పిల్లలమర్రి లెక్కా పెరిగుతున్నయ్. ఎప్పటిలాగే…
ఆగర్భ శ్రీమంతుల విలాస జీవితాలు
ఆకాశమార్గంలో హాయిగా ఎగురుతుంటే
నడక తప్పా ఏ మోటారు దూరలేని
అరణ్యపు చీకటి బాటల్లో పయనిస్తున్న
అభాగ్యురాల్ల ‘ప్రసవ’ కేకలూ ఎప్పటిలాగే..
ఆసుపత్రి బిల్లు కట్టలేక పొత్తిళ్లలో
కన్నుమూసిన భర్త/తండ్రి /పాపలనూ
గుండెలకు హత్తుకుని
గుండెలు పగిలేలా రోధిస్తూ..
నిలబడ్డ తల్లుల రోధన ఎప్పటిలాగే.
ఆరుగాలం పండించిన అన్నదాతల బతుకులు
మాయాజాలం మార్కెట్లో దళారుల దౌర్జన్యానికి
దగాపడుతూనే ఉన్నాయ్ !. ఎప్పటిలాగే..
వారానికోనాడూ కడుపునిండా తినలేని
అభాగ్యులు చౌరస్తాలో నిలబడి
కదలలేని అంగవైకల్యంతో
అడుక్కుంటున్నయ్ .. ఎప్పటిలాగే …
ఉన్నత శిఖరాలనుండి
నికృష్టమైన జీవితాల లోతులనూ..
కళ్ళుండీ చూడలేని కనకపు కంత్రి గాళ్ళు
ఇంకా …. ఎప్పటిలాగే..
కళ్ళు మూసుకుని కలియుగాన్ని దర్శించే
కంత్రి మంత్రగాళ్ళూ ఎప్పటిలాగే…
కడుపుమీద కాలు పెట్టీ పిల్లల పుట్టించేటీ
మూఢనమ్మకాల మాయా సంస్కృతి ఎప్పటిలాగే!
-సోమశిల తిరుపాల్