బుడిబుడి అడుగులతో
అవనమ్మ గుండెలపై పారాడుతూ
నెమ్మదిగా సాగిపోయే పిల్ల కాలువ
పిల్లలకే కాదు పెద్దలకూ
ఆట విడుపుల అల్లరి కాలువ…
వీపున గోగ్గర్రల మోపునో
నడుముకి బిగించిన టైరో లేకుండా
బుడుబుంగలా మునుగుతూ తేలుతూ
చేప్పిల్లోలే ఈతల ఆరితేరించే
బుడ్డ పోరగాళ్ళ దోస్తు గీ పిల్ల కాలువే…
బుడ్డ పరకలు చంద మామలు
తళుకు తళుకు మని కవ్విస్తుంటే
ఒడుపుగా గాలం లేకుండానే
పట్టుకోవడం నేర్పిన పంతులమ్మ
గీ పిల్ల కాలువే…
పొలాల కడుపు నింపేందుకు
బాటపొంటి పోయే జనాల దూప తీర్చేందుకు
గంగమ్మ తల్లి నుండి జాలువారిన పాలధార,…
ఎగుసం చేసే రైతన్నలకు
కాయ కష్టం చేసే కూలినాలి తల్లులకు
వస్తా పోతా సేద తీర్చి
ఒళ్ళునూ మనసును
కడిగిన ముత్తెంలా చేసే తల్లి కాలువ..
గలగలమనే చిరుసవ్వడితో
గట్లు చెట్ల వెంబడి సాగిపోతూ
సబ్బండ జనాల క్షేమం కోసం
నిత్యం కలవరించే నీళ్ళమ్మ..
మనిషి బతుక్కీ మెతుక్కీ
పేగు బంధమీ పిల్ల కాలువ
సొచ్చమయిన మనసున్న
పల్లె జనాలకు అమృత జల ధార..