శ్లో ॥ సంబంధ మా భూషణ పూర్వ మాహుః
వృత్తస్స నౌ సంగతయో ర్వనాంతే ,
తద్భూతనాథానుగ నార్హసి త్వం
సంబంధినో మే ప్రణయం విహంతుం.
పదచ్ఛేదము :- సంబంధం , ఆభాషణపూర్వం , ఆహుః
వృత్తః స్సః, నః , నౌ , సంగతయోః , వనాంతే , తత్; భూతనాథానుగ , న, అర్హసి , త్వం , సంబంధినః ,
మే, ప్రణయం , విహంతుం.
అర్థం:— సంబంధం= స్నేహమును, ఆభాషణపూర్వం- ఆభాషణ = సంభాషణమే , పూర్వం = కారణము గాగలిగినదానిగా , ఆహుః = చెప్పుచున్నారు.సః= అట్టి సంబంధము , వనాంతే = వనసమీపమందు, సంగతయోః = సంబంధించిన, నౌ= మనకిద్దరికి, వృత్తః = జరిగెను, తత్ = ఆకారణమువలన ,హే భూతనాథానుగ = ఓయీశ్వరకింకరుడయిన సింహమ, సంబంధినః = మిత్రుడయిన , మే= నాయొక్క, ప్రణయం = యాచనను , విహంతుం = వ్యర్ధపరుచుటకొరకు, నార్హసి = తగవు .
భావము:— ఇద్దరిమధ్యా మాట్లాడుటయే స్నేహమునకు కారణమని అంటారు.అటువంటి స్నేహం మన ఇద్దరికీ ఈ అడవి దగ్గర కుదిరింది. కాబట్టీ భూతనాథుడైన శంకరుని సేవకుడివైన నువ్వు మిత్రడినైన నా యాచనను అంగీకరించకపోవడం న్యాయంకాదు.స్నేహధర్మం కాదు.
రఘువంశంలోని ఈ శ్లోకమును ప్రకరణ ఔచిత్యంగా ప్రధాన శీర్షికగా ఒద్దిరాజు సోదరులు ఎందుకు తీసుకున్నరనీ కాస్త ఆలోచిస్తే …నన్నయ గారి ప్రభావం సోదర కవుల మీద ఉన్నట్టు తోస్తోంది. భావి కథార్ధ సూచిగా ఈ శ్లోకం తీసుకున్నారు. ఆ శ్లోకం చదువుతూనే రాబోయే కథ మనకు ద్యోతకమవుతుంది. అది సూక్ష్మంగా, సూటిగా కథను చెప్పే విధానాలలో ఒకటి. చదువరులకు విసుగు కలుగకుండా కథను లాగిలాగి చెప్పకుండా చదువుతూండగానే కవి ఏమి చెప్తాడన్నది పాఠకుడి ఊహకు వదిలేయడం ఆనాటి రచనా వైచిత్రి.అందుకే ఇలా ప్రతీ ప్రకరణానికీ కావ్యాలనుండి, ఇతిహాస, పురాణాలనుండీ సందేశాల వంటి శ్లోకాలను శీర్షికగా పెట్టడం అద్భుత రచనా శైలి…ముందు ముందు మనం ఆయా సన్నివేశాలు క్లుప్తసుందరంగా వివరించుకుందాము..
ఇక కథలోకి ప్రవేశిద్దామా!
క్రీ॥ శ॥ 1265 వ సంవత్సరం,ఫాల్గుణ శుద్ధ సప్తమి రోజు నిర్మలపురం నుండి దేవగిరికి వెళ్లేబాటమీద ఒకతను నడుస్తున్నాడు. అతనికి దాదాపు 50 సంవత్సరాల వయస్సు ఉంటుంది. మంచి దుస్తులు కట్టుకున్నాడు. శరీరం సుకుమారంగా ఉన్నా , చాలా దూరం నుండి ప్రయాణంచేయడం వల్లనేమో అతని చర్మం నల్లగా కమిలిపోయింది.. గడ్డాలు, మీసాలు గుబురుగా పెరిగినా అతనేమీ సన్యాసి వలె లేడు. అతనిని చూస్తే సాత్వికుడి వలె కనపడుతున్నా… గంభీరమైన మనసున్న వాడని, ఎంత గొప్పపనైనా చేయడానికి వెనుకాడడని, చేయాలనుకుంటే ఆ పనిని ఎంతో నేర్పుగా చేయగల సమర్థుడనీ, ఎంత పని చేసినా అలసిపోడని అతనిని చూసిన వారికి అనిపిస్తుంది.ఎక్కువ లావుగానూ ఎక్కువ సన్నగానూ లేకుండా పొడవుకు తగినట్టున్నాడు. అతను ఒక అడవి నుండి ప్రయాణం చేస్తున్నాడు. ఆ అడవి పెద్ద పెద్ద చెట్లతో ఎత్తయిన తరువులతో నిండి ఉండి, వాటి మొదళ్లలోనూ మరి కొన్ని రకాల చెట్లు పెరిగి ఉన్నాయి. ముళ్ళపొదలు కుప్పలు కుప్పలుగా పెరిగి , ఆ బాట విశాలంగా ఉన్నా కూడా రెండు వైపులా ఆ పొదలు ఉండడంతో బాట ఇరుకై పోయింది. అందుకే ఆ దారి వెంట వెళ్లేవారికి ఆ ముళ్ళపొదలు గీరు కొని పోయేవి. ఆ ఎత్తైన చెట్లపై గుబురుగా అల్లిబిల్లిగా అల్లుకున్న కొమ్మలపై పక్షులు గూళ్ళు తయారుచేసుకుని అందులో జీవిస్తూ చిన్న జాతి పక్షులు చాలా సంతోషంతో కిలకిలమంటూ అరుస్తూ ఆ పొదలలోనూ, బొరియలలోనూ సూర్యుని ఎండ వేడి బాధ లేకుండా హాయిగా అవి ఎలాంటి చెడు పనులు చేయకుండా తమ తమ పిల్లలతో ఆడుకుంటూ ఉండేవి. అలా ఆడుకుంటున్న క్రమంలో ఒక్కొక్కసారి భయంకరంగా అరుస్తూ, మరొకసారి చెవులకు ఆనందం కలిగించే విధంగా అందంగా అరిచే అరుపులు హాయిని కలిగించేవి. కొన్ని పెద్ద జాతి పక్షులు ఆ ఎత్తైన చెట్లపై కూర్చొని, మధ్య మధ్యలో రెక్కలు విదిలించడంతో వచ్చిన చప్పుడు చాలా వింతగా ఉండేది. అటువంటి అడవి నుండి నడుస్తున్నాడు మన బాటసారి. మండే సూర్యుడు పశ్చిమ కొండలవైపు వెళుతున్నా కూడా వేడిమి తగ్గలేదు. ఎండ ఫెళఫెళ మని కాస్తూనే ఉన్నది భూమి ఆకాశాల నిండా ఎండమావులు వ్యాపించి ఉన్నాయి. జీవకోటి జంతుజాలం ఆ ఎండవేడికి కనీసం తలలు కూడా బయట పెట్టలేక పోతున్నాయి. చల్లటి నీడలో పడుకొని సాధు జంతువులు కూడా ఆ ఎండవేడికి రొప్పుతున్నాయి.
మన బాటసారి ఆ దట్టమైన అడవిలో నడుస్తూ ఉండటం వల్లనో, మరే కారణమో కానీ,గొడుగును పట్టుకోవడం కానీ, చెప్పులు తొడుక్కోవడం కానీ, తల మీద కండువా కప్పుకోవడం కానీ చేయలేదు. అతను అలా నడిచి పోతూ ఉంటే కొంతసేపటికి గుబురు అడవిలోని చెట్లు కాస్త పలచబడినట్లు అనిపించింది. అతనికి విపరీతంగా దప్పిక వేయడంతో ఏదైనా చెరువు గాని, బావి గాని చుట్టుపక్కల ఉన్నాయా? అని నాలుగు వైపుల చూశాడు. అంత ఘనమైన అడవిలో తనకు చెరువు కనపడుతుందా? అనుకొని మనసు దిటవు చేసుకుని నడుస్తుండగా అతనికి ఒక కొలను కనపడింది. ఆ కొలను విశాలమైన ఆరుబయలులో ఉంది. అతనికి ఒక్కసారిగా పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్లయింది. గబగబా నడిచి కొలను చూశాడు. అంత చిట్టడవిలో ఆ కొలను ఎందుకు నిర్మించారో తెలియలేదు. ఆ దిగుడుబావి వంటి కొలనులోని స్వచ్ఛమైన నీటిని చూసి చాలా సంతోషం కలిగింది. ఆ కొలనుకు నాలుగు వైపులా నునుపైన, వెడల్పైన రాతిపలకలతో, సున్నంతో కట్టిన మెట్లు ఉన్నాయి.
చుట్టూ గచ్చు గోడ కూడా ఉంది. లోపలికి దిగేందుకు చాలా చోట్ల తోవలు ఉన్నాయి. ఆ నాలుగు తోవలకు తలుపులు ఉన్నట్లుగా గుర్తులు చూశాడు మన బాటసారి. బాటసారి గబగబా నడిచి వచ్చి, చంకలో ఉన్న బట్టల మూటను ఆ ప్రాంతంలో ఉన్న రావిచెట్టు మొదట్లో పెట్టి, మీద కప్పుకున్న బట్టలు తీసి పక్కన పెట్టి, అక్కడనుండి దగ్గర్లో కొలను లోపలికిదిగి,కాళ్ళు చేతులు, ముఖం కడుక్కొని, ముఖం మీద నీళ్లు చల్లుకొని, దోసిలితో నీళ్ళన పట్టి, అందులో చేపలు కప్పలు మొదలైన చిన్న జంతువులు లేకుండా చూసుకొని, నాలుగైదు దోసిళ్ళ నీళ్లు తాగి, దప్పిక తీర్చుకుని, మళ్లీ కొంత నీటిని ముఖంపై చల్లుకొని చాలా హాయిగా ఉంది అనుకుంటూ వచ్చి చల్లటి నీడ నిస్తున్న రావిచెట్టు కింద తన బట్టల మూట దగ్గర కూర్చున్నాడు.
అతనికి ఆ రావిచెట్టు కాండం మొదట్లో కూర్చునేందుకు అనువుగా ఉందనిపించింది. అందుకే దానికి ఒరిగి కూర్చొని, కళ్ళు మూసుకుని కొన్ని నిమిషాల దాకా తనకు కలిగిన అలసట తీర్చుకుంటున్నాడు. అతడు ఇంతదాకా చెట్ల నీడలో నడిచిన వాడైనా.. ఆ ఎండాకాలపు వేడికి అలసిపోయాడు. ఆ అలసట పోయేదాకా అతనేమీ మాట్లాడకుండా కళ్ళు సగం మూసుకొని ఉన్నాడు. అలసట తీరుతున్న కొద్దీ అతనికి తన గతచరిత్ర అద్దంలో కనపడినట్టు గుర్తుకు వస్తున్నది. అందుకే అతని ముఖంలో కోపం, దుఃఖం పెనవేసుకొని కనబడుతున్నాయి. అప్పుడప్పుడు అతని కంటి వెంట కన్నీరు ఆగకుండా దుముకుతున్నది. కొంచెం సేపటికి అతను తనలో తాను ఇలా అనుకున్నాడు .
ఇటువంటి చెడు పని చేయడానికి అతనికి మనసెట్లు ఒప్పుకున్నదో? ఏమైతేనేం అన్ని ప్రాణులను తమ ప్రాణం వలనే చూడాలి కదా! ఎవరికీ చెడు చేయకూడదు అని భావం రానీయక, ఇలాంటి పని చేయాలనుకోవడం! ఆహా! వేదాలు హింసా ధర్మం గురించి చెప్పలేదా? ఆ వేదం మాటలను ఎందుకు అర్థం చేసుకోలేదు? వేదం చెప్పినట్టు అందరూ నడుచుకోవాలన్న సంగతి తమకు తెలియకపోతే ఇంకొకరు ఎవరైనా చెప్పలేదా? రూపం లేని వాడైనా, అన్నిటినీ సమానంగా చూసే సర్వేశ్వరుడు పైనున్న (16) పదహారు లోకాలకు పైన ఉన్న యాగమీంద్ర లోకంలో ఉన్నా… అతను అంతటా ఉండే వాడు కాబట్టి ఇక్కడ జరిగే అన్నింటిని అతను చూస్తుంటాడు.. పుణ్యాత్ములు నడిచే తోవలో కాకుండా పాపాత్ములు పోయె” అధోలోకములైన ఏడు లోకాలకు పోయిందుకే నిశ్చయించుకుని ఉంటాడు . అన్ని ధర్మాలలోనూ అహింసా ధర్మం గొప్పది కదా! ముఖ్యమైనది కూడా! రాత్రి పూట భోజనం చేస్తే చీకటిలో ఎన్నో జీవులు చనిపోతాయని భోజనం చేయకూడదు! ప్రాణహాని జరుగుతుందని వడియ బోయకుండా మంచి నీళ్లు తాగకూడదు. గట్టిగా అడుగులు వేస్తూ నడవకూడదు అనే ఇటువంటి ధర్మాన్ని లెక్కచేయక, చీమలను దోమలవలె జనాలను లెక్కలేకుండా చంపివేయడం… జైనులు నీకేమి హాని చేశారు? ఒకరి జోలికి పోనివారిని ఇంతటి తప్పు చేసిన నీకే గతి కలుగునో? నీ చేతికి చిక్కి తల నరికించుకున్నప్పుడు , రాతిగానుగలలో పెట్టి చిత్రహింసలు చేసేటప్పుడు, మంటలలో తోసి వేసినప్పుడు తల్లడిల్లి జైనులు ప్రాణాలు విడిచారో వాళ్ల అవస్త కళ్ళారా చూసినప్పుడు నీకెలా మనసు కరగకుండా ఉన్నదో? కదా! నీ మనసులో కొంచమైనా దయ ఉంటే ముప్పైఆరు గ్రామాలను తుదముట్టిస్తావా? ఇటువంటి చెడు పనులు చేసే నీ ప్రభుత్వం లోపాలతో నిండి ఉంది. అంటే తప్పేమిటి?” ” ధర్మం ఎక్కడ ఉందో జయం అక్కడ” అని పెద్దలు చెప్తారు కదా! నీకు ఎప్పుడూ అపజయం కలుగక పెద్దల మాటవట్టిమాటై విలువ లేకుండా పోయింది. ఇది కలియుగం కదా! పాపాత్ములకే విజయం కలుగుతుంది. మా ఖర్మ ఇలా ఉంటే నిన్ను అనవలసిన పని ఏమున్నది?
ఓ ! గణపతి రాజా! నువ్వు నాకు చేసిన ద్రోహం తలచుకుంటే నాగుండె ఝల్లుమంటుంది. పసిబిడ్డలను, భార్యలను, ముసలి వారిని కూడా చంపడానికి వెనకాడలేదే? నువ్వు శాశ్వతంగా రాజ్యమేలు కుంటానని అనుకున్నావేమో? కానీ చివరికి అందరిఉసురు పోసుకున్న నీ ఉసురులను కూడా భగవంతుడు తీయకుండా ఉంటాడా? నువ్వు చచ్చిపోయి ఐదు సంవత్సరాలు అయినా నువ్వు చికాకు పెట్టిన మా మతం, మా దేశం ఇంకా కోలుకోనేలేదు. నీ బారినపడిన నీ నుండి ఎలాగో నావలె తప్పించుకొని విదేశాలకు పారిపోయిన మా వాళ్లకు నీ మరణ వార్త చెప్పక తప్పదని నీకు అనిపించలేదు.
ఓరీ! దేశద్రోహీ ! నువ్వు చేసే పనులు క్రూరాతి క్రూరమైనవి. అసలు ఒక మంచి మనిషి అయినా నీ వంశంలో పుట్టారా? అయినా విత్తు ఒకటి పెడితే చెట్టు ఒకటి మొలుస్తుందా ? ఏ తప్పూ చేయని జనాల శాపం నీకు తగిలి, నీకు సంతానం కలుగక చచ్చి పోయినప్పుడు… ఒక ధర్మప్రభువుగా మరొక రాజు పరిపాలన కొస్తాడని నమ్మకంతో ఎదురు చూసాము. నీ బిడ్డ కూడా నీ పోలికనే ! హా! దైవమా! మా కష్టాలు గట్టెక్కించాలను కోవడం లేదా? ఇప్పుడేం చేయాలి? ఏ తప్పూ చేయని అమాయకులను ఎందరినో తన పొట్టనపెట్టుకున్న రాజవంశం సర్వనాశనం చేయాలి! అయ్యో! తన మతాన్ని, ధర్మాన్ని పాటించకుండా పనికిరాని వాడివైనావు ! ఏం చేయాలి? తలమీద గుండు పడుతున్నప్పుడు ధర్మం ఎంత వరకు పాటించగలము? పాపమైనా పుణ్యమైన సరే! వెనుకకు మరలను. వంశ నాశనం అవుతున్నప్పుడు నేనొక్కడినే నా కులాచారం పాటించటం ఎంతవరకు సబబు? సరే పాపమే వస్తుందనుకుందాం ! పాపం వచ్చినా, ఏ తప్పూ చేయని వారిని వేలకువేలు చంపిన గణపతి రాజునకు అంటిన పాపం లో నూరో వంతు కాదు…. వెయ్యో వంతు కూడా కాదు. లోకానికి ముల్లు వంటి వాడి కుటుంబాన్ని నాశనంచేయడం వల్లనైనా రాజ్యాన్ని, వారి వంశాన్ని, కులాన్ని, వాళ్ల చేతిలో నుంచి జారి విడిచినా కూడా ఏమీ కాదు. ఈ ప్రతీకారం ఎలా తీర్చుకోవాలి? ఇతడైనా నా మాట వింటాడో? వినడో? అసలు ఇతని ఆలోచన ఏమిటో తెలియడం లేదు. అతడు ఏం ఆలోచించినా గణపతి రాజులకు వీళ్లకు పైపైన స్నేహ భావం ఉన్నట్టు కనబడినా…. లోలోపల శత్రుత్వం రగులుతున్న నిప్పువలె వెలుగుతున్నదని అటా అటలుగా తెలుస్తున్నది. ఒక ఎత్తువేస్తాను. పాచిక పారిందా సరే సరి! లేదా నాకు సహాయపడే వారితో నేననుకున్న పని నెరవేర్చుకుంటాను. శతృవుకు శతృవు పరమ మిత్రుడు. కానివ్వు ! అయ్యేదేదో కాక మానదు.ముందుగా యాదవరాజును ఒకపట్టు పట్టు పడతాను.తరువాత నా బలాబలాలను తేల్చుకుంటాను.”
ఇలా ఇతను మాట్లాడడం వల్ల ఇతను జైనుడని అనిపిస్తుంది. శ్రీ కాకతీయ గణపతి రాజు జైనులమీద ఎంత కక్ష కట్టాడో అందరికీ తెలిసిందే.ఇతను ఎలానో తప్పించుకొని వచ్చి గణపతి రాజు మరణించినా, కోపము వదలక అతని వంశం పై పగ తీర్చుకోవాలని చూస్తున్నట్టు అతని మాటలను బట్టి తెలుస్తున్నది.
ఈ బాటసారి దేవగిరి తోవబట్టి వెళ్లి పోతుండడం,
“గణపతి రాజులకు వీరికీ పగ” ఉన్నదని అతని మాటలు విచారించినా దేవగిరి పోతున్నవాడని మనం అంత తేలికగా కాకపోయినా..తెలుసుకోవచ్చును. కొంత సేపటికి తన మనసులోని భావాన్ని తెలుపుతూ,అరకన్నులు మూసి ఆలోచిస్తూ, చెట్టు మొదట్లో బోదెను ఆనుకుని కూర్చున్నాడు. ఆ అడవిలో మానవమాత్రుడుండరని అతను అనుకున్నాడు. అందుకే జనాలు లేని ప్రదేశంలో ఒంటరిగా కూర్చొని, గత చరిత్రను నెమరు వేసుకుంటూ ప్రస్తుతం ఏంచేయాలా ? అని ఆలోచిస్తున్నాడు. ఎండ వేడి అంతగా లేదు.రెండు మూడు ఝాముల పొద్దున్నది.కళ్ళు మూసుకున్న మన బాటసారికి సాయంకాలం అవుతున్నట్లుగా అనిపించింది. ” పొద్దు గుంకక ముందే చేరవలసిన చోటుకు వెళ్లాలి.లేకపోతే క్రూరమైన జంతువుల పాల బడవలసి వస్తుంది. ” అనుకున్నాడు.చాలా సేపటినుండి కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్నాడు కదా!ఆ కూరుకుపోయిన కళ్ళను
బలవంతంగా తెరిచాడు.
తెరవడంతోనే ఒక్కసారిగా కలవరపడ్డాడు దీనంగా చూసాడు.గుండె దడదడా కొట్టుకోవడం మొదలు పెట్టింది. ఒళ్ళంతా గగుర్పొడిచింది. పెదవులు ఎండిపోయి, అప్రయత్నంగా నాలుకతో తడుపుకోవడం మొదలుపెట్టాడు.పెద్ద నిట్టూర్పు విడిచాడు.
బాటసారి అలా కావడానికి అతని ముందు ఇద్దరు వ్యక్తులు కళ్ళ ముందు కనపడడమే!
అలా అతని ముందు నిలబడిన ఇద్దరూ ఒకే ఈడువారై పోలికలలోనూ ఇద్దరూ ఒకే తీరుగాఉండి చూసేవాళ్ళకి అన్నదమ్ములవలె కనపడుతున్నారు.ఈ బాటసారి కన్నా పది సంవత్సరాలు చిన్నవారే…కానీ వారి శరీరాలు ఒకప్పుడు మంచి ఉచ్ఛదిశ అనుభవించి, క్రమేణా ఆ వైభవం కోల్పోయిన వారి వలె కనిపిస్తున్నారు.
తన మాటలను ఆ కొత్త వారు విన్నారనుకొని , చాలా చాలా బాధపడుతున్నాడు. వారెవరో అతనికి తెలియదు. వాళ్ళతో తనకేమైనా హాని కలుగుతుందా?అని అనుకుంటున్నాడు.బాటసారి ముఖంలో నిమిష నిమిషానికి రంగులు మారుతున్నాయి.
ఏం మాట్లాడకుండా నిలబడి చూస్తున్న ఆ ఇద్దరికీ బాటసారి స్థితి మొత్తం తెలుస్తున్నది. వెంటనే వారిద్దరూ ఒకరి మొహాలు మరొకరు చూసుకుంటూ…
ఏవో సైగలు చేసుకొని , ఏంచెప్పుకున్నారో ఏమో ? మనకైతే తెలియదు.కానీ బాటసారి తో ఇలా అన్నారు.
మొదటివాడు అన్నాడు కదా ! నీవేమీ భయపడవలసిన పని గానీ, విచారించాల్సిన పని కానీ లేదు. నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాము. వాటికి బదులు చెప్తారా?అని అడిగాడు.
బాటసారి:—అయ్యా! మీరెవరు?
మొదటి వాడు:– నీ వలెనే మేమూ బాటసారులమే!
బాట :– ఎక్కడికి పోతున్నారు?
మొ-వాడు :– దేవగిరికి…మహాదేవరాజు దగ్గరకు.
బాట :— మీరేమైనా తప్పు చేసారా? వారి పట్ల?
రెండవ వాడు:– మేమేమీ తప్పు చేయలేదు. మేము వారికీ శత్రువులమూ కాము; మిత్రులమూ కాము.
బాటసారి:– మీరు మిత్రులూ, శత్రువులూ కాకపోతే మరి అక్కడికి ఎందుకు పోతున్నారు?
రెండవ వాడు:– మీరెందుకు పోతున్నారు?
బాటసారి:– ఒక్కసారిగా భయపడిపోతూ…తన మాటలను వీరు విన్నారనుకున్నాడు.
రెండవ వాడు:– విచారించకండి! మీ మాటలను విని , మీరు కూడా దేవగిరికి పోతున్నారని తెలుసుకున్నాము.మీకు గణపతి రాజు శత్రువని రుద్రమదేవిని రాజ్యపదవి నుండి తప్పించాలని మీరు అనుకోవడం మేము తెలుసుకున్నాము.ఇక ఇప్పుడు ఆ విషయం దాచినా లాభం లేదు.
బాటసారి:– నన్ను రక్షించండి బాబుగారూ! నేనన్న మాటలు మీరు విన్నారు కాబట్టి ఇక నన్ను ఏమి చేసినా మీరే…అంటూ తడబాటుతో బాటసారి మాట్లాడలేక పోయాడు. బాటసారి భయానికి ఆ ఇద్దరూ జాలిపడి ఇంకా వేరే ప్రశ్నలు వేయలేదు.
మొదటి వాడు :– చీకటి పడుతున్నది.మేము కూడా దేవగిరికే పోతున్నాము. కనుక దారి వెంట మాట్లాడుకోవచ్చు రాండి మాతోపాటు.
బాటసారి ఏం చేయలేక , తన బట్టలను ముందటి వలెనే సర్దుకుని , లేచి ప్రయాణమై ఆ ఇద్దరి వెంట నడుస్తున్నాడు. ఏంచేయాలో తెలియని మూర్ఖులు ఎవరు ఎలా చెబితే అలా చేయడానికి వెనుకాడరు కదా!
మొదటి వాడు:– మీరు బాధపడకండి ! మీకెటువంటి ఆపద వచ్చిందో…దాదాపు మాకూ అటువంటి ఆపదే వచ్చింది.
బాటసారి:– మీకు ఆపద ఎవరి వలన వచ్చింది?
మొదటి వాడు:– గణపతి రాజు వల్ల.
జైనుడికి నమ్మకం కలుగలేదు. మొదటివాడు వెనుకకు తిరిగి చూసాడు. రెండో వాడికి చెప్పాడు. అతను నమ్మడం లేదని…
రెండవ వాడు:–మీరు అంతగా బాధపడకుండా మమ్మల్ని నమ్మండి!
బాటసారి:– మీరెవరో చెప్తారా?
మొదటి వాడు:– మా పేర్లు అడుగుతున్నారా?
బాటసారి:– పేర్లు చెప్పండీ…ఇం…కా…
మొదటి వాడు:– తడబడకండీ ! నా పేరు హరిదేవుడు.రెండో వాడి పేరు మురారిదేవుడు. ఇంకా…?
బాటసారి:– మీకూ, మహాదేవరాజుకు మైత్రీ సంబంధంలేదని అన్నారు కదా! అక్కడికి పోవాల్సిన పనేముంది?
మొదటి వాడు:– మాకు వారు ఉత్తరం రాసారు. ఇంతకుముందెప్పుడో పరిచయమున్నది.కానీ మళ్ళీ కలువలేదు.అదీగాక! మేము ఇక్కడ నివసించే వాళ్ళము కాము. కాకతీయుల రాజ్యమున మేము….అయ్యా ! జరిగిపోయిన మాటలు ఇప్పుడెందుకూ?
బాటసారి:– అయ్యా ! దేవరా! చెప్పితే తప్పా?
మొదటివాడు:– తప్పా అని అంటున్నారా? గణపతి రాజు మమ్మల్ని పదవి నుండి తీసేశాడు. అంతేకాదు మమ్మల్ని గుర్తు పెట్టుకున్నాడు. చేసేదిలేక, మారు వేషాలతో ఆ దేశం లోనే ఉన్నాము. మొరపెట్టుకుందామని పోవాలి అనుకున్నాము. ఇంతలోనే ఉత్తరం కూడా వచ్చింది.
బాటసారి:– మన ముగ్గురం ఒకే తీరు ఆపదలో ఉన్నాం కాబట్టి, ఒకరిపై ఒకరం విశ్వాసం వదులుకోకూడదు. మన మొరలను మహాదేవరాజు వింటాడో?
మొదటివాడు:– నిజంగా స్నేహాన్ని విడిచి పెట్టవద్దు. మా మండలాలు మాకు దక్కితే మిమ్మల్ని మా దగ్గర ఉంచుకుంటాం. గణపతి రాజులకు దేవగిరి ప్రభుత్వం వారికి ఎప్పటినుండో శత్రుత్వం ఉన్నది. మన మాటలపై ఆదరం ఉంచుతారని నా నమ్మకం.
బాటసారి:– ఏమో? ఏమవుతుందో? మన ప్రాప్తం ఎలా ఉందో?
రెండవవాడు:– మీ పేరేమిటి?
బాటసారి:– నా పేరా? ధర్మవర్ధనుడు.
మొదటివాడు:– అయ్యా ! మీరు జైనులా?
బాటసారి:– అవును నేను జైన బ్రాహ్మణుడను. ప్రజా వృక్షానికి వేరుపురుగు వలె గణపతి రాజు దాపురించి, పెట్టరాని కష్టాలు పెట్టినాడు. దాన్ని ఇప్పుడు తలుచుకుంటే గుండెలవిసి పోతాయి. దీనికి అంతటికి కారణం తిక్కన! తిక్కన కవి, బ్రాహ్మణుడు, సోమయాజికూడా. అందుకే గణపతి రాజుకు బోధలు ఎన్నో చేసి, మాకు ఇటువంటి కష్టాలు తెచ్చిపెట్టినాడు.
రెండవవాడు:– విధి బలీయమైనది. కనుకనే అదంతా జరిగింది.
ఆ ముగ్గురు మాట్లాడుకుంటూ నడుస్తూ… నడుస్తూ… బాటకు కుడివైపుకు అరకోసుదూరంలో ఒక కూలిపోయిన కట్టడం కనిపించింది.
బాటసారి:– అయ్యా! ఇవేమి కట్టడములు? అందచందాలు తగ్గినా పూర్వపు వైభవాన్ని తెలుపుతున్నాయి.
మొదటివాడు:– ఈ కట్టడాల గురించి రాస్తే ఒక చరిత్ర గ్రంథమే అవుతుంది. అయినా క్లుప్తంగా చెబుతాను. నిర్మలపురంలో మూర్ఖుడైన సుదర్శన వర్మ అనే రాజు అనిల పురము సోమ పాలుడు, మరికొంత మంది ఇక్కడ మేడలను కట్టించి, పాతాళంలో మంచి తోటను పెంచి, దానికి “నందనవనము” అని పేరు పెట్టి, దానిలో ఎందరినో అందమైన వయ్యారిభామ లను, వయసులో ఉన్న యువకులను చెర పెట్టి రాగమంజరి అనే ఆమెను అధికారిగా నియమించి, ఆమె ఆధ్వర్యంలో ఆ చెరపట్టిన ఆడ ,మగ వారి మధ్య ఒకరిపై ఒకరికి ప్రేమ కలిగేటట్టు చేసి, ” పాతాళ భైరవి” అనే దేవతా పాతాళ మందిరంలో ఉంచి పూజించేవారు. ఈ మహాదేవరాజు అక్క పద్మావతిదేవి అనే ఆమెను, అన్న అయిన కృష్ణ భూపాలుని చెరలో పెట్టి, శౌణదేశమును ఆక్రమించుకోవాలని అనుకున్నారు. నందనవనంలో తమ మాట వినని వారిని ఆ భైరవికి బలి ఇచ్చేవారు. ఈ కట్టడాలు వారికి సంబంధించినవే. ఇక్కడి నుండి పాతాళభైరవి దగ్గరకు పోవడానికి సొరంగ మార్గం ఉన్నది.
ఇలా మాట్లాడుతూ వాళ్ళు నడుస్తుండగా దారి పక్కన పెద్ద రావిచెట్టు కనబడింది. దానిని ఆ ఇద్దరు వ్యక్తులు చూసి బాటసారికి చూపెట్టి ఇలా చెప్పారు.
మొదటివాడు:– ఈ ప్రాంతంలో అప్పుడు శౌణ దేశపు మంత్రి అయిన శంకర రాయుడు నివసిస్తూ, సోమ పాదులు మొదలైన వారి కుట్రలను తెలుసుకొని, వారిని పట్టుకునేందుకు దండు విడిచిన చోటు నుండి వచ్చి ఇక్కడనే ఉన్నాడు.
బాటసారి:– చివరకు ఏం జరిగింది?
మొదటివాడు:– గణపతిరాజు వచ్చి శంకరునితో కలిసిపోయి, సోమ పాలాదుని కుట్రలు తెలుసుకొని , కృష్ణభూపాలుని, పద్మావతిని జాగ్రత్తగా తీసుకుని వచ్చి, పాతాళ మందిరాలను, బైంపిని నాశనం చేశారు
బాటసారి:– చాలా వింతగా ఉన్నది కదా!
మొదటివాడు:– వింత అనడానికి ఇంకా అనుమానం ఎందుకు? శంకరుడు, గణపతిరాజు లేకపోతే దేవగిరికిప్పుడు రాజు మహాదేవ రాజు కాక నిర్మలా పురము రాజయిన సుదర్శనవర్మ కొడుకు వర్థమానుడు రాజు అయ్యేవాడు.
బాటసారి:– తమకు కుల క్రమానుసారంగా వచ్చే రాజ్యానికి చెర నుండి తప్పించి తన అన్నను రాజులు చేసిన గణపతి రాజవంశంపై మహాదేవ రాజు జోక్యం చేసుకుంటాడో లేదో అని అనుమానం కలుగుతున్నది. అలామాట్లాడుతూ నడుస్తూనే ఉన్నారు. ఇంతలో దేవగిరి వారికి కనపడి ఆనందం కలిగించింది.
( పరిపాలనలో అసంతృప్తుల అయినా ముగ్గురు శత్రువులుగా మారి, రుద్రమదేవిని ఓడించి, ఓరుగల్లు సింహాసనాన్ని దక్కించుకోవాలని దేవగిరి రాజు దగ్గరకు బయలుదేరి పోవడం, అడవి వర్ణన మొదలైనవి ఈ ప్రకరణంలో ని విశేషాలు.)
(సశేషం)
సరళీకృతం
-రంగరాజు పద్మజ
ఒద్దిరాజు సోదరులలో చిన్నవారైనా ఒద్దిరాజు రాఘవరంగా రావు గారి కుమార్తె.
ప్రముఖ కవయిత్రి, రచయిత్రి,
హైదరాబాద్
+91-9989758144