మౌనం వారి స్వభావం. ఒద్దికగా నిమ్మళంగా పనిచేసే తత్వం. అధ్యయనం వారికి ఇష్టం. దృష్టికోణం భిన్నంగా కలవారు డా|| మచ్చ హరిదాసు సార్. పద్యసాహిత్యం వారి వారసత్వం. తెలుగు సాహిత్య మెళకువలు గురుప్రసాదం. ఋషి తుల్యులు. విద్యార్థి దశ నుండి ఈనాటి దాకా చదువుకోటం నిత్య ఆనందంతో చేసే పని. అందరికన్నా భిన్నంగా తన కార్యనిర్వాహణ ఉంటుంది. రాసిన ప్రతి పదం, వాక్యం అన్నీ పరిశోధనాత్మక విషయాలే. ఆదియానో బహూన్ గ్రంథాన్, సేవ్య మానో బహూన్ గురూన్, లోకమానో బహూన్ దేశాన్…. అచ్చుగా ఈ శ్లోకం హరిదాసు సార్ కి బాగా అబ్బుతుంది. కొండాపూర్ నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయం, తంజావూర్, వేటపాలెం గ్రంథాలయాల నుండి కరీంనగరు దాకా ప్రతీ ప్రదేశం, నేర్పిన కొత్త అంశాలు తన రచనకు సోపానాలుగా మారినాయి. హరిదాసు సార్ అంటేనే యాత్రా చరిత్ర అనే సమానార్థకంగా మారిపోయి, పరిశోధనలో దూరిపోయి, అక్షరాల మీద ప్రదేశాలను నిలిపిన కళాత్మకత. కావ్య సౌందర్య రసాత్మకత.
విస్తృత అధ్యయనం విమర్శనంగాని వైపుకు దారి తీసింది. ప్రస్తుత తెలుగు సాహిత్యంలో విమర్శ చాలా తక్కువగా వస్తుందని పెద్దల అభిప్రాయం. కాని వచ్చే విమర్శలు మాత్రం చాలా వరకు లోతైన విమర్శ వస్తున్న క్రమంలో హరిదాసు గారు మొదటి వరుసలో ఉంటారు.
డిగ్రీ కళాశాల ద్వారా జాతీయ సెమినార్లు నిర్వహించటంలో ప్రముఖ పాత్ర వహించినారు. కళాశాల ద్వారా తీసుకొని వచ్చిన సాధారణ పరిశోధకులు తాము పరిశోధన చేసిన అంశాన్ని డాక్టరేట్ పట్టా పొందాక పక్కన ఉంచుతారు. కొందరు మాత్రమే కొనసాగిస్తారు. అందులో హరిదాసు గారు ఒకరు. యాత్రాచరిత్రల సూచి ప్రకటించారు. ఇంకా ఈ వైపు పరిశోధన వీరు చేస్తూనే వున్నారు. తెలుగు సాహిత్యంలో మచ్చలేని చంద్రుడు హరిదాసు గారు.
కె.ఎస్. అనంతాచార్య, కరీంనగర్,
యాత్రా చరిత్రలపై పరిశోధన చేయాలని మీకు ఎందుకు అనిపించింది?
డా|| ఎన్.గోపి (గోపాల్) వేమన మీద పరిశోధన చేస్తున్న రోజులలో ఆయన వెంట సహాయకుడిగా 1977లో మద్రాసుకు వెళ్లాను. అది నా మొట్టమొదటి రైలు ప్రయాణం. కుతూహలంతో ఆ రాత్రంతా మేల్కొని ఉండి దారిలో తటస్థించిన ప్రతి స్టేషన్ పేరును, రెండు స్టేషన్ల మధ్య కాలాన్ని గుర్తు పెట్టుకుంటూ (నోట్ చేసుకుంటూ) వచ్చాను. మద్రాసులో 40 రోజులు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో మా పని. అక్కడి ప్రదేశాలు, ధరపరలు, విశేషాల గురించి ఏ రోజుకారోజు రాత్రి టూకీగా దినచర్య రాసుకునేవాణ్ణి. ఈ విధంగా ప్రదేశాల గురించి దినచర్య రాయటం, రైలు ప్రయాణంలో స్టేషన్ల వివరాలు నోట్ చేసుకోవటం అనేది యాత్రా చరిత్ర రచనలో కొంతవరకు ఒక భాగమేనని నాకు అప్పటివరకు తెలియదు. తర్వాత పిహెచ్.డి. చేయాలనుకొని “కరీంనగర్ గ్రామ నామాలు”, “గ్రంథ పరిష్కరణల పద్ధతులు” – ఈ రెండు అంశాల్లో ఏదైనా ఒకదాని గురించి మీ అభిప్రాయమేమిటని గోపికి అడిగినప్పుడు, ఆయన ఈ రెండింటి పైన పరిశోధనలు జరుగుతున్నాయి. నీవు “తెలుగులో యాత్రా చరిత్రలు” అనే అంశం మీద చేయి, అది నీ స్వభావానికి బాగా నప్పుతుంది అని సలహా ఇచ్చాడు. అదే అప్లై చేసాను, సీటు వచ్చింది. నాకు తోచిన అంశం కాకున్నా, దానిపై ఇష్టం పెంచుకొని, మనసు పెట్టి రాసి, పరిశోధనాంశానికి తగిన న్యాయం చేసాననే భావిస్తున్నాను.
యాత్రలు చేయడం సహజం, ఐతే వీటివల్ల కలిగే ఉపయోగమేమిటి?
యాత్రలవల్ల మనిషికి ప్రాపంచిక జ్ఞానం అలవడుతుంది. కవి పండితులకైతే రచనోత్సాహం కలుగుతుంది. ఇక భక్తులకైతే తీర్థయాత్ర సందర్శనంలో భక్తి భావం పెంపొందంతో పాటు పాపప్రక్షాళన జరిగినట్లు భావిస్తారు. విద్యార్థులకు గ్రంథ పఠనం ద్వారా తెలుసుకొన్న విషయాలకు ప్రత్యక్షానుభూతి కలుగుతుంది. నలుగురితో కలిసి దేశాటనం చేయటం వలన సాటి మానవులతో కలిసి ప్రవర్తించే సహన సౌశీల్యం ఏర్పడుతుంది. అహంకారం తొలగిపోయి, హృదయ వైశాల్యం కలుగుతుంది. కలిసి ప్రయాణించడం వల్ల, ఆయా సందర్భాల్లో కలిసి భుజించటం వల్ల తమ భౌతిక స్థాయిని, అధికారాన్ని, సంపన్నతనూ మరచి కలిసి మెలసి జీవించగలుగుతారు. అనేమందితో నూతన పరిచయాలు ఏర్పడుతాయి.
పరిశోధన, విమర్శ – ఈ రెండింటో మీకు ఏది ఇష్టం?
విమర్శ వ్యాసాలు రాయటానికి ఇల్లు దాటి వెళ్ళాల్సిన పనిలేదు. సాహిత్యాధ్యయనం విస్తృతంగా చేసి వుంటే చాలు. తర్వాత ఏ అంశం గురించి విమర్శ చేస్తున్నామో దానిపై సాధికారికంగా చెప్పగలిగే నైపుణ్యం సపాదిస్తే చాలు. కానీ పరిశోధన అట్లా కాదు. క్షేత్ర పర్యటనతో ఇది ముడివడి ఉంటుంది. నాలుగు పుస్తకాలు ముందు వేసుకొని పనైపోయిందని ముగించటం కంటె, గ్రంథాలయాలు తిరిగి, ఊళ్లు తిరిగి విషయ సేకరణ సంపూర్ణంగా చేసిన తర్వాత కుదురుగా కూర్చొని వ్యాసరచన చేయగలిగితే చేసిన పనికి గుర్తింపు వస్తుంది, పరిశోధకునికి తృప్తి మిగులుతుంది. అందుకని నాకు సాహిత్య విమర్శ, పరిశోధన ఈ రెండూ ఇష్టమే కాని పరిశోధన అంటే మరింత మక్కువ, ఇష్టం.
మీ రచనలు చాలావరకు పరిశోధనాత్మకమైనవే. ఈ నాటి పరిశోధకులకు మీరందించే సందేశం ఏమిటి?
నా రచనల్లో ఎక్కువభాగం, నా కిష్టమైన పరిశోధన గ్రంథాలే అవి :
1) తెలుగులో యాత్రాచరిత్రలు (సిద్ధాంత గ్రంథం)
2) తెలుగులో యాత్రాచరిత్రలు (లఘు గ్రంథం)
3) తథ్యము సుమతీ! (1984), పరివర్ధిత ముద్రణము (2017)
4) యేనుగుల వీరాస్వామి (జీవిత చరిత్ర)
5) తెలుగులో యాత్రాచరిత్ర రచనల సూచి
6) గునుకుల కొండాపురం – పద్మశాలీయులు – బూట్ల వంశం – ఏడుతరాల చరిత్ర.
మొదటి మూడు రచనలు పాఠకులకు తెలిసినవే. ఒకటి పిహెచ్.డి. పట్టాకోసం, రెండు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వెలువరించిన లఘు గ్రంథం. ముందు ఏ అవార్డులూ ఆశించకుండా తంజావూరులో తాళపత్ర గ్రంథాల్లో సేకరించిన సుమతి పద్యాలను వెలుగులోకి తేవడం. ఇక నాలుగవది సి.పి.బ్రౌన్ అకాడమీ వారి కోరికలో రాసినది. వీరాస్వామి జీవిత చరిత్ర విశేషాలు సేకరించడానికి మద్రాస్ ఓరియంటర్ లైబ్రరరీ, కన్నెమెరా లైబ్రరీ, వేటపాలెం లైబ్రరీలకు వ్యయప్రయాసలతో వెళ్లి సమాచారం దొరుకక, నా సిద్ధాంత వ్యాసం ఆధారంగా రాసి ఇవ్వటం. ఐదవది : పిహెచ్.డి ఇంటర్వ్యూ కాలం (1987) నాటికి యాత్రా చరిత్ర రచనలు మూడు నాలుగు కంటె ఎక్కువ లేవని తెలియగా, థీసి లో 50 పుస్తకాలు, తర్వాత 300 పుస్తకాల పేర్లు, వాటి వివరాలను సేకరించి ‘తెలుగులో యాత్రా చరిత్ర రచనల సూచి’ అనే పుస్తకాన్ని భావి పరిశోధకుల కోసం కూర్చి పెట్టాను. ఇక చివరిది : గునుకుల కొండాపురం నేను పుట్టిన గ్రామం. అక్కడ బూట్ల వంశం వాళ్లే ఎక్కువ. మా ఒక్కరిదే మచ్చ వంశం. క్రీ.శ. 1850 సం||లో బతుకుదెరువు కోసం వేరే గ్రామం నుంచి వచ్చి స్థిరపడిన బూట్ల రామయ్య మొదలుకొని ఆయన తర్వాత ఇప్పటి ఏడవతరం వ్యక్తి వరకు అందరి వివరాలను వెలికి తీసిన వైనం పొందుపరచబడింది.
పై ప్రతి పుస్తక రచనకు నేను క్షేత్రస్థాయిలో పడ్డ శ్రమను ఈనాటి పరిశోధకులకు మార్గదర్శకంగా ఉంటుందనే, ఉండాలనే దృష్టితో వివరంగా తెలుపవలసి వచ్చింది. పరిశోధన చేసేవారు పై పైనా కాకుండా, చిత్తశుద్ధితో పని పైన దృష్టి పెట్టి ప్రత్యేకతను సంతరించుకునేట్టు, సాహితీలోకం గుర్తుంచుకునేటట్టు శ్రమించి, లోచూపుతో విషయ సేకరణ రచన చేయాలని సూచిస్తున్నాను. థీసిస్ అంటే సముద్రంలో మునిగి ముత్యాలు తీయటమే కావాలి. తీసి రాని, ప్రింటు చేయకుండా అలమారుల్లో పెట్టడం కాదు. ధైర్యంగా ముద్రించి, నలుగురి ముందు పెట్టి మంచి చెడ్డలను (విమర్శ) ఆస్వాదించాలి. వారిచ్చే సూచనలను మలి ముద్రణలో – సరియైనవైతే – సవరించుకోవాలి.
చాలా సుమతి పద్యాలు సేకరించి పుస్తకం వేసారు కదా! దీని నేపథ్యం వివరించండి.
వేమన పరిశోధనలో భాగంగా డా|| ఎన్. గోపి నన్ను తన వెంట తంజావూరుకు (1978) తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడి లైబ్రరీలో సుమతి శతకానికి సంబంధించిన తాళపత్ర ప్రతులు, కాగితపు ప్రతులు కనిపించాయి. గోపి వాటిని రాసుకొమ్మన్నాడు. నోట్ బుక్ లోకి యథాతథంగా ఎక్కించాను. 1856లో సర్ ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తంజావూరులో పండితుల చేత రాయించిన పద్యాలే ఇవి. అంతకు ముందే 1832లో సుమతి పద్యాలను పండితులచే రాయించి అచ్చుకు సిద్ధం చేయించిన 150 పద్యాలను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1973లో ముద్రింపచేసింది. శ్రీ ఆంధ్రసాహిత్య పరిషత్ పత్రిక 1938 సంచికలో బొడ్డపాటి లక్ష్మీపతి గారు సేకరించిన 50 పద్యాలు అచ్చు వేయబడ్డాయి. ఈ విధంగా పైన పేర్కొన్న ప్రతులలోని మొత్తం పద్యాలను సరిపోల్చి చూడగా –
కేవలం తంజావూరు ప్రతులలోని పద్యాలు – 36
లక్ష్మీపతి ప్రతి లోనివి – 21
ఈ రెంటిలో కామన్‌గా కనిపించే పద్యాలు – 06
పై ప్రతుల్లో వేటిలోను లేకుండా తర్వాతి కాలంలో అచ్చు ప్రతుల్లోకి
ఎక్కిన పద్యాలు – 03
వెరసి 56 కొత్త పద్యాలు తేలాయి. బ్రౌన్ సేకరించిన (అకాడమీ ప్రతి) 150 పద్యాలు. వీటిని కలుపగా (150-156) మొత్తం సుమతి పద్యాల సంఖ్య ఇప్పటికి 206 అవుతున్నాయి.
గోరుకొయ్యల నానీల ప్రత్యేకత ఏమిటి?
నేను స్వతహాగా కవిని కాను. నాకు 56 సం||ల వయసు వచ్చేదాకా కవిత్వ రచన వైపు చూపు సారించలేదు. నానీల అష్టమ వార్షికోత్సవ సభకు వెళ్లి వచ్చిన తర్వాత ఆ ప్రభావంతో నానీల రచన మొదలు పెట్టాను. మిత్రులతో ముచ్చటిస్తున్న సందర్భంలో పదాల గారడీ, చమత్కారం
చిందించడంలో నేను నేర్పరినని నా మిత్రులు చాలా సందర్భాలలో చెప్తుండేవారు. ఐతే నేను వాటిని అక్షరబద్ధం చేయకపోవటం పెద్దలోటని కూడా అనేవారు. ఈ చమత్కారాలతోటే నానీలు రాయాలన్న తలంపు కలిగింది. రాసాను. దాని పేరే ‘గోరు కొయ్యలు’. ముఖ్యంగా దేశీయత, ప్రాంతీయత ఉట్టిపడే విధంగా ఆయా వ్యక్తుల వైశిష్ట్యాలను చాటే వాక్చిత్రాల నానీలను 16 దాకా ఈ పుస్తకంలో పొందు పరిచాను.
తెలుగులో సాహిత్య విమర్శ ప్రస్తుతం తక్కువగా వస్తున్నదని అంటున్నారు. దీనికి కారణం ఏమిటి?
తెలుగులో సాహిత్య విమర్శ మనమనుకుంటున్నంత తక్కువగా ఏమీ రావటం లేదు. ఫరవా లేదు. సమీక్షల రూపంలో పత్రికలలో, వ్యాససంపుటుల ద్వారా బాగానే రాస్తున్నారు, సాహిత్య విమర్శకులు. కథలు, కవితలు రాస్తున్నంత విరివిగా రావటం లేదన్నతి సత్యమైన విషయమే. ఐతే దీనికి ముఖ్యకారణం ఈ కాలపు రచయితలు ప్రాచీన సాహిత్యం మీద సరియైన దృష్టి పెట్టడం లేదనే. ప్రాచీన ఆధునిక సాహిత్యాల మీద పూర్తిగా పట్టు సాధించాలంటే అన్ని ప్రక్రియలను సాకల్యంగా, సవివరంగా అధ్యయనం చేయాలి. ఈ అధ్యయనం అంతర్వీక్షణంతో చేసినప్పుడే సాహిత్య విమర్శ సుసంపన్నమవుతుంది.
మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన గురువర్యులు ఎవరు?
నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కరీంనగర్లో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు ఆ స్కూల్లో తెలుగు అధ్యాపకులుగా చింతల నారాయణ గారు ఉండేవారు. వారి విద్యాబోధన, విద్యార్థులతో వారు వ్యవహరించే తీరు బాగా ఆకట్టుకునే విధంగా ఉండేది. ముఖ్యంగా నాకు ఛందస్సు గురించి ఎరుక పరిచిన మెలకువలు నాకు బాగా నచ్చాయి. తొందరంగా పట్టువడింది. ఎంతగా అంటే నా సహాధ్యాయుల సందేహాలను తీర్చగలిగేంత. అప్పుడు నా మీద నాకు పూర్తి నమ్మకం కలిగింది. మునుముందు ఎం.ఏ. తెలుగులో పి.జి. చేయాలన్న కోరిక ఆ వయసులోనే బలంగా నాటుకొన్నది. బి.ఏ. పరీక్షల్లో కూడ ద్వితీయ భాషే ఐనా తెలుగులో నేను అందరికంటె ఎక్కువ మార్కులు సాధించాను.
అలాగే ఎం.ఏ. తెలుగులో చేరిన తర్వాత ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు, ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డిగారు, డా|| పాటిబండ మాధవశర్మ గారు – వీరు విద్యాబోధన చేసిన తీరు అనుపమానం. పిజిలో వీరు నాకు అభిమాన గురువులు. వారి బోధనలో ప్రభావితుడనైన నేను ఎం.ఏ.లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడనైనాను.
తెలుగు సాహిత్య అధ్యయనం చేయడానికి గల కారణం ఏమిటి?
నేను 8, 9 తరగతులు చదివేటప్పుడు హాస్టల్ లో ఉండేవాడిని. మా స్కూలుకు, హాస్టల్ కు మధ్య దారిలో లైబ్రరీ ఉండేది. ప్రతిరోజు బడి వదిలిన తర్వాత సాయంకాలం అక్కడికి వెళ్లి సీరియల్ కథలు చదువుతుండేవాణ్ని. ఈ అలవాటు తర్వాతి కాలంలో పద్మనగర్ కు వచ్చిన తర్వాత తెలుగు సాహిత్యం కాదు గాని నవలలు, కథల పుస్తకాలు చదివేవాణ్ని. ఇంకా మా నాయన ఆశువుగా కవిత్వమల్లడం, దాన్ని నేను కాపీ చేయడం, గురువు గారు చింతల నారాయణ గారు ఛందస్సులోని మెలకువులు నేర్పడం – ఇవన్నీ నాకు సాహిత్యంమ ఈద అభిలాష కలగడానికి కారణాలైనాయి. ఐతే ఈ ఒక్క ఛందస్సు మీద ఆధారపడి ఎం.ఏ. చదవడానికి వచ్చిన నాకు మహాసముద్రమంత సాహిత్యం ఎదుట కనిపించేసరికి ఒక్కసారిగా భయమేసింది. మిత్రుల సాంగత్యంలో, ప్రోత్సాహంతో ఆర్ట్స్ కాలేజి లైబ్రరీలో నిత్యం సాయంకాలం వెళ్ళి సాహిత్య పాఠ్యాంశాల సంబంధిత విషయాలను, ఇతరమైన వాటిని ఆధార గ్రంథాలను, వ్యాసాలను అధ్యయనం చేయడంతో నాకు సాహిత్యం మీద అభిమానం కలిగింది.
గోపి సార్, అనుమాండ్ల భూమయ్య సార్, కిషన్ రావు సార్, మీరు సహాధ్యాయులు కదా! మీ మధ్య ఉండే అనుబంధాన్ని తెల్పండి?
అనుమాండ్ల భూమయ్య, నేను శ్రీరాజరాజేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, కరీంనగర్ లో 1966-67 సం||లో పి.యు.సి.లో సహాధ్యాయులం. తర్వాత ఆయన జగిత్యాల డిగ్రీ కళాశాలలో, నేను కరీంనగర్ లో డిగ్రీ పూర్తి చేసాము. ఎం.ఏ.లో మళ్లీ కలుసుకున్నాము. తంగెడ కిషన్ రావు ‘ఇ’ హాస్టల్ లో, భూమయ్య బయట రూం తీసుకొని ఉంటుండగా, మా ‘ఏ’ హాస్టల్ లోని 45వ నెంబరు రూం ఖాళీ కాగానే, అందులోకి వాళ్ళను రమ్మని చెప్పి, ముగ్గురం ఒకే రూంలో కలిసి ఉన్నాం. ఒక సంవత్సరం తర్వాత భూమయ్య ఫైనలియర్ లో పి.జి. హాస్టల్ కు వెళ్లగా, మా రూంకు అంజరావు వచ్చాడు. కిషన్ రావు, నేను రెండు సంవత్సరాలు ఒకే రూంలో ఉన్నాము. నేను అంతర్ముఖున్ని, అతి తక్కువ మందితో కలిసేవాణ్ని, కిషన్ రావు అట్లా కాదు. అందరితో తొందరగా కలిసి పోయేవాడు. ఎక్కడెక్కడి వార్తలో తెచ్చి నాకు చెప్పేవాడు. ఈ ఇద్దరి స్నేహం నాకు బాగా సంతోషాన్నిచ్చేది. పరిచయాలు కూడా ఎక్కువే అయ్యాయి. మేం ముగ్గురమే కాకుండా హాస్టల్లో మరి ముగ్గురు మా సహాధ్యాయులుండేవారు. మా అందరినీ కలిపి మా క్లాసు వాళ్లు హాస్టల్ బ్యాచ్ అనేవారు. మెస్ కు వెళ్లినా, తరగతులకు, లైబ్రరీకి వెళ్లినా అందరం గుంపుగా కలిసే వెళ్లేవాళ్లం.
ఇక గోపితో ఉన్న అనుబంధం మరికొంత ప్రత్యేకమైనది. 45 నెంబరు రూముకు రాకముందు
మరో ఇద్దరితో కలిసి వేరే రూములో ఒక వారం రోజులున్నాను. వారు వ్యసనపరులు, జల్సారాయుళ్లు, కనుక నన్ను ఆ రూంలోంచి గెంటివేయడానికి కుట్రలు పన్నుతున్న సంగతి గోపికి తెలిసి నన్ను మరొక రూముకు మార్పించారు. అక్కడినుండి పైన తెల్పిన 45 కు వచ్చాను. అప్పటినుండి గోపితో నా స్నేహం బలపడింది. ఎక్కడికి వెళ్లినా మేమిద్దరం జంటగా వెళ్లేది. ఈ రెండేళ్లలో ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా మా స్నేహం వికసించింది. సెలవులు వస్తే ఉత్తరాలు రాసుకునేవాళ్లం. ఆయన సాంగత్యంలో అనేకమంది స్నేహితులు, కుటుంబాలు, అధ్యాపకులు పరిచయమయ్యారు. మా ఫైనలియర్ పరీక్షలు జూన్ లో ఐపోగానే అందరూ తమతమ ఇండ్లళ్లకు వెళ్ళిపోయారు. నేను ఫస్టియర్ పరీక్షలకు ఇంప్రూవ్ మెంటు కట్టి ఉన్నాను. కనుక ఒక్కడ్నే హాస్టల్ లో వేరే రూంలో సర్దుకొని ఉంటూ జూలైలో పరీక్షలు రాసాను. ఆ నెలరోజుల్లో గోపి దాదాపు నాకు రోజుకొక ఉత్తరం రాస్తూ నేను నిరుత్సాహ పడకుండా ఉత్తేజం కలిగించేవాడు. ఆ కారణంగా నేను ఎం.ఏ. మొత్తమ్మీద ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడను కాగలిగాను. మా క్లాసులో 34 మందిలో హాస్టల్ వాళ్లమే నలుగురం (7 గురు ఫస్ట్ క్లాసు) ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులమయ్యామంటే మేమెంత కలిసిమెలసి చదువుకునే వాళ్లమే దీన్ని బట్టి తెలుస్తుంది.
రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు అందుకున్నారు కదా! విద్యార్థులతో మీకున్న అనుబంధాన్ని వివరించండి?
నేను 1974-2008 సం||ల మధ్య 34 సంవత్సరాలపాటు జూనియర్ కళాశాలల్లో, డిగ్రీ & పి.జి కళాశాలల్లో అధ్యాపకునిగా పని చేసాను. అంతకుముందు సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ అది నా మనస్తత్వానికి సరిపడేది కాదని గ్రహించి, అధ్యాపకునిగానే జీవనం సాగించాలని నిర్ణయించుకొని ఈ వృత్తిలోకి వచ్చాను. జగదేవ్ పూర్ (మెదక్), ములుగు (వరంగల్), హుస్నాబాద్ (కరీంనగర్) లాంటి గ్రామాల్లో అక్కడే కుటుంబంతో ఉండి పని చేస్తున్నప్పుడు విద్యార్థులతో, అలాగే వారి తల్లిదండ్రులతో పరిచయం ఏర్పడేది. మేము అద్దెకున్న ఇంటి పరిసరాల్లోనే విద్యార్థులున్నందున వారితో బాగా కల్సిపోయేవాడిని. తరగతి గదిలోనే కాకుండా విద్యార్థులు కొందరు ఇంటికి వచ్చి సందేహాలు తీర్చుకుంటూ, కుటుంబ సభ్యుల వలె మెలిగేవారు. ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికీ కొంతమందితో రాకపోకల మర్యాదలు (శుభకార్యాలు) జరుగుతూనే ఉన్నాయి. డిగ్రీ కళాశాలలు టౌన్లో ఉండేవి కనుక పిల్లలు కళాశాలలో తప్ప బయట ఎక్కడా కలిసేవారు కాదు. ఐతే నేను తెలుగు అధ్యాపకుణ్ని కనుక సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల్లోను, ఇంకా కళాశాల మేగజైన్ కు కవితలు, వ్యాసాలు అందించే సమయాల్లోను విద్యార్థులు కొందరు నాకు సన్నిహితంగా మెలిగేవారు.
ఎం.ఏ. తెలుగు ఎస్.ఆర్.ఆర్. కాలేజికి వచ్చిన తర్వాత తెలుగు అధ్యాపకునిగా డిగ్రీ విద్యార్థుల
కంటె పిజి విద్యార్థులతో సన్నిహితంగా ఉండవలసి వచ్చేది. దాదాపు 15 సం|| గడుస్తున్నా ఇప్పటికీ వారితో సంబంధం (ఫోన్ లో) కొనసాగుతూనే ఉంది. అనేకమంది విద్యార్థులు తరగతి బైట నా వద్ద సాహిత్యాధ్యయనం చేసి అధ్యాపకులుగా, కవులుగా, ప్రభుత్వోద్యోగులుగా కొనసాగుతున్నారు. ప్రతినిత్యం ఎవరో ఒకరు తమ సందేహాలను నాకు ఫోన్ చేసి తీర్చుకుంటుంటారు. దానికి కారణం! నేనేదో మిగతా అధ్యాపకుల కంటె తెలివైన వాణ్నని కాదు కాని, వారే అంటారు “మీలాగా ఎవరూ సమయమివ్వరు, ఓపికగా, నమ్మకంగా సందేహాలను నివృత్తి చేయరు- అని. నాకు తెలిసినంతవరకు ఏ ఉపాధ్యాయునికీ దక్కని అదృష్టం నాకు దక్కింది ఒక విద్యార్థి ద్వారా. అది : ఇటీవలే ఉద్యోగ విరమణ పొందిన నా పూర్వ విద్యార్థి డా|| పాతూరి రఘురామయ్య నా జీవితాన్ని గురించి మధురాక్కర పద్యాలలో ‘గురువరేణ్య శతకం’గా 120 పద్యాల్లో రాయటం. రెండు ఎండాకాలాలు నేనిచ్చిన కోచింగ్ తో నక్క శ్రీనివాస్ అనే పూర్వ విద్యార్థి ప్రస్తుతం తహసీల్దారుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. మచ్చుకు ఇవి రెండు చాలు విద్యార్థులతో నాకున్న అనుబంధం తెలుపడానికి.
మీ తండ్రిగారు మచ్చ వీరయ్యగారు మంచి పద్యకవి కదా! వారి ప్రభావం మీ మీద ఎలా ఉంది?
మా నాయన మచ్చ వీరయ్యగారు కష్టజీవి. నీతి, నిజాయితీలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చే వాడు. ఒకవైపు వ్యవసాయం, మరోవైపు గుంట మగ్గం నేస్తూ జీవికను కొనసాగించాడు. ఒక్కరి సంపాదనపై తల్లి, భార్య, నలుగురు పిల్లలు ఆధారపడి ఉండగా కుటుంబాన్ని పోషించడానికి అనేక కష్టాలననుభవించాడు. చదవింది మూడవ తరగతే ఐనా ఆశువుగా ఆబాల్యం కవిత్వం చెప్పేవాడు. అదే ఆయనకు ఎట్లా అబ్బిందో తెలియదు. భగవత్సంకల్పం అనుకోవాలి. రామానుజం అయ్యవారి వద్ద రామాయణం చదువుకున్నాడు. శేషప్ప వరకవి నృసింహ శతకం కంఠోపాఠం కాబట్టి మా నాయన రాసిన సీసపద్యాల్లో ఆ పద్యాల మూస ఉంటుంది. నేను ఏడవ తరగతి చదువుతున్నప్పటి నుండి నా చేతిరాత బాగుంటుంది కాబట్టి – తాను మగ్గం నేస్తూ చెప్పిన తత్వాలు, కీర్తనలు నన్ను కాపీ చేయుమనేవాడు.
తర్వాతి కాలంలో రామ శకతం, పుత్ర శకతం, భక్తి తత్త్వ ప్రకాశిక (కీర్తనలు, తత్వాలు, పద్యాలు, లోకం పోకడ, కందార్థ దరువులు) వంటి రచన చేసారు. ఆయన రచనలలో సామాజిక స్పృహతో పాటు, భక్తి సంబంధి సాహిత్యం ఎక్కువగా ఉంటుంది. బహుశా నేను హైద్రాబాద్ లో ఎం.ఏ. తెలుగులో చేస్తానన్నప్పుడు నిరుత్సాహపడకుండా ఎంత ఇబ్బందైనా సరే శక్తికి మించి నన్ను చదివించడానికి ఒప్పుకొన్నారంటే అది ఆయనకున్న సాహిత్యాభిలాషే కారణమనుకుంటున్నాను. మా నాయన పద్యకవి ఐనప్పటికీ నామీద ఆయన ప్రభావం పడలేదు. నేను పద్యకవినే కాదు. వచన కవిని కాదు.
మీ కుటుంబాన్ని గురించిన వివరాలు తెలపండి?
మాది మొదట బావుపేట (ఆసిఫ్ నగర్). ఎల్ గందల్ సమీపగ్రామం. మా నాయన ఐదేండ్ల వయస్సులో ఉండగానే మా తాతగారు కాలధర్మం చెందగా, ఏ దిక్కులేని మా నాయనమ్మ తన ఇద్దరు పిల్లలను తీసుకొని తల్లిగారిలైన గునుకుల కొండాపురం వచ్చింది. మా అమ్మమ్మకు ముగ్గురు బిడ్డలు, ఒక కొడుకు. అందరూ మా నాయన కంటే చిన్నవారే. పెద్ద కుమార్తె (మా తల్లిగారు)ను మా నాయనకిచ్చి పెండ్లి చేసి ఇంట్లోనే ఉంచుకొని, తనకున్న 50 గుంటల భూమిని అల్లునికి, కొడుక్కు సమానం పంచి ఇచ్చాడు మా తాత. అందుకు ప్రతిగా మా నాయిన మా మేనమామకు, మా ఇద్దరు చిన్నమ్మలకు పెళ్లిళ్లు చేయించి, తర్వాత తాను విడిగా ఇల్లు కట్టుకొన్నాడు. అప్పటికి నేను జన్మించాను (1950). తర్వాత 15 సం|| అదే ఇంట్లో కాపురముండి మా ఊళ్లో 4వ తరగతి వరకే ఉంది కాబట్టి 5-9 తరగతులు చదివించినారు. తదుపరి రీంనగర్ కు మకాం మార్చారు. నేత కార్మికుల కోసం 1960లో పద్మనగర్ లో రేకుల ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా, అందులో ఒకటి మా నాయనకు కేటాయించబడింది. 1964లో మేము ఇక్కడికి వచ్చాము. నా తర్వాత ముగ్గురు చెల్లెండ్ల పోషణ కొరకు మా నాయన కొన్నాళ్లు మగ్గం నేసి, మరికొంత కాలం (ఎం.ఏ. పూర్తయ్యేవరకు) బర్లనుకొని పాలు అమ్ముతూ జీవనం గడిపాడు. నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత 1976లో ఆయనకు అన్ని పనుల నుండి విశ్రాంతి కల్పించాను. ఐనా ఊరకే ఉండటం ఇష్టంలేక 76వ యేట వాస్తు, జ్యోతిష్యం నేర్చుకొని ప్రజాసేవ చేసేవాడు. పెండ్లికార్యం తప్ప మిగతా శుభాకార్యాలు నిర్వహించేవాడు. పద్మనగర్ లోని రెండు గుడుల నిర్మాణానికి విరాళాలు వసూలు చేయడంలో కీలకపాత్ర వహించాడు. 86వ యేట అనాయాస మరణం ఆయనను వరించింది.
ఇక నా విషయానికి వస్తే నాకు ముగ్గురు కుమారులే. ముగ్గురూ ఉన్నత విద్యనభ్యసించిన వారే. పెద్ద కొడుకు రాజశేఖర్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. హైదరాబాద్ లో స్వంత ఇంట్లో ఉంటున్నాడు. ఆయనకు ఒక కొడుకు, ఒక కూతురు. భార్య వసంత లక్ష్మి. ఎమ్మెస్సీ జువాలజీ హోమ్ మేకర్. రెండవ అబ్బాయి చంద్రశేఖర్. బెల్లంపల్లిలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్. మంచిర్యాలలో స్వంత ఇల్లుంది. ఇద్దరు కొడుకులు. భార్య శిరీష. బియస్సీ, బి.ఎడ్. హోమ్ మేకర్. చిన్న కొడుకు ఇందుశేఖర్ ఆల్ఫోర్స్ లో అడ్మినిస్ట్రేటర్ మాతోటే పద్మనగర్‌లో ఉంటున్నాడు. ఆయనకు ఒక కూతురు. భార్య భాగ్యలక్ష్మి, ఎం.బి.ఏ., హోమ్ మేకర్. అన్నీ స్థానికమైన సంబంధాలే. నా భార్య భారతి తల్లిగారి ఇల్లు గునుకుల కొండాపురంలో మా ఇంటి ముందే ఉండేది. 1973లో ఎం.ఏ. పరీక్షలకు కొద్దిరోజుల ముందే మా వివాహం మే, 18న జరిగింది.
సాహిత్య విమర్శకు తెలుగు విశ్వవిద్యాలయం ‘కీర్తి పురస్కారం’ ప్రకటించింది కదా! దీనిపై మీ అనుభూతి ఏమిటి?
నా సాహిత్య కృషిలో భాగంగా సాహిత్య విమర్శకు తెలుగు విశ్వవిద్యాలయం వారు నాకు ‘కీర్తి’ పురస్కారం ప్రకటించడం సంతోషదాయకమే. ఐతే నాకు సాహిత్య విమర్శలో కంటే పరిశోధన విషయంలో నేను చేసిన కృషికి ఈ పురస్కారం లభించి వుంటే నేను మరింత ఆనందించేవాడిని.
భవిష్యత్తులో మీరు చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి తెలపండి?
ఇప్పటికి నేను 11 రచనలు చేసాను. చేపట్టబోయే ప్రాజెక్టులేమీ లేవు కాని నాలుగు పుస్తకాలు
“హరిదాసు రచనలు వ్యక్తిత్వం, సాహిత్య విమర్శ గ్రంథం, సమగ్ర సుమతీ శతక పద్యావళి మరియు దేశ విదేశాలలో వింతలు విశేషాలు డి.టి.పి. దశలో ఉన్నాయి. త్వరలోనే వాటిని అచ్చు వేయిస్తాను. ఓపిక, శక్తి ఉంటే నా దగ్గరున్న యాత్రా చరిత్రల వివరాలతో రెండవ భాగం వేయాలని వుంది.