భానుడి ప్రతాపం రోజురోజుకీ పెరుగుతూ, ఎండలు చుర్రుమంటున్నాయి. ఎక్కండి! ఎక్కండి! ఎల్లిపోదాం అని కేకలేస్తూ ప్రయాణీకులను బస్సు లోపలికి కూరుతున్నాడు క్లీనర్ కన్నబాబు. ఈ మాటలు నువ్వు గంటసేపటి నుండీ చెపుతున్నావు తెలుసా! అసలు ఎక్కడికెళ్ళారయ్యా మీ డ్రైవరూ కండక్టరూ? అని తమ అసహనం ప్రదర్శించారు ప్రయాణీకులు.
బస్సుపైనా, లోపలా కూడా లగేజీతో నిండిపోయింది. వాటిల్లో మూటలు, కోళ్ళ గంపలున్నాయి. ఒక కుర్రాడైతే రెండు మేకల కాళ్ళకు బంధంవేసి, తాడును గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు. బస్సులో సీట్ల కోసం ఆడంగుల తగాదా మొదలైయ్యింది. మగరాయుళ్ళు మటుకూ వేరుశనక్కాయలు తింటూ పిచ్చాపాటీ మాట్లాడుతున్నారు. తిన్న వేరుశెనగ తొక్కలను బస్సు లోపలే వేస్తున్నారు.
ఎవరయ్యా! దారికడ్డంగా ఇలా చేపల బుట్టలను బస్సులో ఏసింది? మరి మీరు మేకలను, కోళ్ళను ఎక్కించలేదా? బస్సు నీ ఒక్కడిదే కాదు బాబూ మరి మన అందరిదీ! అంటూ చమత్కరించాడు చేపల చిన్నయ్య.
మీ మేకలు చూడవయ్యా, ఒంటేలు, రెండు చేసి ఎలా పాడుచేశాయో అని ఒకడంటే, నీ చేపల బుట్టల్లోంచి నీచువాసన నీళ్ళు ఎలా కారతన్నాయో చూడు! అంటూ వాగ్వాదానికి దిగారు. అయినా బస్సు మాత్రం ఇంకా స్టార్ట్ కాలేదు.
మొత్తానికి డ్రైవర్ వచ్చి డ్రైవింగ్ సీటులో కూర్చున్నాడు. ప్రయాణీకులందరీని ఒకసారి విమానం పైలట్‌లా చూసి, వెంటనే సిగరెట్ వెలిగించి, సినిమా పాటలు పెట్టాడు. ఇదుగో అందరూ టికెట్ సరిపడా డబ్బులు ఇచ్చి బేగా టికెట్ తీసుకోండి. టికెట్! టికెట్! అంటూ చిటికెలేస్తూ టికెట్లు కొడుతున్నాడు కండక్టర్.
ఇంతలో ఒక ప్యాసింజర్ బీడీ వెలిగించాడు. అసలే బస్సులో ఒకటే ఉక్కపోతగా ఉంది. దానికి తోడు ఈ సిగరెట్ల బీడీల పొగతోడైంద అని తిట్టేసరికి గబగబా మూడు దమ్ములులాగి బీడీని పడేశాడు అతను.
అప్పటికే కికిరిసిన బస్సులోకి స్కూలు పిల్లలూ, కూరగాయలవాళ్లు, చిన్నా చితకా వ్యాపారులు ఇంకా ఎక్కుతున్నారు.
అందుకే సత్తిరాజు ముందుగానే బస్సెక్కి హాయిగా పేపర్ చదువుకుంటున్నాడు. సత్తిరాజు ఆ చుట్టుప్రక్కల నాలుగు గ్రామాలకి ఒకే ఒక మెడికల్ స్పెషలిస్ట్, అదే ఆర్.యం.పి. డాక్టర్, వారాని ఒకసారి టౌనుకెళ్ళి ఒక సినిమా చూసి, పేషంట్లకి ఇవ్వవలసిన మందులు, ఇంజక్షన్లు కొని తెచ్చుకుంటాడు.
ఇదుగో డబ్బులు తీసుకో! టౌనుకి ఆరు టిక్కెట్లు ఇవ్వమన్నాడు ఓ ప్యాసింజర్. మరి ఆరుగురినీ చూపించమన్నాడు కండక్టర్. మేము ముగ్గురం మగ మనసులం. ఇంకా ముగ్గురు ఆడ టికెట్లు.ఇప్పుడే బాత్రూమ్కెళ్ళారని చెపుతుండగానే వాళ్ళు ముగ్గురూ పరిగెత్తుకుంటూ వచ్చి బస్సు ఎక్కేశారు.
ఈ గందరగోళంలో, డాక్టర్‌గారూ ఒకసారి పేపరు ఇస్తారా! అని డాక్టర్ సత్తిరాజు చేతుల్లో నుండీ విసురుగా దినపత్రికను లాగేసుకున్నాడు వెనకసీటు స్కూలు మాస్టారు.
కండక్టర్ రైట్! రైట్! అని చెప్పటంతో బస్సుస్టార్ట్ అయ్యింది. బస్సు కదిలిందిగా! ఇక ఉక్కపోత ఉండదు, హాయిగా గాలేస్తోంది లే! అంటున్నారు ప్రయాణికులు. బస్సు ఒక ఫర్లాంగు దూరం వెళ్ళేలోపే బస్సులోకి నల్లని దట్టమైన పొగ కమ్ము కొచ్చింది. పొగతోపాటు కిరసనాయిల్ వాసనతో ప్రయాణీకులు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఇంజన్ని రైజ్ చేశాడు డ్రైవర్. అంతే! బస్సు ఆగిపోయింది.
తుమ్ముతున్నవాళ్ళు కొందరైతే, మరికొందరు వాంతులు కూడా బస్సులోనే చేసుకున్నారు. ఇదేం బస్సురా నాయనా! టాపునిండా చిల్లులే! ఇక కింద నుండి రోడ్డు కన్పిస్తోంది. ఇంజను సౌండూలో ఒకరి మాటలు ఇంకొకరికి వినిపించటంలేదు. కళ్లు మండటంతో ప్రయాణీకులు బస్సు దిగిపోతున్నారు.
డ్రైవరూ, క్లీనరూ కలసి ఏదో రిపేరింగు చేస్తున్నారు. స్టార్ట్ అవుతోంది, మళ్ళీ ఆగిపోతోంది. కానీ డాక్టర్ సత్తిరాజు, స్కూలు మాష్టర్ మటుకూ బస్సులోనే కూర్చుండిపోయారు. ఒకవేళ తాము కిందకు దిగితే మళ్ళీ సీటు దొరకదేమోనని.
డాక్టర్‌గారూ! ఈ పేపర్లో రాసిన దినఫలాలు నిజంగా జరుగుతాయంటారా? అని అదోలా అడిగాడు స్కూలు మాష్టారు. చూడండి మాష్టారు అది మీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఇంతకీ దినఫలంలో మీకు ఏం రాసుందేమిటి? అని ఉత్కంఠగా అడిగాడు డాక్టర్ సత్తిరాజు. మీరు వస్తువులు కోల్పోతారు జాగ్రత్త! ప్రయాణాలలో అటంకాలు ఎదురౌతాయి అని రాసుంది. అయినా నా దగ్గరేముండిపోవటానికి? ఈ బ్యాగు ఒక్కటేగా? ఇది నా చేతిలోనే ఉంటుందిగా! అని చెప్పి కిందకి దిగాడు. కళ్లు మండటంతో సత్తిరాజు కూడా బస్సుదిగక తప్పలేదు.
దాదాపు రెండు గంటలు రిపేరింగు చేసినా బస్సు స్టార్ట్ అవలేదు. ప్రయాణీకులు కాస్తా, ఆందోళనకారులుగా మారిపోయారు. అసలు ఇలాంటి డొక్కు ప్రయివేటు బస్సుకి లైసెన్సు ఇచ్చిందెవరు? దీన్ని కాల్చిపారేయాలి అని రెచ్చిపోతున్నారు. దాన్ని మనం కాల్చక్కర్లేదు నాయనా! అదిగో పొగ ఇంకా ఎక్కువగా వస్తోందిగా! అదే కాలిపోతుందిలే! అని అంటూ డాక్టర్ సత్తిరాజు ఇంటికి తిరుగు ముఖం పెట్టాడు. అలాగే తిట్టుకుంటూ కండక్టర్ దగ్గర టికెట్ డబ్బులు తిరిగి తీసుకొని వెళ్ళిపోతున్నారు ప్యాసింజర్లు.
స్కూలు పిల్లలకి మాత్రం బస్సు ఇలా పాడైపోవటం ఆనందంగానే ఉంది. ఆడుతూ పాడుతూ ఇంటికెళ్ళిపోయారు. మాష్టారు స్కూలుకు ఆలస్యంగా చేరుకున్నాడు. మొఖానికి పట్టిన చెమట తుడుచుకుందామని తన చిన్న టర్కీటవల్‌ని బ్యాగ్‌లోంచి తీయబోయాడు. ‘‘అరే! ఆ టవల్‌ను బస్సీటుమీద వేసుకొని కూర్చున్నాను.’’ అది కాస్తా బస్సులోనే మర్చిపోయాను. అయితే పేపర్లో రాసిన దినఫలం రైట్! రైట్ అనుకున్నాడు.
‘‘కండక్టర్ రైట్! రైట్! అన్నా బస్సు మాత్రం అక్కడే ఉంది.’’
కథలు
అదేంటీ పోలీసు కస్టడీలో వినాయకుడా………??? అని ఆశ్చర్యపోతున్నారు కదూ! ఇది కలా నిజమా లేక నేనేమైనా జోకు జోకాననుకుంటున్నారా? అలా అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే! ఇదస్సలు జోకు కాదు, వైష్ణవ మాయా కాదు.ఇది అక్షరాలా నూటికి నూరుపాళ్ళు నిజం. నమ్మలేరా…..?
అయితే మనస్సు ఉగ్గపట్టుకుని , నిర్భయంగా ముందుకు సాగి పొండి. చదవండి చివరిదాక!!!
అసలయినా ప్రపంచమంతా ఈ మాయదారి కరోనా…చాపక్రింద నీరులా ప్రాకి , యావత్ ప్రపంచాన్నీ ఓ కుదుపు కుదిపేస్తుంటే, కాలచక్రం మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. ఫలితంగా రావలసిన పండగలన్నీ వస్తున్నాయి పోతున్నాయి. మనం అనుకుంటున్నట్లుగానే ఈ సారి వినాయక చవితి కూడ వచ్చేసింది.
ఇక చూసుకోండి నా సామిరంగా, దేశంలో అందరిలోనూ ఒకటే కలకలం……ఈ సందర్భంలో వినాయకుడి విగ్రహాలు తయారు చేసేసి , పెద్ద ఎత్తున ఆర్భాటంగా పండగ చేసుకోవాలా వద్దా అన్న మీమాంస అందరిలోనూ తలెత్తింది.
ప్రభుత్వాలు మాత్రం, ఈ కరోనా కారణంగా , మునుపటిలాగా పండుగ ఉత్సవాలుగా చేయవద్దనీ, ఎక్కడైనా సరే జనం గుంపులు గుంపులుగా పోగయే వ్యవహారాలేవీ పెట్టుకోవద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాయి. అందరూ పూజలు ఇంటివరకే పరిమితం చేయాలని హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది.
కానీ మన ఈ పామర జనం ఊరుకుంటారా? అసలు ఎవరి మాటైనా వినే అలవాటు మన ప్రజలకు ఉంటే , మన దేశం ఇలా ఎందుకుంటుంది? ఎప్పుడో బాగు పడి ఉండేది కదా!!!
అది సరే ముందు విషయం చెప్పండి……ఉపోద్ఘాతాలు వద్దు అంటారా…..? అదే అక్కడికే వస్తున్నా…….కాస్త ఓపిక పట్టండి మరి….!
అనగనగా ఒక మహానగరంలోని ఒకానొక గేటెడ్ కమ్యూనిటీ అయిన సొసైటీ. అందులో యదార్థంగా జరిగిన కథ ఇది. ఇంకా ఈ జాగేలనో అని మీలో మీరు హమ్ చేస్తున్నారా? ఇదిగో చెప్తున్నా…..చెప్పేస్తున్నా……కాచుకోండి! ఆ సొసైటీలో రీసెంట్గా మ్యానేజింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయండీ!
అందులో గెలిచిన వాళ్ళకు , ఉన్నమాట చెప్పొద్దూ…..ఈ సొసైటీని పరిపాలించడంలో అస్సలు అనుభవం లేదంటే నమ్మండీ! ఆ గెలుపుకూడ చాలా కుట్రలు పన్ని సంపాదించిందే కానీ, న్యాయబద్ధమైన గెలుపు కాదు.
విపక్షాలను దెబ్బకొట్టి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న దురుద్దేశంతో చేసిందే కానీ మరోటి కాదు. ఆ సంగతి అలా ప్రక్కన పెట్టి మనం అసలు కథకి వద్దాము.
ఈ గెలిచిన కమిటీ అధికారంలోకి వచ్చి రెండు నెలలుకూడకాలేదు వినాయక చవితి రానే వచ్చింది. ఇక చూసుకోండీ వీళ్ళ ఉత్సాహానికి అంతులేదు. ఓ ప్రక్క పూర్వంలానే వినాయకుడ్ని ప్రతిష్ఠించాలి….అంటూ ఈ పాత మేనేజ్మెంట్ పుణ్యమా అని రెండేళ్ళనుంచీ ఒక పండగాలేదు….పబ్బమూ లేదు….ఎందుకని అడిగితే ఈ కరోనా ఉన్నంతవరకూ, ఈ పండుగలూ, గిండుగలూ జాన్తా నై అని చెప్తారా…..ఇప్పుడు చూడండి మా తఢాకా …….అని కొత్త కమిటీ వాళ్ళందరూ ఒకటై సొసైటీలో ఉన్న రెసిడెంట్స్ ఎవరినీ సంప్రదించకుండానే వాళ్ళకి వాళ్ళే నిర్ణయం తీసేసుకుని, అందుకు కావలసిన ఏర్పాట్లు చేయసాగారు.
ఇదంతా గమనిస్తున్న ఫ్లాట్ ఓనర్స్ మండిపడి ఎవరిని అడిగి చేస్తున్నారు ఈ ఏర్పాట్లన్నీ అని కమిటీ వాళ్ళని నిలదీసారు! అసలే కరోనా భయంతో ఓప్రక్క వణికి చస్తుంటే మళ్ళీ ఇదో ఆపద తెచ్చి పెట్టారేంటని ఒక్కసారిగా విరుచుకు పడ్డారు. కానీ మొండివాడు రాజుకన్నా బలవంతుడన్నట్లు , వీళ్ళు ఇలా గర్జిస్తునే ఉన్నారు…..కమిటీ మాత్రం మేం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాం, కంగారు పడకండి అంటూ, గణేసుని కూడ తెచ్చి ప్రతిష్ఠించేసారు. ఇదంతా గమనిస్తున్న ప్రతి పక్షాలు గట్టిగా హెచ్చరించాయి. ఏమైనా జరగకూడనిది జరిగితే మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని అల్టిమేటమ్ ఇచ్చారు.
దాంతో భయపడ్డ ఈ కొత్త కమిటీ వాళ్ళు వినాయకుడి దగ్గరకు ఎవరూ వెళ్ళకుండా బ్యారికేడ్స్ కట్టేసి, పిల్లలెవరూకూడ దగ్గరకు వెళ్ళకుండా ఇద్దరు సిక్యూరిటీ వాళ్ళని కాపలా ఉంచి, ఎవరూ అక్కడ గుమి గూడకుండా చూస్తూ ఉండమని ఆదేశాలు జారీ చేసారు. అది కాక ఉదయం సాయంత్రం యధావిధిగా పూజ కావించి , పూజారి వెళ్ళి పోవడానికి కుదుర్చుకున్నారు. అంతే కాదు పోలీస్ పెట్రోలింగ్ కూడ అరేంజ్ చేసారు.
ఇంతకీ మన గణనాధుడు మాత్రం, భక్తులులేక గిజ గిజలాడుతున్నట్లుగా అనిపించింది.భక్తులతో కళకళలాడే మంటపాలలో ప్రతిష్ఠించబడి , రోజూ నైవేద్యాలూ ప్రసాదాలతో , మరెన్నో సాంస్కృతిక కార్యకలాపాలతో అందరినీ అలరించాల్సిన గణపతి బిక్కు బిక్కుమంటూ గడపసాగాడు పోలీసు కస్టడీలో…….! అది చూసిన ఫ్లాట్స్‌లో నివసించే జనాలకు చాలా బాధ, జాలీ రెండు కలిగాయి.ఇక ఆ వినాయకుడ్ని దేవుడే కాపాడుగాక అనుకుని చేసేదేమీలేక పాపం గణేశుడు అని మనస్సులో అనుకుంటూ మౌనంగా ఉండి పోయారు.అయినా దేవతలకే తప్పటంలేదు కష్టాలు మరి మానవమాత్రులమైన మనమెంత అని అనిపించడం లేదూ ఈ కథ చదివాక!!!
అంకితం
————-
అన్ని విఘ్నాలనూ తొలగించే విఘ్నేశ్వరుడికి ఈ చిట్టి కథ అంకితం.
మాధవ పెద్ది ఉష
ఈ రోజు నేను ఆవకాయ గురించి వ్రాయబోతున్నాను. ఆవకాయ అంటే ఇష్టపడని తెలుగువారు ఉంటారా అసలు? ఆ మిథునం సినిమా పాట ఎంతో సమయోచితంగాను, తెలుగువారికి ఓ కితాబు ఇచ్చినట్లే ఉంటుంది. ఆ పాట విన్నప్పట్నుంచి మనందరికీ ఆవకాయమీద ప్రేమాభిమానాలు పొంగి పొర్లాయంటే ఒప్పుకుంటారా? అసలైనా తినబోతూ రుచిలెందుకు లెండి! నేను ఇప్పుడు రాయబోయే మా ఇంట్లో ప్రతి ఏడాది జరిగే ఆవకాయ ప్రహసనం చదివారంటే, మన భానుమతి అత్తగారి కథలు బలాదూర్ అనుకొని నాకు కూడా ఒక స్పెషల్ బిరుదు ఇచ్చేస్తారు తెలుసా!
సరే, అసలు విషయానికి వద్దాం. పోయిన సమ్మర్ లో మాకూ కరోనా రావడంవల్ల నేను ఊరగాయలు ఓ మాదిరిగ పెట్టాను. ఇంతకీ మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేటంటే మాకు ఇద్దరు ఆడపిల్లలండి. ఒకళ్ళు U.S అయితే ఇంకొకరు ఎవరూ అంతగా పట్టించుకోని కానీ world అంతా మెచ్చుకొనే బుల్లి దేశం ఉందే…. అదే న్యూజిలాండ్ అండీ…. పోయి పోయి అక్కడ సెటిలైంది. పైగా అక్కడ వాతావరణం సీనిక్ బ్యూటి అంతా నాకు నచ్చాయి పో. (అంటే మా అల్లుడుగారికి కూడా లెండి) అని ఒక్క అక్షరంలో తేల్చిపారేసింది. ఇంకా ముఖ్యమైన కారణం అక్కడ ఇండియాలో లాగా దోమలుండవట (మా అమ్మాయికి దోమల ఎలర్జీ ఉంది లెండి). అందుకని అక్కడకి వెళ్ళాక అది సుఖసంతోషాలతో వర్థిల్లుతోంది. మనకి, అంటే తల్లిదండ్రులకి కూడా కావల్సిందదేగదండి!
ఇకపోతే అప్పట్నుంచి నేను ప్రతి ఏడాది కిలోలకి కిలోలు ఊరగాయలు ఇటు అటు ఎడాపెడా పెట్టేసి, వాళ్ళకి కొరియర్లో పంపించటం అలవాటైపోయింది. (మా వాళ్ళకి, అల్లుళ్లకీ, మనవళ్లకి ఆవకాయన్నా, దానితోపాటొచ్చే రకరకాల పచ్చళ్ళన్నీ కూడా చాలా ఇష్టమండీ). పంపించాక వాళ్లకి అందడం పెద్ద process అన్నమాట.
కానీ U.S.వాళ్లు ఏవన్నా అనండి, చాలా మంచివాళ్ళు కరెక్టుగా మూడు, నాల్గు రోజులలో చేరిపోతాయి. కానీ ఈ న్యూజిలాండ్ కస్టమ్స్ వాళ్ళేమో పరమ దుర్మార్గులండీ! మన పికిల్స్ చేరడం చేరతాయి. కాని వాళ్ళ చేతుల్లో పడ్డాయంటే చాలు. ఇక మనం రామనామ జపం చేయాల్సిందే లేక ఆ క్షణ క్షణంలో సినిమాలో లాగా ‘దేవుడా! దేవుడా!’ అంటూ కూర్చోవాల్సిందే. మొన్నైతే మేము న్యూజిలాండ్ కు పికిల్స్ పంపినపుడు ఓ వారం రోజుల ఎదురు చూపుల అనంతరం మా అమ్మాయి దగ్గరనుండి ఒక ఫన్నీ మెసేజ్ వచ్చింది. అదేంటంటే ‘అభిమన్యు హాజ్ రీచ్ డ్ కురుక్షేత్ర బాటిల్ ఫీల్డ్” అని వచ్చింది. మేము ఫోన్ చేసి అడిగితే అప్పుడు చెప్పింది. కష్టమ్ వాళ్ళమో కురుక్షేత్ర్ యుద్ధభూమి, పద్మవ్యూహంలో చేరిన అభిమన్యుడేమో ఆవకాయ. ఇక వాటిని పరిక్షించేందుకు కస్టమ్స్ అధికారులు మొదలుపెడతారని దాని సారాంశం. అది విని మాకు నవ్వాగలేదు. అసలు మహాభారతంలో, అభిమన్యుడు చనిపోతాడు కదూ. కానీ మా చిన్నమ్మాయి భారతంలో మాత్రం చావడు. ఏదో కొన్ని రోజులు హోరా హోరీ కష్టమ్స్ ఆఫీసర్సతో యుద్ధం చేశాక విజయుడై ఇంటికి చేరతాడన్నమాట.
ఇక ఊరగాయల పార్సెల్ దగ్గర్నుంచి ఊరగాయలన్నీ బయటికి తీసాక వాటిని బాటిల్స్‌లో పెట్టాక వాటిని కూడా ఫోటో తీసి మాకు వాట్సప్ లో పెట్తారన్నమాట. అవి చూసుకని మేము ఆనందంతో తబ్బిబ్బై ఇక డాన్స్ చేయడమే తరువాయి.
మీకు ఇంకో విషయం చెప్పాలి. అదేంటంటే ఈసారి నన్ను అందరూ బెల్లం ఆవకాయ గూర్చి అడగడం, దాని రెసిపీ చెప్పడంతో నేను కూడా బెల్లం ఆవకాయ పెడదామని ఉబలాటపడ్డాను. ఒకరైతే బెల్లం పాకం పట్టాలి వగైరా – వగైరా అని చెప్పారు. ఆ సింగినాదం – జీలక్రర అదేం అక్కర్లేదండీ, మన రెగ్యులర్ ఆవకాయలోనే బెల్లం కలపండి, అదే బెల్లం ఆవకాయ అంటే అంతే ఇంకేం లేదు మరొకరూ చెప్పారు. ఇంకేం, అంతే కదా వెరీసింపుల్ అనుకుంటూ కొంచెం ఆవకాయ జాడిలోంచి విడిగా తీసి అందులో తగినంత మోతాదులో బెల్లం కలిపేసి, బెల్లం ఆవకాయ జిందాబాద్ అనుకుని నన్ను నేనే అభినందించుకున్నాను. తీరా పిల్లలకి పంపేందుకు వాళ్లనడిగితే ‘వామ్మో అదేంటి ఎప్పుడూ వినలేదే. బెల్లం మాగాయ విన్నాంగాని బెల్లం ఆవకాయ గురించి వినలేదు. తినలేదు. అయినా మేము రిస్క్ తీసుకోదల్చుకోలేదు. మా కొద్దంటే మాకొద్దని ఇద్దరూ ముక్తకంఠతో సెలవిచ్చారు. దాంతో నా గుండెల్లో రాయి పడింది. ఇప్పుడేం చేయడం అంత ఆవకాయలో బెల్లం కలిపానే అదంతా ఎవరు తింటారు? ఇంతలో నాకొక బ్రిలియంట్ ఐడియా తట్టింది. అది వినే ముందు తెనాలి రామకృష్ణులవారి కథ తెలుసుండాలి.
ఒకసారి రాయలవారు వారి తల్లిగారి ఆబ్దికమప్పుడు భోక్తలకు ఒక బంగారు మామిడిపండు తలా ఒకటి చొప్పున ఇద్దామనుకున్నారు. కారణం వారి తల్లిగారు చనిపోతూ మామిడిపండు తినాలన్న తన కోరికను వెలిబుచ్చారట. కాని ఆ కోరిక తీరకుండానే కాలం చేశారు. రాయలవారందుకు చాలా వ్యథ చెంది ఆబ్ధికం రోజున తల్లిగారి ఆత్మశాంతి కోసము అందరికీ బంగారు మామిడి పండ్లు దానమిస్తున్నారు. కాని అక్కడ కొంత మోసము జరగనారంభించింది. భోక్తలందరూ పేరాశతో రెండోసారి కూడా తీసుకొనడం మొదలుపెట్టారు. అది గమనించి రామకృష్ణులవారు ఇలాగైతే ఖజానా ఖాళీ అవుతుందని భయపడి వీరికి గుణపాఠం చెప్పాలని ఒక ట్రిక్ చేస్తారు. వెంటనే ఏమని ఎనౌన్స్ చేశారంటే, రామక్రిష్ణులవారి తల్లిగారు చనిపోయే ముందు తనకు వాతలు పెట్టమని కోరుకున్నారట. (బహుశా ఆ రోజుల్లో అదో రకం వైద్యం అయి ఉండవచ్చు). కానీ చూస్తూ చూస్తూ తల్లికి వాతలు పెట్టే బాధాకరమైన పని చేయనంటే చేయనని భీష్మించుకు కూర్చున్నారట. దాంతో ఆవిడ కోరిక తీరకనే పరమపదించారట. కానీ ఎవరూ వాతలు పెట్టించుకోవడానికి ఒప్పుకోరు కనక తన తల్లి కోరిక తీర్చుటకిదే తగిన సందర్బం అని తలచి ఒక బంగారు మామిడి పండుకి ఒక వాత తీసుకోవాల్సిందిగా ఒక నిబంధన పెట్టారు. దాంతో కొంతమంది పెట్టించుకున్నారు. కానీ అందరూ సాహసించలేకపోయారు. దాంతో ఖజానా ఖాళీ అయిపోతుందన్న రామకృష్ణులవారి భయానికి చెక్ పడింది.
సో, ఆ కథ లాగ నేను కూడా మా పిల్లలకి నేను పెట్టిన పికిల్స్ కావాలంటే బెల్లం ఆవకాయ కూడా ఒక్కో కిలో చప్పున తీసుకోవాలని ఒక కండిషన్ పెట్టాను. దాంతో పిల్లలు తప్పనిసరి ఒప్పుకోవల్సి వచ్చంది.
తరువాత ఆ రుచిలేని బెల్లం ఆవకాయ తీసుకున్నారేగాని దాన్నలాగే ఉంచి మిగతావి లాగించడం మొదలెట్టారు. కానీ నేను ఊరుకోక రోజూ బెల్లం ఆవకాయ తిన్నారా? లేదా? అని ఫోన్ లో సతాయించే దాన్ని – అది భరించలేక వారం వారం గెష్ట్లలని భోజనానికి పిల్చి ఆ బెల్లం ఆవకాయ వాళ్లకి వేసి ఖర్చు చేశారు. అప్పట్నుండి ఆ బెల్లం ఆవకాయ బాధితులెవరూ వారింటిపై కన్నెత్తి చూడ్డానికి కూడా సాహసించలేదు. నేను కూడా బెల్లం ఆవకాయ మాట కలలో కూడా తలచడం మానేసాను.
ఇంతకీ నేను స్టార్టింగ్ లో చెప్పినట్లు నాకు ఏం బిరుదునిస్తున్నారు? చెప్పరూ।।
అన్నపూర్ణ హోటల్ యజమాని విజయభాస్కర్‌కు ఇద్దరు కొడుకులు. పెద్దబ్బాయి సృజన్ డిగ్రీ చదువుతూ కూడా తండ్రికి చేదోడువాదోడుగా హోటల్ పనులు చేస్తున్నాడు. కానీ చిన్నబ్బాయి సుధీర్ మాత్రం అలా కాదు. తన స్వంత హోటల్లో పనిచేయటానికి కూడా నామోషీగా ఫీల్ అవుతాడు. ఎప్పుడు చూచినా టిప్‌టాప్‌గా టక్ చేసుకొని, టై కట్టుకొని మరీ స్నేహితులతో అల్లరిచిల్లరగా తిరగటమే అతని పని.
ఒకప్పుడు చిన్న షెడ్డులో ప్రారంభమైన కాఫీ హోటల్, అంచలంచలుగా వృద్ధి చెందుతూ ఇప్పుడూ పెద్ద హోటలై పోయింది. ఒరేయ్ సుధీర్ మన స్వంత పనులు చేసుకోవటానికి సిగ్గు పడకూడదురా! వీలు కుదిరినపుడు నువ్వు కూడా అన్నయ్యలాగా ఏదో ఒక పనిచేయరా! ఎందుకంటే మన జీవనాధారం ఈ హోటలే కాబట్టి. దీనివల్లే కదా మీరిద్దరూ డిగ్రీలవరకూ చదువుతూ వచ్చారు అని అమ్మ అన్నపూర్ణ అంటుంటే, వద్దమ్మా! ‘‘తమ్ముడికి పనిచెప్పకండి, వాడిని బాగా చదువుకోనివ్వండి’’ అంటూ సృజన్ తమ్ముణ్ణి పెద్దరికంగా సమర్థించాడు.
దాంతో సుధీర్ ఆగడాలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఒకవేళ ఎప్పుడైనా క్యాష్‌కౌంటర్‌లో కూర్చుంటే, కొంత డబ్బు కొట్టేసేవాడు. అలాగే స్నేహితులందరికీ టిఫిన్లు, కాఫీలు ఫ్రీగా ఇచ్చి, ఏదో పెద్ద ఘనకార్యం చేసిన వాడిలా కాలర్ ఎగరేసి మరీ ఫోజులు కొట్టేవాడు.
అన్నపూర్ణ హోటల్ రుచికరమైన టిఫిన్లకూ, అభిరుచిగల భోజూజనానికి మారుపేరుగా మారింది. అందుకే హోటల్ నిరంతరం జనంతో కిటకిటలాడుతోంది. హోటల్ నిర్వాహణలో భార్య అన్నపూర్ణ పాత్ర, నిరంతర శ్రమ ఎంతో ఉంది. అదంతా తన శ్రీమతి సమర్థవంతమైన ప్లానింగ్ మహిమేనని విజయభాస్కర్ విజయగర్వంగా అందరికీ చెపూతు ఉంటాడు.
కొడుకులిద్దరికీ ఘనంగా వివాహాలు జరిగాయి. ఇద్దరు కోడళ్ళు నలుగురు పిల్లలతో ఇల్లు కళకళలాడిరది. తల్లిదండ్రులు ఒకరి తరువాత ఒకరు కాలగమనంలో కలసిపోయారు. నాన్న చెప్పిన అనుభవసారాన్ని నెమరువేసుకుంటూ క్రమశిక్షణతో హోటల్‌ను నడుపుతున్నాడు సృజన్. కానీ తల్లిదండ్రుల కోసం గుండెనిండా బెంగ పెట్టుకున్నాడు.
ఇప్పుడు తమ్ముడి పరిస్థితి అదుపు ఆజ్ఞ లేకుండా పోయింది. నిజం చెప్పాలంటే రౌడీలా తయారయ్యాడు. సృజన్ చెమటోడ్చి సంపాదించిన డబ్బును దుబారాగా ఖర్చు చేస్తున్నాడు. ఇక ఇలా ఊరుకుంటే లాభం లేదని, ఒకటికి రెండుసార్లు సున్నితంగానే తమ్ముణ్ణి మందలించాడు. దాంతో ఇంకా రెచ్చిపోయి, అన్నయ్యను దుర్భాషలాడాడు.
సరిjైున సమయం దొరికింది కదా అని ఒక కొత్త పన్నాగాన్ని ప్రయోగించాడు సుధీర్. అయినా నాపై నీ పెత్తనం ఏమిటి? నా ఇష్టం వచ్చినట్లు నేనుంటాను. నన్ను కమాండ్ చేయాలని చూడకు. ‘‘నువ్వు పెద్దవాడివే అవ్వచ్చు, కానీ నీ హద్దుల్లో నువ్వుండు’’ అని ఆవేశంగా తిట్టేసరికి సృజన్‌కి కోపం తారాస్థాయికి చేరింది. అదీ కాస్తా కొట్లాటకు దారితీసింది.
అంటే ఏమంటావ్? అని సృజన్ తమ్ముణ్ణి నిలదీశాడు. నీకు దమ్ముంటే ఆస్తిలో నీ వాటాను నాకు పంచేయ్! అని అన్నయ్యను రెచ్చగొట్టాడు సుధీర్. ఇది చాలదు అన్నట్లు తోడికోడళ్ళు ఇద్దరూ రంగంలోకి దిగి, అక్కడ భయంకరమైన దృశ్యాన్ని సృష్టించారు. ఆ సమయంలో నాన్న చెప్పిన అమృతవాక్కులను గుర్తు చేసుకున్నాడు సృజన్. నీకు ఎలాంటి కష్టాలు, సమస్యలు ఎదురైనా సహనాన్ని పాటించు. అప్పుడు నీ యొక్క సహనమే నీ సమస్యలకు పరిష్కారాలను కూడా చూపిస్తుంది ` నాన్న.
నీవు ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఇంట్లో గొడవ జరిగిన వారం తరువాత సామరస్య వాతావరణం నెలకొంది. అనేక గందరగోళ ఆలోచనలతో సృజన్‌కు నిద్రలేకుండా పోయింది. ఇప్పుడు తను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావటంలేదు. ఇక చేసేది లేక ఆస్థిని రెండు భాగాలుగా పంచుకున్నారు అన్నదమ్ములు.
ఎవరికివారు సపరేటుగా హోటళ్లు పెట్టుకున్నారు. అమ్మ నాన్నకు సహకరించినట్లే, సహధర్మచారిణి హిమజ కూడా సృజన్‌తో కలసి అన్ని పనులూ ఓపికగా చేస్తోంది.
కానీ సుధీర్‌కు భార్య సునంద సహకారం అంతంత మాత్రంగానే ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరికీ అతి తెలివితేటలు ఎక్కువ. ఆచరణ తక్కువ. చేస్తున్న వంటల్లో శుచి, శుభ్రత పాటించేవాళ్ళు కాదు. దీనివల్ల చేసిన వంటకాలు తొందరగా పాడైపోయేవి. దానికి తోడు కష్టమర్లు ఎక్కువగా తినకుండా ఉండటానికి అన్నంలో సున్నం కలిపేవాళ్ళు. పైకి ఘుమఘుమల వాసనలు బాగా వచ్చేవి. తీరా తిందామనుకునేవారు తినలేకపోయేవారు. సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉన్నా దాహం తీర్చుకోలేని పరిస్థితిలా ఉండేది వారి దుస్థితి.
కూరలు, సాంబారుల్లో గూబగుయ్యిమనిపించే కారం వేసి, పట్టపగలే నక్షత్రాలు కన్పించే బిల్లు చేతికిచ్చేవారు. పాపం గొడ్డుకారం తట్టుకోలేక కష్టమర్లు బెంబేలెత్తి పారిపోయేవారు.
ఇదేంటండీ? మీరు గొడ్డుకారం వంటకాలు వడ్డిస్తే మేము మాత్రం ఎలా తింటామనుకుంటున్నారు? అని జనం నీలదీసి అడిగేసరికి ‘‘మీరు తింటే తినండి లేకపోతే బయటకుపొండి’’ అంటూ సునంద తిట్ల దండకం మొదలుపెట్టింది.
చూడండి! అక్కడ మీ అన్నయ్యగారి హోటల్లో టిఫిన్లతోపాటు భోజనాలు కూడా ఎంతో రుచికరంగా ఉంటున్నాయి. అక్కడ భోజనంలోకి అరటిపండో, మామిడిపండో వడ్డిస్తున్నారు. అవి లేకుంటే ఏదైనా స్వీటుని స్పెషల్‌గా ఇస్తున్నారు. అంతేకాదండీ! ఆ హోటల్లో భోజనంచేసిన తరువాత వక్కపొడి, సోంపు, పాన్లు కూడా ఇస్తున్నారు అని ఒక వ్యక్తి ధైర్యంగా సుధీర్‌ని క్లాస్ తీసుకున్నాడు.
అప్పుడు మళ్ళీ సునంద కళ్ళెర్రజేసి, అతని మీదకు విరుచుకుపడిరది. మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ‘‘మా హోటల్లో నచ్చితే తినండి, లేకపోతే బయటకుపొండి’’, మా హోటల్లో తిన్నవారికి పట్టు చీరలివ్వటం, పేరంటటాలు చేయటం, తాంబూలాలివ్వటం లాంటి చెత్త మర్యాదలు చెయ్యటం మావల్ల కాదు. వంటల్లో కల్తీ వంటనూనెలు వాడటం, నిల్వ ఉంచిన కూరలు, సాంబర్లు వడ్డీంచడం, ఎక్కువగా జరగడంతో జనం ప్రభుత్వానికి కంప్లయింట్ ఇచ్చారు. దాంతో ఫుడ్‌ఇనస్పెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేసి కేసు బుక్ చేశాడు. అలాగే 5వేల రూపాయలు జరిమానా విధించారు. ఇది మొదటిసారి కాబట్టి కేవలం వార్నింగ్ ఇచ్చామని, లేకుంటే జైలుశిక్ష కూడా విధించే అవకాశముందని కోర్టులో మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు.
ఇంత జరిగినా తమ తప్పులను వీరిద్దరు సరిదిద్దుకోలేకపోయారు.
రోజు రోజజుకీ ఆమె కొట్లాటలు మితిమీరిపోయాయి. హోటల్ దివాలా స్థాయికి చేరుకొంది. ఆ కారణంగానే సుధీర్‌కి సహనం, అశాంతి బాగా పెరిగిపోయాయి. అవి తట్టుకోలేకే చిటికీమాటికీ సునందను తిట్టటం, మొదలుపెట్టాడు. ఒకరోజు ఉక్రోషంతో ఆమెను చావబాదాడు.
సునంద అహం దెబ్బతిన్నది. అసలు మీకు బిజినెస్ చేయటం చేతకాక నన్ను కొట్టటం ఏమిటి? అని భర్త సుధీర్‌ని ఆవేశంతో చెంపదెబ్బకొట్టింది. ఇంట్లో జరిగిన ఈ గొడవతో పిల్లలు భయభ్రాంతులకు లోనయ్యారు. ఇంట్లో అందరూ కలసి భోజనం చేసి ఎన్నో రోజులైయ్యింది. పాపం పిల్లలు ఆకలితో అలమటించిపోతున్నారు.
సుధీర్ ఇద్దరమ్మాయిలూ బిక్క ముఖంతో పెదనాన్నింటికి వెళ్ళారు. వీళ్ళిద్దరూ చెప్పిన విషయాలు విని పెద్దమ్మ, పెదనాన్న ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఆ తరువాత కొంత సమయానికి తేరుకొని పిల్లలతో కలసి భోంచేశారు.
పెదనాన్న మీరే ఎలాగైనా మా అమ్మకు, నాన్నకు సహాయం చేయాలి. ప్రస్తుతానికి అమ్మా నాన్నల దగ్గర డబ్బులు అసలే లేనే లేవు అని చెపుతూ బోరున ఏడ్చేశారు ఇద్దరమ్మాయిలూ.
సృజన్ పేరుకు తగ్గట్టు చాలా సున్నితమైన మనసున్న వ్యక్తి. తను చెబితే తమ్ముడూ, మరదలూ వినకపోవచ్చని భార్య హిమజను సుధీర్ ఇంటికి పంపించాడు. మళ్లీ అందరూ కలిసుండటానికి సుధీర్, సునంద ససేమీరా ఒప్పుకోలేదు. అప్పుడు సృజన్ రంగంలోకి దిగి హోటల్ బిజినెస్ నష్టాల్లో మునిగిపోయిన తమ్ముణ్ణి ఓదార్చాడు.
మొత్తానికి అన్నయ్య, వదినల ప్రేమా ఆప్యాయతలకి సుధీర్, సునందలు కరిగిపోయారు. నన్ను క్షమించు అన్నయ్య అని అంటూ, ఇంతకీ నీ హోటల్ బిజినెస్‌కి ఎక్కువగా లాభాలు రావటానికి గల రహస్యాలేమిటి? అని వినయంగా అడిగాడు.
తమ్ముడి పశ్చాత్తాపంతో అడిగిన మాటలకు సృజన్ కళ్ళు చమర్చాయి. ఆ రోజుల్లో నాన్న చెప్పిన మాటలు సృజన్ గుర్తుచేసుకొని చెపుతున్నాడు.
ప్రతీ వ్యాపారంలో లాభనష్టాలు చాలా సహజమైనవి. ప్రతి బిజినెస్‌లోనూ కష్టమర్లు ఉంటారు. కానీ మన హోటల్ కూడా ఒక బిజినెస్సే అని అందరూ అనుకుంటారు. ఈ హోటల్ వ్యవస్థలో వ్యాపారం కన్నా సేవాభావం చాలా ముఖ్యమైనది.
హోటల్ కొచ్చేవారంతా అన్నార్థులే. అందుకనే మనకు లాభం రాకపోయినా, రుచికరమైన, నాణ్యమైన ఫలహారాలను, భోజనాన్ని అతిథులకు వడ్డించాలి. మనంగానీ మంచి రుచికరమైన వంటకాలు వండి వడ్డిస్తే హోటల్ బిజినెస్‌లో నష్టం రానే రాదు. ఒకవేళ అధిక లాభాలు రాకపోయినా, నష్టాలు మాత్రం రానే రావు.
అందుకనే హోటల్‌కి వచ్చే వాళ్ళందరూ అతిథి దేవుళ్ళే, కష్టమర్లు కానేకాదు అని నాన్నగారు ఆనాడు చెప్పిన మాటలను సృజన్ చెపుతూ ఉంటే అందరూ శ్రద్ధగా విన్నారు. ఆ తరువాత అందరూ కలసి విందు భోజనం చేశారు.
మళ్లీ అన్నపూర్ణ హోటల్ అతిథిదేవుళ్ళతో కళకళలాడుతోంది.
అతిథి దేవోభవ
అప్పు అనే పదం వింటేనే చిరాకు పడే చిన్నారావు కి అప్పు చేయాల్సిన అవసరం వచ్చింది .
అదీ అర్జెంట్ గా చేయవలసిన సందర్భం ఎదురయింది.
చేసేదేమీ లేక తన బాస్ పరాంకుశం గారి దగ్గరికి వెళ్ళాడు !
“రావోయ్ చిన్నారావు ! ఏంటి విషయం? అలా దిగాలుగా వున్నావేం”ఆప్యాయంగా అడిగాడు.
“సార్ అదీ..అదీ..” అంటున్నాడే కాని విషయం చెప్పలేక తల వాల్చేశాడు.
“సిగ్గు పడ్డది చాల్లే సంగతేంటో చెప్పు ” అన్నాడు చనువుగా.
పెళ్ళై రెండు నెలలే అవడంతో కుర్రాడికి సెలవేమైనా కావాలేమో ఇచ్చేద్దాం అనుకున్నాడు పరాంకుశం..అలియాస్ జి.ఎం అంకుశం !
అసలైతే ఆయన దగ్గర నిలబడాలంటే కాళ్ళు వణికి పోతాయి ..
చిన్నారావు కే కాదు మిగిలిన స్టాఫ్ అందరికీ !
అలాంటిది ..ఆయన ప్రమోషన్ వచ్చిన ఊపులో ఉత్సాహంగా ఉండడం తో ..
ధైర్యంగా ఆయన వద్దకు వెళ్ళాడు చిన్నారావు పనెలాగైనా అవుతుందనే నమ్మకం తో !
“సార్ అది..అదీ..”
“ఏంటది..”
“…”
“ఏంటోయ్..ఆది?”
“సార్ నాకో లక్ష అప్పు కావాలి?” గబుక్కున అడిగాడు.
“ఏంటి?లక్ష..నేను ఇటీవలే ఇల్లుకట్టాకదా? నా దగ్గర డబ్బుల్లేవు..పైగా నేనే అప్పుల్లో ఉన్నాను ” నిర్మొహమాటంగా చెప్పాడు ఆయన.
దిగాలుగా బయటకు వచ్చిన చిన్నారావు వైపు అందరూ జాలిగా చూస్తున్నారు.
బాస్ సంగతి తెలిసి చివాట్లేమైనా పెట్టాడేమో ..
తమకెందుకు వచ్చిన చిక్కులే అనుకుంటూ అందరూ మౌనంగా ఉన్నారు .
“రేయ్! రామ్మోహన్ నువ్వే నన్ను ఈ సమస్య నుండి గట్టెక్కించాలి రా ..”
అంటూ స్నేహితుడి చేతులు పట్టుకున్నాడు అవే కాళ్ళనుకోమంటూ ..
“రేయ్ ! ఊరుకోరా..కాళ్ళని పట్టుకుని చేతులంటున్నావు..నీకు మతి గాని పోయిందా?” అంటూ పైకి లేపాడు రామ్మోహన్.
“అర్రే..సారీరా” అంటూ గబుక్కున లేచి .. చేతులని పట్టుకున్నాడు ప్రాధేయ పూర్వకంగా బ్రతిమిలాడు తూ !
“ఇంతకీ నీకు కావలసిన సహాయం ఏంటో చెప్పరా ముందు” అడిగాడతను ఆందోళనగా .
ఆలస్యం చేయకుండా వెంటనే అడిగాడు..
“నాకో లక్ష అప్పు గా కావాలి రా?”అన్నాడు చిన్నారావు.
“ముందు చేతులు వదలరా?”
“ఆహా వదలను ..”
“వదులుతావా లేదా?”
“వదిలితే నువ్వు తప్పించుకుంటావు”
“వదలకపోయినా తప్పించుకుంటాను ” చేతులు విడిపించుకుని పారిపోయాడు రామ్మోహన్ .
‘అయినా ..తాను ఎప్పుడూ ఎవరికీ అప్పు ఇవ్వలేదు .
ఎవరి దగ్గర తీసుకోలేదు .అందుకే అప్పు అడిగే పద్దతేంటో తెలియడం లేదు ‘ అనుకున్నాడు .
ఆరోజు తెలిసిన వాళ్ళందరినీ అడిగాడు.
పనవ్వలేదు.
వచ్చే జీతం ఇరవై వేలు ..డిగ్రీ చదివాడు చిన్నారావు !
ఓ చిన్న ఆఫీస్ లో క్లర్క్ గా పని చేస్తున్నాడు !
తనకి ఇద్దరు చెల్లెళ్లు !
ఒకరికి పెళ్ళయి రెండేళ్ళవుతుంది.
మరో చెల్లికి ఇటీవలే సంబంధం కుదిరింది .
పెళ్ళివాళ్ళు కట్నం భారీగా అడగకపోయినా పెళ్లి మాత్రం ఘనంగా చేయాలని షరతు పెట్టారు ..
తన వద్ద వున్న డబ్బులకి తోడుగా కనీసం ఒక లక్ష అయినా కావాలి ..
అలాగైతేనే చెల్లి పెళ్లి అవుతుంది .
ఆలోచిస్తుంటే మనసంతా దిగులు మేఘాలు కమ్ముకున్నాయి !
రాత్రి పడుకోబోయే ముందు ..అన్యమనస్కంగా ఉన్న భర్తతో ..
“ఏంటండి అలా వున్నారు !?” అడిగింది జానకి .
నిరాశగా నవ్వి ఊరుకున్నాడు సమాధానం చెప్పలేదు .
భర్త అలా మౌనంగా ఎందుకున్నాడో అర్థం కాలేదు జానకి కి !
అతడే చెబుతాడు లే అనుకుని ఊరుకుండిపోయింది.
* * *
రెండు రోజులు గడిచాయి .
“నేను ఊరు వెళ్ళి రెండు రోజుల్లో వస్తాను ” అన్నాడు భార్య తో ..
“సరే” అంది భర్త మాటలు విని .
సూరయ్య మామయ్య ఏమైనా డబ్బులు సర్దుతాడేమోనని సంబరంగా ఊరు వెళ్ళాడు చిన్నారావు.
అతడి చిన్నతనంలోనే తండ్రి దూరం కాగా తల్లి చేసిన కష్టం..తన చిన్ని సంపాదనతో ఇంతకాలం అప్పు చేయకుండా ఇల్లు ఎలాగోలా నెట్టుకొచ్చాడు !
ఇప్పుడు మాత్రం ఇక అప్పు చేయకుండా పెళ్లి అసాధ్యం ..నిర్ణయానికి వచ్చాడు !
సూరయ్య మామయ్య హ్యాండ్ ఇవ్వడంతో ..నిరాశగా వట్టి చేతులతో ఇంటికి వచ్చాడు.
భార్య ఎంత అడుగుతున్నా తన సమస్య మాత్రం చెప్పలేదు.
“ఏంటండి!? వారం రోజులుగా అదోలా వున్నారు ?నాకు కూడా చెప్పలేనంత సీకేట్ సమస్యా ?” అడిగింది జానకి అనునయంగా .
జరిగిందంతా సింపుల్ గా వివరించాడు.
“ఓ నాకు అర్థమయింది మీ సమస్య .మీకు ఒక లక్ష రూపాయలు కావాలి .అది అర్జెంటుగా !
మరి నాకు ఈ సమస్య ముందుగా చెప్పినట్లయితే నేనే పరిష్కరించే దాన్ని కదా?”
“ఏంటి నువ్వంటుంది?”
“మీరు వింటున్నది నిజమే !”
భార్య వైపు చూశాడు విస్మయంగా .
“నేను మీకు ఇదివరకే చెప్పాను కదా .పెళ్ళికి ముందు నేను ఉద్యోగం చేశానని .
అప్పట్లో నేను సంపాదించిన డబ్బులు మా నాన్న వాళ్ళు నా దగ్గర నుండి తీసుకోకుండా పెళ్లి చేశారు.
ఆ డబ్బులు నా దగ్గర అలాగే వున్నాయి. అవి తీసుకుని ముందు అవసరం గడవనీయండి.
తరువాత మనం ఎలాగూ డబ్బులు సంపాదించుకోవచ్చు .
అడపడుచు ఆనందంగా ఉంటే మనకు అంతా మంచే జరుగుతుందని నా నమ్మకం “
అంది భర్తతో.
జానకి మాటలు వింటుంటే అతడి మది సంబరం తో నిండిపోయింది.
“శ్రీవారు ! నేను చెబుతున్న ఈ మాటలు గుర్తుపెట్టుకోండి.అవసరానికి డబ్బులు అప్పు చేయవచ్చు.
అదేం తప్పు కాదు .నేరం అంతకంటే కాదు.కానీ మనం కూడా ఎవరైనా అవసరం అని అడిగితే ఇవ్వాలి ..తీసుకుంటుండాలి !
ఆర్థిక విషయాల పట్ల అప్రమత్తత ఎంత అవసరమో ఇలాంటి సంఘటనలే నిదర్శనాలు ..
డిగ్రీ చదువు కున్నాను కదా.. ఖాళీగా ఇంటి దగ్గర ఏం కూర్చుంటాను !?
దగ్గరలో ఉన్న స్కూల్ లో టీచర్ గా జాయిన్ అవుతాను .
ఏదో వేడి నీళ్లకు చన్నీళ్లు గా నా సంపాదన కూడా కలిసి వస్తుంది కదా!?”
అడుగుతున్న శ్రీమతి వైపు సంతోషంగా చూశాడు !
చిరునవ్వు నవ్వింది జానకి.
తెలివైన భార్య తోడుగా వున్న తన జీవితం పూలబాట కాబోతుందన్న నమ్మకం తో ..
హాయిగా నవ్వుతూ “అలాగే ” అన్నాడు చిన్నారావు !
ల్యాండ్ లైన్ ఫోను రిసీవర్ అప్పటికి పావుగంట నుంచీ రాజేశ్వరి చెవిని అంటిపెట్టుకునే ఉంది. ఈ మధ్య ఈ ఫోనుని వాడడం బాగా తగ్గిపోయింది. ఎప్పుడో తప్ప కాల్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. అందుకే హిమబిందు కి ఆశ్చర్యంగా ఉంది.
తల్లి వంకే చూస్తోంది. ఆవిడ ముఖంలో మారే రంగులు, భావాలు అర్థం కాక, సైగలతో అడిగింది బిందు, ‘ఎవరు అవతలి వైపు?’ అని.
కానీ, ఏకపక్షంగా సాగుతున్న ఆ సంభాషణలో, రాజేశ్వరి వినటంలోనే నిమగ్నమయి పోయి ఉంది. ‘ అయ్యో ‘, ‘ అవునా ‘ ,’ నిజమా ‘లాంటి ఆశ్చర్యార్థకాలు తప్ప మరో మాట లేదు రాజేశ్వరి వైపు నుంచీ.
ఎట్టకేలకు ఫోను పెట్టేసింది రాజేశ్వరి. నీరసంగా వచ్చి సోఫాలో కూలబడింది.
“ ఎవరమ్మా? బాగా వాయించేశారుగా!”
“ఏదో లే! రాంగ్ నంబరు”
“రాంగ్ నంబరుతో అరగంట మాట్లాడావా? చెప్పమ్మా ఎవరూ?”
” ఏం లేదన్నాగా!” కూతురి వంక చూడకుండా, లేచి వంట గది లోకి వెళ్లి పోయింది రాజేశ్వరి.
సాయంత్రం అయిదున్నర అవుతుండగా చక్కగా తయారయ్యి బయల్దేరింది హిమబిందు.
“ఎక్కడికీ?”
“మర్చిపోయావా అమ్మా…? కేదార్, నీ దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నాడుగా…! ఇద్దరం అలా షికారు వెళ్ళొస్తామమ్మా…!”
“వద్దొద్దు….!”
అర్థం కాలేదు బిందు కి. కాబోయే భర్త తో కాస్త మాట్లాడు కోవడానికి ప్రైవసీ కావాలని తెలియనంత అమాయకురాలు, చాదస్తురాలు కాదే అమ్మ! సరిగ్గా వారం క్రితమే నిశ్చితార్థం అయింది. వచ్చే నెలలోనే పెళ్ళి. నిన్న సరే అని ఇప్పుడొద్దంటుందేంటి?
“అదేంటమ్మా…నిన్న వస్తానని చెప్పి, ఇవాళ ‘ రాను ‘ అంటే, అతనేమనుకుంటాడు? ఏమయ్యిందమ్మా?”
“ ఒద్దన్నాను. ఒద్దంతే! రావట్లేదు అని చెప్పేయి. నాతో వాదించకు.”
“ అది కాదమ్మా….ప్లీజ్…అతను నా కోసం ఎదురు…..”
“నువ్వు చెప్తావా…నన్ను చెప్పమంటావా….!” కోపంగా అంది రాజేశ్వరి.
కళ్ళల్లో నీరు గిర్రున తిరిగాయి బిందూకి. లోపలికెళ్లిపోయింది.
***
“ఏవండీ…. ఇవాళ మధాహ్నం ఒక ఫోన్ కాల్ వచ్చింది. అప్పటినుండి నా మనసు మనసులో లేదు.” మధ్యాహ్నం నుండీ కొంగున కట్టుకున్న నిప్పు కణిక ను విప్పింది రాజేశ్వరి.
చంద్రమౌళి కి కూడా అనుమానంగానే అనిపించింది ఇంట్లో ఉన్న అసహజ వాతావరణం. ఎప్పటిలాగా, బిందు నవ్వుతూ ఎదురు రాలేదు. తన గదిలోనే ఉండి పోయింది.
“ ఎక్కడి నుంచీ…?”
“చెప్తాను! బిందు పడుకుందో లేదో చూసొస్తానుండండి.”
“అక్కర్లేదులే….! చూసే వచ్చాను. నిద్ర పోతూంటే నేనే దుప్పటి కప్పి వచ్చాను. “
“ ఎవరోనండీ…సుందరిట! అరగంట పాటు చెప్తూనే ఉంది. చాలా చెప్పింది. మన బిందుకి కాబోయే భర్త కేదార్ గురించి చెప్పింది.” కంగారు ఆమె గొంతులో.
“ అంటే, బాడ్ క్యారెక్టర్ అనా?”
“దాదాపు అంతే! వాళ్ళ అమ్మాయితో ఎనిమిది నెలల క్రితం ఈ కేదార్ నాథ్ తో నిశ్చితార్థం జరిగిందట. ఈవిడ వద్దన్నా వినకుండా అతను ఆ పిల్లని షికార్లకీ సినిమాలకీ తీసుకెళ్ళాడట ముందుగానే రెండు లక్షలు కట్నం కూడా తీసుకున్నారట. సరిగ్గా వారం రోజుల్లో పెళ్ళి అనగా ‘మీ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని తెలిసింది, మాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అన్నారట కేదార్ తల్లి, తండ్రి.’ ఎంత బ్రతిమిలాడినా ఒప్పుకోలేదట. పాపం చాలా రోజులు పట్టిందట వీళ్ళకి ఆ బాధ నుంచీ బయట పడడానికి.”
షాక్ తిన్నాడు చంద్రమౌళి.
సాధారణ మధ్య తరగతి కుటుంబీకుడికి ఇది పెద్ద కష్టమే! రెండేళ్ల క్రితం పెద్దమ్మాయికి పెళ్ళి చేసి అమెరికా పంపాడు. రెండో అమ్మాయిని కూడా ఓ ఇంటిదాన్ని చేస్తే, తన బాధ్యత అయిపోతుందని అనుకుంటే ఈ వార్తతో ఆయన గుండె గుభేలుమంది. ప్రెస్ నుంచీ శుభలేఖలు కూడా వచ్చాయి . పెళ్ళి హాలు, వంట వాళ్ళూ, అన్నీ బుక్ చేయడం ఐపోయింది. పిలుపులే మిగిలాయి.
“ కానీ రాజీ…ఆవిడకి మన ఫోన్ నెంబర్ ఎలా తెలిసింది? బిందూకి అతనితో కుదిరిందని ఎవరు చెప్పి ఉంటారు? అసలు ఆవిడకేం సంబంధం మనతో? మన మంచి కోరడానికి ఆవిడకి మన గురించి ఎలా తెలుసని అడగాల్సింది “
“అడిగానండీ! తోటి ఆడపిల్ల తల్లిని కనుక మన మంచి కోసం తెలుసుకుని చెప్తున్నాను అంది. వాళ్ళ అమ్మాయిని వద్దన్నాక వీళ్ళు ఎంక్వయిరీ చేస్తే తెలిసిందట, అతనికి వేరే అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయిట. ఆ ఫ్యామిలీనే అలాంటిదట. ‘మీ శ్రేయోభిలాషి గా చెప్తున్నాను. మరో ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరగకూడదు అని, చాలా కష్టపడి మీ నెంబర్ కనుక్కున్నాను అని’ ఏమేమో చెప్పిందండీ. అప్పటినుండీ నాకు మనసు మనసు లో లేదు.”
భర్త చెవిన వేశాక, రాజేశ్వరి గుండె బరువు కొంత తగ్గింది. చంద్రమౌళి కాసేపు ఏమీ మాట్లాడలేదు.
“కానీయ్! ఈ విషయాలేవీ బిందూ కి తెలియనీయద్దు. చిన్నపిల్ల. బాధపడుతుంది. ఇందులో నిజమెంతో నేను కూడా ఎంక్వయిరీ చేస్తాను. నువ్వు తొందర పడకు!” భార్యతో చెప్పి, భోజనం పూర్తి కాకుండానే లేచాడు చంద్రమౌళి.
తన గది గుమ్మం దగ్గరే కర్టెన్ వెనుక నిల్చుని అన్నీ విన్నది హిమబిందు.
“నాన్నా…! అమ్మ ఎందుకింత డల్ గా ఉందో నాకిప్పుడర్థమైంది. నేనేం చిన్నపిల్లను కాదు. చూస్తూ, చూస్తూ ఒక వంచకుడితో జీవితాన్ని పంచుకుంటానా? కేదార్‌తో నేనే ముఖాముఖీ మాట్లాడుతాను. ఏది ఏమైనా నేనేం భయపడి, బెంబెలుపడను. మీరు మనసు పాడు చేసుకోవద్దు. అమ్మా! నాకు నువ్వు ఏదీ దాచకుండా విన్నది విన్నట్లు చెప్పాలి. భోజనం చేసి రా!” గబగబ అని గిరుక్కున తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది.
భార్యాభర్తలిద్దరూ అవాక్కయ్యారు.
**
నేషనల్ హై వే మీద మెత్తగా దూసుకు పోతోంది ఇన్నోవా కారు.
“నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టమే! ప్లాన్ చేసిన నిన్నటి ప్రోగ్రాం కాన్సిల్ చేశావు. ఈ రోజు నీ అంతట నువ్వే కాల్ చేసి లీవ్ పెట్టి మరీ రమ్మన్నావు. ‘ క్షణ క్షణముల్ జవరాండ్ర చిత్తముల్….’ ” నవ్వుతూ అన్నాడు కేదార్.
నవ్వలేదు బిందు.
“ఏమిటీ మూగనోము? మేడమ్ గారికి అలకా?”
“కారాపండి. ఎక్కడయినా కూర్చుని మాట్లాడుకుందాం.” ముక్తసరిగా అన్న బిందు మాటలకి కాస్త ఖంగు తిన్నాడు కేదార్.
భుజం మీద చెయ్యి వేసి, “ఎనీ థింగ్ సీరియస్?”
“ఎస్” చెయ్యి తీసి దూరం జరిగింది బిందు.
కొద్ది దూరంలో హై వే ప్రక్కగా ఉన్న వేప చెట్టు దగ్గరగా కారాపాడు కేదార్. ఇద్దరూ అక్కడే ఉన్న సిమెంటు చప్టా మీద కూర్చొన్నారు.
“రేఖ ఎవరు?” ఏ ఉపోద్ఘాతము లేకుండా అడిగింది బిందు.
“ఏ రేఖ?”
“ఎందరు రేఖలు తెలుసేం? ప్రస్తుతానికి ఒక్క రేఖ చాలు. చెప్పండి. మీ పూర్వ ఫియాన్సీ . ఎంగేజ్మెంట్ అయ్యాక, మీరు వదులుకున్న శశిరేఖ .”
“నీకు…తన గురించి ఎలా తెలుసు?” ఆశ్చర్య పోయాడు కేదార్. నిజానికి బిందు అతను తత్తరపడి అవాక్కవుతాడనుకుంది.
“ ఆ విషయం తర్వాత. ముందిది చెప్పండి. ఆ అమ్మాయిని కాదన్నదెందుకు? నన్ను కావాలనుకున్నదెందుకు? మాకు ఈ విషయం తెలియకుండా దాచారెందుకు? ఎవరిని మోసం చేయాలని?” కోపం, దు:ఖం కలగలిసి ఆమె కళ్ళెరుపెక్కాయి.
“కమాన్…బిందూ….చెప్పకూడదనేమీ లేదు. నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకున్నాను. నువ్వనుకునే అంత సీరియస్ కాదు కాబట్టి చెప్పాలనిపించలేదు. దట్సాల్ .”
చాలా కోపం వచ్చింది బిందూకి.
“ఎంత సీరియస్ కాకపొతే వాళ్ళు, మా ఫోన్ నెంబర్ తెలుసుకుని మరీ మీ చరిత్ర తెలియజేస్తారు? ఒక ఆడపిల్లని అలా మోసం చేసి మరో అమ్మాయికి తాళి కట్టేందుకు సిద్ధమయ్యారే …! మై గాడ్…’చదువుకున్నారు. మంచి జాబ్ చేస్తున్నారు’ అని పొరపడ్డారు మా వాళ్ళు..రియల్లీ అయాం సేవ్ డ్.” ఆమె ముక్కు పుటాలు ఆదరుతున్నాయి.
“మోసమా…?నేనా…?ఎవరిని చేశాను? ఎవరు చెప్పారు? ఏం చెప్పారు? నాకు అర్థమయ్యేలా చెప్పు హిమబిందూ!”
“ఏం చెప్పాలి? అప్పుడు రేఖని, ఇప్పుడు నన్ను! రేపెవరినో? ఎంత మందిని మోసం చేస్తారిలా ?”
“నాకు కాస్త స్పష్టం చెప్పగలవా బిందూ….! నీకెవరెవరు ఏమేమి చెప్పారో…!.నేనెవరినీ మోసం చెయ్యలేదు. నిజానికి మోసపోయింది మా కుటుంబం. ముందు నువ్వు చెప్పాక, నేను చెప్తాను.”
జరిగిన విషయం అంతా చెప్పింది హిమబిందు కేదార్ కి.
కాసేపు మౌనంగా ఉండి పోయాడు కేదార్.
“హిమబిందూ ! ఇలా జరగడం చాలా మంచిదయ్యింది. ఔను. నీకు తెలియడమే మంచిది. అవసరం కూడా అనిపిస్తోంది ఇప్పుడు. విను. నాకు రేఖతో నిశ్చితార్థం జరగడం నిజం. అది విఫలం అవడం ఇంకా నిజం. తనూ నా లాగే సాఫ్ట్ వేర్ ఇంజనీర్. నాలాగే క్రికెట్ పిచ్చి తనకి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం కోసం మూడు సార్లు బయట తిరిగాం. బాగా షాపింగ్ చేసింది తను. పెళ్ళి చీరలు, డ్రెస్సులు వగైరాలన్నీ నా చేత కొనిపించుకుంది. ఇక వారంలో పెళ్ళి. మా ఇంట్లో దగ్గర బంధువులున్నారు. చాలా హడావిడిగా ఉన్న సమయంలో రేఖ ఫోన్ చేసింది. మాట్లాడాలి రమ్మని పిలిచింది. వెళ్ళాను. నా చేతులు పట్టుకుని కన్నీళ్ళతో షాకింగ్ వార్త చెప్పింది. ‘తనకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, అతను దినకర్ అని, తామిద్దరికీ ఎప్పటి నుంచీనో నెట్ స్నేహం ఉందనీ , అతడినే తను పెళ్ళి చేసుకుంటాను’ అని. . మరి ముందుగానే నాకు గానీ మా వాళ్లకి గానీ ఎందుకు చెప్పలేదు అని అడిగితే, యు ఎస్ లో ఉన్న అతడు రెండు నెలల తర్వాత ఇండియా వస్తాను అన్నాడనీ, అతను రాకపోతే, ఇక తన గతి ఇంతే అని నాతో జీవితం పంచుకుందాం అనుకున్నానని, ఈ విషయం తన పేరెంట్స్ తో చెప్పే ధైర్యం లేకపోయిందని అంది. కానీ, ఇప్పుడు అతడు ముందుగానే తన కోసం భారతదేశం వచ్చాడని చెప్పింది. అంటే స్టాండ్ బై గా నన్ను ఉంచుకుందన్నమాట. చాలా బాధపడ్డాను. అప్పటికే తనకి మేము ఇద్దామనుకున్న బంగారు ఆభరణాల కోసం డబ్బు కూడా ఇచ్చేశాం. ఇంత వరకూ వచ్చాక పెళ్ళి రద్దు అయితే పరువు పోతుందని, దినకర్ని మరచిపోమని ప్రాధేయ పడ్డాను. కానీ రేఖ కన్నీళ్ళతో వేడుకుంది. మనసు ఒకరితో, మనువు మరొకరితో పంచుకోలేనంది. ఆది చాలనట్లు నా నెత్తి మీద మరో భారం వేసింది.”
“ఏమిటది?” అడిగింది బిందు .
“రేఖకి తల్లితండ్రుల దగ్గర తమ కులం కాని వాడిని పెళ్ళి చేసుకుంటాను అని చెప్పే ధైర్యం లేదు. ఇంత దాకా వచ్చాక వాళ్ళు తనని ఎట్టి పరిస్థితులలోనూ బయిటికి రానివ్వరు, బలవంతంగా నాతోనే పెళ్ళి చేస్తారు కనుక, నన్ను బ్రతిమిలాడింది ‘ దయచేసి, మీరే ఏదో ఒకటి చెప్పండి. నేను మీకు నచ్చలేదని చెప్పెయ్యండి. పెళ్ళి కాన్సిల్ చేయండి.’ అంటూ ఏడ్చింది. కాళ్ళా వేళ్ళా పడింది. ఆలోచించాను. మనసు లేని పెళ్ళి నేనూ చేసుకోలేను కదా! అందుకే, తను చెప్పినట్లే చేశాను. వాళ్ళ వాళ్లకి నామీద చాల కోపం వచ్చింది. బాగా గొడవలయ్యాయి. మేమిచ్చిన సోమ్ములేవీ మేం అడగలేదు. వాళ్ళివ్వ లేదు. ఆడపిల్ల జీవితం అల్లరి పాలు కాకూడదని నా తల్లితండ్రులకు తప్ప ఈ విషయం ఎవరికీ తెలియనీయలేదు. నాకూ ఓ చెల్లెలుంది బిందూ! మీకు ఎవరు ఏమేం చెప్పారో నాకు అనవసరం. నమ్మితే ముందుకు వెళ్దాం. లేకపోతే, ఇక్కడితో వదిలెయ్యి. ఫ్రెండ్స్ గా ఉందాం!“ నిజాయితీ ఉంది అతని స్వరంలో.
“ఇది నిజమని నమ్మేదెలా?” ఇంకా అనుమానంగానే ఉంది బిందుకి .
“నమ్మించేదెలా? ఆగు. నా దగ్గర తన ఫోన్ నెంబర్ ఉంది. “ అంటూనే డయల్ చేశాడు కేదార్.
“హాయ్ కేదార్! హవ్వార్యూ? ఎంత హ్యాపీ గా ఉందో నువ్వు కాల్ చేస్తే! బట్, నాకు తెలుసు ఎప్పటికయినా నువ్వు నా కాంటాక్ట్ లోకి వస్తావని. యూ ఆర్ మై మ్యాన్. “ రేఖ స్వరం మొబైల్ ఫోన్ స్పీకర్ లో నుంచీ బిందుకి స్పష్టంగా విన్పిస్తోంది.
“జస్ట్ ఏ కర్టెసీ కాల్….ఎలా ఉన్నావు రేఖా? ఎలా ఉంది లైఫ్? నువ్వూ, దినకర్…. యు ఎస్ లోనేనా?”
“ఓ ! అయాం సో అన్ లక్కీ కేదార్! వాడొట్టి చీట్. పెద్ద ఫ్రాడ్. అన్ని కబుర్లు చెప్పాడా…! ఇండియా వచ్చాడా! నన్ను చూసాడా! వాడేదో ప్రిన్స్ లాగా ఉన్నట్లు ఫీలింగ్ ఒకటి! ‘నువ్వింకా చాలా అందంగా ఉంటావనుకున్నాను. అయినా సరే, ఏదో అడ్జస్ట్ అవుతాను. యాభై లక్షలు కట్నం తెమ్మన్నాడు. ఎక్కడినుంచి తెస్తాను? అందుకే ఇంకేం చేస్తాను? బ్రేకప్ చెప్పి బయట పడ్డాను. నిన్ను మిస్ చేసినందుకు నేను ఎంత ఫీల్ అవుతున్నానో…! రియల్లీ ఐ రిపెంట్” బాధగా అంది రేఖ.
“ సో స్యాడ్ రేఖా…! ఒక్కో సారి అంతే! అనుకున్నట్లు జరగదు. బీ బ్రేవ్!” చెప్పాడు కేదార్.
“కేదార్! ఒక మాట చెప్పనా….!నాకు ముందు నుంచీ నువ్వంటే నాకిష్టం. నీతో క్రికెట్ మ్యాచెస్ చూస్తూ లైఫ్ మొత్తం వన్డే మాచ్ లాగా జరిగిపోవాలి. ఎస్…,నువ్వు నన్ను నమ్మాలి. మరెందుకు ఎలా చేశావ్ అని అడగొచ్చు నువ్వు. వాట్ టు డు ? ఆ దినకర్ నీకన్నా క్వాలిఫైడ్. ఫారిన్ లో మంచి జీతం. అందుకే అప్పుడటు మొగ్గాను. అంతా ఉల్టా అయ్యింది. ప్చ్! కేదార్ డియర్… ప్లీజ్! లెటజ్ గెట్ మారీడ్! మా అమ్మతో అదే చెప్పాను. ప్లీజ్, కేదార్, ఒక్క సారి మనం కూర్చుని మాట్లాడుకుందాం. నాకు తెలుసు నువ్వు ‘ కాదు’ అనవని. లవ్యూ కేదార్….”ఇంకా ఏదో చెప్తూనే ఉంది రేఖ.
హిమబిందు, కేదార్ చేతిలో ఉన్న మొబైల్ ఫోనుని తీసుకుంది.
“మిస్ రేఖా…! నేనేవరా అని ఆశ్చర్య పోతున్నట్లున్నావు కదూ…. నా పేరు హిమబిందు. కొద్ది రోజుల్లోనే మిసెస్ కేదార్ నాథ్ ని . పాపం. మా ఫోన్ నెంబర్ వెతికి మరీ మమ్మల్ని తప్పిద్దానుకున్నారు. చాలు మీరాడిన జూదం. చూడూ …పెళ్ళికి కావాల్సినది ప్రేమ. నమ్మకం. ఆస్తి, అంతస్తు కాదు. నువ్వు, మీ అమ్మా మీ తెలివితేటలని కాస్త మంచి పనులకి వాడుకోండి. మంచిమనిషిని వంచించడానికి కాదు. ఏదేమైనా నా జీవిత భాగస్వామి ఔన్నత్యాన్ని తెలుసుకున్నాను. వివాహబంధాన్ని వ్యాపారంగా మార్చేసే మీలాంటి వాళ్ళ వల్లే సమాజంలో ఆడవాళ్ళ పట్ల గౌరవభావం తగ్గుతోంది. బై !“
ఫోనుని తిరిగి కేదార్ చేతికిచ్చి, ఆ చేతిని గట్టిగా పట్టుకుంది హిమబిందు.
అనుమానపు తెరలు తొలిగిన ఆమె కళ్ళల్లో ప్రతిఫలిస్తున్న అభిమానాన్ని చూశాడు కేదార్.
“థాంక్యూ “ అతని కళ్ళు చెప్పాయి ఆమెకి. కారు వైపుగా ఇద్దరి అడుగులో సాగాయి.
ఆనందు తీసుకున్న నిర్ణయం అతని తల్లికి ఏమాత్రం మింగుడుపడడంలేదు. అతని భార్య సరోజ అతని నిర్నయాన్ని అస్సలు జీర్ణించుకోలేక పోతుంది. అతని అబిప్రాయంతో ఏకీబవించకుండా కాసేపు మౌనవ్రతం దాల్చింది ఆమె. అతని తల్లి కోడలికి బాసటగా నిల్సి ‘‘ఒరే ఆనందు ఏందిరా నువు సేసేది, ఈడ బతికేది బతుకు కాదా,నువ్వు మమ్ముల ఇడిసి దూరంగా పోతంటే ఎట్టా, సర్కారు నౌకరి వొచ్చిందంటే సంబురపడ్డాం గని మిలటరీ నౌకరంటే ఒప్పుతాంరా అయ్యా, ఉన్నొక్కనివి ఇడ్సిపోతే ఎట్టరా ఆనందూ, మయ్యగాని నెత్తినోరుకొట్కోని చెబుతున్న ఇనరా అయ్యా, నారెక్కలిర్గలే రెక్కలిర్గిందాంక సాకుతా , అటెంక ఏదన్న పనిసూసుకో బిడ్డా కోడలుపిల్ల వుత్తమనిషి కూడా కాదాయె, ఈ సమయముల్ల పిల్లకు నువు తోడుగుండాలే. అసలే పెద్దింటిపిల్ల ప్రేమించి మరి పెండ్లాడ్త్వి,ఇప్పుడు పచ్చిని చేసి ఇడ్సిపోతె ఎట్టా. దానిబతుకేంగాను, పిల్ల బాగోగులెవరు సూస్తరు.’’ అంటూ కంతలబోయిన కండ్ల నీళ్ళు రాలుస్తూ అరవసాగింది.అప్పటికే ఆమె మూడుకాళ్ళ ముదిమికొచ్చింది.
దుఖ్ఖాన్ని కళ్ళలో అదిమిపట్టిన సరోజ మౌనంతో సూటిగా ఆనందు కళ్ళలోకి చూసింది. అతను తన బట్టలను బ్యాగులోకి సర్దుకొంటూ ‘‘సరూ మనకోసమే నేను ఈ పని చేస్తున్నా. ఈరోజుల్లో గవర్నమెంట్ జాబ్ దొరకడం అంత ఈజీ కాదని నీకు తెల్సు, మనం హయిగ బతకాలంటే ఏదోపని చేయాల్సిందే, ఆప్ట్రాల్ ప్యూన్ పోస్ట్‌కు పి.ఎచ్.డి చేసిన వారు అప్లై చేస్తున్నారు. మనమెంత పైగా ఒకే ప్రయత్నంలోనే మిలటరీలో జాబ్ వచ్చింది. ఆనందించాల్సింది పోయి అమ్మ, నువ్వు నాపై అక్కసు ఎల్లగక్కితే ఎలా, నా ఆశయం దేశసేవ చేయడం. అందివచ్చిన అవకాశం వదులుకోలేను.’’ అంటూ తడుముకోకుండా పలాకాడు ఆనంద్.
‘‘ఆనంద్ సేవే పరమావది అయితే ఈ దేశంలో, మన రాష్ట్రంలో వివిధ రంగాలలో జాబ్ చేసేవారిది సేవకాదా.’’అంటూ గాటుగానే బదులు పలికింది సరోజ అతనివైపు కటినంగా కోపంతో చూస్తూ
‘‘చూడు మైడియర్ సరూ అలా ఉరుమురిమి చూడకు, నేను తట్టుకోలేను ప్రేమామృత ధారలు కురిపించే నీకళ్ళు నిప్పులవాన కురిపించి నన్ను దహించివేయకు’’అంటూనే దీనవదనంతో ప్రాదేయపడుతున్నట్టుగా ఆమెవైపు లీలగా చూస్తూ తన చేతితో ఆమె గదుమను తడిమాడు.
‘‘ఓయబ్బో లేనిప్రేమవొలికించకు, ఆనంద్ నిన్ను నేను ఎంత ఆరాదించానో అది నీకు తెలుసు, ఐనా బాడర్ లో జవాన్ జాబ్ మంచిదే కాని నీ తెలివికి ఇక్కడే ఏ ప్రయివేట్‌లో చూసుకున్నా చాలినంత జీతమిస్తారు, నువ్వే ఓ నెట్‌సెంటర్ పెడితే నలుగురికి ఉపాదికల్పిస్తావు. ి ఆనంద్ నీవు బాడర్లో అష్టకష్టాలు పడటం నాకు సుతారమూ ఇష్టంలేదు. ఇప్పటి పరిస్థితుల్లో నువ్వు వెళ్లితే నన్నేవరూ చూసుకుంటారు. మీ అమ్మ అసలే మతిమరుపు మనిషి, నేనో వుత్తమనిషిని కాను నెలలు నిండిన గర్బినిని, నీ తొందరపాటు నిర్ణయాలతో విసిగించకురా..’’అంటూ తన పొట్టపై చేయితో నిమురుకొంటూ అతనివైపు దీనాతిదీనంగా చూసింది.
‘‘సరూ అన్ని ఏర్పాట్లు చేస్తా, నువ్ ఫికర్ చేయకు కొన్ని రోజులు ఓపిక పట్టు అంతా సర్దుకుంటుంది. నేను ఈ నేలపై పుట్టినందుకు దేశ సేవ చేసేబాగ్యం నాకు లభించింది. ఆనందపడు, ఎందరికొస్తుంది ఈ అవకాశం. తినడంకోసమే అయితే ఏదోపనిచేసి బతకొచ్చు. మనిషన్నాక ఏదో సాధించాలి. అందరిలా మనముంటే ఎలా కాస్తా భిన్నంగుండాలి,నేనలావుండడం నీకిష్టంలేదా. నీకు గుర్తుందా సరూ నువ్వే అనేదానివి మనం అందరికంటే డిపరెంట్‌గా ఆలోచించాలి అని అందుకే సైన్యంలో చేరా.’’ అంటూ సరూ తలనిమురుతూ మాటలతో మరిపించాడు.
‘‘ఏమో బాబు మీరెన్నైనా చెబుతారు. సరే మళ్ళి తమరి రాక ఎప్పుడో’’ జీరబోయిన గొతుంకతో అడిగింది.
‘‘పోన్ చేస్తుంటా,కుదిరితే లెటర్ రాస్తా’’అంటూ ఆమెను చివరగా ఆలింగనం చేసుకొని నుదురుపై ముద్దుపెట్టి అటునుంచి కదిలాడు. ఆక్షణంలో అతనికి తెలియకుండానే కన్నుల్లో నిద్రానమైన కడలి ఉద్వేగంతో పొంగి కంటిరెప్పలనుండి తన్నుకొచ్చి కన్నీటి వరద పారింది. అతను కళ్ళు తుడుచుకుంటూ ముందుకు సాగిపోయాడు. అతనినే చూస్తూ నిలబడిపోయింది సరోజ.
ఆమె మతి యాదుల్లోకి మల్లింది ‘‘ఈ నేలపై తలుకుబెలుకు కాంతులీనె నవజాతశిశువు పుడమీన పాదం మోపె గడియ కోసం ఎదురుచూస్తాను, నీ మది తలపులు తెరచుకొని నీ గుండె గది పడకలో నీ పక్కనే నేను కొలువు దిరుగుతాను ఆనందు కలతపడకు కలలు కను వీరుని కల కను దేశభక్తుల గాదలు విను అవి నాకు నీ జాబుతో సంతకం చేసి పంపు నేను వాటిని చదువుతున్నప్పుడు నాలో నూతనత్తేజం నిండాలి. నీకుమల్లె నేను మాతృభూమిపైన మమకారం పెంచుకోవాలి.’’ అని తనలో తాను అనుకోసాగింది. అతను దూరమౌతున్నకొద్ది అతనిపై ఆమె చూపు దుర్బినిలా నిలబెట్టి చూడసాగింది. అతను మాయమయ్యాడు…. ఆమె కళ్ళలో అతని రూపు నిలిచిపోయింది.
అతను సరిహద్దులో కాపలా కాస్తున్నప్పుడు కోడెతాచుల బుసలుకొట్టె చీకటిలో కంచె ఆవలి కాలాంతకుని పసిగట్టె పనిలో అతని కనురెప్పలు మూయక తెరచుకొని ఉంటాయి. శత్రువు నిశ్శబ్ద పాదాల అలికిడి పసిగడుతూ కారుచీకటి కమురువాసనలో కనురెప్పలు తెరిచి రెటినా దుర్బినిగా మారుస్తాడు. అతని చెవిలో కర్నబేరి రిక్కపొడుచుకొని అగంతకుని అలికిడి సవ్వడిని వినసాగుతుంది. భూతలస్వర్గం కాశ్మీరపు అందచందాలలో హిమపాతపు మంచులోయలో ముసురులా ఎడతెరుగక మంచు కురుస్తుంది. కర్కశత్వం నిండిన కఠినశిలా హృదయంలో డమరుక నాథం దేశభక్తి గేయాలాపన. లోయలో జలపాతం సడిచేస్తూ సైనికుల కవాత్తును కీర్తిస్తూ గానం చేస్తుంది. డేరాలలో కొందరు యోదులు విశ్రమిస్తుంటారు అలసిసొలసి. కార్పెట్ బూట్ల పహారా కాస్తూ అతను, ఆనందు లాంటి యోదులు ఎందరో. ఇక్కడ సూర్యోదయాలు, చంద్రోదయాలు, అమావాస్య నిశి చీకటి రాత్రులు వారికి ఒక్కతీరే, వారి మనసులో సంతోషపు ఆనందగడియల్ని వెదికేందుకు క్షణం తీరిక ఉండదు. వారి కవాత్తు, మార్చ్ ఫస్ట్ మంచులోయలో దూకే జలపాతంలా సాగుతుంది. గగన సీమలో సాగిపోతున్న వలసపక్షుల క్రమశిక్షణకు ఏ మాత్రం తీసిపోని తీరున వారు సరిహద్దు కంచె ముందు సాగుతారు, కఠోర సాధనతో సాయుదులై అకస్మిక యుద్దంలో ముందుకు దూకుతారు. కంచె ఆవల మాటువేసే శత్రువు దుశ్చర్యను పసిగడతారు, తిప్పికొడతారు. వారు భారత సైనికులు, కార్గిల్ వీరులు. అయినా వారు అప్పుడప్పుడు అంతర్గత శత్రువు నుండి ,అలాగే సరిహద్దు కంచెదాటిన శత్రువు చేతులో ఎదురుదెబ్బలు తింటుంటారు. అవి పటాన్‌కోట్, యూరిసెక్టార్ లాంటివి. కాని వారి మనోధైర్యం ఈసమంత చెదరదు వారి గుండె నిబ్బరం శత్రువు ఎదురుదెబ్బలతో రెట్టింపు చేస్తాయి. తూర్పున సూర్యుడు ఉదయించి పడమర అస్తమించడం మళ్ళీ ఉదయించడం ఎంత వాస్తవమో భారతమాత స్వేచ్చగా ఉండాలని తపన పడుతూ ఎదురొడ్డి పోరాడి సడలని అచెంచల ఆత్మ విశ్వాసంతో అసేతు హిమాచలం కాపలా కాయడం అంతే వాస్తవం.
‘‘హలో ఆనంద్ ఎలా ఉన్నావు నీకోసం నీరాకకోసం కళ్ళ ఒత్తులు పెట్టుకొని నేను, మీ అమ్మ, మన బిడ్డ ఎదురుచూస్తున్నాం వేయి కళ్ళతో నీవు ఎప్పుడొస్తావా నన్ను మళ్ళీ తన్మయత్వంతో ఆలింగనం చేస్కుంటావా అని ఎదురుచూస్తున్నా’’ అంటు ఆతృతతో పలకరించింది సరోజ.
‘‘సరూ మాకు విజయాలు, అపజయాలు మామూలే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కంటికి రెప్ప వాల్చకుండ, కునుకు తీయకుండ గస్తీ కాయడం మా డ్యూటీ. ఇది ఒకరోజుతో ముగిసేది కాదు ఏటి ప్రవాహంలా నిరంతర నిఘా ఆదమరిస్తిమా శత్రువు చేతికి మేం చిక్కినట్టె గస్తీ పెంచితిమా వాడు మాకు చిక్కినట్టే ఇక్కడ మాకు మరణం వీరత్వం వెన్నుచూపడం పిరికితనం చావడమో చంపడమో ఇదే మా డ్యూటీ నిరంతర నిఘాలో అలుపులేకుంటా ఉన్నా నువెలా ఉన్నావు.’’ అంటూ ఉద్వేగంతో ప్రవాహంలా అతని పలకరింపు సాగింది.
భయాందోళనకు గురైన సరోజ అతనితో మాట్లాడుతూ ‘‘నేను రోజు పూజలు చేస్తూనే ఉన్నా కన్పించిన చెట్టును, పుట్టను, కొండను, కోనను మొక్కుతూనే ఉన్నా ,నువ్వు క్షేమంగా ఉండాలని మా దరి చేరాలని’’ అంటూ ఆమె గద్గద స్వరంతో పలకరిస్తుంటె అతనూ నిట్టూర్చాడు ఇద్దరూ ఫోన్లో పిచ్చాపాటి కబుర్లాడుకున్నారు. అమ్మ గురించి, అమ్మగల్లాడుతున్న చిన్నోడి గురించి ఆమె చెబుతావుంటే అతను మురిసిపోయాడు.
మురిసిపోతూనే ‘‘సరూ సరిహద్దు కంచెలు మా చరిత్ర చెప్పడమే కాదు మా గురించి స్వర్ణాక్షరాలతో లిఖిస్తాయి. యావత్ భారతదేశానికి మా కీర్తిని, మా త్యాగాలను వివరిస్తాయి. దేశానికే కాదు ప్రపంచానికి చాటుతాయి. ఇంతటి గొప్ప గణకీర్తి ఏ పౌరునికి, ఏ ఉద్యోగికి లబిస్తుంది’’ అంటూ అతను వారి ఉన్నతిని స్తుతిస్తుంటే సరోజ ఒంటిలో ఒకవైపు ఒనుకు పుడుతూనే, మరో వైపు తన పెనిమిటిలోని పౌరుషత్త్వము ఆమెలో రాజుకుంది. కాని ఆమెలో తెలీని ఆందోళన జరగకూడనిది ఏదైన జరుగుతుందేమోనని మదిలో ఆందోళన ‘‘ఏమండీ జాగ్రత నేను రోజు పేపరు తిరగేస్తూనే ఉన్నా సరిహద్దులో జరుగుతున్న సంఘటనలను చదువుతూనే ఉన్నా. సినిమాల్లో మాదిరి కసాయి ముష్కరలు మీ పట్ల కర్కశత్వం ప్రదర్శిస్తారట కదా అదే నా బెంగ అది వింటుంటే, చదువుతుంటే ఒళ్లు గగ్గురు పొడుస్తుంది జాగర్త సుమా.’’ అంటూ దీనంగా విలపించ సాగింది సరోజ. కళ్ళలో సుడులు తిరిగిన కన్నీటిని తుడుచుకొంటూ…
‘‘సరూ యుద్దంలోకి దిగాక విజయమో వీరమరణమో మిగతావాటి గురించి ఆలోచిస్తామా’’ అంటూ గర్వంతో పలికాడు ఆనంద్. అలా చెబుతూనే ‘‘సరూ సరిహద్దుల్లో ఈ మద్య మాలో ఒక జవాన్ దారితప్పి కసాయి ముష్కర మూకకు చిక్కాడు దేహమంతా విషం నింపుకున్న కసాయి ఉగ్రమూక అతడి దేహానికున్న శిరస్సును ఖండిరచి మొండాన్ని గరుడలకు ఆహారంగా పారవేసి తలతో బంతులాడుకున్నారట. అంతకుముందు వీర సైనికుని కాల్లుచేతులు కట్టివేసి హింసిస్తూ ఈడ్చుకెళ్లి ఆనందపడసాగారు. దేహంనుంచి కారుతున్న ఒక్కొక్క రక్తపు బొట్టును చూసి పకపకనవ్వుతూ ఈలలు వేసారు చేతులలో గుండుసూదులు గుచ్చారు. చేతిగోర్లు పీకి కాటాలు గుచ్చారు కీల్లు విరగొట్టి మేకులు దించారు. పళ్లూడగొట్టి కనుగుడ్లు పెరికి వేశారు. దేహమంతా రగతాలు కారుతుంటే ఎరట్రి కారాన్ని దేహమంతా పులిమి అతడు ఆహాకారాలు చేస్తుంటే వారు ఆనందతాండవం చేశారు వారి ఉన్మాద వికృత క్రీడకు చచ్చి పడున్న దేహం మౌన సాక్షిగా నిలుస్తుంది అయినా వారి కసి తీరదు ఎక్కడో గుర్తుతెలియని చోట మొండం ఒకచోట, తలొకచోట మంచులోయలో రాబందులకు ఆహారంగా విసిరేసి రాక్షసానందం పొందుతారు అయితేనేం అతను అమరుడు అతని కీర్తి అజరామరం మువ్వన్నెల జెండై రెపరెపలాడుతుంది’’ అంటూ అతను చెపుతావుంటే సరళ వెన్నుల్లో ఒనుకు పుట్టింది. గుండె వేగం పెరిగింది అతని మాటలు వింటున్నంత సేపు ఆమెలో ఉద్ద్వేగం కట్టలు తెంచుకుంది కసితో ఆమె మతి రగిలింది ‘‘ఆనంద్ అలాంటి కసాయి ముష్కరుల మట్టికర్పించు నీకండగా నేనే కాదు ఈ దేశమంతా వెన్నంటే ఉంది’’ అంటూ భావోద్వేగంతో పలకగానే ఆనంద్ మది ఆనందతాండవం చేసింది ఆమె మాటలకు. ‘‘సరూ ఈ భూతల స్వర్గంలో కొన్ని రోజుల్లో మేం కొత్తచోటుకు వెళ్తున్నాం’’ అంటూ చివరి మాటగా పలుకుతూ ‘‘మన బాబుకు, నీకు నా ముద్దులు’’అని పోన్ పెట్టేశాడు. నెలలు గడుస్తున్నాయి, తన బాబుగూర్చిన ఆనందగడియలను అప్పుడప్పుడు ఆనందు, సరోజలు పోనులో మాటలాడుకుంటూనేవున్నరు, ఒకరినొకరు పలకరించుకొంటూ యోగక్షేమాలు తెలుసుకుంటూనేవున్నరు, వారి బాబు వచ్చిరాని మాటలతో ఆనందును పలకరిస్తుంలే అతనిలో సంతోషం వికసించి విప్పారేది.
ఒకనాటి సాయంత్రం టీవి ముందు వాలి టివి ఆన్ చేసింది. అన్ని న్యూయస్ చానల్లలో స్క్రోలింగ్ హెడ్లైన్లతో కాశ్మీర్‌లోయ రక్తసిక్తం, పుల్వామా సెక్టార్లో నలబైమంది జవాన్లు ఉగ్రదాడిలో వీరమరణం పొంది అమరులైయ్యారు. ఆ వార్త దావానంలా భారతావని వ్యాపించింది. టీవీలముందు కూర్చున్నవారు నిర్ఘాంతపోయి చూస్తున్నారు. సరోజలో వణుకు మొదలైంది, గుండె వేగంగా కొట్టుకోసాగింది, ఆమెలో ఏదో తెలియని ఆందోళన ఆమెని ఉక్కిరిబిక్కిరి చేయసాగింది. తనదేహం తన ఆదీనంలో లేకుండా పోయింది. ‘‘ఆనంద్, ఆనంద్ ’’అంటూ కలవరిస్తూ తదేకంగా రెప్పవాల్చకుండా ఆ ఘటననే చూడసాగింది. టీవిలో వచ్చె దృశ్యాలు చూపరుల గుండెల్నిపిండెసేలావున్నాయి, ఆదృశ్యం భీతావాహ భయానకం సైనికుల బస్సు తుక్కుతుక్కైంది,ఆబస్సులో వున్న అరవైమందిలో నలబైమంది అక్కడికక్కడే వీరమరణం పొందారు.సైనికుల శరీరాలు ముక్కలు ముక్కలై చెల్లాచెదురుగా పడిపోయాయి,ఉగ్రవాది ఒక్కడు ముందుగా బస్సును డీకొట్టి ఆపై తనను తాను పేల్చేసుకొని సృష్టించిన విద్వంసం అది. అప్పుడే వీరమరణం పొందిన సైనికుల పొటోలు టివీలో రాసాగాయి,అందులో ఆనందు పొటో వుండడంతో సరోజ తట్టుకోలేక స్పృహకోల్పోయింది,ఆ ఘటన చూపరులకు ఊరిజనాలకు ఒళ్ళు గగ్గుర్పొడుస్తుంది, రోమాలు నిక్కపొడుచుకుంటున్నయి. జనం నరనరాల్లో ఆవేశం కట్టలుతెంచుకొని , మరుగుతున్న రక్తాన్ని అనుచుకోలేక దాయాది దేశంపై తలోతీర్గ దుమ్మెత్తిపోయసాగారు. దిక్కులుపిక్కటిల్లేలా ‘‘ఆనందూ అమర్‌రహే’’అంటూనే అంతకంతకూ ప్రతీకారం బదలా తీర్చుకోవాలని ముక్తకంఠంతో చాటుతున్నారు…
ఆయల్ల పనికెళ్లిన బాలమ్మ పనిముగిసింది. పొద్దుకూకింది, సందలవడ్డది, ఊరపసులు ఇంటిబాట పట్టినయ్.వాటి ఎనకాలె పనికెళ్లిన కూలీలందరూ కొండ ఆవలిగట్టునుంచి కొండెక్కిదిగి ఎగుడుదిగుడు గుంతల బెట్టెరాళ్ల బాటలో నడిచినడిచి వారికాళ్లు అలిసిఅలిసి మెత్తబడ్డాయి అయినా తిన్నగా అడుగులోఅడుగేస్తూ ఇంటిబాటపట్టారు. పొద్దుమునిగి చీకటిపరుచుకొంటుంది ‘‘ఇంటికెళ్లి గింత చాయసుక్క కడుపులేసుకుంటే కడుపులాకలి సల్లబడుద్ది’’అని తనమదిలో అనుకొంటూ ఇంటినిసమీపించింది. ఇంటిముందు జనం గుమ్మిగూడివున్నరు, ఇసుకపోస్తే రాలనట్టుగ. ‘‘ఏందల్లా ఏంది మా ఇంటిముంగల గుమ్మిగూడిరడ్రు,కశ సందిడువుర్రి ఇంట్లకుపోవాలే, ఏందే సరోజా ఏంది జనం’’అంటూ అందరివైపు ఎగాదిగా చూసింది సరోజా టీవిముంగల కూలవడివోయింది పోరడు తల్లిమీన తారాడ్తుండు జనం వార్తలు ఇనసాగిండ్రు. సరోజ ఏడుస్తుంది, ఎన్నడూ కడవాడకట్టుకు రాని జనం ఇంటిముంగల గుమ్మిగూడటం చూసి ‘‘ఏంజరిగిందర్రా ఏంది సంగతి’’ అంటూనే వారివైపు ఎగాదిగాచూసింది. ‘‘ఓ బాలమ్మా గుండేదైర్నం చేసుకో అటకూలవడు,నీ కొడుకు ఆనందు…. ఆనందూ’’ అని గుంపులో ఓవ్యక్తి అనేలోపే ‘‘ఏమయిందయా నా ఆనందుకూ…’’అని సూటిగా వారివైపుచూస్తూ అడిగింది. అమ్మా ఇంకెక్కడి ఆనందూ నీకొడుకు ఉగ్రదాడిలో వీరమరణం పొందిండు, సైన్యంలో వుండి దేశానికి సేవచేస్తూ, అసువులుబాసి అమరుడైండు తల్లి నీ ఎంట ఊరుంది, ఊరెకాదు ఈ దేశమే మీయెంటవుంది.’’ అనేసరికి ‘‘అయ్యో ఓరి దేవుడో ఎంతపనిచేశావురో, నాఇల్లు ముంచితివా.. నా ఆనందూ ఓయమ్మా, ఓ దేవుడా.. ఎట్టబతికేది సరోజా.. నా తల్లి ఏమి శెరలొచ్చెరా బగవంతా, ఎవనికేం పాపంచేస్తిమి సామి నాయిల్లు ముంచితివీ, మమ్ముల మగదిక్కులేనోళ్ల జేస్త్వి ఓయమ్మా…ఓ అయ్యా… నా ఆనందూ ఏడకానొస్తడే, మల్లెప్పుడొస్తడే, అమ్మో,అయ్యో, మా తండ్రి.. ఆనందా..’’ అంటూ తలబాదుకుంటూ, జుట్టుపీకుంటూ వల్లవల్ల ఏడుస్తూ కూలవడిపోయింది టీవిముందు. ఆమెకు కొడుకు లేడన్న వాస్తవం జీర్ణించుకోలేకపొయింది. ఆమెలో ఆవేశం దుఖ్ఖమై ఉప్పొంగింది,కంతలవోయిన కండ్లలో ఇంకిన కన్నీరు ఊటలా ఉబికి వరదలైపారుతూ చెంపలపై జాలువారుతూ కొంగుతడిసి ముద్దయ్యింది చీకటి ఆ ఇంటిని కాలసర్పమై మింగింది. నిశిచీకటి కమ్మింది ఊరిపెద్ద ఒకరు ఆ యింటిలో క్యాండిల్ జ్యోతులను వెలిగించాడు, బైట జనం అమర జవానుకు జేజేలు పలుకుతూ ఆ ఊరంతా జ్యోతులతో దిక్కులు పిక్కటిల్లేలా జోహార్లు అర్పిస్తూ ర్యాలితీసి ఊరంతా ఆ ఇంటికి బాసటగా నిలిచిండ్రు….
భూతం ముత్యాలు, కథారచయిత
9490437978
మాది ఉత్తర తెలంగాణలో ఓ పట్టణం. బతుకు కోసం దుబాయ్ సూరత్ బొంబాయి పోయే బతుకులు మావి. చుట్టూ చెరువులే.. వానలు లేవు. పంటలు లేవు . వలస పోవుడే బతుకు బాగు కోసం..అందరి లాగే మా నాన్న వలస దుబాయ్ కి . మేము ముస్లింలం. ప్రతి రోజు నమాజు వేళలో అలికిడి. మా వీధిలో అంతా ముస్లింలమే. అందరూ పరదా చాటునే.. ప్రశ్న తలెత్తని మహిళా సమాజం. తలాక్ లకు ఎన్నో జీవితాలు బలి. ఎచ్చోటనైనా పితృస్వామ్య దురాక్రమణ యే – ఏ మతమైనా…
నేను పుట్టాను ఓ మధ్య తరగతి కుటుంబంలో…. పుట్టాను ఎందుకో అనుకోలే నా తల్లిదండ్రులు. నా కంటే ముందు ఇద్దరూ అమ్మాయిలే.. ఐనా పుట్టుక ఆడో మగో తమ చేతుల్లో ఉండదనే విజ్ఞత గల తల్లి దండ్రులు. అబ్బాయినైనా అమ్మాయినైనా పెంచే తీరులో వ్యత్యాసాలు కనబరచని తల్లి దండ్రులు నా అదృష్టం.అల్లారు ముద్దుగా పెంచారు ఆడపిల్లనయినా… నాన్న జమీల్ ఫుట్ బాల్, క్రికెట్ ఆటగాడు. అమ్మ పర్వీన్ విద్యార్థి దశలో కబడ్డీ ఆడేది. సిర్నాపల్లి కోట చుట్టూ ఎన్ని సార్లు ఉరికానో ఆలిసాగర్ కట్ట మీద ఎన్నిసార్లు అటూ ఇటూ పరిగెత్తానో మల్లారం అడవి లో పక్షి పలుకులు నా మాటలకు పదును పెట్టాయేమో.. రెక్కలొచ్చిన పక్షుల జూచి నేను నేర్చుకున్నా ఎలా ఎదగాలో…. వివక్షను ఎరుగను ఇంట్లో.. వీధిలో చూచే చూపులు.. విరిసే సూటిపోటి మాటలు.. మామూలే.. అడ్డంకులు ఈ సమాజంలో.
అక్కలిద్దరూ పుస్తకాల పురుగులు. ప్రాథమిక విద్య నుండి చదువులో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత. ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా అమ్మ నాన్న మమ్మల్ని పెంచారు. నాకు చదువుతో పాటు ఆటపాటలంటే ఇష్టం. మా ఇంటికి దగ్గరే వుండే కలెక్టరేట్ మైదానంలో పరుగు పందేల సాధన చేసే దాన్ని. అనుకోకుండా అక్కడ మగపిల్లలు ఆడే ఆటల పై నా దృష్టి పడింది. నేనెందుకు బాక్సర్ కాకూడదనే మీమాంస నాలో మొదలైంది . పట్టుమని పదేళ్లు నిండని నాకు నాడే నా లక్ష్యం కళ్ళల్లో మెదిలింది. రోజూ పరుగు కోసం పోవటం బాక్సింగ్ వైపు చూడటం లోలోన మథన పడటం నా వంతయింది. నాన్న కి చెబితే ఏమంటాడో అమ్మకి చెబితే ఏమంటుందో అనే బెంగ లోలోన.
నాన్న సంవత్సరాంతర సెలవులకి మా ఇంటికి వచ్చారు. ఒక రోజు నాన్న జమీల్ తో పాటు మైదానానికి వెళ్ళాను. ముందే ఒక ప్రణాళిక ప్రకారం నా మనసులో మాట చెప్పాలనే నాన్న నీ తీసుకెళ్ళాను. రన్నింగ్ ప్రాక్టీసు అయిపోగానే నేనూ నాన్న ఓ వేప చెట్టు కింద కూర్చున్నాం. ఇంతలో నాన్న స్నేహితుడు గౌస్ వచ్చాడు సలాం వా లేకూం అనుకుంటూ. ఆలింగనం చేసుకుంటూ చిన్న నాటి ముచ్చట్లు, గల్ఫ్ ముచ్చట్ల లో వారిద్దరూ. నా చూపులు మాత్రం దూరంగా జరుగు తున్న బాక్సింగ్ ప్రాక్టీసు వైపు.. నాన్న కి ఎలా చెప్పాలనే ఆలోచనల్లో నా పదకొండేళ్ల బుర్ర అస్తవ్యస్తం. ఏదైతే అదైందని నా మనసులో మాటను అబ్బా! మై బాక్సర్ బనూంగి,! అని చెప్పేసాను. ఒక్కసారి గా నాన్న నివ్వెర పోయారు . ఏమడుగుతున్నావ్! నీకేమైనా మతి పోయిందా! ఆడపిల్లవు బాక్సింగ్ ఎలా చేస్తావు అని ప్రశ్నల వర్షం కురిపించాడు. పక్కనే కూర్చుని మా సంభాషణ చూస్తున్న గౌస్ మామ కలుగ చేసుకుని నీకు నిజంగా ఆసక్తి పట్టుదల ఉంటే నేను నిన్ను బాక్సర్ ను చేస్తా అన్నారు. ఇదేంటి గౌస్ మామ ఇలా అంటున్నారు ఈయనకి బాక్సింగ్ కి ఏం సంబంధం అనుకుంటుంటే ఏం ఆలోచిస్తున్నావు నేను బాక్సింగ్ కోచింగ్ ఇస్తున్నాను అని తనకు తాను పరిచయం చేసుకున్నాడు. అప్పటిదాకా గౌస్ మామ బాక్సర్ అనే విషయం నాకు తెలియదు .
నిజామాబాద్ డిచ్ పల్లి మీదుగా వెళ్లాల్సిన మన్మాడ్ రైలు మార్గం సిర్నాపల్లి మీదుగా వెళ్లినట్లు అథ్లెట్ కావాల్సిన నేను బాక్సింగ్ వైపు వెళ్ళాను. రైలు మార్గం మళ్ళింపు వెనుక సిర్నాపల్లి రాణి సీలం జానకి బాయి ప్రోద్బలం వుంటే నా వెనుక నా ఆత్మ విశ్వాసం మాత్రమే వుంది. ఆరంభంలో బాక్సింగ్ దుస్తుల ను వీధిలోని వారు చూచి పెదవి విరిచారు. ఆడపిల్ల కి బాక్సింగ్ ఏమిటి పెళ్ళి చేసి అత్తారింటికి పంపక అని గుసగుసలు. గౌస్ మామ సలహాలు సూచనలు తుచ తప్పకుండా పాటిస్తూ బాక్సింగ్ ప్రాక్టీసు మొదలెట్టాను. మహబూబ్ గంజ్ గడియారం నాకు సమయపాలన నేర్పింది. నా విశాల దృక్పథం వ్యక్తిత్వం కోచ్ ల సలహాలు సూచనల మేళవింపు తో ముందుకు కదిలాను.
రోజూ ఉదయాన్నే లేచి టీ షర్ట్ పొట్టి నిక్కర్ వేసుకుని బైటికి వెళ్తుంటే నా మతస్తులే నన్ను అవహేళన చేసేది. ముస్లింలలో చెడ బుట్టింది. సంప్రదాయాన్ని మంట గలుపుతుందని దాడి చేసినంత పని చేసేది. వేళకి నమాజ్ చేసుకుని పరదా మాటున వుండాల్సిన పిల్లని బాక్సింగ్ అంటూ జనాల్లో తిప్పుతున్నావని నాన్నని మసీదులో పెద్దలు హెచ్చరించే వారు. ఒక చెవిన విని మరో చెవిన వదిలి పెట్టే వారు నాన్న. అమ్మ కి చుట్టుపక్కల అమ్మలక్కల చెవి కొరుకుడు ఎక్కేది కాదు. ఇంట్లో మంచి రుచి గల వంటలు మాంసాహారం బిర్యానీ లు వండినా నా కోసం నా డైట్ యే వండి పెట్టేది. నా ముఖం పై పంచ్ లతో గాయాలయితే కన్న తల్లి మనసు తల్లడిల్లి పోయేది.. ముఖం వాస్తే అందం సన్నగిల్లితే పెళ్ళి కాదేమో ననే ఆదుర్దా అమ్మలో. ఒక్కసారి బాక్సింగ్ ఛాంపియన్ అయితే వరుసలో మగపిల్లలు స్వయంవరం ప్రకటనలా ఇంటికే వస్తారంటే అమ్మ గలగల పారుతున్న గోదావరిలా నవ్వేది. నాలో నా నేల ఆత్మ స్థైర్యం ఎక్కువని నాన్న కితాబు ఇచ్చేవారు.
బాక్సింగ్ లో తొలి మెళకువలు నేర్చుకున్నాక మంచి కోచింగ్ కోసం హైదరాబాద్ కి వచ్చాము. షేక్ పేట్ లో ఇల్లు. డాబా పైకి ఎక్కితే ఎత్తైన గోల్కొండ కోట నాలో ఉత్తేజాన్ని నింపేది. నేను పుట్టిన పట్టణానికి గోల్కొండ రాజు నిజాం ఉల్ హక్ పేరు మీద పెట్టిందే. నిజామాబాద్ నుండి హైదరాబాద్ ప్రయాణం ఒక ప్రయాణం గా కాక ఓ చరిత్ర సృష్టించాలి గోల్కొండ లా అని మనసులో అనుకున్నా. పోరాడు చదువుతూ పోరాడు లక్ష్యం కోసమని తలంచి డిగ్రీ లో చేరాను. బాక్సర్ స్లగ్గర్ స్వార్మర్ శైలులు నేర్చుకునే పనిలో నా శారీరక మానసిక లక్షణాలను బట్టి నాలో పరిపూర్ణత సాధించుకుంటూ ముందుకు సాగుతున్నాను. ఈ శైలులు ఒక దాని పై ఒక ప్రయోజనం ప్రతికూలత వుంటుంది. అది అర్ధం చేసుకునే రీతిలో నా కోచ్ లు బాగా తర్ఫీదు ఇచ్చారు. అక్కలిద్దరూ ఫిజియో థెరపిస్టులు గా స్థిర పడ్డారు. చెల్లెలు బ్యాడ్మింటన్ లో శిక్షణ తీసుకునేది. దుబాయ్ కి తన కుటుంబాన్ని వదిలి వెళ్ళి నాన్న సంపాదించిన సొమ్ము తో నా శిక్షణ సజావుగానే సాగేది. పద్నాలుగు సంవత్సరాల ప్రాయంలో జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ గెలవడంతో నాలో ఆత్మ విశ్వాసం రెట్టింపైంది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఒలింపిక్స్ కి వెళ్ళాలనే తాపత్రయం నాలో కలిగింది. భుజం గాయంతో బాధ పడినా శస్త్ర చికిత్స తో కోలుకుని సంవత్సరం తర్వాత మళ్ళీ ప్రాక్టీసు మొదలెట్టాను. కరోనా లాక్ డౌన్ లో మా యింటి టెర్రస్ పై ప్రాక్టీస్ చేస్తుంటే తారామతి బారాదరి నృత్య కళా వేదిక స్ఫూర్తి ని కలిగించేది. గోల్కొండ టోంబ్స్ నిర్మాణ శైలి తరాలు గా నిలిచి పోయినట్లే నా ఆట తీరు మన్ననలు అందుకోవాలనే ఆరాటం నాలో తన్నుకు వచ్చేది. గోల్కొండ నలు దిక్కుల నాలుగు దర్వాజలు ఏ దర్వాజ గుండా వెళ్ళినా కోట దగ్గరి కెళ్ళినట్టే నేను ఎటునుండి వెళ్ళినా గెలుపు తీరాన్ని చేరాలనుకునే దాన్ని.
రోజూ బాక్సింగ్ వీడియో లు చూస్తూ నాలోని తప్పొప్పులను దిద్దుకునే దాన్ని. నేను ఆత్మ రక్షణ లో వున్నా ఎదుటి వారిని అంచనా వేయటం లో వారి మానసిక లక్షణాలను పసిగట్టి వారి రిథం ను గ్రహించటం అలవాటు చేసుకున్నాను. నా స్ట్రెయిట్ పంచ్ లను బలంగా వేస్తూ కోచ్ ల ప్లాన్ ఎ బి సి డి లను తప్పక అనుసరించే దాన్ని. నేను ఎడమ వైపు నుండి బాగా దాడి చేయగలను. హుక్ లు తక్కువే అయినా స్ట్రెయిట్ షాట్ లతో గెలిచే వ్యూహాన్ని పన్నుతాను. నాలోని సాంకేతికత క్లీన్ పంచ్ లు ఫేడ్ అవే మూవ్ లు ఫుట్ వర్క్ నా బలం. ప్లాన్ సి నుండి డి కి క్షణాల్లో మారే చైతన్యం నా సొంతం. కంఫర్ట్ జోన్ లో చిక్కుకోకుండా సిల్హౌట్ లు సంధించే నేర్పరితనం నన్ను రింగ్ లో ఎదురు లేకుండా చేసేది. నా వేగవంతమైన మెదడు తీసుకునే చర్య ప్రతిచర్య ల మేళవింపు నన్ను సాన బట్టింది.
నా లోని పోరాట పటిమ ఎవరినైనా ఎదిరించగలదనే ధృడ సంకల్పం లక్ష్యం దిశగా నడుస్తుంటే వివక్షల నెదుర్కున్నాను. ప్రాంతం కులం మతం భాష యాస రాజ్యమేలుతున్న వ్యవస్థ లో ఎదురీదాలని తెలిసే అడుగులు బలంగా వేస్తూ కదిలాను. అంచెలంచెలుగా ఎదిగి నేను నేడు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ గా బంగారు పతకాన్ని సాధించాను. నేనెవరిని అని ప్రశ్నించి అవహేళన చేసిన వారికి ఈ బంగారు పతకమే జవాబు నేనే నిఖత్ జరీన్.
గోపి చిన్న పిల్లాడు. అతడు తన పూల తోట లోనికి వెళ్ళాడు. అక్కడ చాలా పూల మొక్కలు అందంగా రకరకాల రంగులతో ఉన్నాయి.ఇంతలో ఒక పూలమొక్క గాలికి అడ్డంగా అటూ,ఇటూ ఊగుతోంది.
గోపీకి ఒక సందేహం వచ్చింది.
ఇంతలో అక్కడకు అతని తాతయ్య వచ్చాడు. అప్పుడు గోపి తాతయ్య తో” చూడు తాతయ్యా! ఈ మొక్క గాలికి అడ్డంగా అటూ, ఇటూ ఊగుతుంది. దీని అర్థం ఏమిటి?” అని ప్రశ్నించాడు?
అప్పుడు తాతయ్య” ఇది నీకు భయపడి తనను తొలగిస్తావనుకొని తొలగించవద్దని అడ్డంగా ఊగుతోంది రా! . అంతే గాకుండా నేను చాలా మంచి మొక్కను. మీకు పూలు ఇస్తాను .నన్ను తొలగించవద్దని ప్రార్థిస్థున్నది ” అని అన్నాడు.
అప్పుడు గోపి “ఓహో! ఈ మొక్క ఇలా అడ్డంగా ఊగితే అర్థం ఇది అన్న మాట “అని బిగ్గరగా అన్నాడు. ఆ తర్వాత ” అయితే తాతయ్యా! దీనిని మనం తొలగించడం లేదు .అంతేకాదు. ఇలాంటి మొక్కలు ఇంకా కొన్ని కూడా తెచ్చి నాటుదాం” అని
అన్నాడు.గోపి అలా అనడమే కాకుండా మరి కొన్ని మొక్కలు కూడా తెచ్చి ఆ తెల్లవారి నాటాడు.గోపి చేసిన పనికి తాతయ్య ఎంతో సంతోషించాడు.
మరొక రోజు గోపి తోట లోకి వెళ్లి తాతయ్యను పిలిచి ” తాతయ్యా! ఈ మొక్క అడ్డంగా కాకుండా నిలువుగా ఊగుతుంది . మరి దీని అర్థం ఏమిటి” అని ప్రశ్నించాడు? అందుకు తాతయ్య” గోపీ! నిన్ను ఆ మొక్క తన దగ్గరకు రమ్మని పిలుస్తోంది రా! తనను ఇక్కడనుండి తొలగించమని అది ప్రాధేయ పడుతోంది! “అని అన్నాడు. అప్పుడు గోపి “తాతయ్యా ! మొక్కలను తొలగించవద్దని మీరే చెప్పారుగా” అని అన్నాడు. ” అవును గోపీ! నీవన్నది నిజమే! కానీ ఇది కలుపు మొక్క. ఇతర మంచి మొక్కలకు నీరు ,ఎరువు అందకుండా ఇది చెరుపు చేసేది. ఇది మంచిమొక్కలను ఎదగనీయదు.అందుకే తనను తీసేయమని ఇది నీకు భయపడి నిన్ను ముందే వేడుకొంటోంది .ఇలాంటి వాటిని మనం తీసేయాలి రా!” అని అన్నాడు. ” అయితే దీనిని తొలగిద్దాం తాతయ్యా! ” అని అన్నాడు గోపి.” అవును !ఇలాంటి వాటిని తొలగిస్తే మంచి మొక్కలు ఎదిగి మన తోటలో చక్కని పూలు పూస్తాయి” అన్నాడు తాతయ్య.
మళ్లీ గోపి “మరి పూవులను మొక్కలనుండి తెంప కూడదా తాతయ్యా! ” అని ప్రశ్నించాడు ? “వద్దు. తెంపకూడదు. మనకు అత్యవసరమైనపుడు మాత్రమే ఒకటో, రెండో తెంపుకోవాలి.ఆ రంగు రంగుల పూలు మన కళ్ళకు ఎంతో అందంగా కనబడతాయి . వీటిని మనం మొక్కల నుండి వేరు చేయకూడదు. అవి మనకు కమ్మని సువాసనను, మంచి గాలిని ఇస్తాయి. మనం స్వార్ధం తో వీటి అన్నింటినీ ఒకేసారి తెంపకూడదు “అని అన్నాడు తాతయ్య. గోపి” సరే తాతయ్యా! నా సందేహాలు నివృత్తి అయినాయి. మీకు కృతజ్ఞతలు.మీరు చెప్పినట్లే నేను చేస్తాను ” అని అన్నాడు.
పిల్లలూ! అందుకే పూల మొక్కలను నాటి ప్రకృతి అందాలను కాపాడి పర్యావరణానికి తోడ్పడాలి.
సాయంత్రం కావొస్తుంది. గది కిటికీ పక్కనే కూర్చున్న రిజ్వానా దీర్ఘ ఆలోచనల్లో మునిగిపోయి ఉంది. అస్తమిస్తున్న సూర్యుడు తన లేత నారింజ రంగును భూమంతా పరిచాడు. ఆ వెలుగు పడిన పరిసరాలు మరింత ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి. సన్నగా వీస్తున్న చల్లటి గాలి ఆమె ముఖాన్ని మెత్తగా తాకుతోంది.
అదే పాత రిజ్వానా అయితే ఆ దృశ్యాలను మనసారా ఆస్వాదించేది. కానీ ఇప్పుడు ఆమె మనసు మనసులో లేదు. ఆమె, ఆమెనే కాదసలు. కొద్ది రోజుల్లోనే అంతా మారిపోయింది. నిత్యం ఆత్మవిశ్వాసం తొణకిసలాడే ఆమె కళ్ళల్లో ఇప్పుడు శూన్యం నిండుకుంది.
ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎటూ దిక్కు తోచడం లేదు. తననే నమ్ముకున్న తల్లి, ఇద్దరు చెల్లెళ్లు. ఇల్లు పట్టకుండా తిరిగే తండ్రి. అన్నింటినీ మించి తన కడుపులో పడిన నలుసు గురించిన బాధ స్థిమితంగా ఉండనీయడంలేదు. సరిగ్గా ఊపిరైనా పోసుకోని ఆ నలుసును తలచుకుంటే రిజ్వానాకు ఊపిరాడ్డం లేదు. తామిద్దరి ప్రతిరూపం తన కడుపులో అంకురించింది.
కానీ స్నేహితులు ‘రానివాడి రూపెందుకు? అబార్షన్ చేయించుకో’ అని సలహాలిస్తున్నారు. బంధువులైతే ‘నీచమైన పని చేసావ్’ అంటూ చీదరించుకున్నారు. ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని తికమకలో తనతో తానే పోరాటం చేస్తుంది. తనలాగే ఈ లోకాన్ని చూడబోయే ఆ అంకురాన్ని నలిపేయాలంటే మనసు రావడం లేదామెకు. ఇది ఆడవాళ్ళ బలమో బలహీనతో ఇదమిత్థంగా తేల్చుకోలేని గందరగోళ పరిస్థితి.
“లేదు నా రియాజ్ నా కోసం కచ్చితంగా వస్తాడు. ఎక్కడున్నా వస్తాడు. తండ్రి కాబోతున్నాడని తెలిస్తే కచ్చితంగా వస్తాడు. మళ్లీ పాత రోజులు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో బిడ్డను చంపుకోకూడదు” అని దృఢ నిశ్చయంతో అనుకుంది రిజ్వానా. అయినా ఎక్కడో చిన్న అనుమానం పొడసూపుతనే ఉంది.
“రియాజ్ రాకపోతే… ఎప్పటికీ రాకపోతే. ఈ బిడ్డ పరిస్థితి ఏంటీ? తండ్రి లేని బిడ్డగా పెరగాల్సిందేనా” భవిష్యత్తును తలచుకుంటే తల తిరిగిపోతుంది.
“ఏది నీ బడీ బేటీ… నీ ప్యారీ బిడ్డా. ఎటు పోయింది. వాడెవడితోనే ప్రేమా ప్రేమా అంటూ తిరిగింది. వద్దంటున్నా వినకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి పెళ్ళి చేసుకుంది. చివరకు వాడు కడుపు చేసి ఎటో పారిపోయాడు. ఊళ్ళో నా పరువు తీసింది” బయట వరండాలో తండ్రి రంకెలు వేస్తూ ఇష్టమొచ్చినట్లుగా భార్య చెంపలు పగలగొడుతున్నాడు.
అదే గతంలోని రిజ్వానా అయితే కొట్టబోతున్న తండ్రి చేతిని పట్టుకుని ఆపేసేది. తల్లిపై ఒక్క దెబ్బ పడనిచ్చేది కాదు. ఎముకలు తప్ప చెంచా కండైనా లేని తల్లి భరించలేక ఆర్తనాదాలు పెడుతున్నా రిజ్వానా బలవంతంగా తనను తాను ఆపుకుంటూ మౌనంగా ఉండిపోయింది.
“పైసా సంపాదించవు. ఆడపిల్ల జీతంపై బతుకుతున్నావు. నీకెక్కడిదిరా పరువు. నువ్వు నా కూతుర్ని అనేంత మగాడివా” అని భర్తను నిలదీయాలని వుంది ఆమెకూ. కానీ ఆ పని చేయలేదు.
పెండ్లయిన కొత్తలోనే భర్త తాగొచ్చి కొడుతుంటే పుట్టింట్లో ఎన్నో సార్లు చెప్పుకుంది. అతన్ని మార్చడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. తాగుబోతోడు ఎవరి మాట వింటాడు. పైగా మూర్ఖుడు. అందుకే వాళ్ళూ చేతులు దులుపుకున్నారు.
“మొగుడు కొట్టినా తిట్టినా పడుండాలి. మేమేం చేయగలం. నిన్ను కన్నాము గానీ నీ తలరాతను కనలేముగా. చావైనా బతుకైనా అతనితోనే” పుట్టింటికి వచ్చిన ప్రతిసారీ తండ్రి బలవంతంగా భర్త దగ్గరకు పంపేవాడు.
ఆ మాటలు ఆమె చెవిలో అలా ఉండిపోయాయి. దెబ్బలకు అలవాటు పడిన ఆమె శరీరం పుట్టింటి సంగతే మరచింది. ముగ్గురు ఆడపిల్లలకు తల్లయింది. ఆమె కష్టాలు మరింత పెరిగాయి. అబ్బాయిని కనలేదని హింసించేవాడు. అయితే పెద్ద కూతురు రిజ్వానా కాస్త ఎదిగిన తర్వాత తండ్రిని ఎదిరించడం మొదలుపెట్టింది. “అమ్మీ… అబ్బా అలా కొడుతుంటే నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడవేంటి?” అడిగేది రిజ్వానా.
“చావైనా బతుకైనా మొగుడితోనే” అన్న తండ్రి మాటలు గుర్తు చేసుకుని మౌనంగా ఉండిపోయేది. అమాయకమైన తల్లిని చూసి రిజ్వానాకు జాలిపడాలో, కోప్పడాలో అర్థమయ్యేది కాదు.
తండ్రి ఇల్లు పట్టించుకోకపోయినా రిజ్వానా కష్టపడి డిగ్రీ పూర్తి చేసింది. పై చదువులు చదవాలని ఉన్నా కుటుంబం కోసం ఉద్యోగంలో చేరింది. ఇద్దరు చెల్లెళ్ళను చదివిస్తుంది. ఆడపిల్ల అయినా కుటుంబాన్ని పోషించేది. ఎవరి మాటనూ లెక్క చేయని తండ్రి ఉద్యోగం చేసి, డబ్బు సంపాదించే రిజ్వానాని చూస్తే మాత్రం భయపడతాడు. కానీ ఆడపిల్ల గడపదాటి బయటకు వెళ్ళడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. పైసా సంపాదించడు. పైగా రిజ్వానా తన మాట వినదని తెలుసు. కూతురు ఎదురైతే కొరకొరమని చూస్తాడు. ఏమీ చేయలేక నోరు మూసుకుని ఉంటాడు.
అలాంటి అతనికి ఇప్పుడు కూతురంటే భయం లేదు. ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. దీనంతటికీ కారణం రియాజ్. తన జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని రిజ్వాన కలలో కూడా అనుకోలేదు. అన్ని విషయాల్లో తెలివిగా వ్యవహరిస్తూ ధైర్యంగా ఉండే రిజ్వానా అలా ఎలా చేసిందో తల్లికి కూడా అర్థం కావడం లేదు.
సరిగ్గా ఏడాది కిందట తను పని చేసే చోటనే రియాజ్ ను చూసింది. తొలి చూపులోనే బాగా నచ్చేశాడు. చూపు తిప్పుకోలేని అందం రిజ్వానాది. అందుకే రియాజ్ ఆమెను కలవడానికి రోజూ అక్కడకు వచ్చేవాడు. రియాజ్ కూడా అందంలో తక్కువేం కాదు. ఓ రోజు ధైర్యం చేసి రిజ్వానాని పలకరించాడు. అతని పలకరింపు కోసమే ఎదురుచూస్తున్నట్టు వెంటనే స్పందించింది. ఆ పలకరింపే వారి మధ్య పరిచయానికి నాంది పలికింది.
మెల్లిమెల్లిగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. రియాజ్ ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవాడు. అప్పటి వరకు ఇల్లూ, చెల్లెలు, తల్లీ బంధాలను మోసిన రిజ్వానాకు అతని పలకరింపులో ఓదార్పు కనిపించింది. కష్టాల్లో పాలుపంచుకుంటానని ధైర్యం చెప్పాడు. ఇద్దరం పెండ్లి చేసుకుందామన్నాడు. అతని మాటలు పూర్తిగా నమ్మింది. ఇద్దరూ దగ్గరయ్యారు. ఆరు నెలలు హాయిగా గడిపేశారు.
వీరి ప్రేమ గురించి చుట్టు పక్కల అందరికీ తెలిసిపోయింది. దాంతో రిజ్వానా పెండ్లి చేసుకుందామని తొందరపెట్టింది. రియాజ్ విషయం ఇంట్లో చెప్పాడు. కానీ ఒప్పుకోలేదు. పైగా ఆ పెండ్లి చేసుకుంటే చచ్చిపోతామని బెదిరించారు. భయపడ్డ రియాజ్ అప్పటి నుంచి రిజ్వానాకు ముఖం చాటేశాడు. అతన్ని కలవడానికి, ఏం జరిగిందో తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. ఎంత ప్రయత్నించినా రియాజ్ దొరకలేదు. చివరకు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది.
పోలీసులు రియాజ్ ను, అతని తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. పోలీసులకు భయపడి పెండ్లి చేసుకున్నాడు. అతని తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో పోలీసులే మాట్లాడి వేరు కాపురం పెట్టించారు.
పెండ్లి తర్వాత రిజ్వానా ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండేది. అక్కడ తల్లి, చెల్లెళ్ళ పరిస్థితి దారుణంగా తయారయింది. ‘నా సుఖం నేను చూసుకొని వచ్చేశాను. అమ్మా, చెల్లెళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో’ అని ఆవేదన చెందింది. వాళ్ళ కోసం రిజ్వానా మళ్ళీ ఉద్యోగంలో చేరతానంటే భర్త ఒప్పుకోలేదు. తల్లినీ, చెల్లెళ్ళను ఆదుకోవడం కోసం ఆమె రియాజ్ కు చెప్పకుండా ఉద్యోగంలో చేరిపోయింది. దాంతో ఇద్దరికీ గొడవ జరిగింది. అసలే అవకాశం కోసం ఎదురుచూస్తున్న రియాజ్ తల్లిదండ్రులకు ఇదొక సాకుగా దొరికింది. వద్దన్నా ఉద్యోగంలో చేరిందని కొడుక్కు లేనిపోనివి చెప్పారు.
‘ఇలాంటి పిల్ల మనకు వద్దు. దాన్ని ఎలాగైనా వదిలించుకో, నీకు మంచి సంబంధం చూసి మళ్ళీ పెళ్ళి చేస్తాం’ అనేవారు. అటు కన్న వాళ్లకు ఎదురు చెప్పలేక, పెండ్లి చేసుకున్న రిజ్వానాను వదిలేస్తే పోలీసులు ఏం చేస్తారో అనే భయంతో ఎవరికీ చెప్పకుండా ఎటో పారిపోయాడు.
రియాజ్ వెళ్ళిన కొద్ది రోజులకే తను తల్లికాబోతుందని తెలిసింది. ఈ విషయం అతనికి చెప్పడానికి ఎన్నోసార్లు ఫోన్ చేసింది.
కానీ ఫోన్ పని చేయలేదు. చివరకు మళ్ళీ పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. ‘ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాము. మావాడిని వదిలి వెళ్ళమనండీ’ పోలీసులు పిలిపించి మాట్లాడితే రియాజ్ తండ్రి జవాబు ఇది.
‘నాకు డబ్బు వద్దు, నా కడుపులో బిడ్డకు తండ్రి కావాలి, నేను నా భర్తతోనే కలిసి బతుకుతాను’ అంది. ఆమె కన్నీళ్ళకు కాస్త కూడా కరగని అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి మళ్ళీ అత్తమామల కాళ్ళు పట్టుకుంది. అయినా ఆ కఠిన హృదయాలు చలించలేదు. చేసేది లేక ఏడ్చుకుంటూ పుట్టింటికి చేరింది.
‘మీ అమ్మాయిని మొగుడు వదిలేసి ఎటో వెళ్ళిపోయాడంట కదా. అందర్నీ ఎదిరించి ప్రేమించి పెళ్ళి చేసుకుంది. నేను సంపాదిస్తున్నాను కదా అంటూ తండ్రినే లెక్కచేసేది కాదు. ఇప్పుడేమయింది? ఆకొచ్చి ముల్లు మీద పడ్డా, ముల్లొచ్చి ఆకు మీద పడ్డా నష్టం ఆకుకే. అందుకే ఆడపిల్ల హద్దుల్లో ఉండాలి’ అంటూ తల్లి దగ్గరకు వచ్చి నీతులు చెప్పే వారు చుట్టుపక్కల వాళ్ళు. వాళ్ళంతా ఒకప్పుడు రిజ్వానాను చూసి మురిసిపోయిన వాళ్ళే.
“మీ అమ్మాయికి ఎంత ధైర్యం. కొడుకులు లేకపోయినా నీకు ఆ లోటు తీర్చింది నీ బిడ్డ. ఇలా కుటుంబం కోసం ఆరాటపడే ఆడపిల్లలు ఎంత మంది ఉంటారు. నిజంగా నూ అదృష్ట వంతురాలివి” అని రిజ్వానా తల్లితో తెగ చెప్పే వారు. ఇప్పుడేమో ఇలా నోటి కొచ్చినట్టు మాట్లాడుతుంటే ఆ తల్లి మనసు తట్టుకోలేకపోయింది.
ఇప్పుడు కూతురికి మూడో నెల. తమకు అండగా ఉంటుందనుకున్న బిడ్డ ఇలా ఢీలా పడేసరికి ఆ తల్లికి ఏం చేయాలో తోచడం లేదు. నలుగురూ అంటున్న మాటలు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని ఓ సారి ఆ ప్రయత్నం కూడా చేసింది. తల్లి కాళ్ళా వేళ్ళా పడి బతిమలాడితే మనసు మార్చుకుంది. ఇక ఎప్పుడూ దిగాలుగా తన గది కిటికీ దగ్గర కూరొచ్చి ఆలోచిస్తూనే ఉంటుంది.
“దీదీ… అబ్బా అమ్మీని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు. మేం ఎంత చెప్పినా వినడం లేదు. నూ ఒకసారి బయటకు వచ్చి నాన్నను ఆపు” రిజ్వానా పెద్ద చెల్లెలు ధైర్యం చేసి అక్క దగ్గరకు వచ్చి బతిమలాడింది. .
“ఇప్పుడు నాన్న నా మాట వింటాడా. నేను చేసిన తప్పు అలాంటిది. నోరు తెరిచి మాట్లాడే హక్కు నాకు లేదు” అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ అలాగే మంచంపై ఒరిగింది.
ఓపికున్నంత సేపూ రంకెలేసిన తండ్రి అలసిపోయి పడుకున్నాడు. ఇల్లంతా నిశ్శబ్దం. ఆ ఇంట్లో ఎవరి ముఖాల్లో జీవం లేదు. ఒకప్పుడు ఆ ఇల్లు ఎలా ఉండేది. రిజ్వానా చేసే అల్లరితో సందడి సందడిగా ఉండేది. ఇంట్లో అందరి కన్నా పెద్ద పిల్ల అయినా చిన్న పిల్లలా సరదాగా ఉండేది.
“ఇక ఈ బతుకు బతకడం అనవసరమా? చావు మాత్రమే నా సమస్యకు పరిష్కారం” అనే నిర్ణయానికి వచ్చింది రిజ్వానా. మెల్లగా లేచి తన గది తలుపు తీసుకుని బయటకు వచ్చింది. తల్లిని చివరి చూపు చూసుకుందామని వెదికింది. వంటగది బయట తలుపుకు ఆనుకుని నిద్రపోతుంది. భర్త కొట్టిన దెబ్బలకు అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. అలాగే నిద్రపోతోంది. పక్కనే తన ఇద్దరు చెల్లెళ్ళు అమాయకంగా నిద్రపోతున్నారు. వాళ్ళను ఆ స్థితిలో చూసి రిజ్వానా దుఖం ఆగలేదు.
‘వీళ్ళను ఇలా వదిలేసి నా చావు నేను చస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి?’ అని ఒక్క క్షణం ఆలోచించింది. మళ్ళీ వెళ్ళి దిండులో తల దూర్చి వెక్కి వెక్కి ఏడుస్తూ ఎప్పుడు నిద్రపోయిందో తనకే తెలియదు.
కిటికీ నుండి వెచ్చగా పడుతున్న సూర్య కిరణాల వేడిమి భరించలేక కండ్లు తెరిచింది. మళ్ళీ అవే ఆలోచనలు చుట్టుముట్టాయి. స్నేహితురాలు మున్ని పరుగులాంటి నడకతో వచ్చింది.
“మామీ… మామీ… రిజ్వానా ఏదీ? ఎక్కడుంది..?” అంటూ కంగారుగా అడిగింది.
ఆ కంగారు చూసి భయపడ్డ ఆమె “ఏమైంది మున్నీ.. ఎందుకంత కంగారుగా ఉన్నావు. అసలేం జరిగింది. నాకు చెప్పు” అంది.
“లేదు మామీ…. రిజ్వానాకే చెప్తా… గదిలోనే ఉందా…” అంటూ అటువైపుగా పరిగెత్తింది. లోపల నుండి మున్నీ మాటలు వినిపించిన రిజ్వానానే ఆత్రంగా బయటకు వచ్చింది.
“ఏంటి మున్నీ… రియాజ్ గురించి ఏమైనా తెలిసిందా. తను నిన్ను కలిశాడా. నా గురించి తనకు చెప్పావా. నా కోసం వస్తానన్నాడా..?” అంటూ ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపించింది.
“రియాజ్ పై ఎంత ప్రేమ ఈమెకు. అతనిపై ఎంత నమ్మకం పెట్టుకుంది. ఇప్పుడు ఈ విషయం చెప్తే ఏమైపోతుందో ఏమో? కానీ చెప్పకపోతే ఎలా… చెప్పాల్సిందే. లేకపోతే ఇలా భ్రమల్లోనే బతికేస్తుంది” అని ధైర్యం తెచ్చుకుంది.
“లేదు రిజ్వానా తను నన్ను కలవలేదు. కానీ రియాజ్ మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడంట. వాళ్ళ అమ్మానాన్ననే ఎవరికీ తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా ఊళ్ళో పెళ్ళి చేసి సైలెంట్ గా ఇక్కడకు తీసుకొచ్చారు. పెళ్ళి జరిగి కూడా పది రోజులయ్యిందంట” అని చెప్పింది.
ఆ మాటలు విన్న ఆమెకు నెత్తిన పిడుగుపడ్డట్టు అనిపించింది. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గుండెలు పగిలేలా ఏడుస్తూనే ఉంది. మళ్ళీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది.
కూతురు ఎలాంటి అఘాయిత్యం చేసుకుంటుందో అని బయట తల్లి తల్లడిల్లిపోయింది. దబదబా తలుపులు బద్దలు కొట్టి లోపలికి పోయింది. రిజ్వానా కుక్కిమంచంలో పడి ఏడుస్తూనే ఉంది. “ఏమీ చేసుకోనని నాకు మాట ఇవ్వు రిజ్వానా” అంటూ తల్లి కన్నీళ్ళు పెట్టుకుంది.
“ఈ విషయం చెప్పడానికే మా అబ్బాకు తెలియకుండా మీ ఇంటికి వచ్చాను. ఇక్కడికి వచ్చానని తెలిస్తే ఇంట్లో నన్ను చంపేస్తారు. నేను మళ్ళీ వస్తా” అని మున్నీ వెళ్ళిపోయింది.
రియాజ్ గురించి తెలిసి కూతురు ఏం చేసుకుంటుందో అని ఆ తల్లి భయపడింది. ఆ రోజంతా బిడ్డను క్షణం కూడా వదిలిపెట్టలేదు. రిజ్వానా రోజంతా ఏడుస్తూనే ఉంది. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. రాత్రి పది దాటింది. తల్లి ఎంత బతిమలాడినా మెతుకు ముట్టుకోలేదు.
“అమ్మీ… కొద్ది సేపు నన్ను ఒంటరిగా వదిలెయ్, ఊరికూరికే తినమని విసిగించకు. నేనేమీ చేసుకోనులే, నువ్వెళ్ళి తినుపో” అంది చిరాగ్గా.
కొద్దిసేపు వదిలేస్తే మనసు కుదుటపడుతుందిలే అని తల్లి వచ్చేసింది. ఏమీ తినకుండా గ్లాసుడు నీళ్ళు తాగి అలా నడుం వాల్చింది. బాగా అలసిపోయింది వుంది. అయినా నిద్ర పట్టడం లేదు. రాత్రి పన్నెండు అయ్యింది.
రిజ్వానా గదిలో ఏదో అలికిడైనట్టు వినిపించి అటువైపు వెళ్ళింది. ఉరి వేసుకోవడానికి చున్నీని ఫ్యానుకు కడుతుంది రిజ్వానా. అది చూసి తల్లి గుండెలు బాదుకుంది.
“అంత పని చేయకే తల్లీ, మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా, నిన్నే నమ్ముకున్న మేము ఎలా బతకాలి” అంటూ వెళ్ళి కూతురి కాళ్ళు పట్టుకుంది. ఉదయం తలుపు పగలకొట్టడంతో రిజ్వానాకు లోపలి నుండి గడియ పెట్టుకునే అవకాశం లేకుండా పోయింది.
“అమ్మీ… అసలు నేనెందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? నా వల్ల కావడం లేదు. అందర్నీ ఎదిరించి పెండ్లి చేసుకున్నాను. ఎవరికీ సుఖం లేకుండా పోయింది. ఇన్ని రోజులు రియాజ్ వస్తాడని ఆశగా ఎదురు చూశా. ఇక
రాడని అర్థమయింది. ఇక నేనెందుకు బతకాలి. ఈ బిడ్డను ఎలా బతికించాలి. నన్ను చావనీ అమ్మీ” అంటూ తల్లి గుండెలపై పడి పొగిలి పొగిలి ఏడ్చింది.
“నీ కడుపులో బిడ్డ కోసం బతకాలి. నీతో పాటు ఆ బిడ్డను కూడా చంపేస్తావా? నిన్ను నమ్ముకుని చెల్లెళ్ళు ఉన్నారు. మీ అబ్బా ఇల్లు పట్టించుకోడు. నువ్వు కూడా ఇలా చేస్తే మేమేం చేయాలి. చచ్చిపోవడమే నీ నిర్ణయమైతే అందరం కలిసే చద్దాం” అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది.
ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. వాళ్ళ ఏడుపు విని నిద్ర పోతున్న ఇద్దరు చెల్లెళ్ళు కూడా వచ్చారు. పరిస్థితి అర్థమై అమ్మనూ, అక్కనూ చుట్టుకొని వాళ్ళూ ఏడుపు మొదలుపెట్టారు.
అలా ఏడుస్తూ ఎప్పుడు నిద్రపోయిందో తెలీదు, రిజ్వానా కండ్లు తెరిచే సరికి ఎదురుగా స్వాతి. “స్వాతీ నువ్వేనా… ఎప్పుడు వచ్చావు. నువ్విక
రావేమో అనుకున్నాను. కోపంతో నా మొఖమే చూడవనుకున్నాను” అంటూ తలదించుకుంది.
“ఏంటే నువ్వు చేసిన పని. ఇదేనా రిజ్వానా అంటే. నా స్నేహితురాలు ఎలా ఉండేది. ఏంటిది? పిరికి దానిలా చావాలనుకుంటావా?” అంటూ కోప్పడింది.
“అమ్మీ నీకు అన్ని విషయాలు చెప్పినట్టుంది” అంది.
“అవును చెప్పింది. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను. అయినా నేను వున్నాననుకున్నావా లేదా? ఇంత జరిగినా నాకెందుకు ఒక్క మాట కూడా చెప్పలేదు” అంది మళ్ళీ కాస్త కోపంగా.
“ఎలా చెప్పమంటావే? అప్పుడు అంటే, నువ్వు ఎంత చెప్పారు. ఇంకా చదువుకో, ఇప్పుడే పెళ్ళి ఎందుకని. అంటీ అయితే మరీ మరీ బతిమలాడారు.
కానీ నేను మీ మాట వినలేదు. చివరకు అంకుల్ కూడా చెప్పారు. ఎవ్వరినీ లెక్క చేయలేదు. ఆంటీకి నా ముఖం ఎలా చూపించేది? అందుకే రాలేదు” సంజాయిషీగా చెబుతూ తలదించుకుంది.
“నీ మొహం. అమ్మ నీ గురించి ఎంత బాధపడుతుందో తెలుసా. అసలిప్పుడు నాతో పాటు అమ్మ కూడా నీ దగ్గరకు రావాలనుకుంది.
కానీ యూనివర్సిటీలో సెమినార్ ఉంది. అమ్మ డిపార్ట్ మెంట్ హెడ్ కదా.. కంపల్సరీగా ఉ ండాలి. అందుకే వెళ్ళాల్సి వచ్చింది. నిన్ను నాతో మాటు మా ఇంటికి తీసుకురమ్మంది. నాన్న కూడా ఇదే చెప్పారు.” అంది. “అవునా… అంటీ నా గురించి అడిగారా? నిజమేనా..?” అంటూ అత్రంగా అడిగింది రిజ్వానా. “నేను నీకు అబద్దం చెప్తానా” “లేదు, నువ్వెప్పుడూ అబద్దం చెప్పవు. అప్పుడు మీ మాట విని ఉంటే ఎంత బాగుండేదో” అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది.
“ఇప్పుడేం జరిగిందని ఇలా ఏడుస్తున్నావు? వాడు పోతే ఇక నీ జీవితమే పోయిందా? మేమంతా ఏంటి మరి?” కోప్పడింది స్వాతి.
“ఏడ్వక ఏం చేయమంటావే. తల్లినైతే రేపు నా బిడ్డ భవిష్యత్ ఏమిటి? ఎలా పెంచాలి? తండ్రి గురించి నిందించే లోకాన్ని నేనసలు ఎదుర్కొనగలనా?”.
“ఎవర్నే ఎదుర్కోవలసింది. ముందు నీకు నువ్వు సమాధానం చెప్పుకో చాలు. సూటి పోటి మాటలు అనే సమాజం గురించి ఆలోచించకు. అయినా మోసపోవడం కాదే తప్పు. మోసగించిన ఆ వెధవది. అటువంటి దరిద్రులదే తప్పంతా. ఇప్పుడు రోజులు మారిపోయాయే. ఇంకా బ్లాక్ అండ్ వైట్ సినిమా రోజుల్లోలా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. ఒంటరి తల్లులు ఎందరో ధైర్యంగా, ఇష్టంగా తమ బిడ్డలను పెంచుకుంటున్నారు. చివరకు పాస్‌పోర్టులో కూడా తండ్రి పేరు లేకుండా తల్లి పేరుతోనే విదేశాలకు వెళుతున్నారు. సర్టిఫికేట్లో తల్లి పేరు కోసం పోరాటం చేసి గెలిచిన
వారు ఎందరో ఉన్నారు. నీ బిడ్డకు తండ్రి లేడు. అయితే ఏం. తల్లి వుంది. తానే అవసరం ఉన్న చోట తండ్రిగా మారుతుంది. అది నువ్వే. ధైర్యంగా ఉండు. మేమంతా నీ ప్రతి కష్టంలో ఉన్నామని మరిచిపోకు”.
విశ్వాసంగా స్వాతి చెబుతున్న మాటలు ఎంతో ఊరటనిచ్చాయి. విషాద ఛాయల చీకటి అలుముకున్న ముఖంలో పున్నమి వెన్నెల వికసిస్తున్నది. అయినా చిన్న చిన్న భయాలేవో ఇంకా వదల్లేదు. తిరిగి ఇలా అడిగింది.
“నన్ను ఈ సమాజం బతకనిస్తుందా? అంతెందుకు మా నాన్నే నన్ను నీచంగా చూస్తున్నాడు”
“నాన్న గురించి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు. ముందు నువ్వేమీ తప్పు చేయలేదన్న నిజాన్ని నీ మనసుకు చెప్పు. ప్రేమించడం తప్పెలా అవుతుందే. అవతలి వాడికి నీ ప్రేమను పొందే అర్హత లేదన్న నిజాన్ని ముందు నువ్వు
అంగీకరించు. మళ్లీ నువు కోరుకున్న రోజులు నీ ముందుకు వస్తాయి. మళ్ళీ ఉద్యోగం మొదలుపెడితే మీ నాన్నను దారిలోకి తేవడం ఎంతసేపు చెప్పు”.
“నువ్వు చెప్పేది నిజమే కానీ..” అంటూ ఏదో అనబోయింది రిజ్వానా. “చూడవే.. అనవసరంగా ఏదేదో అలోచించి మైండ్ పాడుచేసుకోకు. ఇప్పుడు నీ జీవితానికి ఏం కాలేదు. ధైర్యంగా ఉండు. హాయిగా బతుకు” అంది స్వాతి.
“నువ్వు చెప్తుంటే ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. అసలు నేను ఇన్ని రోజులు ఇలా ధైర్యంగా ఉన్నానన్నా, అమ్మను హింసించే నాన్నను ఎదిరించి బతికానన్నా దానికి కారణం నీ స్నేహమే. నువ్విచ్చిన ధైర్యమే. ప్రేమ పిచ్చిలో పడి నిన్నూ, నా ధైర్యాన్ని ఇన్ని రోజులూ పోగొట్టుకున్నాను.
యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ ఆంటీ, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గిరిజన మహిళల కోసం ఎంత చేస్తున్నారు. అంత పెద్ద కుటుంబంలో పుట్టిన నువ్వు కూడా ఆంటీలాగే సమాజం అంటూ, సమస్యలంటూ పోరాడుతున్నావు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉంటావు. నీలాంటి స్నేహితురాలు ఉండడం నిజంగా నా అదృష్టం. కానీ నేను ఏం చేశాను? మీ మాటలు పట్టించుకోలేదు. నేను చేసిన చిన్న పొరపాటు నా జీవితం మొత్తాన్నే తలకిందులు చేసేసింది.” మళ్ళీ కన్నీళ్ళు పెట్టుకుంది.
“నీకెన్ని సార్లు చెప్పాలి. పాత విషయాలు గుర్తు చేసుకోకు. మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. ముందు ఆ ఏడుపు మానుకో. నీకు తెలుసుగా ఏడిస్తే నాకు నచ్చదని. అంతేకాదు. లోపల రూపుదిద్దుకుంటున్న బిడ్డకు అస్సలు మంచిది కాదు” అంది స్వాతి.
“అవును. నీకు ఏడిస్తే నచ్చదు. ఇక ఏడ్వనులే. నువ్వు చెప్పినట్టు కొత్త జీవితం మొదలుపెడతా. నువ్వు నా తోడుంటే చాలు. ఈ ప్రపంచాన్నైనా జయిస్తా. నా బిడ్డకు ధైర్యంగా జన్మనిస్తా. మంచి మనిషిగా తీర్చిదిద్దుతా. ఉ ద్యోగం చేసుకుంటూనే పై చదువులు చదువుకుంటాను. అమ్మను, చెల్లెళ్ళను కూడా చూసుకుంటాను. అంతే కాదు నీలా, అంటీలా సమాజం కోసం కూడా నాకు చేతనైనది చేస్తా. నాలా ప్రేమ పేరుతో మోసపోతున్న ఆడపిల్లలకు అండగా ఉంటా” గుండెల నిండా ఆత్మవిశ్వాసం నింపుకుని అంది రిజ్వానా.
“అద్దీ లెక్క! స్వాతీ ఫ్రెండంటే ఆశామాషీగా ఉంటుందా ఏమి? నాకు తెలుసు. నువ్వు తలచుకుంటే సాధించగలవు. నీకెలాంటి సాయం కావాలన్నా చేసేందుకు నేనూ. అమ్మా సిద్ధంగా ఉన్నాము” అంటూ స్నేహితురాలిని ఓ నిమిషం గాఢంగా కౌగిలించుకుని మంచంపై కూర్చోబెట్టి అన్నం ముద్దలు కలిపి పెట్టింది.
“అంటీ, దీన్ని కొన్ని రోజులు మా ఇంటికి తీసుకెళతాను. వాతావరణం కాస్త మారితే మనసు కాస్త కుదటపడుతుంది” “సరే స్వాతమ్మా… ఆ పని చెయ్యి. కొన్ని రోజులు నీతోనే ఉంచుకో” అంటూ బట్టలు సర్దే పనిలో పడింది రిజ్వానా
“అంతా ఓకేనే… మరి ఆ రియాజ్ ను అలా వదిలేయాల్సిందేనా” అంది రిజ్వానా. “అలా ఎలా వదిలేస్తాం. వాడి సంగతి నాన్న చూసుకుంటారు”.
“అవును స్వాతి. నిజమే… అంకుల్ లాయర్ కదా, ఆ సంగతే మర్చిపోయా. ఇలాంటి వాళ్ళకు కచ్చితంగా శిక్ష పడాలి. ఆడపిల్లల్ని ప్రేమించి మోసం చేస్తారు. మళ్ళీ పెండ్లి చేసుకుని హాయిగా బతికేస్తారు. చట్టాలంటే అసలు భయం లేకుండా పోయింది. ఎలాగైనా తప్పించుకోవచ్చని వీళ్ళ ధీమా. వీడికి అంకులే సరైన మందు. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉందే. నువ్వొచ్చి నాకు కొత్త ఊపిరి పోశావు” అంటూ నవ్వుతూ స్వాతి మెడచుట్టూ తన రెండు చేతులు వేసి అల్లేసుకుంది రిజ్వానా.