
పుస్తక సమీక్ష
‘‘యత్ర నార్యన్తు పూజ్యంతే` రమంతే తత్ర దేవతా:!
యత్రైతాస్తు స పూజ్యంతే ` సర్వాస్తత్రాఫలా:క్రియా: !!
శోచంతి జామయోయత్ర -వినశ్యత్యాశు తత్కులం!
నశోచంతితు యత్రైతా: `వర్ధతే తద్ధి సర్వదా !!
తస్మాదేతా సదా పూజ్యా: `భూషణాచ్ఛాదనాశనై : !!’’
మహిళలు గౌరవం పొందే స్థలంలో దేవతలు ఆనందంతో నిలుస్తారు. స్త్రీలను అగౌరవపరిచే వారికి ఏ పనులలోనూ మంచి ఫలితాలు లభించవు. ఏ స్త్రీలు వంశంలో దు:ఖిస్తూ ఉంటారో ఆ వంశం నాశనమైపోతుంది. నిజానికి వారి సంతోషమే వంశోన్నతికి మూలం. ఎపుడూ వారికి అన్నం, వస్త్రం తదితర సామగ్రీ ఉండే విధంగా వ్యవహరించాలి అనేది శాస్త్రం. వాస్తవం కూడా.
అనాది నుండి అత్యాధునికం వరకు మహిళ తమవంతు బాధ్యతను నిర్వహిస్తూ తన ఉనికి పతాక స్తాయిలో వినువీధుల్లో విస్తరిస్తూనే ఉంది. ఇది నిజం. నిజానికి ఆదిలో స్త్రీలకు ఉన్న ప్రాధాన్యత రాను రాను తగ్గుతూనే వస్తుందని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే అప్పట్లో మహిళ కి ఇన్ని పరిమితులు విధించి ఉన్నట్లయితే కులాలకతీతంగా ఒక రaాన్సీ లక్ష్మీబాయి, సమ్మక్క సారక్కలు, జ్యోతీరాయ్పూలే, మొల్ల, చాకలి ఐలమ్మ వంటి వారు ఉండేవారే కారు. ఆ కాలంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన దాఖలాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. రాను రాను ఎప్పుడైతే పితృస్వామ్యవ్యవస్థ అహంతో ముందువరసలోకి వచ్చిందో అపుడే స్త్రీల అణచివేత ప్రారంభమైంది. కన్యాశుల్కం ఇచ్చిన రోజులనుంచి నేడు వరకట్నం ఇస్తున్న నేటి రోజుల వరకు మహిళ ఆర్థికంగా సమానత్వం సాధించినా కూడా ఇంకా ఇంకా అణచివేత సాగుతూనే ఉంది. వీటిని ఎలా అధిగమించడం? అమ్ముడుపోతున్న చట్టాలను ఎదిరించి గెలిచే ధైర్యమూ ఎవరికీ లేదు. మరి ఆడపిల్లను ఎలా పెంచడం? కాపాడటం ఎలా? అంతరిక్షానికి ఎగురుతున్నా కూడా ఇంకా అణగారిన కథలే వినిపిస్తున్నాయంటే లోపం ఎక్కడుంది? అసలు ఆడపిల్ల సమాజంలో బతకగలదా? తనకు తానే ధైర్యంగా ఈ సమస్యలను ఎదుర్కోగలదా? వంటి అనేక పశ్నలకు సమాధానంగా వెలువడిన ‘‘భారతీయ మహిళ’’ అమూల్యమైన గ్రంథాన్ని రూపొందించిన ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారములు.
ఈ గ్రంథంలో వేదాలలో మహిళలు, పురాణాల్లో మహిళలు, భాగవతంలో మహిళలు, రామాయణంలో మహిళలు, మహాభారతంలో మహిళలు, దేశ చరిత్రలో మహిళలు, ఆధునిక కాలంలో మహిళలు , పూజ్యశ్రీ గురూజీ చెప్పిన మహిళల భాగస్వామ్యం వంటి అతి విలువైన అంశాలు ప్రస్తావనలోకి వచ్చాయి.
భారతీయ మహిళ` మాతృశక్తి లో ఆత్మకు స్త్రీ అనీ, పురుషుడనీ, మృగమనీయ పక్షి అయనీ పాము అనీ భేదం లేదు. అందరిలోనూ అంతటా ఉన్న ఆత్మ ఒక్కటే. సంసారంలో ఎవరి విధి వారు నిర్వర్తిస్తారు. పరస్పరం సహకరించుకుంటూ, ఇచ్చిపుచ్చుకుంటూ జీవిస్తారు. వర్గపోరాటమే జీవితమనుకుంటే అదే చరిత్ర అనుకుంటే కలిసి బతికే వ్యవస్థ ఏర్పడి కాదు ఆత్మీయత , అనురాగం సర్వ ప్రాణుల మధ్య ఎప్పటికీ ఉంటాయి. ఈ సువిశాల భావాలు, ఆచారాల కారణంగా, మహిళను భార్యగా, అక్కగా, చెల్లెలిగా గౌరవించబడుతున్న కారణంగానూ, జీవితంలో పురుషుడు స్త్రీనే అనుసరించి నడుస్తాడని చెప్పడం జరిగింది.
ఋగ్వేదంలోని అనేక మంత్రాల్ని మహిళలే దర్శించినట్లు అంతర్గత సాక్ష్యాలున్నాయని అంటారు. ‘‘గార్గి, రోమశ, ఘోషా, విశ్వాపర, ఆత్రేయ, లోపాముద్ర, వసుక్రపత్ని, ఇంద్రాణి, అపాల, శ్రద్ధ, కామాయని, వైవస్వతి, యామిపైలమి, సూర్య, స్వస్తి, శిఖండిని, ఊర్వశి, శచి, దేవరని, ఇంద్రమాత, సర్వరాజ్ఞి, వాక్, గోధ.. తదితరుల పేర్లు ఉన్నాయి. వీరందరూ దార్శనికులైన మేధావినులు. విద్య, వైద్యం, వ్యవసాయం, సాహిత్యం, కళలు వంటి వివిధ వృత్తులు, రాజనీతి తదితర రంగాలలో ప్రతిభావంతులుగా వెలిగారు. మహిళావికాసం సమగ్రంగా జరిగిన కాలమది. ఆ కాలంలోని కొంతమంది మహిళామణులను గురించి తెలుసుకోవాలంటే ముందుగా
బ్రహ్మవాదిని గార్గి గురించి: మహావేదాంతి రాజఋష జనకుడు మిథిలను పరిపాలిస్తున్న రోజుల్లో సీత తండ్రి జనకుడు కాడు. రామాయణ కాలం కన్నా ఎంత ముందున్నవాడు. ఈ రాజవేదాంతి ఆస్థానంలో గార్గి అనే బ్రహ్మవాదిని ఉండేది. యాజ్ఞవల్క్య అనే ఋషి ఉండేవాడు. వీరిరువురికి బ్రహ్మతత్త్వ వివేచనార్థం సభ జరుగుతున్నప్పుడు ఆకాశం, నేల, నీరు వంటి పంచభూతాల పట్ల వాదోపవాదాలు జరిగింది. చివరికి యాజ్ఞవల్క్యుని బ్రహ్మజ్ఞానిగా గార్గి గుర్తించింది. అంటే అతను బ్రహ్మజ్ఞాని అని గుర్తించిన మహామేధావి గార్గి అన్నమాట. అందుకే ఈమె బ్రహ్మవాది అయింది.
శ్రేయోమార్గంలో మైత్రేయి యజ్ఞవల్కుని భార్య. వీరికొక ఆశ్రమమున్నది. పోషణ నిమిత్తుం ఆశ్రమ భూములున్నాయి. గోవులున్నాయి. ఫలధాన్య సమృద్ధి వున్నది. ఆయన ఆశ్రమం విడిచి వెళ్ళి కొన్నాళ్ళపాటు తపస్సు చేసి దేశ పర్యాటన చేసి రావాలనుకుని మరో భార్య అయిన కాత్యాయనికి మొదటి భార్య మైత్రేయికి ఆస్థి విభజన చేసి రక్షించుకోవలసినదిగా తెలిపి మైత్రేయితో ఈ విషయం ప్రస్తావించాడట. కానీ మైత్రేయి ఈ భూమి వల్ల నేను అమృతత్త్వం పొందుతానా? అని అడిగిందట. అందుకు ఎప్పటికీ పొందలేవు. సంపదలున్నవారు అమృతత్త్వాన్ని పొందలేరు అంటే అమరత్వం పొందని ఈ ఆస్తి వలన, సంపద వలన నాకేం ప్రయోజనం ఉంది అని తిరస్కరించిందట. అయితే ఆత్మ బ్రహ్మ ఒక్కరే! ధ్యానం చేయాలి. ఆత్మను తెలుసుకోవాలి, ఇంద్రియాలను తాడిరచి ఆత్మను శోధించి ఈ పంచభూతాత్మక ప్రపంచం కంటే ఆత్మ ఎలా భిన్నమైనదో భార్యకు యజ్ఞవల్కుడు వివరించాడట. పృథ్వి జలము, అగ్ని , వాయువు, ఆదిత్యుడు, దిశలు, విద్యుత్తు, మేఘం, ఆకాశం తదితర వివరాలు చెప్పి ధర్మమే సర్వప్రాణులకు ప్రీతియని మైత్రేయి తెలుసుకున్నది.. కానీ రెండవ భార్య మాత్రం ఆస్తివైపే దృష్టిని సారించి కఠోపనిషత్తులోని శ్రేయస్సును, ప్రేయస్సును స్వీకరించింది. ఇపుడు కాత్యాయని సంసారాన్ని నడుపుతోంది. మైత్రేయి మోక్ష పథంలో ఉంది. యాజ్ఞవల్క్యుడు తపస్సులో ఉన్నాడు ముగ్గురిలో ఒకరు ప్రేయస్సుకు ప్రతీక, మైత్రేయి శ్రేయస్సుకు ప్రతీక, యాజ్ఞవల్క్యుడు తపస్సుకు ప్రతీక అనచ్చు. ఇలా సుజ్ఞాని సులభ జనక మహారాజుతో సులభ వేదాంత గోష్టి చేసిన అంశం భారతంలో సూచించబడిరది. వేదాల్లో వందల కొలది మహిళలు పృథ్వి, ఇల, సరస్వతి, భారతి, సినీవాలి, రాఖ, సూనృత, పురంధ్రి, ధిషణ, అనుమతి, తిఱిని, ఇంద్రాణి, ఉషస్సు, రాత్రి, శ్రద్ధ, అనుమతి, అరామతి, దంపతి, అరణ్యాని, వరుణాని వంటి వారంతా మహిళా రూపంలోని దేవతలే అనవచ్చు. ఇలా మహిళల పేర్లు ఎన్నో ఒక్క ఋగ్వేదంలోనే ఉన్నాయి. వీటన్నిటిమీద ప్రత్యేకాధ్యయనం చేయాల్సిందే అంటారు రచయిత.
మాతృశక్తి దివ్యత్వాన్ని తీసుకుంటే ఆదిశక్తి మహామాయగా అవతరించింది. ఈ తల్లికి మహాకాళి అని పేరు. మొదటి అవతారంలో ఈ అమ్మవారు మధుకైటభులనే రాక్షసులను సంహరించారు.
రెండవ అవతారం మహిషాసురమర్థిని. సింహవాహనjైున ఈ తల్లికి ‘మహాలక్ష్మి’ అనే పేరుంది. ఈ తల్లి మహిషముఖుడైన అసురుడిని సంహరించింది. మూడవ అవతారం అయిన మహాసరస్వతి రక్తబీజుడ్ని సంహరించింది. నాల్గవ అవతారంలో యోగమాయగా జన్మించి కంసుడ్ని భయపెట్టి అదృశ్యమైపోయింది. ఐదవ అవతారంలో అమ్మవారు దంతాలనే ఉపయోగించడం వల్ల రక్తదంతిగా పేరును సంపాదించుకుంది. లోకంలో కరువు కాటకాలు ఎక్కువై పోవడంతో తల్లి అంతటా శాకాలు సృష్టించి కరువును తొలగించింది. అందుకే ఈ తల్లిని శాకాంబరిగా పిలుస్తారు. ఏడవ అవతారంలో దుర్గుడునే రాక్షసుడ్ని సంహరించినందువలనే దుర్గాంబగా పేరు వచ్చింది. ఎనిమిదవ అవతారంలో తల్లి మాతంగుని ఇంట పుట్టి మాతంగిగా పిలవబడిరది. తొమ్మిదవ వతారంలో రాక్షస సంహారం నిమిత్తం అమ్మవారు భ్రమరాలను సృష్టించి విజయం సాధించింది. అందువల్లే ఈ అవతారానికి భ్రామరి అనే పేరు వచ్చింది. ఇలా భిన్న రూపాలతో వర్ణితమైన పురాణాది ప్రక్రియలను ఆధారంగా గ్రహించి రేఖామాత్రంగా మనకు దర్శనమిస్తున్నాయి.
పురాణాల్లో మనసావాచా కర్మణా శుచీ దేవి. శచీదేవి, వేదవేత్త వేదవతి, వరూధిని మన నాయనమ్మ, అరుంధతి మన అంతర్యామి, ఆత్మబంధువు అనసూయ, ప్రేమరస చైతన్యమూర్తి ఊర్వశి, సుస్థిర మానస సుకన్య, ఎల్లలు లేని ఎల్లమ్మ రేణుకమ్మ, సత్యసారమతి చంద్రమతి, సంపదల దేవి లక్ష్మీదేవి, పరాశక్తి పార్వతి, జ్ఞానజ్యోతి సరస్వతి వంటి దివ్యశక్తులున్న మహిళలెందరో పురాణాల్లో ఉన్నారు. మన జీవితాలు, ప్రవర్తనలు భారతీయ మహిళలకు ఆదర్శాలయి, ఆచరణ యోగ్యాలయ్యాయి.
ఇంద్రసేన, దేవసేనచ పులోమ, ఇల, అంగీరస, కావేరి, ఘృతాచి, జలంధర, తిలోత్తమ, మనోరమ, యమున, రాధ, లోపాముద్ర, శతరూప ఇలా మరో వందమంది పురాణ మహిళల ద్వారా సార్వకాలీన సత్యాల్ని అనుసరించవచ్చు. అయితే ఈ పురాణ మహిళలు ఏం చేసారు? అని ఆలోచిస్తే సత్యమే మాట్లాడుతారు. స్వేచ్చాభిప్రాయాలు ప్రకటిస్తారు. రాజీపడి జీవిస్తారు. ప్రేమను పంచి పెడతారు.అన్యాయాన్ని ఎదిరిస్తారు. పురుషునితో పాటు సమానంగా వ్యవహరిస్తారు. జన హితం కోసం దేశ హితం కోసం త్యాగాలు చేస్తారు. ఆత్మబంధువులై అందరినీ ఆదుకుంటారు. శక్తి పూత్కారం చేస్తారు. జ్ఞానజ్యోతిని వెలిగిస్తారు. అంతేనా? అంటే కాదు. మహిళాలోకానికి ఆదర్శవంతులై నిలిచారు. ఆధునిక మహిళా ప్రస్థానంలో ప్రాథేయాలంగా మహిళలంతా నిలిచారు. ఒక్కొక్కరి స్పర్శ ఒక్కొక్క పీఠికై నిలిచేలా చేసారు. నేడు దారులు వేరైనా గమ్యం ఒకటే అనిపించేలా ఆనవాళ్ళను ఉంచి మరీ కదిలారు.
భాగవతంలో ఆదితి మాత నేతృత్వం. వ్యతిరేక దిశలో దితి ప్రయాణం, దివ్య మార్గం చూపిన దేవహూతి, సహనశీలి ఆశావాది దేవకి, వాత్సల్యద యశోద, చంద్రునికో నూలుపోగు అంటున్న కుబ్జ, జగన్మోహిని యుక్తి, అరుచి సురుచి వినీతి సునీతి, తమస్సు చీల్చిన ఉషస్సు ఉష, జనగణనాయక రాధ, మహిళా చైతన్య ప్రతీక సత్యభామ, కృష్ణ చైతన్య స్రోతస్విని రుక్మిణి వంటి వారెందరో మహిళలు భారతీయ మహిళల జీవితాలతో పెనవేసుకుపోయారు. వీరిలో కొందరు భారతాది గ్రంథాల్లోనూ, అన్య పురాణాల్లోనూ వచ్చారు. కొందరిని మాత్రమే పరామర్శించే అవకాశం ఉంది. వీటి వివరణలు ఈ గ్రంథంలో చదవవచ్చు.
రామాయణంలో మహిళలు గమనిస్తే ఈ మహాకావ్యం నిండా మహిళల కథలే. మహితమైన దారిలో నడిచిన మండోదరి, రాజనీతి దురంధర మంథర, జైజైజై కైకామాతా దేవహిత కార్యనిర్మాత స్త్రీ జనాభ్యుదయతారా తార, అసురత్రాత, కైకసి కైసేత,, సత్య సౌందర్యమూర్తి సరమ, జనరంజన అంజన, కౌశల పూర్ణ కౌసల్య, ఫలిత పర్ణ శబరి, విషాగ్ని వృక్షం శూర్పణఖ, యోగిని ఊర్మిళ, పరమపునీత లోకమాత సీత తలుచుకుంటే రామాయణమంతా రమణుల కథే కదా అనిపించకమానదు.
మహేతిహాసంలో (మహాభారతంలో)మహిళల విషయానికి వస్తే స్వేచ్ఛాజీవి గంగ, ధీరమానస సత్యవతి, సౌజన్యవతి శర్మిష్ట, స్వాభిమాని దేవయాని, కపటి కద్రువ వినీత వినత, మేధానిది మేనక, సత్యవాది సరమ, ధర్మవాదిని జరత్కారువు, మృత్యుంజయ సావిత్రి, పరమ పతివ్రత పారమార్థికత, వీరమాత కుంతి, భారత భారతి ద్రౌపది. వీరిని తలుచుకుంటూనే ఉంటాం. మళ్ళీ మనం యథాస్థానంలోకి వస్తూనే ఉంటాం.
దేశ చరిత్రలో మహిళల్ని ఆలోచించుకుంటే గృహంలో యశోధర, ప్రచారిక సంఘమిత్ర, దేవిగా మారిన ఉభయభారతి, ఉత్తమ సేవిక సుజాత, వీర నారి రుద్రమ, రామాయణ రచయిత్రి మొల్ల, నాయకురాలు నాగమ్మ, వీరునికి వెన్ను చూపని చానమ్మ, చితిని వరించిన సంయుక్త, కృష్ణభక్తిని చూపే మీరాబాయి, విద్వేషాల మంటల్లో దుర్గావతి, యువతకు ప్రేరణ రaాన్సీరాణి ఇలాంటి చరిత్రలో ఎందరో ఇంకెందరో ఉన్నారు.
కీస్తు శకారంభం నుండి ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామం వరకు ఎందరో మహిళలు గృహిణులుగా, వీర వనితలుగా, పరిపాలకులుగా, విద్యావేత్తలుగా, వ్యవసాయదారులుగా, వృత్తి నైపుణ్య రమణులుగా, నాట్యగత్తెలుగా, సంగీత విద్వాంసులుగా, దార్శనికులుగా, కర్మయోగినులుగా, భక్తి ప్రచారకులుగా, దేశికలుగా, ఋషికలుగా, రచయిత్రులుగా, కవయిత్రులగా దేశంలో భిన్న ప్రాంతాలలో వికసించారు. అయితే ఈ దేశం జాతిలో శక్తి తగ్గి విదేశీయులను తనలో జీర్ణించుకునే పాటవం కోల్పోయిన నాటినుంచి స్వతంత్య్రాన్ని కోల్పోతూ వచ్చింది. దానివల్ల, స్వదేశీ ఆచారాలపై జీవన విధానాలపై విదేశీయ అశాస్త్రీయ భావజాలం పెత్తనం చలాయిస్తూ వచ్చింది. ఇది కాస్త రాజ్య సభల్లో, వీధుల్లో వీర విహారం చేసినా చాలాకాలం గృహంలోనే ప్రవేశించలేకపోయింది. అందువల్ల విశాల హిందూ ధార్మిక సాంస్కృతిక తాత్త్వికాంశాలను ఎన్నింటినో గృహిణి అందించగలిగింది. ఇలా జాతి జీవనాడి నిత్య చైతన్యంతో పోరాడిన స్థలం గృహమే. ఈ గృహానికి యజమానే గృహిణి. ఆమె పుణ్యఫలమే జాతిలో స్వాతంత్య్ర భావబీజాలు నాటుకోవడం, ఆధునిక మహిలకు స్పూర్తి ప్రదాతగా నిలవడం అంటూ వివరిస్తున్న రచయిత భావాలకు ప్రణమిల్లక తప్పదు.
ఇదొక అద్భుతమైన గ్రంథం. ప్రతి మహిళ ఇంట్లో నిత్యం నిలవాల్సిన గ్రంథం కూడా. స్వేచ్ఛ అనేది ఒకప్పుడు లోక కళ్యాణం కోసం ఉపయోగించేవారు. నేడు స్వేచ్ఛ దుర్వినియోగం ఎక్కడ ఎలా అవుతోందో అనే విషయాలు ఈ గ్రంథం చదివితే అందరికీ ఖచ్చితంగా బోధపడుతుంది. నామటకు నాకు చాలా కాలమైంది ఇంత చక్కని గ్రంథం చదివి అనిపించింది. గౌరవనీయులైన కసిరెడ్డి వెంకటరెడ్డి గారి కలం నుండి వెలువడిన ఈ గ్రంథం తెలుగు సాహిత్య చరిత్రకు ఒక తలమానికం.
కసిరెడ్డిగారి గురించి
కసిరెడ్డి వెంకటరెడ్డి కవిగా, వక్తగా, వ్యాసకర్తగా, జానపద వాజ్మయ పరిశోధకుడిగా, ధార్మిక సామాజిక విజ్ఞాన వ్యాఖ్యాతగా వాసికెక్కాడు
పద్య సంపుటులు:::చైతన్యశ్రీ, సుభాషిత గీత త్రిశతి, లేతమబ్బుల

గేయ సంపుటులు: సింహగర్జన, ప్రబోధమాల, మున్నూరు ముక్తకాలు, శ్రీ భగవద్గీత
సాహిత్యం యొక్క ప్రధాన భూమిక సమాజ హితాన్ని కాంక్షించడం. రాయబడే ప్రతీ విషయం సాహిత్యం లో భాగం అవుతుందా అనే ప్రశ్నకు సమాజ శ్రేయస్సును కోరుతూ, సమాజాన్ని ప్రభావితం చేయగలిగినదైతే అది సాహిత్యంగా పరిగణించడం ఏ మాత్రం తప్పు కాదు. సాహిత్యం యొక్క పరిధిని, సాహిత్యంలోని రీతులను పనికట్టుకొని హాద్దులు నిర్ణయించడం సాధ్యం కాని పని. ఒకనాడు మౌఖిక సాహిత్యం ఆ తర్వాతి కాలంలో 11వ శతాబ్దం నాటి నన్నయ నుండి నేటి ఆధునిక కవుల దాకా, నాటి వేదాలు, పురాణాలు, ఇతిహాసాల నుండి నేటి నానీలు, హైకూలవంటి ప్రక్రియలదాకా దేనికీ కొలమానాలు రూపొందించలేం. కాబట్టే
సాహిత్యం యొక్క పరిధి విస్తృతమైంది. సామాజిక స్పృహతో పాటు, వ్యక్తిని సంకుచితత్వం నుండి విశాల భావాలోచన వికాసం వైపు పయనించేలా చేయగలిగిన శక్తి సాహిత్యానిది.
తెలుగు సాహితీ ప్రపంచాన ఎందరో గొప్ప కవుల ఉదయాస్తమానాలు జరిగినా వారు నాటిన ఆలోచనాంకురాలు సమాజాన్ని కాలానుగుణంగా ప్రభావితం చేస్తూ వున్నాయి. కొన్నిసార్లు ఆ ప్రభావం విప్లవాలకు దారితీయొచ్చు కాని అది విప్లవాత్మక వేగంతో జరుగుతుందా అనేది ఎవ్వరం నిర్ణయించలేం. తెలుగు సాహిత్యంలో సాహితీ కలాలు ఎన్నో వాదనలను, ఎన్నెన్నో వేదనలను కాగితపు కాన్వాస్ పై పుటలు, పుటలుగా చిత్రించాయి. కాల, స్థల, పాలనా పరిస్థితులకు అనుగుణంగా పేదల, పీడితుల కష్టాల, కన్నీటి కథలను ఎందరో కవులు సిరాచుక్కలతో వ్యవస్థపై కుమ్మరించారు. సాహితీ కలానికుండే శక్తి ప్రశాంతంగా కనిపించే అగ్ని పర్వతం లాంటిది. ర
చనాభిరుచి అనేది వ్యక్తి, వ్యక్తిని బట్టి మారుతుంది. అది పూర్తిగా స్వనిర్ణయ సాధికారతను కల్గి వుంటుంది. ఒకనాడు శిష్ట కులాలకు మాత్రమే అనే చందాన సాగేది పాండిత్య, రచనా ప్రస్థానం కాని నేడు అన్ని వర్గాలకు వ్యాపించడం శుభపరిణామం. దాని వల్ల జరిగిన లాభం ఏమిటంటే? ఇతరుల భాదను చూస్తూ రాస్తున్న వ్యక్తి కంటే అనుభవించిన వాడు చేసే వ్యక్తీకరణ మరింత సహజంగా, ప్రభావవంతంగా వుంటుంది. కుటుంబ ప్రాతిపాదికన వ్యక్తుల సమూహం చేత భాషా, ప్రాంత, కుల, మత వైరుధ్యాలచే నిర్మితమయ్యే సంక్లిష్ట వ్యవస్థ సమాజం. సాహిత్యమెప్పుడూ సాధారణ ప్రజల పక్షాన నిలిచి వారి నిత్యజీవితంలో నిక్షిప్తమై వున్న ఘోషను, గోసను వినిపించే స్వరం అవుతుంది. ఈ క్రమంలో దళిత వాదం, స్త్రీ వాదం, మైనార్టీ వాదం, బహుజనవాదం మొదలైన సాహితీ వాదాలు ఉనికిలోకి వచ్చాయి.
ఏ వాదమైనా వ్యక్తి, వ్యవస్థ యొక్క అస్థిత్వాన్ని, జీవికను ఉనికిలో
ఉంచే లక్ష్యంతో కొనసాగుతూ సమాజపు విపరీత పోకడలను నిరసించడంలో కీలక పాత్ర వహిస్తుంది. ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణ మూలంగా మన సమాజాల్లో ఏర్పడిన సంఘర్షణలు, సంపీడిత పరిస్థితులను బహిష్కృతం చేసే స్వభావాన్ని కల్గి వుంటాయి. అక్కడి నుండి ఉద్భవించినవే దళిత, స్త్రీ, మైనార్టీ, బహుజన వాదాలు. ఈ క్రమంలో బిసీ వాదం అనే ప్రత్యేక వాదం ఉందా లేదా అనే ప్రశ్న తలెత్తక తప్పదు. ఈ ప్రశ్నకు సమాధానంగా నిలిచే దానికి సంబంధించిన అంశాలను చర్చించే వివిధ బీసీ వాద గ్రంథాల క్రమంలో నిలిచిన మరొక గ్రంథం “తెలంగాణ బి.సి. వాద సాహిత్యం”. ఈ పుస్తక రచయిత అట్టెం దత్తయ్య. అట్టెం దత్తయ్య నేటి కామారెడ్డి జిల్లాలోని షెట్పల్లి గ్రామ వాస్తవ్యులు. ఈయన ఇటీవలే “మహభారతంలో సంవాదాలు- సమగ్ర పరిశీలన” అనే అంశంపై పరిశోధనను పూర్తి గావించారు. ఇంతకుముందు ఈ రచయిత ఆధ్వర్యంలో ‘కళ్ళం’(సాహిత్య వ్యాస రాశి) 2018 అనే గ్రంథం వెలువడింది.
‘ఆకాశంలో సగం’ అనే నినాదంతో పురుషుల్లో సగభాగంగా వున్న స్త్రీలు వారి పట్ల కొనసాగుతున్న వివక్షకు వ్యతిరేకంగా స్త్రీ వాదం అనే పేరుతో పోరాడుతున్నారు. సమాజంలో సగ భాగంగా వున్న బిసీలు అనేక ఉద్యమాలలో క్రియాశీలంగా వుంటున్నప్పటికీ అటు రాజ్యాధికారమూ, ఇటు అస్తిత్వమూ లేని పరిస్థితుల్లోకి నెట్టి వేయబడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో బిసిలు అస్తిత్వ, రాజ్యాధికారం వైపుగా ఆలోచించడం అవసరం. దానికై సాహిత్య, సాంస్కృతిక పునరుజ్జీవనం తథ్యంగా రావాలి. బిసీలకు చెందిన సాహిత్య, సాంస్కృతిక అంశాలు బహుజన సాహిత్యం ముసుగులో అసౌష్ఠవ రీతిలో విసిరివేసినట్లుగా వున్న సందర్భంలో వాటినంతటినీ ఒక చోటకు చేర్చడం అనివార్యమైంది. ఈ అనివార్యతను తొలగించి బిసీ సాహిత్యం యొక్క స్థాయి, వ్యాప్తిలను తెలిపిన నిర్మాణాత్మక రచన ఈ “తెలంగాణ బిసీ వాద సాహిత్యం” అంటూ ఈ పుస్తకానికి ‘బహుజనుల వీలునామా’ పేరుతో పీఠిక రాశారు ఎస్.రఘు గారు.
ప్రస్తుత పరిస్థితుల్లో వైశ్వీకరణం(గ్లోబలైజేషన్), వైశ్యీకరణం( వాణిజ్యీకరణం) మూలంగా చేతి వృత్తులు, కుల వృత్తులతో పాటు అన్ని వర్గాలు అస్తిత్వాన్ని కోల్పోయి వృత్తి, విషయ నైపుణ్యాలకు విలువ లేకుండా పోయింది. వాటి పర్యవసానంగా సంపద కేంద్రీకరణ, అధికార కేంద్రీకరణ పెరిగిపోయి అన్ని వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుకు గురవుతున్నాయి. వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను ఏకరువు పెట్టే క్రమంలో కొందరు స్వానుభవం చేత, మరికొందరు పరిశీలన అనుభవం చేత సాహిత్యాన్ని సృష్టించారు. ఆ సాహిత్యాన్ని సంకలనం చేస్తూ విమర్శించిన పుస్తకం ఈ ” తెలంగాణ బిసీ వాద సాహిత్యం” అంటూ పుస్తక పీఠిక రాశారు సాగి కమలాకర శర్మ గారు.
“బహుజనులు దళితులు ఒక్కరే, ఇవి రెండు సమానార్థక పదాలు. ఈ విషయం గుర్తించకుండా ఎస్సీలను దళితులుగా, బిసీ లను బహుజనులుగా పేర్కొని వారి మధ్య దూరం పెంచకూడదు” (తెలంగాణ బిసీ వాద సాహిత్యం-పేజీ 24) అంటూ కాలువ మల్లయ్య స్పష్టం చేశారు. లక్ష్మీనర్సయ్య ‘చిక్కనవుతున్న పాట’ లో ఎస్సీ, ఎస్టీ, బిసీ కవులందరూ తమ స్వానుభావాల్ని కూర్చుతూ రాసిన కవిత్వమే దళిత కవిత్వం అన్నాడు. పరాయి పల్లవి వ్యాసంలో సతీష్ చందర్ దళిత వాడలు అగ్రహారనికి ఎంతదూరమో బిసీ పేటలకూ అంతే దూరం. హరిజనోద్దరణ కవిత్వం పేరుతో పులుపు చావని బిసీ కవులు మళ్ళీ రాయనవసరం లేదంటూ ఘాటుగా స్పందించాడు. బిసీ సాహిత్యకారులు తమ కోణాల్లో సాహితీ సృజన చేస్తున్నప్పటికీ వారి సాహిత్యం బిసీ అస్తిత్వవాద సాహిత్యంగా ఎందుకు గుర్తించబడలేదు అనే ప్రశ్నను బాణాల శ్రీనివాస్ లేవనెత్తాడు. ఇదే విషయంపై ఎస్.రఘు “కొన్ని గాయాలు మానవు కాని మానినట్టుగా వుంటాయి. అస్తిత్వ ఉద్యమాలు కూడా గాయాల్లాంటివే కొన్నిసార్లు అవి ఉవ్వెత్తున ఎగసి పడలేక పోవచ్చు, కాని అంతర్గత స్రావాలు జరుగుతూనే వుంటాయి అని చెప్తూనే బిసీల కన్నా పై తరగతి వారి చేతుల్లో మూల్గిన సాహిత్యం ఇప్పుడిప్పుడే వారికి సాన్నిహిత్యంగా ముందుకు సాగుతుండడం వల్ల బిసీలు తమ అస్తిత్వవాదాన్ని బలపర్చడానికి కొంత తెగింపును ప్రదర్శించడం లేదు” అనే కారణాన్ని తెలియపరిచాడు. ఇలాంటి సమయంలో 2001లో పూర్తి బిసీ వాద కవిత్వంగా జూలూరి గౌరీశంకర్ సంపాదకత్వంలో ‘వెంటాడే కలాలు- వెనుకబడిన కులాలు’ అనే సంకలన గ్రంథం వెలువడింది. ఆయన అగ్రకుల అధిపత్య, భూస్వామ్య వర్గాల అణచివేతను ఎదిరించడానికి దళిత, బిసీ, మైనార్టీలందరూ కలిసికట్టుగా ఉద్యమించాలని కోరుకున్నారు. కాని ఈ విషయాన్ని దళితులు మరో కోణంలో అర్థం చేసుకున్నారంటూ ‘కొత్త తొవ్వలు తీస్తున్న బిసీ కవిత్వం’ అనే వ్యాసంలో పగడాల నాగేందర్ తెలుగు సాహిత్యంలో దళితవాద కవిత్వం ఒక పాయలాగ మొదలై 1995-2000 మధ్య పూర్తి పాయలాగా చీలిపోయింది. దానికి కారణం “అనాది కాలం నుండి అగ్రకులాల చేతిలో అవమానాలకు గురికావడం వల్ల వారికి వారే అన్నట్లుగా భావించడం, దాంతోపాటు బిసీలను మీరు మాతో సమానమైన పీడితులు కాదు అంటూ వారిలో నిక్షిప్తమైన ఎత్తిపొడుపు భావన” అంటూ వివరించారు. శతాబ్దాలుగా సమాజంలో, చరిత్రలో కీలక పాత్ర పోషిస్తున్న సమాజ నిర్మాతలు, సంపద సృష్టికర్తలు బిసీలు అంటూ బి.ఎస్. రాములు ఒక వ్యాసంలో తెలియపర్చారు. దళిత సాహిత్యం, మాదిగ సాహిత్యం, మైనార్టీ సాహిత్యం, గిరిజన సాహిత్యం, క్రైస్తవ సాహిత్యం అంటూ అన్నింటికీ ఒక అస్తిత్వం వుంది. కాని బిసీ సాహిత్యం మాత్రం దళిత, బహుజన సాహిత్యంలో అంతర్భాగమైన నేపథ్యంలో బిసీ సాహిత్యం ‘సబ్బండ సాహిత్యం’ గా బలపడాలి అంటూ కాలువ మల్లయ్య తన వాదనను తెలియపర్చారు. ఇలా పలువురు రచయితల నిర్వచన, అభిప్రాయాలతో ఈ పుస్తకంలో బి.సి.వాదం ఎందుకు ప్రత్యేకంగా ప్రారంభమైంది, ఇది కావడానికి ప్రేరణలు, కారణాలు ఏమిటి, బి.సి.ల గురించి వచ్చిన మొదటి గ్రంథాలు ఏవి, వెలువరించిన గ్రంథాల మీద వచ్చిన కుట్రపూరిత విమర్శ, విస్మరణ, అట్లాగే బి.సి.పదాన్ని మరో పదంగా మార్చుకోవాలనే సాహితీకారులు సమావేశాల ద్వార నిర్ణయించిన పదాలు, బి.సి.వాదం గురించి రాస్తున్న వారిలో కనిపిస్తున్న రెండు ధోరణులు వంటి విషయాలను సోపపత్తికంగా “తెలంగాణ బిసి వాద సాహిత్యం- పరిచయం” అనే విభాగంలో చర్చించారు.
ఈ పుస్తకంలోని ప్రధాన శీర్షికల్లో మొదటి అంశం “తెలంగాణ పద్య కవిత్వం – బిసీ వాదం”. పురాణం, ప్రబంధం, శతకం, ఉదాహరణం ప్రక్రియ ఏదైనా విషయాన్ని ఉద్ఘాటించడానికి పద్యం వారధిగా నిలిచింది. తెలంగాణ సాహిత్యంలో మొదటిసారిగా బిసి
కులాలకు తన బసవపురాణంలో పాల్కురికి సోమనాథుడు స్థానమివ్వడంతో ప్రారంభం అయింది. పాత జ్ఞాపకాల వెలికితీత, బాధలు, వివక్షల ఇతివృత్తంతో, వృత్తి ఆధారంగా కులం ఏర్పడిందా? కులం ఆధారంగా వృత్తి ఏర్పడిందా? అనే ప్రశ్న వస్తుంది. కొన్నిసార్లు అవసరం నిమిత్తం తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర కుల వృత్తులు చేపట్టిన వారున్నారు. అంత మాత్రాన వారి కులం మారుతుందా? అనేది ప్రశ్న. ఇక వృత్తి పనిని నమ్ముకొని కాలం వెళ్ళదీస్తున్న వారికి, సమాజంలో కనీస ఆదరణ లేక వారి జీవన ఉపాధి పరిస్థితులు ఏవిధంగా మారాయి అనే తాత్వికతతో వివిధ రచయితలు రాసిన పద్యాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. వాటిలో వృషాధిప శతకంలో పాల్కురికి ” గొల్ల స్త్రీ లు వీధుల్లో చల్లను అమ్మేవారని” రాసిన విషయాన్ని, అలాగే బసవ పురాణంలో ” వీధిలో చల్లనమ్ముచు ఒక గొల్లకాంత జారి పడబోయి బసవరో అని కేక పెట్టగా బసవన కాపాడినాడు” లాంటి విషయాలు కలవు. వీటి ద్వారా బిసి కులాలకు చెందిన గొల్లల ప్రస్తావన నాటి కాలంలోనే రాయబడింది అనే విషయం ధ్రువీకరించాడు రచయిత దత్తయ్య. గొల్లడా! అనే శీర్షికతో కేశపంతుల వేంకట నర్సింహశాస్తి రాసిన ఐదు పద్యాలు చేర్చాడు. దోరవేటి ఒక పద్యంలో ఉప్పరుల గూర్చి ‘కట్టడముల ధాత! కరము మోడ్తు’ అని పల్కిన సందర్భాన్ని తెలియజేశాడు. దానితోపాటు దోరవేటి అన్ని కులాలను గురించి పద్యాల్లో ప్రస్తావించిన విషయం తెలియ పర్చాడు. గంగుల శాయి రెడ్డి ‘కాపుబిడ్డ'(1937) లో మున్నూరు కాపులు మొదటి రోజుల్లో పడ్డ కష్టాలను తెలుపుతూ రాసిన పద్యం అయిన ” కుడిమూపుపై కాడి యెడమ భుజంబున,,,,,,,,,,,” ను గూర్చి రాశారు. “తెలంగాణ పద్య కవిత్వం- బిసీ వాదం” శీర్షికలో 14 కులాల ప్రస్తావనతో వివిధ రచయితలు వారి రచనలలోని పద్య పంక్తులను సహ వాటి నేపథ్యంతో కూడిన విషయ వివరణ తెలియజేశారు.
ఈ పుస్తకంలో మరొక శీర్షిక “తెలంగాణ పాట- బిసి వాదం”. ఆట- పాట, పని- పాట, ఆడుతు పాడుతు పనిచేస్తుంటే ఇలాంటి మాటలను బట్టి చూస్తే మనిషి జీవితంలో పాటకున్న ప్రాముఖ్యత ఏపాటిదో అర్థం అవుతుంది. పండితులకూ, పామరులకు అందరికీ ఆమోదయోగ్యమైనది, ఆదరపూరకమైనది పాట. “జర్మన్ భాషా సుభాషితం ప్రకారం ప్రతి వస్తువులోనూ ఒక పాట నిద్రిస్తూ వుంటుంది, ప్రతి వస్తువూ ఆ పాటను స్వప్నిస్తూ వుంటుంది(అదే, పుట :73)” అన్నట్టుగా ఈ శీర్షికలో పాటల ద్వారా బిసీ కులాలు, వారి జీవన విధానం, సంఘర్షణలు, వారి పాటలో వృత్తికి సంబంధించిన పంక్తులు మొదలైన అంశాల పరిశీలన కలదు. అలాంటి కొన్ని ఉదాహరణలు: గూడ అంజయ్య చేతివృత్తుల వారి కష్టాలను తెలుపుతూ రాసిన పాట ‘బావయ్యో…బావయ్యో’, గోరటి వెంకన్న సబ్బండ వర్ణాల కష్టాలను తెలిపిన పాట ‘పల్లే కన్నీరు’ ఇందులో కుమ్మరి, కమ్మరి, మంగలి, కంసాలి, సాకలి, గౌడ, కురుమ కులాల బతుకు చిత్రం ఎలా ఛిద్రం అవుతుందో తెలియపరిచాడు. బిసీ కులాలను గూర్చి ఒకే పాటలో పలికిన మరో రచయిత జయరాజ్ పంక్తులు: ‘గడ్డాలు మీసాలు గీసి/గుడ్డల్ని శుభ్రంగ ఉతికి/ వండె గుండిల్ని చేసి/ వంటా వార్పుల నేర్పి/మనిషిని మనిషిగ చేసి ,,,,,,,,,,బహుజనులే మన ప్రేమ పావురాలు/బహుజనులే మన శాంతి కపోతాలు’ అంటూ బహుజన కులాల ప్రాముఖ్యాన్ని తెలిపాడు. అదే విధంగా కందికొండ రాసిన యూట్యూబ్ పాటలో: ‘చలో చలో చలో చలో బిసి/ నీవే నీ తలరాతను రాసుకోలేసి/60శాతం ఉండి అడుక్కునుడు ఏంది’ అంటూ బిసిల్లో ఐక్యత నింపేలా వారు రాజ్యాధికారం వైపు అడుగులు కల్పించాలంటూ స్ఫూర్తిని నింపే మరో పాటను నొక్కిచెప్పాడు. ఈ శీర్షికలో వివిధ రచయితలు పాటల రూపంలో బిసి కులాలకు సంబంధించి ప్రత్యేకంగా స్పృశిస్తూ రాసిన పాటలను, బహుజన, సబ్బండ వర్ణాల నేపథ్యంగా రాయబడిన పాటల ప్రస్తావనను గూర్చి అట్టెం దత్తయ్య విశ్లేషించారు. ఈ విభాగంలో సూచించిన ప్రధానమైన అంశం బి.సి.ల ఆశ్రితగాయకుల మౌఖిక సాహిత్యం అంతా గ్రంథస్థం అయిననాడు బి.సి.ల నిజమైన అస్తిత్వం తెలుసుకునే అవకాశం ఉంది అనే అంశం తెలిపాడు.
“తెలంగాణ వచన కవిత్వం- బిసీ వాదం” అనేది మరొక శీర్షిక. నిజానికి బిసీ వాద సాహిత్యం ఎక్కువ మొత్తంలో వచన కవిత్వంలో వచ్చిందని చెప్పొచ్చు. దానికి కారణం పీ.వీ.నరసింహ రావు గారి నూతన ఆర్థిక సంస్కరణల వల్ల జరిగిన పారిశ్రామికీకరణ, ప్రపంచీకరణల ఫలితంగా చేతి, కులవృత్తుల ప్రాభవం తగ్గిపోయింది. బిసీల జీవన స్థితిగతులు దైన్యంలోకి నెట్టబడ్డాయి. వాటిని ఏకరువు పెట్టేందుకు 2000 సంవత్సరం తర్వాత చాలా మంది రచయితలు తమ కలాల గలాలను వచన రూపంలోనే ఎక్కువ మొత్తంలో వినిపించారు. అలాంటి వచన కవితా సంకలనాలలో కొన్ని ‘ బహువచనం’, ‘మేమే‘, ‘మొగి‘, ‘వెంటాడే కలాలు- వెనుకబడిన కులాలు’, ‘ఇరుసు’, ‘సమూహం’, ‘బి.సి.కవితా సంకలనం’ వంటి వచన కవితా సంపుటాలలో వారి అస్తిత్వాన్ని, జీవన సంఘర్షణలను, వృత్తుల విలువ తగ్గడం వల్ల ఎదుర్కొంటున్న కష్టాలను ప్రతిబింబించే రీతిలో వచ్చిన వచన కవితా సంకలనాలను పూర్తిస్థాయిలో విశ్లేషించే ప్రయత్నం కనిపిస్తుంది. వీటితో పాటు కొన్ని కులాల మీద వచ్చిన దీర్ఘ కవిత అయిన‘బువ్వకుండ’ వంటి వాటిని విశ్లేషిండం వల్ల రచయిత దత్తయ్య పాఠకులకు బిసీ సాహిత్యంలో రూపొందిన వచన కవిత్వ సాంద్రతను తెలిపే ప్రయత్నం చేశాడు. ఉదాహరణకు యువ రచయిత, పరిశోధకుడైన వడ్కాపురం క్రిష్ణ కుమ్మరి కులం వారి వ్యధలను తెలుపుతూ రాసిన ‘మట్టి చిత్రం’ కవితలో కొన్ని పంక్తులు:
“జీవితమంతా మట్టిమయం
అంతెందుకు!?
అసలు మట్టి అంటేనే జీవితం
జీవితమే మట్టి కదా
అదే మట్టికుండ నాడు
రాగి, ఇత్తడి,వెండి
ఆఖరుకు ఇనుమును కూడా తట్టుకుని నిలబడింది
నేడు ప్లాస్టిక్
చెరలో బందీగా కనుమరగవగా
ఉత్పత్తి కులం నేడు ఉత్తి చేతులతో నిలబడిపోతున్నది…”
ఇలా వచన కవిత్వంలో బిసీలకు సంబంధించిన వివిధ కులాలపై వచ్చిన కవిత సంపుటాలను, అందులోని వాదాన్ని, వర్ణనలను పాఠకులకు పరిచయం చేశారు.
తెలంగాణ కథ- బి.సి వాదం, తెలంగాణ నవల బి.సి వాదం అనే పేర్లతో మరో రెండు శీర్షికలు కలవు. ఇక కథ, నవలల్లో బిసిల ప్రస్తావన అస్తిత్వ ఉద్యమానికి ముందు నుంచే వారి కులాలకు చెందిన, వారి జీవనశైలికి సంబంధించిన అంశాలతో కథలు, నవలలు కలవు. సమాజంలో ఉత్పత్తి, సేవా, చేతివృత్తుల పాత్ర గణనీయమైనది అవ్వడం మూలంగా వారి జీవన ముఖచిత్రాల గూర్చి ప్రత్యేకంగా బిసీ వాదం పేరుతో కాకుండా ఒక కథ, నవలకు కథా వస్తువును ఎంచుకొనే క్రమంలో సహజంగానే కథా సంవిధానాల్లో వారి జీవిత చిత్రాలు అల్లబడినాయి. కథ, నవల ఎప్పుడూ ప్రజల పక్షం వహిస్తూ అన్ని వర్గాల వారి శ్రామిక, పీడిత, సమస్యాత్మక అంశాలను, భూస్వామ్య, పెట్టుబడిదారీ, పారిశ్రామికీకరణల పర్యవసానంగా ఉత్పన్నమైన సమస్యలను, వివాదాలను చిత్రీకరించే విధంగా వుంటాయి. దానికి తోడు సమకాలీన, చారిత్రక కల్పిత అంశాలచేత మనిషిని ఒక కొత్త ప్రపంచంలో లీనమయ్యేలా చేయగల్గి, సగటు మనిషిని వాటిలో ప్రతిబింబించే స్వభావాన్ని కల్గి వుంటాయి. సమాజంలో, కుటుంబంలో అంతర్గతంగా ఇనుమడింపబడిన విభిన్నత కల్గిన కథావస్తువుతో సమాజాన్ని పెద్ద కాన్వాస్ లో దర్శించడానికి కథలు, నవలలు తోడ్పడ్తాయి. బహుజనులను ఆధారంగా చేసుకొని వచ్చిన కథలు, నవలలకు సంబంధించిన వివరాలను రచయిత ఈ “తెలంగాణ బిసీ వాద సాహిత్యం” పుస్తకంలో ఎక్కువ మొత్తంలో నమోదు చేశారు. అందులో కొన్ని: చేనేత జీవిత సాధకబాధకాలను చెప్పే ‘పడుగు పేకలు’, గొల్ల- కురుమల కథల సంకలనం ‘వేపకాయంత నిజం’, నేరెల్ల శ్రీనివాస్ గౌడ్ ‘ మా బతుకులు’, తుమ్మల రామకృష్ణ సంపాదకత్వంలో నాయీ బ్రాహ్మణుల జీవితాలను చిత్రించిన ‘అడపం’, ఉప్పల నరసింహం ‘సబ్బండ వర్ణాల సారస్వతం’ మొదలైన కథల సంపుటాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఇక నవలల విషయానికి వస్తే గుడెళ్ళగుమ్మి మారెమ్మ, పట్నమొచ్చిన పల్లె- భూపాల్, సాంబయ్య సదువు, చీకట్లో చిరుదీపం, భూమిపుత్రుడు- కాలువ మల్లయ్య, సంకెళ్లు తెగాయి- ముదిగంటి సుజాతా రెడ్డి, ఊరువాడబ్రతుకు- దేవులపల్లి కృష్ణమూర్తి, పరంపర- శిరంశెట్టి కాంతారావు, సుషుప్తి- మాదిరెడ్డి సులోచన, బతుకు తాడు, కల్తీ బతుకులు- నేరెళ్ళ శ్రీనివాస్ గౌడ్ మొదలైన నవలలు ఇవన్నీ కూడా కేవలం మచ్చుకు కొన్ని మాత్రమే. దత్తయ్య ఈ పుస్తకంలో బహుజన, సబ్బండ కులాలపై వివిధ కవులు రాసిన కథలు, నవలలను చాలా మొత్తంలో తెలియపరిచారు. ముఖ్యంగా కథలను గురించి రాస్తూ బి.సి.ల జీవితాలకు సంబంధించి కథకులు విస్తృతంగా రాసినప్పటికి వాటిలో కులాల ప్రస్తావనలు మరుమరుగుగా చేయడం వెనుకున్న భయమేమిటో సందిగ్ధత ను రేకెత్తించే విషయం అని కథా రచయితలను ప్రశ్నిస్తాడు.
ఇక ఈ శీర్షికల తర్వాత చివరగా ‘తెలంగాణ బి.సి.వాద సాహిత్య విమర్శ’ పేరుతో ఒక శీర్షిక కలదు. విమర్శ అనగా సమీక్షించడం, పర్యాలోచించడం అనే అర్థాలు కలవు. బహుశా వెనుకబడిన వర్గాలపై వచ్చిన సాహిత్యం గురించి విమర్శ చేయడం పై స్థాయి వర్గాల వారికి ఆసక్తి వుండకపోవచ్చు. అందుచేత బిసీల, బహుజనుల సాహిత్యం పెద్దగా విమర్శకు నోచుకోలేదు. కవిత్వం, నవల, నాటకం, కథ ఇలా ప్రక్రియ ఏదైనా రచయిత దానిని ఏ పరిస్థితుల్లో రాశాడు, ఏ కోణంలో రాశాడు, ఏ ఆశయం చేత రాశాడు, తదుపరి దాని ప్రభావం ఎలా వుండబోతుంది అనే విషయాలన్నింటికీ విమర్శ దారి చూపుతుంది. బిసి సాహిత్య విమర్శలో ప్రధానంగా చెప్పబడే నాలుగు పుస్తకాలను తెలిపారు. అవి ‘బి.సి కథలు ఒక విశ్లేషణ 2000-2010’- కథా సాహిత్యం పై బి.ఎస్.రాములు 2011 లో వెలువరించారు. ‘కవిత్వంలో బిసి సూర్యోదయం’ 2015 లో జూలూరి గౌరీశంకర్, ఈయన ఆధ్వర్యంలోనే బిసీ వాద కవిత్వం పై ‘ఒక కవిత ఇరవై కోణాలు’. మరొక విమర్శ గ్రంథం ‘ప్రవాహం’ ఇది బిసి అస్తిత్వవాద యువ కవిత్వం పై వెలువడిన సంకలనం దీనికి చింత ప్రవీణ్ సంపాదకత్వం వహించారు. ఇలాంటి ఎన్నో విషయాలను ప్రస్తావించిన దత్తయ్య ’వినతి‘ అనే శీర్షకలో ఇదొక చిన్న ప్రయంత్నమని వినయంగా చెప్పుకుంటాడు. ఇంకా కొన్ని కులాల గురించి, కొన్ని ప్రక్రియలలో వచ్చిన బి.సి.ల జీవితాలను గురించి ముందు ముందు రాసే ప్రయత్నం చేస్తానని చెప్పుకోవడం సమగ్రతకోసం ప్రామిస్ చేసినట్లుగా కనిపిస్తుంది.
అట్టెం దత్తయ్య రూపొందించిన “ఈ తెలంగాణ బిసీ వాద సాహిత్యం” పుస్తకంలో పద్యం,పాట, వచన, కథ, నవలా ప్రక్రియల్లో బిసిలకు సంబంధించి కవులు వివిధ కోణాల్లో బహుజన, బిసీ కులాలను గూర్చి వ్యక్తం చేసిన అంశాలను విస్తృత పరిశీలనతో సంక్షిప్తంగా పొందుపరిచారు. దత్తయ్య చేసిన ఈ ప్రయత్నం మాటల్లో, వాక్యాల్లో మాట్లాడినంత సులభం కాదనే విషయం పుస్తకాన్ని చదివే ప్రతీ పాఠకుడికి అర్థం అవుతుంది. ఈ పుస్తకం బిసీలు, వారి అస్తిత్వవాదానికి సంబంధించిన కోణంలోనూ, పరిశోధన చేస్తున్న, చేయబోయే వారికి మార్గదర్శనం చేయడంలో ఎంతో కొంత పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. బిసీ వాదం పై వచ్చిన పుస్తకాల వరుసలో అట్టెం దత్తయ్య పుస్తకం కూడా విలువైనదిగా మారబోతుందనేది సత్యం. ఏదేమైనా అట్టెం దత్తయ్య సలిపిన ఈ కృషి ఒక చారిత్రక సందర్భాన్ని గుర్తుచేస్తుంది. అదేమిటంటే నాడు తెలంగాణ ప్రాంతంలో సాహితీవేత్తలు, సాహిత్యమే లేదన్న ఆంధ్ర సాహితీ మేధావులకు తెలంగాణ సాహిత్య విస్త్రృతిని, సాహిత్యకారులను పరిచయం చేస్తూ సురవరం వారు రూపొందించిన ‘ఆంధ్ర కవుల సంచిక’ లాగానే, నేడు దళిత, మైనార్టీ, బహుజన వాద సాహిత్యాల ముసుగులో బిసీ వాద సాహిత్యం విస్తృతి, కవులు తెరచాటైన స్థితి ఏర్పడింది. ఇలాంటి స్థితిలో రచయిత దత్తయ్య రాసిన ఈ “తెలంగాణ బిసీ వాద సాహిత్య గ్రంథం” బీసీ వాద సాహిత్యం యొక్క విస్తృతిని, కవులను సాహితీ ప్రపంచానికి తెలియజేసి నాటి సందర్భాన్ని పునరావృతం చేసిందని చెప్పొచ్చు. ఏదేమైనా బీసీ వాదాన్ని వ్యక్తీకరించే ప్రయత్నం లో ఈ “తెలంగాణ బిసీ వాద సాహిత్యం” గ్రంథం ఒక అడుగు ముందుకు వేసిందని చెప్పవచ్చు.
తెలంగాణ బి.సి.వాద సాహిత్యం రచయిత: అట్టెం దత్తయ్య
ప్రచురణ సం: 2021 పుటలు : 259
వెల : 23
ప్రచురణ : ప్రణవం పబ్లికేషన్స్
రచయిత పరిచయం
పేరు : అట్టెం దత్తయ్య
చదువులు : బి.ఏ (ఎల్), టి.పిటి, ఎం.ఏ. తెలుగు (ఓ.యు) ఎం.ఏ (జర్నలిజం), ఎం.ఏ(సంస్కృతం)
రచనలు: 1. కళ్ళం (సాహిత్య వ్యాసరాశి) (2018) 2. తెలంగాణ బి.సి.వాద సాహిత్యం (2021)
సంపాదకత్వం: 1. నిత్యాన్వేషణం (సాహిత్య దీర్ఘవ్యాసాల సమాహారం) 2018, 2. శిలాక్షరం (బి.ఎన్.శాస్త్రి సాహిత్యం – సమాలోచనం) 2019
సహాయ సంపాదకత్వం
- ఆలోకనం (31 తెలంగాణ జిల్లాల సాహిత్యం – చరిత్ర, సంస్కృతీ సమాలోచనం) 2017, మూసీ ప్రచురణ
- శతవాసంతిక (ఉస్మానియా వందేళ్ళ సంబరాల ప్రత్యేక జ్ఞాపిక 1917-2017) 2019 ఓ.యు. తెలుగుశాఖ ప్రచురణ.
- తెలంగాణ సాహిత్యం – సమాలోచన (పరిశోధక విద్యార్థుల సాహిత్య వ్యాసాలు) 2019 ఓ.యు. తెలుగుశాఖ ప్రచురణ.
ఇంకా
జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో 25కు పైగా పత్రసమర్పణలు, వివిధ ప్రతికలలో 70కి పైగా వ్యాసాల ప్రచురణ.
చిరునామా : ఇం.నెం. 3-9/3, గ్రా.శట్పల్లి, మం.లింగంపేట్, జిల్లా, కామారెడ్డి, తెలంగాణ
ఫోన్ : 9494715445
ఆనాటి కాలంలోనే చలం తన రచనల్లో స్త్రీకి స్వేచ్ఛ కావాలని కోరుకున్నాడు. ఆమెకు మనసుంది, దాని స్పందన ఉంటుంది. ఆ స్పందనకు స్వేచ్ఛ కావాలని ఆమె ఆలోచనకు రూపం ఉండాలని స్త్రీని గౌరవిస్తూ ఆమెకు మాట్లాడే హక్కుతోపాటు జీవన స్వేచ్ఛ కావాలని చాలా సందర్భాల్లో చెప్పారు.
నేటి కాలంలో స్త్రీ చదువుకుంది. ఎన్నోరకాల ఉద్యోగాలు చేస్తూ రాజకీయాల్లోను తన ప్రతిభ చాటుకుంటుంది. కాని మానసికంగా స్వాతంత్రాన్ని కుటుంబపరంగా స్వేచ్ఛను పొందలేక పోతున్నది. ఎ.కె.మల్లీశ్వరిగారు రాసిన ‘నీల’ నవల ద్వారా మహిళ స్వాతంత్రాన్ని మరింత నిశితంగానూ నిర్ధిష్టంగాను తెలుసుకునె అవకాశం లభించింది. స్త్రీ పురుషుల మధ్య సహచర్యం ఆర్థిక రాజకీయ స్వాతంత్రాల వల్ల వచ్చేది కాదు. కేవలం మానసిక స్వాతంత్ర్యం వల్ల మాత్రమే సాధ్యం అంటారు స్త్రీ వాద రచయితలు. మన చుట్టూ ఉన్న పదిమంది మనకు అండగా ఉంటారనుకోవడం మానవ సహజం. అయితే ఒకరు లేకపోతే జీవితమే శూన్యం అనుకోవడం బేలతనం అవుతుంది. అలాంటి బేలతనం నుండి తన జీవన ప్రయాణం నుండి తెలుసుకున్న పాఠాలే నేడు సామాజిక ఉద్యమాలు రాజకీయ సమానత్వపు పోరాటాలను తెలుసుకున్నపాఠాలే నేడు సామాజిక ఉద్యమాలు రాజకీయ సమానత్వపు పోరాటాలను తెలుసుకున్న ఆమె జీన పోరాటము అందులోని సామాజిక అసమానతుల, స్త్రీ పురుషుల సమానత్వం అంటూనే స్త్రీని అణచివేస్తున్న పరిస్థితులకు నిలువెత్తు రూపం ‘నీలం’ నవల సముత్ర చెలియలి కట్ట దాని అలలే దాన్ని నియంత్రించినట్లుగా స్వేచ్ఛ లేనపుడు పెళ్ళి, ప్రేమ, సహజీవనం ఒంటరి జీవితం బరువే అంటారు. అలాంటి సందర్భాల్లో వ్యక్తికీ – వ్యక్తికీ స్వేచ్ఛ నిర్వచనాలు మారుతాయి. ఒకరికి స్వేచ్ఛ అనుకున్నది. మరొకరికి విశృంఖలత్వం అనిపించవచ్చు. ఇవి అన్ని కూడా వ్యక్తులు మనస్తత్వాలు, సంస్కారాలను వాటి పరిమితిల్లో నుంచి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అలాంటి ఓ మహిళ జీవితంలో జరిగిన సంఘటనలే ‘నీల’ నవలగా చెప్పవచ్చును.
నీల బాల్యం నుండి కష్టాల కొలిమిలో రాటు తేలింది. తన తల్లిని చంపిన తండ్రి జైలుకెళ్ళగా అనాథగా జీవనం సాగించింది. మానసిక పరిపక్వత చెందని వయస్సులోనే పెంచినవాళ్ళు పెళ్ళి చేయగా తనకు ఓ తోడు దొరకదని ఆనందపడింది. ఓ బిడ్డకు తల్లిగా మారింది. అంతలోనే తన భర్తకు మరో స్త్రీతో సంబంధం ఉందని తెలుసుకొని ‘స్వచ్ఛమైన, నిష్కలషమైన ప్రేమకోసం పరితపించింది. ఋతువులు మారుతున్నాయీ కాని నీల జీవితంలో ఏ వర్ణము ఆమెను దరిచేరలేదు. కుటుంబ జీవితంలో హింసను చూసింది తనను హింసిస్తున్న మగవాడి పట్ల ద్వేషాన్ని పెంచుకోలేదు. పైగా అతను పడుతున్న హింస నుంచి విముక్తి కల్గించాలనుకుంది. అంటే తను విముక్తమవ్వాలి అనుకుంది. అందుకే పెళ్ళి పేరున ఏర్పడిన సాహచర్యాన్ని తెంచుకుంది. సహజీవనంలో భద్రత కోరుకుంది. స్వచ్ఛతని, సమానత్వాన్ని కోరుకుంది. స్త్రీ పురుషుల సాహచర్యంలో ప్రేమ, స్వేచ్ఛలతో కూడిన దృఢమైన బంధం కోసం వెతికింది. అతి హింసాత్మక నేపథ్యం నుంచి దుర్భర దారిద్ర్యం నుంచి భవిష్యత్తు సందేహంగా మారగా ‘నీల సుదీర్ఘ ప్రయాణంలోని అనుభవాల నుంచి మరియు చుట్టూ వున్న తనలాంటి మరికొందరి జీవితాల నుంచి ఎన్నో పాఠాలను నేర్చుకుంది. తనలాంటి నీలవేణులకు జీవితపు అస్తిత్వము సులుపు చేయాలనుకుంది. మళ్ళీ కథలోకి వస్తే పెళ్ళి బంధం నుండి విముక్తి అయిన తరువాత నీల తొలి ప్రేమ పరదేశిపై కల్గింది. కాని అప్పటికే పరదేశి మరో స్త్రీతో రిలేషన్లో వున్నట్లు తెలుసుకుని తన ప్రేమను విరమించుకుంది. ఎవరి వ్యక్తిగత జీవనం వాళ్ళదే దానివల్ల కలిగే మంచి చెడ్డల ఫలితం అనుభవించేది కూడ వాళ్ళే అందులోకి తొంగి చూసె అవసరంకాని ప్రమేయం లేదు. స్త్రీ పురుషుల సహజీవనానికి ప్రేమ అవసరం కాని సమాజం, కుటుంబ విధించిన నియమాల సంకెళ్ళ, చిక్కుదారులు అనేకం వాటిని తెంచుకొని స్వేచ్ఛ కోసం వెతుకులాడే వాళ్ళంతా నీలగాను, నీల తల్లిగాను, నీల నేస్తం సంపూర్ణం, పరదేశిలాగా, ఆపన్న హస్తం అందించిన అజితలాగ సంఘర్షణకు గురికావల్సిందే. స్త్రీ ఆర్థిక స్వాతంత్ర్యానికి, లైంగిక స్వేచ్ఛకి వున్న కనిపించని సంబంధాలు గూర్చి వెలువడిన ఎన్నో ప్రశ్నలకు రచయిత ఈ నవలలో సమాధానాల కోసం అన్వేషణ చేశారు. కొన్నిటికి సూచనప్రాయంగా జవాబులు ఉన్నట్లు కన్పిస్తుంది. ఈ నవలలోని ‘నీల’ వేసుకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు జీవితానుభవం ద్వారా తనకు తానే రాబట్టుకుంది. ఆమెకు తెలియకుండానే జారిపోయిన వాటిని వొడిసి పట్టుకుని తనకు నచ్చిన రీతిలో సరిదిద్దుకునే క్రమంలో తనను తాను తెల్సుకుంది. చదువుకుని సొంత కాళ్ళమీద నిలబడింది. తనని బాధించే హక్కు ఎవరికీ లేదు. తాను ఎవరి బాధకీ కారణం కాకూడదు అనే జీవన తత్త్వంగా మార్చుకుంది. ‘నీల’ స్వీయ అస్తిత్వం కోసం ఆత్మగౌరవం కోసం స్వేచ్ఛ కోసం చేసిన పెనుగులాటే ఆమె గమనంగా మారింది. దాతృత్వం కాన్సెప్ట్ తో పనిచేసే స్వచ్ఛంద సంస్థలో లోపిస్తున్న దీర్ఘకాలిక ప్రయోజనాల్ని తెలుసుకుంది. అభివృద్ధి నీడ కింద సమాజం అనుభవించే వేదనని అర్థం చేసుకని జీవించే హక్కు కోసం పోరుసల్పె జనంతో కలిసి రాజ్యం చేస్తున్నఅమానవీయం హింసకు వ్యతిరేకంగా నిలవాలని నిర్ణయించుకుంది.
‘నీల’ అనే వ్యక్తి జీవిత చిత్రణలో సామాజిక చరిత్రను చేర్చారు. వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేసే రాజకీయ సామాజిక సంఘటనల్ని ప్రస్తావిస్తూ ‘నీల’కి సొంత జీవితము, సామాజిక జీవితము వేర్వేరుగా లేవు అనే స్పృహతోనే రచయిత ‘నీల’ని ‘ఒక పిరియడ్’ ‘నవల’ తీర్చిదిద్దారు. ఒక నిర్దిష్ట కాలంలో గ్రామీణ పట్టణ నగర నేపథ్యాలు స్త్రీల స్వేచ్ఛపై లైంగికతపై చూపే ప్రభావాల్ని వాటిలోని భిన్న పార్శ్వాల్ని కూడా ఇక్కడ చర్చకు వచ్చాయి. స్వశక్తి డ్వాక్రా గ్రూపుల ద్వారా స్త్రీలకు కొత్తగా ఆర్థిక వెసులుబాటు వల్ల దాంపత్య సంబంధాల్లో వచ్చిన మార్పుల వల్ల కుటుంబ వ్యవస్థపై అధిక ప్రభావము లేకున్న స్త్రీ పురుష లైంగికతపై బలమైన ప్రభావాన్ని చూపాయని సూచనప్రాయంగా తెలిపారు. గ్రామాల్లో సైతం కమ్యూనిజం కోరలు చాచింది. మార్కెట్ గద్ద రెక్కలు విప్పుకోగా దేశీయకళాకారులకీ కొత్త మార్కెట్ లభించింది. చాలా సందర్భాల్లో పురుషులు కుటుంబ భారాన్ని ఆడవాళ్లకి వొదిలేశారు. ఊర్లు ఆత్మహత్యలకి, అత్యాచారాలకి నిలయంగా మారాయి. స్వశక్తి గ్రూపులు స్త్రీ వోటు బ్యాంక్ రాజకీయాలకు దారులు వేశాయి. మహిళలు కొత్త సవాళ్ళు ఎదుర్కొన్నారు. అధికారుల కోసం ఆధిపత్యపు కులాల ఎత్తుగడలకు వీళ్ళు పావులుగా బలైనారు. నవల్లో రచయిత్రి ఈ విషయాన్ని విస్తృతంగానే వివరించారు. సమకాలీన స్థానీక రాజకీయాల్తో పాటు పలాస అడవుల్లో ‘నీలధార’ సాక్షిగా నడిచిన గిరిజన ఉద్యమాల ఊసులు, స్టాలిన్ సూర్యం పాల్గొన్న ఉత్తర తెలంగాణ రైతాంగ ఉద్యమాలపై అమలైన అణచివేత జాడలు నవల్లో సందర్భానుసారంగా ప్రస్తావనకి వచ్చాయి.
ప్రకృతి వనరుల్ని మల్టీ నేషనల్స్ కి అప్పజెప్పడానికి సముద్ర మైదానం అడవి తేడా లేకుండా మానవ విధ్వంసానికి ప్రకృతి వినాశనానికి తెగబడ్డ భీభత్స సందర్భంలో మల్లీశ్వరి నీల గురించి నీల లాంటి మరికొందరి నీల చేయబోయే నూతన ప్రస్థానం గురించి మనం మాట్లాడటం అనివార్యమే కాని ఆ అనివార్యములోంచే ఈ నవల పుట్టి వుండవచ్చు. ‘సముద్రం కార్పోరేట్ల నీటి తొట్టి’ అవడానికి కారణాలు అనేకం. వాటిని తెలుసుకునే దిశగా ‘నీల’ ప్రస్థానం మొదలైంది. ‘జీవితమంతా పోరాటమైన స్థితి నుంచి పోరాటాన్నే జీవితంగా’ మార్చుకునే కొత్త ప్రణాళికల్ని రచించుకుంటుంది. నాలుగు పదులు కూడ నిండని ‘నీల’ మరింత సంఘర్షణాత్మకమైన దారిలో నీల తనలాంటి మరెందరినో కలుపుకుని అడవుల వేడి నిట్టూర్పుల్ని సాగరాల గంభీర శ్వాసని వింటు నడుస్తుంది. స్వతంత్ర జీవనం గడపాలి అనుకునేవాళ్ళు, జాలరి పైడమ్మ లాంటి పీడితుల కోసం పరదేశిలా భుజంకాయారి అనుకునేవాళ్లు సదాశివలా స్వేచ్ఛని గౌరవించగల వాళ్ళు అందరూ నీలకు హితులే, సన్నిహితులే.
మానవ సంబంధాల్లో బలీయమైనది ప్రేమ, స్వేచ్ఛకి సంకెళ్ళుగా పరిణమించిన సంఘర్షనాత్మక సందర్భాల్లో క్లేశాన్ని అధిగమిస్తూ చిక్కుముడులు నిప్పుకుంటూ ప్రేమ – స్వేచ్ఛల మధ్య సమన్వయం సాధించటానికి ఓ స్త్రీ జీవన పోరాటమే ‘నీల’ నవల.

Writer: A. K. Malleswari
ఈ నవలని రచయిత్రి దృష్టిలోంచి చూసినపుడు అశాంతిని కాక జీవశక్తిని ఆవిష్కరిస్తుంది. అది వ్యక్తిలో అపార జీవశక్తి ఉంది. ఆమె వైరిలో ఉద్వేగముంది. సన్నివేశ కల్పనలోను, మనోభావాల్ని పట్టుకొని వివరించడంలో కౌశల్యముంది. కె.ఎఫం.మల్లీశ్వరిగారు రచించిన ‘నీల నవల’ ‘తానా’ బహుమతి పొందినది. మన ధర్మశాస్త్రం ప్రకారం స్త్రీ అన్ని దశల్లో పురుషుడి మాటునే ఉండాలనే నియమాలకు విరుద్ధంగా స్త్రీ స్వేచ్ఛ కోసం ‘నీల’ పాత్ర ద్వారా మనకు అనేక విషయాలను సమా కోణంలో చూపిస్తూనే స్త్రీలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యము ఎంత అవసరమో చెప్పడంలోనను కొన్ని మెళుకువలతోపాటు ఆధిపత్యపు సంస్థ ద్వారా స్త్రీ జీవన సంఘర్షణని చూసారు. ఈ నవల ప్రతి ఒక్కరిని చదివించేదిలా ఉంది.
భాష పుట్టుకకు ప్రాంతముంటుంది కానీ దాని పరిమళాలు నిండిన గాలులు ఏ ప్రాంతంలో వీస్తాయో ఎవరూ చెప్పలేము…
భాష వైభవం సాహిత్యంలోనే కనిపిస్తుంది…
భాష మనుగడ సాహిత్యంతోనే ముడిపడి ఉంటుంది…
సరిహద్దులు దాటి స్వేచ్ఛగా విహరించేదే కదా సాహిత్యమంటే…
కమ్మనైన అమ్మభాషకు కవుల కలాలే కప్పురపు హారతులు…
కాదంటారా…!?
అనేక ప్రక్రియల్లో తనదైన ప్రత్యేక శైలితో పడమటి గాలుల్లో తెలుగు పరిమళాలను నింపుతున్న కవి , రచయిత శ్రీధర్ బిల్లా…వీరి స్వస్థలం వరంగల్ జిల్లాలోని మల్లక్కపల్లి గ్రామం. ప్రస్తుతం ఉంటున్నది కాలిఫోర్నియా(అమెరికా). దాదాపు పది సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అమెరికాలోనే ఉంటున్న శ్రీధర్ కు తెలుగుభాషన్నా , భారతీయ సంప్రదాయమన్నా ఎంతో అభిమానం. తన చుట్టూ సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలను , తన బాల్యాన్ని , తన వృత్తిని ఇలా అనేక అంశాలను వస్తువులుగా తీసుకుని వాటిని వివిధ ప్రక్రియలలో అక్షరీకరించారు.
ఒక్కో ప్రక్రియకు ఒక్కో పుస్తకాన్ని విడిగా వేసుకుంటున్న ఈ రోజుల్లో అన్ని ప్రక్రియలను కలిపి ఒకే సంపుటిగా తీసుకు రావడం కాస్త సాహసమనే అంటాను…ఏదైనా కవిత్వమే కదా అంటారు శ్రీధర్…
కవి మనసుకు ప్రతిబింబమే అతని సాహిత్యం…బహుశా అందుకే తన ఈ సంపుటికి “ప్రతిబింబం” అని పేరు పెట్టారని అనుకుంటాను.
ఇందులో వచన కవిత్వం, నానీలు, రుబాయీలు, పద్య ఖండికలు ఉన్నాయి.
వచన కవిత్వం ఎక్కువగా దీర్ఘ కవితలుగా ఉన్నాయి. అందుకే తీసుకున్న ప్రతి వస్తువుకు పూర్తి న్యాయం చేశారనిపిస్తుంది.
ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాలలో జరుగుతున్న బాల్య వివాహాల గురించి ”ఒంటరీ బందీ” అనే కవితలో హృద్యంగా తెలియజేశారు. ఇది తన బాల్యంలో జరిగిన ఓ సంఘటన…తన సోదరిలాంటి బాల్య మిత్రురాలికి జరిగిన బాల్య వివాహం గురించి ఆవేదనతో రాసుకున్న అక్షర నివాళి ఇది…
// హృదయాంతరాళం ప్రళయ ఘోష చేస్తున్న,
అధరం దాటని మూగ ఆర్తనాదం తాను! మౌన శిఖరం తాను!
గర్భమంతా మంచుకాసారం నిండియున్నా ,
మంచుగప్పి మలయమారుతం వీస్తున్న మహాగ్ని పర్వతం తాను! // అంటూ ఆవేదనతో రాశారు…
//పెంచిన తల్లివి గావు! తండ్రివీ గావు!
తోడబుట్టిన దానవు కావు! కానీ, తోడై నిల్చిన దానవు!// అంటూ ”ఎర్ర బర్రె” కవితలో తన బాల్యంలోని ఆత్మబంధువైన ఎర్ర బర్రెను ఆత్మీయంగా తలచుకొన్నారు.
అకాల వర్షాల వల్ల రైతు ఆశలు ఎలా కొట్టుకు పోతాయో “చినుకుల మాటున” కవితలో మన కళ్ళ ముందుంచారు.
రెక్కలొచ్చిన పిల్లలు సుదూర తీరాలకు ఎగిరెళ్ళిపోతే…రెక్కలుడిగిన ముసలి ప్రాణం ఎంత తల్లడిల్లి పోతుందో ”ముసలోడు” కవితలో ఇలా రాశారు…
//ఏ జ్ఞాపకం హఠాత్తుగా ఏ కలవరాన్ని మోసుకొచ్చిందో
పక్కనున్న మంచాన్ని ఒక్కసారి తడిమి చూశాడు
ముసల్ది మరణించిందని ఓ క్షణం పాటు మరచాడేమో
ఖాళీ మంచం వేళాకోళమాడుతూ వెక్కిరించింది//
//తాను విలపిస్తూ చితికి శిధిలమై పోతుంటే
ఆ విలాప శిధిలాలతో పేరుస్తున్న విలాస సౌధాలు
కళకళలాడుతున్నాయి//అంటూ వేశ్యల జీవితాలలోని ఆక్రందనలను ”ఆక్రందన” కవితలో అక్షరీకరించిన తీరు కవికి సమాజం పట్ల ఉన్న బాధ్యతను మనకు తెలియజేస్తుంది.
//అందమైన ఒకనాటి ఆంధ్రదేశానికి
జాతీయ భాషను నేను
జాతీయ భాషగా వేరొకటి రుద్దగా
‘ప్రాంతీయ భాషనయ్యాను’ నేడు!//
అంటూ ”తెలుగు అనే నేను” కవితలో నేడు తెలుగు భాష ఎదుర్కొంటున్న అనేక సమస్యలను తెలియజేస్తూ విదేశాలలో మన భాష ఎంత గొప్పగా వెలుగొందుతోందో
//ప్రాంతీయ భాషగా
భారతావనిలో భారంగా బతుకీడుస్తున్నా,
ప్రవాస సంఘాల కృషితో
ప్రపంచ భాషగా గుర్తింపు పొందుతున్నా!// అంటూ ఈవిధంగా తెలియజేశారు. ఇలా వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్న వచన కవితలు 38 శీర్షికలతో ఉన్నాయి.
ఈ కవికి అంత్యానుప్రాసలు బాగా ఇష్టమనుకుంటాను. అందుకే అతని కలం ప్రాసలను అందంగా జాలువార్చింది.
ఇంక నానీలు , రుబాయీలు, పద్య ఖండికలు కూడా ఈ సంపుటిలో ఉన్నాయి.
శ్రీధర్ రాసిన కొన్ని నానీలను చూద్దాం…
//నాలుగు మెతుకులు
ఆకలి మంటల్లో
బాలల హక్కులు
కాలిపోయాయి//
//ఆటలాడి
రాటుతేలాల్సిన దేహం
రాళ్ళు కొడుతూ
రాటుదేలుతోంది!// అంటూ ‘బాల కార్మికులు’ అనే శీర్షికలో సందేశాత్మక నానీలను రాశారు. ఇంతే కాకుండా మామగారు , కొడుకులు, బడి , చెత్తకుండీ, పందెం కోడి , రోడ్డు గుంత అనే శీర్షికలతో కూడా నానీలు ఉన్నాయి.
ఇంకా ఈ సంపుటిలో “అన్వేషణ”, “దిన దినం” శీర్షికలతో రుబాయీలు కూడా ఉన్నాయి…
చివరగా 14 శీర్షికలతో పద్యఖండికలు కూడా ఉన్నాయి.
తే.గీ. నీదు ఇంటిలోన, కటిక పేదరికపు
కాళరాత్రుల చీకట్లు కప్పియుండె!
నీవు జెక్కిన శిల్పము, దేవళమున
దీపములలో వెలుగుచుండె, తేజమలర!
అంటూ రాసిన ఈ తేటగీతి “శిల్పి” అను శీర్షికలోనిది.
పద్యఖండికలోని పద్యాలన్నీ సులభ శైలితో పాఠకులకు సులభంగా అర్ధమయ్యే విధంగా ఉన్నాయి.
ఇందులోని సాహిత్యం చదువుతుంటే ఈ కవికి సామాజిక బాధ్యతే కాకుండా భాషాభిమానం కూడా చాలా ఉందని మనకు తెలుస్తుంది.
ప్రచురింపబడిన మొదటి పుస్తకం ఇదే అయినా మరెన్నో గ్రంథాలను త్వరలో ఆవిష్కరించాలని కోరుకుంటూ…
“ప్రతిబింబం” రచయిత శ్రీధర్ గారికి ఆత్మీయ అభినందనలు తెలియజేస్తున్నాను.
అవును! ఎంతటి చింతనీయమైన ‘దుర్గతి’ ఇది!
భూమి, నీరు, వెలుగు, సమీరాకాశాలను కేవలం తన కడకంటి చూపుతో, 4 అంగుళాల అరచేతిలో ఇమిడపోయిన ‘రిమోట్’ ఒకచోట వ్రేలి కొస నొక్కుతో శాసించగల్గిన మానవుడికేనా – ఈ చింతనీయ గతి!
త్రివిక్రముడులా అపరపరాక్రమంతో ఒక కాలు భూమిపై నుంచి, మరోకాలు చంద్రమండలాన్ని తాకి విర్రవీగిన మానవుడికేనా – త్వరలో అంగారక సదృశ గ్రహాన్ని ఆవాసంగా మార్చుకోబతోన్న మానవుడికేనా ఈ దుస్థితి!
‘సర్వాంతర్యామి’ అనే వాడెవడో, ఎక్కడో లేడని, భూలోకంతో సహా 14 భువనాలు తనవేనని, తనే సర్వవ్యాపి, సర్వంతర్యామి, సర్వంతనేనంటూ విర్ర వీగుతూ తనే మాన్యుడనీ మరెవరినీ కొలువొద్దని విర్రవీగుతోన్న అసురసంధ్యవేళ పుచ్చిపోయిన మొగురం (స్థంభం)లోంచి, అటు మనిషి కాక ఇటు జంతువుకాని ప్రాణి ఉద్భవించి తన ఇనపగోళ్ళతో గర్వాంధుడు మదాంధుడు అయిన హిరణ్యకశిపుడిని సంహరించినట్లు, అటు సురల్నీ ఇటు అసురుల్నీ, తన ఉనికి, స్థితి, చింతనకు తెచ్చినట్లు –
ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఊహించను కూడా వీలుకాని ‘ఊహాన్’ నగరంలో, బొగ్గురామిత్రవ్వే చీకటి గనుల్లో, అటు జంతువుకాక ఇటు పక్షీ కాక, నోరు, విసర్జక అవయవం ఒక్కటే అయి, పరమ రోత కలిగించే గబ్బిలం కడుపులో పుట్టి, మానవ హిరణ్యకశిపుల్ని నిర్దయగా, నిర్దాక్షిణ్యంగా అన్ని జాగ్రత్తలకు అతీతంగా, పేద ధనిక ఆడ, మగ, ఇక్కడ అక్కడ, అనే తేడా చూపకుండా ఈ మానవ హిరణ్యాక్షులను తన వాడిగోళ్లతో, కళ్లకు కనిపించక, దును మాడటం ఏమిటి?
అంతటి అసమాన పరాక్రమశాలి, అతులితబలుడు అస్త్ర, శస్త్ర సంపన్నుడూ అయిన మానవుడు ఈ కంటికి కనిపించని శ్రతువు ఖడ్గ ప్రహారాలకు బెంబేలెత్తి, కకావికలై ‘తాను శాసిస్తున్నాను’ అనుకున్నా ఉచితంగా ప్రకృతిలో అనాయాసంగా, ఆయాచితంగా దొరికే వాయువు; ప్రాణవాయువు, ప్రాణాధార సమీరాన్ని లీటర్ల చొప్పున లక్షలు వెచ్చించి కొనుక్కోవటం ఏమిటి? ఇంతా చేసినా, లక్షలు ధారపోసినా, ప్రాణాలు దక్కక విలవిలలాడటం ఏమిటి?
ఇంత చేసినా, బ్రహ్మ కలంపోటుతో కసువుగా మారి అసువులు బాస్తే – పూడ్చటానికో, కాల్చటానికో ఆలుబిడ్డలకు దూరమై ‘అనాధ’ చావు చస్తే, ఎవరూ భయంతో రాకపోతే, మ్యునిసిపాలిటీ వాడి కుక్కల బండే, వైకుంఠరథమై ప్రయాణం కట్టటం ఏమిటి? విలయం కాకపోతే, ఇది ఏమిటి?
సర్వాంతర్యామి మానవాతీత శక్తి మహాదేవుడు – ఎవరూ లేరని అన్నీ తానేనంటు, అన్ని వనరుల్ని అప్పనంగా అనుభవించాల్సింది తానేనని విర్రవీగిన ఈ మానవ హిరణ్యాక్షుడిని కరోనా – అవును- కరోనా ఎక్కడి నుండి ఎక్కడకు దిగజార్చింది!
ఇలాంటి గతిలో, దుర్గతిలో నరజాతి సమస్తం విలవిల్లాడుతోంటే – చీకటి కుహరంలోకి త్రోయబడి చివరకు గాలి కూడా ఆడని గతిలో, 68 కళలు సాహిత్య సౌరభాలు గానసభలు, కళారంగ భారతిలు ఎవరడిగేను? ఎవరికి గుర్తు వచ్చేను?! సన్మాన పంచాంగాలు కాదు: ప్రాణాంగ దక్కితే చాలు; గండం గడిస్తే చాలు; బలుసాకు తినగలిగే స్థితిలో ఉన్నా చాలు.
మనల్ని ఈ కష్టకాలంలోంచి పైకి చేదుకునే ప్లహ్లాదుడు – అదుగో వస్తున్నాడు. సూది మొనయై మన భుజకండాల్లోకి, సున్నితంగా దిగబడి మనలో ఎదురిచే అస్త్రశ్రస్తాలను నింపటానికి వస్తున్నాడు. చిక్కగా క్రమ్ముకుని మసకేసిన మబ్బులు ప్రపంచాన్ని చెదరగొడుతూ చెదిరిన మబ్బు పూలదండ ఆయన గళహారంగా ప్రకాశిస్తోంటే , మనల్ని ఆదుకోవటానికి, చేదుకోవటానికి వాక్సీనై వస్తున్నాడు.
మనల్ని ఈ సమస్య వలయంలోంచి పైకి లాక్కుని అలిసిన మన ‘పాల’ బంధువుల్ని తుడిచి స్వాంతన చేకూర్చుతాడు. సకల కళాభారతిని గంధర్వగాన సభల్ని మళ్ళీ వింటాము. చింతవద్దు. తొందరవద్దు.
(బుర్రా లక్ష్మీనారాయణగారి మబ్బుదండ (పాలపిట్ట మే 21) చదివాక.
లేఖలు అంటుంటేనే..
మనసు గతంలోని జ్ఞాపకాల్లోకి పరుగులు పెడుతుంది. ఇవి సమాచార మాధ్యమాలే కాదు, ఇరు మనసుల భావోద్వేగాలను మోసుకుపోయే పావురాలు కూడా! ఇతర ప్రక్రియల్లాగే సాహిత్యంలో లేఖారచనా ప్రాశస్త్యం కూడా అనన్య మైందే.! కమ్యూనికేషన్లు పెద్దగా విస్తరించని కాలంలో లేఖలే మనుషుల మధ్య వారధులు.
ఇవి మనసులను కలిపే రహదారులు.
ఒక మనిషి అంతరంగాన్ని లోలోపలి ఉద్వేగాల్ని మరో మనిషికిఅందజేసే వాహికలు.
ఉత్తరం రాయటం ప్రత్యుత్తరం కోసం ఎదురుచూడటం అదీ ఓ త్రిల్లింగ్..! ఉభయకుశలోపరి అంటూ మా నాన్న రాసిన ఉత్తరం నా కళ్ళముందిప్పుడు రెపరెపలాడుతోంది నాన్న దూరమైనా ఆ ఉత్తరాలు మాట్లాడుతూ భరోసానిస్తూనే ఉంటాయి. మాటలు గాలిలో కలిసి పోతాయి గానీ, రాతలు మిగిలిపోతాయి. కాలం గడుస్తున్న కొద్దీ మధురానుభూతులను పెంపొందిస్తాయి. ఆర్కైవ్ లోంచి పాత ఉత్తరాలను చదువుతుంటే.. ఓహో! అప్పటి పరిస్థితులు ఇవ్వా.! అప్పటి ఆలోచనలు ఇట్లా ఉండేవా అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా… అనిపిస్తుంది కదా..!
ఇంతటి ప్రాధాన్యత గల లేఖలు కాలక్రమంలో అంతరిస్తున్నాయంటేనే అదో రకమైన వేదన. నేడు లేఖల స్థానంలో సోషల్ మీడియా వచ్చి చేరడంతో లేఖలు రాసుకునే మంచి అలవాటు తగ్గిపోయిందనే చెప్పవచ్చు. అలాంటి ఈ సమయంలో వెలువడిన ‘లేఖావలోకనం’ డెబ్భై లేఖలతో కూడిన ఉత్తరాల పొత్తం తెలుగులో మొదటిది. ఈ గ్రంధానికి సంపాదకత్వం వహించిన
సాహితీవేత్త ప్రముఖ కవియిత్రి, కథయిత్రి నిత్యమూ అక్షరాలతో జ్వలించే జ్వలిత అభినందనీయులు..!
దీంట్లోని ఒక్కొక్క లేఖా గుండె లోతుల్లోంచి ఉబికి వచ్చిన కన్నీటి చుక్క..! ఇవి మనసు విప్పి మాట్లాడుతాయి భావోద్వేగాలను కురిపిస్తాయి. దీంట్లొని కొన్ని లేఖలు ఆవేశంతో రగిలిపోతే మరికొన్ని ఒళ్ళు జలదరింప చేస్తాయి.
అనిశెట్టి రజితగారి లేఖ “స్త్రీ బలిపశువూ, భోగవస్తువూ ఏకకాలంలో అయిపోయింది.. కావున స్త్రీలకు వేరే ఆకాశం వేరే నేలా కావాలంటే దాంట్లో తప్పేముంది!? స్త్రీల రక్షణకు ప్రత్యేక సామాజిక సూత్రాలేమైనా రూపొందించారా, తుప్పు పట్టిన చట్టాలతో ఆడపిల్లలను ఎలా రక్షితంగా చూడగలం..!?” అంటూ వారి ఆక్రోశాన్ని వెలిబుచ్చారు. నిజమే ఆకాశంలో సగం ఉన్న స్త్రీలకు చట్టాల్లో, చట్టసభల్లో ప్రాధాన్యత కరువైపోయింది నేటికీ..
ఆచార్య సూర్యాధనంజయగారి లేఖలో స్త్రీల వెనకబాటు తనం పోవాలంటే..”ప్రతీ మహిళ ఒక రాణి రుద్రమ, సమ్మక్క సారక్క, ఇందిరాగాంధీ, సరోజినీనాయుడు, చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, కిరణ్బేడీలా తమను తాము మార్చుకోవాలి అంటారు.” అందుకుగాను మరేం చేయాలి వారు!? ఏముందీ ముందుగా విద్యనభ్యసించి తమ కాళ్లపై తాము నిలబడి ఆత్మనిబ్బరంతో అడుగు ముందుకెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కట్టా శ్రీనివాస్ గారి లేఖ వాళ్ళ అమ్మాయికి ఎన్నో మంచి మాటలు చెప్తూ రేపు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో.. ఏమి మానాలో ఏమి మానకూడదో జీవితానికీ కవిత్వానికీ వర్తించేలా సున్నితంగా స్ఫూర్తి దాయకంగా చెప్తారు. ఇలాంటి తండ్రులు సమాజంలో ఉన్నంతకాలం, ఏ అమ్మాయీ అబలా కాదు అనుకున్నది సాధించే తీరుతుంది.
కుప్పిలి పద్మ గారి లేఖ “స్త్రీల జీవితాల్లో బై చాయస్ పెళ్లి చేసుకోవడం చదువుకోవడం నచ్చిన పని చేయడం ఆమెకే ఉండాలంటారు. లైంగిక దాడులకు ప్రధాన కారణం పురుషాధిక్య ఆలోచనా ధోరణే.. దీన్ని అడ్డుకోవడానికి చట్టాలే కాదు సాంస్కృతిక విప్లవం అత్యంత అవసరమే” అంటారు.
నిజమే.. జరుగుతున్న పరిణామాలను బట్టి ఆలోచిస్తే.. స్త్రీ తనను తాను తిరిగి తీర్చి దిద్దుకోవలసిన ఆవశ్యకత ఆసన్నమైంది. లేదంటే వాడిపారేసే కరివేపాకో.. తొక్కి నడిచిపోయే బండ లాగే చూస్తారు.!
తిరునగరి దేవకీ దేవి గారి లేఖలో “స్త్రీల మీద చిన్న చూపు వేధింపులు రూపుమాపబడాలి అంటే ప్రభుత్వ విధి విధానాలలో మీడియాలో కోర్టు తీరుతెన్నులలో విద్య విధానాలలో సమూలంగా మార్పు వస్తే తప్ప హత్యాచారాలకు ముగింపు పలుకలేమని “ఘంటాపథంగా తెలియజేశారు. వ్యక్తుల్లో వ్యవస్థల్లో ఇప్పటికైనా మార్పులు రావాల్సిన అవసరం
ఎంతైనా ఉంది.
ఈ ‘లేఖావలోకనం’లో అధ్యాపకులు ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువే.. వారు వారి వారి విద్యార్థులకు.. లేఖల ద్వారా హితోపదేశం చేశారు.. నాంపల్లి సుజాత తన విద్యార్థికి లేఖ రాస్తూ సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అత్యాచారాలు సూచనప్రాయంగా తెలియచేస్తూ తదనుగుణంగా “ఆడపిల్లలు క్రమశిక్షణ నియమనిబంధనలు జీవన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి” అన్నారు.
కొండపల్లి నీహారిణీగారిది సందేశాత్మక లేఖాసారాంశం..” అమ్మాయిల మీద హింస రూపుమాపాలంటే బళ్లను వేదికలుగా చేసుకొని, పాఠ్య పుస్తకాల్లో స్థాయీలవారీగా, విలువలనూ, ఆత్మస్థైర్యాన్నీ మిళితం చెయ్యాలంటారు”..అవును
మొక్కప్పటినుంచే విలువలతో కూడిన విద్య నేర్పినట్లైతే తప్పక ఫలితాలుంటాయి.
శిలాలోలితగారు వారి లేఖలో ఇలా అంటారు “తప్పు జరిగాక విచారించే కంటే మూలాల్లోకి వెళ్ళి విశ్లేషించుకుంటే బాగుంటుందని” కొన్ని కారణాలను కూడా తెలియజేశారు. “తలుపులేని గుడిసె బతుకులో తప్పనిసరిగా చూసే అమ్మానాన్నల లైంగిక చర్యలు, తాగిన తండ్రి ప్రేలాపనలు, కుటుంబంలో దొరకని ప్రేమ, స్నేహం, కరుణ వల్లే యువత దారి తప్పవచ్చు అంటారు”.
మూలాలకు చికిత్స చెయ్యాలి గానీ.. పుండెక్కడో ఉంటే మందింకో కాడా అయితే..ఎలా..!? శైలజామిత్రగారు ఎవరిని ఏమీ నిందించలేక కాలానికో లేఖ రాశారు. దేశంలో ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట స్త్రీ మానభంగానికి, అవమానానికి, హింసకు గురవుతుంది. “భయం పోగొట్టే చట్టం బాధను పోగొట్టే చుట్టం “ఉండాలంటారు. కనీస ఓదార్పూ బాధిత మహిళలకూ అవసరమే..!
చదువుల తల్లి సావిత్రిబాయి గారికి విన్నవిస్తూ జ్వలిత గారిలేఖ ఇప్పటి సమాజ పోకడలు, జరుగుతున్న అత్యాచారాలకు కారణాలతో పాటు పరిష్కారాలు సూచిస్తూ.. “ఆడపిల్లలకు అక్షరజ్ఞానమూ రక్షణ నైపుణ్యాలను ఆత్మస్థైర్యం పెంపొందించాలంటూ.. మనుష్యులను ప్రేమించే విలువలను పిల్లలకు నేర్పాలంటూ” వారి లేఖా సారాంశం.
ఎవరో వస్తారని.. ఏదో మారుస్తారనీ ఎదురు
చూడకుండా ఎవరికి వారే మారాల్సిన
అవసరం ఇప్పుడత్యంతావశ్యకం..!
ఇంత అమూల్యమైన ఈ పుస్తకంలో మరిన్ని పరిమళాన్ని జోడించినట్లు ప్రముఖుల లేఖలు ప్రచురించడం ముదావహం..! సావిత్రిబాయి పూలే జ్యోతిబాపూలేకు వ్రాసిన ప్రేమ లేఖలు, సావిత్రిబాయి శిష్యురాలు ముక్తాబాయి పత్రికకు రాసిన తిరుగుబాటు లేఖ,
ఔరంగజేబు తన గురువుగారికి రాసిన అమూల్యమైన లేఖ, అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ వారి అబ్బాయి గురించి ఉపాధ్యాయులకు వ్రాసిన లేఖ, బోయి భీమన్న గారి లేఖ..
ఆ అమూల్యమైన లేఖలని చదువుతూ ఆ కాలానికెళ్లి పులకించిపోతాం..! పుస్తకానికి ముందుమాటలు ఆచార్య సూర్యాధనుంజయ్ యశస్వి సతీష్ శీలా సుభద్రాదేవి గారల మాటలు పుస్తకానికి మరింత శోభనిచ్చాయి.. ఇక శేషబ్రహ్మం గారి కవర్ పేజీ అందంగా, అర్ధవంతగా అదనపు ఆకర్షణగా అమరింది..!
ఈ పుస్తకం ద్వారా జ్వలితగారు ఆశించిన మార్పు తప్పకుండా రావచ్చనీ.. వస్తుందని కోరుకుంటూ వారికి హార్థికాభినందనలతో…!
ప్రతులు..
జ్వలిత,సాహితీవనం.
15-21-130/బాలాజీ నగర్
కూకట్పల్లి..72
హైద్రాబాద్..
మొబైల్..9989198943
మెయిల్..jwalitha2020@gmail.com.
మనం అనేక రచనలు చదువుతుంటాము. వాటిల్లోని ఆ కథ ఎక్కడో ఓ ప్రదేశం లో జరుగుతూంటుంది.అది నగరమో,పట్టణమో,పల్లెనో…కానీ ఒకసారి చదివేసి అవతల పెట్టేసిన తరువాత కూడా ఆయా ప్రదేశాలు మనల్ని అంత త్వరగా వదలవు. మనం మానసికంగా అక్కడికి ప్రయాణం చేస్తూనే ఉంటాము.రచయిత ఎంతో మమేకమై రాస్తే తప్పా దాన్ని మనం అంతగా అనుభూతి చెందలేము. ఈ కళ అందరి లోనూ సమానంగా ఉండదేమో..!వారి పరిశీలనాశక్తి ఇంకా దాన్ని అక్షరాల్లోకి మార్చే వారి మంత్రజాలం లో ఉంటుందేమో.
ఉదాహరణకి చార్లెస్ డికెన్స్ ని చదివితే లండన్ లోకి,థామస్ హార్డీ ని చదివితే వెసెక్స్ లోనికి,మార్క్ ట్వైన్ ని చదివితే మిసిసిపి లోకి, విలియం ఫాల్క్నర్ ని చదివితే అమెరికా దక్షిణ భాగం లోని లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్ళిపోతాము.ఇక పారిస్ ప్రయాణం చేయాలంటే గై డి మపాసా ని ,పీటర్స్ బర్గ్ లోకి వెళ్ళాలంటే దోస్తోవిస్కీ ని చదవవలసిందే. జేన్ ఆస్టిన్ ఆవిడ తన జీవితమంతా ఓ పల్లె ప్రాంతం లోనే ఉన్నది,ఆ అందాలన్నీ ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ వంటి నవలల్లో చూడవచ్చు.
అసలు ఆ అందమంతా ఎక్కడనుంచి వస్తుంది.ఏ ప్రదేశమైనా గానీ దానికి ఓ రంగు ,రుచి ఉంటుంది.అది అక్కడి పరిసరాల్లోనూ,మనుషుల్లోనూ,వాతావరణం లోనూ గూడు కట్టుకుని ఉంటుంది.దాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఎలాంటి జడ్జ్ మెంట్ లేకుండా చిత్రించినపుడు ఒక నిజాయితీ ఉట్టిపడుతుంది.సరైన మాటలు పడాలి.అవి పఠిత కి దృశ్యాన్ని చూపించాలి.అలా అన్ని సార్లు జరుగుతుందా కష్టమే.కాని కొంతమంది లో ఆ నేర్పు పిసరంత ఎక్కువగా ఉంటుంది.
అలాగే జోసెఫ్ కోన్రాడ్ ని చదివితే మనం సముద్రం మీద తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది.ఎందుకంటే తను అలానే జీవించాడు కాబట్టి.అలా అని సముద్రం మీద తిరిగినవాళ్ళు అందరూ అలా రాశారా అంటే లేదనే చెప్పాలి.ఒక భావాన్ని ఎంతో నేర్పుగా దృశ్యమానం చేసే కళ ఇలాంటి వారి లో చాలా ఎక్కువ గా ఉన్నదని అనిపిస్తుంది.ఇది నాకోసం,నేను నా హృదయభారాన్ని ఆపుకోలేక రాసుకున్నది …మీకు నచ్చిందా సరి లేదా మంచిది అన్నట్లుగా ఉంటాయి కొన్నిసార్లు వారి రాతలు.అక్కడే వస్తుంది ఓ నిజాయితీ తో కూడిన అందం.
సోమర్సెట్ మామ్ ,గ్రాహం గ్రీన్ కథలు వాళ్ళ పర్యటనా ప్రభావం అనుకుంటాను,వివిధ ప్రదేశాల్లో ఆయా పాత్రలు జవ జీవాలతో ఉంటాయి. ఇక మన దేశం లోని ముస్సోరి లో నివసించే రస్కిన్ బాండ్ గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది. ఆయన రచనలు చదువుతుంటే హిమాలయ సానువుల్లోని గుట్టలు,మిట్టలు,చెట్లు చేమలు,జంతువులు,కీటకాలు,అక్కడి శిధిల నిర్మాణాలు ఒక్కటేమిటి ఆ ప్రాంతం లోకి వెళ్ళి విహరించినట్లుగా ఉంటుంది.

EM and the big HOOM అనే ఈ ఆంగ్ల నవల ని చదవడం పూర్తి చేసిన తర్వాత అనేక భావాలు ముప్పిరిగొన్నాయి.అసలు టైటిల్ పెట్టడం లోనే ఓ తికమక ఉంది అనిపించింది.అయితే చదివిన తర్వాత ఇదే సరైన టైటిల్ అనిపించింది.ప్రస్తుతం మన దేశం లో ఆంగ్లం లో రాసేవారి సంఖ్య బాగా పెరుగుతోంది.ఇది భారతీయ ఆంగ్లం…భారతీయ వాస్తవికతని మోసుకువచ్చే వాహకం.సగర్వం గా తనదైన ఘుమ ఘుమలతో ప్రపంచవేదిక పైన తన పరిమళాల్ని వెదజల్లుతున్నది.
ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇమెల్డ తీవ్రమైన మానసిక సమస్యలకి గురి అయి పేరానాయిడ్ గా మారుతుంది.ఉదాహరణకి మున్సిపాలిటి వాళ్ళు రోడ్డు పక్కన గోతులు తవ్వితే అది తన మీద కుట్ర చేయడానికే అన్నట్లు భావిస్తుంది.అలా అనేక పరిస్థితుల గుండా నలుగురు ఉన్న కుటుంబం తమ జీవనాన్ని కొనసాగిస్తుంది.ఆమె చేసే పనులు ,మాట్లాడే మాటలు చదువరులకి కొన్నిసార్లు జాలి కొన్నిసార్లు కోపం పుట్టిస్తాయి.EM అనేది ఇమెల్డ కి,BIG HOOM అనేది అగస్టస్ కి పెట్టిన ముద్దు పేర్లు వంటివి.అదే ఈ పుస్తకానికి టైటిల్ అయ్యింది. ఊహించని ట్విస్ట్ లు అలాంటివి ఏమీ ఉండవు గాని, ఒక మానసిక సంతులనం కోల్పోయిన వ్యక్తి తో అందరూ దయగలిగి ప్రవర్తించాలనే సందేశం అంతర్లీనం గా దీనిలో ఇవ్వడం జరిగింది.రచయిత ఓ చోట చెప్పినదాని ప్రకారం 72000 పదాలు (ఇంచుమించు వార్ అండ్ పీస్ నవల సైజు) తాను ఒరిజినల్ గా రాస్తే దాన్ని ఆ తర్వాత 235 పేజీలకి కుదించడం జరిగిందట.
సరే…రచయిత విషయానికి వస్తే వీరి పేరు జెర్రీ పింటో. గోవా కి చెందిన రోమన్ కేథలిక్ కుటుంబం నుంచి వచ్చారు.ఒకప్పుడు గోవా ప్రాంతాన్ని పోర్చ్ గీస్ వారు పాలించిన విషయం మనకు తెలుసు.ప్రస్తుతం వాళ్ళు లేరు,కాని వారి సంస్కృతి తో ముడిపడిన ప్రజలు మిగిలిపోయారు.డిసూజా,పెరీరా,డి
ఈ నవల ఇతివృత్తం గూర్చి చెప్పాలంటే మానసికంగా దెబ్బతిన్న ఒక మాతృమూర్తి కథ.ఆమె పేరు ఇమెల్డ. ఆమె భర్త పేరు ఆగస్టస్.కూతురి పేరు సుసాన్.కొడుకు పేరు ఏమీలేదు.ఆ కొడుకు తన గొంతు తో ఈ కథ ని మొత్తం వినిపిస్తుంటాడు.అంటే కొడుకు చివరి దాకా పేరు చెప్పడు.రచయితనే మనం ఆ కుమారుని గా భావించవచ్చు. కథ చెప్పే పద్ధతి లో ఒక విన్నూత్నమైన విధానాన్ని అనుసరించాడు. దానివల్ల కొంతమంది పాఠకులు గజిబిజి పడినా ఆశ్చర్యం లేదు.అయితే భాష సరళతరమైన శైలి లో సాగుతుంది.
ఉదాహరణకి ఇమెల్డ అనే తన తల్లికి ఎప్పుడు ఏ కారణం చేత ఈ పిచ్చి అనేది వచ్చింది అనేది తెలుసుకోవడానికి కొడుకు అనేకరకాలుగా ప్రయత్నిస్తుంటాడు.బై పోలార్ డిజార్డర్,పేరానోయా ఇలాంటి మానసిక సమస్యలచేత ఆమె బాధపడుతూంటుంది.ఆమె మాత్రం ఇతరుల దృష్టిలో మెంటల్ లేదా పిచ్చిది.అంతే.కాని ఈ కొడుకు చాలా ఓపిక గా ఉంటూ ఆమె ని మాటల్లో పెట్టి సమాధానాలు రప్పించడం ద్వారా,ఆమె రాసిన ఉత్తరాలు,డైరీలు పరిశీలించడం ద్వారా కొంత విషయాన్ని తెలుసుకుంటూంటాడు.
వీరి కుటుంబం పేరు మెండిస్ ,కొన్ని ఏళ్ళ క్రితం జీవనోపాధి వెదుక్కుంటూ గోవా ప్రాంతం నుంచి బర్మా వెళ్ళి మళ్ళీ ముంబాయి వచ్చి మహీం అనే ఏరియా లో స్థిరపడతారు.అక్కడ ఒక చిన్న అపార్ట్మెంట్ లో నివసిస్తూంటారు.మధ్య తరగతి కుటుంబం అని చెప్పాలి.ఇమెల్డ తాను యవ్వనం లో ఉన్నప్పుడు ఎలా చదువుకున్నది,ఉద్యోగ జీవితం గడిపింది,ఎలా ఆగస్టస్ తో ప్రేమ లో పడింది,ఏ విధంగా ఆమె తల్లిదండ్రుల తో గోవా ప్రాంతం లో గడిపింది ఇంకా ఇలాంటివి సమస్తం మనకి ఇమెల్డ చెబుతుంది.అంటే కొడుకు మాటల్లో పెట్టి అడిగినప్పుడు పేజీలు పేజీలు గా ఆమె చెప్పుకుపోతుంది.అలా కథ నడుస్తుంది.
కూతురు సుసాన్ గాని,భర్త అగస్టస్ గాని ఎంతో ఓపికతో ఈమె ని చూసుకుంటూంటారు. ఎందుకంటే ఉన్నంతసేపు బాగానే ఉంటూ ఒక్కోసారి ఇష్టం వచ్చినట్టు తిట్టడం చేస్తుంది.కొన్నిసార్లు రోడ్డు కి అడ్డం గా వెళ్ళి సూసైడ్ ప్రయత్నం చేస్తుంది.ఇంట్లో ఉన్నంతసేపు బాగా టీ తాగుతుంది లేదా బీడీలు కాలుస్తుంది.ఇంకా కూతురు లేదా కొడుకు తో మాట్లాడేటప్పుడు కూడా సెన్సార్ అనేది ఏమీ ఉండదు.మనసు లో వచ్చినదంతా మాటాడేస్తుంది.నిజం చెప్పాలంటే నవల అంతా పిచ్చి వచ్చిన వారి ప్రవర్తన మీద కేంద్రీకరించి రాసినట్లుగా అనిపిస్తుంది.చివరకి ఆమె ఒక హాస్పిటల్ లో మరణిస్తుంది.ఆమె జీవించిఉన్నప్పుడు జరిగిన సంగతులు తలుచుకుంటూ మిగతా ముగ్గురు బాధపడుతుండగా నవల ముగుస్తుంది.235 పేజీలు ఉన్న ఈ నవల ని అలీఫ్ బుక్ కంపెనీ వారు ప్రచురించారు.
ఈ నవల కి 2016 లో సాహిత్య అకాడెమీ అవార్డ్, వింధాం కాం బెల్ అవార్డ్ వచ్చింది.2012 లో హిందూ లిటరరీ పురస్కారం వరించింది.సాల్మన్ రష్దీ,అమితావ్ ఘోష్,కిరణ్ దేశాయ్ వంటి ప్రముఖులు ఇచ్చిన కితాబులు ఈ పుస్తకం లో ప్రచురించారు.ప్రస్తుతం జెర్రీ పింటో, మెల్ జోల్ అనే స్వచ్చంధ సంస్థ తో కలిసి పని చేస్తున్నారు.కాలమిస్ట్ గా కొన్ని పత్రికల్లో రాస్తుంటారు.అంతేగాక ఔత్సాహిక రచయితల కోసం వివిధ నగరాల్లో తరగతులు కూడా నిర్వహిస్తుంటారు.
– మూర్తి కెవివిఎస్ (ఫ్రీ లాన్సర్, ఖమ్మం)
ఫోన్: 7893541003
“సిస్టర్ అనసూయ ” సమాజ సమస్యలను శతక
పద్యాల్లో ఇమిడ్చి రాసినందుకు ముందుగా అభినందనీ యురాలు .
పున్నామ నరకం నుంచి తప్పించేది కొడుకనే లోతైన భావన యుగాల తరబడి పాతుకుని పోయింది. ఆడపిల్ల
కు జన్ననిచ్చిందని తాళికట్టిన బార్యను వదిలి మగ పిల్లాడి కోసం మరొక ఆడదాన్ని పెండ్లి చేసుకొని సంసారం
చేసే మగాళ్ళు ఎంతమందో. ఈ శతకంలో…
సుతుడు లేకపోతె స్వర్గంబు లేదని
ఆడ పిల్లలాని ఆడ వదిలి
మరల పెండ్లి యాడె మగపిల్లల కొరకు
శుద్ధి చేయు తండ్రి! సృష్టికర్త!!
బంధాలు, అనుబంధాలను మరిచిపోయి అనుక్షణం ధన
వ్యామోహంలో పడి ఎటువంటి ప్రేమకు నోచుకోనివాడే
నిజమైన నిరుపేద. సంపాదన కోసం ఎటువంటి పని చేయడానికి వెనుకాడడు. అందుకే కవయిత్రి ” బహు
ధనంబు ఉన్న భాగ్యవంతుడైన ప్రేమ లేనివాడు పెంట బోలు ” అంటున్నారు.
ఆడపిల్ల పుట్టిందనగానే చెత్త కుప్పమీద పడవేసేవారు
కొందరు, కడుపులోనే నులిమేసేవారు కొందరు, పుట్టగానే
అమ్మేవారు మరికొందరు ఇన్ని సమస్యలను ఎదుర్కొంటు న్న ఆడపిల్ల. భూమిపైన మనుగడ సాగిస్తున్న తరుణంలో
పాపపు కళ్ళు పడుతున్నయి. బడిలో, గుడిలో, రైళ్ళలో,
రెస్టారెంట్లో, బస్సులో , ఆఫీసుల్లో ఎక్కడా ఆమెకు రక్షణ
లేకుండా పోతుంది. ఇటువంటి విపత్తులను చూసి చలించిన ” సిస్టర్ అనసూయ ” తన శతక పద్యాల్లో తోటి
మహిళల పట్ల సానుభుతి తెలుపుతూ తన స్పందన
కనబరిచారు . ” చిన్న బాలికయని చూడకుండా వాడు పాడు చేసినాడు పాపమనక/ పశువులకును తెలుసు
పరిపక్వత వయస్సు/
దీనికి కారణం మద్యపానం అంటూ…..
కల్లు సార తాగి కండ్లు మూసుకపోయి తల్లి బిడ్డ యాని
తేడ లేక/ పశువులాగ నరులు పాపంబు జేస్తుండ్రు/
అని తన ఆవేదన వ్యక్తపరిచారు.
విముక్తి నవలా రచయిత్రి–సిస్టర్ అనసూయ ఎం.ఎ సోషియాలజీ ఉపాధ్యాయురాలు (ప్రవేట్), anasuya344@gmail.com
” కవి క్రాంతదర్శి, మార్గదర్శి అటువంటి కవులకు కూడా ఈ మధ్య కవితలు రాసేవారిని నిందిస్తూ, పద్యం రాసేవా రిని దూషిస్తూ చిన్నచూపు చూడడం ఒక ఎత్తు అయితే
ఒకరిపై మరొకరు ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం , విచ్చ
లవిడిగా సమూహలు పెడుతూ సాహిత్య వేదికలు మాట
ఏమో గాని కలహలు పెట్టుకుంటూ అసలైన తమ బాధ్య తను విస్మరిస్తున్నారు. ప్రజా సమస్యల పట్ల స్పందించి
వారికి చేదోడువాదోడుగా ఉండాల్సిన కవులు, రచయిత లు తగువులు పెట్టుకుంటూ పోతే సమాజం లోని సామాన్య ప్రజల పరిస్థితి ఏమవుతుంది ఇది తరతరాల కు ఆదర్శంగా నిలిచే కవులు, రచయితలు అందరూ కూడ ఆలోచించాల్సిన విషయం. కవయిత్రి మాటల్లో…
” కవుల మధ్య ఎన్నొ కలహములున్నవి
ఎవరి తిక్క వారికెక్కువాయె
మల్లెలోలె వారి మనసు ఉండుటకును
శుద్ధి చేయు తండ్రి! సృష్టికర్త!!”
మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాల పక్కన
నిలబడాలని ప్రయత్నిస్తున్న కాని కుల మత, ప్రాంతీయ,
వర్గ, లింగ వివక్షత, ఆర్థిక విభేదాలు అడ్డుగోడలవుతు న్నాయి .
” ఆడ – మగ కులములె అంతట నుండగా
భరత దేశమందె బహుకులముల?
ఆర్యులొచ్చి చేసె అన్ని కులములను
శుద్ధిచేయు తండ్రి! సృష్టికర్త!!”
” సిస్టర్ అనసూయ సృష్టికర్త శతకంలో ” సంప్రదాయాలు,
సామాజిక స్పృహ కలిగిన ఆర్థిక, రాజకీయ, న్యాయ వ్యవస్థ పనితీరును ప్రశ్నించిన శతకాలు, పేదరిక బాధలు,
సాంస్కృతిక, సాంఘిక, అసమానతలు గురించిన ఎన్నో
ప్రేరణాత్మక, స్పూర్తిధాయకమైన శతకాలు ఉన్నాయి. ”
ఈ ఆటవెలది పద్యాలను చదవాల్సిన అవసరం
ఎంతైనా ఉంది. ఇంత మంచి పుస్తకాన్ని మనకు అందించి న కవయిత్రికి హృదయపూర్వక అభినందనలు.
ప్రతులకు:
సిస్టర్ అనసూయ
ఇంటి నెం. 5 – 12 – 409/3
బి .టి. యస్, నల్లగొండ – 508001
చరవాణి: 9492728122, 8074573716
-సమీక్షకురాలు: యడవల్లి శైలజ ( ప్రేమ్)


<—-Burra Venkatesham(I.A.S.)
మకుటధారియై తెలుగు సాహిత్యంలోకి.. శతకం ఎప్పుడు వచ్చిందో సాహితీవేత్తలకు తెలుసు.. అప్పటి నుండి ఇప్పటివరకు మెరుగులు దిద్దుకుంటూ వస్తూనే ఉంది. మకుటం తలపై ఉంటుంది. కాని శతకంలో సర్వసాధారణంగా క్రిందనే ఉంటుంది. క్రింద ఉండేవి పాదాలు.. శతకం నిండా పాదాలే ఉంటాయి.. అందులో క్రింది పాదం కాని, ఆ పాదంలో కొంత భాగం కాని మకుటంగా ఉంటుంది. శతకంలో జీవితమ్ ఆవిష్కరింప బడుతుంది. ఎందరో మహానుభావులు తమ జీవితానుభవాన్ని రంగరించి.. శతకాలను మనకు అందించారు. జీవన సత్యాలను అద్భుతమైన రీతిలో ఛందోబద్ధంగా పద్యాలను రూపుదిద్దిన వారున్నారు. ఛందస్సనే సంకెళ్లలో బంధించబడటం వల్ల… నేటి ఆధునిక ప్రపంచానికి తగిన విధంగా శతకాలు రావడం లేదు.. నేటి తరానికి ముఖ్యంగా యువతీ యువకులకు సులభంగా పద్యాల్లోని సారం.. సందేశం అర్థమయ్యే రీతిలో.. ఛందస్సును కాస్త ప్రక్కన పెట్టి… నిఘంటువు సహాయం లేకుండా.. చదవగానే మనసుకు హత్తుకునేలా శతకాలు రావలసి ఉంది.
ఈ క్రమంలోనే… సీనియర్ ఐఏఎస్ అధికారి.. సాహిత్యమంటే మక్కువ చూపే తెలుగు భాషా ప్రేమికులు శ్రీ బుర్రా వెంకటేశం గారు తమ అంతరంగంలో గుట్టుగా, గుట్టగా గూడుకట్టుకున్న భావాలను.. జీవన సత్యాలను.. అక్షరబద్ధం చేస్తూ “జీవన ధన్య శతకం” పేరుతో ఓ గ్రంథాన్ని వెలుగులోకి తేవడం ఆహ్వానింపదగింది.. ఛందస్సుతో పని లేకుండా.. సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ శతకంలో వెంటేశంగారు పద్యాలను పొందుపరిచారు. సదా పరిపాలనలో క్షణం తీరిక లేకుండా ఉండే ఆయన.. లోకహితం కోసం.. సామాజిక చైతన్యం కోసం.. జన జాగృతికై.. తమ జీవితానుభవాలను ఏర్చి కూర్చి చక్కని పదబంధాలతో పద్యాలను అల్లడం ప్రశంసనీయం.. సార్వజనీన అంశాలకు పెద్దపీట వేస్తూ.. ఓ దార్శనికునిగా ఇప్పటి తరానికే కాదు.. రాబోయే తరాలకు సైతం.. మార్గదర్శకంగా ఉండేందుకు వీలుగా.. తమ లోక పరిశీలనను జోడించి.. మేధస్సును మేళవించి ఇందలి పద్యాలకు జీవం పోశారు. యువతీ యువకులకే కాక అన్ని వయసుల వారికి ఉపయుక్తంగా ఉండేలా తీర్చిదిద్దారు.
తెలంగాణ ప్రభుత్వం ద్వారా 2017లో నిర్వహింపబడిన ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా క్రియాశీలకంగా నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించిన ఆయనకు స్వయంగా తెలుగులో ఆంగ్లంలో గ్రంథాలను వెలువరించిన అనుభవమూ ఉంది. “సెల్ఫీ ఆఫ్ సక్సెస్” అను విజయం మరియు విజేతల గాథల పుస్తకం… అందరి మన్ననలు పొందింది. ఆ పుస్తకాన్నే “గెలుపు పిలుపు”పేరుతో తెలుగులోకి తీసుకొచ్చారు. ఈ గ్రంథం తెలుగులో.. ఆంగ్లంలోనూ బహుళ ప్రాచుర్యాన్ని పొందటం విశేషం.. తెలుగు భాష పట్ల అమిత ఆసక్తిని చూపే కవి వెంకటేశం గారు సహజమైన రీతిలో “జీవన ధన్య” శతకాన్ని వెలుగులోకి తెచ్చారు. “సత్యమిదే తెలుసుకో మిత్రమా” మకుటంతో తమ రచనను కొనసాగించారు. నాలుగు పాదాల్లో.. మొదటి రెండు పాదాల్లో కవిగా తాము చెప్పదలచుకొన్న విషయాన్ని చెప్పుతూ.. మూడవ పాదంలో నిర్దేశిత లక్ష్యాన్ని సూటిగా ప్రకటించే ప్రయత్నం చేయడం ప్రశంసనీయం. ఛందస్సు లేకుండానే సహజ శతకానికి తెర లేపారు.
శతక సాహిత్యంలో ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. కవి వెంకటేశం గారి మనోఫలకంపై ఎప్పటి నుండో నర్తిస్తున్న ఆ జీవన సత్యాలను ఇందలి పద్యాల్లో నిక్షిప్తం చేశారు. ‘సత్యమిదే తెలుసుకో మిత్రమా’ అనే మకుటంతో…
ఈ శతకంలో నాలుగు భాగాలుగా వివిధ అంశాలపై దృష్టి సారిస్తూ పద్యరచన చేయడం విశేషం..
మొదటి భాగంలో జీవన సత్యాలను.. ఆవిష్కరించారు. రెండో భాగంలో “గెలుపు/ ఆత్మవిశ్వాసం”వంటి అంశాలకు చోటు కల్పించారు. మూడో భాగంలో “జీవన బంధాలు.. జీవన దశలను”, నాల్గో భాగంలో “తాత్విక చింతన దైవ చింతన” వంటి అంశాలను పద్యాల్లో నిక్షిప్తం చేశారు. కవి వెంకటేశం గారి పద్యాల్లో ఆయన ఉత్తమ వ్యక్తిత్వం.. సామాజిక చింతనం.. సున్నిత మనస్తత్వం అడుగడుగున మనకు కానవస్తాయి. నాలుగు భాగాలుగా రూపుదిద్దుకున్న ఈ శతకం మరో విశేషమేమిటంటే… ప్రతి భాగం చివరన ప్రతి పద్యంలోని ఆణిముత్యాల్లాంటి నిర్దేశిత లక్ష్యాలను పొందుపరిచి శతకానికి మరింత శోభను కలిగించారు.
అంతేగాక ప్రతి భాగం చివరన “మీ మదిలోని మీ మాట” శీర్షికను పొందుపరిచి.. పాఠకులు శతక పద్యాలను మరింత ఆసక్తిగా చదవడం కోసం.. చదివిన పద్యాల్లోని సారాన్ని మరొక్కసారి మననం చేసుకుని స్వీయ స్పందనకు అవకాశం కల్పించడం ఓ కొత్త ప్రయోగం.. ‘సత్యమిదే తెలుసుకో మిత్రమా!’ మకుటుంతో సాగే ఇందలి పద్యాలను పరిశీలిద్దాం.
“జీవన సత్యాలు” విభాగంలో కవి యొక్క ఉత్తమ సంస్కారాన్ని వీక్షించగలం.. సామాజిక చైతన్యం కోసం ఆయన పడే ఆరాటాన్ని చూడగలం.. యువతీ యువకులకే కాదు అందరికీ ఉపయుక్తంగా ఉండే విధంగా పద్యాలకు జీవం పోశారు.
పుచ్చుకొనడం కోసం పోటీ ఏంటి? ఇవ్వటంలో ఉండాలి కాని? అంటూ పుచ్చుకొనటం దైన్యం.. ఇవ్వటం ధన్యమని మొదటి పద్యంలోనే తేల్చి చెప్పారు. ఇంకా ఇందలి పద్యాల్లో…
లొంగుబాటు లేని ధైర్యం కొరత లేని ధనం వంటిదని… నగుబాటు లేని జీవితం ధన్యమని హితవు పలికారు. శాశ్వత సుఖం ఎంతో ధన్యమైనదని తెలియజెప్పారు.
ఎన్నో భాషలు తెలిసిన పండితుడైనా ఇంటి ఇల్లాలు కంటి భాష చదువలేడని.. లిపి లేని కంటి భాష చదువగల నేర్పు ధన్యమని నిగూఢంగా… బలంగా కవి వెంకటేశం గారు తమ భావ ప్రకటన చేయడంలో సఫలీకృతులైనారు.
రాశి-వాసిల జ్ఞానం ధన్యమని.. పదవికున్న విలువ పద్ధతికి లేదు.. వెదికి మరీ వచ్చి గౌరవిస్తారు పదవిలో.. అయితే.. గౌరవం ఉందని గర్వం పెరగకుంటేనే ధన్యమని విడమరిచి చెప్పారు. విలువలు శాశ్వతమని.. వేషభూషణాలు అశాశ్వతమనే విచక్షణ ధన్యమంటూ మరో పద్యాన్ని రాశారు. చకచక మారే పడతి అంతరంగం మధురిమ ధన్యమంటూ రాసిన పద్యంలో పడతి అంతరంగం సాంతం ఎరుగుట అసాధ్యమని నొక్కి వక్కాణించారు.
ఇంకో పద్యం ద్వారా అందరి నవ్వులో నీ భాగముండాలని హితవు పలికారు. ఎదుగుతూ ఒదుగుతూ గెలుచుటయే ధన్యమనే జీవన సత్యాన్ని మరో పద్యం ద్వారా తెలియజెప్పారు.
ఇలా జీవన సత్యాలను అలతి అలతి పదాలతో మొదటి విభాగంలో సందేశాత్మకంగా ఆవిష్కరించారు.
“గెలుపు | ఆత్మవిశ్వాసం” శీర్షికతో రెండో భాగాన్ని తీర్చిదిద్దారు.
ఓ పద్యంలో…
శక్తివంతమైన సంతకం ఏది?
పెద్ద పదవిదా? గొప్ప పనిదా? లాభాలు తెచ్చేదా?
చరిత్ర సృష్టించేదా? అని ప్రశ్నించుకుంటూ.. కవి వెంకటేశం గారు.. గెలుపు ఫలాల పంపకం చేసే సంతకం ధన్యమని తేల్చి చెప్పారు.
నీలోనే నేనున్నానని పిలుస్తుంది గెలుపు… ఆ పిలుపు వైపు మలుపు నీ చూపు.. ఆ దిశగా పయనించే జీవితం ధన్యమని హితవు పలికారు.
ఇంకొక పద్యంలో మలుపు లేని దారి ఉండదని.. వియోగం లేని సహయోగం లేదని గెలుపు ఓటముల సంయోగ జీవనం ధన్యమని అభిప్రాయపడ్డారు.
యువతీ యువకులకు చక్కని మార్గదర్శనం చేస్తూ ఈ విభాగంలో పొందుపరచబడిన పద్యాలు ప్రేరణ దాయకంగా కొలువుదీరాయి.
భయం.. నీలోని బలహీనత.. అభయం నీవు ప్రకటించే బలమని సూచించిన తీరు బాగుంది.
ఇలా రెండో విభాగంలోని పద్యాల ద్వారా నిరంతర శ్రమతో.. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఆశావహ దృక్పథంతో ముందుకు సాగి గెలుపు సాధించాలని సూచించారు.
ధనమే జీవనం కాదని.. జీవితంలో భాగమని, ప్రేమ లేని ధనం విలువ శూన్యమని విడమరిచి చెబుతూ.. మూడో విభాగంలో “జీవన సంబంధాలు జీవన దశలు” శీర్షికతో పద్యాలను రాసి బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలు ఎలా పదిల పరుచుకోవాలో వివరించారు.
తల్లిదండ్రుల పట్ల.. స్నేహితుల పట్ల ప్రేమానురాగాలతో వ్యవహరించాలన్న అర్థం ధ్వనించేలా.. ఇందలి పద్యాలకు జీవం పోశారు. మలి సంధ్యలో ధనం ముఖ్యం కాదని.. స్థిరపడిన సంతానం.., బాధించని అనారోగ్యం.. మనస్సుకిష్టమైన పని ధన్యమని అభిప్రాయపడ్డారు.
జీవన దశల్లోని అనుభూతులను అనుభవాలను అక్షరాల్లో నిక్షిప్తం చేస్తూ.. పసితనమున తప్పటడుగులు అద్భుతమని.. పడుచుతనమున జీవన యానపు తడబాటులు.. ముసలితనమున స్థిరచిత్తం.. నిశ్చలత్వం ధన్యమని సూచించారు. మాతృత్వపు మధురిమలో బాల్యం.. రూపసుల మోహంలో యౌవనం.. కాసుల వేటలో మిగతా జీవితం.. అంటూ జీవన సరిగమలను మరో పద్యంలో ఆవిష్కరించిన తీరు బాగుంది. ఇంకా ఈ మూడో విభాగంలో పసిపాపల నవ్వుల పువ్వులను, జవనుల చిరునవ్వులను – మలి వయసులోని బోసి నవ్వులను వివరిస్తూ.. కోపతాపాలను కరిగించుట శ్రేయస్కరమని తెలిపారు.
గడచిన గతం బాల్యం….
నేటి జీవన సౌధ పునాది కూడా బాల్యమని..
రేపటి మలిసంధ్య జ్ఞాపకం బాల్యం అదే ధన్యమని విడమరిచి వివరించారు.
కవి వెంకటేశం గారు ఇంకా ఈ విభాగంలో ప్రాణమున్నంతవరకు తరగని మాతృప్రేమను.. ఊపిరున్నంత వరకు సరిహద్దులో దేశ ప్రేమను ప్రస్తావిస్తూ ప్రేమ స్వరూపాలు ఎన్నైనా, ప్రేమ శాశ్వతం ధన్యమని తెలియ జెప్పారు. ఇలా జీవన యానంలోని వివిధ దశలను కవి తమ అనుభవాలను జోడించి జీవన సత్యాలను ఆవిష్కరించి స్ఫూర్తిని నింపేలా మూడో విభాగంలో పద్యాలకు జీవం పోశారు.
ఇక చివరి నాలుగో విభాగంలో “తాత్విక చింతన / దైవ చింతన” శీర్షికతో పద్యాలను పొందుపరిచి.. ఆనందం మన సహజ స్వభావమని.. దుఃఖం మనం తెచ్చి పెట్టుకున్న అనుభవమని.. కలిమి లేముల విచక్షణ మరిస్తే ధన్యమని అభిప్రాయపడ్డారు.
నదీ ప్రవాహంలా.. సాగే జీవన పయనమే ధన్యమని.. మరో పద్యంలో పేర్కొన్నారు.
కాలం – జ్ఞాపకాన్ని ఇచ్చిందా? జ్ఞాపకం కాలాన్నీ గుర్తుకు తెచ్చిందా? అంటూ ప్రశ్నించుకుంటూనే కవి కాలం కొన్ని జ్ఞాపకాలను దాచేస్తుందని….. జ్ఞాపకం కొంతసేపు కాలాన్ని బంధించేస్తుంది… అదే జీవన ధన్యమని పేర్కొన్నారు.
మరికొన్ని పద్యాల్లో.. భిన్నత్వంలో ఏకత్వం.. ఆద్యంతం లేని ప్రేమ… అంతుచిక్కని జీవన సంక్లిష్టత.. భ్రాంతి జీవన వైరుధ్యాలను కవి వెంకటేశం గారు తాత్త్వికతతో సందేశాత్మకంగా ఆవిష్కరించారు.
ఇంకా.. భావనా శక్తి విస్తరణ గురించి.. మనకు మనం చిత్రించే కళాఖండం గురించి.. కవి ప్రకటించిన భావాలు ప్రేరణదాయకంగా ఉన్నాయి.. ఇంకో పద్యం ద్వారా కావాలన్న కోరిక.. ఇంతేనా అన్న నిరాశ అంతా నాదే అన్నీ నాకే అన్న అత్యాశ.. పరులదీ తనకే అన్న దురాశ వదులుకోవాలని సూచించారు.
ఇంద్రియాలకతీతంగా మనోనేత్ర సందర్శన భాగ్యమని.. పరమాత్మ అలౌకిక సౌందర్యం ధన్యమని మరొక పద్యంలో వివరించిన తీరు బాగుంది. ప్రకృతి దైవ చింతన తుదకు శరణ్యం అనుటే ధన్యమని తేల్చి చెప్పారు.
ఇలా ఈ పుస్తకంలోని అనేక పంక్తులు ఉదహరించడానికి యోగ్యంగా ఉన్నాయి. ప్రతి పద్యం ఓ ఆణిముత్యంలా రూపుదిద్దుకుంది. జీవన సత్యాన్ని ప్రకటించేలా కొలువుదీరింది. కవి వెంకటేశం గారు ప్రకటించిన భావాలన్నీ గొప్ప సందేశాలను మోసుకొచ్చాయి. సామాజిక చైతన్యానికి మధుర గుళికలుగా ఉపయోగపడేలా ఉన్నాయి. ఈ సందర్భంగా కవి వెంకటేశం గారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం.
– దాస్యం సేనాధిపతి
