విద్యా నామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం,
విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురుః,
విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరం లోచనం
విద్యా రాజసు పూజ్యతే నహి ధనం విద్యావిహీనః పశుః.
మానవులకు విద్యయే సౌందర్యము; అదియే గుప్తధనము; చదువే కీర్తిని,
సుఖమును,భోగమును కలిగించును; విద్యయే గురువులకు గురువైనది;విదేశములకు పోయినపుడు విద్యయే బంధువు; అదియే మరొక కన్నువంటిది; రాజ్యసభలలో పూజార్హత విద్యకే గాని ధనమునకు గాదు.ఇంతటి శ్రేష్ఠమైన విద్య లేని నరుడు వింతపశువు మాత్రమే.
సూక్తి ముక్తావళి – సంకలన కర్త మహీధర జగన్మోహన రావు -ప్రాచీ పబ్లికేషన్స్-మొదటి ముద్రణ1963,ఏడవ ముద్రణ 2015 నవోదయ బుక్ హౌస్-హైదరాబాద్.
విద్య మాత్రమే మానవులకు అందాన్నిస్తుంది.అంతేకాదు గుప్తధనం వంటిది.ఈ విద్యే మానవులకుకీర్తిని,సుఖాన్ని, సౌఖ్యాలను అందిస్తుంది.విద్య-గురువులకు గురువు వంటిది;విదేశాలలో బంధువులా సహాయం చేస్తుంది;మరో నేత్రం వలె ప్రపంచపు లోగుట్టును తెలియ జేస్తుంది.అంతమాత్రమే కాదు,రాజ సభలలో విద్యావంతుడు మాత్రమే గౌరవాన్ని పొందుతాడు.విద్యా విహీనుడు చులకనగా చూడబడతాడు.అని భర్తృహరి నీతి శతకం లో చెబుతాడు.
విద్య ఒక్కటే, మానవునికి విలువను పెంచుతుంది,అన్న విషయాన్ని ఆధునిక కాలంలో నిరూపించిన వారిలో ప్రథమంగా చెప్పుకోదగిన వ్యక్తి-ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్.కాస్మాలజి,జనరల్ రిలెటివిటి పై అతడు చేసిన పరిశోధనలు ప్రపంచానికి కొత్త చూపును ఇచ్చాయి.మోటార్ న్యూరాన్ వ్యాధి తో బాధపడుతూ, ప్రత్యేక మైన వీల్ చైర్ కి పరిమితమై ఆయన చేసిన కృషి సమస్త మానవాళికి స్ఫూర్తి దాయకం.జ్ఞానానికి దక్కిన గౌరవం అది.
విద్యను గూర్చి విశిష్టంగా తెలిపిన స్వామి వివేకానంద గారి బోధలను మనం పరిశీలిస్తే ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది.’విద్య’ ప్రతి మానవుని యందు ఉంటుందని,పాత్రకు మకిలి పట్టినట్లుగా,ఆ విద్య చుట్టూ అజ్ఞానం అలుముకొని ఉంటుందని,గురువు ఆ అజ్ఞానాన్ని తొలగించినపుడు అతడు విద్యావంతుడు కాగలడని అంటారు.మఱ్ఱి విత్తనంలో చెట్టుకు ఉండవలసిన సమస్త భాగాల కణాలు ఉంటాయి. భౌతిక పరిస్థితులు అనుకూలించి నప్పుడు ఆ విత్తనం చెట్టుగా ఎదిగినట్లే, వ్యక్తి కి సరైన సుఖం హితగురువు లభించినప్పుడే అతడు విద్యావంతుడు గా పరిఢవిల్లుతాడు అని వివేకానందుల వారు చెప్పిన వాక్యాలు సమస్త మానవాళికి హితవాక్యాలు.ఆ పాత్ర వంటకు యోగ్యమైనట్లుగా ,ఆ మఱ్ఱి చెట్టు పక్షులకు ఆశ్రయమిచ్చి నట్లుగా,బాటసారులకు నీడనిచ్చినట్లుగా విద్యావంతుడు సమాజాన్ని తన అక్కున చేర్చుకుని కావలసిన రక్షణనిస్తాడు.అతడు ఆ సమాజం చేత ప్రేమించబడతాడు-అని మనం గుర్తించాలి.