Home అనువాద సాహిత్యం రేపెక్కడికెళ్తావ్..! – కథ

మూలకథ : డోగ్రీ (కల్  కహాఁ  జాహోగి )

                                                                                        మూల రచయిత్రి, హిందీ అనువాదం : పద్మా సచ్ దేవ్

తెలుగు అనువాదం : డా. రూప్ కుమార్ డబ్బీకార్

రేపెక్కడికెళ్తావ్..! 

ఉదయపు తోలి కిరణంలా  నా వాకిట్లోకి  సుస్వరమై వాలింది.  వాలిన మరుక్షణమే చెదిరిన కాంతిపుంజమై నలుదిశలా పాకింది.  స్వర్ణ కాంతులు వెలిగి  వాకిలి  మూలమూలకు వ్యాపించాయి.  విచ్చుకున్న కాంతిపుంజం  తుళ్లిపడుతూ ఎప్పుడైతే ఒద్దికగా  ఒదిగిపోయిందో, ఒక గాఢమైన కాంతి బిందువు  వాకిలి మధ్యలో అల్లరి చేస్తూ  నిలిచి పోయింది.  ఇంకా తన నిష్కల్మషపు  నవ్వు  వాకిలి  మల్లెతోటలో విరిసిన పూల  పరిమళమై నలువైపులా వ్యాపించింది. తన పేరు ప్రీత్.  నేను ప్రీతో అని ముద్దుగా పిలిచేదాన్ని.

అసలు జరిగిందేమంటే  నా పాత  స్నేహితురాలొకరు తన ఇంటికి పోతూ ఒక ప్రస్తావన ముందుకు తీసుకు వచ్చింది.  ప్రీతోను కొన్ని రోజులకు నా ఇంట్లో ఉండనివ్వమని  కోరింది. అందుకు  నేను వెంటనే సరేనన్నాను.  ఎలాగూ నా భర్త  వేరే దేశం లో వున్నాడు.  ఇల్లు ఒంటరితనంతో చికాకు కలిగించేది .  నా  స్నేహితురాలికి కుడిభుజంలా వుండేది  ప్రీతో.   ఆ విషయం  నాకు బాగా తెలుసు.  కిండర్ గార్డెన్  స్కూల్  పిల్లలు ఆమెను  ‘తీతో ‘ అని పలకరిస్తూ  లోనికి  ప్రవేశిస్తారు. దాంతో  ప్రీతో వాళ్లకు ఆంటీగా,  ఆరిందాలా మారిపోతుంది.

ప్రీతోకు  ప్రీత్ అని పిలిపించుకోవాలనే సరదా వుండేది.  స్కూల్ నుండి  దిండు గిలాఫ వరకు ఏ పనైనా ప్రీతో అజమాయిషీలోనే.  ఎప్పుడైతే మేడమ్  సెలవుల్లో ఇంటికెళ్ళడం  జరిగేదో  ప్రీతోను వెంట తీసుకెళ్లక పోవడంతో  మేడమ్  పిసినిగొట్టు తనానికి   విసుక్కునేది .  ఈ నా స్నేహితురాలు  చిన్నప్పట్నుంచి  తెగింపుగలది. ఎలాంటి భయం లేదు. ఒకసారి  ‘ గోల్ గప్పా’ వాడితో జగడం జరిగింది. అప్పుడు మేడం గారి  చెప్పు దెబ్బలతో వాడు పరుగుతీసాడు.  వెంటనే మేమంతా ‘ గోల్ గప్పా ‘ బండి మీద ఒక్కుమ్మడిగా పడిపోయే వాళ్ళమే, కానీ, మేడం గారు బండి మీద అతడి స్థానంలో కూర్చొని  ప్లేట్లలో మరీ సర్ది  అందరికీ ఇవ్వసాగింది . ఈ సందడిలో గోల్ గప్పాలు  గాలిలో ఎగిరిపోయాయి. అప్పుడు తాను చింతపండు నీటిని ఎంతో ఇష్టంగా  స్,  స్,  అంటూ శబ్దం చేస్తూ, చూపిస్తూ చెప్పింది,  ” ముహా  నన్ను ఒంటరిగా వుండటం చూసి కన్ను గీటసాగాడు. నేను నాటు చెప్పు తీసుకొని వీపు చింతపండు చేస్తే  ఒకటే పరుగు లంకించుకున్నాడు.” అప్పట్నుంచి ఆమెను  మేము మేడమ్ అనే పిలుస్తున్నాము.  అసలు  పేరే మర్చిపోయాము.  కానీ, మేడమ్ ను ఎవరూ మర్చిపోలేదు.  ఆ  ప్రస్తావన  నాకేమి సంతోషం కలిగించలేదు.  కానీ,  ప్రీతో రావడం వలన కాస్త ఇంటికి కళ  వుంటుందని  ఆలోచించాను.  రెండు రోజుల క్రితమే  మేడమ్  ప్రీతోను తీసుకొని నా ఇంటికి వచ్చింది.  ఎన్నో విధాలుగా నచ్చజెబితే గాని మేడమ్  రైలు ఎక్కి కూర్చోలేదు .  ప్రీతో, దాని సామాన్లు  ప్రతి ఒక్కటీ జాగ్రత్తగా అందిస్తూ అలిసి కుప్పయిపోయింది .

ఇంటికి రాగానే రెండు సారిడాన్ మాత్రలు వేసుకొని పడుకుంటే, నేను కూడా  ఏమీ అడగడం సరికాదనివూరుకున్నాను.  మరుసటి రోజు  ఇంకా తెల్లవారనే లేదు. కానీ ,ఇంట్లో ఎవరో అపరిచిత వ్యక్తి నడక, హడావుడి , ధ్వని రావడం మొదలయ్యింది.  ఈ  అపశబ్దాలను ఎలాగో సహిస్తాను గాని బాత్ రూమ్ లో  ఆగకుండా నీరు ఏకధాటిగా ప్రవహిస్తూ వుండటం చూసి ఇక ఆగలేక అడిగే ధైర్యం చేసాను. ఇనుప బకెట్లో నల్లా పూర్తిగా వదిలి వేస్తే పడే నీళ్ల చప్పుడు కలిగించే అసౌకర్యం  బహుశా మరే దాని ద్వారా కలగదనుకుంటాను. పక్కలోనే  పడుకొని కళ్ళు మూస్తూ, తెరుస్తూ  గట్టిగా అరిచాను –  ” ప్రీ.. తో ..”

” ఆఁ , మేడమ్ ”  అంది . తలకెక్కి కూర్చున్నట్లు  అనిపించసాగింది . “ఖబడ్దార్, నన్ను మేడమ్  అంటే, ”  నేను కోపంతో,  ఆవేశంతో ఆమె మీద అరవగానే అమాయకంగా చెప్పింది –  “మరి ఏమని పిలవను మేడమ్  గారు !”

“ ముందు ఆ నల్లా బంద్ చెయ్!  ఇక నుండి  నువ్వు నన్ను దీదీ అని పిలవ్వచ్చు.”  అన్నాను.  ఎప్పుడొచ్చి నన్నల్లుకుందో నాకే తెలిసిరాలేదు, ” దీదీ , దీదీ”  అంటూ ఇల్లంతా ఒకటి చేసింది.  నా ఉదార స్వభావం మీదనే నాకు కించిత్  గర్వం కలిగి ఉప్పొంగిపోయాను .

మళ్లీ  ఆమె  గతం  జ్ఞాపకాల మూటలు కొన్ని నా ముందు పరుచుకున్నాయి .

ప్రీతో ఒక్కగానొక్క కూతురు వారికి.  ముగ్గురు , నలుగురు  అన్నదమ్ముల మధ్య  ఒక్క సోదరి.  కానీ, ఆమె తండ్రి ‘వడ్రంగి తక్కువ , తాగుబోతు ఎక్కువ’ అనే తీరులో వుంటాడు . ఈమెకు కాస్త వయసు రాగానే  నంబర్ దార్ (వడ్డీలు నడిపేవాడు)  కొడుక్కిచ్చి పెళ్లి జరిపించేసాడు.  అతను  చాలా కాలం నుంచి దమ్మా , ఆస్త్మా రోగంతో బాధపడుతూవున్నాడు.  ఈ అన్యాయాన్ని ఎదిరించి ఎవరు ఎదురు నిలబడతారు.  ఆమె సోదరులు  తాగుబోతు తండ్రి  చేతిలో దెబ్బలు తిని తిని,  రెక్కలు  రాగానే ఎగిరిపోయారు.  ఇక తల్లి ఇంటిగోడల  మాదిరి తానూ ఓ గోడలా వుండిపోయింది .

శోభనపు రాత్రే సప్తపది సమయంలో  హోమం నుండి వచ్చిన  పొగ పీల్చి పీల్చి పెళ్ళికొడుకు  మహాశయుడికి దమ్ముతోటి  ఫిట్స్ వచ్చినంత పనయి ఆస్పత్రి పాలయ్యాడు . ఇది కర్మ ఫలం.  శోభనపు శయ్య పైన కూర్చొని  ప్రీతో నిద్ర పోయింది. ఎవ్వరూ  అటువైపు తొంగి కూడా చూడలేదు. తెల్లవారగానే అందరూ గుసగుసలు పోయారు. “నష్ట జాతకురాలు, వచ్చీ రాగానే మొగుడి ప్రాణాల మీదికి తీసుకువచ్చింది.  నంబర్ దార్ కు దీని వల్ల ఏం  చెడు జరుగుతుందో  అర్ధం కావడం లేదు.  దీని అడుగు పడగానే ప్రాణాంతకమైంది.”

అప్పుడే మా మేడమ్  అక్కడికి చేరుకుంది. ఇంకా మొగుడు చావకముందే  ప్రీతోను ఇంటికి తీసుకొని  వచ్చేసింది . వూరు మొత్తంలో ఒంటరిదై పోయింది ప్రీతో.  కానీ ఆమె చొరవ, దుందుడుకుతనం  చూసి నంబర్ దార్  హుక్కా వదిలేసి లేచి నిలబడేవాడు. ఆమె తెగింపు,  నిర్లక్ష్య వైఖరి చూసి ఆమెను వివాహమాడటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆమె ప్రతిష్ట ఎంతగా పెరిగిపోయిందంటే  చివరికి పురోహితుడు కూడా ఆమె జన్మపత్రీ  తీసుకొని పోవడానికి నిరాకరించేవాడు. ఫలితంగా కుమారి గానే వుండిపోయింది .  ప్రీతో కళ్ళలో ఈదులాడే కలలను మేడమ్  సులువుగానే తుడిచేసి, నగరానికి వచ్చి పిల్లలకోసం కిండర్ గార్డెన్  ప్రారంభించింది .  దీంతో ప్రీతోకు అండ దొరికినట్లయి పూర్తిగా తన మనసును పిల్లలమీద లగ్నం చేసింది.  మేడమ్  ఆమెను ప్రేమగానే చూసుకుంటుంది.  కానీ ఆ  ప్రేమ ఎవ్వరికీ తెలిసేది కాదు.

ఏ ప్రీత్  పెళ్లి పేరుతో ఏడడుగులు నడిచి దాంపత్య జీవితంలోకి  సిగ్గుపడుతూ అడుగుపెట్టిందో , ప్రీత్  ప్రమాణాల సమయంలో అగ్నిసాక్షిగా,  తాపానికి కరిగిపోయిందో ఆ ప్రీత్ ఎంతకాలం  అదుపు ఆజ్ఞలో బందీగా వుంటుందో నన్న  భయం నాలో ఆనాడే  ఖచ్చితంగా  కలిగిందని చెప్పాలి.  నా ఇంట్లోకి రాగానే లభించిన  కొద్ది  సానుభూతి తోనే  తిరిగి ఆమె కళ్ళలో కలల  సంకేతాలు అల్లుకోసాగాయి.  ప్రతి పనీ నవ్వుతూ తుళ్ళుతూ పూర్తి చేస్తుంది.  రోజు మొత్తంలో ఐదారుసార్లు తల దువ్వుకుంటూ జాగ్రత్తగా  హెయిర్ స్టైల్  చేస్తూ వుంటుంది.  బొట్టు బిళ్ళలు దిద్దుకునే గొప్ప షోకు వుంది.  నేనొక రోజు అడిగాను – ” ప్రీతో, నువ్వు బొట్టు దిద్దుకొని మళ్ళీ చెరిపేస్తావు ఎందుకని ?”

ఉదాసీనంగా జవాబిచ్చింది ” అతను చచ్చిపోయాడు గదా! కానీ  దీదీ, నా మనసు బొట్టు పెట్టుకోవాలని తహ తహ లాడుతూవుంటుంది ”  అని.

” అతనితో నీకేమిసంబంధం  ? దాన్నేమైనా పెళ్లంటారా ?”   నేనన్నాను.

ఉత్సాహంతో  అన్నది ” అదే నేనంటున్నాను, కానీ మేడమ్  ఎప్పుడూ ఎత్తిపొడుపు మాటలతో  అడ్డు చెబుతూ వుంటుంది.  ఎర్రబొట్టు ఎప్పుడూ ముత్తై దువలే  పెట్టుకోవాలి  అని హెచ్చరిస్తుంది .”

“నువ్వు నల్లరంగు బొట్టు బిళ్ళ పెట్టుకో ! ”

” ఔను దీదీ, నల్లరంగు బొట్టు బిళ్లనైతే  పెట్టుకోవచ్చు .  అతను  చచ్చిపోయి ఎలాగూ ఏడాది గడిచిపోయింది . ఇప్పుడతని  ప్రేతాత్మ నన్ను ఇబ్బంది పెట్టలేదు”  ఇలా చెప్పి పగలబడి నవ్వసాగింది.  ఎంతలా నవ్విందంటే ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయాయి.

కారుతున్న ముక్కు చీదుకుంటూ,  కళ్ళ నీళ్లను తుడుచుకుంటూ  చెప్పసాగింది  – ” దీదీ, ఒక వేళ అతను  బతికే వుంటే నేను అస్సలు వూరు వదిలిపెట్టక పోదును.  పెళ్ళికి ముందు ఒకసారి అతను  దారిలో నా చేయి పట్టుకొని చెప్పాడు, ” ప్రమాణం చెయ్యి ప్రీతి, నన్నువదిలిపెట్టి ఎన్నటికీ పోవుకదా “యని .

“ప్రీతో, నీకు ఇంకా ఇరవై సంవత్సరాలు కూడా నిండలేదు” అని గుర్తు చేశా . ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతావు?  ఏ విధంగా చూసినా నీ పెళ్లి కాలేదు  అనిపిస్తుంది.  నీ పెళ్లి నిర్ణయం మేడమ్  తెలిసి తెలిసి తీసుకున్నది. ఇక దీన్ని ఇక్కడితో  వదిలెయ్యాల్సిందే!”

“దీదీ , భర్త విషయంలో నేనేవైతే కలలు అల్లుకున్నానో  ఆ కలల  రాకుమారుడైతే ఇతను కాలేదు.  విధి, ఆ కలల్ని  ఎంతో నిర్దయగా నా కళ్ళ నుండి తుడిచిపెట్టేసింది. ఇప్పుడు ఆ కొత్త పలక  మీద ఎవరో ఒకరు ప్రతిరోజూ వచ్చి అస్పష్టంగానే  ఏవో రేఖలు  అద్ది కదిలిపోతారు. వాటికి ఏ రూపం  ఆపాదించబడదు!”

నేను ఎంతో  ప్రేమగా అడిగాను – ” నీ దృష్టిలో ఎవరైనా వున్నారా ప్రీతో !”

“లేదు, కానీ మనసు కోరుకుంటుంది,  నేనెవరికో  ఒకరికి నచ్చితే బాగుండును అని ”

“కాళ్ళు చేతులకు గోరింటాకు, పాపిటలో సింధూరం, ఎరుపు రంగులో పెళ్లి జోడా,  కాటుక దిద్దిన కళ్ళు , ఇలా  సింగారించుకుని శోభనం జరగాలంటే  అది నాతొ కూడా జరిగిపోయింది.  కానీ శోభనం భర్త సహవాసంలో జరుగుతుంది . కానీ  నేనతన్ని చూడనే లేదు.”

“ప్రీతో, మేడమ్  కిండర్ గార్డెన్  నీ అజమాయిషీ లోనే  కదా నడిచేది. ఒకవేళ  నీకెవరైనా నచ్చితే, అన్నీ వదిలేసుకొని వెళ్ళిపోతావా?”

“తెలియదు దీదీ!”

“కానీ, మేడమ్  ఈ విషయాన్ని ఎప్పటికైనా సహించగలదా?”

” అదే కదా, మేడమ్ కు నా మీద  చాలా విశ్వాసం వుంది. అందుకే నాకు  భయమేస్తుంటుంది. ఎక్కడ ఎలాంటి భేదాభిప్రాయాలు పుట్టుకొస్తాయోనని.  మేడమ్ కే కాదు స్కూల్ పిల్లల  తల్లిదండ్రులకు కూడా నా మీదనే భరోసా. మేడమ్  కైతే అందరి పేర్లు కూడా తెలియవు. అంతేకాదు, ఒక్క రోజు కూడా నా చేతివంట లేకపోతె భోజనమే చేయదు . అప్పుడప్పుడు మనసు బాగులేకున్నా వంట  చేయక తప్పదు. ఎవరినైనా కానీ ఆకలి మీద ఉంచడం పాపం కదా దీదీ!”

“నేనామెవైపు చూసా, నువ్వు కూడా ఆకలితోనే వున్నావు కదా ప్రీతో ”  అని చెప్పాలనుకున్నాను.  కానీ అంతలోనే మేడమ్  రావడంతో నా నోటి మాట నోటిలోనే వుండిపోయి  మౌనం దాల్చాను.

రెండు నెలలు ఎలా గడిచిపోయాయో  తెలిసిరాలేదు.  ఒకరోజు మేడమ్  వచ్చి ప్రీతోను తీసుకొని వెళ్ళిపోయింది . వెళ్లే సమయంలో ప్రీతో రహస్యంగా నాతొ చెప్పింది,  “దీదీ, నన్ను మర్చిపోవద్దు. నేను రాలేను. కానీ నువ్వు రావాలి. నన్ను పిలుస్తావు కదూ దీదీ.”  అయోమయ స్థితిలో పడిపోయా.  నేను ఆమె చేతులను నా చేతిలోకి తీసుకొని  నా కన్నీళ్లను ఎలాగోలా దాచుకొని ఆమెకు ధైర్యం చెప్పాను. ఆ తర్వాత ఇంటి వ్యవహారాల్లో మునిగిపోయి ప్రీతో సంగతే మర్చిపోయాను .

ఒకరోజు మిట్ట మధ్యాహ్నం,  మగతగా వుంటే  పడుకుందామనుకున్న సమయంలో మేడమ్  ఊడి పడింది . వస్తూ వస్తూనే ఆయాసం తీర్చుకోకుండా, “ఇక్కడికి  ప్రీతో వచ్చిందా ?” అని అడిగింది .

నేను ఆశ్చర్యంతో స్థాణువులా  నిలబడిపోయా.  ఏం  సమాధానమివ్వాలో పాలుపోలేదు. వయసులోవున్న పిల్ల ఎక్కడికి  పోయివుంటుంది.  నేను మౌనంగా ఉండిపోవడం చూసి మేడమ్  అన్నది , ” దానికి  పొగరెక్కింది.  నాతో ఒక్కటే తప్పు జరిగిపోయింది.  నేను చేసిందల్లా కూరగాయలకు,  దాన్ని ఒంటరిగా పంపుతూ వచ్చాను. కూరగాయల గంపలో  దొంగ చాటుగా బొట్టు బిళ్ళలు పెట్టుకొని  పోతూవుంటేనే,  ఈ విషయం నాకప్పుడే అర్ధమయిపోయింది .”

“ఆ సచ్చినోడి దగ్గరికి  వెళ్లి పెట్టుకునేది. అంత  పిచ్చి ఎందుకో  ఆ బొట్టు పెట్టుకోవడానికి. ఎప్పుడొచ్చినా  ఆ దరిద్రపుది  ఆలస్యంగానే వచ్చేది. బట్టలు ఇస్త్రీ చేసే సమయంలో, కూరగాయలు తరిగే సమయంలో గాని , రొట్టెలు కాల్చేటప్పుడు గాని ఎట్లా సిగ్గుపడుతూ, ముసిముసి నవ్వులు నవ్వుతూ  వగలు పోయేది పోరి.  నాకేం తెలుసు, దీని చావు ఇట్లుంటదని , తెలిస్తే ఎగిరిపోయే ముందే దాని రెక్కలు కత్తిరించి పారేసేదాన్ని. ఎక్కడైనా ఇది పిచ్చిదై  పోదు గదా అన్న భయం పట్టుకుంది.  లక్షణాలన్నీ అవే వుండే.  కొన్ని రోజులముందు స్కూల్ పిల్లల తల్లి ఒకామె  చెప్పకపోతే నాకూ తెలిసేది కాదు. ఎవడో దర్జీవాడు. కూరగాయల  దుకాణం దగ్గర వుంటాడు.  వాడితోటే  లేచిపోయి వుంటుంది ముందు!  వాడి వైపే దొంగచూపులు  చూస్తూ వయ్యారాలు పోయేది .  ఒక్కసారి చేతికి చిక్కితే పోలీసులకు అప్పజెప్పి అంతుచూడనూ ! ఇనస్పెక్టర్  తివారి పిల్లలు నా స్కూల్లోనే  చదువుతున్నారు.”

మురికి కంపులా ప్రవహించే ఆమె మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ,  “మేడమ్,  నువ్వా – మోడువారిన చెట్టు కట్టెలాంటి దానివి.  ప్రీతో ఎదుగుతున్న తీగ లాంటిది. ఆధారం వెతుక్కుంటూ  పోయింది.  పోనీ, తన ఆనందాన్ని, సుఖాన్ని వెతుక్కోనీ !”

కోపంతో  మేడమ్  అరిచింది – ” ఒహో, ఐతే ఈ యవ్వారం , ఈ అగ్గి  నువ్వుంటించిందేనా? నా శిక్షణలో ఎక్కడ  తప్పు జరిగిందో నేను ముందే అర్ధం చేసుకునేదుండే .  దాన్ని మీ ఇంట్లో వుంచకపోతే , నాకు ఈ రోజు ఈ దరిద్రం చూడాల్సి రాకపోయేది .”

దాంతో నాలో కూడా ఆవేశం రెచ్చిపోయింది.  నేనూ అరుస్తూ చెప్పాను – ” ఈ అగ్గి నేను పెట్టింది కాదు . కానీ, నిజానికి  ఈ మంట నేనే అంటించాల్సింది. నువ్వు నాకు స్నేహితురాలివి కదా!  నీ  పాపాలకు ప్రాయశ్చిత్తం నేను కాకపొతే ఇంకెవరు చేస్తారు.  నీకేం తెలుసు, మగాడి ప్రేమ లేకుండా జీవితం ఎడారిలా ఎలా మారిపోతుందో!  దురదృష్టవంతురాలు , జీవితంలో మోసపోయింది.  క్రమశిక్షణ  పేరుతొ దాని కాళ్ళు కట్టేసావు. దుర్మార్గురాలవు  తోషీ ,  మనిషివి కావు.  ప్రేమ జీవితాన్ని చవిచూడని దానివి.  ఎప్పుడైనా, ఎవరినైనా  ప్రేమిస్తే తెలిసేది ఇప్పటివరకు నువ్వేమి కోల్పోయావో?”

కోపంగా మేడమ్  చెప్పింది – ” నీ జ్ఞానబోధ నా కక్కరలేదు మిసెస్ ఆదిత్య వర్మ.  ఇంట్లో పెట్టుకొని చూడు తెలుస్తుంది. నీ అడుగులకు  మడుగులొత్తే  ఆదిత్యకు కూడా ఒక ‘ఝట్ కా ‘ ఇవ్వకపోతే నా పేరు తొషియే కాదు. రాత్రి ,పగలు లేకుండా దాని వెకిలిచేష్టలు నా దృష్టికి  రాకుండా పోలేదు.  ఒకవేళ ఈ స్కూల్ అనే దరిద్రమే లేకుంటే దాన్ని అదే వూరు ఎక్కడినుంచైతే  కసాయివాళ్ళ చేతుల్లోనుండి విడిపించుకొని వచ్చానో అక్కడికే పంపించేసే  దాన్ని.

“పెళ్లి చేసెయ్యి దానికి ,”  నేను చెప్పాను.

” అవును, ఇదే కారణం కావలిసి వచ్చింది .  మరి, నువ్వు కూడా చేయించవచ్చు కదా !”

నేనన్నాను ” అది నీ బాధ్యత తోషీ , నేను కేవలం పెళ్ళికి రాగలను.  సరే,  టీ  తాగుదువు గాని  రా, నీళ్లు మసిలిపోతుండొచ్చు .”

తోషీ అన్నది – ” నా కడుపు మండిపోతూవుంటే  ఇంకా దాని పైన నిప్పులు చేరగాలని చూస్తున్నావు.”

నేను ప్రేమతో ఆమె చెయ్యి పట్టుకొని, “చలో మేడమ్ , నీకు ‘రూహ్ ఆఫ్ జా’ తాగిస్తాను” అన్నాను.  దాని తర్వాత ఆమె మనసు కాస్త తేలిక పడింది.  ” మేడమ్, ఆమె పెళ్లి చేసెయ్యి. అమ్మాయి వయసులో వుంది.  తోడు కోసం  తపించి పోతుంది. ఆమె స్థానంలో నిన్ను నువ్వు ఊహించుకొని ఆలోచించు ఒక్కసారి .”

మేడమ్  అంది, ” నేను ఒక మంచి కుర్రాణ్ణి చూసి ఏదో నిర్ణయం తీసుకుంటాను.  కానీ, అంతకు ముందే అది ఎవరితోనో  లేచిపోయినట్లనిపిస్తుంది. ఈ రోజు రెండవ రోజు .  రామ, రామ , ఇప్పుడు సాయంకాలం  క్లాసులకు పెద్ద పిల్లలు వస్తూ వుండవచ్చు. నేను వెళ్తాను”  అంటూ వెళ్ళిపోయింది .

మేడమ్  వెళ్లి రోజులు గడిచిపోయాయి.  ఆమెతో  ప్రీతో గురించి అడిగే ధైర్యం చేయలేక పోయాను. తర్వాత  అంతా మర్చిపోయాను. ఒక రోజు సాయంకాలం తలుపు తెరిచి చూస్తే  ప్రీతో ఎదురుగా నిల్చొని వుంది.  వెనకాల ఒడ్డు పొడుగు వుండి  అందంగానే వున్న యువకుడు .

సారా తాగి,  వీర బాహు కళ్ళతో వున్న అతన్ని చూడగానే నా లోపల  సన్నని వణుకు పుట్టింది.  చెదిరిన జుట్టు, ఇంకా  అతని ముఖంలో డాంబికం , నిజాయతీ లేనితనం కొట్టొచ్చినట్టు కనబడుతుంది.  ఎందుకో అతనిపై నాకు నమ్మకం గాని, విశ్వాసం గాని కలగలేదు.  అతనితో  ప్రీతో చెప్పింది, ” నా దీదీ”  అని .

స్నేహపూర్వకంగా ఇద్దరినీ  లోపలికి తీసుకెళ్ళాను. సన్నగా నవ్వుతూ  గదిలో కూర్చోబెట్టాను.  టీ  నీళ్లు పెట్టడానికి ఎలాగైతే వంటింట్లోకి  దూరగానే  ప్రీతో వెనకాలే వచ్చింది. నవ్వుతూ అడిగింది –  “ఎలా వున్నాడు? ”

“బాగున్నాడు ” అన్నాను

నవ్వి మళ్ళీ చెప్పింది – “సారా రాత్రికే  తాగుతాడు. కళ్ళు ఎప్పుడూ ఎర్రగానే వుంటాయి. పెదవుల మీద నవ్వు బలవంతంగా తెచ్చుకొని నవ్వసాగింది .  నవ్వుతూ నవ్వుతూ నీళ్లు నిండిన ఆమె కళ్ళను చూడనట్లు నటించి ” మేడమ్  ను కలిసావా?”  అని అడిగాను.

ప్రీతో కళ్ళను నేలకు వాల్చివెళ్లాను,  కానీ వెళ్లగొట్టి మళ్ళీ ఇక్కడికి రాకు” అంది .   ప్రకాష్, ఇతనే చాలా కోపానికి గురయ్యాడు.  కాస్త ఆగి, “దీదీ , నాకు పాత ధోతులివ్వవా! ఒక్క ధోతియే వుంది. మేడమ్ ది !”

నేను ధోతులతో పాటు ‘ శగున్ ‘  రూపంలో కొంత డబ్బు కూడా ఇచ్చి ప్రేమతో  ” ప్రీతో,  నేనున్నాను.  ఎప్పుడైనా, ఏదైనా కష్టమొస్తే  నన్ను మర్చిపోకు” అని ధైర్యం చెప్పాను.  ప్రీతో నన్నల్లుకొని ఏడవసాగింది.  నాకు తెలుసు తాను తప్పు చేసింది. ఈ మనిషి ఒక భర్తలా కనబడటం లేదు. అతనికి కూడా ‘శగున్’ రూపంలో కొంత డబ్బు చేతిలో పెట్టాను. ఏమనుకున్నాడో తెలియదు కానీ, అతను  నా కాళ్లకు  మొక్కాడు.  అప్పుడు నాకనిపించింది ఆడకూతుళ్ళను ఇలాగే సాగనంపుతారు కాబోలు అని.

కొన్ని రోజుల తర్వాత మేడమ్  ఫోన్ వచ్చింది.  ఎలాంటి భూమిక  లేకుండా నే  ” స్నేహాన్ని ఎంత బాగా నిలుపు కుంటున్నావ్  మిసెస్ ఆదిత్య వర్మ.   నిన్న.. అదే .. నీ చీర తొడిగి  ప్రీతో కలిసింది. ఆ చీరని కాలేజీ మేళ లో మనం ఇద్దరం కలిసి కొన్నాము.  ఎంత ఘనకార్యం చేసావు నువ్వు.  చీర ఇచ్చావ్,  కానీ  ప్రీతో వచ్చినట్లు నాతొ మాట మాత్రం కూడా చెప్పలేదు.  చీర ద్వారా ఆదిత్యకు పిలుపు అందకుండా జాగ్రత్త పడు,”  ఈ మాటలు చెప్పి టక్కున  ఫోన్ పెట్టేసింది .

ఆదిత్య – నేను ఆశ్చర్యపోయాను. ఈ మేడమ్  ఎంత కఠిన హృదయం గలది. ఫోన్ వచ్చిన మరుసటి రోజే  ప్రీతో మళ్ళీ వచ్చింది.  కానీ ఒంటరిగా,  వస్తూనే నా వెనకాల వంటింట్లోకి  వచ్చి, ” నాకు వంకాయల పకోడీ చేసి పెట్టగలవా?” అని అడిగింది.  నేను ఆమెను ఎగాదిగా చూసాను.  సిగ్గుతో  “ఇప్పుడు మూడు – నాలుగో నెల నడుస్తుంది ” అంది . ఈ రోజు అతను నాసిక్ వెళ్ళాడు.  అందుకే  రాగలిగాను. నాకు కొంత డబ్బు కూడా కావాలి, ఇస్తావ్ కదూ! అతను కేవలం రేషన్  తెచ్చి పెట్టేస్తాడు. ఒక్క పైసా కూడా చేతికివ్వడు.  బయటి నుండి తాళం వేసుకొని దుకాణానికి వెళ్తాడు . అప్పుడప్పుడు వేపిన శనగలు తినాలనిపిస్తుంది .  రాత్రికి అతని ప్యాంటు నుండి కొన్ని పైసలు జారిపడిపోతాయి, అవి తీసుకుంటాను . తిరిగి వెంటనే ఆనందం తో అంది – అక్కడ ఒక కిటికీ వుంది.  అందులో నుంచి దూకి అప్పుడప్పుడు బయటికి వెళ్ళి పోతాను.  కానీ ఒక రోజు పొరుగింటావిడ ఈ విషయం అతనికి చెప్పేసింది. ఆ రాత్రి అతను  నన్ను బాగా చితక్కొట్టాడు .

నేను ఆమె వైపు చూడకుండానే అడిగాను,  ” పెళ్ళైన పత్రాలు ఏమైనా ఉన్నాయా నీ దగ్గర ?”

“లేదు,  పెళ్లి గుళ్లో జరిగింది !”

పైసలు తీసుకొని  ప్రీతో వెళ్ళిపోయింది.  మూడు , నాలుగు సంవత్సరాల వరకు  ఆమె గురించి ఎలాంటి సమాచారం లేదు.  ఒక రోజు మేడమ్  స్వయంగా వార్త పట్టుకొచ్చింది —  ప్రీతో భర్త ఎప్పుడూ ఆమెను చావబాదుతాడు అని. ఒక రోజు ఆమె మరిది విడిపించడానికి వస్తే అతన్ని కూడా చావబాది ప్రీతోని ఇంటినుంచి  వెళ్ళగొట్టాడు అని .  ఇరుగు పొరుగు కల్పించుకొని సర్ది చెప్పారట. నాకు బాధ కలిగింది .  తిరిగి ఆలోచించా.  పిల్లలున్నారు – పిల్లల ఆసరాతో ఆడది రావణుడితోనైనా  సర్దుకుపోతుంది.  రేపటి రోజు పిల్లలు పెరిగి పెద్దవారౌతారు.  వారితో పాటు ప్రీతో కూడా పెద్దదైపోతుంది .

కాలం సాగిపోతుంది.   ఎప్పటిలాగే  రోజూ తెల్లారుతోంది , సంధ్య వాలుతోంది. పిల్లలు  స్కూలుకు  వెళ్తున్నారు, ఇంటికి వస్తున్నారు.  ఆదిత్య,  నేను కూడా జీవితంలో ఒక విడదీయరాని భాగంగా మారిపోయాము . ఏ రోజు పని ఆ రోజే  అయిపోవాలి.  ఏ మాత్రం ఆలస్యం జరిగినా మనసు కంగారు పడేది.  మా చిన్ని ప్రపంచంలో మొత్తం విశ్వం ఇమిడిపోయింది .  ఆ ప్రపంచంలో  ప్రీతో ఉండదు. ఆమె జగడాల మారి మొగుడు వుండడు.

ప్రతిరోజూ లానే సాయంకాలం అయింది. వస్తూ వస్తూ  వెంట అతిధులను వెంటేసుకొచ్చింది . ఆదిత్య సామాన్లు తేవడానికి  బజారుకెళ్ళాడు. అప్పుడే దర్వాజా దగ్గర బెల్ మోగింది . తలుపు తెరిస్తే  ఎదురుగా ఒక అపరిచిత మహిళ  తన పువ్వుల్లాంటి ఇద్దరు పిల్లలను తీసుకొని నిలబడివుంది .  ఎవరిదైనా అడ్రస్  అడగాలనుకుంటుందేమో అని నేననుకున్నాను. ప్రశ్నార్థకంగా  ఆమెవైపు చూసాను.  ఆమె నవ్వింది.  పెదాలు ముడుచుకు పోయివున్నా ఆనవ్వును గుర్తు పట్టడానికి  నాకంత సమయం పట్టలేదు.  ” ప్రీతో ” అన్నాను.  వెంటనే తాను పిల్లల చేతిని వదిలించుకొని ఈ ప్రపంచంలో నేను తప్ప తనకు మరెవ్వరూ లేరన్న  విశ్వాసంతో గట్టిగా అల్లుకుంది.

ఆమెను వదిలించుకుంటూ – ” ప్రీతో, ఇంట్లో బంధువులున్నారు. రా, లోపలికి  నడు” అన్నాను .

ఆమెను కూర్చోబెట్టి  పిల్లలకు పాలు, బిస్కట్లు ఇచ్చాను.  వాళ్ళు తింటూవుంటే , పిల్లల్ని వదిలి  ప్రీతో నా వెనకాలే వచ్చి ఏ విషయం చెప్పకుండానే – ” దీదీ , అతను వెళ్ళిపోయాడు. దుబాయ్.  ఇల్లు కూడా  ఎవరికో  వేరే వారికి ఇచ్చేసాడు. కేవలం ఈ రాత్రికి ఇక్కడ వుండనివ్వు” అంది .

“ప్రీతో, ఈ బంధువులు  ఈ రోజే వచ్చారు.  నిన్నెక్కడ  పడుకోబెట్టను. వెంట పిల్లలు కూడా ఉన్నారు” అన్నాను .

ప్రీతో – ” పిల్లల్ని తీసుకొని నేను వరండాలో పడుకుంటాను. రేపు ఉదయం  ఇక్కడే ఒకరిని కలవాలి.  వారు ఏదో ఒక ఏర్పాటు  చేస్తారు.  మేడమ్ నన్ను  ఒక ఆశ్రమానికి పంపాలని ఆలోచిస్తుంది,  కొన్ని రోజుల మాట మాత్రమే”  అంది . నా బుర్ర మొద్దుబారిపోయింది. “నువ్వు మేడమ్  ఇంటికి ఎందుకెళ్ళలేదు.”

“తాను ఇంట్లో ఎప్పటికీ ఉండనివ్వదు , దీదీ.  నాకు ఆశ్రమానికి వెళ్లాలని లేదు .”

“కానీ ఎందుకు ?”

“ఒకవేళ ఎప్పుడైనా వీళ్ళ తండ్రి వస్తే?”

“వచ్చేవాడైతే,  ఎందుకెళ్ళిపోతాడు?”

“కొన్ని రోజులు  ఎదురు చూస్తాను. కొన్ని రోజుల మాటే !”

నా కళ్ళ ముందు ఆదిత్య  ముఖం కదలాడింది.  మేడమ్  చెప్పిన మాటలు కూడా గుర్తుకు వచ్చాయి.  తాను చెప్పిన  హెచ్చరిక కూడా ఇంకా జ్ఞాపకమే.  ఒక్క రాత్రి అతని ఇష్టం లేకుండా కూడా ఉంచగలను, కానీ ప్రీతోకు “ రేపెక్కడికెళ్తావు?“ అని అడిగే  సాహసం ఆమెలో లేదు.  నాకు తెలుసు మేడమ్  తప్ప మరెవ్వరు కూడా ఆమెను ఆశ్రమానికి వెళ్ళడానికి  ఒప్పించలేరు.  ఈ క్షణమే ఒక అవకాశం. ఒక వేళ ఇప్పుడు నేను బలహీనపడిపోతే,  ప్రీతో  వెళ్లే  ‘రేపు’ మళ్ళీ ఎప్పుడొస్తుందో”.  నా లోపల వున్న  మానవత్వం గొంతు పిసికి  చెప్పాను,  ” లేదు ప్రీతో, ఇక్కడ వుండటం సాధ్యపడదు . వీళ్ళు నా బావగారి కూతుర్ని చూడటానికి వచ్చారు.  అమ్మాయి రేపు ఢిల్లీ నుండి వస్తుంది .  ఇలాంటి  సందర్భంలో నాజూకు  బందుత్వం  మధ్య నేను ఎలాంటి రిస్క్ తీసుకోలేను.  జరగరానిది  జరగటం వూహించలేను.  డబ్బులు తీసుకో . ఒకవేళ ఇక్కడే ఎవరినో కలవాలి అనుకుంటే టాక్సీ తీసుకొని  రా ! ఇప్పుడు మాత్రం వెళ్ళిపో ”  అని చెప్పి ఆమె ఇద్దరు పిల్లల చేతులను ఆమె చేతిలో పెట్టేసాను. ఇంటి తలుపులు దాటి చౌకీదార్ ను  పిలిచి టాక్సీని  తెప్పించాను.  పిల్లలతో సహా  ప్రీతో కూర్చోవడం చూసా.  చెమటతో తడిసి ముద్దయిన ఆమె చేతిలో కొన్ని నోట్లు పెట్టేసాను. టాక్సీ వెళ్ళే వరకూ వేచి వుండకుండా ఇంట్లోకి వచ్చి తలుపులు మూసేశాను .

ఈ తలుపులు నేను ప్రీతో కోసం మూసేసానా?!  లేక నా కోసమా !?  నాకే అర్ధం కాలేదు.  రాత్రంతా  నాకు పీడకలలు రా సాగాయి.  ఎన్నో రోజులు గోడలను  ప్రశ్నిస్తూ వుండిపోయాను  – ” రేపెక్కడి కెళ్తావు ..? ”

 

***

 

You may also like